Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుతుడు

[డా. జి వి పూర్ణచందు గారు రచించిన ‘శస్త్ర చికిత్స పితామహుడు సుశ్రుతుడు’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

ప్రాచీన భారత దేశంలో క్రీ.పూ. 3,000 నాటికే శస్త్ర చికిత్సాపరమైన పరిశోధనల గురించి బీజాలు పడ్డాయి.

బుద్ధుడి కాలానికి శస్త్ర చికిత్స విస్తృతంగా ఉంది. చరకుడు, సుశ్రుతుడు, వాగ్భటుడూ ఈ ముగ్గురూ ఆయుర్వేద వైద్యశాస్త్రాన్ని అత్యున్నత స్థితికి తీసుకు వెళ్ళారు. చరకుడు ఔషధచికిత్సకు, సుశ్రుతుడు శస్త్రచికిత్సకూ పితామహులుగా నిలిచారు. వాగ్భటుడు ఆ ఇద్దరికీ సమన్వయంగా ‘అష్టాంగ హృదయం’ గ్రంథాన్ని రచించాడు. ఈ ముగ్గురునీ బృహత్త్రయం అంటారు.

ఆధునిక వైద్యానికి పితామహుడని భావించే హిప్పోక్రేట్ర్స్ (క్రీ పూ. 460-370) కన్నా ఈ ముగ్గురూ ముందు తరం వాళ్లు.  క్రీ.పూ. 1000-6000 ఆచార్య సుశ్రుతుడి కాలంగా ఎక్కువమంది భావిస్తున్నారు. బహుశా బుద్ధుడికి ఈయన సమకాలికుడు కావచ్చు. ఈజిప్ట్ లోని Komombo లో ఒక ప్రాచీన దేవాలయం గోడల మీద శస్త్రచికిత్స ఉపకరణాలు చెక్కి ఉన్నాయి. అవి సుశ్రుతుడి ఉపకరణాలను పోలి ఉన్నాయనీ, నైలూ నది దాకా విస్తరించిన సుశ్రుతుడి ప్రభావానికి అది సాక్ష్యం అనీ చరిత్రకారుల భావన.

కాశీరాజైన ‘దివోదాస ధన్వంతరి’ శిష్యుడు సుశ్రుతుడు. అధర్వణ వేదంలో సుశ్రుతుడి పేరు కనిపిస్తుంది. మహాభారతం అనుశాసన పర్వంలో శ్యామ, గార్గి, జాబాలితో పాటు సుశ్రుతుడు కూడా విశామిత్రుడి పుత్రుడిగా ఉంది. “విశ్వామిత్ర సుతం శిష్య మృషిం సుశ్రుత మన్వశాత్”, “విశ్వామిత్ర సుతాం శ్రీమాన్ సుశ్రుతః” అని సుశ్రుత సంహితలోనూ విశ్వామిత్ర పుత్రుడనే ఉంది.

ఆయన కాలానికి ఉత్తరాదిలో రాగి, కంచు మాత్రమే తెలుసు. ఆ కాలంలో తెలుగు నేలపైన లోహయుగం నడుస్తోంది. ఉక్కు ఆయుధాలు, పనిముట్లు తయారయ్యే కర్మాగారాలు ఇక్కడ ఉండేవనటానికి సాక్ష్యంగా కర్నూలు పరిసర ప్రాంతాల్లో బూడిద కుప్పలు (ash mounds) కనిపించాయి. అత్యధిక ఉష్ణోగ్రతను ఉపయోగించి దహనం జరిగినందువలన ఏర్పడిన బూడిదగా దీన్ని గుర్తించారు.

