[మున్షీ ప్రేమ్చంద్ హిందీ కథ ‘కఫన్’ని హిందీలో ముజీబ్ ఖాన్ నాటకంగా రూపొందించారు. హిందీ నాటకానికి స్వేచ్ఛానువాదం డా. అంబల్ల జనార్దన్.]
(నేపథ్యంలో బాలయ్య యొక్క భార్య ఆశమ్మ అరుపు వినిపిస్తుంది. బయట మారయ్య ఇంకా బాలయ్య కుంపటి వెలిగించి అందులో ఆలుగడ్డలు కాలుస్తుంటారు.)
ఒకటవ సూత్రధారి: అబ్బా! ఈ బాలయ్య భార్య ఎంత లొల్లి పెడుతున్నది?
రెండవ సూత్రధారి: ఈ రాత్రి పడుకోనిచ్చేటట్టు లేదు. కడుపుతో ఉన్నదని విన్నాను.
ఒకటవ సూత్రధారి: వీళ్లకు పనీ పాటా లేదు కానీ, పిల్లలను మాత్రం పుట్టిస్తారు.
రెండవ సూత్రధారి: ఇంకా తండ్రీ కొడుకులిద్దరు వట్టి సోమరిపోతులు మరియు పనిదొంగలు. మారయ్య ఒక్క రోజు పనిచేస్తే మూడు రోజులు ఆరాం జేత్తడు. ఇక బాలయ్య ఐతే ఒక గంట పనిచేస్తే, పది గంటలు చుట్ట కాలుత్తుంటడు.
ఒకటవ సూత్రధారి: అందుకే ఎవరూ వాళ్లను పనిలోకి పెట్టుకోరు. వాళ్లింట్లో గుప్పెడు ధాన్యం ఉంటే చాలు, ఇంక వారు పనిచేస్తే ఒట్టు.
రెండవ సూత్రధారి: రెండు రోజులు గాని వారు ఉపావాసముంటే, మారయ్య చెట్లు ఎక్కి కట్టెలు కొట్టి తీసుక వస్తాడు. బాలయ్య వాటిని బజార్లో అమ్ముక వస్తాడు. ఇంక జేబులో డబ్బులున్నన్ని రోజులు వారు ఏ పనీ చేయరు. డబ్బులు ఐపోగానే, మళ్ళీ కూలి కొరకై తిరుగుతారు, లేక కట్టెలు కొడతారు.
ఒకటవ సూత్రధారి: నిజానికి మా ఊళ్లో పనికి కొరత లేదు. మాది కష్టజీవుల ఊరు. కష్టపడే వారికి మా ఊళ్లో వందల పనులున్నాయి.
రెండవ సూత్రధారి: వాళ్లింట్లో కూడా మూడు, నాలుగు మట్టి పాత్రల కంటే ఎక్కువేమీ లేవు. బట్టలు కూడా వారు చినిగి పోయినవే తొడుక్కుంటారు. వారు అప్పుల్లో మునిగిపోయారు. వారు ఎప్పుడూ తిట్లు, దెబ్బలు తింటారు.
(వారిద్దరు అలా మాట్లాడుతున్నప్పుడు, అక్కడ చీకటి వ్యాపిస్తుంది. వెలుగు పరిధి మధ్యలోకి వస్తుంది)
మారయ్య: ఇంక బతకదేమో? దినమంతా ఉరుకుట్లనే ఐపోయింది. పో పొయి సూడు.
బాలయ్య: (విసుగెత్తి) చచ్చి పోయేదుంటే జెల్ది సావదేమి? నేను పొయి సూసి ఏం సెయ్యాలె?
మారయ్య: నువ్వు చాలా కఠినాత్ముడివి రా! యాడాదంతా దానితోని సుఖంగ ఉన్నవ్. ఇప్పుడు దాన్ని మోసం సేత్తవా?
బాలయ్య: నాన్నా! అది బాధ పడుకుంట కాలు – సెయ్యి కొట్టుకుంటుండంగ నేను సూడలేనే.
మారయ్య: సరే! ఈ ఆలుగడ్దలు కాలినయో లేదో సూడు.
