Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

సైన్స్ సులువుగా అర్థమయ్యేలా చేసే ‘సైన్స్ కథలు’

[డా. కందేపి రాణీప్రసాద్ బాలబాలికల కోసం రచించిన ‘సైన్స్ కథలు’ పుస్తకంపై సమీక్ష అందిస్తున్నాము.]

డా. కందేపి రాణీప్రసాద్ ప్రసిద్ధ రచయిత్రి. బాలసాహితీవేత్త. పిల్లలకి కథల రూపంలో విజ్ఞానాన్ని అందించటానికి ఇష్టపడతారు. పిల్లల కోసం యాభైకి పైగా పుస్తకాలు రచించారు.

‘సైన్స్ కథలు’ అనే ఈ పుస్తకంలో 28 కథలున్నాయి.

‘లైఫ్ సైన్సెస్, ఫిజకల్ సైన్సెస్‌ను సులభంగా పిల్లల మెదళ్ళలో నాటుకునే విధంగా, కథల రూపంలో చెప్పాలని ప్రయత్నించాన’ని రచయిత్రి అన్నారు.

శరీరంలోని అవయవాలకు మాటలొచ్చి, అవి ఒకదానితో మరొకటి తమ సమస్యలు చెప్పుకున్నట్టుగా కొన్ని కథలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, అవి నేరుగా మనతో చెప్తున్నట్టే. మనం చేసే తప్పులు, వాటివల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ శరీరావయవాలు చెప్తాయి.

‘గుండెపోటు’ కథలో గుండెకి నీరసం వచ్చి నిదానంగా కొట్టుకుంటుంది, మెదడు కారణమడిగితే, మనిషి శారీరిక శ్రమని మర్చిపోతున్నాడనీ, అందుకే స్థూలకాయం వచ్చి, ఇబ్బందులు పడుతున్నారనీ, ఫలితంగా తనపై ఒత్తిడి ఎక్కువవుతోందని అంటుంది గుండె. అప్పుడు మెదడు ఒక ఉపాయం చెప్తుంది. ఆ సలహా ప్రకారం నడుచుకుందామనుకుంటుంది గుండె. కానీ మెదడు చేయమన్న నటన, నిజమై, నిజంగా గుండెపోటు వస్తుందా మనిషికి. సకాలంలో చికిత్స అంది ప్రాణాలు దక్కుతాయి. తదుపరి తీసుకోవాల్సిన చర్యలను డాక్టర్ అతనికి చెప్తారు.

‘ఊపిరితిత్తుల ఉల్లాసం’ కథలో ఊపిరితిత్తులు తమ సమస్యలను తోటి అవయవాలకి చెప్పుకుంటాయి. మనిషుల ధూమపానం వల్ల, వాయు కాలుష్యం వల్ల తమకెంత ప్రమాదం ఎదురవుతోందో అవి చెప్పుకుని బాధపడతాయి. అప్పుడు గుండె సలహా మేరపు ఊపిరితిత్తులు తాత్కాలికంగా తమ విధులు నిర్వహించటం మానేస్తాయి. మిగతా అవయవాలు కూడా వాటికి సహకరించటంతో, ఆ వ్యక్తి ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. వైద్యుడు ఎన్నీ జాగ్రత్తలు చెప్తాడు. ఊపిరితిత్తులు, ఇతర అవయవాలు సంతోషిస్తాయి.

‘కాలేయం కష్టాలు’ కథలో తనకొచ్చిన అనారోగ్యం గురించి కాలేయం తోటి అవయవాలకు చెప్పుకుంటుంది. మద్యపానం వల్ల మనుషుల్లో కాలేయం పాడైపోతున్నా పట్టించుకోవడం లేదని గుండె అంటుంది. ఆపరేషన్ చేస్తారని తెలియగానే కాలేయం భయపడుతుంది. నీలో కొంత భాగం తీసేసినా, తిరిగి పెరిగే శక్తి ఉందని గుండె గుర్తు చేస్తుంది. తోటి అవయవాలు తన వెంట ఉన్నాయన భరోసా కాలేయానికి ధైర్యాన్నిస్తుంది.

గర్భాశయం రోదిస్తూంటుంది. అన్ని అవయవాలు కారణమడుగుతాయి. తాము తోడుగా ఉంటామని అంటాయి. అయితే అప్పుడు గర్భాశయం “మీరు అందరు మనుషులలో ఉంటారు, నేను మాత్రం ఆడవాళ్ళలోనే ఉంటాను కదా. నేను ఉంటున్న ఈ మహిళ, నెలసరి బాధలు పడలేక, గర్భసంచీ తీయించేసుకుంటుందట” అని చెప్పింది. మర్నాడు ఆ మహిళ డాక్టర్ దగ్గరకి వెళ్ళి హిస్టరెక్టమీ చేయమని అడిగితే, డాక్టరు గారు వారించి, ఋతుస్రావ సమస్యలకి మందులు రాసిచ్చి, ఆ మహిళకు, ఆమె ఇరుగుపొరుగు వారికి గర్భసంచీని ఎందుకు తొలగించుకోకూడదో వివరించి, వారిలో చైతన్యం కలిగిస్తారు ‘గర్భాశయ వేదన’ కథలో.

