[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
స్ఫులింగాలింగనాత్ కృద్ధకృష్ణసర్పోపసర్పణాత్।
మకరాకరపాతాంచ కష్టం నృపతిసేవనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 87)
జ్వలిస్తున్న అగ్నిని కౌగలించటం, కోపంగా ఉన్న కృష్ణసర్పం దగ్గరకు పోవటం, సముద్రంలో పడటం వంటివాటన్నిటికన్నా ప్రమాదకరం రాజుల సేవ చేయటం.
జీవితాంతం రాజుల దగ్గర ఉద్యోగం చేస్తూన్న శ్రీవరుడు ఈ శ్లోకం రాయటం వెనుక ఎంత బాధ ఉందో ఊహించవచ్చు. శ్రీవరుడు జైనులాబిదీన్ దగ్గర పనిచేశాడు. జైనులాబిదీన్‌ను విష్ణువన్నాడు. రాముడన్నాడు. కానీ, ఇప్పుడు అగ్ని కౌగిలి, సర్ప సమీపం, సముద్ర పతనం కన్నా ప్రమాదకరం, కష్టం, రాజు సేవ అంటున్నాడు. ఎందుకంటే, ఎప్పుడు ఎవరికి మూడుతుందో తెలియదు. దుష్టుల కన్ను ఎవరిపై పడుతుందో తెలియదు. రాజు స్వయంగా ఆలోచించటం లేదు. చుట్టూ ఉన్న దుష్టులేది చెపితే అది వింటున్నాడు, మత్తులో జోగుతున్నాడు. ఎవరేమడుగుతున్నారో కూడా తెలియకుండా వారు చెప్పిన దానికి తల ఊపుతున్నాడు. అలాంటివాడి దగ్గర పని చేయటాన్ని మించిన ప్రమాదం మరొకటిలేదు.
చేతకాని అధికారి దగ్గర పనిచేసిన ప్రభుత్వోద్యోగులందరికీ ఇది అనుభవమే. అధికారికేమీ రాదు. ఏమీ పట్టింపు వుండదు. తన క్రింది ఉద్యోగులలో ఎవరో ఒక తుచ్ఛుడిని నమ్ముతాడు అధికారి. ఇక ఆ తుచ్ఛుడు ఏమి చెప్తే అదే వేదవాక్కు ఆ అధికారికి. ఎలాగో అధికారి ప్రాపకం సంపాదించేవారిలో అధికులు తుచ్ఛులే కాబట్టి, వాడు ఇతరులందరినీ హింసిస్తాడు, అధికారి వెనుక దాక్కుని. ఎప్పుడెవరికి ఏముప్పు వస్తుందో తెలియదు. కశ్మీరులో అలాంటి పరిస్థితిని అనుభవిస్తున్నాడు శ్రీవరుడు. తన ఆవేదనను, ఆక్రోశాన్నీ ఇలాంటి శ్లోకాల ద్వారా ప్రకటిస్తున్నాడు.
ప్రద్యుమ్నగిరిపాదాంతే చండాలైనిశ్యనాథవత్।
ఇట్టికాభిస్తతో నీత్వా భూగర్తేషు నివేశితాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 88)
రాజు చంపించినవాళ్ళ శవాలను అనాథల్లా రాత్రిపూట చండాలురు తీసుకువెళ్ళి, ప్రద్యుమ్న పర్వత పాదాల వద్ద భూమిలో పాతిపెడతారు. ఆ స్థలంలో ఇటుకనుంచుతారు.
రాజు చంపించినవాళ్ళను ఏం చేస్తారో చెప్తున్నాడు శ్రీవరుడు. ప్రద్యుమ్న పర్వతము, హరి పర్వతము దగ్గరలో వుంటుంది. కశ్మీరులో పర్వత పాదాల వద్ద భూస్థాపితమయిన శవాల ఆనవాళ్ళనేకం లభించాయి. దీన్నిబట్టి శ్రీవరుడు తాను చూసిన నిజాలే రాజతరంగిణిలో పొందుపరిచాడని అర్థమవుతుంది.
