Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శతసహస్ర నరనారీ హృదయనేత్రి, భరత ధాత్రి!-6

[శ్రీమతి మాలతీ చందూర్ గారి ‘హృదయనేత్రి’ నవలపై శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన సిద్ధాంత గ్రంథాన్ని ధారావాహికగా అందిస్తున్నాము.]

కాంగ్రెస్ పార్టీ – ఎన్నికలలో పాల్గొనడం – ప్రత్యక్ష రాజకీయాలు – ప్రపంచ యుద్ధం:

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో పోటీ చేసి ఎనిమిది రాష్ట్రాలలో అధిక మెజారిటీ సాధించింది. నందయ్య సత్తెనపల్లిలో పోటీచేసి గొప్ప విజయం సాధించాడు. మద్రాస్ రాష్ట్రంలో సి. రాజగోపాలాచారి ముఖ్యమంత్రి అయ్యారు.

కాంగ్రెస్ పాలన:

కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల నాలుగు నెలలు స్వపరిపాలన చేసింది. ప్రజలకు వారి పట్ల నమ్మకం, గురి ఏర్పడ్డాయి. వారు చేపట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఇవి.

  1. అస్పృశ్యతా నిర్మూలన
  2. ప్రాథమిక విద్య
  3. మద్యపాన నిషేధం
  4. హరిజన దేవాలయ ప్రవేశం
  5. ఋణవిమోచన చట్టం
  6. సత్యాగ్రహుల ఆస్తులు తిరిగి అప్పగింత (-పుట 89.)

రాముడత్తయ్య కట్టాల్సిన చక్రవడ్డీని మాఫీ చేసి, అసలు బాకీని పొలం అమ్మి తీర్చి, ఆమె ఇల్లు నిలబెట్టారు.

అప్పుడు కాంగ్రెస్ మంత్రివర్గంలో స్థానిక వ్యవహారశాఖామంత్రి శ్రీ బెజవాడ గోపాలరెడ్డి గారు. ఆయన చీరాల-పేరాలను మళ్లీ పంచాయితీగా మార్చారు. ప్రజలు పండగ చేసుకున్నారు.

నందయ్య కూడ మంత్రి పదవిలో ఉన్నాడు. గోపాలరావును ఆప్యాయంగా కావిలించుకొన్నాడు. “ఏం చేస్తున్నావ్?” అని అడిగాడు. దానికి అటుగా వెళుతున్న జానకమ్మ గారు ఇలా చెప్పారు –

“గాంధీగారి అడుగుజాడల్లో నడుస్తున్నాడు.”

ప్రపంచ యుద్ధంలో పాల్గొనటానికి భారతీయులెవరూ సిద్ధంగా లేరు. గాంధీజీ దాన్ని (యుద్ధాన్ని) నైతికవిరుద్ధంగా అభివర్ణించారు.  యుద్ధాన్ని సపోర్ట్ చేస్తే అహింసావాదం గంగలో కలిసినట్లేనని ఆయన భావన. వ్యక్తి సత్యాగ్రహానికి పిలుపునిచ్చారు. యుద్ధానికి వ్యతిరేకంగా వినోబా భావే మొదటి వ్యక్తి!

గోపాలరావు కొంత వ్యక్తి సత్యాగ్రహంలో దిగాడు. ఆ మేరకు కలెక్టరుకు రాశాడు.

వెంటనే తమ్ముడు, పిల్లనిచ్చిన మామ, అతని ముందు ప్రత్యక్షం!

“నీ సత్యాగ్రహం వల్ల కలెక్టరు మా కాంట్రాక్టులు రద్దు చేస్తానంటున్నాడు. నాయనా, మమ్మల్నిలా బ్రతకనివ్వవా?” అన్నారు మామగారు, ఇద్దరూ అతన్ని emotional blackmail చేయడం ప్రారంభించారు. గోపాలరావు అలాంటి చీప్ ట్రిక్స్‌కి లొంగే రకం కాదు.

“మానను! నా పెళ్లాం బిడ్డలూ లాంటి స్వార్థం కోసం, నా ఆశయాలు వదులుకోను” అన్నాడు ఖండితంగా. (- పుట 92)

పది నెలలు జైలులో ఉండి తిరిగివచ్చాడు గోపాలరావు.

యుద్ధ కాలపరిస్థితులు:

కిరసనాయిలు నుండి, తిండిగింజల దాకా జనాలకి ఏమీ దొరకడం లేదు. అన్నిటికీ రేషనే. వార్తా పత్రికలకు కాగితం దొరకడం లేదు. పత్రికలకు సెన్సారు. అగ్గిపెట్టి కూడ ప్రియం అయిపోయింది. శ్మశానంలో శవాన్ని కాల్చడానికి కట్టెలకు కూడా సివిల్ సప్లయి శాఖవారి అనుమతి కావాలి.

