Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శేష ప్రశ్న

[శ్రీమతి సురేఖ పులి గారు రచించిన ‘శేష ప్రశ్న’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము. సంచిక – బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథ.]

వినసొంపైన కోకిల కుహు కుహు ఫోన్ ధ్వని తెల్లవారుజామున విశ్వదకు కర్ణకఠోరంగా ఉంది. నిద్ర మత్తు పూర్తిగా వదల్లేదు. బెడ్ పక్కన ఉన్న టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకోలేని మత్తు, తెరలు తెరలుగా నిద్ర మత్తు!

సూర్యుడు కన్ను తెరవక ముందే అమ్రిత్ జాగింగ్ వెళ్తాడు. తనకు బద్దకం! ఫోన్ అవతలి వైపు ఎవరు మాట్లాడుతున్నారో చూడకుండా మగతగా, “హలో, విశ్వదా హియర్..”

“హలో, నేను అమర్ మాట్లాడుతున్నాను. మీరు వెంటనే హైదరాబాద్ రావాలి, మీ అక్క చనిపోయింది” బాధగా అన్నాడు అమర్.

చెర్నాకోల్ దెబ్బ చెళ్లుమంది, “బావగారు నమస్తే! ఏమిటి మీరనేది, అక్క.. భాగ్య అక్క చనిపోయిందా? ఎప్పుడూ, ఎలాగ, ఎందుకు??” జవాబుకు అవకాశం ఇవ్వక ప్రశ్నల పరంపర.

“భాగ్యం ఇక లేదు, ఆత్మహత్య చేసుకుంది” అవతలి కంఠం హడావిడిగా వినబడింది.

“బావగారు, ఏంటి? వినలేక పోతున్నాను. నిజం చెప్పండి, ప్లీజ్..” గొంతు పూడ్చుకుపోతున్న బాధ మింగుతూ అంది విశ్వద.

“అవునమ్మా, నిజమే; కారణం తెలియదు.. ఎక్కడా ఏ కాగితం ముక్క.. అదే వాంగ్మూలం లేదు. మీ ఆయనకు కూడా చెప్పమ్మా, నేను ఇంకా చాలా ఫోన్లు చేయాలి” ఫోన్ కట్ అయింది.

రాత్రంతా సుఖంగా, ప్రశాంతంగా నిద్రించిన విశ్వద తల దిమ్మెక్కిది. కామధేనువుకి పర్యాయపదం భాగ్యలక్ష్మి అక్క! అటువంటి దేవతా మూర్తి ఆత్మహత్య చేసుకోవడం ఎంత దారుణం!!

అత్తారింట్లో విశ్వద ఏకైక తోడు భాగ్యలక్ష్మి.. ఇక ఈ ప్రపంచంలో లేదా?? ఆత్మహత్య??

గుండె వేగం అదుపు తప్పింది. ఎప్పుడూ సంతోషం పంచుతూ, కుటుంబంలో ప్రతి ఒక్కరి అవసరాలకు అనుగుణంగా నడుచుకుంటూ ఏదో రకంగా సహాయ పడుతూ.. ఓ మై గాడ్! అసలు అక్కకు కష్టాలు, కన్నీళ్లు ఉండవు. ఆలయాన వెలసిన దేవుని రీతి.. అటువంటి ఇల్లాలి ఆత్మహత్యకు బలీయమైన కారణమేంటి?

‘హ్యాపీ హోమ్’ పేరుకు తగ్గట్టు ఎప్పుడూ స్వర్గసీమ అనబడే ఆ ఇంట్లో అలజడా!? అలజడి మూలమేమిటి?

బావగారు అంటే స్వయానా అమ్రిత్ అన్న అమర్ గారు, ఎంతో హుందా మనిషి. ఆ అనురాగ జంటకు పంట రవళి, రక్షిత్.

రక్షిత్‌పై చదువులకు విదేశాలకు వెళ్ళాడు. రవళి టెన్త్ పరీక్షలు రాయగానే రక్షిత్ స్నేహితుడు విష్ణుసహస్ర కిచ్చి పెళ్లి జరిపించారు. పదిహేనవ ఏట పెళ్లి వద్దని ఎంత వారించినా భాగ్యక్క వినిపించుకోలేదు. తల్లి తన కూతురి విషయంలో ముందుచూపు లేకుండా తప్పు చేసింది; అంటే, ఒక రకంగా బాల్య వివాహం జరిపించింది.

అన్నీ బాగానే ఉంటే ఆత్మహత్య ఎందుకు? తన మనసు విప్పి ఎవరితోనూ చెప్పుకోలేని పరిస్థితులేమిటి?

