[1950 నాటి ‘షావుకారు’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణ రాజు.]
1950లో వచ్చిన ‘షావుకారు’ చిత్రం ఇప్పటికీ నిత్యనూతనంగా అనిపిస్తుంది. ఈ చిత్రంలోని పాత్రలు ఇప్పటికీ సంఘంలో కనిపించే పాత్రలే. దుష్ట పాత్రలున్నా భారతీయత, ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఉన్న చిత్రమిది. ఇప్పటి చిత్రాలలో మంచి పాత్రలూ, ఆధ్యాత్మికతా కూడా లోపిస్తున్నాయి అని చెప్పక తప్పదు. ఇప్పటి కథానాయకులే దుష్ట పాత్రలు! ఆ సినిమాల్లో ధర్మబద్ధంగా ఉండే పాత్రల్ని భూతద్దం పెట్టి వెతకాలి. దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ‘షావుకారు’లో సంభాషణలు ఎంత బావుంటాయో మాటల్లో చెప్పలేం! సరదా సన్నివేశాల్లో మాటల్లో సమయస్ఫూర్తి సంగతి అటుంచితే గంభీర సన్నివేశాల్లో మాటలు మనసుకి హత్తుకునేలా ఉంటాయి. స్నేహితుల మధ్య, బావామరదళ్ళ మధ్య, మేనమామ-మేనకోడళ్ళ మధ్య ఒకరినొకరు ఆటపట్టించుకునే మాటలు చిరునవ్వు మొలిపిస్తే అవే పాత్రల మధ్య భావోద్వేగభరితమైన మాటలు గుండెని బరువెక్కిస్తాయి. మొత్తం చిత్రమంతా కనిపించేది ఆశావహ దృక్పథం. కష్టాలు ఎల్లకాలమూ ఉండవని, కష్టాలని తట్టుకోవటమే మనిషి కర్తవ్యమని చెప్పే కథ ఇది. నేటి యువతరానికి ఈ చిత్రం చూపిస్తే మనఃస్థైర్యం కలుగుతుంది. ఈ చిత్రం యూట్యూబ్‌లో లభ్యం.
విజయా పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి ఈ చిత్రాన్ని నిర్మించారు. కథ, మాటలు చక్రపాణి. ఆయన ప్రతిభకి జోహారనకుండా ఉండలేం. స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎల్.వి.ప్రసాద్. కథలోకి వెళితే చెంగయ్య (గోవిందరాజుల సుబ్బారావు) ఒక షావుకారు. వడ్డీ వ్యాపారం చేస్తాడు. ఆయన కొడుకు సత్యం (ఎన్టీఆర్) పట్నంలో చదువుతూ ఉంటాడు. చెంగయ్య ఇంటి పక్కన రామయ్య (శ్రీవత్స) కుటుంబం ఉంటుంది. ఆయనకి కొడుకు నారాయణ (శివరామ్), కూతురు సుబ్బులు (‘షావుకారు’ జానకి), కోడలు శాంతమ్మ (శాంతకుమారి), ఒక చిన్న మనవడు ఉంటారు. రెండు కుటుంబాల మధ్య సఖ్యత ఉంటుంది. రామయ్య చెంగయ్య దగ్గర అప్పు చేసి పొలం కొన్నాడు. రెండొంతులు తీర్చేశాడు. సుబ్బులు ఆడదిక్కు లేని చెంగయ్య ఇంటి పనులు చక్కబెడుతుంది. చెంగయ్యని మామా అని పిలుస్తుంది. చెంగయ్య డబ్బు యావ ఉన్న మనిషి. సుబ్బులు ఆయన్ని ఆ విషయం మీద సున్నితంగానే ఆటపట్టిస్తుంటుంది. ఆయనకి ఆమె అంటే ఆపేక్ష. నగలు పెట్టుకోమని ఇస్తాడు. ఆమెని కోడలు చేసుకోవాలని ఆయన కోరిక. రామప్ప పంతులు (వంగర) చెంగయ్య పంచనే ఉంటాడు. రంగడు (ఎస్.వి.రంగారావు) చెంగయ్య బాకీలు వసూలు చేస్తుంటాడు. రామి (కనకం) చాకలి పని చేసుకుంటూ అందరి ఇళ్ళకీ తిరుగుతూ ఉంటుంది. ఊళ్ళో ఉన్న పచారీ కొట్లో వరాలు (రేలంగి) సరుకులు అమ్ముతాడు. అంధుడైన పిచ్చయ్య (మాధవపెద్ది సత్యం) సత్రంలో ఉంటూ, తత్వాలు పాడుతూ కాలం వెళ్ళదీస్తూ ఉంటాడు. ఊరి వారికి ఆధ్యాత్మిక గురువులా ఉంటాడు.
