[శ్రీ ఆడెపు రమేశ్ గారు రచించిన ‘శూన్యం’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
మౌనాలన్నీ మధురాలయితే
మాటల మధురిమ
మురిపిస్తుందా?
నిశ్శబ్దాలే శబ్దాలయితే
స్పందించాలని
అసలుంటుందా?
గాయాలన్నీ గేయాలయితే
గానం, గాత్రం
మరిపిస్తాయా?
చూపుల దారులు
శూన్యాలయితే
అందం, చందం
అలరిస్తుందా?
ప్రణయం పయనం
ప్రళయం అయితే
ఆనందాలు
ఆవిరి కావా?
అవసరాలే అన్నీ అయితే
అనుబంధాలు
సరుకులు కావా?
గమనాలన్నీ గాలాలయితే
గుండె గూటిలో
వెలుగుంటుందా?
మనసే మనసుకు
శత్రువు అయితే
మనుగడ కర్థం
శూన్యం కాదా?