లోహాల్లోకెల్లా కఠినమైన ఇనుమును కరిగించటానికి ఈ అత్యధిక ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. బహుశా నాణ్యమైన ఉక్కు తయారీ పరిశ్రమల అవశేషాలు ఈ బూడిదకుప్పలు కావచ్చునని భావిస్తున్నారు.  విశ్వామిత్రుడు రామలక్ష్మణుల్ని దండకారణ్యానికి తెచ్చి అస్త్రశస్త్రాలు ఇప్పించటానికి ఇక్కడ ఆయుధ కర్మాగారాలు ఉండటం ఒక కారణం కావచ్చు. ఉక్కుతో తయారైన శస్త్రోపకరణాల (surgical instruments) తయారీలో ఆనాటి లోహకారులకు శస్త్ర వైద్యంతోనూ శస్త్రచికిత్స చేసేందుకు ఉపయోగించే ఉపకరణాలతోనూ ఎక్కువ పరిచయం ఉండి ఉంటుంది. కాబట్టి, సుశ్రుత సంహిత పరిరక్షకలు లోహకారులేనని ‘హిష్టరీ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ’ గ్రంథంలో మేథ్స్ పండితుడు పేర్కొన్నాడు. ఈ ఆధారాల్నిబట్టి సుశ్రుతుడి కాలం క్రీ.పూ. 1000 వరకూ ఉండే అవకాశం ఉంది.

అమ్మోనియస్ (క్రీ.పూ. 283-247), సెల్సస్ (క్రీశ. 1వ శతాబ్ది) పేర్కొన్న perineal vesicolithotomy లాంటి శస్త్ర చికిత్సా విధానాలు సుశ్రుత సంహిత ఆధారంగా చేసినవేనని ఋజువైంది. క్రీపూ. 326 లో అలెగ్జాండర్ దండయాత్ర తరువాతే, భారతదేశంలో వర్ధిల్లుతున్న విజ్ఞానం గురించి గ్రీకో రోమన్లకు తెలిసింది. వీళ్లంతా తమ శాస్త్రాలను పరస్పరం మార్పిడి చేసుకోవటం ద్వారా విజ్ఞానం పెంచుకోగలిగారు. ఇతర వైద్యపోకడల్ని గ్రహించి ఆయుర్వేద శాస్త్రాన్ని అభివృద్ధి చేయాలని  చరకుడు కూడా సూచించాడు.

వాత పిత్త కఫాలనే త్రిదోషాలకు అదనంగా రక్తధాతువును నాలుగవ దోషంగా సుశ్రుతుడు పేర్కొన్నాడు. రక్త ధాతువు దుష్టి చెందితే అన్ని ధాతువులూ దుష్టి చెందుతాయన్నాడు. గాయాలకు వ్రణరోపణ చికిత్సలు, శల్యోద్ధరణం అంటే, బాణపు ములుకుల్ని తొలగించే శస్త్ర చికిత్సలు చెప్పాడు. విష ప్రయుక్తమైన ఆహారాదులు, వాటి విరుగుడు చికిత్సలు చెప్పాడు.

విష్పల అనే స్త్రీ తన కాలు కోల్పోతే, లోహంతో చేసిన కాలుని అమర్చాడు. కండ తెగి రక్తస్రావం అవుతున్నప్పుడు ఆ కండరం రెండు అంచులను దగ్గరకు లాగి కుట్లు వేయటం (సూచరింగ్), క్షారాలను ఉపయోగించి స్రావం అవుతున్న రక్తనాళాన్ని కాల్చటం ద్వారా రక్తస్రావాన్ని ఆపటం (కాటరైజేషన్) లాంటి ప్రక్రియలు సుశ్రుతుడు చెప్పినవే! చీము పట్టి కుళ్ళిపోతున్న ‘దుష్టవ్రణా’న్ని ‘శుద్ధవ్రణం’ గానూ, పుండు తగ్గే దశలో దాన్ని ‘రుద్ధవ్రణం’గానూ మార్చే (ulcer healing) విధానాల్ని పేర్కొన్నాడు.