ఈ దయనీయమైన పరిస్థితులను రచయిత్రి నిజాయితీగా అక్షరబద్ధం చేశారు. ప్రజల దీనావస్థను కళ్లకు కట్టినట్లు వర్ణించారు. ‘బ్లాక్ అవుట్’ ప్రకటించింది ప్రభుత్వం, ఇంట్లో రాత్రిపూట దీపాలు నిషిద్ధం. కిటికీలకు నల్ల తెరలు కట్టుకోవాలి. గోపాలరావు తర్వాత తన నిరసన తెలిపాడు, అర్జీ రూపంలో తాసిల్దారుకు. గోరుచుట్టుపై రోకటి పోటన్న చందాన, మిలిటరీ కోసం చుట్టుపక్కల ఇండ్ల నుండి ధాన్యం, పళ్లు, కూరలు, మాంసం సేకరించసాగారు, బలవంతంగా. గోపాలరావు దీన్ని ఎదిరించాడు. కానీ లాభం లేకపోయింది.

మనకు ఏ సంబంధమూ లేని యుద్ధాన్ని గురించి మాలతీ చందూర్ గారు ఇలా రాశారు.

“వీడొక జపాన్ సైనికుడు, చూడగానే చంపుడు – అన్న పెద్ద సైజు జపాన్ సైనికుని బొమ్మ తాసిల్దారు ఆఫీసు ముందు! ఆ బొమ్మలో గోపాలరావుకు గాని, మిగతా ప్రజలకు గానీ శత్రుత్వం, క్రూరత్వం కనబడలేదు. ఆ బొమ్మలో ముఖ పరిచయం లేని ఆ జపాన్ వాడి కంటే.. ఈ ఆంగ్లేయ సైనికులే ప్రత్యక్షశత్రువుల వలె తోచారు గోపాలరావుకు.”

ఎంత నిజం! బలవంతంగా మన నెత్తిన రుద్దిన యుద్ధాన్ని ఇంతకంటే బాగా ఎవరు వివరించగలరు, మాలతమ్మ తప్ప! పై మాటల్లో బ్రిటిష్ వారు చేస్తున్న, భారతీయులతో బలవంతంగా చేయిస్తున్న, యుద్ధ నీతి లోని డొల్లతనం స్పష్టమౌతుంది. వాళ్ల శత్రుత్వానికి మనల్ని బలి చేసే స్వార్థపరులు.

క్విట్ ఇండియా ఉద్యమం హింసాత్మకం – స్వాతంత్య్ర సిద్ధి – గోపాలరావు కుటుంబ సభ్యుల హిపోక్రసీ – అవకాశవాదం – అతని విముఖత:

‘క్విట్ ఇండియా’ అన్న నినాదంతో గాంధీజీ ప్రజులకు పిలుపు ఇచ్చారు. తమ ‘హరిజన్’ పత్రికలో ఈ ఉద్యమంపై రోజూ చర్చలు జరిగేవి. ‘డు ఆర్ డై’ అన్న ఆయన సందేశం దేశంలో సంచలనం సృష్టించింది. యథాప్రకారం గాంధీజీని, ఇతర ముఖ్య నాయకులను రహస్యంగా అరెస్టు చేసి, ‘ఎక్కడికో’ తరలించారు.

ఉద్యమం హింసాత్మకమైంది. అంతవరకు శాంతియుతమైన పోరాటాలనే చూసిన గోపాలరావు, దాని పట్ల కలత చెందాడు. తెనాలి రైలు స్టేషన్ మీద పడి విద్యార్థులు తగులబెట్టారు. పోలీసు స్టేషన్స్, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ అగ్నికి ఆహుతి అయ్యాయి. విజయోత్సాహంతో పొంగిపోతున్న విద్యార్థులను చూసి గోపాలరావు విచారిస్తూ దూరంగా నిలుచున్నాడు. అతన్ని కూడా అరెస్టు చేసి పట్టుకుపోయారు పోలీసులు.

నాలుగేళ్లు జైలులో ఉన్నాడు. మధ్యలో రాముడత్తయ్య చనిపోయినట్లు తండ్రి కార్డు రాశాడు.

భార్యకి ఉత్తరం వ్రాసి కొడుకు ఫోటో పంపమని అడగాలని అనిపిస్తూ ఉండేది అతనికి. ఈ సందర్భంలో గోపాలరావు మానసిక స్థితిని మాలతిగారు చాలా గొప్పగా వర్ణించారు.

