[శ్రీ బ్నిం గారి ‘సెల్ఫీ రామాయణం’ పుస్తకంపై ప్రొ. సిహెచ్. సుశీలమ్మ గారు వ్రాసిన సమీక్షని అందిస్తున్నాము.]
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరమ్
ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలమ్
ఆదికవి వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన ‘శ్రీమద్రామాయణమ్’ కావ్యం భారతీయ సాంస్కృతిక ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక విలువలకు, సర్వధర్మ స్వరూపానికి ప్రతిబింబం. కనుకనే భారతీయ భాషలన్నిటిలోనూ ఎందరో కవివరేణ్యులు రామాయణాన్ని మరలా మరలా రచించారు. సీతాదేవి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను, ఆదర్శనీయతను తెలియజేసేది కనుక ఈ కావ్యాన్ని వాల్మీకి మహర్షి “సీతయాశ్చరితం మహత్” అనే కొనియాడినాడు. కేవలం వాల్మీకి రామాయణాన్ని అనువదించటమే కాక కాలానుగుణంగా, సమాజ పరిణామాలు అనుసరిస్తూ, తమ తమ భావ పరిణతిననుసరిస్తూ, కొత్త కొత్త మార్పులతో చేర్పులతో రచించి పాఠకులచే ‘భళా’ అనిపించుకున్న కవులెందరో కలరు. ఇతర భాషా కవులైన అవధీ భాషలో తులసీదాస్ ‘రామచరిత మానస్’, తమిళంలో కంబన్ రచించిన కంబ రామాయణం, మలయాళంలో తుంచత్తు ఎళుత్తచన్ రచించిన ఆధ్యాత్మ రామాయణం, కన్నడంలో తోరణ రామాయణం అద్భుత రామాయణం ఉన్నాయి.
తెలుగులో తిక్కన నిర్వచనోత్తర రామాయణం, మొల్ల రామాయణం, గోన బుద్ధారెడ్డి రచించిన రంగనాథ రామాయణం, విశ్వనాథ వారి శ్రీమద్రామాయణ కల్పవృక్షం మాత్రమే కాక ఎందరో “మరల నిదేల రామాయణంబన్న..” అంటూ, అనుకుంటూ మరలా మరలా రచించారు. ఆధునిక కాలంలో పుల్లెల రామచంద్రుడు, శ్రీనివాస శిరోమణి, బేతవోలు రామబ్రహ్మం, కథా నవలా రచయితలైన విహారి, సింహప్రసాద్, బృందావనరావు వంటి రచయితలు కూడా రామున్ని కీర్తిస్తూ రచించారు.
“రామో విగ్రహవాన్ ధర్మః” అని రామాయణంలోనే చెప్పబడింది. అదే రామాయణంలోని కొన్ని సన్నివేశాలను ఉదాహరిస్తూ “ఇదేం రామాయణం” అని ప్రశ్నించిన వారున్నారు, విమర్శించిన వారున్నారు, ధిక్కరించిన వారున్నారు, తిరస్కరించిన వారున్నారు.
అనేక సాహిత్య ప్రక్రియల్లో కూడా రామాయణం రచించబడింది. పద్యం, వచనం, గేయం, నాటకం, పాటల రూపంలో ఇంకా ఇంకా తెలుగువారు రచిస్తూనే ఉన్నారు. సినిమాలు, టీవీలలో మరలా రామాయణం చిత్రిస్తూనే ఉన్నారు.
రామాయణానికి సంబంధించిన కథలను సంపాదించి, సంచిక సంపాదకులు కస్తూరి మురళీకృష్ణ మేలిమి ముత్యాల వంటి కథలను ఎన్నిక చేసి ‘రామ కథాసుధ’ పేరిట కోడీహళ్ళి మురళీమోహన్‌తో కలిసి సంకలనంగా తెచ్చారు.
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యుల వారి కుమారుడు ప్రముఖ జర్నలిస్టు కోవెల సంతోష్ కుమార్ ‘రామం భజే శ్యామం’ అని వెలువరించిన పుస్తకం అనేక సందేహాలకు సమాధానాలుగా పేరుగాంచింది.
