Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-12

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

‘నటసామ్రాట్’ అనే మరాఠీ సినిమాలో, నానా పటేకర్ (గణపతిరావ్) తన యావదాస్తినీ పిల్లలకు రాసిచ్చేస్తాడు. కొంచెమైనా ఉంచుకుందామని పోరుతుంది భార్య. ఆమెను ‘సర్కార్!’ అని సంబోధిస్తుంటాడు. కానీ ఆమె మాట వినడు. ‘నా పిల్లలు రత్నాలు!’ అంటాడు. అటు కొడుకు కోడలు వీళ్లను ఇంట్లో నుంచి వెళ్లగొడతారు. కూతురయితే నాలుగాకులు ఎక్కువే చదివింది. ఏకంగా తండ్రి మీద దొంగతనం మోపుతుంది. అప్పుడా తండ్రి ఉంటాడు భార్యతో.

“మనం వివాహం, దాంపత్యం ద్వారా పిల్లలకు జన్మనిచ్చామనుకుంటాం. కాని నిజానికి వారి జననాలకు మనం వారధులం మాత్రమే!”

సుబ్బమ్మగారి పరిస్థితి కూడా అంతే! ఏమిటంటే ఆమె తన నగలను ఎవరికీ ఇవ్వలెదు. ఫలితం: అన్నంలో బూడిద పోయడం. ఇస్తే ఒక సమస్య, ఇవ్వకపోతే ఒక సమస్య. అందుకేనేమో వీలునామాలలో ‘మా తదనంతరం మాత్రమే’ అన్న క్లాజ్ ఉంటుంది.

పార్వతి వాదనతో సుబ్బమ్మగారు ఏకీభవిస్తుంది.

“నా బొడ్లో ఆ నగలున్నాయి కాబట్టి ఈ మాత్రంగా ఉంది. పిచ్చిదానిలాగా వాళ్లకి అన్నీ అప్పచెపితే బతికుండగానీ ఈడ్చి పారేస్తారు!” అంటుందా వృద్ధురాలు.

ఏమిటీ సంబంధాలు? బాంధవ్యాలు? Unconditional love అన్నది రాను రాను మృగ్యంగా మారుతుందా? తల్లిదండ్రులు, పిల్లల అనుబంధాలు give and take గా మారుతున్నాయా? తల్లిదండ్రులు జాగ్రత్తపడకపోతే వారి గతి అంతేనా?

“అమ్మా, నాకున్నదాంట్లో నువ్వూ తిందువుగాని ఆ నగలు వాడికిచ్చేయి” అంటాడు పెద్ద కొడుకు. ఆ నగల కోసమే తానూ తల్లిని చేరదీశానని అనుకుంటారేమో అని అతని భయం! కానీ ఆమె వినదు.

పోనీ ఇక్కడయినా కుదురుగా ఉంటుందా ఆ మహాతల్లి! అదీ లేదు! ఇక్కడ కూడా తగాదాలు తెస్తూనే ఉంటుంది. మధ్య మధ్య బుచ్చి యింటికి వెళుతుంది.! వాళ్లకు ఈ ముసలిది అక్కర్లేదు. ఆమె బంగారం మాత్రం కావాలి? పోనీ అతనికేం తక్కువయిందా అంటే లక్షల ఆదాయం వచ్చే బిజినెస్!

అలా సంక్లిష్టమైన మానవ సంబంధాలను నగ్నంగా చిత్రీకరించారు రచయిత్రి. అయితే నాణేనికి రెండువైపులా చూపించారు. ‘కుపుత్రో జాయేత, క్వచిదపి కుమాతా న భవతి’ అన్న ఆదిశంకరులకు ఇవన్నీ తెలియదు. ‘చెడ్డ తల్లిదండ్రులుంటారు జాగ్రత్త!’ అని ముప్పాల రంగనాయకమ్మ గారు ఏకంగా ఒక నవలే రాశారు. కానీ సుబ్బమ్మగారి్ని చూస్తే మన కెందుకో కోపం రాదు! జాలి వేస్తుంది. గోపాల రావు ప్రభావం వల్లనేమో? ఎలాంటి మనస్తత్వం గలవారయినా తల్లి తల్లే, తండ్రి తండ్రే! అదీ మాలతమ్మకూ రంగనాయకమ్మకూ తేడా!

***

డబ్బు – అధికారం – వికృత సంబంధం

బుచ్చి ఒకరోజు అన్నయ్యను చూడడానికి వస్తాడు. దేశం అవినీతితో భ్రష్టు పట్టిపోతోందంటాడు. ధర్మపన్నాలు వల్లిస్తాడు. గోపాల రావుకు నవ్వు వస్తుంది. ఇలా అనుకుంటాడు.