సత్యం పట్నం నుంచి సెలవులకి వస్తాడు. సుబ్బులు, సత్యం ఒకరినొకరు ఇష్టపడతారు కానీ అప్పటి పద్ధతుల ప్రకారం సుబ్బులు అతనికి దూరంగానే ఉంటుంది. అప్పుడప్పుడూ వేళాకోళం చేస్తూ ఉంటుంది. ఊళ్ళో అందరూ సత్యం తండ్రి లాంటి వాడు కాదని, తాత లాగ ధర్మవర్తనుడని అనుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగా పచారీ కొట్టు వరాలు తండ్రి చెంగయ్య దగ్గరకు వచ్చి సత్రం అద్దెకి ఇవ్వమని, వరాలు అక్కడ కొట్టు పెట్టుకుంటాడని అడుగుతాడు. ఆ సత్రం చెంగయ్య తండ్రి కట్టించిన ధర్మసత్రం. బాటసారులు, ఇళ్ళు లేని వారు, బిచ్చగాళ్ళు అక్కడ తల దాచుకుంటూ ఉంటారు. చెంగయ్య కొంచెం వెనకాడతాడు కానీ రామప్ప పంతులు, రంగడు వాక్చాతుర్యంతో వరాలుకి సత్రం అద్దెకి ఇప్పిస్తారు. రామప్ప పంతులు బతకనేర్చిన మనిషి. ఆయనకి చెంగయ్య ప్రాపకం కావాలి. రంగడు ఎలాగూ చెంగయ్య పనులు చక్కబెట్టేవాడే. చెంగయ్య అద్దెకి ఆశపడి ఒప్పుకుంటాడు. వీళ్ళంతా తన మంచి కోరేవారే అనే భ్రమలో ఉంటాడు. ఆయన దృష్టిలో మంచి కోరేవాళ్ళంటే డబ్బు రప్పించేవాళ్ళే. వరాలు రెచ్చిపోయి అంధుడైన పిచ్చయ్యని సత్రం నుంచి వెళ్ళగొడతాడు. దాంతో కోపగించిన ఊరివాళ్ళు కొట్టు సమాన్లు తీసి అవతల పారేస్తారు. వరాలు తండ్రి పోలీసు రిపోర్ట్ ఇవ్వటంతో పోలీసులు వస్తారు.
పోలీసు అధికారి చెంగయ్యకి సత్రం మీద హక్కు ఉందా అని విచారణ చేస్తాడు. రామప్ప పంతులు లౌక్యంగా అవునూ కాదనకుండా సాక్ష్యం చెబుతాడు. రామయ్యని అడిగితే “చెంగయ్య గారికి సత్రం అమ్ముకోవటానికి కానీ, అద్దెకి ఇవ్వటానికి కానీ ఎలాంటి హక్కూ లేదు” అని చెబుతాడు. ఇప్పటి వాళ్ళకి వింతగా ఉంటుందేమో కానీ అప్పట్లో ప్రజల కోసం అలాంటి సత్రాలు కట్టించేవారు ధర్మాత్ములు. వారి వారసులకి వాటి మీద హక్కు ఉండదు. అవి ప్రజల సొత్తు. రామయ్య తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పటంతో చెంగయ్య అగ్గి మీద గుగ్గిలం అవుతాడు. తమ ఇళ్ళ వాకిళ్ళ మధ్యలో ఉన్న తలుపు మూయించేస్తాడు. సుబ్బులు ఇదేం అర్థం కాక గాభరా పడుతుంది. సత్యం తండ్రితో పోట్లాడి పట్నం వెళ్ళిపోతాడు.