అన్నీ ప్రశ్నలే. మామూలుగా ఇంట్లో ఎవరైనా చనిపోతే చాలా బాధగా ఉంటుంది; అటువంటిది ఆత్మీయుల ఆత్మహత్య అంటే.. ఎంత రంపపు కోత!?

విశ్వద రీసెర్చ్ మొదలైనప్పటి నుంచి ఎన్నో కేసులు క్షుణ్ణంగా పరిశీలించింది. కానీ, ఈమారు భాగ్యక్క.. ఆత్మ.. హత్య! తలచుకుంటేనే ఒంట్లో నరాలన్నీ స్తంభించాయి. కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడేందుకు శక్తి లేదు. అన్ని కోణాల్లోనూ గుండె మోత ఘోరంగా ఘోషిస్తుంది.

హమ్మయ్య! అమ్రిత్ వచ్చాడు.

వదిన అంటే అమితమైన గౌరవం. బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఎల్లవేళలా నవ్విస్తూ, నవ్వుతూ ఉండే అమ్రిత్ ముఖం ఒక్కసారిగా చెదిరి పోయింది. తన కంటే బలంగా ఉండే భర్త దీనావస్థ చూసి విశ్వద బెడ్ పైనుండి లేచి అమ్రిత్ చేతిని ఓదార్పుగా పట్టుకొని కళ్ళలోకి చూసింది. తెల్లటి కళ్ళలో ఎర్ర జీరలు వ్యాప్తి చెందాయి. బేలగా విశ్వదను చూశాడు.

అమ్రిత్ ఆర్ద్రతతో కూడిన స్వరం కష్టంగా పలికింది, “నీ బాధ నాకు అర్థమైంది.”

ఎర్రజీరల కళ్ళుల్లో కన్నీరు..! నిలిచె స్థలం, ఓపిక లేక మెల్లిగా జారుకున్నాయి. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నారిద్దరూ, చటుక్కున విశ్వద చేయిని విడిపించుకుని తన మొబైల్ తీశాడు.

రెండు ఫ్లైట్ టికెట్లు బుకింగ్ కన్ఫర్మ్ అయ్యాయి.

***

అమ్రిత్ వదినను తల్లిదండ్రుల కన్నా మిన్నగా గౌరవిస్తాడు. నిజమేనని విశ్వద ఎన్నో విషయాల్లో, మరెన్నో సందర్భాలలో రూఢి చేసుకుంది. అమ్రిత్ పరోక్షంగా వదినతో; విశ్వద ప్రత్యక్షంగా భాగ్యక్కతో ఆత్మీయతను పంచుకున్నారు.

అమ్రిత్ బెంగళూరు, ఎలక్ట్రానిక్ సిటీలో పేరు మోసిన ప్రైవేట్ సంస్థలో హోదా గల ఉద్యోగి. న్యూస్ పేపర్ ప్రకటన ద్వారా సోషియాలజీలో పి.హెచ్.డి చదివిన విశ్వదను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆత్మహత్యపై నాణ్యమైన పరిశోధన చేసి ప్రతిష్ఠాత్మక అవార్డులు, ఫెలోషిప్‌లలో భాగంగా బంగారు పతకం గెలుచుకుంది విశ్వద.

బెంగుళూర్‌లో ‘డైనమిక్ అమ్రిత్’ హైదరాబాద్‌లో అన్న వదిన ముందు స్థబ్దుడు! ఇదే విషయం విశ్వదకు నచ్చదు. రక్షిత్, రవళి చిన్నాన్న గుణగణాలు పుణికి పుచ్చుకున్నారు. సెలవుల్లో ఇండియా వస్తే బెంగళూరులో ఉల్లాసంగా ఎంజాయ్ చేసే వాళ్ళు; హైదరాబాద్ వెళ్ళగానే మూగ జీవులైపోతారు. వాళ్లకు మాటలు రావా అనే అనుమానం కలుగుతుంది. ఈ తరహా ప్రవర్తన అందరికీ ఒక ప్రశ్న వలె మిగిలింది. విశ్వద ఉండబట్టలేక బావగారిని అడిగితే మారు మాట్లాడలేదు.

భాగ్య అక్కని ప్రశ్నించింది, “సామాజికంగా రీసెర్చ్ చేసిన దానివి, ఈ విచిత్ర ప్రవర్తన పైన మరో పరిశోధన చేసి కారణం కనుక్కో” మాటల్లో పెట్టి, అక్క నవ్వుతూ ఉండేది. కానీ కారణం చెప్పలేక పోయింది. పిల్లల ప్రవర్తన గురించి తల్లికి తెలియకపోతే ఎవరికి తెలుస్తుంది?