“ఇనుప కెటిల్‌ని మసిపట్టిన కుండ ‘నువ్వు నల్లగా ఉన్నావు’ అన్నదని..” ది డెవిల్ కోటింగ్ ది స్క్రిప్చర్స్..” (పుట 158)

దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లనిపిస్తుంది అతనికి తమ్ముని మాటలు వింటుంటే. ఇంకాస్త రెచ్చిపోయి “ఈ రాజకీయ కాలుష్యం పోగొట్టటానికి మనం ముందు తరాలకి ఏదైనా చెయ్యాలి” అంటాడు. “ముందు తరాలవారికి స్వచ్ఛమైన పరిపాలన అందించాలి మన తరం” అంటాడు.

గోపాలరావు అడుగుతాడు, “పార్టీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నావా?”

ఆ ఒక్క ప్రశ్నతో బుచ్చి అసలు స్వరూపాన్ని బట్టబయలు చేసారు రచయిత్రి. అతడు ఎలక్షన్లలో నిలబడాలనుకుంటున్నాడు. డబ్బు పెట్టగల శక్తి ఉంది. కానీ గోపాల రావు లాంటి క్లీన్ చిట్ గల, స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారి సానుకూలమైన రెకమెండేషన్ అవసరం అవుతుంది. అదే చెబుతాడు అన్నతో.

“పార్టీలో నీ రెకమెండీషన్‌కు – అంటే ఫలానా గోపాల రావు అన్న పేరుకి కొందరు పాత తలకాయల్లో విలువ ఉంది” (పుట 161)

అందుకే అన్నయ్య మీద అంత ప్రేమ పుట్టుకొచ్చింది! అవకాశవాదమా వర్ధిల్లు! అన్నదమ్ములిద్దరి మధ్య ఈ సందర్భంలో జరిగిన చర్చ ద్వారా డబ్బుకు అధికారానికి గల అగ్లీ రిలేషన్‌షిప్‌ను మాలతి గారు ఆవిష్కరించారు. అది వెర్రితలలు వేసి ఇప్పుడు, ఈ తరంలో వికృత విశ్వరూపం దాల్చింది.

అన్నయ్యలో.. అవినీతి లంచాలు అన్న మచ్చ లేదు. మొదట అతన్నే నిలబెడదాం అనుకున్నాడట! కాని లక్షలు గుమ్మరించాలి!

ఇప్పుడు పార్టీ ఐదు లక్షలిస్తుంది. మిగతా పదిహేను క్యాండిడేట్ పెట్టుకోవాలి. అప్పుడు అంటే 1950 ల్లోనే లక్షలు! అదే యిప్పుడు సర్పంచ్, కార్పొరేటర్ పదవులకే కోట్లు గుమ్మరిస్తున్నారంటే, రాజకీయం ఎంత లాభసాటి వ్యాపారమో తెలుస్తుంది. అంత ఖర్చు పెట్టి పదవిలోకి వచ్చినవాడు ప్రజాసేవ చేస్తాడా? పెట్టిన డబ్బుకు మూడింతలు రాబట్టుకుంటాడు గాని!

“అధికారం చేతిలో ఉంటే గాని అవినీతిని అరికట్టలేము” అంటాడు బుచ్చి పైగా.

“పార్లమెంటులో కూర్చుంటే తప్ప ప్రజాసేవ చేయలేవా?” అనడుగుతాడు అన్నయ్య.

“పార్టీ టికెట్ కోసం లక్షలు లక్షలు లంచం ఇవ్వడమే అవినీతి కదా!” అంటాడు. తానివ్వకపోతే ఇంకొకడు ఇచ్చినటు కొట్టేస్తాడు కదా! అలాంటపుడు తానే.. ఈ పనికిమాలిన లాజిక్ తోనే అవకాశవాదులు రెచ్చిపోతారు. అప్పుడు గోపాల రావు మాటలు పదునుగా ఉంటాయి.

“ఎలక్షన్‌లో నీవు పెట్టాలనుకుంటున్నది నల్లడబ్బు కాదా? ఎలక్షన్లు అంటే డబ్బు పెట్టి ఓట్లు కొనడం కాదు రా! ప్రజలు ఇష్టపడి మనని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకున్న వ్యక్తి ప్రజాసేవ చేయాలి. ప్రజస్వామ్యానికి ఎలక్షన్లు పునాదిరాళ్లురా! ఆ పునాది లోనే ఓట్లు కొనుక్కున్నపుడు, ఇసుకతో కట్టిన ఇల్లులాగా అది కూలిపోతుంది. నేను నిల్చున్నపుడు దమ్మిడీ ఖర్చు పెట్టనా? నాకు ఓట్లు రాలేదా? అసెంబ్లీ సీటు గెల్చుకోలేదా?” (పుట 160)

దానికి తమ్ముడు ఆ కాలం వేరంటాడు. అవి స్వాతంత్యం వచ్చిన తొలి రోజులు కాబట్టి అలా జరిగిందంటాడు. కానీ నిష్కళంకుడు, నిస్వార్థపరుడు ఎన్నికల్లో నిలబడితే ప్రజలు ఆదరిస్తారు. మొన్నటికి మొన్న లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణ గారు గెలవలేదా?

