[మహాశివరాత్రి సందర్భంగా ‘శివోహం.. శివోహం.. శివోహం’ అనే వ్యాసం అందిస్తున్నారు పి.వి.ఎస్. కృష్ణకుమారి.]
హైందవ సంస్కృతిలో, తెలుగు మాసాలలో ఒకొక్క మాసానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకొక్క మాసం ఒకొక్క భగవంతునికి ప్రియమైనదిగా చెప్పబడింది.
కొన్ని ముఖ్యమైన మాసాలని చూస్తే, మొదటిగా వచ్చేది చైత్ర మాసం. ఈ మాసంలోని వసంత నవరాత్రులు ముఖ్యమైనవి. అంటే చైత్ర శుక్ల పాడ్యమి నుంచి, అనగా , ఉగాది నుండి శ్రీరామ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే దేవీ నవరాత్రులు. ఈ తొమ్మిది రోజులు దుర్గా దేవి ఆరాధన చేస్తారు.
ఇక శ్రావణ మాసం. లక్ష్మీ దేవి ఆరాధన. ఆశ్వీయుజ మాసం శరద్నవరాత్రులు లలితా పరమేశ్వరిని వివిధ ప్రాంతాల్లో, వివిధ రూపాలతో తొమ్మిది రోజులు ఆరాధన చేస్తారు.
తర్వాత వచ్చే కార్తీక మాసం శివకేశవులకు ఇద్ధరికీ ప్రీతిపాత్రమైనది. తర్వాత వచ్చేది మార్గశిర మాసం. ‘మాసానాం మార్గశీర్షోహం’ – మాసాలలో మార్గశిర మాసం నేనే అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెపుతాడు. శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైన, పవిత్రమైన నెల ఈ మార్గశిర మాసం.
అయితే శివ, కేశవ, అమ్మవారికి, ప్రత్యక్ష దైవం సూర్యనారాయణణునికి ఇష్టమైన, పవిత్రమైన నెల మాఘమాసం.
అమ్మవారు చదువుల తల్లి సరస్వతీ రూపిణిగా అవతరించినది ఈ మాఘ మాసంలోనే. అదే వసంత పంచమి. సూర్యనారాయణుడు కశ్యప-అదితి దంపతులకు జన్మించిన రోజు రథసప్తమి కూడా ఈ మాఘమాసమే.
వీటన్నింటినీ మించి దేవాదిదేవుడు, దీనజన సంరక్షకుడు అయిన ఆ బోళా శంకరుని మహా శివరాత్రి వచ్చేది ఈ మాఘమాసంలోనే.
ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు చంద్రుడు, శివుని జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనరోజున ‘మహాశివరాత్రి’ గా జరుపుకుంటారు.
శివపురాణం ప్రకారం లింగోద్భవం జరిగింది ఈ రోజునే. శివపార్వతుల కళ్యాణం జరిగింది కూడా ఈ పవిత్రమైన రోజే. అందువల్లనే ఈ రోజును ‘శివ’ మరియు ‘శక్తి’ల కలయికగా భావించవచ్చు.
మరికొన్ని పురాణాల ప్రకారం శివుడు హాలాహలాన్ని మింగి, లోకాలన్నిటినీ ఒక పెద్ద విపత్తు నుండి కాపాడిన పర్వదినమే శివరాత్రి అని చెప్పబడింది.
గరళాన్ని మింగిన కారణంగా శివునిలో తాపం పెరిగిపోయింది. అంతేకాదు, ఆ వేడికి పరమశివుడు మూర్ఛిల్లాడట. ఆందోళన చెందిన భక్తులు శివునికి మెలకువ వచ్చేవరకూ జాగరణ చేసారట. తాపం తగ్గించటానికి లింగరూపంలో ఉన్న ఆ విశ్వేశ్వరునికి అభిషేకాలు చేస్తూనే ఉన్నారు అని ఒక కథనం.
శివుడు తాండవం చేసిన రాత్రిగా కూడా ఈ శివరాత్రి జరుపుకుంటారు.
ఈ మహాశివరాత్రి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ.
లింగోద్భవం అనగా మహాశివరాత్రి అంతులేని జ్యోతిర్లింగ రూపంలో శివుడు ఆవిర్భవించడం.
‘శివ’ అంటే మంగళకరం, శుభప్రదం అని అర్థం. శివరాత్రి అంటే శుభప్రదమైన రాత్రి అని అర్థం. శివారాధనలో లింగ రూపమే ప్రధానమైనది.
లింగోద్భవం:
పూర్వం బ్రహ్మ విష్ణువులకు ఆధిపత్యం విషయంలో వివాదం ఏర్పడి, అది కాస్త భీకరయుద్ధంగా మారింది. ఈ యుద్ధంలో విష్ణువు మహేశ్వరాస్త్రం, బ్రహ్మ పాశుపతాస్త్రం ఒకరి మీద ఒకరు సంధించుకున్నారు.