హైదరాబాద్ వెళ్ళినప్పుడల్లా బావగారు సరదాగా “నీ రాకతో ఇంట్లో లక్ష్మీ కళ వచ్చిందని” ఆదరణ చూపిస్తారు.

అందరూ హ్యాపీ మనుషులే, మరి హింసను తలపించే ఆత్మహత్యకు మూలం ఏంటి?

చావు పై పూర్తి అవగాహన ఉంటేనే ఆత్మహత్యకు పాల్పడతారు; అంటే, జీవితంపై విరక్తి శాతం పెరుగుట. వరకట్నం, నిరుద్యోగం, వివాహేతర సంబంధాలు, దీర్ఘకాలిక అనారోగ్యం, రాజకీయ అస్థిరత వంటివి ముఖ్య కారణం. చచ్చి ఏమి సాధిస్తారు? మనకు దొరికిన చిన్న జీవితాన్ని జీవించాలి. నాణేనికి మరో వైపు కూడా ఉంది సుఖం-దుఃఖం ఏది ఎదురైనా జీవించడం అలవాటు చేసుకోవాలి. ఎంత వద్దనుకున్నా ఆలోచనలు రోద పెడుతున్నదే తప్ప తరగడం లేదు.

***

బెంగళూరు నుంచి హైదరాబాద్ ప్రయాణం ముప్పావు గంట పట్టినా, ఎయిర్ పోర్టు నుంచి సికింద్రాబాద్ చేరుకోవడానికి రెండు గంటలు దాటింది!

పచ్చటి వాకిట్లో తెల్లటి ముగ్గులతో కళ కళ లాడే ముంగిలి వెల వెల పోతున్నది.

తమ్ముడితో తక్కువగా మాట్లాడే అమర్ అన్నాడు “పోస్టుమార్టం నుండి బాడి రాలేదు.”

“ఏ హాస్పిటల్?”

“ఉస్మానియా.”

“హూ ఈజ్ కోఆర్డినేటింగ్ దేర్?”

“మా ఆఫీస్ ఫ్రెండ్స్.”

“డీటెయిల్స్ ఇవ్వండి వెళతాను.”

“వద్దు, నువ్వు వెళ్లొద్దు.”

“నేనూ వెళ్లక, మీరూ వెళ్లక..” అమ్రిత్ నిదానంగా అన్నాడు. అమర్ జవాబివ్వక దిక్కులు చూశాడు.

“అన్నా, మిమ్మల్నే! మీరు వెళ్లి బాడీ తెస్తారా, నేను తెచ్చేదా?” ఈసారి దురుసుగా అడిగాడు. తమ్ముడి బెదిరింపుకు తప్పదని భర్త కదిలాడు భార్య శవం కోసం.

***

వదిన ఆత్మహత్యకు ఏదైనా ఆధారం దొరుకుతుందేమోనని అమ్రిత్ ఇల్లంతా వెదికాడు. బ్రతికుండగానే ఒకరిని కష్ట పెట్టని వదిన, చావుకి కారణాలు చెబుతూ ఇతరులను కష్టపెడుతుందా? నో ఛాన్స్!!

ఏదో ఉబలాటం! వదినలో తల్లిని చూసిన మనసు తల్లడిల్లిపోతుంది, అమ్రిత్ శ్వాస ఎగసిపడుతున్నాయి.

అక్క పార్ధివ దేహానికి నివాళులు అర్పించే జనాల అనుకూలత కోసం ముందు గదిలో ఫర్నీచర్ అంతా ఓ మూలకు గోడ వారీగా సర్ది, విలువైన వస్తువులు అల్మారాలో పెట్టి లాక్ చేసింది విశ్వద.

తెల్ల వస్త్రంలో చుట్టబెట్టి భాగ్యలక్ష్మి శవం వస్తుంది.. విశ్వద ఎదురుచూస్తూ కూర్చుంది. ఎంతకీ రాలేదు. అమ్రిత్ ఓర్పు, సహనం నశించాయి, విసురుగా ఆసుపత్రి బయలుదేరాడు.

***

“హలో.. విశ్వా..” అమ్రిత్ ఫోన్.

“హలో.. అమృ.” భయంతో మాట పెగలని విశ్వద కష్టంగా అంది.

“వదిన చనిపోలేదు. గట్టిగా తలకు గాయమై, స్పృహ కోల్పోయింది. పరీక్షలు జరుగుతున్నాయి. బహుశా ‘కోమా’ అని అంచనా వేస్తున్నారు.”

చనిపోలేదు సంతోషం! కోమా అనుకుంటున్నారు విషాదం!!