బాలయ్య: (ఒక ఆలుగడ్డ తీసి చూసి, వెంటనే మళ్లీ నిప్పులో పడేస్తాడు.) ఇంకా కాల లేదు.
(మళ్లీ వారిపై వెలుగు ప్రసరిస్తుంది)
ఒకటవ సూత్రధారి: వాళ్లు తమ ఆకలి బాధ తీర్చుకోవడానికి ఎవరి తోట లోంచైనా ఆలుగడ్దలు ఎత్తుకు వచ్చి, అవి కాల్చుకొని తింటారు. ఒక్కోసారి కొన్ని చెరుకు గడలు పీకి తీసుకువచ్చి, రాత్రంతా అవి చీకుతూ గడుపుతారు. అలా మారయ్య అరవై ఏళ్ల తన జీవితం గడిపాడు. ఇక కొడుకు బాలయ్య కూడా తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు.
రెండవ సూత్రధారి: ఐతే బాలయ్య భార్య వచ్చిన్నుంచి వారింట్లో రోజూ వంటకు ఇబ్బందేమీ లేదని విన్నాను. పాపం ఆమె, కూలీ నాలీ చేసి, ధాన్యం రుబ్బి, కలుపు తీసి తమ కుటుంబానికి సరిపడే పిండి సంపాదించి, ఈ బేవార్సుల పొట్ట నింపుతుంది.
మారయ్య: (ఆలుగడ్డ తీసి, దాని పొట్టు తీస్తూ అంటాడు) పొయి సూడు ఆమె పరిస్థితి ఎట్లున్నదో? ఆమెకు దయ్యం పట్టినట్టుంది. దించెతందుకు మంత్రకాడు ఒక్క రూపాయి అడుగుతున్నాడు.. ఈడ ప్రతొక్కడికి పైసలు కావాలె. యాడికెల్లి తేవాలె? పో. పొయి సూడు.
బాలయ్య: (మనసులో మా నాన్న చాలా తెలివిమంతుడే. నేను లోపలికెల్లి అచ్చెతాల్లకు ఆలుగడ్డలన్ని తనే తినేత్తడు. ఏడుస్తూ) నాయిన్నా! నాకు ఆడికి పొయెతందుకు భయమేత్తున్నదే.
మారయ్య: భయమెంటికి రా! నేనిక్కడున్న గదా?
బాలయ్య: ఐతే నువ్వే పొయి సూడు?
ఘీసూ: ఒరేయ్! మీ తల్లి సచ్చిపోయేముందు నేను మూడు రోజులు ఆమె దగ్గరి నుండి కదల లే. ఇంకా నీ పెండ్లం నన్ను సూసి సిగ్గు పడదే? ఇప్పటిదాకా దాని మొహం కూడా సూడని నేను, ఇప్పుడు ఆమె కడుపుతోని ఎత్తున్న పొట్ట ఎట్ల సూడాలె? ఆమె సోయిలో కూడా లేకుండచ్చు. నన్ను సూత్తే ఆమె కాళ్లు చేతులు కూడా ఆడయి.
బాలయ్య: నాయిన్నా! ఒక యాల్ల నీల్లాడితె ఏమైతది? ఇంట్లో శొంఠి, బెల్లం, నూనె ఏం లేవు.
మారయ్య: దేవుడు బిడ్డను పుట్టిస్తే అన్నీ అస్తయి. వోల్లు ఇయ్యాల్ల ఒక్క పైసా ఇస్త లేరో, ఆల్లే రేపు పిలిసి మరీ రూపాలిస్తరు. నాకు తొమ్మిది మంది కొడుకులు పుట్టిండ్రు. ఇంట్లో ఏమీ లేకుండె. కాని ఇట్లనే ప్రతిసారీ గడిసింది.
బాలయ్య: నాయిన్నా! నీ దగ్గర బాగ ఇకమాతులు ఉన్నై గదనే.
