[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]
Public Funded Vs Private Education
ప్రభుత్వ కాలేజీల్లో ఫ్రీగా చదువు చెబుతారు. పుస్తకాలిస్తారు. ఫీజులు నామమాత్రం. స్కాలర్‌షిప్లు ఉంటాయి.
“హయిగా అక్కడ చదువుకోక ప్రయివేట్ కాలేజీలంటూ ఎందుకు ఎగబడాలి?” (పుట 164) అన్నది ఆ అమ్మాయి వాదన.
“నీతో కూడా చెప్పించుకోవాల్సిన స్థితికొచ్చాను. గుడ్డొచ్చి..” అంటుంది పార్వతి. అప్పుడు ఆ చిన్నపిల్ల ఇలా అంటుంది – “నిజాలకు వయసుండదు అమ్మమ్మా! పెద్దవాళ్లయినా చిన్నవాళ్లయినా కొన్ని నిజాలని ధైర్యంగా ఎదుర్కోవాలి.”
‘నిజాలకు వయసుండదు’ – ఇలాంటి మాటలే సామెతలు అవుతాయి. ఫ్రాన్సిస్ బేకన్ ‘Envy Takes no holidays’, రస్సెల్ ‘knowledge is power’ అలాంటివే.
మేము వెల్దుర్తి హైస్కూలులో చదివేటప్పుడు వెంకటరెడ్డి అని మా క్లాస్‌మేట్ ఉండేవాడు. రెడ్లంటే రాయలసీమలో రూలింగ్ క్లాస్ అని అనుకుంటారు. వారిలో కూడా నిరుపేదలుంటారు. వెంకటరెడ్డిది ఆ ఊరికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న అల్లుగుండు గ్రామం. వాళ్ల నాన్న వ్యవసాయ కూలీ. వాడు నడిచి స్కూలుకు వచ్చేవాడు. కాళ్లకు చెప్పులు కూడా ఉండేవి కాదు. అప్పుడపుడు క్యారేజీ తెచ్చుకునేవాడు కాదు. మా బాక్సు ల్లోంచి తలా ఇంత పెట్టేవాళ్లం.
వాడు టెంత్ (1972 బ్యాచ్) జిల్లాకే ప్రథమ స్థానం తెచ్చుకొన్నాడు. కర్నూలు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో వాడు బై.పి.సి తీసుకున్నాడు. తర్వాత వాడి సంగతి తెలియదు. ఇరవై సంవత్సరాల తర్వాత హైదరాబాద్‌లో కలిశాడు. వాడి ప్రస్థానం విని ఆశ్చర్యం, ఆనందం కలిగింది.
మెడిసిన్‌లో సీటు రాక, ఎ.జి. బి.యస్సి, ఎ.జి. ఎమ్.ఎస్.సి చేశాడట. అగ్రికల్చరల్ సైన్స్‌లో పి.హెచ్.డి చేసి, రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడట. వాడు కొత్త వరి వంగడాన్ని కనిపెట్టాడట. దానికి ఆరుతడి చాలట. సాళ్లు (వరుసలు) గా సాగు చేయాలట. కేవలం కంకితో సహా ఒకటిన్నర అడుగులు ఎత్తు మాత్రమే పెరుగుతుందట.
ఇప్పుడు కటక్ (ఒరిస్సా) లోని సెంట్రల్ రైస్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో సైంటిస్ట్‌గా వెళుతున్నాడట. వాడిని చూసి గర్వపడ్డాను. ఎవరన్నారు పేదరికం అభివృద్ధికి ఆటంకమని!
స్వరాజ్యానివన్నీ తాత ఋద్ధులే. బర్మా బజారులో చౌకగా దొరికే స్మగుల్డ్ (దొంగ) సిల్కు చీరలంటే ఆ అమ్మాయికి నచ్చదు. నేత చీరలే కడుతుంది. హాయిగా సుఖంగా ఉంటుందంటుంది. నలుగురు నేత పనివాళ్లు బతుకుతారంటుంది.