కుర్వన్తి మౌసులజనాః స్వశాజిరార్ధం
యత్నం సదైవ బహుకారుశు దత్తవిత్తాః।
నో చింతయంతి పరమేశ్వరమంతరేణ
జానాతి కో మమ కదా మరణం కథం స్యాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 89)
ముసల్మానులు మరణించిన వారిని పాతిపెడతారు. కళాకారులకు ధనం ఇచ్చి వారి సమాధులను అందంగా నిర్మింపచేసేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరు ఎప్పుడు, ఎలా మరణిస్తారో దేవుడికి తప్ప ఎవరికి తెలుసు?
వేదాంతం వచ్చేస్తోంది. పాపం, రాయని ఘోరాలు ఎన్నెన్ని తన కళ్ళతో చూశాడో శ్రీవరుడు. ప్రపంచంలో జాతివధకు (genocide) తొలి సాక్షి జోనరాజు. రెండవ సాక్షి శ్రీవరుడు. జోనరాజు అదృష్టవంతుడు. తన జీవితకాలంలో సికందర్ బుత్‌షికన్ ఘోర అకృత్యాలను చూసి, వాటిని రాజతరంగిణిలో పొందుపరచి, జైనులాబిదీన్ వంటి సుల్తాన్ సుపరిపాలనను అనుభవించి, ఆనందంగా ప్రాణాలు విడిచాడు. జోనరాజుతో పోలిస్తే శ్రీవరుడు దురదృష్టవంతుడు. జైనులాబిదీన్ వంటి వాడి అద్భుతమైన పరమత సహనం కల సుల్తాన్ పాలనలో సుఖ శాంతులతో జీవించిన తరువాత, మతఛాందసంతో రాక్షసుల్లా కదం తొక్కే విద్వేషపాలనలో క్షణం క్షణం ‘ఆఖరిక్షణం ఇదేనా?’ అని ఎదురుచూస్తూ జీవితం సాగించేడు. శ్రీవరుడు క్షేమంగా ఉన్నా, అతని స్నేహితులు, సన్నిహితులు జాతివధకు ఆహుతి అవటం తన కళ్ళతో చూసిన దౌర్భాగ్యం అతనిది. జోనరాజు, శ్రీవరుడు కనుక తాము చూసినది రాసివుండకపోతే, ఈనాడు మన నూతన చరిత్ర నిర్మాతలు, భారతీయులపై ఎలాంటి అత్యాచారాలు జరగలేదని నమ్మించేవారు. ఇప్పటికే ఎలాంటి ఆధారాలు లేని వాటినీ నమ్మించగలుగుతున్నారు. ఎంతగా అంటే, ఆధారాలు చూపినా నిజాన్ని పట్టించుకోని స్థితికి సమాజం దిగజారేంతగా!
భారతీయులకు సమాధి వ్యవస్థ లేదు. శరీరం పై ఎలాంటి ఆపేక్షలేదు. శరీరం ఒక తొడుగు మాత్రమే. అది నాశనమైతే, ఇంకొకటి లభిస్తుంది. ఈసారి ఈ తొడుగు. మరు జన్మలో ఏ తొడుగో తెలియదు. కాబట్టి శరీరంపై ఎలాంటి అపేక్ష వుండదు. అందుకని, మరణించగానే శరీరాన్ని పనికిరానిదిగా భావించి కాల్చేస్తారు. అదే, కొన్ని మతాలలో అదే శరీరం మళ్ళీ జీవిస్తుందన్న ఆలోచన ఉంది. ఫలితంగా శవాన్ని పాతిపెడతారు. ఇస్లాంలో కూడా శవాన్ని పాతిపెడతారు.
ఇస్లాం విరుద్ధమయినా (ఇస్లామ్‌కు చెందిన వాహబీలు, సమాధి నిర్మాణం ఇస్లాం విరుద్ధమని అనేక చారిత్రిక వ్యక్తుల సమాధులను ధ్వంసం చేశారు. ఇప్పటికీ సౌదీ అరేబియాలో సమాధులను పట్టించుకోరు. పాత సమాధులు అనాథల్లా ఉంటాయి) భారతదేశంలో సమాధుల నిర్మాణం, ముఖ్యంగా, సూఫీల ప్రభావంతో పెద్ద ఎత్తున సాగింది. కశ్మీరులో కూడా పర్వతాల పాదాలవద్ద అనేక సమాధులున్నాయి. కానీ, విస్తరిస్తున్న జనావాసాల వల్ల అనేక ఒకప్పటి సమాధి స్థలాలు ఇప్పుడు జనావాసాలయ్యాయి.