మళ్లీ నందయ్యతో పాలుస్తాడు అన్నను బుచ్చి. ‘రెండు సార్లు మినిస్టరయ్యాడు. లక్షలు గడించాడు. ఈ రోజు పార్టీకి ఫైనాన్స్ చేస్తున్నాడు..’

పార్టీ ఫండ్ ఎవరిచ్చినా, వారికి తర్వాత అధికారంలోకి వచ్చిన వారు లబ్ధి చేకూర్చాలి. ఇచ్చిన వారి అవినీతికి కొమ్ము కాయాలి. దొందూ దొందే!

ఈ ఓట్లు కొనుక్కోవడం ఈ మధ్య కొత్త పుంతలు తొక్కుతోంది. ముందు నుంచే సంక్షేమ పథకాల పేరుతో ప్రజల అకౌంట్లలో డైరెక్ట్‌గా డబ్బు జమ చేస్తున్నాయి ప్రభుత్వాలు. దాని వల్ల ప్రజల్లో డబ్బు సర్క్యులేషన్ పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుందని వారి వాదన. సామాన్యులకు ఈ ఆర్థికశాస్త్ర సిద్ధాంతాలు అంతుపట్టవు. మరి ప్రొడక్టవిటీ మాటేమిటి? కొందరు మేధావులు మరింత ముందుకు వెళ్లి ఈ సంక్షేమ పథకాల కోసం డబ్బు పంచడాన్ని మరో ‘క్విడ్ ప్రోకో’ గా అభివర్ణిస్తున్నారు. అలా ఓట్లు కొనుక్కోవడాన్ని లీగలైజ్ చేస్తున్నాయి ప్రభుత్వాలు అని వారి వాదన.

అలా అన్నదమ్ముల చర్చ ద్వారా మాలతమ్మ అత్యంత వివాదాస్పదమైన, డబ్బు – అధికారం – వాటి వికృత సంబంధం అన్న అంశాన్ని, నిర్భయంగా విశ్లేషించారు.

***

స్వరాజ్యలక్ష్మి, తాతయ్య ఆదర్శాలకు ప్రతిరూపం: ఆయన భావజాలానికి ప్రతిబింబం: స్వరాజ్యం చదువు: మళ్లీ పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్‍పై చర్చ: ఆడపిల్లలకు స్వేఛ్ఛ: దుర్వినియోగం: సద్వినియోగం: ఆధునిక ఆడపిల్లల దృక్పథం: స్వరాజ్యం భవిష్యత్తు గురించి, రచయిత్రి కావ్యార్థ సూచన:

స్వరాజ్యాన్ని, ఏ కాలేజీలో చేర్చాలన్న విషయం మీద, ఇంట్లో వాదోపవాదాలు చెలరేగుతాయి. సుబ్బమ్మ గారు, పార్వతి మాత్రం ఈ విషయం ఒకటి అవుతారు. గోపాలరావు, స్వరాజ్యం ఇంకోవైపు మద్రాసులోని ‘మంచి’ (?) కాలేజీల్లో స్టెల్లా మేరీస్, ఉమన్స్ క్రిస్టియన్ కాలేజీలు ముందంజలో ఉంటాయి. స్వరాజ్యనికి ఇంటర్మీడియట్‌లో రాష్ట్రస్థాయిలో రెండో స్థానం వచ్చింది. కాబట్టి ఏ కాలేజీలోనైనా సీటు వస్తుంది. కాని స్వరాజ్యం క్వీన్ మేరీస్‍లో మటుకే చేరతానంది. ఇక్కడ ఆ కాలేజీ గురించి కొంచెం తెలుసుకోవాలి.

