Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శాశ్వతానంద ప్రాప్తి

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘శాశ్వతానంద ప్రాప్తి’ అనే రచనని అందిస్తున్నాము.]

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ।
సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే॥
(భగవద్గీత 2వ అధ్యాయం, 15వ శ్లోకం)

సత్-చిత్-ఆనందము అంటే నిత్యమైన-చైతన్యవంతమైన- ఆనందం అని శాస్త్రం నిర్వచించింది కానీ, ఇంద్రియములకు వాటి విషయ సంయోగము ద్వారా మనము అనుభవించే ఆనందము దీనికి విరుద్ధముగా ఉంటుంది. ఈ భౌతికమైన ఆనందం తాత్కాలికమైనది, పరిమితమైనది, చైతన్యరహితమైనది మరియు జడమైనది. అందుకే మన శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందము మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తి పరచలేదు అని పతంజలి మహర్షి కూడా యోగ సూత్రాల ద్వారా తెలియజేసారు.

ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం మరియు బాధ యొక్క అనుభూతులు తాత్కాలికమే. వీటివల్ల ప్రభావితం అయితే నడిసంద్రంలో నావలా ఊగుసలాడవలిసి వస్తుంది. వివక్ష కలిగిన వ్యక్తి సుఖదుఃఖాలు రెంటినీ, చెదిరిపోకుండా, తట్టుకోవడానికి సాధన చేయాలి. ఉన్నతమైన ఆధ్యాత్మిక సిద్ధి ప్రాప్తి పొండానికి కృతనిశ్చయుడై సుఖదుఖములు వంటి ద్వందాలను సహిస్తూ భౌతిక సుఖాల పట్ల నిరాసక్తతను పెంపొందించుకుంటూ పవిత్రమైన మనస్సుతో చిత్తశుద్ధితో సాధన చేసే సాధకులు మాత్రమే మోక్షాన్ని పొందడానికి అర్హత సంపాదిస్తారు.

ప్రపంచం ఒక గొప్ప భ్రమ అని, జీవితమనే ఈ నాటక రంగంపై మనం కేవలం పాత్రధారులమని, మనల్ని మన కర్మ ఫలానుసారం ఆడించేది ఆ భగవంతుడని తెలియని వారు ఇంద్రియాలు మరియు మనస్సు యొక్క అనుభవాలను వాస్తవమని భావించి, వాటిని తమపై తాము విధించుకుని, వారి జీవితమంతా బాధలు అనుభవిస్తారు. అయితే ఈ మార్పులు శరీరానికి మాత్రమే సంబంధించినవని మరియు వాటి ద్వారా ఆత్మ చైతన్య రూపుడైన మానవులు ఎటువంటి ఇబ్బంది లేకుండా మరియు కలుషితం కాకుండా ఉంటాయని తెలిసిన వారు సుఖదుఃఖాల నుండి విముక్తులవుతారు. అలాంటి పురుషులు ఎల్లప్పుడూ ఆనందంగా జీవిస్తారు.

భగవంతుని ఉనికిని ఎల్లప్పుడూ అనుభవిస్తూ, అతనిని ఎన్నడూ మరువక ఎల్లవేళలా అతనికి సాధనమాత్రులమై, ఆయన విదించిన జీవిత విధానంలో జీవించడం, మన ధర్మ, వేద శాస్త్రాలు మనకు నిర్వర్తించిన కర్తవ్య కర్మలను త్రికరణశుద్ధిగా నిర్వర్తిస్తూ మనస్సును, ఇతర ఇంద్రియాలను నియంత్రించుకుంటూ భక్తి మార్గంలో నడవడం ఎంతో శ్రేయస్కరం. అట్టి స్థిరమైన భక్తి స్థిరపడాలంటే, భగవత్కథలను వినడం, భగవంతుని స్మరించడం, భగవన్నామాలను సంకీర్తించడం. భగవంతునికి మనసా వాచా కర్మణా సమర్పించుకోవడం అవసరం.

ఏది జరిగినా అది మన మంచికే అనుకొని మన చుట్టూ ఉన్న సమాజం మంచి కోరడమే నిజమైన భక్తి. అంటే.. భగవంతుని నిరంతర స్మరణతో మనస్సులోని మలినాలు తొలగుతాయి. తత్ఫలితంగా చిత్తశుద్ధి కలుగుతుంది. ఇటువంటి స్థితిలో భగవత్ అనుగ్రహం కోసం మరింత కఠిన, కఠోర సాధన చేయగలుగుతాము.అప్పుడే భగవత్ అనుగ్రహం సిద్ధించి తద్వారా శాశ్వతానంద ప్రాప్తి కలుగుతుంది.

Exit mobile version