జీవితం పట్ల, అంత చిన్నవయసులోనే ఆ పిల్లకు నిశ్చితాభిప్రాయాలున్నాయి. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం, ఆమె వ్యక్తిత్వంలో తొణికిసలాడుతుంటాయి.
పార్వతితో ఇలా అంటుంది – “ఇదిగో అమ్మమ్మా, నా చదువు నా జీవితం నావి! వాటిని శాసించే హక్కు మీకెవ్వరికీ లేదు!”
లెక్కకు పార్వతి, స్వరాజ్యానికి నాయనమ్మ అవుతుంది. కాని ఎందుకో అమ్మమ్మా అని పిలుస్తుంది.
“బర్మా బజారు వాళ్లు కూడ పొట్టకూటికే గదా ఆ పనులు చేస్తారు” అని పార్వతి అంటుంది. దానికి స్వరాజ్యం రిటార్ట్ చూడండి. వాళ్లంతా స్మగుల్డ్ గూడ్స్ అమ్ముతారు. అది ఒకరకంగా దోపిడీయే అని స్వరాజ్యం ఉద్దేశం.
“నా పెళ్లాం బిడ్డల్ని పోషించుకోవాలి కనుక మీ ఇంటి మీద పడి దోచుకుంటాను అంటే ఊరుకుంటానా?” (పుట 164)
ఈ మాటల ద్వారా మాలతిగారు ‘రాబిన్‌హుడ్’ టైపు సామాజిక పరిష్కారాన్ని కూడా ఒప్పుకోనట్లే కనబడుతుంది. స్వరాజ్య దృష్టిలో స్మగ్లర్లు దొంగలూ ఒకటే!
స్వరాజ్యం క్వీన్ మేరీస్‌లో చేరడానికి కారణం, “బీచ్‌లో అబ్బాయిలతో షికార్లు కొట్టడానికి” అని పార్వతి తోటికోడలు, బుచ్చి భార్య వ్యాఖ్యానిస్తుంది.
సాయంత్రాలు చీకటి పడింతర్వాత గాని స్వరాజ్యం కాలేజి నుంచి ఇంటికి రాదు. ఇంటర్-కాలేజి డిబేట్స్‌లో, తెలుగు శాఖకు ఆ అమ్మాయిని సెక్రెటరీని చేశారు. గోపాలానికి చెప్తే, దానికి ఒప్పుకుంటాడు. పార్వతి.. స్వరాజ్యం ఆలస్యాన్ని, ఇంకో రకంగా అర్థం చేసుకుంది.
గోపాలరావుకు మనవరాలి మీద అంతులేని నమ్మకం. ఒక వయస్సు వచ్చిన తర్వాత, ఆడపిల్లలకు స్వేచ్ఛ ఇవ్వాలని నమ్మేవారిలో అతడొకడు. పార్వతితో ఇలా వాదిస్తాడు.
“ఆడపిల్లలు మగపిల్లలతో సరిసమానంగా చదువుకోవాలని మేమంతా కలలు కన్నాం. అది కళ్లతో చూస్తున్నాం. ఆ మార్పు చూసి ఆనందించడానికి బదులు ఇంకా ‘ఆడపిల్లవు కాబట్టి కట్టుదిట్టాల్లో ఉండాలి’ అనీ బి.సి. నాటి నమ్మకాలు పట్టుకొని వేళ్లాడకు. తమకు కలిగిన అవకాశాలని, స్వేచ్ఛని దుర్వినియోగం చేసేది మగపిల్లలు గాని.. ఆడపిల్లలు మటుకు కాదు.” (పుట 165)
“చీకటి పడేదాకా ఆడపిల్ల..” అంటుంది పార్వతి.