మారయ్య: అరె కొడుకా! మన సమాజంల రైతులు కష్ట పడతరు. ఆల్లు కూడా మన లెక్కనే ఉన్నరు. కాని ఆల్లతోని వోల్లు ఫాయిద తీసుకుంటరో ఆల్లు బాగ సుకంగ ఉన్నరు. గందుకనే జిందగిల నేను ఒక నేమం ఏర్పాటు సేసుకున్న. ఖుషీల గానీ, బాధలో గానీ ఊరోల్ల ముందు సేయి సాపాలె, ఏడవాలె, ఏదో మాయ చేసి పబ్బం గడుపుకోవాలె. ఒరేయ్! అట్ల సూత్తున్నవేంది? తిను.
బాలయ్య: “నాయిన్నా! నువ్వు తినంగ మిగిలితే కదా? గప్ప గప్పమని ఉడుకుడుగుగా, తినేత్తున్నవ్. పొట్టుతీయంగానే బయట సల్లంగనే ఉంటది, గని లోపల ఊడుకుగనే ఉంటది కదా?”
మారయ్య: “ఒక్కసారి లోపలికి పోయిందంటే, ఆడ సల్ల బరిసేటివి బాగున్నయి. అరే పిసోడా! నువ్వు నన్నంటున్నావు గని, నువ్వు కూడా అడ్డదిడ్డంగా తింటున్నావు కదా?” (అని నవ్వుతాడు)
బాలయ్య: నాన్నా! ఎంటికి నగుతున్నవ్?
మారయ్య: ఏం లేదురా! మన ఊరి దొర ఇంటి లగ్గం దావత్ యాదికచ్చింది. అప్పటి నుంచి అసుంటి భోజనం, కడుపునిండా ఎక్కడా తిన్నది లేదు. పిల్ల తరపోల్లు అందరికీ కడుపునిండా పూరీలు పెట్టిండ్రు. సిన్నా పెద్దా అందరూ స్వఛ్ఛమైన నేతి పూరీలు మస్తుగా తిన్నరు. సకినాలు, గారెలు, బూరెలు, బగారన్నం, తెల్లన్నం, మూడు రకాల వేపుళ్లు, ఒక రసాల కూరగాయ, పెరుగు, మిఠాయిలు, అసుంటియి ఎన్నో. అక్కడి ఆ రుచుల గురించి ఏమని సెప్పాలె? అవి యాదికత్తె, ఇప్పటికి నోరూరుతున్నది. ఎసుంటి రోక్ ఠోక్ లేకుంట తిన్నోడికి తిన్నంత. నీళ్లు కూడా తాగకుంట జనాలు దొరికినంత బరికిండ్రు. ఇక అడ్డిచ్చెటోల్లు ఇస్తార్ లల్ల, ఉడుకుడుకు బజ్జీలు, పకోడీలు, అద్దని సేతులు అడ్డం పెట్టినా ఏశిండ్రు. తిని సేతులు కడుక్కున్నంక, యాల్చిలు ఏసిన పాన్ కూడా ఇచ్చిండ్రు, కాని నాకు పాన్ తినే సోయి యాడిది? సక్కగ నిల్సుండనికి గుడా రాలె. ఎంటనే పొయి బిచాన మీద పడ్డ. ఎంతైనా దొరది ది సముద్రమంత మనుసురా.
బాలయ్య: మాకు కూడా అసుంటి తిండి ఓల్లన్న పెడితే బాగుంటుండె.
మారయ్య: ఇప్పుడోల్లు అసుంటి భోజనం పెడతరు? ఇప్పుడంతా కాపాయమే. పెండ్లిండల్ల కర్సు సెయ్యకుండ్రి, చావు రేవుల్లల్ల దుబార కర్సు సెయ్యకుండ్రి. గరీబోల్లను దోసుకునుడత్తది గని కర్సు సేసుడు రాదు. గా దోసుకున్న పైసలు యాడ బెట్టుకుంటరు? కాపాయం సేసి సచ్చెటప్పుడు యెంత తీసుకపోతరా?
బాలయ్య: నాయినా! నువ్వు ఓ ఇరవై పూరీలైనా తిన్నవానే?
మారయ్య: ఇంకా ఎక్కనే తిన్న.
బాలయ్య: నేనైతే యాభై ఐనా తింటుంటి.