వైను, సారాయిల్ని ఎనస్థీషియా కోసం ఉపయోగించాడు. Excision (ఛేదనం), Incision (భేదనం), Scraping (లేఖనం) లాంటి విధానాలను అనుసరించాడు. వరిబీజంలో నీటిని తీసేందుకు ‘వ్యవధాన’ అనే ఉపకరణాన్ని ఉపయోగించాడు.

దబ్బనం ఆకారంలో ఉండే ప్రోబ్’ని ‘ఈషణ’ అన్నాడు. పేగుల లోపలి భాగంలో ఏర్పడే మొలలను (internal piles), లూఠీ వ్యాధిని (ఫిష్ట్యులా ఇన్ యానై) తొలగించటానికి లాంగలక, అర్థలాంగలక, సర్వభద్ర, చంద్రాథ వగైరా ఉపకరణాలను ఉపయోగించాడు.

పేగులలో ఏర్పడే అవరోధాలను (intestinal obstructions-బద్ధ గుదోదరం) తొలగించటానికి, అలాగే చిల్లులు పడిన పేగులకు (ఛిద్రోదరం-perforated intestines) శస్త్రచికిత్సలు చెప్పాడు.

శవాన్ని కుళ్లకుండా కాపాడి, ఒక్కోపొరనీ విడదీసి చూస్తూ మనిషి శరీర రచనని (అనాటమీ) అధ్యయనం చేశాడు. పిండ స్థాయి (ఎంబ్రియాలజీ) నుండి, ఎముకలు ఆస్టియాలజీ, కండరాలు(మయాలజీ) లాంటి అధ్యయనాలెన్నో సుశ్రుత సంహితలో ఉన్నాయి. ఆయన చెప్పిన నూటొక్క శస్త్ర ఉపకరణాల్లో స్వస్తిక, సందంశ, తాళ, నాడీ, శలాక లాంటివి ముఖ్యమైనవి. బంగారం, వెండి, ఏనుగుదంతం శ్రేష్ఠమైన ఉక్కుతో చేసినవీ ఉన్నాయి. ఒక వెంట్రుకని నిలువుగా చీల్చేటంత నిశితమైన శస్త్రాలున్నాయి.

సర్జరీకి ముందు అగ్నితో “ఉపకరణ పాయనం” (steriliation) చేయాలన్నాడు. శరీరం లోపలికి ప్రవేశ పెట్టేందుకు 28 రకాల కేథెటర్లను, ఇరిగేషన్ సిరింజిలను వివరించాడు. అనేక క్షారాలతో (alkalies and caustics) గాయాలను శుభ్రపరచటం గురించి చెప్పాడు. పొట్ట లోపలి అవయవాలలో కుళ్ళును తొలగించటానికి పొట్టను కోసి తెరిచే ప్రక్రియ లాపరాటమీ గురించి వివరించాడు. పేగుల గాయాల్ని repair of intestinal injuries సరిచేయటం, హెర్నియా, హైడ్రోసీల్, మొలలు, ఫిష్ట్యులా విరిగిన ఎముకలు సరిచేయటం, శరీరభాగాలు తొలగించటం, కంటిశుక్లాలకు ఆపరేషన్లు, పెదిమలు, ముక్కు, బుగ్గలకు సంబంధించిన అంగవైకల్యాలు ఏర్పడినప్పుడు ఆ భాగాల్ని పునర్నిర్మించటం (ప్లాస్టిక్ సర్జరీ) గురించి ప్రస్తావించాడు. నుదుటి పైన ఉండే చర్మపుపొరని నిలువుగా గాయపడిన ముక్కుని తెచ్చి అంటుగట్టి, ముక్కు తిరిగి మామూలు స్థితికి తెచ్చే ‘ప్లాష్టిక్ సర్జరీ’ పద్ధతిని సుశ్రుతుడే కనుగొన్నాడు. తొలి ప్లాష్టిక్ సర్జన్ సుశ్రుతుడు అందించిన విజ్ఞానాన్ని ఈ యుగం ప్రజలు సరిగా ఉపయోగించుకోకపోవటం వలన నష్టం మనకే!