శ్రీవరుడికి సమాధులంటే పెద్దగా నచ్చినట్టు లేదు. సమాధుల కోసం డబ్బులిచ్చి శిల్పులను పిలిచి అలంకారాలు చేయిస్తారు. అయినా, ఎవరెప్పుడెలా పోతారో దేవుడికే తెలుసు అంటున్నాడు. ఇలా అనటంలో నిరసనతో పాటూ నిరాశ కూడా కనిపిస్తున్నది. ఎంతెంత గొప్పవారిని కూడా మోసంతో చంపేయటం, నిశ్శబ్దంగా పాతేయటం. దీనిపట్ల ఒక రకమయిన నిరాశ శ్రీవరుడిలో కనిపిస్తుంది. జైనులాబిదీన్ కాలంలో గౌరవమన్ననలందుకున్నవారు, ఎంతో వైభవంగా బ్రతికినవారు, శవాలవగానే, పశువులను లాక్కెళ్ళినట్టు లాక్కెళ్ళి పాతేస్తున్నారు. ఈ శ్లోకం ప్రాధాన్యం ఇంకొన్ని శ్లోకాల తరువాత తెలుస్తుంది.
యః స్వాయుశోవధిమవైతి స్వదేహనిష్ఠం
యస్యాంతకో భవతి మిత్రతయాతివశ్యః।
యుజ్యేత తం ప్రతి శవాజిరకర్మ కర్తుం
మ్లేచ్చేషు దుర్వ్యసనమాత్రమిదం మతం మే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 90)
శ్రీవరుడి మనసులో మాట బయటకు వచ్చింది.
ఎవరికయితే, తన ఆయుష్షు ఎంతవుందో తెలుసో, మరణం ఎవరి నియంత్రణలో ఉంటుందో, అంటే, మృత్యువు ఎవరికి బానిసత్వం చేస్తుందో, వారికి సమాధి నిర్మించటం ఔచిత్యం. ఇలా సమాధులు నిర్మించే మ్లేచ్చుల పద్ధతి మూర్ఖత్వం. ఇది నా అభిప్రాయం.
భారతీయ సామాజిక జీవనంలో సమాధులు నిర్మించే పద్ధతి ఇస్లామ్ సంపర్కంతో వచ్చింది. ఇస్లామ్‌లో కూడా సమాధులు నిర్మించటం నిషిద్ధం. భారతీయులు, ముఖ్యంగా రాజపుత్రులు సమాధులు పెద్ద ఎత్తున నిర్మించేవారు. సమాధి దగ్గర ఛత్రి నిర్మించేవారు. కానీ, సూఫీల ప్రభావంతో దర్గాహ్‌లు నిర్మించటం ఆరంభమయింది. దర్గాహ్ అంటే, సూఫీయో, లేక ఇతర ఆధ్యాత్మిక గురువో మరణించిన తరువాత అతని సమాధిపై నిర్మించిన మందిరాలు. మసీదులలో నమాజ్ చేస్తారు. దర్గాహ్‌లలో చాదర్ కప్పుతారు. పూలు అర్పిస్తారు.
భారతీయ ధర్మంలో మరణం ఒక మైల. మరణం మైల అయినప్పుడు ప్రాణంలేని శరీరాన్ని దాచటం, దానికి పూజించటం అన్న ఆలోచననే రాదు. అందుకే స్మశానాలు ఊరవతల ఉండేవి. స్మశానంలో పనిచేసేవారు ఊరికి దూరంగా ఉండేవారు, శవాన్ని కాల్చిన తరువాత పద్ధతి ప్రకారం బూడిదను, కాలకుండా మిగిలిన ఎముకలను ప్రవహించే నీటిలో కలిపేస్తారు. అంతే తప్ప, సమాధికట్టి పూజించటం అన్నది భారతీయ ధర్మంలో లేదు. ఇదంతా పధ్నాలుగవ శతాబ్దంలో ఆరంభమయింది.
మన దేశంలో ప్రస్తుతం అతి ప్రాచీనమైన దర్గాహ్ 1315కు చెందినది. జఫర్ ఖాన్ ఘాజీ దర్గాహ్ అది. పశ్చిమ బెంగాల్ లో ఉంది. ఘాజీ అంటే, ఇస్లామేతరులతో యుద్ధం చేసినవాడు.