పగబట్టిన చెంగయ్య రామయ్యని బాకీ తీర్చమంటాడు. రామయ్య కొడుకు నారాయణ భార్య నగలు తాకట్టు పెట్టి మిగిలిన బాకీ తీర్చటానికి వెళితే అంతకు ముందు తీర్చిన రెండొంతుల బాకీ కూడా కట్టమంటాడు చెంగయ్య. జరిగినది ఏమిటంటే రామయ్య కొంత బాకీ తీర్చినా చెంగయ్య మీద నమ్మకంతో పత్రం మీద రాయించుకోలేదు. చేసేది లేక అప్పు చేసి మొత్తం మళ్ళీ జమ కడతాడు రామయ్య. ఇంకా కసి తీరని చెంగయ్య “ఎట్లా తీర్చాడు” అని అడిగితే రామప్ప పంతులు “పొలం తాకట్టు పెట్టాడు. ఈసారి పంటతో సగం ఋణం తీరిపోతుంది” అంటాడు. రంగడు “పంట వస్తుందో లేదో ఎవడికి తెలుసు” అంటాడు. “రెండ్రోజుల్లో కోయబోయే పంటని ఇంతలో పురుగులు కొడతాయా?” అంటాడు రామప్ప పంతులు. “ఏమో. పురుగులే కొడతాయో, మనుషులే కొడతారో ఎవరికి తెలుసు” అంటాడు ఉక్రోషంగా చెంగయ్య. ఇక్కడ సంభాషణలని గమనిస్తే చెంగయ్య పంట పాడు చెయ్యాలని రంగడికి సూచన ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. కానీ చెంగయ్య కేవలం ఉక్రోషంగా అన్న మాటే ఇది. ఆయన మరీ అంత దుర్మార్గుడు కాదు. కానీ రంగడు లాంటి వాళ్ళు దుర్మార్గులు. వాళ్ళు దుష్కార్యాలు చేయటానికి వెనకాడరు. ఇంకో రకంగా చూస్తే ఇది ముసుగులో గుద్దులాటలా ఉంటుంది. చెంగయ్యకి నిజంగానే రామయ్య పంట పాడు కావాలని ఉండొచ్చు. రంగడికి సూచన చేసి ఉండొచ్చు. కానీ రేపు రంగడు “చెంగయ్యే చేయమన్నాడు” అంటే “నేను అనలేదు” అనేందుకు అవకాశం కూడా ఉంచుకున్నాడు. ఇక్కడే మాటల రచయిత లోకజ్ఞానం, రచనా నైపుణ్యం అబ్బురపరుస్తాయి.
చెంగయ్య మోసం చేశాడని తెలిశాక రామయ్య కొడుకు నారాయణ “ఆయన్ని ఎలా నమ్మావు?” అంటే రామయ్య “అవును. నాదే తప్పు” అంటాడు. బాకీ చెల్లించినట్టు రాయించుకోవటం చాలా ముఖ్యం. ఈరోజుల్లో సొంత అన్నదమ్ములైనా రాతకోతలు ఉండాలి. స్నేహం కారణంగా రామయ్య చెంగయ్యని నమ్మాడు. తప్పు చేశానని కొడుకు దగ్గర ఒప్పుకున్నాడు. తప్పు ఒప్పుకోవటంలో ఆయన ఔన్నత్యం ఉంది. నారాయణ శాంతిస్తాడు. ఇందులో నారాయణకి తండ్రి పట్ల ఉండే గౌరవం కనబడుతుంది. నష్టం జరిగిపోయాక పరిష్కారం వెతకాలి గానీ ఒకరినొకరు నిందించుకుంటే లాభం ఏమిటి అనే వివేకం కనపడుతుంది. కోర్టుకి వెళ్ళినా బాకీ చెల్లించినట్టు సాక్ష్యం లేదు కాబట్టి రామయ్యదే తప్పు అంటారు. అందుకే ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. రామయ్య మళ్ళీ మొత్తం డబ్బు పట్టుకుని చెంగయ్య దగ్గరకి వెళ్ళినపుడు సౌమ్యంగా ఉంటాడు. గొడవ పెట్టుకోడు. “ఈ డబ్బుతో నీ ధనఋణం తీరుతుంది కానీ దయాఋణం తీరదు బావా” అంటాడు. మరీ ఇంత మంచితనం సబబేనా అనిపిస్తుంది. అప్పట్లో కర్మసిద్ధాంతాన్ని బాగా నమ్మేవారు. అవతలి వారు మోసం చేస్తే తమ కర్మఫలం అని, దేవుడే న్యాయం చేస్తాడని ఊరుకునేవారు. రామయ్యకి పోయింది డబ్బే, చెంగయ్యకి మిగిలింది పాపపురాశి. పైగా చెంగయ్య దయ వల్లే తాను పొలం కొన్నానని రామయ్యకి కృతజ్ఞత. ఇలాంటి పాత్రలు ఇప్పుడు కనిపిస్తాయా? ఇదంతా జరిగాక సుబ్బులు కొంచెం దిగులుగా ఉంటుంది కానీ నారాయణ, శాంతమ్మ నవ్వుతూనే ఉంటారు. కష్టాలని తట్టుకునే ధైర్యం వారి సొంతం. సుబ్బులుది చిన్నతనం. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ధైర్యం చెప్పాలి. అందుకే పెద్దవాళ్ళకి తగిన ప్రాధాన్యం ఉండాలి. ‘మా ఇష్టం’ అని చిన్నవాళ్ళంటే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే.
