Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-101

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

తే వైశ్రవణభట్టాద్యాః కృత్వాపి స్వశవాజిరామ్।
అంతే యత్ర మృతా గ్రామే భివి తత్రైవ శాయతాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 91)

వైశ్రవణభట్టు, ఇతరులు మరణించిన తరువాత శవాన్ని ఉంచే సమాధులను నిర్మించుకున్నారు. కానీ, చివరికి వారు మరణించిన గ్రామంలో ఎక్కడ మరణించారో అక్కడే వారిని పడుకోబెట్టారు(పాతిపెట్టారు).

ఈ  శ్లోకంలో శ్రీవరుడు పైకి చెప్పినదొకటి, మార్మికంగా  చెప్పిన  అసలు విషయం మరొకటి అనిపిస్తుంది.

ఇస్లామీయులను చూసి భారతీయులు కూడా తమ సమాధులను నిర్మించుకోవటం కశ్మీరులో జరిగిందన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఆరునెలలు సాము చేస్తే వారు వీరు వీరువారు అవుతారంటారు. అది కశ్మీరులో జరగుతూండటం శ్రీవరుడు చూపిస్తున్నాడు.

తమ సమాధులను నిర్మించుకున్నా, ఎవరు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మరణిస్తారో ఎవరూ చెప్పలేరు. భగవంతుడికి తప్ప ఇంకెవరికీ ఆ విషయం తెలియదు. సమాధులయితే నిర్మించుకున్నారు కానీ వారు మరోచోట మరణించారు. అక్కడే వారి అంతిమ సంస్కారాలు అయ్యాయి.

ఇది పైకి కనిపిస్తున్న అర్థం.

తమకు సమాధులు నిర్మించుకున్నారంటే, వారు సామాన్యులు కారు. పైగా శ్రీవరుడు వారి పేరు కూడా చెప్తున్నాడు. కాబట్టి అసామాన్యుడే. అంతే కాదు, ఇస్లామీయుల పాలనలో, ఇస్లామేతరుడు స్థలం కొని, సమాధి నిర్మించుకోగలగటం సామాన్యులకు సాధ్యం కాదు. అలాంటి వాడు మరణించిన తరువాత అతని ఆఖరి కోరికను నెరవేర్చటం కోసమైనా శవాన్ని తెచ్చి తయారుగా ఉన్న సమాధిలోకి చేరుస్తారు. కనీసం అతని అస్థికలను, బూడిదలనయినా  సమాధిలో భద్రపరుస్తారు. కానీ అలాంటివేవీ జరగలేదంటే, ఏం జరిగిందో ఊహించటం పెద్ద కష్టం కాదు.

బహుశా సుల్తాను అనుగ్రహం ఉన్నప్పుడు వారు ప్రముఖులయి ఉంటారు. సమాధి ఏర్పాటు చేసుకున్నారు. కానీ, సుల్తాను అనుగ్రహం తప్పి ఉంటుంది. రాజధాని వదలి గ్రామం వెళ్ళి వుంటారు. కానీ, నమ్మించి మోసం చేయటం సుల్తాన్ పద్ధతి. అలా వారిని నమ్మించి, చంపి, రాత్రికి రాత్రే ఇంతకుముందు శ్రీవరుడు చెప్పినట్టు ఎక్కడో పాతిపెట్టేసి వుంటారు. ఆ విషయాన్ని తిన్నగా చెప్పకుండా నర్మగర్భితంగా చెప్తున్నాడు. అయితే ఇది ఊహ మాత్రమే.

ఈ శ్లోకం ఇలా రాయటం వెనుక మరో కారణం కూడా ఉండి ఉంటుంది.

శ్రీవరుడు సాంప్రదాయవాది. ఇస్లామీయులు పాలకులయినా మ్లేచ్చులుగానే భావిస్తున్నాడు. ఒక్క జైనులాబిదీన్‍ను తప్ప అందరినీ మ్లేచ్చులుగానే పరిగణిస్తున్నాడు. అలాగే సంబోధిస్తున్నాడు. తన రచనలో ఎంతవరకు రాయాలో అంతవరకే రాస్తున్నాడు. అతడికి, భారతీయులు, ఇస్లాం స్వీకరించకున్నా, నెమ్మదిగా వారి పద్ధతులను పాటించటం బాధ కలిగించి వుంటుంది. ఇలాగే జరిగితే కొన్నాళ్ళకు తాము తమ అస్తిత్వం కోల్పోతామన్న భయం కలిగి వుంటుంది. అందుకని, ఇస్లామీ పద్ధతులను పాటించే భారతీయుల పట్ల అసహనం ఉండివుంటుంది. అందుకే, సమాధులు కట్టటాన్ని, ఆ ఆలోచనను విమర్శించాడు. ఆ పద్ధతులను  పాటించే ఇస్లామేతరులను ఎద్దేవా చేస్తున్నాడు. ఒకవేళ వైశ్రవణ్ మతం మార్చుకుని ఉంటే, జోనరాజు లాగే, మతం మారిన తరువాతకూడా  మారిన పేరుతో కాకుండా అసలు పేరుతోనే ప్రస్తావించి ఇంకా నొక్కి పొడుస్తున్నాడు. పంచభూతాలలో కలిసిపోయే శరీరాన్ని భూమిలో దాచే దుస్థితి మతం మారటం వల్ల పొందాడని వెక్కిరించటం ఇది.