ఇది చూసిన దేవతలందరూ భీతావహులై, కైలాసానికి వెళ్లి, “ఈశ్వరా, పరమేశ్వరా, శంకరా, దేవదేవా, నీవే మాకు శరణం ,నీవే మమ్మల్ని కాపాడు” అంటూ శరణు వేడారు.
పరమశివుడు వారికి అభయమిచ్చి పార్వతీ సమేతుడై యుద్ధ భూమికి వెళ్లి, రహస్యంగా ఆ యుద్ధాన్ని తిలకించసాగాడు. మహేశ్వరాస్త్రం పాశుపతాస్త్రం రెండూ సమీపానికి రాగానే ఆ రెండిటిని తనలో ఇముడ్చుకొని అగ్నిస్తంభంగా ఆవిర్భవించాడు. అంతేకాదు, ఎవరైతే ఆ స్తంభం యొక్క ఆది, అంతము కనుక్కుంటారో వారే అధికులు అని ప్రకటించాడు. అగ్నిస్తంభము ‘ఆది’ చూడటానికి బ్రహ్మ, ‘అంతము’ చూడటానికి విష్ణువు బయలుదేరుతారు.
కానీ ఎంత వెళ్ళినా వారు ‘ఆది, అంతము’ కనుగొనలేక పోతారు. విష్ణువు ఓటమి అంగీకరించి తాను ‘అంతము’ కనుగొనలేదని చెప్పుతాడు. కానీ బ్రహ్మ మాత్రం తాను అగ్నిస్తంభం యొక్క ‘ఆది’ కనుక్కున్నాను అని అబద్ధం చెప్పటమే కాకుండా, కేతకీ పుష్పము, కామధేనువు మొదలైన వాటి చేత కూడా సాక్ష్యం చెప్పిస్తాడు.
నిజాన్ని గ్రహించిన పరమశివుడు, ఓటమి ఒప్పుకొని నిజాన్ని చెప్పిన విష్ణువు తనతో సమానంగా పూజలందుకుంటాడని పరమిస్తాడు. అలాగే అబద్ధం చెప్పినందుకు బ్రహ్మయొక్క పంచముఖాలలో, ఏ ముఖమైతే అబద్ధం చెప్పిందో ఆ శిరస్సును ఖండిస్తాడు. అంతేకాక బ్రహ్మకి, అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుకు పూజార్హత లేదని శపించాడు. అలాగే కామధేనువు ముఖంతో అబద్ధం చెప్పి, తోకతో నిజం చెప్పిన కారణంగా, ముఖానికి పూజార్హత ఉండదని, కామధేనువు తోక మాత్రం పూజలు అందుకుంటుందని వరమిస్తాడు.
అటు పిమ్మట బ్రహ్మ విష్ణు ఆదిగాగలదేవతలు అందరూ శివుని ధూప, దీప, నైవేద్యాలతో స్తుతిస్తారు. దీనికి సంతోషించిన శంకరుడు, “మీరు ఈనాడు చేసిన పూజకు నేను సంతసించితిని. నేను లింగ రూపంలో ఆవిర్భవించిన తిథి ‘మహా శివరాత్రి పర్వదినంగా’ ప్రసిద్ధి చెందుతుంది. ఈ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి, భక్తి శ్రద్ధలతో నన్ను ఆరాధిస్తారో వారికి మహా ఫలం లభిస్తుంది” అని అభయమిచ్చాడు.
శివుడు అగ్నిస్తంభంగా ఆవిర్భవించిన ప్రదేశం తమిళనాడులోని అరుణాచలంగా చెబుతారు. ఇది అహంకారాన్ని వీడి, శివుడే సర్వోన్నతుడని, నిరాకారుడని తెలుసుకోవడాన్ని సూచిస్తుంది ఈ కథనం.
ఈ రోజు రాత్రంతా శివపూజ, బిల్వార్చన, అభిషేకాలతో జాగరణ చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగి, శివ సాయుజ్యం, మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్మకం.
జాగరణ అనగా ప్రకృతిలో నిద్రాణమైన శివశక్తిని అభిషేక, పూజ, భజన, లీలా శ్రవణాదులతో మేల్కొలిపి, తానే శివుడై ,సర్వము శివస్వరూపముగా భావించి దర్శించటమే.
తద్వారా పరమశివుని పూజించుటలో సారూప్యము, శంకరా, శివా, అని కీర్తించుటలో సామీప్యము, ఈశ్వరాధకులతో మాట్లాడుటచే సాలోక్యము, శివ ధ్యానం చేత సాయుజ్యం సిద్ధిస్తాయి.