“హలో వింటున్నావా?” గట్టిగా అరిచాడు అమ్రిత్.

“వింటున్నా అమృ..” కళ్ళు తుడుచుకుంది విశ్వద.

***

భాగ్యలక్ష్మి మేడపై నుంచి కింద పడి తలకు తీవ్రమైన గాయమైనందుకు ఆసుపత్రి ప్రత్యేకమైన వార్డులో బెడ్ పైన స్పృహ లేక అచేతనంగా ఉంది. భాగ్యలక్ష్మి తల వైపు కూర్చుని అమర్ తలవంచుకుని మౌనంగా దుఃఖిస్తున్నాడు. అమ్రిత్ వదిన కాళ్ళకు దండం పెట్టి, చెంపలు వాయించుకుంటూ హృదయవిదారకంగా విలపిస్తున్నాడు. విశ్వద ఒక పక్కగా కుర్చీ పైన కూర్చుని నీరసంగా ఏడుస్తుంది. ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు ఆరా తీశారు. చిలికి చిలికి పెద్ద వాన కురువ లేదు; తుఫాను రాలేదు. క్లుప్తంగా రిపోర్ట్ వచ్చింది, ‘ఇల్లాలు ఆత్మహత్య ప్రయత్నం చేసింది, వికటించి మెదడు ఘోరమైన గాయాన్ని ఎదుర్కొని కోమాలో అచేతనంగా ఉంది.’

రవళి, రక్షిత్ ఆఘమేఘాల మీద వచ్చి కరువు తీరా కంట తడి పెట్టుకున్నారు. ఇంటికి, ఆసుపత్రికి తిరుగుతూ తల్లి పట్ల ఎంతో ప్రేమగా శ్రద్ధ తీసుకుంటున్నారు.

“వీళ్ళు నెలరోజులు మాత్రం ఉండగలరు. ఆ తర్వాత నేను ఒక్కడిని మీ వదిన సపర్యలు చేయలేను. విశ్వద ఇక్కడే ఉండి చూసుకుంటుంది, నువ్వెళ్ళు..” అమర్ తమ్ముడితో అన్నాడు.

“నో, విశ్వద ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను.” అమ్రిత్ నిశ్చయంగా అన్నాడు.

ఎందుకు? అన్నట్టు చూసాడు అమర్.

“మీ ఉద్యోగం పోయిందని మీ ఫ్రెండ్స్ చెప్పారు, నిజమా?” మాట మార్చాడు అమ్రిత్.

“నిజమే. వేరే జాబ్ దొరికింది. మన నియోజకవర్గ రాజకీయ నాయకుడు సురేంద్ర గారు, వాళ్ళ ఇంట్లో ఉద్యోగం ఇచ్చారు” స్వరం నిండా ధృఢత్వం తొణికిసలాడింది.

“రాజకీయ నాయకుడి ఇంట్లో ఉద్యోగం.. అంటే? ఏం పనులు చేయాలి..?” ధీమాగా అడిగాడు.

అన్నకు ఇచ్చే కనీస గౌరవం లేదు. భర్త ఎందుకు అలా దురుసుగా ప్రవర్తిస్తునాడు? అర్థం కాక విశ్వద అయోమయంగా అమ్రిత్ వైపు చూసింది.

“పర్సనల్ సెక్రటరీ. అప్పుడప్పుడు ఇంటి అవసరాలకు కావాల్సిన మార్కెట్ పనులు. డ్రైవర్ లేనప్పుడు డ్రైవర్e.. పనులు చేయాలి. డబ్బుకు ఇబ్బంది లేదు. కానీ నెల రోజుల్లో ఒక్క సెలవు కూడా ఉండదు. సొసైటీలో నా హోదా; ఇంకా జీతం.. అన్నీ గ్రేట్! ఇక పోతే, మీ వదిన సేవలకు మాత్రం మన వారు అనే ఒక ఇంటి మనిషి కావాలి.. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే బాగుంటుంది. భాగ్య, విస్సు ఒకరికొకరు సఖ్యతగా ఉంటారని.. అడిగాను.”

“వదిన కోసం ప్రైవేట్ నర్స్ లేదా కేర్ టేకర్ పెట్టుకుందాం” అమ్రిత్ అన్నాడు.

“ఉండేది నేను ఒక్కడిని.. ఇంట్లో ఆడవాళ్లు లేనప్పుడు, ఎవరైనా కేర్ టేకింగ్ జాబ్ ఎందుకు ఒప్పుకుంటారు?” అనుమానంగా అన్నాడు అమర్.