ఇంతకన్నా ముందరివి మొయినుద్దీన్ చిష్తి, హజ్రత్ నిజాముద్దీన్ దర్గాహ్, హాజీ అలీ దర్గాహ్ లున్నా, నిర్మాణాలు తరువాత జరిగాయి. అందుకే ఇస్లామీ దేశాలలో దర్గాహ్‌లు అధికంగా కనబడవు.
చివరికి ముహమ్మద్ ప్రవక్తకు కూడా సమాధి నిర్మాణం తరువాత జరిగింది. 632వ సంవత్సరంలో మరణం తరువాత అతని భార్య ఐశా గృహంలోనే శవాన్ని పాతిపెట్టారు. సమాధిపై 1279లొ చెక్కలతో చతురస్రాకారపు గోపుర నిర్మాణం జరిగింది. ఇప్పుడు ఉన్న డోమ్ 1818లో కట్టారు. 1837లో ఈ డోమ్‌కు పచ్చరంగు వేశారు.
అంటే, ఇస్లామ్‌లో సమాధి నిర్మాణం, దాన్ని ఒక కట్టడంలా కట్టటం, దర్గాహ్‌ల నిర్మాణం వంటివి ఆరంభంలో లేవు. తరువాత వచ్చి చేరాయి.
శ్రీవరుడి కాలానికి సమాధులు కట్టటం కొత్త. పైగా, మరణాన్ని మైలలా భావించే సంస్కృతిని నమ్మిన వారికి శవాన్ని ఇంట్లో, రోడ్ పక్కన, రహదారుల కూడళ్ళలో పాతిపెట్టటమే కాక, కట్టడాలు కట్టటం వంటివాటిని శ్రీవరుడు అసహ్యకరమైన దానిగా భావించటంలో తప్పులేదు. కానీ, వారు పాలకులు కాబట్టి భరించక తప్పదు. అందుకే అనేది అనేసి ‘ఇది నా అభిప్రాయం’ అని తప్పించుకున్నాడు. కానీ, మ్లేచ్ఛులు అనకుండా ఉండలేక పోయాడు.
శ్రీవరుడు సమాధులను అసహ్యంగా భావించటం వెనుక మరొక కారణం ఉంది. స్మశానానికి వెళ్ళివచ్చిన వారు తప్పని సరిగా స్నానం చేస్తారు. శుభ్రమవుతారు.
ఇప్పుడు నగరాల నడిబొడ్డులలో సమాధులు. నగరాల నిండా సమాధులు, నాలుగు రోడ్ల కూడళ్ళలో సమాధులు, వీధి వీధిలో సమాధులు. ఆ సమాధులను దర్శించటం పవిత్ర కార్యం. సమాధి దగ్గరకు వెళ్ళి వచ్చి స్నానం చేయటం అన్న ఆలోచనే రాదు.
ఇప్పుడు ఈ సమాధులను, సంవత్సరానికోసారి సమాధి దగ్గర పూలు అర్పించటం, విదేశీ నేతలు రాగానే సమాధులను దర్శింపచేయటం, సమాధుల దర్శనం ఒక పర్యాటక అంశం కావటం చూస్తే, సమాధులను కట్టే పద్ధతినే మూర్ఖత్వం అన్న శ్రీవరుడేమంటాడో?
పైగా దర్గాహ్‌లు ముస్లిములకు పవిత్ర స్థలలు. కానీ, ముస్లిమేతరులకు సమాధులు. అలాంటి సమాధుల దగ్గర పూజ చేసే హిందువులనేమంటాడో?
ఇటీవలి కాలంలో ఈ సమాధులు మరో రకంగా భూ ఆక్రమణకు ఉపయోగపడుతున్నాయి. తమకు నచ్చిన చోట చాదర్ కప్పి కొన్ని పూలు చల్లితే అది దర్గాహ్ అయిపోతోంది. ఆ స్థలం ఆక్రమితమయిపోతొంది. చివరి వాడని, పాడుపడిన గుళ్ళలో కూడా ఓ రాయిపై చాదర్ కప్పి, ‘ఇది మాది. ఇది దేవల్ మసీదు’ అని మందిరాలను సైతం ఆక్రమించటం కనిపిస్తున్నది. ఇదంతా చూస్తే శ్రీవరుడు సమాధులను విమర్శించటం వెనుక, మైల ఒక్కటే కారణం కాదు అనిపిస్తుంది. రాబోయే శ్లోకాలు ఈ ఆలోచనను బలపరుస్తాయి.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