మళ్ళీ కథలోకి వస్తే రంగడు రామయ్య పంటకి నష్టం చేస్తాడేమో అని రామప్ప పంతులుకి అనుమానం వస్తుంది. నారాయణ దగ్గరకి వెళ్ళి “కాస్త జాగ్రత్త. రెండు రోజులు రాత్రివేళ పొలం దగ్గర పడుకో” అని చెబుతాడు. రంగడు తప్ప మిగతా పాత్రలు ఏవీ పూర్తిగా దుష్టపాత్రలు కావు. రామప్ప పంతులు కూడా రామయ్యకి జరిగిన అన్యాయానికి బాధపడ్డాడు. ఇంకా అన్యాయం జరగకూడదని ఆయన తాపత్రయం. అయితే ఈ పంతులే చెంగయ్యని రెచ్చగొట్టటం గత సన్నివేశాలలో చూస్తాం. సత్యం పట్నం వెళ్ళాక రామయ్య కుటుంబానికి పార్సిల్ పంపిస్తాడు. అందులో రామయ్యకి భాగవతం పుస్తకం, చిన్న పిల్లవాడికి బొమ్మ, సుబ్బులుకి గాజులు ఉంటాయి, ఇతర వస్తువులు ఉంటాయి. అది పంతులే తీసుకొచ్చి విప్పి ఇస్తాడు. చెంగయ్య దగ్గరకి వెళ్ళి “మీకు అబ్బాయి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందా? వాళ్ళకి పార్సిల్ వచ్చింది. వెళ్ళేటప్పుడు డబ్బు ఇచ్చారేమో. పంపించినట్టున్నాడు” అని చిన్నపాటి చిచ్చు పెడతాడు. కొందరు ఇలాగే ఉంటారు. అగ్నిలో ఆజ్యం పోసి చలి కాచుకుంటారు. రంగడు “బాబుగారి పిచ్చిగానీ చినబాబు ఎప్పుడో వాళ్ళలో చేరిపోయాడు” అని ఆ అగ్గిని ఇంకా ఎగదోస్తాడు. పంతులు మరీ దుష్టుడు కాదు అనటానికి ఆయన నారాయణకి చేసిన హెచ్చరికే నిదర్శనం. లక్క ఇంటి నుంచి పాండవులని కాపాడిన విదురుడిలా అనిపిస్తాడు. విదురుడి పాత్ర చాలా ఉన్నతమైన పాత్ర. పంతులు అంత గొప్పవాడేం కాదు. కానీ నష్టం మరీ ఎక్కువ జరుగకుండా కాపాడాడు.
మిగతా కథ వివరంగా చెప్పటం కన్నా కొన్ని ఘట్టాలు ప్రస్తావిస్తాను. నారాయణ మీద తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టిస్తాడు చెంగయ్య. దీనికి రంగడు చెప్పిన అబద్ధమే కారణం. మరో పక్క హాస్టల్లో ఉంటున్న సత్యం తన రూమ్‌మేట్ ప్రియురాలి కారణంగా అమె గొలుసు దొంగతనం చేశాడనే తప్పుడు కేసులో జైలుకి వెళతాడు. చెంగయ్య చేసిన పాపాలకి అతని కొడుక్కి శిక్ష పడింది. నారాయణ కోర్టులో “నా పంట తగలబెట్టాలని రంగడు ప్రయత్నిస్తుంటే కొట్టిన మాట నిజమే. కానీ రంగడి దగ్గర ఉన్న చెంగయ్య డబ్బు దొంగిలించాననేది అబద్ధం” అని ధైర్యంగా చెబుతాడు. కానీ చెంగయ్య అబద్ధపు సాక్ష్యం వల్ల శిక్ష పడుతుంది. సత్యం మాత్రం తన మీద పడిన నిందకి తన తండ్రి పాపాలే కారణం అని కోర్టులో మౌనంగా ఉండిపోతాడు. ఇక్కడా కర్మ సిద్ధాంతం మీద నమ్మకం కనిపిస్తుంది. సత్యం, నారాయణ జైల్లో కలుసుకుంటారు. చెంగయ్య సత్యాన్ని విడిపించాలని లాయర్ని సంప్రదించి అప్పీలు కాగితం సత్యం దగ్గరకి తెస్తాడు. సంతకం చేయమంటే సత్యం చేయనంటాడు. నారాయణకి అన్యాయం చేసినందుకు తాను కూడా శిక్ష అనుభవిస్తానంటాడు.