“బాధ్యత నెరవేర్చిన వారికే, హక్కుల గురించి పోరాడే అధికారం ఉంటుంది.” (-పుట 97)

అన్న మహాత్ముని మాటలు అతనికి గుర్తుకువచ్చాయి అంటారామె. “ఆ పసివాడి జన్మకు తాను కారణం అయ్యాడు తప్ప, తండ్రిగా తన బాధ్యత నెరవేర్చలేకపోయాడు. వయసులో ఉన్న స్త్రీపురుషుల దేహ కలయిక వల్ల కలిగిన సహజ పరిణామం తప్ప తను ఏ విధంగానూ తండ్రి అనే బాధ్యత మొయ్యలేదు ఇన్నాళ్ళూ. ఇప్పడు ఈ ఒంటరితనంలో, జ్ఞాపకాల ఒత్తిడి వల్ల పిల్లవాడి ఫోటో పంపమని రాయడం అతనికి మనస్కరించడం లేదు.”

అంటే రచయిత్రి, గోపాలరావు ఒక రకమైన అపరాధ భావనకు లోనైనాడని చెబుతున్నారా? కానే కాదు. తాను నమ్మిన ఉద్యమం పట్ల, సిద్ధాంతం పట్ల మొక్కవోని చిత్తశుద్ధితో ఉన్నవాడతను. ఆ చిత్తశుద్ధి అతనికి అడ్డం వస్తుంది తప్ప, గిల్టీ ఫీలింగ్ కాదు. భార్య అతన్ని అర్థం చేసుకొని ప్రోత్సహించి ఉంటే పరిస్థితి మరోలా ఉండింది. తర్వాత బాధ్యతలు- హక్కులుగురించిన అవగాహన అతన్ని వెనుకడుగు వేసేలా చేసింది. అత్యుత్తమ సంస్కార విశేష శోభితుడైన ఒక మనిషి అంతరంగ ఆవిష్కరణ ఇది. పాత్ర చిత్రణలో పరాకాష్ఠ. మానవ స్వభావాన్ని ఇంతకంటే బాగా ఎవరూ చిత్రించలేరు, రచయిత్రి తప్ప.

‘హింద్ స్వరాజ్’ పత్రికలో గాంధీజీ ఇలా రాశారు –

“Real rights are a result of the performance of duty.”

“నిజమైన హక్కులు, బాధ్యతలు నిర్వర్తించడం వల్ల వచ్చీ ఫలితాలే!” హక్కులు, బాధ్యతల్లో embryonic form లో, అంటే అంతర్లీనంగా కలిసి ఉంటాయని గాంధీజీ చెప్పారు.

“when duties are performed, it automatically gives rise to rights.”

హక్కుల్లో మానవ హక్కులు (human rights), రాజకీయ హక్కుల కంటే ముఖ్యమైనవి. పార్వతి వైపు నుంచి ఆలోచిస్తే, భర్త ఆదరణ పొందడం అతని కొడుక్కు తండ్రి ప్రేమ, పోషణ లభించడం అనేవి సహజమైన మానవహక్కులు కదా! అతని లక్ష్యం వీటి కంటే గొప్పది కావచ్చు. కాని వారి హక్కులు దాని వల్ల వారు కోల్పోయారు. సంస్కారవంతుడు కాబట్టి గోపాలరావు దాని గురించి బాధపడుతున్నాడు. అతనేమో హృదయం లేని బండరాయి కాదు. కానీ స్వాతంత్ర్యోద్యమం పట్ల అతని కమిట్మెంట్ అతని చేతులను కట్టేసింది. కుటుంబ బాధ్యతలా, దేశమా అన్న ప్రశ్నకు అతడు దేశాన్నే తన ప్రాధాన్యతగా ఎంచుకొన్నాడు. కాని ఆ క్రమంలో కొంత మానసిక సంఘర్షణ తప్పనిసరిగా ఉంటుంది.

పార్వతి ఆక్రోశాన్ని, పిల్లవాడి అమాయకపు ముఖాన్ని చూస్తూంటే మనకు వారి పైన అవ్యాజమైన సానుభూతి కలుగుతుందే గాని, కోపం రాదు. గోపాలరావు స్థిరచిత్తాన్ని ప్రశంసిస్తూనే అతని భార్య, పిల్లవానిపై జాలి పడతాము. వారు అతనికి మద్దతుగా నిలవకపోవచ్చు. కాని అలాంటివారు కూడా స్వాతంత్య్ర సమరంలో తమ వంతు పాత్రను పోషించినట్లే అని చెప్పవచ్చు.