“నాకు తెలిసిన వాళ్ళు మెడికల్ ఫీల్డ్‌లో ఉన్నారు, కేర్ టేకర్ విషయంలో సహాయం చేస్తానన్నారు. డబ్బు ఖర్చు మనం చూసుకోవాలి. ఆర్నెల్లు.. లేదా ఏడాది సమయం పట్టొచ్చు, వదిన కొలుకుంటున్న సూచనలు ఉన్నాయన్నారు.” డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్ చూపించాడు అమ్రిత్.

“అంటే? ట్రీట్మెంట్ హాస్పిటల్లో.. అంతేగా!?” సందేహ నివృత్తి చేసుకున్నాడు అమర్.

“అవును. వదిన క్షేమంగా ఇంటికి వచ్చే వరకు కేర్ టేకర్ జీతం నేను ఇస్తాను” అన్నదమ్ములు ఒప్పందం కుదుర్చుకున్నారు.

***

నిర్జీవంగా బెంగళూరు తిరిగి వచ్చిన విశ్వదకు భాగ్యలక్ష్మి చేతి వ్రాతతో రాసిన పోస్టల్ కవర్ చూసేసరికి జీవం పుంజుకు వచ్చింది. ఆతృత, ఆనందం, దుఃఖం వీటన్నిటి మిశ్రమం వలన కవర్ తెరిచేందుకు ధైర్యం రాలేదు. అధైర్యంతో అమ్రిత్ చేతిలో పెట్టింది.

ఏ మాత్రం తొణకక, ఉత్తరాన్ని డ్రస్సింగ్ ఛైర్ మీద పెట్టి, “స్నానం చేసి, రిలాక్స్ అయ్యాక చదువు” అన్నాడు అమ్రిత్

“ప్లీజ్.. అమృ, నువ్వు చదువు వింటాను” విశ్వద తొందర పెట్టింది.

‘మనిషినే చదివిన నేను ఉత్తరం ఏం చదవాలి’ మనసులో అనుకుని కవర్ తెరవలేదు. ఉత్కంఠ భరించలేక విశ్వద చదవడం మొదలుపెట్టింది.

డియర్ విశ్వదామ్రిత్,

వరుసకు చెల్లివే అయినా నీలో ఒక మంచి స్నేహితురాలిని చూసిన చనువుతో ఈ ఉత్తరం రాస్తున్నాను. నీ రీసర్చ్ చదువుకు కొంతైనా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం; అంతేకానీ పగ, కక్ష పెంచుకోమని కాదు.

అమర్ నన్ను ఇష్టపడే పెళ్లి చేసుకున్నాడు. ఇష్టం అనే పదానికి నిఘంటువు సమాధానం వేరు. నా జీవితానికి మాత్రం మరో కొత్త అర్థం. అమర్ దృష్టిలో నేను తన కొరకు తయారు చేసిన తోలుబొమ్మ! అతను ఆడిస్తే ఆడాలి, అంటే నా కీస్ అతని వద్ద ఉంటాయి. అతని సుఖం, సంతోషం, అతని అవసరాలకు మాత్రమే నేను కావాలి. తన చుట్టూ ఉన్న ప్రపంచానికి మాత్రం అతనొక పురుషోత్తముడు. అందరి మెప్పులు పొందాలని హద్దుల్లేని కోతలు కోస్తుంటాడు. నా భర్తగానే కాదు, ఒక తండ్రిగా కూడా బాధ్యత లేని జీవి.

నా పెళ్ళికి అమ్రిత్ చిన్నవాడు. మేమిద్దరం తల్లీకొడుకుల వలె ఉండే వాళ్ళము. ఎన్నోమార్లు మా ఇద్దరి మధ్య చెడు సంబంధం ఉన్నట్లు అనుమాన పడి నన్ను మానసిక క్షోభకు గురి చేసేవాడు. అయినా మేమిద్దరం పట్టించుకోలేదు. ఒకసారి స్కూల్ పరీక్షల సమయంలో చదువుతూ అన్నం తినకుండా టేబుల్ పైన తల పెట్టుకుని ఆదమరచి నిద్ర పోయాడు. జాలి వేసి, అన్నం కలిపి, నిద్ర లేపి నా చేతులతో తినిపించాను. నాకు శిక్షగా నా అరచేయిని గరిటతో వాత పెట్టాడు. అమ్మలాంటి వదినను తప్పు పట్టినందుకు అన్నగారి దుశ్చర్యకు తమ్ముడు చాలా గొడవ చేశాడు. మా ఇద్దరి మధ్య అక్రమ సంబంధం అంటగట్టి, యింట్లో నుండి పొమ్మన్నాడు. నమ్మకం లేని మనిషికి సుఖం తక్కువ!