రామాయణ ఇతివృత్తంతో, సన్నివేశాలతో అనేక దృశ్యరూపకాలు, జానపద గేయాలు, తత్వగీతాలలో అనేక రచనలు ఉన్నాయి. ఎందరో ప్రవచించారు. ప్రచారం గావించారు. ఆత్మ తృప్తి పొందారు. ఎన్ని వందల రామాయణాలు ఉన్నాయో చెప్పలేం. రామాయణ కల్పవృక్షం ఎంతవరకు విస్తరించిందో అంచనా వేయలేం కానీ విషవృక్ష ఛాయలు చాలా దూరం ప్రాకాయి. రామాయణం, అందలి పాత్రలు విమర్శలకు గురైనంతగా బహుశా ప్రపంచంలో మరే గ్రంథమూ ఉండి ఉండదు. ఒక సిద్ధాంతం, ఒక వర్గం వారు ఎంత తీవ్రంగా విమర్శించి చెరుపు చేసారో – రామ భక్తులు మూఢభక్తితో అంతే గందరగోళం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా ఆనాటి ‘లవకుశ’ సినిమా చూడడానికి పల్లెల నుండి బండ్లు కట్టుకుని ధియేటర్లకు వచ్చారట. నేడు క్రియేటివ్ ఫ్రీడమ్ పేరిట ఓం రౌత్, నితీష్ తివారి తమ ఇష్టానుసారం రామాయణాన్ని తీసి భక్తుల – సాధారణ ప్రేక్షకుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు.
‘బ్యాలే బాదుషా’ బ్నిం
నాటక, దృశ్య, రూపక, కథా రచయిత, చిత్రకారుడు అయిన బ్నిం ‘సెల్ఫీ రామాయణం’ పేరిట తేటగీతి పద్య రీతిలో సరళమైన భాషలో, బొమ్మలతో సహా రామాయణం రచించారు అక్టోబర్ 2025 లో. రామాయణంలోని ఆయా పాత్రలు తమ గురించి తాము పరిచయం చేసుకోవటమే ఈ ఆధునిక వినూత్న ప్రక్రియ ‘సెల్ఫీ రామాయణం’.
మొదటగా రామాయణమే తన గురించి తను పరిచయం చేసుకోవడం అద్భుతంగా ఉంది.
నన్ను చూడరే రామాయణము నేను
మహిని వెలసిన మహితాత్మ మానవు కథ
రామచరితము ఆదర్శ రమ్య గాథ
ఎన్ని యుగములైనను నేను ఇలను నిలుతు
చాలమంది వలెనే బ్నిం కూడా రామున్ని దేవుడిగా కీర్తించలేదు. “మానవు కథ” అని రామాయణమే పలికినట్లు స్పష్టంగా చెప్పారు. “ఎన్ని యుగములైనను నేను ఇలను నిలుతు” అన్న నమ్మకమూ వెలువరించారు.
తరువాత దశరథుడు, ముగ్గురు భార్యలు, వశిష్టుడు, ఋష్యశృంగుడు, సీతారాములు, లక్ష్మణ శత్రుఘ్నుడు, భరతుడు, విశ్వామిత్రుడు, తాటకి, మారీచ సుబాహులు, జనకుడు, ఊర్మిళ, పరశురాముడు, మంథర, సుమంత్రుడు, అనసూయ, శూర్పణఖ, జటాయువు, కబంధుడు, సుగ్రీవుడు, తార, అంగదుడు, జాంబవంతుడు, సింహిక (నేటి సైన్స్ ప్రకారం బెర్ముడా ట్రయాంగిల్) సురస, లంకిణి, అక్షకుమారుడు, విభీషణుడు, ఇంద్రజిత్, కుంభకర్ణుడు, నలుడు, నీలుడు, మండోదరి, మాతలి తో పాటు కాకాసురుడు, జటాయువు.. తమ గురించి ప్రజలకు (పాఠకులకు) పరిచయం చేసుకున్నట్టు వ్రాశారు. ప్రాణులైన పాత్రలతో పాటుగా మైనాక పర్వతము, సముద్రుడు, వారధి, ఉడుత, సంజీవని కూడా రామాయణంలో తమ తమ ప్రాధాన్యాన్ని చెప్పుకున్నట్టు వ్రాయడం బాగుంది.
కేవలం వాల్మీకి రామాయణమే కాక వివిధ రామాయణాలలో ప్రజాదరణ పొందిన కల్పనలను కూడా స్వీకరించారు బ్నిం. మొల్ల రామాయణం లో అద్భుతంగా కల్పితమైన శబరి పళ్ళను ఎంగిలి చేసి “దోరవేవో, కాయలేవో, ఆరమ్రగ్గినవేవో ముందుగా రుచి చూసి” రామునికి సమర్పించుకున్నట్లు తానూ రాశారు.
