[శ్రీ గంగాధర్ వడ్లమన్నాటి రచించిన ‘శభాష్..’ అనే కథని పాఠకులకి అందిస్తున్నాము.]
జనరల్ స్టోర్స్‌లో లలిత, క్యాష్ కౌంటర్లో ఒక వైపుగా వాలిపోయి నీరసంగా కూర్చుని మొబైల్ చూసుకుంటోంది.
ఇంతలో తన భర్త ఫోన్ మోగడంతో అటువైపు ఆశ్చర్యంగా చూసి, “ఈయన హడావిడి పాడుగాను, బయటికి వెళుతూ వెళుతూ, ఫోన్ మర్చిపోయారు. అయినా కంగారు ముందు పుట్టి తర్వాత ఈయన పుట్టారు” అని నాలుగు నసుగుళ్ళు నసిగింది. ఆ తర్వాత మళ్ళీ కుయ్యో మొర్రో అంటూ రింగ్ అయి ఆగిపోయింది. తర్వాత మళ్లీ రింగ్ అవడం మొదలుపెట్టింది. ఆ రింగ్ టోన్ గోలకి, ‘అబ్బబ్బ తీయకపోతే తలనొప్పి, ఇలా మోగుతూనే ఉంటుంది కాబోలు’ అనుకుంటూ ఆ ఫోన్ చేతిలోకి తీసుకుని, “హలో ఎవరు” అడిగింది
“ఆ మేడం, ఇంతకీ మీరు ఎవరు” అడిగింది అవతలి వ్యక్తి.
“అదేమిటి! నా మొగుడి ఫోన్‌కి ఫోన్ చేసి, నన్ను ఎవరని అడుగుతున్నావ్” విసుగ్గా అడిగింది
“నా పేరు షర్మిష, నేను సార్‌కి తెలుసు”. అని ఆమె అనగానే
లలిత పళ్ళు బిగిస్తూ “అలాగా, మంచిది. విషయం చెప్పు” అంది.
“ఏమీ లేదు, ఇది రామారావు జనరల్ స్టోర్స్ కదా.”
“అవును, ఇది రామారావు జనరల్ స్టోర్స్. అయితే ఏవిటిప్పుడు”
“ఏమీ లేదు మేడం, చిన్న హెల్ప్ కోసం ఫోన్ చేసాను. ఆయనుంటే ఇలా చేసేస్తారు. కానీ మీరు” అని నసిగి, చిన్నగా నవ్వింది.
“సరే సరే, ముందు విషయం చెప్పండి, చేయగలిగేది అయితే చేస్తాను. ఇంతకీ ఏమిటది” అడిగింది.
“ఏమీ లేదు మేడం, నేను ఒక పావుగంటలో మీ రామారావు జనరల్ స్టోర్స్‌కి వస్తున్నాను. ఒక ఇరవై వేలు నాకు అర్జెంటుగా ఈ నెంబర్‌కి ఫోన్ పే చేస్తే చాలు. నేను ఓ పది నిమిషాల్లో మీ రామారావు స్టోర్స్‌కి వచ్చి, ఆ ఇరవై వేలు మీ చేతికి ఇచ్చేస్తాను, అంతే. ఈ చిన్న సాయం చేయలేరూ” అడిగింది.
“ఇరవై వేలా” అని క్షణం ఆగి, “సరే సరే, నా ఫోన్ పే ద్వారా పంపుతాను. కానీ మీరు ఎంత సేపట్లో వస్తారు?” అడిగింది.
“ఈ సందు చివరలో ఉన్నాను, నా నెంబర్ మీ దగ్గరే ఉంది కదా, కాల్ చేయండి. నేను వీళ్ళకి మీరు పంపే ఫోన్ పే డబ్బు పంపేసి వచ్చేస్తాను. ఇక్కడ కాష్ తీసుకోవడం లేదు, ఫోన్ పే కావాలట. సరే ఏం చేస్తాను? నేను కూడా మీ వీధిలోనే, అదే అశోక్ నగర్ కాలనీలోనే ఉంటాను. సార్ చాలా మంచి వ్యక్తి. ఉన్నారనుకుని చేసాను. లక్కీగా మీరు హెల్ప్ చేయడానికి ఒప్పుకున్నారు.”
“ఒక్కసారి ఆయన ఊరు మీద పడితే, వచ్చేటప్పటికి ఎంత టైం అవుతుందో, ఎప్పుడు వస్తారో ఎవరికీ తెలియదు” అసహనంగా అంది లలిత.