“ఆ మాటే, ఆ వివక్షలే వద్దంటున్నాను. చదువు ఆడపిల్లకి విచక్షణ, ఆత్మస్థయిర్యమూ ఇచ్చేందుకు కారణం కావాలి” (పుట 166).
ఆ కాలంలోనే ఆడపిల్లల పట్ల ఎంత విశాల దృక్పథం!
అదీ స్వరాజ్యన్ని, విభిన్నంగా ముందుకు నడిపించింది.
***
ఎమర్జెన్సీ విధింపు, ఇందిరా గాంధీ నియంతృత్వం – స్వరాజ్యం సమర్థన; గోపాలరావు వ్యతిరేకత
ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించింది. దానివల్ల సమాజంతో ఆరోగ్యకరమైన మార్పు, ప్రజల్లో క్రమశిక్షణ వచ్చినట్లు గమనిస్తుంది స్వరాజ్యం.
ఉత్సాహంగా తాతయ్యతో ఇలా చెబుతుంది –
“ఇన్నాళ్లకు రైళ్ళు టైముకొస్తున్నాయి. బస్ డ్రయివర్లు ఒళ్లు దగ్గర పెట్టుకొని నడుపుతున్నారు. ఎక్కడ చూసినా క్రమశిక్షణ, భయభక్తులు! మన దేశం నిజంగా బాగుపడుతుంది. కూరల మార్కెట్‌లో అన్ని కూరల ధరలు వేసి, ఆ అట్టలు కూరల మీద గుచ్చారు. సెక్రెటేరియట్‌లో గుంపులు లేరు. పది అయ్యేటప్పటికి అందరూ ఎవరి సీట్లతో వారు కూర్చుంటున్నారు. నువ్వు కోరుకున్న క్రమశిక్షణ అమలులోకి తీసుకొని వచ్చింది ఇందిరా గాంధీ!”
ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. స్వరాజ్యంలాంటి యువతకు ఇది గొప్ప విజయంలా అనిపిస్తూంది. కానీ ఒక్క వాక్యంతో దాన్ని పూర్వపక్షం చేస్తాడు గోపాలరావు. నాణేనికి మరోవైపును మనమరాలికి చూపిస్తాడు.
“ఈ ఎమర్జెన్సీని నైతికంగా నేను హర్షించలేకుండా ఉన్నాను.”
అది యువతకు, పెద్దవారికీ తేడా! ‘నైతికంగా’ అన్న పదం ద్వారా రచయిత్రి దాన్ని చెప్పారు. భయభక్తులతో వచ్చే క్రమశిక్షణ అభిలషణీయం కాదంటాడు.
“క్రమశిక్షణ కోసం – ప్రధాని ఎమర్జెన్సీ పెట్టలేదమ్మా! అలహబాదు హైకోర్టు తీర్పును తోసిపుచ్చి ఇలా అక్రమంగా అత్యవసర పరిస్థితి అనడం ఏం బాగోలేదు!” (పుట 169).
“ప్రజాభిప్రాయం ప్రకారం నడుచుకొనవలసిన ప్రధాని, ఎమర్జెన్సీ ముసుగు కింద ప్రజల హక్కులను తుంచిపారెయ్యడం మంచిది కాదమ్మా..” (పుట 169)
స్వరాజ్యం ఒప్పుకోదు. నైతికవాదం, గాంధీయవాదం అంటూ చేతులు ముడుచుకొని కూర్చుంటే ఎలా? అని అడుగుతుంది తాతయ్యను. ఆమె ఏం చేసినా ప్రతిపక్షాలు గోల చేస్తాయి. సమ్మెలు, బంద్‌లు, ఉద్యమాలతో.
ఇందిరాగాంధీకి వ్యక్తిగత క్రమశిక్షణ లేదంటాడు గోపాల రావు – స్వచ్ఛమైన పారదర్శకమైన పరిపాలన అందించడంలో ఆమె విఫలమైందంటాడు.
