[శ్రీమతి శ్రీదేవీ మురళీధర్ గారు రచించిన ఆవిష్కరణ, నా హాలీవుడ్ డైరీ, వేదాంత దేశికులు అనే మూడు పుస్తకాలపై సమీక్షని అందిస్తున్నాము.]
ఆవిష్కరణ:
ఈ పుస్తకం చదువుతూంటే, ఒక శ్రేయోభిలాషి ఆప్యాయంగా మంచి చెడు వివరిస్తూ మంచి మార్గాన్ని సూచిస్తున్నట్టనిపిస్తుంది. మరో వైపు ఈ విషయంపై రచయిత్రికున్న లోతైన అవగాహన, రచయిత్రి చేసిన లోతైన అధ్యయనాలు అర్థమవుతాయి. మందుకు బానిస అవటమన్నది ఒక మానసిక బలహీనత అని, సరయిన సమయంలో దాన్ని నియంత్రించకపోతే అది వ్యాధిలా ముదురుతుందని, అందువల్ల కలిగే అనర్థాలు,మందుకు బానిస అయినవారి సన్నిహితుల వ్యథలను హృదయానికి హత్తుకునే రీతిలో వివరించారు రచయిత్రి. రచయిత్రి పొందుపరచిన గణాంక వివరాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. త్రాగుడు అన్నది ఒక స్థాయి వరకే వ్యక్తిగతమని, ఆ తరువాత అది కుటుంబ సమస్యగా పరిణమించి సామాజిక సమస్యగా ఎదుగుతుందని చక్కగా చెప్పారు. త్రాగుడు వ్యాధికి గురయిన వారి వల్ల వారి సంతానం కూడా దుష్ఫలితాలు అనుభవించాల్సి వస్తుందనీ, తద్వారా పిల్లల్లో కలిగే మానసిక సమస్యలను మరచిపోలేని రీతిలో వివరించారు. పుస్తకం చివరలో డి-అడిక్షన్ సెంటర్ల వివరాలనూ పొందుపరచారు. ఈ పుస్తకం నిజానికి పాఠ్యపుస్తకం లాంటిదయినా, ఒక నవలను చదివినంత ఆసక్తికరంగా చదివించేట్టు రచించారు. బాలి బొమ్మలు పుస్తకానికి అదనపు ఆకర్షణ.
~
నా హాలీవుడ్ డైరీ:
ఆనాటి సినిమాలు ఏ రకంగా ఆనాటి సమాజాన్ని సినిమాల్లో ప్రదర్శిస్తూ కూడా సార్వజనీన సత్యాలను ప్రదర్శించేవో బోధపడుతుంది. చార్లీ చాప్లిన్‌తో సహా పలు సినిమాలు ఆనాటి నిరాశామయమైన పరిస్థితులలో సమాజానికి ఆశాభావాన్నివ్వటం అందుకు హాస్యాన్ని ఆధారం చేసుకోవటం అర్థమవుతుంది. కళాకారులకు సమాజం పట్ల వున్న బాధ్యతను ఆనాటి కళాకారులు సమర్థవంతంగా నిర్వహించారని, ఆ బాధ్యతను నిర్వహిస్తూ కూడా, ఉత్తమ విలువలతో రాజీపడకుండా వ్యాపార విజయాలూ సాధించారని తెలుస్తుంది. ఈ వ్యాసాలు ఎంత చక్కగా రచించారంటే, పుస్తకం మధ్యలో ఎక్కడ తెరచి అయినా చదవటం ఆరంభిస్తే, ఒకదాని తరువాత మరొకటి వ్యాసం చదువుతూ సమయం మరచిపోతాం. పుస్తకం పూర్తయితే కానీ కదలలేము. ప్రతి సినీ ప్రేమికుడి దగ్గర తప్పనిసరిగా వుండాల్సిన పుస్తకం ఇది. ఎందుకంటే, ఒక్కసారి చదివితే సరిపోదు. పదే పదే చదవాలనిపిస్తుంది ఒక్కో వ్యాసం. సినిమా ప్రేమికుల దగ్గరే కాదు, సినిమాలను అర్థం చేసుకోవాలనుకునేవారి దగ్గర, సినిమాల గురించి తెలుసుకోవాలనుకునే వారి దగ్గర కూడా తప్పకుండా వుండాల్సిన పుస్తకం ఇది. ఈ పుస్తకం విలువ పెంచుతాయి, పుస్తకంలో పొందుపరచిన ఛాయా చిత్రాలు.