అంత చింతను, నా కొరకరుగు దెంచె
శబరి ముదుసలి నన్ చూడ సాదరముగ
రామచంద్రుని సౌహార్ద్ర మేమనందు
బాగు వేరిస్తి రుచి చూసి రేగుపండ్లు.
నేను దైవాన్ని, నాకు గుడి కట్టి తరించండి అని రాముడు చెప్పలేదు. మంచి నడతకు తన పేరు నిలిచివుంటుందనే చెప్పాడు. ఇది వాల్మీకి హృదయం.
దశరథసుతుడు రాముడ ధర్మపథము
అనుసరించుచు చరియింతు నవని మెచ్చ
ఒక్క మాట శరము, సతి నొప్ప యుండు
మంచి నడతకు నా పేరు మహిని నిలువ
సీతాదేవి కూడా ‘మానవులుగా కష్టాల అనుభవించామని, కానీ ఆదర్శ జంటగా నిలిచి ఉన్నామని’ చెప్పింది.
దానవ పీడను తొలగించ మానవులయి
అవని ననుభవించితి మేము నవరసములు
మమ్ము ఆదర్శ జంటగా మహి నుతించే
సీతారాముల కీర్తి స్థిరము నిలిచె
నిజానికి సీతారాములు ఆనందంగా కలిసి ఉన్న కాలం చాలా తక్కువ. వివాహమైన తర్వాత కైక వరాలు కారణంగా వనవాసమున కేగుట, అక్కడైనా సుఖంగా ఉండే పరిస్థితి లేక రావణునిచే తాను అపహరింపబడి, అశోక వనములో విలపించుట, రావణ వధానంతరం, అయోధ్యలో పట్టాభిషేకమైన తరువాత కూడా గర్భిణి అయి ఉండి రామాజ్ఞచే అరణ్యముల కేగుట, లవకుశ జననము, తర్వాత తన తల్లి భూమాతను చేరటం.
ఎల్లప్పుడూ వియోగమే అనుభవించిన సీతారాముల జంటనే భారతీయులు పూజిస్తారు, ఆదర్శ దంపతులని నమ్మి, వివాహ శుభలేఖలపై చిత్రాలు ముద్రిస్తారు. ఆంతర్యం గ్రహించిన, అంతరార్థం బోధపడినవారే కాక, పల్లెటూర్లలో తమ పిల్లల వివాహ సమయంలో పట్నం వచ్చి, శుభలేఖలు పరిశీలించి సీతారాముల కల్యాణం చిత్రాన్నే ఎన్నుకోవడం విచిత్రం కాదు, విశ్వాసం.
గౌతముడు లేని సమయంలో అతని వేషములో వచ్చిన ఇంద్రుని మోసం అహల్య గ్రహించలేదా గ్రహించి కూడా తప్పు జరిగేనా! గౌతముని శాపమును సమర్థిస్తూ కొందరు, అహల్య బేలతనాన్ని సమర్థిస్తూ కొందరు చర్చలు జరుపుతూనే ఉన్నారు. ఇక్కడ బ్నిం అహల్య అంతరంగాన్ని ఇలా స్పష్టపరిచారు..
తప్పు జరిగెనొ జేసితో దైవమెరుగు
తపమునొనరించితిని నేను ధైన్యపడుచు
ఎన్ని యుగములు గడిచెనో ఎరుగలేను
ధన్యనైతిని రామపాదమ్ము సోకి!
సనక, సనందన, సనాతన, సనత్కుమారుల శాపంచే జయ విజయులు భూలోకములో మూడుసార్లు విష్ణుద్వేషులై చరించి మరణానంతరం తిరిగి వైకుంఠం చేరగలరని పురాణ గాథ. కృతయుగంలో హిరణ్యాక్ష హిరణ్యకశపులుగా, త్రేతా యుగంలో రావణ కుంభకర్ణులుగా, ద్వాపరయుగంలో శిశుపాల దంత వక్త్రులుగా జనించారన్న గాథనే బ్నిం స్వీకరించి దశకంఠునిచే ఇలా పలికించారు..