ఆ అపనమ్మకము వలననే కనబడిన ప్రతి మనిషికి తను ఎంత గొప్పవాడో, తన దయాదాక్షిణ్యాల మీద మేము ఎలా బ్రతుకుతున్నదీ దండోరా వేస్తూనే ఉంటాడు. పొరపాటున కూడా నేను నా పిల్లలతో మనసు విప్పి మాట్లాడకూడదు. చదువులో ఒక్క మార్కు తక్కువ వచ్చినా చావబాదుడే!

ఆయన పాటలు, టీవీ అతి బిగ్గరగా పెట్టుకుంటాడు. ఎవ్వరూ ఎటువంటి ఆక్షేపణ చెప్పరాదు. నవ్వుతూ ఉండొద్దు, అట్లా అని సీరియస్‌గా ఉండొద్దు. మౌనంగా ఉంటే మాట్లాడమంటాడు, మాట్లాడితే మొదలవుతుంది గొడవలకు నాంది.

అన్నీ అసత్యం, అసభ్యం గోచరించే మాటలే. నేను మొద్దుబారి పోయాను. ఒకే ఒక్క సారి భక్తి సినిమాకు పిల్లలతో వెళ్ళాము. ఇక బ్రతికుంటే సినిమాలకు వెళ్లొద్దని ఒట్టేసుకున్నాను. ఆఫీసు తర్వాత ఇంటా, బయట మత్తు పదార్థాల బానిస.

పిల్లలకు చదువు, ఇల్లు తప్ప వేరే వ్యాపకాలు లేవు, ఉండొద్దు. తాగి వచ్చి కారణం లేకుండానే దండన విధిస్తాడు. నేను వారిస్తే వాళ్ళతో పాటు నేను హింస భరించాలి. వాళ్ళకి జబ్బు చేస్తే ఒక బాధ్యత గల తండ్రిగా దగ్గర ఉన్న డాక్టర్‌కు చూపించే ప్రయత్నం చేయడు. నేను ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ తిరిగేదాన్ని.

నా వంటి నిండా స్విచ్‌లు; అందుకే అందరికీ నేనొక బాధ్యత గల ఇల్లాలు. అమర్ లేని వేళలో నేను, నాకు లేని ధైర్యాన్ని తెచ్చుకొని పిల్లలతో చక్కగా చదువు కొని, ఆర్థికంగా నిలబడే స్తోమత సంపాదించి స్వేచ్ఛగా వెళ్ళి పొమ్మనేదాన్ని; పాపం వాళ్ళ ఆశలు, కోరికలు, బాధలు ఎవ్వరితోనూ చెప్పేవారు కాదు.

ఇంటి నుండి వెళ్ళిపోయిన అమ్రిత్, నిన్ను పెళ్లి చేసుకొని తోడుగా నా ఆశీర్వాదం కోసం వచ్చాడు. నువ్వు అందం, చదువు, సంస్కారం కలిగిన దానివి. ఆయన నీ ముందు ఎంత నటించే వాడు!

నిన్ను పోలుస్తూ నన్ను కించ పర్చేవాడు. ఆయనకు నువ్వు భార్య అయితే కాపురం పచ్చగా ఉండేదని కలలు కనేవాడు. అందుకే నీతో నవ్వుతూ, సరదాగా మాట్లాడేవాడు. ఏ కల్మషం లేని సహృదయత నీకుంది. నేను ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని ప్రతి సెలవులకు పిల్లల మనోవికాసం కొరకు నీ వద్దకు పంపే ఏర్పాటు చేసేదాన్ని. నిన్ను తెర వలె అడ్డుగా వాడుకున్నాను, ఇది నా స్వార్థం, తప్పేమో!

ఇది గమనించి, నాకు పరోక్షంగా తోడ్పడ్డాడు అమ్రిత్. విదేశాల చదువుల ఖర్చు కూడా ఆయనకు తెలియకుండా సాయం చేశాడు.

పరిపక్వం చెందని రవళికి పెళ్లి వద్దని నువ్వు గొడవ చేశావు. మాకు దూరంగా విదేశాల్లో అన్నకు దగ్గరగా ఉంటే రవళి సంతోషంగా ఉంటుందని అనుకున్నాను. పెళ్ళికి అమ్రిత్ చాలా సహకరించాడు.

నేను పిల్లల కోసం అన్నీ భరించాను, వాళ్ళ జీవితాలు ఓ కొలిక్కి వచ్చాయి, ఇక నా పాత్ర ఏమిటి?