~
వేదాంత దేశికులు:
ఇంతవరకూ చర్చించిన రెండు పుస్తకాలు ఒక ఎత్తు, శ్రీదేవీ మురళీధర్ రచించిన ‘వేదాంత దేశికులు’ పుస్తకం మరొక ఎత్తు.
శ్రీవైష్ణవ కవీశ్వరులు, పరమ భాగవతోత్తములు, సైద్ధాంతికులు, తాత్త్వికులు అయిన వేదాంత దేశికుల జీవితం, వారి రచనలు, ఆ రచనల ద్వారా వారు బోధించిన తత్త్వం, సమాజం పై ఆయా రచనల ప్రభావం వంటి అంశాలను అతి సరళంగా, అయినా, గాఢత, తాత్విక లోతు ఏ మాత్రం తగ్గకుండా వారు రచించిన తీరు అమోఘం. జలజల పారే ఒక నదీ ప్రవాహాన్ని తలపుకు తెచ్చే శైలితో, లోతైన సముద్ర గాంభీర్యాన్ని పోలిన ఆధ్యాత్మిక అంశాలను వారు వివరించిన తీరు అద్భుతం అనిపిస్తుంది.
తొలిపలుకులలోనే శ్రీవైష్ణవానికే కాదు, భారతీయ సమాజంలో వారి ప్రాధాన్యాన్ని వివరించి, వేదాంత దేశికులపై జరిగిన అధ్యయనాలను వివరించి పుస్తక పఠనానికి పాఠకుడిని మానసికంగా సిధ్ధం చేస్తారు రచయిత్రి. తాను ఈ రచన కోసం పరిశీలించిన గ్రంథాలను, రచనలో తన దృక్కోణం వంటివాటిని స్పష్టం చేస్తారీ తొలిపలుకులోనే.
“వేదాంత దేశికులు మహాచార్యులు, మహాకవీశ్వరులు, మహోన్నత వేదాంతవేత్తలన్న సత్యాన్ని ముముక్షువులలోనే గాక, చదువరులండరిలో కలిగించడమే ఈ గ్రంథం పరమావధి” అని స్పష్టం చేస్తారు. పుస్తకం చదివిన తరువాత వారి లక్ష్యం నెరవేరిందన్న నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే, పుస్తకం పూర్తయ్యేసరికి పాఠకుడు ఒక రకమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతాడు. మనసు ప్రశాంతమవటమే కాదు, ఇంతటి మహానుభావుడు జన్మించిన దేశం మనది అన్న గర్వం కలుగుతుంది.
వేదాంత దేశికుల జీవితం మాత్రమే కాక, ఆయన రచనల గురించి, ఆయన దర్శనంపై రామానుజాచార్యుల ప్రభావం గురించీ, ఆయన వ్యక్తిత్వం గురించీ అత్యంత సరళంగా, లోతుగా వివరించారు రచయిత్రి ఈ పుస్తకంలో.
శ్రీవైష్ణవం గురించి మొదటి అధ్యాయంలో వివరించారు. రెండవ అధ్యాయంలో వేదంత దేశికుల జీవిత చిత్రాన్ని ప్రదర్శించారు. రెండవ అధ్యాయంలో రచనలు, వాటి సమీక్షలను పొందుపరచారు. మూడవ అధ్యాయంలో భక్తికావ్యాలను సమీక్షించారు. ఇందులో పాదుకా సహస్రం, శ్రీ హయగ్రీవ స్తోత్రం వంటి భక్తి కావ్యాలను టూకీగా పరిచయం చేశారు. నాలుగవ అధ్యాయం ‘ఆచార్యవర్యులుగా దేశికులు’. ఈ అధ్యాయంలో శ్రీవైష్ణవంలో దేశికుల స్థానంతో సహా శ్రీవైష్ణవ ప్రాచుర్యంలోనూ, సైద్ధంతిక స్థాపనలోనూ వారి పాత్రను సమగ్రంగా చర్చించారు.