మూడు జన్మలు హరి పగతుండు యగుచు
అతని చేతను నిర్జించునట్లు గాను
శాపమును పొంది ఆ హరే జంపగోరి
అపహరించితి నరుడైన అతని సతిని
పైత్యంతోనో, ప్రేక్షకాదరణ కొరకో, కాసుల దాహంతోనో కొందరు సినీ నిర్మాత దర్శకులు రామాయణాన్ని (తమ బుద్ధి వలె) వికారంగా నిర్మించి, రామ అయనం కాకుండా రావణ అయనంగా ‘రావణాయణం’గా చిత్రీకరించుట దౌర్భాగ్యం.
అలాగే చెట్టు చాటు నుండి వాలిని వధించుట అధర్మం అని వ్రాక్కుచ్చెదరు కొందరు – వాలి బలం, శాపం తెలియక. ఇక్కడ వాలి స్వగతం –
చెట్టు చాటునుండా వాల్ని మట్టుబెట్టే
ననుచు నిందించు రాముని జనులు గాని
జంతువును గాన వేటాడి చంపె నతడు
భ్రాతృ ఘాతను శిక్షించ పాడి గాదే
అగస్త్యుడు ఆదిత్య హృదయం రామునికి నుపదేశించుట, రామ రావణ యుద్ధం, రావణుని వధ, సీత అగ్నిప్రవేశం, సీతా లక్ష్మణ సమేతముగా రాముడు అయోధ్య చేయుటతో ఆరు కాండలతో శుభం పలికారు వాల్మీకి.
అయితే తన రాజ్యంలో ఒక అనామకుడు పలికిన దుష్టవాక్కులు వేగభద్రుడి ద్వారా విన్న రాముడు పూర్ణ గర్భిణీ అయిన సీతను అరణ్యాలకు పంపుట, లవకుశుల జననం, యాగాశ్వాపహరణం, పుత్రులను రాముని కప్పగించి సీతమ్మ తన తల్లి భూమాత ఒడిని చేరుట – రామాయణంలోని ఏడవ కాండం. ఇది వాల్మీకి విరచితమేనని అందరూ నమ్ముతారు. కొందరు అనేక సందేహాలు వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ఏకాభిప్రాయం, కచ్ఛితాభిప్రాయం లేదు. సంపూర్ణ ఆధారాలు కూడా లేవు.
వాల్మీకి అనే పేరు గల మరొక మహర్షి వ్రాసి ఉండే అవకాశం లేదా! అడవుల పాలైన సీతను తన ఆశ్రమానికి తీసుకొని వెళ్లి లవకుశలను పెంచిన ఆ వాల్మీకి తానే తన కథను రాసుకున్నాడా! రామాయణ గాథలో తన పాత్రను తానే ఎలా వ్రాయగలరు అనే ప్రశ్నలు ఉన్నాయి లోకంలో.
విశ్వనాథ సత్యనారాయణ కూడా పట్టాభిషేకంతో కల్పవృక్షాన్ని ముగించారు. భవభూతి సంస్కృతంలో, కంకంటి పాపరాజు తెలుగులో రచించిన కరుణ రసాత్మకమైన ‘ఉత్తర రామ చరితము’ (లవకుశులు) ను అనేకమంది అనువదించారు. అనుసరించారు. తమ చిత్రాల్లో చిత్రీకరించారు.
మొల్ల కల్పనలు – శబరి రుచి చూసిన పళ్ళు, గుహుడు రాముని కాళ్ళు కడుగుట, గోనబుద్ధారెడ్డి కల్పన లక్ష్మణరేఖ, లవకుశల ప్రసక్తి లేకుండా రామాయణాన్ని ఊహించలేరు తెలుగువారు. అదే వారికి సంతృప్తి.
బ్నిం కూడా ఉత్తర రామాయణం లోని తిప్పడు, వేగబద్రుడు, లవకుశులు, చివరికి భూమాతను కూడా వర్ణించారు.
సహనమున నన్ను మించినా దుహిత సీత
ధరను ఏలేడు రాముని ధర్మపత్ని
సూర్యవంశము నిలబెట్ట సుతులనిచ్చి
జన్మభూమికి చేరెనీ జానకమ్మ
రామాయణంలో అతి ముఖ్యమైన సీతారాముల సమాగమనానికి కారణభూతుడు, ప్రతి పల్లెలోనైనా తన ఆలయం నిర్మించుకునే భక్తుల కొంగుబంగారం, కష్టాల్లో ఉన్న వారికి సన్మార్గం చూపే పారాయణం ‘సుందరకాండ’కు సూత్రధారుడు అంజనీ పుత్రుడు హనుమంతుడు.