గతంలో ప్రతి క్షణం నేను నా మనసుతో తిరగబడే దాన్ని, నాలో లావా పేరుకు పోయింది. ఈయన్ను వదిలేసి పిల్లల వద్ద హాయిగా ఉండొచ్చు కదా అని నా కథ విని ఎవరైనా సలహా ఇవ్వొచ్చు! నేను అలసిపోయాను. అతనితో నా జీవితం దుర్భరం. ఇన్నేళ్ల నా సంసార జీవితం ఒక వెట్టి చాకిరీ!

అందుకే ఎదురు తిరిగాను. రెండు సార్లు నన్ను చంపాలని ప్రయత్నించాడు.

కోర్టు, చట్టాలు స్త్రీ స్వేచ్ఛ సంఘాలు ఎన్నో పరిష్కార మార్గాలు ఉన్నా, నాలోని ఈ మంటను ఆర్పలేవు. అమ్రిత్ లాంటి వాళ్లు జోక్యం చేసుకున్నా ఫలితం దక్కదు. ఏదో ఒక రోజు నన్ను చంపేస్తాడు. నా హత్య ఆత్మహత్య అని నిరూపిస్తా.. అని చాలా సార్లు బెదిరించాడు.

మీ లాంటి సహృదయులు, ఎల్లవేళలా నా గురించి ఆలోచించే సంతానం ఉంటే.. బతుకుతాను.

చావు-పుట్టుకలు నిర్ణయించేది దేవుడు.. భర్త కాదు. నాకై నేను ఆత్మహత్య చేసికోను, ఇది తథ్యం!

మీ ఇద్దరికీ అమర్ నిజరూపం తెలియాలి. నువ్వు, బావగారు అంటూ ఎంతో గౌరవించే వ్యక్తి ఒక క్రూరమృగం అని నీకు తెలియదు. అందుకే ఎవ్వరికీ రాయని ఉత్తరం నీకు రాస్తున్నానంటే అర్థమయ్యే ఉండాలి.

తోబుట్టువుగా ప్రేమను పంచి, ఇప్పుడు నా దుఃఖాన్ని నీ ముందు పెట్టినందుకు క్షమించు..

ప్రేమతో అక్క.

***

చదవడం పూర్తి చేసిన విశ్వద మనసు భారమైంది. ఈ విషయాన్ని తన నుండి దాచి అమ్రిత్ కూడా తప్పు చేశాడు. అమర్ బావగార్ని తాను మార్చడానికి ప్రయత్నం చేసేది. అతను మారే వాడేమో!? నిండు ప్రాణం కర్కశంగా బలి చేయాలని ప్రయత్నించాడు. అంటే? అక్కను మేడపై నుంచి కింద పడేసి చంపాలనుకున్నాడు. ఆయుష్షు ఉంది ప్రాణం దక్కింది. హత్య ను ఆత్మహత్య అని ప్రచారం చేశాడు.

ప్రతి విషయాన్ని భర్తతో సౌమ్యంగా చర్చించే విశ్వద ఈ సారి భర్తను నిలదీసింది. అమ్రిత్ నవ్వుతూ, “మై డియర్ విశ్వదా! మనిద్దరి మధ్య ఈ సఖ్యత, అనురాగం వర్ధిల్లనీ..! నా పైన అంత పెద్ద నింద వేసిన వాడ్ని, దేవతకే మారు పేరైన వదినను చిత్రహింసలు పెట్టిన కపటిని నువ్వు మారుస్తావా? ఏ మార్పు అయినా స్వతహాగా, సహజంగా రావాలి. ఎందుకంటే వదిన ఉత్తరంలో చాలా క్లుప్తంగా రాసింది, మా అన్నకు నీ పట్ల ఉన్న ఇష్టానికి అర్థం వేరని. కానీ ప్రత్యక్షంగా ప్రతి దినమూ అప్పటి పరిస్థితులు ఎదుర్కొని నేను ఎంతటి రంపపు కోత అనుభవించానో తెలుసా?!” ఉద్వేగంగా చెప్తుంటే విశ్వద ఎదురు మాటల్లేకపోయింది.

“అన్న మూర్ఖుడు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. నువ్వు నా అర్ధాంగి; నన్ను ప్రేమగా ప్రేరేపిస్తూ నాకు సలహాలిస్తూ, నన్ను సమర్థిస్తూ, నా పట్ల అవగాహన కలిగి ఉండాలి. నీ పట్ల నా ధర్మం కూడా ఇదే!” నవ్వుతూ మొదలైన మాటలు సీరియస్‌గా మారాయి.

“ఓకే. బావగారి సంగతి వదిలేసేయి, వాట్ అబౌట్ యు? అక్కను ఆ నరక కూపం నుంచి తొలగించి ఆమెకు న్యాయం ఎందుకు చేయలేదు?”