తెగిన ముక్కును అతికిన కథ

ఎడ్లబండి నడుపుతూ జీవించే కౌవస్జీ అనే మహరాష్ట్రుణ్ణి టిప్పుసుల్తాన్ బంధించి ముక్కు కోసే శిక్ష విధించాడు. తెగిన ఇతని ముక్కుని తిరిగి మొలిపించి సరిచేసిన కుమార్ అనే ఆయుర్వేద వైద్యుడి గురించి చరిత్రలో రికార్డయి ఉంది. అతని ముక్కుని సరి చేసాక బ్రిటిష్ వాళ్లు ఈ వైద్యుణ్ణి  గుర్తించారు. భారతీయ శస్త్ర చికిత్సా నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. 1795లో లూకాస్ అనే ఆంగ్ల వైద్యుడు ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలన్నీ లండనుకు రిపోర్ట్ చేశాడు.  ముక్కు బాగైన కౌసాజీ చిత్రం అలా లండన్ చేరింది.

ఈ కథకు ఇంకో కొసమెరుపు ఉంది: Joseph Constantine Carpue అనే లండను వైద్యుడు ఆ భారతీయ వైద్యుడి పద్ధతిలో ప్లాస్టిక్ సర్జరీని ప్రయత్నించి 20 యేళ్లపాటు శ్రమించి చివరికి ఎలాగైతేనేం సాధించాడు. “An account of two successful operation” అనే పుస్తకంలో కాన్‘స్టంటైన్ కార్పస్ గారు rhinoplasty (ముక్కు సరిచేసే చికిత్స) ని ఫలానా భారతీయుడి నుండి తన మిత్రుల ద్వారా తాను తెలుసుకుని నిర్వహించినట్టు స్వయంగా ఒప్పుకున్నాడు. కానీ, ఆయన్ని ప్లాస్టిక్ సర్జరీ పితామహుడుగా ఆధునిక వైద్యం కీర్తిస్తోంది. అందరూ కలిసికట్టుగా కుమార్ పేరును మరుగుపరిచారు. మనం పరాయి పాలనలో ఉన్నవాళ్లం కదా!

గురుశిష్య పరంపర చెడిపోయి, తగిన గురువులు లేక, systematic surgical teaching and practice లోపించిన కారణంగా, శస్త్ర చికిత్స భారతదేశంలో క్రమంగా ప్రాభవం కోల్పోతూ వచ్చింది. ఇందుకు బౌద్ధమో,  జైనమో ప్రవచించిన అహింసా సిద్ధాంతం ఎంతమాత్రమూ కారణం కాదు. ఆ శాస్త్రాన్ని దక్కించుకోవాలన్న చొరవ మనకు లేకపోవటాన్ని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. గౌతమబుద్ధుడు, జైన మహావీరుడు, వేదవ్యాసుడూ ఈ యుగానికి ఎంత అవసరమో సుశ్రుతుడు కూడా అంతే అవసరం. ఆయన ఎంత శత్ర వైద్య నిపుణుడో అంత అభ్యుదయవాది కూడా! శూద్రుడికీ ఉపనయనం చేసి విద్య బోధించాలని ప్రతిపాదించినవాడు. ప్రాచీన విజ్ఞానవేత్తలు దురాచారాల్ని ఖండించి ఎదురొడ్డి నిలిచారు. వారికి అండ ఆనాడు వారి విజ్ఞానమే! సుశ్రుతుడు అనేక వైద్యక అంశాలలో విప్లవాత్మక ఆలోచనలు చేసిన వైద్యవేత్త. ఆయనకు పూర్వమూ శస్త్ర చికిత్స ఉంది. కానీ, ఒక సర్జన్‌కి కావలసిన నిర్భీతితో కూడిన సాహసోపేతమైన నిర్ణాయకశక్తి సుశ్రుతుని శస్త్రచికిత్సా పితామహుని చేసింది!

Exit mobile version