కేవలము వానరుండను దైవము కడ
అంత చేరువగా నుంటి నందువలన
పూజలాలయ విభవముల్ భువిని దొరకె
భక్తునకు రాముడిచ్చిన పరపతి యది.
తనను తాను పరిచయం చేసుకున్న ‘రామాయణం’ పలుకులతో ప్రారంభించి, దానిని రచించిన వాల్మీకి పలుకులతో పూర్తి చేశారు బ్నిం. అయితే తర్వాత కూడా రామాయణాన్ని కీర్తించిన తులసీదాసు, పోతన, రామదాసు, త్యాగరాజు, విశ్వనాథతో పాటు టీవీ సీరియల్‌గా తీసిన రామానంద సాగర్, బాపూ రమణలతో పాటు, రాముని పాత్రలో నభూతో న భవిష్యతిగా నటించి మెప్పించిన ఎన్టీఆర్‌ని కూడా కీర్తించారు. చివరి పేజీలో తాను ఓ చిన్న స్థలంలో సర్దుకుని మనసుకు సర్ది చెప్పుకున్నాడు కొంటె బ్నిం. ఇన్ని పాత్రలను పరిచయం చేసినవాడు ఎందుకనో త్రిజటను మరిచాడు.
రామభక్తుల, భక్తుల రమ్య కళల
ఆదరమ్ముగ మది తల్తు నంద మలర
బ్నింని నే వ్రాసి, బొమ్మలు వేసినట్టి
పుస్తకమ్మిది చూడరే నేస్తులార.
సెల్ఫీ లేనిదే జీవితం లేదని, సెల్ఫీ లేని రోజు రోజు కాదని అనుకునే నేటి యువతకు ఇష్టమైన ‘సెల్ఫీ’ అని శీర్షిక పెట్టి యువతరానికి చేరువయ్యారు బ్నిం. హైస్కూల్ విద్యార్థులకు కూడా అర్ధమయ్యే సులభశైలి.
పాత్రల స్వగతాలతో, పేజీకి ఒకవైపు తెలుగు, ఇంగ్లీషులో చిన్న వచనం, రెండోవైపు తేటగీతిలో బొమ్మలతో సహా పాఠకులకు అందించడం ప్రశంసనీయం. పుస్తకం ప్రచురించిన అక్షజ్ఞ పబ్లికేషన్ వెంకట్ ఈ ఆంగ్లానువాదాలు చేసారు.
చివరిగానైనా ప్రముఖంగా చెప్పుకోవాల్సినది ‘అంకితం’. తనకెంతో ఆప్తులు, మాతృసమానులు అయిన శ్రీమతి ముళ్ళపూడి శ్రీదేవి గారికి అంకితమిచ్చారు.
బ్నిం అనబడే భమిడిపల్లి నరసింహమూర్తి వ్రాసిన ఈ తేటగీతులు తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం లోని పూతరేకుల వలె సుతారంగా, రుచిభరితంగా ఉన్నాయి.
ఆత్రేయపురం నుంచి హైదరాబాద్ 1981 డిసెంబర్లో వచ్చి, ఆంధ్రభూమి, కృష్ణా పత్రిక, సుప్రభాతం, శ్రీపీఠం మొదలైన పత్రికల్లో పనిచేస్తూ ఫ్రీలాన్సర్, కాలమిస్టుగా, కార్టూనిస్ట్‌గా క్యారికేచరిస్ట్గా ఉంటూ, 150 పైగా కథలు, వేలాది వ్యాసాలు, వందలాది బుక్ టైటిల్స్ డిజైన్ చేశారు. టివిలో పనిచేస్తూ వాటిలో పౌరాణిక చారిత్రక సాంఘిక ఇతివృత్తాలతో చాలా సీరియల్స్ వ్రాయటం, సింగిల్ ఎపిసోడ్స్ రాయడమే కాక, దర్శకత్వం వహించారు. వీటిలో ప్రముఖమైనవి పసుమర్తి రామలింగశాస్త్రి కోరికపై వ్రాసిన ‘శ్రీరామకథాసారం’, డా. మద్దాలి ఉషా గాయత్రి బృందం కొరకు రాసిన “మా తెలుగు తల్లికి మల్లెపూదండ”, శ్రీమతి స్వాతీ సోమనాథ్ కొరకు రాసిన ‘వాత్సాయన కామసూత్ర’ అనేక సార్లు ప్రదర్శించి, 25 ఏళ్ల తర్వాత ఇటీవల కొత్త శిష్యులతో ప్రదర్శించారు.