1914లో క్వీన్ మేరీస్‌ని స్థాపించారు. మద్రాసు నగరంలోని, తొలి, అతి పురాతన కళాశాల అది. అది మెరీనా బీచ్‍కు ఎదురుగా, కామరాజర్ సాలై, డా. రాధాకృష్ణన్ సాలైల మధ్య కూడలిలో ఉంటుంది. పేద విద్యార్థినుల చదువు, సాధికారతలలో అది గొప్ప పాత్రను పోషించింది. దాని మోటో – ‘Common Sense and Consideration’. దాన్ని స్థాపించినవారు Dorothy de la Hey. ఇది మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల. మొదట దాని పేరు ‘మద్రాస్ కాలేజ్ ఫర్ ఉమెన్’. దాని తొలి భారతీయ ప్రిన్సిపాల్, శ్రీ నల్లముత్తు రామమూర్తి గారు. 2022లో ఆ కళాశాల NIRF (National Institutional Ranking Framework) వారి రేటింగ్‌లో 47వ స్థానాన్ని పొందింది. ఆ కళాశాలలో చదివిన విశ్వవిఖ్యాతులు వీరే.

  1. యశోదా దాసప్ప; రాజకీయవేత్త, పద్మభూషణ్
  2. కమలాదేవి ఛటోపాధ్యాయ, స్వాతంత్య్ర సమరయోధురాలు, పద్మవిభూషణ్.
  3. జానకీ అమ్మాళ్, శాస్త్రవేత్త.
  4. చారుమతి రామచంద్రన్, సంగీత విద్వాంసురాలు
  5. వాణీ జయరాం, గాయని.
  6. అనూరాధా శ్రీరామ్. సంగీతవేత్త
  7. ఆర్. శివభోగం; తొలి భారత ఛార్టర్డ్ ఎకౌంటెంట్.

వీరు గాక, స్వరాజ్యం ప్రస్తావించిన వారు ముత్తులక్ష్మి రెడ్డి. ఆమె తొలి భారత మహిళా శాసన సభ్యురాలు, వైద్యురాలు; పద్మభూషణ్, అవార్డు గ్రహీత, రుక్మిణమ్మ గారు.

అది గవర్నమెంట్ కాలేజి కాబట్టి, సహజంగానే ఉన్నత, ఎగువ మధ్య తరగతి వర్గాలవారి కంటికి ఆనదు. పార్వతి లాంటి ఫాల్స్ ప్రిస్టేజి కోసం పాకులాడే వారికి అసలు నచ్చదు.

ఆమె ఇలా అంటుంది – “బుచ్చి పిల్లలందరూ స్టెల్లా లోనే చేరారు. నువ్వూ అక్కడే చేరు.”

అదీ విషయం. ఆమెకు మరిది అంటే ఒక గొప్ప భావం!

స్వరాజ్యం ఒప్పుకోదు, “నీకు సంబంధం లేని విషయాల్లో నీవు కల్పించుకోకు” అంటుంది తీవ్రంగా. అది స్వరాజ్యం తొలి తిరుగుబాటు!

“అక్కడ చదువు బాగా చెప్పరట. లెక్చరర్సు సరిగ్గా ఉండరట. అక్కడి పిల్లలంతా బీచ్‌లో చేరి..”

“ఆ కాలేజీలో మరీ స్లమ్స్ నుంచి వచ్చిన పిల్లలుంటారు”

“పెద్దింటి పిల్లలున్న కాలేజీ అయితే.. మంచి మర్యాద.” (పుట 162)

ఇక్కడ పెద్దింటి/స్లమ్స్ పిల్లల గురించి స్వరాజ్యం చెప్పే మాటలు మాలతమ్మ మాటలే.

“నాలుగు మేడలు, రెండు కార్లు ఉంటే పెద్దింటి వాళ్లవుతారా? పెద్ద ఇంట్లో పుట్టిన వాళ్ళు తప్పకుండా బుద్ధిమంతులవుతారని గ్యారంటీ ఉన్నపుడు, నీ తోటికోడలుని తన మనుమడి గురించి అడగకపోయావా?” (పుట 162)

బుచ్చి మనుమడు కిశోర్. తాగి కారు నడుపుతూ ఒకరి చావుకు కారణం అయ్యాడు. స్టెల్లా లోని అమ్మాయిని నమ్మించి, ప్రేమించానని కల్లబొల్లి మాటలు చెప్పి, మోసం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. బుచ్చి తన పలుకుబడి ఉపయోగించి మనుమడిని కాపాడాడు.

ఇదంతా నిలదీసి అడుగుతుంది స్వరాజ్యం నాన్నమ్మను. తాతమ్మ (సుబ్బమ్మ గారు) అక్కడా ఇక్కడా Double Standards పాటిస్తుందని ఆ పిల్లకు తెలుసు.

“అమ్మమ్మా, మనం బీదవాళ్లం నిజమే.. అది సిగ్గుపడాల్సిన విషయం కాదు.” (పుట 163)

ఆత్మగౌరవం అంటే అది! అది తాతయ్య నుంచి వచ్చింది స్వరాజ్యానికి.

(సశేషం)

 

Exit mobile version