ఇదే మానసిక సంఘర్షణ, వ్యక్తిగత జీవితాన్ని తృణప్రాయంగా త్యజించిన సత్యాగ్రహులందరిలో ఉంటుంది. ఎంత ఉద్యమానికి కట్టుబడినా, వారూ మనుషులే కదా! రెండు ప్రత్యామ్నాయాల మధ్య, సరియైన దానిని ఎంచుకోవడంలో, సందిగ్ధత (dilemma) ఎదురైనపుడు, తనకు నచ్చిన దానిని స్వీకరించినా, మనసు కొన్నిసార్లు పీకుతూనే ఉంటుంది. గోపాలరావు కెదురైనది ఈ సందిగ్ధతే. కాని ఎప్పటికప్పుడు దాన్ని అధిగమించేవాడు.

ఇది dilemma విలియమ్ షేక్‌స్పియర్ సృష్టించిన Prince Hamlet పాత్రకు కూడా ఎదురవుతుంది. అక్కడ సందర్భం వేరు కావచ్చు కాని ‘From Particular to Genera’’, ‘from the individual to the universal’ అన్న సాహిత్య లక్షణం ప్రకారం ఆ సమస్య హామ్లెట్ నుండి విశ్వానికంతా వర్తిస్తుంది. అదే ఆ డెన్మారులో యువరాజు చెప్పుకొనే ప్రపంచ ప్రఖ్యాత స్వగతం (Soliloquy). అది ఇలా వుంటుంది.

“To be, or not to be: that is the question: Whether ‘tis nobler in the mind to suffer The slings and arrows of outrageous  fortune, Or to take arms against a sea of troubles, And by opposing end them?”

సరిగ్గా ఇదే సందిగ్ధతను మన సనాతన ధర్మం అస్తినాస్తివిచికిత్సా హేతువుగా అభివర్ణించింది. హామ్లెట్ చెప్పే ఈ స్వగతం అతని పేరిటే ఉన్న ఆ నాటకంతో Act 3 లో, సీన్ I లోవస్తుంది. దాన్ని ‘Nunnery Scene’ అంటారు.

సముద్రమంతటి కష్టాలను ఎదుర్కొని, వాటిని ప్రతిఘటించి, తుదముట్టించడమా లేక మనసులో నిరంతరమూ మథనపడుతూ ఉండడమా? అని తనలో తాను తర్కించుకుంటాడు హామ్లెట్. Of course, అతని సమస్య వేరు కావచ్చు. కాని తర్కం మాత్రం విశ్యజనీనమైనది. గోపాలరావుకు, మీకు, నాకు అందరికీ ఎప్పుడో ఒకసారి ఎదురయ్యేదే! భక్తశిఖామణి అయిన ప్రహ్లాదునికి కూడ ఈ సందిగ్ధం వచ్చింది.

“కలడు కలండనెడువాడు కలడో లేడో?”

అని భగవంతుని అస్తిత్వాన్ని గురించి ప్రశ్నించుకుంటాడు.

అలా బాధ్యతలకు హక్కులకు ఉన్న అవినాభావ సంబంధాన్ని రచయిత్రి గోపాలరావు పాత్ర ద్వారా పరిపుష్టం చేశారు. జీవితంలో ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోవలసి వస్తే, మానవుడు అంతరాత్మ చెప్పిన ప్రత్యామ్నాయాన్నే స్వీకరించాలని, తీసుకోలేని ప్రత్యామ్నాయం పట్ల కొంత soft corner ఉన్నా, దానిని అధిగమించాలని సూచించారు. పైన మనం చేసిన సుదీర్ఘ చర్చ ఏదీ ఆమె నవలలో చేయరు. గోపాలరావు, కొడుకు ఫోటో పంపమని అడగటానికి సంశయించాడుఅని మాత్రమే చెబుతారు. అదీ creative genius అంటే. దాన్ని interpret చేయాల్సిన బాధ్యత critical genius లది. నిస్సందేహంగా critical genius ల కంటే creative genius లే గొప్పవారని మాథ్యూ ఆర్నాల్డ్ గారు తన ‘Study of Poetry’ అని సాహిత్య విమర్శనా గ్రంథంలో స్పష్టం చేశారు, అని మనం ముందే చెప్పుకున్నాము.

మాలతిగారి సృజనాత్మక మేధను మథించడానికి మాబోంట్ల విమర్శనాత్మక మేధ ఏ మాత్రమూ చాలదు. కాని, ‘ప్రయత్నంతు కర్తవ్యంఅన్నారు కదా! ఆమె అసాధారణ ప్రతిభను వెలికితీయడంలో, ఇటువంటి చర్వితచర్వణాలు తప్పవు మరి.

(సశేషం)

Exit mobile version