‘బ్యాలే బాదుషా’ బ్నిం రచించిన ‘మీనాక్షీ కళ్యాణం’ దృశ్య రూపకంలో మీనాక్షిగా ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్ భార్య సౌజన్య నాట్యం చేయడం, సుదీర్ఘమైన ఆ విన్యాసాన్ని (నేటి డి.సి.యమ్.) కొణిదెల పవనకల్యాణ్ ఆసాంతం వీక్షించి ప్రశంసించడం ఒక రికార్డు.
నేడు ప్రముఖ యాంకర్స్‌గా పేరు తెచ్చుకున్న వారు బ్నిం తమకు నటించడమే కాక, తెలుగు పలకడం కూడా నేర్పించిన ‘గురువు’ అంటూ గౌరవిస్తారు.
గతంలో రామాయణ ఇతివృత్తంతో చిన్న చిన్న ఘట్టాలతో ఎన్నో నృత్య రూపకాలు రచించారు బ్నిం.
చందోబద్ధమైన పద్యాలు, లయాత్మకమైన గీతాలు వ్రాయగలరు కనుకనే 320 పైగా నృత్య రూపకాలు రచించారు. అవి దేశ విదేశాల్లో వందల ప్రదర్శనలు జరుగుతున్నాయి. సాహిత్య సాంస్కృతిక సభలు నిర్వహించటం చాలా సరదా ఆయనకు. ముఖ్యంగా బాపూ రమణల జయంతి సభలు నిర్వహించి అర్హులకు అవార్డులు ఇవ్వడమంటే మరింత ప్రేమ.
(ముళ్ళపూడి వెంకటరమణ రచనలపై నా పిహెచ్.డి. పుస్తకానికి ముఖచిత్రం వేసి, కె.వి. రమణాచారి, తనికెళ్ళ భరణి వంటి మరికొందరు మహామహులచే ఆవిష్కారణ సభను ఏర్పాటు చేశారు)
పాతికేళ్ళ క్రితం అధ్యాపకులకు విధించిన రూల్ ప్రకారం రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠంకి రిఫ్రెషర్ కోర్సుకు 30 మందిమి హాజరయ్యాం. అక్కడ సంస్కృత కళాశాల అధ్యాపకులు డా. దోర్భల ప్రభాకరశర్మ ఆధ్వర్యంలో ‘రామాయణ పాత్రలు’ తమ గురించి తాము పరిచయం చేసుకునే కార్యక్రమం ఏర్పాటయింది. వివాదాస్పదమైన పాత్ర ‘కైక’ నాకు ఇవ్వడం జరిగింది. కైకకు అనుకూలంగా వాల్మీకము, అవాల్మీకములు అయిన విషయాలను నేను మాట్లాడాను, కొద్దిగా నటిస్తూ. (మధ్యలో భయమేసి నేను రెండు గుటకలు వేసి, గ్యాప్ తీసుకుంటే ‘జీవించేసాన’ని భావించారు ప్రేక్షకులు.) దాంతో అనూహ్యంగా అన్ని పాత్రల కంటే ‘కైక’కు ఎక్కువ చప్పట్లు వచ్చాయి.
నేస్తం బ్నిం ని గత నెల 13న కలిసిన సందర్భం
ఇప్పుడు ఈ సెల్ఫీ రామాయణం లోని పాత్రలను తేటగీతి పద్యాలలో రాసి మెప్పించిన బ్నిం రాగతాళయుక్తంగా దృశ్య రూపకంగా రచిస్తే కాలంలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. నా ఆప్త మిత్రుడైన బ్నిం ఆ ప్రయత్నంలో ఉంటారని ఆశిస్తున్నాను.
***
రచన, బొమ్మలు: బ్నిం
ప్రచురణ: అక్షజ్ఞ పబ్లికేషన్స్
పేజీలు: 157
వెల: ₹ 200/-
ప్రతులకు:
అక్షజ్ఞ పబ్లికేషన్స్, ఫోన్: 87127 29057
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్.
ఫోన్: 9000413413
ఆన్లైన్లో:
https://www.telugubooks.in/products/selfie-ramayanam-thetageethi-swagathalu