మారయ్య: నేను కూడా యాభై కంటే ఎక్కువే తిన్ననేమో? చాల గట్టిగా, బలంగా ఉండెటోన్ని. నువ్వు నాయండ్ల సగం కూడా లేవు.
బాలయ్య: నాన్నా! ఆలుగడ్డలన్ని ఐపోయినై.
మారయ్య: ఐతే ఆ నీళ్లిటియ్యు (బాలయ్యనీళ్లు తెచ్చి మారయ్యకు ఇస్తాడు)
బాలయ్య: నాయిన్నా! ఈడనే పండుకుందం. ఆశమ్మని రేపు సూద్దం.
స్టేజి అంతా చీకటి
(వేదికపై వెలుగు – బాలయ్య ఒక్కసారిగా లేచి లోపలికి వెళ్తాడు. ఆ వెంటనే ఏడుస్తూ తిరిగి వస్తాడు.)
బాలయ్య: నాయిన్నా! ఓ నాయిన్నా !
మారయ్య: ఏమైందిరా? నన్ను పండనియ్యి.
బాలయ్య: లేచి సూడు ఆశమ్మ సచ్చిపోయింది, బిడ్డకూడా సచ్చిపోయింది.
మారయ్య: మరి అట్ల నిల్సున్నవేంది? ఏడువు, గట్టిగా ఏడువు. అప్పుడే శవ సంస్కారానికి కావలసిన కట్టెలకు, ఇతర వస్తువులకు డబ్బులు రాళ్తాయి. లొల్లి వెట్టి. గట్టిగా లొల్లి వెట్టుకుంట ఏడువు. ఇప్పుడు సక్కగ పటేలయ్య దగ్గరకు పోదం.
బాలయ్య: ఛ. ఛ.
మారయ్య: అరె! ఏమయింది?
బాలయ్య: ఆయనైతే మన మొఖాలు సూత్తెనే మండి పడ్తడు. ఎన్నోసార్లు మనల్ని, అతని మనుషులతో కొట్టించిండు.
మారయ్య: ఒరేయ్! ఇసుంటి కఠిన సమయంలో మనిషి మనుసు కరుగుతది. నేనెట్ల సెబితే అట్ల సెయ్. నడు, ఏడ్సుడు సురూ జెయ్యి. అయ్యయ్యో మేము శిథిలమైనం.
బాలయ్య: అయ్యయ్యో మేము శిథిలమైనం.
మారయ్య: ఉన్నదంతా ఊడ్సుక పోయింది.
బాలయ్య: ఉన్నదంతా ఊడ్సుక పోయింది.
మారయ్య: దేవుడా! ఇప్పుడేంజెయ్యాలె?
బాలయ్య: దేవుడా! ఇప్పుడేంజెయ్యాలె? నా భార్య సచ్చిపోయింది. పుట్టిన బిడ్డ కూడా సచ్చిపోయింది.
మారయ్య: మా మాధవుడి భార్య కాలం చేసింది. ఎవరన్నా మాకు సాయం సేయుండ్రి.
(వేదిక మరో వైపు నుండి జమీందారు వస్తాడు. మారయ్య అతని కాళ్లు పట్టుకుంటాడు.)
బాలయ్య: అయ్యయ్యో! మేము బర్బాదైనం. రోడు మీదికచ్చినం.
పటేల్: ఒరేయ్ మారిగా! ఏమయింది? ఎందుకేడుస్తున్నావ్? ఈ మధ్య నువ్వెక్కడా కనిపించడమే లేదు. మీకు ఈ ఊళ్లో ఉండడం ఇష్టం లేనట్టుంది.
మారయ్య: దొరా! ఆపదలో ఉన్నాము. మా బాలయ్య భార్య బాద పడీ పడీ సచ్చిపోయింది. అర్ధరాత్రి దాకా మేము ఆమె పక్కనే ఉన్నాము దొరా! మాతోని అయినన్ని ఇలాజులు చేశామయ్యా. ఇంట్ల ఉన్న పైసలన్ని కర్సైనయ్. ఇంక ఎవరూ మాకు ఇంత తిండి పెట్టేవారు లేరు దొరా. మేము శిథిలమైనం. మా ఇల్లు బోసిపోయింది. మేము నీ బానిసలం. మీరు గాక ఈ పీనుగును వోల్లు మట్టిల కలుపుతారు? మీరు గాక ఇంక మేము వోల్ల తలుపు కొట్టాలె?
