Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శేషేంద్రచంద్రునికో అక్కరాల నూలుపోగు

[సముద్రాల హరికృష్ణ గారు రచించిన ‘శేషేంద్రచంద్రునికో అక్కరాల నూలుపోగు’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]

ఆకాశయానం, తారా విహారం, హరివింటి వర్ణం,
కౌముదీ గానం మహా ప్రియకరం!
**
భూలోక గంధం, విరిబాల అందం, సామీర గీతం
సాగర తీరం, కడు మోదకరం!
**
కార్మిక కష్టం, ఆ కర్షక సేద్యం, ఈ శ్రామిక స్వేదం-
మానవజీవనేతిహాసం అతి ప్రీతికరం!
**
ఎంత స్వాప్నికుడో, అంత సంఘర్షి, రస విప్లవుడు
క్షీర కలశం, బాడబానలం- రెండూ!
**
భూమ్యాకాశాల నొడిసిపట్టిన సాహితీ సాలప్రాంశుడు
వామన దశయె లేని త్రివిక్రముడు!
**
సనాతనము నాధునిక బాణిలో దీటుగ పల్కినవాడు
ప్రాచీనార్వాచీన మిశ్రపరీమళుడు!
**
అటు వాల్మీకి కాళిదాసుల కవితల పరవశించినవాడు,
ఇటు గజళ్ళకు వహ్వాల గుప్పించినవాడు!
**
వాసంత శిశిర చక్రాల పల్కరించి పయనించినవాడు,
ఋతు వేదము సానందుడై పఠించినవాడు!
**
చెట్ల సుఖదుఃఖములె ఋతువులన్న భాష్య శిఖరుడు
ప్రకృతి నక్షరాల బింబించిన శుభ్రాదర్శుడు!
**
రాజకీయ నినాదాల సోమరి వ్యాయామం కాదన్నాడు,
కవిత– మది రగిలే అగ్నిజ్వాలన్నాడు!
**
కొత్త భావాల, నిర్భయ సింహాల నడకలు కావాలన్నాడు —
కవి సైనికా! కదలు ముందు కన్నాడు!
**
శిథిల జీవికై అరుణుడు తెరల చీల్చి వడి రావాలన్నాడు
జీర్ణ కుటికి వెన్నెలవాక రాకలన్నాడు!
**
కూపస్థ మండూక సామాజిక చైతన్యమె చాలదన్నాడు
ప్రపంచమంతటి సాహితీస్పృహ కావాలన్నాడు!
**
శబ్దాల ఢమఢమ, అర్ధాల దాగుడుమూతలు కాదన్నాడు
భావం నడిపే ఆత్మకళ, కవితన్నాడు!
**
రామాయణము ఆ పూర్ణకళేశ్వరి షోడశి ఉపాసనన్నాడు
సొమాన్యుని జీవనవేద పాఠకునన్నాడు!
**
సౌందర్యోపాసనా కవితా విధానుడు, సమరస భావ ధనుడు
అపూర్వ పదచిత్ర సంవిధానుడు!
**
సౌమ్య సురూపుడు, స్మిత వదనుడు, మృదు భాషణుడు
కవితాసుధాశయ రాజహంసా నిభుడు!
**
కవి నను ఆభిజాత్యమె, స్వాభిమానమె – సంతకమైనవాడు
అనంత రమ్యరత్న కవిశేషుడ నన్నవాడు!
**
ఇన్ని నదుల సంగమకేంద్రము శేషేంద్రనామ్న కవ్యర్ణవము
హితవచనం, రసగ్రహణం – రెక్కలైన సితమరాళము!

Exit mobile version