“తెలుసు, నేను రెగ్యులర్‌గా మీ రామారావు జనరల్ స్టోర్స్‌లో సరుకులు కొంటూ ఉంటాను. ఆయన ఒక్కొక్కసారి నాకు అప్పు కూడా ఇస్తూ ఉంటారు, తర్వాత క్రెడిట్ కార్డు ద్వారా చెల్లిస్తాననుకోండి. అలా తెలుసు, మీ గురించి కూడా చెప్తూ ఉంటారు. మీరు ఉన్నప్పుడు నాకు రావడం కుదరలేదు. ఆయన ఎప్పుడూ పొద్దున ఉంటారనుకుంటాను.”
“అవును,ఆయన పొద్దున్న ఉంటారు. ఇవాళ పని మీద వెళ్లడంతో నేను ఉండాల్సి వచ్చింది. సరే సరే” అంటూ ఉండగానే
“సరే మేడం వేసేసేయండి, నేను వచ్చేస్తున్నాను. ఇరవై వేలు తెచ్చేస్తున్నాను” అంది.
సరే అని ఫోన్ పే ఓపెన్ చేసి డబ్బులు ఫార్వర్డ్ చేసి, “డబ్బులు పంపాను, కానీ ఒక” అని లలిత చెప్తుండగానే ఫోన్ కట్ అయింది.
ఇదేవిటి ఇలా కట్ అయింది అని మళ్ళీ చేస్తే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ‘ఏవిటిది, డబ్బు పంపాను అని చెప్తుండగానే ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది’ అని అనుకుంటుండగానే రామారావు వచ్చాడు.
అతన్ని చూస్తూనే “ఎవరండీ అది” అడిగింది.
“ఎవరే” అన్నాడు చుట్టుపక్కల చూస్తూ
“అమాయకుల్లా మాట్లాడకండి. ఎవరో చెప్పండి. ఫోన్లో ఇప్పటిదాకా మీ గురించి అన్నీ చెప్పి ఇరవై వేలు వెయ్యిమంది. సరే ఎందుకు అని అడిగితే ఫోన్ పే ద్వారా మాత్రమే అక్కడ డబ్బు తీసుకుంటున్నారట. అందుకనే పదినిమిషాల్లో క్యాష్ పట్టుకుని మన జనరల్ స్టోర్స్‌కి వచ్చి నా చేతిలో పెడతాను అంది. అయినా అమ్మాయిలకి ఈమధ్య ఇంత సాయం ఎలా చేస్తున్నారు. నేను తెమ్మంటే మూర మల్లెపూలు తీసుకురారు. అలాంటిది, నాకు తెలియకుండా ఈ మధ్య పరాయి ఆడవాళ్ళకి ఇలాంటివన్నీ చేస్తున్నారన్నమాట. ఫోన్ ఇవాళ ఇక్కడ వదిలేసి వెళ్లారు కాబట్టి, మీ బాగోతం బయటపడింది” అంది కళ్ళు పెద్దవి చేస్తూ.
“అలా అనకు, ఏం మాట్లాడుతున్నావో నాకు సరిగా అర్థం కావట్లేదు. అసలు ఆమె ఎవరో ఏవిటో తెలీదు. ఒకసారి నెంబర్ చూడనీ” అంటూ ఫోన్ తీసుకుని చూసి “తెలియని నెంబర్‌లా ఉందే, కొంపతీసి డబ్బులు గానీ పంపావా” అడిగాడు, కాదు అరిచాడు.
“పంపాను, ఒక రూపాయి పంపాను. మళ్లీ మీకు అది ఫోన్ చేయకుండా ఉండడానికి గాను, రూపాయి మాత్రమే పంపి అవమానించాను. మళ్ళీ ఇలాంటి ధన సహాయాల కోసం మా ఆయనికి ఫోన్ చేస్తే బావుండదు అని ఆమెకి చెపుదామనుకునే లోపే, ఫోన్ కట్ చేసి స్విచ్ ఆఫ్ చేసింది” చెప్పింది మూతి విరుస్తూ.
దాంతో ఊపిరి పీల్చుకుని, “నీ అనుమానం ఇన్నాళ్ళకి ఓ పనికొచ్చే పని చేసింది” అన్నాడు మెచ్చుకోలుగా చూస్తూ.
“అంటే” అడిగింది
“అది ఫ్రాడ్ కాల్, అంటే స్కామ్ కాల్. నేను లేని సమయం చూసి నిన్ను ఎవరో బుట్టలో వేద్దాం అనుకుని బయట నుంచి ఎక్కడి నుంచో మన జనరల్ స్టోర్స్‌కి, నా నెంబర్‌కి కాల్ చేశారు. కొద్దో గొప్పో మన వివరాలు చెప్పేస్తే, నువ్వు ఇరవై వేలూ వేసేస్తావనుకున్నారు పిచ్చి మొద్దులు. కానీ నువ్వు వాళ్ళ మాయలో పడకుండా తప్పించుకున్నావ్. శభాష్” అని బుజం తట్టడంతో, ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక, లలిత చిత్రంగా చూస్తూ, తెల్ల మొహం వేసింది.