ఐదవ అధ్యాయంలో వివరణాత్మక వ్యాసాలున్నాయి. ఇది చాలా చక్కని అధ్యాయం. ఈ పుస్తకంలో మొదటి అధ్యాయంతో పాటూ నాలుగు, అయిదు, ఆరవ అధ్యాయాలు అత్యంత ప్రాధాన్యమైనవి. ముఖ్యంగా అయిదు, ఆరు అధ్యాయాలలో వేదాంత దేశికుల సాహిత్య విశ్వరూపం సూక్ష్మంలో ద్యోతకమవుతుంది. వారు జీవించిన కాలంలోని స్థితిగతులు, వాటికి ఆయన స్పందన కూడా తెలుస్తుంది. ముఖ్యంగా, శ్రీరంగం తురకల రాక్షస చర్యలకు లోబడినప్పుడు మళ్ళీ రంగనాథుడి పూర్వవైభవం రావాలని, వస్తుందన్న నమ్మికతో ఆయన ప్రవచించిన ‘అభీతిస్తవం’, విశ్వాసం వల్ల సంభవించే అద్భుతాలకు తిరుగులేని తార్కాణంలా నిలుస్తుంది. విశ్వాసం కొండలను కదిలిస్తుందంటారు. ఈ అభీతిస్తవం ప్రభావం, శ్రీరంగం నుంచి తురకలను తరిమి శ్రీరంగనాథుడికి పూర్వంలా పూజలందజేసే భాగ్యాన్ని ప్రజలకు కలుగచేసింది. ఇంకా, ఒక కాల్పనిక నాటిక గురించి కూడా వుంది. చివరలో మంగళాకాంక్ష, మలిపలుకులతో ఈ పుస్తకం ముగుస్తుంది. పుస్తకంలో పొందుపరచిన బొమ్మలు అత్యుత్తమంగా వుండి, కళ్ళకు విందుచేస్తూ, మనసులో భక్తిభావనలు కలిగిస్తాయి. ఒకరకమైన శాంతి భావనను కలిగిస్తాయి.
ఈ పుస్తక పఠనం భారతీయ సామాజిక, ధార్మిక, రాజకీయ చరిత్రలో ప్రయాణింపచేస్తూ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. ఈ పుస్తకం చదివినవారు ఎంతో బండ హృదయులయితే తప్పించి పుస్తక ప్రభావం నుంచి తప్పించుకోలేరు. భారతదేశం గురించి, ఈ దేశ సంస్కృతి, సాంప్రదాయాలను తీర్చిదిద్ది, ఆధ్యాత్మిక వారసత్వాన్ని సజీవంగా భవిష్యత్తు తరాలకందించటంలో తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి, ఈ దేశ పవిత్రాత్మకు తమ జీవితాన్ని అంజలిలా సమర్పించిన మహానుభావులలో ఒకరి గురించి తెలుసుకుని, వారితో ఆత్మీయ సంభాషణం చేసిన అత్భుతమైన భావనను కలిగిస్తుంది. ఇలాంటి అత్యద్భుతమైన పుస్తకాన్ని రచించి అందించిన శ్రీదేవీ మురళీధర్ గారికి తెలుగు పాఠకలోకం ఋణపడి ఉంటుందనటం అతిశయోక్తి కాదు
***
ఆవిష్కరణ – ఆల్కహాలిక్‌ల పిల్లలు- ఒక అవగాహన
పేజీలు: 67
వెల: అమూల్యం
~
నా హాలీవుడ్ డైరీ
పేజీలు: 364
వెల: ₹ 550/-
~
వేదాంత దేశికులు
పేజీలు: 311
వెల: అమూల్యం
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
~
శ్రీమతి శ్రీదేవి మురళీధర్ గారి ప్రత్యేక ఇంటర్వ్యూ
https://sanchika.com/special-interview-with-mrs-shridevi-muralidhar/