Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శివశక్తి

[రాయపెద్ది హనుమంతరావు – సంజీవ లక్ష్మి స్మారక కథల పోటీ 2025 లో పౌరాణిక కథల విభాగంలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ ‘శివశక్తి’. రచన డా. సి. భవానీదేవి.]

హిమగిరి శిఖరాలపై నక్షత్రాలు రాలిపోతున్న ముత్యాల్లా మెరుస్తున్నాయి. మంచుకణాల కాంతులమధ్య పార్వతీదేవి దీర్ఘాలోచనలో ఉంది. గతజన్మలో తాను సతీదేవిగా దక్షప్రజాపతికి జన్మించి పుట్టింట అవమానం పాలయి చివరకు యోగాగ్నిలో ఆత్మాహుతి చేసుకున్న అనుభవం తల్చుకుని వేదన చెందింది. ఈ జన్మలో హిమవంతునికి పుత్రికగా శివ కైంకర్యంగా జన్మించింది. ఆమెకు యుక్తవయస్సు వచ్చేనాటికి పరమశివుని పతిగా కోరి నిష్ఠతో పూజిస్తూ తపస్సు చేస్తున్నది. అది ఆదిశక్తి అచంచల వ్రతం. ఆమె కళ్లలో కేవలం ఒకే ప్రతిబింబం. అది శివచరణారవిందం.

చంద్రబింబం వెలుగులలో ప్రకాశిస్తున్న గోరింటపంటలా, సూర్యరశ్మిలోంచి దూసుకొచ్చిన అగ్నికిరణంలా, గౌరీదేవి మనసు అచంచలంగా ‘ఓం నమః శివాయ’ అనే జపంలో లీనమైంది.

త్రిలోకాలలో తారకాసురుని ఆగడాలు మితిమించిపోతున్నాయి. దేవతాలోకం మీద తారకాసురుని అణచివేతవల్ల లోకమంతా వణికిపోతోంది.

శివుడు మాత్రం మహా సమాధిలో మునిగిపోయాడు. ఆయన కన్నులు మూసినపుడు సమస్త విశ్వమే కళ్ళు మూసుకున్నట్టే.

హిమగిరి తనయ తపస్సు ద్వారా శివుని మృదు హృదయాన్ని కదిలించాలని ప్రతిజ్ఞ వహించింది. ఆమె శివుని త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తున్నది. రోజులు కరిగిపోయాయి. ఋతువులు మారాయి. ఆమె ఆహారం క్రమంగా తగ్గించింది. పుష్పరసం, తరువాత ఆకులు, చివరికి గాలి. అలసట శరీరాన్ని కృశింపజేస్తున్నా భక్తి హృదయాన్ని మరింత వెలిగిస్తున్నది. పంచాగ్నుల మధ్య ఒంటి కాలిపై నిలిచి ముక్కంటి కృపకోసం తపస్సు చేస్తున్నది. స్వామికి పూజలు చేస్తున్నది. యోగసమాధిలో తపోదీక్షలో ఉన్న పరమేశ్వరుడు కళ్ళెత్తయినా చూడలేదు.

“శివుని మనసు మారాలి. శివపార్వతుల కళ్యాణం జరిగి వారికి పుత్రుడు జనించాలి. అతడే దుష్ట తారకాసురుని సంహరించి లోకాలకు శాంతి చేకూర్చగలడు. ఇది యోచించిన దేవతాగణం శివుని మనసు మరల్చటానికి మన్మథుని దగ్గరికి వెళ్ళి అతని సహాయం కోరారు.

కామదేవుడు వసంత సుగంధాల మధ్య ప్రవేశించి, శివుని ధ్యానంలోకి పంచబాణాలను ఎక్కుపెట్టి వదులుతున్నాడు.

ఒక్కక్షణం శివునికి ధ్యానభంగమైంది. విచలితుడై చుట్టూ పరికించాడు. తపములో సేవలో పార్వతి. చెట్టు చాటుణ వాసంతపు విల్లుతో మన్మథుడు.

ఎంత ధైర్యం.. ఆగ్రహం అవధులు దాటింది. నుదుటికన్ను నిప్పులు చెరిగింది.