“అతని కంఠంలో కోపం కంటే ఆవేదన ఎక్కువ కనిపిస్తుంది.”
స్వాతంత్ర్యం వచ్చి ముఫై ఏళ్ళయినా అవిద్య, దారిద్ర్యం, జనాభా పెరుగుదల అలాగే ఉన్నాయి. కానీ ఈ ఎమరెన్సీ వల్ల మన దేశం యావత్ ప్రపంచం ముందు తల వంచుకోవాల్సివచ్చింది. ఇక్కడ గోపాల రావు ద్వారా పరిపాలన ఎలా ఉండాలో రచయిత్రి చెప్పారు.
“పరిపాలన అన్నపుడు దానికి స్వపర భేదాలు ఆపాదించకూడదు. నైతికంగా మనం చేస్తున్నది సబబా కాదా? అన్నది చూడాలి ఎమరెన్సీ ముసుగులో ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో నీకు తెలియదమ్మా. మా పత్రికల నోరు నొక్కేశారు. ఎక్కడ అన్యాయం జరుగుతున్నా దానిని ఎలుగెత్తి చాటే ప్రథమ కర్తవ్యం మా పత్రికలది. అటు వంటి హక్కు, బాధ్యత రెండూ నొక్కేశారు ప్రెస్ సెన్సారింగ్‌తో..” (పుట 170).
ఎమర్జెన్సీ తాత్కాలికమే అన్నదానికి గోపాల రావు చెప్పే సమాధానం మనకు దిగ్భ్రాంతే కలిగిస్తుంది. ఒక రకంగా తీవ్రమైన (extreme) అభిప్రాయం ఇది.
“ఒకసారి నరమాంసం రుచి మరిగిన పులి, ఎన్ని జన్మలయినా నరవాసన మర్చిపోదట. అధికార దాహం చాలా చెడ్డదమ్మా, దాన్ని రుచి చూసిన మనిషి ప్రాణాలనైనా వదుల్తాడు గాని అధికారాన్ని జార విడుచుకోడు” (పుట 170)
ఫ్యామిలీ ప్లానింగ్‌ను పాశవికంగా అమలు చేయడం ఒక రకమైన శాడిజం అంటాడు గోపాల రావు పరోక్షంగా. మగవాళ్లు దానికి భయపడి ఊరు విడిచి పారిపోతున్నారు. దానిని మొగలాయి కాలంలో జుట్టు పన్ను కంటే ఘోరమైనదిగా అభివర్ణిస్తాడు గోపాల రావు.
అయినా, స్వరాజ్యానికి ఇందిర అంటే గుడ్డి ఆరాధన. బ్రతిమాలితే వింటారా ప్రజలు? అని ఆమె అభిప్రాయం. కాని వ్యక్తిగత స్వాతంత్ర్యం అన్నదాన్ని హరిస్తే?
“మనిషి శరీరం మనిషిది. ఆ శరీరంలో భాగాన్ని ముట్టుకోడానికి ఎవరికీ హక్కు లేదు. నీ చెయ్యి, కాలు విరిస్తే ఊరుకొంటావా?” (పుట 171).
నార్త్‌లో ఆడవాళ్ళు కూడా దీనికి వ్యతిరేకమే ఉంటాడు గోపాల రావు.
“తాత్కాలిక ఫలితాల కోసం మానవ విలువలను మరచిపోకూడదు.” (పుట 171)
ఈ మాట అందరు పాలకులకూ, అన్నికాలాలకూ వర్తిస్తుంది – కనువిప్పు కలిగించే మాట ఇది. ఇందిర ఒక ఆడది అని అందరూ ఆమెని చిన్నచూపు చూస్తున్నారంటే,
“నైతిక దృక్పధానికి మానవతా విలువలకి ఆడ-మగ భేదం లేదు” అంటాడు తాతయ్య.