‘జీర్ణాశయం కష్టాలు’ కథలో, శరీరానికి హితం చెయ్యని పదార్థాలు తినడం వల్ల జీర్ణాశయానికి ఎంత బాధ కలుగుతుందో, తిన్న పదార్థాలని అరిగించటానికి అదెంత శ్రమించాలో చెప్తారు రచయిత్రి. కథలో నూడుల్స్ కోసం పట్టుపట్టి అమ్మ మీద అలిగిన ఆకాశ్‌కు జీర్ణాశయం కలలో కనబడి హెచ్చరించి, అతని తప్పు తెలుసుకునేలా చేస్తుంది.

‘మూత్రపిండం బాధ’ కథలో, మనుషులు.. ముఖ్యంగా ఆడపిల్లలు మూత్ర విసర్జనని ఆపుకోడానికి, చాలాసేపు నీళ్ళు తాగకుండా ఉండడం వల్ల మూత్రపిండాలలో ఎదురయ్యే సమస్యలను తెలిపారు.

‘గూని వెన్నెముక’ కథలో శరీర అవయవాలన్నీ సమావేశమవుతాయి. ఒకదాని సమస్యలు మరొకదానితో చెప్పుకుని బాధపడతాయి. పిల్లల వీపులపై అధిక భారం వేస్తున్న స్కూలు బ్యాగుల వల్ల వెన్నెముకకి ఎదురవుతున్న సమస్యలు చెప్తారు రచయిత్రి. శరీరంలోని ఏ అవయానికి చికిత్స చేయాలన్నే తనకే మత్తు ఇంజక్షన్ ఇస్తారని బాధపడుతుంది వెన్నెముక. డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్‌లో మెడలు వంచి మాట్లాడడం వల్ల, కాల్షియం లేని ఆహారం తీసుకోవడం వల్ల వెన్నెముకకి కలిగే నష్టాలను ప్రస్తావించారు రచయిత్రి ఈ కథలో.

‘అనీమియా’ అనే కథలో ఓ పాపలో ఉన్న రక్తహీనతని గుర్తించి, తగిన చికిత్స చేసి, రక్తహీనత కలగకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతుంది వైద్యురాలైన ఆ పాప మేనత్త. బాలికలందరూ తెలుసుకుని పాటించాల్సిన జాగ్రత్తలివి.

నీరు ఎలా పుట్టిందనేదాన్ని కాస్త హాస్యంగా, ఆక్సీజన్, హైడ్రోజల్‌ల స్వభావాన్ని వివరిస్తూ ‘H2O’ నీరు అనే కథలో చెప్పారు రచయిత్రి.

జలచక్రం అంటే ఏమిటో, అదెలా పనిచేస్తుందో విద్యార్థులకు సులువుగా ‘జలచక్రం’ అనే కథ ద్వారా వివరించారు. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పూజించడం వల్ల పర్యావరణానికి హాని జరగదని ‘మట్టి వినాయకులు’ కథ ద్వారా చెప్తారు రచయిత్రి.

తమకు పుడ్డిన బిడ్డకు గ్రహణమొర్రి రావడంతో, గ్రహణం పూట తన భార్యని బయటకి పంపించి ఉంటారని అత్తమామల మీద కోపగించుకుంటాడు శంకర్, ‘గ్రహణం’ కథలో. వారెంత చెబుతున్నా, శంకర్, అతని అమ్మ వినరు. అప్పుడు డా. ప్రసాద రావు వచ్చి, గ్రహణ మొర్రికి, గ్రహణానికి సంబంధం లేదని, ఆ వ్యాధి అనువంశికంగా వస్తుందని, మేనరికాల వల్ల కూడా రావచ్చని వివరిస్తారు. ఆపరేషన్ ద్వారా చీలిపోయిన పెదవిని దగ్గరకు చేసి కుట్టేయవచ్చని చెప్పి, వాళ్ళ అపోహలను దూరం చేస్తారు.

వేస్ట్ డిస్పోసల్‍లో భాగంగా పిల్లలకి తడి చెత్త, పొడి చెత్తలపై అవగహన కల్పించడం చాలా అవసరమని ఒక కథలో చెప్తారు.