ఈ తత్వం మనకి ఆదిశంకరాచార్య విరచితమైన శివానందలహరిలో ఒక శ్లోకంలో గోచరిస్తుంది.
“సారూప్యం తవ పూజనే, శివ మహాదేవేతి సంకీర్తనే
సామీప్యం శివభక్తి ధుర్య జనతా సాంగత్య సంభాషణే!
సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యానే భవానీ పతే
సాయుజ్యం మనుసిద్దమంత్ర భవతి స్వామిన్ కృతార్ధో స్మృహమ్”.
శివతత్వం ఎంతో మహోన్నతమైనది. తన చేతల ద్వారా మానవాళికి ఉత్తమ సందేశాలను అందించిన ఆది గురువు ఆ శంకరుడు. శంకరుడు అంతటి బోళా భగవంతుడు, అల్ప సంతోషి మరొకరు లేరు. నాలుగు చెంబుల నీళ్లు, రెండు మారేడు దళాలు సమర్పించినంతనే భక్తుల వశమయ్యే దయామయి.
శివుడు భగవంతుడే అయినా మనకు ఆయనలో మానవ లక్షణాలు కూడా కనిపిస్తాయి. కోపం, కరుణ, లాస్యం, ప్రేమ, అనుగ్రహం అన్న గుణాలు కలగలిసి ఉంటాయి. ఇది కూడా సాంబయ్య మనకి ఇచ్చిన వరమే.
ఎప్పుడైతే ఈ మానవ లక్షణాలు కలిగి ఉంటాయో, మనం ఎటువంటి సంకోచం లేకుండా ఆ స్వామికి దగ్గర కాగలుగుతాం.
అప్పుడే ఆయనలోకి వెళ్ళటం మొదలు పెడతాం, కీర్తిస్తాం. అంటే సారూప్యం, సామీప్యం అన్నమాట. ఆయన తత్వాన్ని మనదిగా మలుచుకొని పరిపూర్ణత పొందగలుగుతాం.
లోకానికి ఆ శివయ్య అందించిన జ్ఞానం అంతా ఇంతా కాదు. అర్ధనారీశ్వర తత్వం ద్వారా, స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే అని ఆనాడే లోకానికి తెలియజేశాడు. తాను పులితోలు ధరించినా, పాముల్ని ఆభరణాలుగా ధరించినా, తన అర్ధాంగి ఎప్పుడు ఏడువారాల నగలతో సర్వాలంకార శోభిత అయి వెలుగొందాలని ఆశించాడు. ఆ తల్లి కూడా ఏనాడు తన భర్తని ‘ధనహీనుడు’ అని తూలనాడలేదు సరికదా, ఆయన చేసే ప్రతి పనిని సమర్థించి ఆదర్శపత్ని ఎలా ఉండాలో లోకానికి తెలియజేసింది. కాబట్టే వారిరువురూ లోకంలో ‘ఆది దంపతులుగా’ ప్రసిద్ధి చెందారు.
తాను హాలాహలాన్ని మింగి లోకోపకారం చేసి, అమృతాన్ని అందరికీ ఇచ్చి, పరోపకార గుణం గురించి లోకానికి తెలియజేసిన గొప్ప దయామయుడు ఆ పరమ శివుడు.
అయితే ఈ బోళాతనము ఒకొక్క సారి అనర్థాలు తెచ్చిపట్టినా, తద్వారా విష్ణు పరాక్రమాన్ని లోకానికి తెలిసే అవకాశం కూడా ఇచ్చాడు కదా!
ఆ మహా శివుడిని ప్రసన్నం చేసుకోవటానికి మహా నైవేద్యాలు అవసరం లేదు, పూల మాలల అలంకారాలు అవసరం లేదు. స్మృతి, శాస్త్ర, పురాణ, కవిత, గాన పాండిత్యాలు అవసరం లేదు. కేవలం ‘శివా’ అనే రెండు అక్షరాలు చాలు.
శ్లో:
స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ
పురాణే మంత్రే వా స్తుతినటన హాస్యే ష్వచతురః
కథం రాజ్ఞాం ప్రీతి ర్భవతి మయి కోహం పశుపతే
పశు మాం సర్వజ్ఞ ప్రథితకృపయా పాలయ విభో
ఓ దేవా! నాకు ఏ విధమైన పాండిత్యం, విద్యా లేవు. మూఢుడిని. అలాంటి అజ్ఞానిని అయిన నన్ను కాపాడవయ్యా శంకరా!
కళారూపమైనవాడు, చంద్రుని శిరస్సుపై ధరించిన వాడు, భక్తుల మనోవాంఛలని నెరవేర్చువాడు, త్రిలోకాలకు మంగళములను ప్రసాదించువాడు అయినా ఆ గౌరీ సమేత శంకరునికి వందనములతో..
ఓం నమఃశివాయ 🙏🙏🙏