పిచ్చయ్య పాత్ర గురించి, చాకలి రామి పాత్ర గురించి కూడా చెప్పాలి. పిచ్చయ్యని సత్రం నుంచి వెళ్ళగొడితే “నాకు డాబా ఎందుకు బాబూ. ఏ చెట్టు కిందో ఉంటాను” అంటాడు. ఇది యోగుల లక్షణం. రామి ఆయనకి చెట్టు కింద ఒక చిన్న గుడిసె వేసి ఇస్తుంది. ఆయన “నీ ఋణం ఎలా తీర్చుకోను? వచ్చే జన్మలో నీ కడుపున పుడతాను” అంటాడు. “ఇంత తపస్సూ చేసి చాకలిదాని కడుపున పుడతావా తాతా” అంటుందామె. “కులం కన్నా గుణం మిన్న. నీబోటి గుణవంతురాలు ఏ కులంలో పుట్టినా ఆ కులమంతా రాణిస్తుంది” అంటాడు. వరాలు పిచ్చయ్యని వెళ్ళగొట్టాడు. రామి ఆదరించింది. అసహాయుల పట్ల ప్రవర్తించే తీరే మనిషి గుణాన్ని పరిచయం చేస్తుంది. రామి చివరికి చెంగయ్య ఇంట్లో రంగడు దొంగతనం చేస్తాడని తెలుసుకుని సుబ్బులుకి చెబుతుంది. చెంగయ్య స్వార్థపరుడైనా రంగడి చేతిలో ప్రాణాలు పోకుండా కాపాడాలని ఆమె ప్రయత్నం. మనిషి ఎలాంటివాడైనా ప్రాణం ఎవరికైనా విలువైనదే అని ఆరోజుల్లో అనుకునేవారు. ఈరోజుల్లో ప్రాణానికి విలువ లేదు. అన్నిటికన్నా చవకైనది ప్రాణమే! అయితే హత్య, లేకపోతే ఆత్మహత్య! అప్పట్లో ‘బతికుంటే బలుసాకు తినవచ్చు’ అనేవారు. బతికి ఉండటమే ముఖ్యం. దేవుడిచ్చిన జన్మని సార్థకం చేసుకోవటమే ముఖ్యం.
సుబ్బులు పాత్ర చిత్రానికి హృదయంలా ఉంటుంది. మొదట్లో చెంగయ్యను, సత్యాన్ని ఆటపట్టిస్తుంది. దీపావళికి చెంగయ్యను, సత్యాన్ని తమ ఇంటికి వదిన భోజనానికి పిలిచిందని చెబితే చెంగయ్య “వాడు వస్తాడులే. నేను రాను” అంటాడు. “అదేవిటి మావయ్యా? మీ ఇంట్లో అయితే మానుకున్నా కలిసొస్తుంది కానీ మా ఇంట్లో భోజనం ఎందుకు మానుకోవటం?” అని వేళాకోళం చేస్తుంది సుబ్బులు. ఆయన పిసినారి వాడని ఎత్తిపొడుపు. సత్యం నారాయణ కొడుకుని ‘నల్లాడా’ అని పిలిస్తే “నల్లవాడైతే అయ్యాడు గానీ నీ కూతుర్నేం ఇవ్వక్కరలేదులే” అంటుంది. ఇవన్నీ తెలుగు ఇళ్ళల్లో ఉండే వేళాకోళాలూ, ఆటపట్టింపులూ. నారాయణ సుబ్బులు గురించి తన భార్య శాంతమ్మతో “దానికి నీ మొగుడికంటే మంచి మొగుడే వస్తాడు” అనటం ఒక కొసమెరుపు. నారాయణ మీద కేసు పెట్టాక సుబ్బులు చెంగయ్య దగ్గరకి వచ్చి “అన్నయ్యని క్షమించు. ఈ ఒక్క భిక్షా పెట్టు” అని వేడుకుంటుంది. “మా వ్యవహారం చాలా దూరం పోయింది. చిన్నదానివి. నీకు తెలియదు” అంటాడు చెంగయ్య. సుబ్బులు నిరాశతో వెళ్ళిపోతుంది. చెంగయ్య కళ్ళు తుడుచుకుంటాడు. ఆప్యాయతలు ఉన్నా అహంకారాల వల్ల మనుషులు జీవితాన్ని నరకం చేసుకుంటారు. చివరికి సుబ్బులు చెంగయ్యని కాపాడటానికి తన ప్రాణాలు అడ్డు వేస్తుంది. ఊరివాళ్ళు కూడా చెంగయ్యని ఎంత తిట్టుకున్నా అతన్ని కాపాడటానికి దొంగలతో తలపడతారు. చివర్లో సుబ్బులు మళ్ళీ “మావయ్య ప్రాణాలయినా ఇస్తానన్నాడు కానీ తాళాలు మాత్రం ఇవ్వలేదు” అంటుంది వేళాకోళంగా. అన్నిటిలో హాస్యాన్ని చూడగలిగితే జీవితం సాఫీగా సాగిపోతుంది.