విశ్వజనీన దృక్పథం ఇది. ఇందులో సుధామూర్తి గారు నిరసించిన Gender bias లేదు. వ్యక్తిగా ఆమె అంటే గోపాల రావుకు చాలా గౌరవం, ఇష్టం! కాని అవి అమె నియంతృత్వాన్ని నిరసించడానికి అతనికి అడ్డం రాలేదు.
ఈ చర్చలో మనం గమనించాల్సింది, శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘నిర్భీతి’! మాటలు Protagonist వైనా, భావాలు ఆమెవే! ఇదంతా వ్యక్తం చేయడానికి గట్స్ కావాలి. Objectivity (నిష్పాక్షికత) కావాలి. Subjectivity (వ్యక్తి ఆరాధన) ఉండకూడదు. వీటన్నిటినీ మించి, పరిపాలన పట్ల లోతైన అవగాహన ఉండాలి. హక్కుల పట్ల కమిట్మెంట్ ఉండాలి. ఇవన్నీ మాలతమ్మకు కావలసినన్ని ఉన్నాయి. మళ్లీ మాట్లాడితే ఇంకా ఎక్కువే ఉన్నాయి.
స్వరాజ్యం చిన్నపిల్ల. ఆమె మొండి వాదన చేస్తూంటే. గోపాల రావుకు మల్లే మనకు కూడా కోపం రాదు. ఆమె అమాయకత్వానికి జాలి వేస్తుంది! నోరెత్తితే కటకటాల వెనక్కి తోసే అధికార జులుం ఆ అమ్మాయికి అర్థమే కాదు. ఆ వయసు అలాంటిది. ఆమె లాంటి యువతీయువకులు ఎమర్జెన్సీలోని అకృత్యాలను ‘సాహసోపేత చర్యలు’ అనుకుంటున్నారు.
‘నిరంకుశాః కవయః’ అన్నారు మన లాక్షణికులు. అంకుశం అంటే ‘అదుపు’. కవులు, రచయితల మీద ఎలాంటి అదుపు ఉండకూడదని దాని అర్థం. ఇందిరమ్మ వారిపై దమనకాండను ప్రయోగించింది.
అప్పుడు కూడా ఇలాంటి భావాలు వెలిబుచ్చడానికి ఆమెకేం భయం లేదు. జంకు గొంకు అంటే తెలియని రచయిత్రి ఆమె. 1992లో ఈ నవలకు సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చినప్పుడు శ్రీ పి.వి.నరసింహారావు గారి సారధ్యంలోని కాంగ్రెసు ప్రభుత్వమే కొలువు తీరి ఉంది. సోనియాగాంధీకి ఏ మాత్రం నచ్చని నాయకుడాయన. ‘విధి లేక’ ఆయనను అంగీకరించిందామె. మైనారిటీ ప్రభుత్వాన్ని విజయవంతంగా, చాకచక్యంగా నడిపిన చాణక్యుడాయన. డా. మన్మోహన్ సింగ్ గారిని ఆర్థికమంత్రిని చేసి, ఆర్థిక సంస్కరణలకు, ఫ్లెక్సిబుల్ ఇండస్ట్రియల్ పాలసీకి బాటలు వేశాడు. ఇద్దరూ మౌనమునులే! కాని చేతల మునులు! పివి ధిక్కారస్వరం. మన్మోహన్ గారిది విధేయస్వరం. పి.వి.గారి ప్రభుత్వమే ఈ నవలకు అవార్డు ఇచ్చి, పరోక్షంగా ఎమర్జెన్సీని de-glorify చేసిందా? ఇదంతా hypothesis మాత్రమే. పరిశోధనలలో దీని స్థానం దీనికుంది మరి!