పటేల్: (మనసులో నేను దయామయున్ని. అది ఊరంతటికీ తెలుసు. మారయ్య పై దయ చూపడమంటే కొరివితో తల గోక్కున్నట్టే. చల్ దూరం వెళ్ళిక్కడినుంచి, అని అనాలనుంది. పిలిస్తే కూడా ఎన్నడూ రాని వాడు, ఇప్పుడు అవసరానికి కాళ్లు పట్టుకుంటున్నాడు. నీచుడు. నికృష్టుడు.) ఒరేయ్ త్రాష్టుడా! ఈ రెండు రూపాయలు తీసుకో (అని రూపాయలు కింద పడేస్తాడు.)
మారయ్య: దొరా! అట్ల కింద పడేయకుండ్రి లచ్చిమిదేవిని.
(అప్పుడు బాలయ్య, మారయ్య ఇద్దరూ భిక్షం అడగడం మొదలు పెడతారు.)
మారయ్య: అయ్యల్లారా! అమ్మల్లారా! బాలయ్య భార్య శవ సంస్కారంకు జమీందార్ గారు రొండు రూపాయలు దానం సేసిండ్రు. మీరు కూడా ఎంతో కొంత ధర్మం సెయ్యుండ్రి. భగవంతుడు మిమ్ముల్ని సల్లగ సూత్తడు. మీరొక్క పైస ఇత్తే ఆ దేవుడు మీకు పది పైసలిత్తడు.
బాలయ్య: ఇయ్యుండ్రి ఎంతో కొంత దానం సెయ్యుండ్రి. భగవంతుడు మీకు బర్కతిత్తడు తన సంస్కారం లేక పీనుగు అట్లనే ఉన్నది. పుట్టిన బిడ్ద కూడా సచ్చిపోయింది.
(జనాలు డబ్బులు చల్లుతారు)
మారయ్య: బాలయ్యా! ఇట్లచ్చి ఎంచు, ఎన్ని పైసలు జమైనవో?
బాలయ్య: లెక్క పెడుతూ.. ఐదు రూపాయల మొత్తం అచ్చింది. కట్టెలైతే ఊరోల్లిస్తరు. నడుండ్రి మనం శవ సంస్కారానికి కావలసిన బట్ట. ఇంకా ఇతర వస్తువులు తీసుకద్దం.
మారయ్య: అట్లనే. ఐతే ఏదో అగ్గల ఎళ్లదీద్దాం.
బాలయ్య: అట్లనే. లేపేటల్లకు రాత్రయితది. అప్పుడు శవ సామాగ్రిని వోడు సూడబోయిండ్రు?
మారయ్య: బతికున్నప్పుడే సరిగా బట్టలు లేనోల్లకు సచ్చిపోయినంక కొత్త మంచి బట్ట కప్పాలనే సంప్రదాయం ఎంత సెడ్డది?
బాలయ్య: ఆ గుడ్ద శవంతోని కాలిపోతుంది కదా?
మారయ్య: కాకుంటే ఏంది? ఇవే ఐదు రూపాలు అప్పుడే దొరికితే మందులకు మాకులకు పనికచ్చెటివి కదా?
బాలయ్య: (మందు అనే సరికి బాలయ్యకి సారా కొట్టు కనిపిస్తుంది.) నాయిన్నా! నాకేం కనిపిత్తున్నదో, నీకు కూడా అదే కనిపిత్తున్నదే?
మారయ్య: సరే పో. పోయి రెండు బాటిళ్లు తీసుకరా. అంచుకు ఉడకవెట్టిన శెనిగెలు, పల్లీలు, బొబ్బెర్లు కూడా తీసుకరా.
(బాలయ్య సారయ్య దుకాణంకు పోతాడు.)
బాలయ్య: సారయ్యా రెండివ్వు.