అగ్నిజ్వాలలు వెదజల్లింది. ఒక్క చూపులోనే కామదేవుడు భస్మమయ్యాడు.

వసంతం మౌనమైంది, గాలులు భయంతో ఆగిపోయాయి.

పరుగు పరుగున రతీదేవి వచ్చి పరమేశ్వరుని పాదాలపైబడింది. కన్నీరు మున్నీరుగా విలపించింది. తన భర్త లేనిదే తాను జీవించలేనంది. లోకకళ్యాణం కోసమే మారుడీ పనికి పూనుకున్నాడనీ, శివ పర్వతుల కళ్యాణం దేవతల కోరిక అని చెప్పింది. పార్వతి కూడా శివునితో మన్మథుని మన్నించి పునర్జీవితుని చేయమని కన్నీళ్లతో ప్రార్థించింది. పార్వతి కూడా మహాదేవుని మరి మరి కోరింది. శివదేవుడు అనుగ్రహించాడు. సుమశరుడు అశరీరంగా పునర్జీవితుడవుతాడనీ, లోకానికి అదృశ్యుడుగా ఉన్నా రతీదేవికి మాత్రం కనబడతాడనీ వరమిచ్చాడు. పార్వతి చాలా ఆనందించింది.

అనురాగపూర్వకంగా హరుడు అపర్ణ కేసి చూస్తూ చిరునవ్వుతో ప్రశ్నించాడు.

“నీ తపస్సు ఎందుకు? భర్త కోసమా? మోక్షం కోసమా?”

ఆమె సిగ్గుతో తలదించుకుని పలికింది:

“ప్రభూ! మీరు లేక మోక్షం నిర్జీవం. మీరు లేక జీవితం నిస్సారం. నాకు కావలసింది ఒక్కటే! మీ సమీపం, మీ సాన్నిధ్యం.”

ఆ మాటలు విన్న, శివుని హృదయ సరస్సులో అలజడి పుట్టింది. ఆదియోగి, సకల సృష్టి కర్త, స్త్రీశక్తి ముందు దయామయుడై కరిగిపోయాడు.

దేవలోకమంతా గంగలా ఉప్పొంగింది. గౌరి-శంకరుల వివాహం దివ్య సంగీతంతో సకల దేవీ దేవతల సమక్షంలో జరిగింది. ఋషులు మంత్రపఠనంతో వాతావరణాన్ని మరింత పవిత్రం చేశారు. తారకాసుర సంహారానికి బీజం పడింది

వివాహోత్సవం తరువాత, లోకరక్షణకు శివశక్తి ఉద్భవం కానున్నది.

తారకాసురుని దుష్టత సరిహద్దులు దాటింది. ఆకాశం రక్తవర్ణమైంది, భూమి విలపించింది. అందరూ శివుని ఆశ్రయానికి పరుగులు తీశారు. కుమారస్వామిని చూసి తారకాసురుని అంతం సమీపించినదా అని సంతోషించారు.

అప్పుడు షణ్ముఖుడు సృష్టించిన దివ్యరథం భూమి, సూర్యుడు కుడి చక్రం, చంద్రుడు ఎడమ చక్రం, వాయువు పతాకం, అగ్ని బాణం.

ఆ దివ్యరథంపై కుమారుడు నిలిచాడు, శక్తి అస్త్రాన్ని సిద్ధం చేశాడు.

ఒకే బాణంతో తారకాసురుని ధ్వంసం చేశాడు.

గగనమంతా ‘హర హర మహాదేవ’ నాదమై మార్మోగింది. దేవతల హృదయాలు తృప్తిచెందాయి. భక్తికి వశుడైన శివుడు శక్తియుతంగా సృష్టిని తిరిగి నిలబెట్టాడు.

గంగలా ప్రవహించే ప్రేమ, అగ్నిలా దహించే తపస్సు, గాలిలా వ్యాపించే భక్తి; ఇవన్నీ కలిసినపుడు శివశక్తి అవతరిస్తుంది.

అదే గౌరిశంకరుల లీలావిలాసం. అదే ఈ విశ్వానికి ఆధారం.

Exit mobile version