“వదినకు అన్నతో కలిసి ఉండే అవస్థలు ఎందుకు? మనం తోడుగా ఉండే వాళ్లము అనుకోని చాలా సార్లు ప్రయత్నం చేశాను, కుదరలేదు. నాలోని పశ్చాత్తాపం మాటి మాటికి నాకు శిక్ష వేస్తుంది.”

“బాధపడకు. ఈ ఉత్తరం సాక్ష్యాధారం! మీ అన్నకు శిక్ష పడేలా చూద్దాం” అంది విశ్వద.

“లాభం లేదు. అన్న ఇప్పుడు రాజకీయ పలుకుబడి పెంచుకున్నాడు. పెద్దమనిషి జాబితాలో చేరాడు. ఎంత కేసు వేసిన ఓర్పుగా శిక్ష తప్పించుకోగలాడు. ఇప్పుడు వదిన బాధ్యత మన వంతు” కర్తవ్య భారం తీసుకున్నాడు.

***

అనుకున్న నిర్ణయానికి విశ్వద, అమ్రిత్ కట్టుబడి ఉన్నారు. పదేళ్లు గడిచాయి. ముగ్గురు కేర్ టేకర్లు మారారు. భాగ్యలక్ష్మి అసువున్న అస్తిపంజరం అయ్యింది. రక్షిత్ స్వంత ఖర్చులతో ప్రసిద్ధి చెందిన ఫారిన్ డాక్టర్ బృందాన్ని వెంట తెచ్చుకున్నాడు. వారి చేత పరీక్షలు చేయించాడు. కోలుకునే అవకాశం లేదని నిర్ధారించారు వైద్యులు, ఊపిరి ఉన్నంత వరకు ఇదే పరిస్థితి అని తేల్చి చెప్పారు.

న్యాయం అంటే కేవలం శిక్షించడం కాదు, ధర్మబద్ధంగా, నిష్పక్షపాతంగా మరియు నైతికంగా సమస్యను పరిష్కరించడం. చట్టపరంగా ఒక నిర్ణయం తీసుకున్నా, అది నైతికంగా లేదా సామాజికంగా అన్యాయంగా అనిపించినప్పుడు న్యాయం మరియు చట్టం వేర్వేరుగా అనిపించినప్పుడు, ‘ఈ శిక్ష న్యాయమేనా?’ అనే ఈ ప్రశ్న వస్తుంది.

పాసివ్ యుథనేషియా చట్టపరమైన ప్రక్రియ బలవంతపు మరణం కాదు, మెరుగయ్యే అవకాశం లేని స్థితిలో కృత్రిమ లైఫ్ సపోర్ట్ వెంటిలేటర్ తొలగించి, ప్రకృతిసిద్ధంగా గౌరవప్రదంగా చనిపోవడానికి కుటుంబ సభ్యుల అభ్యర్థన మేరకు ప్రభుత్వం మరణానికి ఇచ్చే అనుమతి.

భాగ్యలక్ష్మి వైద్యపరంగా కోలుకునే అవకాశం లేని స్థితిలో కారుణ్య మరణం పొంది గౌరవప్రదంగా చనిపోవడానికి రవళి, రక్షిత్ అనుమతి తీసుకొని విశ్వద, అమ్రిత్ కోర్టును ఆశ్రయించారు.

భార్యకు ప్రేమ పంచి ఇవ్వలేదు. కుటుంబ సంక్షేమ గురించి ఆలోచన అసలే లేదు. సంవత్సరాల తరబడి ఆరోగ్యం కోల్పోతే పట్టించుకోలేదు. అటువంటి భర్త నుంచి కోర్టు అనుమతి కోరుతుంది.

కుటుంబ సభ్యుల ఇష్టానుసారం భాగ్యలక్ష్మి లైఫ్ సపోర్ట్ వెంటిలెటర్ తొలగించే హక్కుపై కోర్టు స్పష్టతనిచ్చింది:

‘అమర్ బాధ్యత గల కుటుంబ పెద్ద! భాగ్యలక్ష్మి గౌరవప్రదంగా పాసివ్ యుథనేసియా (కారుణ్య మరణం) పొందడానికి భర్త అనుమతి అసంపూర్ణంగా ఉంది.’

అభ్యర్థన కొట్టేశారు.

‘కోర్టు ఇచ్చిన తీర్పు ఎంత వరకు న్యాయం?’

‘ఈ అన్యాయం న్యాయమేనా?’ విశ్వద సోషియాలజీ కొత్త పరిశోధన మొదలైంది.

Exit mobile version