సారయ్య: పైసలు తెచ్చినవా?
బాలయ్య: డబ్బుల గురించి ఫికర్ చేయకు. కావాలంటే నువ్వు కూడా మాతో తాగు. అన్నట్టు నంజుకోడానికి కూడా అన్నీ ఇవ్వు.
(బాలయ్య సారా బాటిళ్లు, ఇతర సరంజామాతో వస్తాడు. ఇద్దరూ బాగా తాగుతారు. వారికి నిషా ఎక్కుతుంది.)
మారయ్య: పీనుగుకు కొత్త బట్ట కప్పితే ఏమొస్తది? ఆఖరికి కాలిపోతది కదా? అది కోడలు వెంట పోదు కదా?
బాలయ్య: ఈ లోకం తీరు చూడు. జనాలు పంతుల్లకు వేల రూపాయలు ఎందుకిస్తారో తెలువది. పరలోకంలో సద్గతులు కలుగుతాయో లేదో వోల్లకెరుక?
మారయ్య: ధనవంతుల దెగ్గర డబ్బులుంటయి. ఖర్చు సేత్తరు. మన దగ్గర ఏముందని ఖర్చు సేత్తం?
బాలయ్య: కాని జనాలకి ఏం చెబుతాం? ఆళ్లు శవానికి గుడ్డ ఏదని అడుగుతారు కదా?
మారయ్య: (నవ్వుతూ) అరె! నడుము నుండి డబ్బులు పడిపోయినయని సెప్పుదాం. ఎంత లెంకినా దొరుకలేదని అందం. జనాలు నమ్మరు, కాని ఆల్లే డబ్బులు ఇత్తరు.
బాలయ్య: పాపం ఆశమ్మ శానా మంచిది. సచ్చి మనకు తాగెతందుకు, తినెతందుకు బాగ ఇచ్చింది.
మారయ్య: ఇతాయెగని ఇప్పుడు ఎన్ని పైసలు మిగిల్నై?
బాలయ్య: రూపాయిన్నర.
మారయ్య: బాగాయె. ఒక్క మాట చసెప్పు బాలిగా. ఇట్ల మనం తాగి తిని, మన ఆత్మ శాంతిస్తే కోడలుకు పుణ్యం దొరుకుతది కదా?
బాలయ్య: తప్పకుండా. తప్పకుండా ఆమెకు సద్గతి దొరుకుతది. భగవంతుడా! నువ్వు అన్ని దిక్కుల ఉన్నవ్. ఆమెను వైకుంఠానికి తీసుక పో. మేమిద్దరం హృదయపూర్వకంగా కోరుతున్నం. ఇయాల దొరికిన భోజనం మాకు జిందగిల దొరుకలే. (ఒక్క క్షణం తర్వాత బాలయ్యకి సందేహం కలిగింది.) నాయిన్నా! ఎప్పుడో ఒకప్పుడు మనం కూడా ఆడికి పోతం కదా? అప్పుడు మనం, ఆమె శవానికి బట్ట ఎంటికి కప్పలేదంటే ఏం సెప్పుదం?
మారయ్య: నీ తలకాయ అని సెప్పుదం.
బాలయ్య: అడగనైతే అడుగుతది కదా?
మారయ్య: ఆమె శవంకు బట్ట కప్పలేమని నీకెట్ల గుర్తు? నువ్వు నన్ను గాడిదననుకుంటున్నవా? అరవైఏండ్లు లోకంలో గడ్ది తవ్విన అనుకుంటున్నావా? ఆమె శవానికి బట్ట దొరుకుతది. బాగ మంచి బట్ట దొరుకుతది.
బాలయ్య: వోల్లిస్తరు? నువ్వైతే రూపాయలన్ని మింగేసినవ్. ఆమె నన్నడుగుతది. ఆమె మెడలో నేను పుస్తె కట్టిన. శవానికి బట్ట వోల్లిస్తరు? సెప్పుండ్రి.