ఏది ఏమైనా, మాలతమ్మలో మనకు శివుని కవిత్వాన్నే తప్పు పట్టిన నత్కీరుడు కనిపిస్తాడు. ‘ఇమ్మనుజేశ్వరాధముల’ను నిరసించిన పోతన కనిపిస్తాడు. “రాజుల్ మత్తులు, వారి సేవ నరకప్రాయంబు” అన్న ధూర్జటి, ‘సాతానిక్ వర్సెస్’ రాసిన సాల్మన్ రష్దీ, ‘లజ్జ’ రాసిన తస్లీమా నస్రీన్ లాంటి నిరంకుశులయిన కవులు, రచయితలు, రచయిత్రులు గుర్తొస్తారు. ప్రభుత్వాల నియంతృత్వాన్ని, established doctrines ని బహిరంగంగా ఎదిరించగలిగిన సాహసులు వీళ్లు.
(సశేషం)
శ్రీ పాణ్యం దత్తశర్మ 1957లో కర్నూలు జిల్లా వెల్దుర్తిలో పుట్టారు. తండ్రి శతావధాని శ్రీ ప్రాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రి. తల్లి శ్రీమతి లక్ష్మీనరసమ్మ. టెంత్ వరకు వెల్దుర్తి హైస్కూలు. ఇంటర్, డిగ్రీ, ఎం.ఎ. (ఇంగ్లీషు), ఎం.ఎ. (సంస్కృతం), ఎంఫిల్, పిజిడిటియి (సీఫెల్), ప్రయివేటుగానే.
దత్తశర్మ ఇంటర్మీడియట్ విద్యాశాఖలో లెక్చరర్‌గా, ప్రిన్సిపాల్‌గా, రీడర్‌గా, ఉపకార్యదర్శిగా సేవలందించారు. కవి, రచయిత, విమర్శకులు, గాయకులు, కాలమిస్టుగా పేరు పొందారు. వీరివి ఇంతవరకు దాదాపు 50 కథలు వివిధ పత్రికలలో ప్రచురితమై వాటిలో కొన్ని బహుమతులు, పురస్కారాలు పొందాయి.
వీరు ‘చంపకాలోచనమ్’ అనే ఖండకావ్యాన్ని, ‘Garland of poems’ అన్న ఆంగ్ల కవితా సంకలనాన్ని, ‘దత్త కథాలహరి’ అన్న కథా సంపుటాన్ని ప్రచురించారు. వీరి నవల ‘సాఫల్యం’ సంచిక అంతర్జాల పత్రికలో 54 వారాలు సీరియల్‌గా ప్రచురితమై, పుస్తక రూపంలో ప్రచురింపబడి అశేష పాఠకాదరణ పొందింది. 584 పేజీల బృహన్నవల ఇది. ‘అడవి తల్లి ఒడిలో’ అనే పిల్లల సైంటిఫిక్ ఫిక్షన్ నవల సంచిక డాట్ కామ్‌లో సీరియల్‌గా ప్రచురించబడింది.
వీరికి ఎ.జి రంజని సంస్థ కవి సామ్రాట్ విశ్వనాథ పురస్కారాన్ని, ‘తెలంగాణ పాయిటిక్ ఫోరమ్’ వారు వీరికి ‘Poet of Profundity’ అన్న బిరుదును, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంవారు వీరి సిద్ధాంత గ్రంథానికి అవార్డును, సి.పి. బ్రౌన్ సమితి, బెంగుళూరు వారు వీరికి ‘NTR స్మారక శతకరత్న’ అవార్డును బహూకరించారు.
ఇద్దరు పిల్లలు. ప్రహ్లాద్, ప్రణవి. కోడలు ప్రత్యూష, అల్లుడు ఆశిష్. అర్ధాంగి హిరణ్మయి. సాహితీ వ్యాసంగంలో రచయితకు వెన్నుదన్నుగా ఉన్న గురుతుల్యులు, ప్రముఖ రచయిత వాణిశ్రీ గారు. వీరు – తమ సోదరి అవధానం లక్ష్మీదేవమ్మ గారు, మేనమామ శ్రీ కె. సీతారామశాస్త్రి గార్లకు ఋణగ్రస్థులు.

