[శ్రీ వీరేశ్వర రావు మూల రచించిన ‘శిశిర శరం’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]
మార్గశిరంలో దిగులు మేఘాలు కమ్ముకుంటాయి!
పండుటాకులు రాలుతుంటాయి
ఎండుటాకులు మరణాన్ని స్మరణ చేస్తుంటాయి!
అంతా ఆకురాలు కాలమే!
కిరణాన్ని కట్టడి చేసే తుహిన తరుణుల
నృత్యమే!
మంచు అంతా కప్పుతుంది
ప్రియురాలు రాకపోతే మనసును
మంచులో ముంచి తేలుస్తూ ఉంటుంది!
మబ్బు సుందరి కౌగిలి నుండి
విడిపడ్డాక సూరీడు
గోరు వెచ్చని సూరీడే!
శీతల స్పర్శ గుండెను కోస్తూంటుంది
ఆమె జ్ఞాపక శరంలా!
చెట్టులంత ధీమాగా ఎందుకున్నాయి?
బహుశా మొగ్గల్ని బుగ్గలలో దాచుకుని
వసంతం వస్తుందని ఎదురుచూపు
కాబోలు!