నటి జానకికి ఈ చిత్రం వల్లే ‘షావుకారు’ జానకి అని పేరు వచ్చింది. గోవిందరాజుల సుబ్బారావు ఎంత గొప్ప నటుడో ఈ చిత్రంలో తెలుస్తుంది. ఎస్.వి.రంగరావు, రేలంగి తమ కెరీర్ ప్రారంభంలోనే ఈ చిత్రంలో తమ ప్రతిభని చూపించారు. రామిగా నటించిన కనకం చలాకీగా ఉంటుంది. రామయ్యగా నటించిన శ్రీవత్స తర్వాత ‘మల్లీశ్వరి’లో కృష్ణదేవరాయల పాత్రలో నటించారు. మార్కస్ బార్ట్లీ కెమెరా పనితనం కూడా ఆకట్టుకుంటుంది. దానికి ఒక సన్నివేశం నిదర్శనం. రామయ్య తనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడని చెంగయ్య కోపంతో అరుస్తున్నప్పుడు సుబ్బులు చెంగయ్య ఇంట్లోనే ఉంటుంది. వాకిళ్ళ మధ్య ఉన్న తలుపు మూయమనటంతో సుబ్బులు కంగారుతో చేతిలో ఉన్న దీపం బుడ్డీని జారవిడుస్తుంది. తర్వాత గాభరా తన ఇంటికి పరుగుపెడుతుంది. వదిన ఆమెని అక్కున చేర్చుకుంటుంది. అప్పటికి గానీ తన కాలికి గాజు పెంకు గుచ్చుకున్న విషయం సుబ్బులుకి తెలియదు. కెమెరా ఆ గాయాన్ని చూపించి వాకిట్లో కారిన రక్తం చూపిస్తుంది. అప్పుడే రామయ్య అక్కడికి వస్తాడు. ఆ రక్తం చూస్తాడు. ముందు రామయ్య పాదాలు చూపించిన తర్వాత కెమరా ఆయన ముఖం మీదకి మళ్ళుతుంది. రామయ్యకి విషయం తెలిసిందని చెప్పటానికి ఇది చాలు. ఇలాంటి కెమెరా విశేషాలు చాలా ఉంటాయి ఈ చిత్రంలో. పాటలు బావుంటాయి కానీ పెద్దగా ప్రజాదరణ పొందలేదు. అప్పట్లో పాటలకి ప్రచారం ఎక్కువగా ఉండేది కాదేమో. పల్లెల్లో అప్పట్లో హరికథలు, బుర్రకథలు రాత్రివేళ కాలక్షేపం. వాటికి కూడా కథతో ముడిపెట్టి చూపించిన విధానం బావుంటుంది. హరికథ, బుర్రకథ లేనప్పుడు పిచ్చయ్య పాడే తత్వాలు వినడానికి ఊరివారు సత్రం దగ్గర చేరటం అప్పట్లో ఉండే తాత్విక చింతనకి నిదర్శనం. నేటి యువతరానికి ఈ చిత్రం చూపిస్తే ఒడిదుడుకులు తట్టుకోవటం ఎలాగో తెలుస్తుంది.