మారయ్య: ఇప్పటి దాక వోల్లించ్చిండ్రో ఆల్లే ఇస్తరు. ఈ సారి డబ్బు మన సేతికి రాదు. ఒక యాల్ల అస్తే, మనం మళ్ల తాగి తందనాలాడుదాం. అప్పుడు మూడోసారి శవానికి గుడ్డ దొరుకుతది.
బాలయ్య: నాయిన్నా! నువు మళ్లీ తాగి తింటావా?
మారయ్య: లేదు.
బాలయ్య: నేను ఆ బిచ్చగాడికి ఇయ్యాల్నా? (మారయ్య ఇవ్వమని సైగ చేస్తాడు. బాలయ్య బిచ్చగాడితో) తీసుకెళ్ళు. బాగా తిను. ఆ తర్వాత ఆశీర్వదించు. సంపాదించే పెండ్లం సచ్చిపోయింది. కాని నీ ఆశీర్వాదం ఆమెను తప్పక సేరుతది. మనసు నిండా ఆశీర్వదించు. బాగ కట్టపడి సంపాదించిన పైసలవి. ఆమె వైకుంఠానికి చేరుతుంది బాబూ! వైకుంఠంలో రాణిగా ఉంటుంది.
మారయ్య: ఔను బిడ్డా! ఆమె వైకుంఠానికి వెళ్తుంది. ఆమె ఓల్లను కష్టపెట్టలేదు. ఓల్లను తిట్టలేదు, ఓల్లతోని గూసులాడలేదు. సచ్చిపోయి మన జిందగిల అన్నింటికంటే పెద్ద ఖాయిష్ ను పూరజేసింది. ఆమె వైకుంఠం పోకపోతే, రెండు సేతుల్తోని గరీబోల్ల రక్తం పీల్సి, అటెనుక గంగా నదిలో ఆల్ల పాపాలు కడుక్కొని, దేవుని గుడిలె నీల్లు పోసే పైసలున్నోల్లు పోతరా?
బాలయ్య: కాని నాయిన్నా! ఆమె ఎన్నో బాధలు పడ్డది. ఆ బాధలు పడుకుంటనే సచ్చింది. (ఏడుస్తాడు)
మారయ్య: ఎందుకేడుస్తావు బిడ్డా! ఆమె ఈ మాయాలోకం నుంచి ముక్తి పొందిందని ఆనందించు. ఈ బాధల చక్రం నుండి దూరంగా పోయిందని సంతోషించు. ఇంత తొందరగా ఈ మాయా ప్రపంచం నుండి అవతల పడ్డ ఆమే బాగ నశీబువంతురాలు.
(బాలయ్య ఏడుస్తున్నాడు. అతనికి సాంత్వన కూర్చడానికి మారయ్య పాడుతాడు)
మారయ్య: జగమే మాయా, బతుకే మాయా. వేదాలలో సార మింతేనయా. ఇంతేనయా. (బాలయ్య కూడా స్వరంలో స్వరం కలుపుతాడు. ఇద్దరూ నాట్యం చేస్తూ చేస్తూ స్పృహ తప్పి కింద పడతారు.)
~
హిందీ మూల కథ: ‘కఫన్’ మున్షీ ప్రేమ్చంద్
హిందీ నాటక రూపాంతరం: ముజీబ్ ఖాన్
తెలుగు నాటక అనువాదం: డా. అంబల్ల జనార్దన్
డా. అంబల్ల జనార్దన్ ప్రసిద్ధ కవి, కథకుడు, నాటక రచయిత. దాదాపు ముప్పై సంవత్సరాల నుండి సాహితీ సృజన చేస్తున్నారు. ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు కవితా సంపుటాలు, ఒక వ్యాస సంపుటి, ఒక మోనోగ్రాఫ్ ప్రచురించారు. వీరి తెలుగు కథలు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఒడియా భాషల్లో సంపుటాలుగా వచ్చాయి. వీరి కథలపై ఎం.ఫిల్. పరిశోధన జరిగింది. పొట్టి శ్రీ రాములు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం 2011 లో లభించింది. గత పాతికేళ్లుగా వీరి తెలుగు కథలు మహారాష్ట్రలోని తెలుగు మరాఠీ విద్యార్థులకు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.