‘ఉనికి’ అనే కథలో, తమ ఉనికిని మానవులు గుర్తించడం లేదని ఫంగస్, బ్యాక్టీరియాలు, వైరస్‌లు తమ నాయకుడి వద్ద వాపోతాయి. మానవులు ఎంతో అభివృద్ధి చెందారనీ, అన్నిటికి మందులు ఉన్నాయనీ ఇప్పుడు మనమేమీ చేయలేమని అంటాడు. అప్పుడు కరోనా వైరస్ ముందుకొచ్చి, తాన తన డిఎన్‌ఎ, ఆర్‌ఎన్‌ఎలు మార్చుకొని కొత్త అవతారెమెత్తి పని ముగించుకుని వస్తాను అంటుంది. అలా కోవిడ్ 19 జన్మించి, ప్రపంచాన్ని అల్లల్లాడిస్తుంది. అప్పుడు వైరస్‌లన్నీ తమ ఉనికిని మానవులు గుర్తించారని సంబరపడతాయి. కాని అది తప్పనీ, మానవులే విజయం సాధిస్తారని రచయిత్రి చెప్తారు.

‘గాలికి బరువుంది’ అనే కథలో, గాలికి ఉండే బరువుని ప్రయోగాత్మకంగా వివరించి, సృజన్ అనే పిల్లాడికి అర్థమయ్యేలా అతని టీచర్ మామయ్య చేత చెప్పిస్తారు రచయిత్రి.

‘ఆస్మాసిస్’ అనే కథలో డయాలసిస్ అంటే వివరిస్తారు. ఆస్మాసిస్ అనే ప్రక్రియ డయాలసిస్‌లో ఉపకరిస్తుందని శ్రీకర్ అనే కుర్రాడికి డాక్టర్ చెప్తారు.

‘విత్తన బంతులు’ అనే కథలో ఒక  ఉపాధ్యాయుడు కొండదిగువన ఖాళీ ప్రదేశంతో తన విద్యార్థులతో సీడ్ బాల్స్ చల్లించి, చెట్లు పెంచే ప్రక్రియని ప్రారంభిస్తాడు. దాని వల్ల కలిగే ప్రయోజనం వాళ్ళకి ప్రాక్టికల్‌గా వివరిస్తాడు. అతని ఆలోచనలని తల్లిదండ్రులు మద్దతునిస్తారు.

మెహందీ కోన్స్ వల్ల ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తున్నాయో ఒక కథలో చెప్పారు రచయిత్రి. పుచ్చకాయలలో జరుగుతున్న కల్తీ వల్ల సంభవించే దుష్పరిణామలను ‘ఎర్రెర్రని పుచ్చకాయ’ కథలో వివరించారు.

ఓ కాకి జంటకి సంతానం కలగదు. ఆడకాకి ఎన్ని గుడ్లు పెట్టినా, అవి పిల్లలుగా మారడం లేదు. నెమలి డాక్టర్ వచ్చి, ఆడకాకిని అనేక ప్రశ్నలు వేస్తుంది. మొదట ఏమీ అర్థం కాదు. చివరికి కాకిగూడుని పరిశీలిస్తే, సమస్య తెలుస్తుంది. గూటిలో పుల్లలకి బదులుగా మెత్తని ప్లాస్టిక్ కవర్లు కనిపిస్తాయి. ఆ ప్లాస్టిక్ కవర్స్ లోని రసాయనాల వల్లే గుడ్లు బిడ్డలవడం లేదని చెప్తుంది నెమలి డాక్టర్.

ఒకే రకం చెట్లని పెంచడం వల్ల జీవవైవిధ్యాన్ని కోల్పోతామనీ, జీవ సమతుల్యత చాలా అవసరమని కుందేళ్ళ పాత్రల ద్వారా చెప్పిస్తారు ‘జీవ సమతుల్యత’ అనే కథలో.

రోగాలను కలిగించే బ్యాక్టీరియా ఉన్నట్టే, మనుషులకు మంచి చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుందని ఓ తండ్రి తన కొడుక్కి చెప్తాడు తగిన ఉదాహరణలతో ‘మంచి బ్యాక్టీరియా’  అనే కథలో.

విద్యార్థులు సైన్స్ తెలుసుకోవాలని, వారి పాఠ్యంశాలను సులభతరంగా బోధించాలనే ఆలోచనతో ఈ కథలు రాశానని రచయిత్రి తెలిపారు. వారి ప్రయత్నం ఫలించినట్టే అనిపిస్తుంది ఈ పుస్తకం చదివితే. బాలబాలికలకు అత్యంత ఉపయుక్తమైన పుస్తకం.

***

సైన్స్ కథలు (బాలల కథలు)
రచన: డా. కందేపి రాణీప్రసాద్
ప్రచురణ: స్వాప్నిక్ ప్రచురణలు, సిరిసిల్ల
పేజీలు: 111
వెల: ₹ 125/-
ప్రతులకు:
డా. కందేపీ రాణీప్రసాద్‌,
మేనేజింగ్‌ డైరెక్టర్‌,
సృజన చిల్డ్రన్స్‌ హాస్పటల్‌,
సిరిసిల్ల – 505301.
తెలంగాణ.
ఫోన్‌: 9866160378

Exit mobile version