ముందుగా సమాధులు ఎవరుబడితే వాడికి కాదు, ఎలాంటి వారికి కట్టాలో చెప్పాడు. ఆ తరువాత సమాధులు కట్టటాన్ని విమర్శించాడు. మూర్ఖత్వం అన్నాడు. ఇప్పుడు పేరు చెప్పి మరీ ఎత్తిపొడుస్తున్నాడు. ఆ కాలంలో కాబట్టి బ్రతికి పోయాడు. ఈ కాలంలో ఇలా అని ఉంటే, జాతీయవాది, ఛాందసవాది, ఆరెస్సెస్ బీజేపీ, బ్రాహ్మణవాది, మనువాది, పరమతాన్ని విమర్శించే అసహన సనాతనీ లాంటి అనేకానేక తిట్లు తినేవాడు. అదృష్టవంతుడు, ఇప్పటి సమాజాన్ని చూసే దురదృష్టం కలగలేదు. ఏడు వందల సంవత్సరాల క్రితం బ్రతికేడు. బ్రతికిపోయాడు. కానీ, అతని రచన ద్వారా చిరంజీవిగా ఉన్నాడు. అతని రచన ద్వారా, ఆ కాలం నాటి రాజకీయాలు, సామాజిక పరిస్థితులు, మారుతున్న మనస్తత్వాలు, స్వీయ మానసిక సంఘర్షణలవంటివాటి స్వరూపాన్ని  భావి తరాలకు అందించాడు.

ఏక ఏకో భువో హస్తశతమాత్రావృతౌ రతః।
పరాప్రవేశదో యత్నాత్ ప్రాకృతో లజ్జతే న కిమ్?॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 92)

శృతం  యఛాస్త్రతః సూక్ష్మశిలాశ్చేచ్చవభూతలే।
స్థాప్యన్తే తత్ సుఖమ్ తస్మిన్ పరలోకగతే భవేత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 93)

అహో లోభస్య మాహాత్మ్యం జీవద్వద్ యన్మృతా అపి।
శవాజిరాపదేశేన కుర్వన్త్యావరణం భువః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 94)

శ్రీవరుడు బయటపడిపోయాడు. ఇంతకాలం మనసులో దాచుకున్న భావాలు బయటకు వచ్చేస్తున్నాయి. జైనులాబిదీన్ ఉన్నంత కాలం ఇలాంటి ఆలోచనలు రాలేదు. జైనులాబిదీన్ మరణం తరువాత నెలకొన్న పరిస్థితుల ప్రభావం ఇది.

భారతీయుల మనస్తత్వం ఇది. వారు పరిస్థితులతో రాజీ పడాలని ప్రయత్నిస్తారు. ఎదుటివారిని అర్ధం చేసుకోవాలని ప్రయత్నిస్తారు. అవసరమైతే, తమ ఇష్టాఇష్టాలతో రాజీ పడతారు. ఎదుటివారు దీన్ని పిరికితనంగా, చేతకాని తనంగా భావించి అవమానిస్తే, అప్పుడు కానీ, వారు తిరగబడరు. అతి సహనవంతులు.అయితే, తమపై హింస నెరపినవాడిపై హింసను కూడా వ్యతిరేకిస్తారు మళ్ళీ.

ఇటీవలే మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికలలో ఒక స్థానంలో ఒక ముస్లిం మహిళ ఎన్నికయింది. ఎన్నికవుతూనే ఆమె “ఎలా ఓడించాం. మళ్ళీ ఎన్నికలలోగా ముంబ్రానంతా పచ్చరంగుతో నింపేయాలి” అన్నది. ఆమె ఉద్దేశం ఏమైనా కావచ్చు, కానీ, గెలవగానే ఇలా వెక్కిరించటంతో అంతవరకూ లేనివారికి కూడా కాషాయం గుర్తుకువచ్చింది. మరుసటి రోజు సభలో అందరూ కాషాయం ధరించి వచ్చి “జై శ్రీరామ్” అని నినాదాలిచ్చారు. ఇది దేశమంతా చూసింది. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, క్రికెట్‍లో భారత్ పాకిస్తాన్‍ను ఓడిస్తే, ప్రజలు అమె ఇంటిముందుకెళ్ళి “ఎలా ఓడించాం?” అని ఆమెను ఎద్దేవా చేశారు. పాకిస్తాన్ ఓడితే ఆమెకేమిటి?భారత్ గెలిస్తే సంతోషం అన్న ఆలోచన కూడా లేదు. కానీ, ఆమె అంతా పచ్చరంగుతో నింపుతాం అని అనకపోయివుంటే, వీళ్ళకీ ఆలోచనే వచ్చేదేకాదు. వీళ్ళంతా ఆమెని మనస్ఫూర్తిగా అభినందించేవారు.

శ్రీవరుడు రాస్తున్న శ్లోకాలు చదివి, భావం గ్రహించటంతో పాటూ శ్రీవరుడి మానసికస్థితిని విశ్లేషిస్తూంటే అనేకానేక ఆలోచనలు వస్తాయి. గతంలో వర్తమానం, వర్తమానంలో గతం కనబడుతూ భవిష్యత్తును కళ్ళముందు నిలుపుతాయి.

సామాన్యులు ఎంతో కష్టపడి చిన్న భూమిని సంపాదించి ఎవరూ తన భూమిలోకి రాకుండా కంచె కట్టుకుంటాడు, తన సమాధికోసం. ఇలా  చేసేందుకు అతడు సిగ్గుపడాలి, అంటాడు శ్రీవరుడు.

ముస్లిముల శాస్త్రాల ప్రకారం ఈ సమాధిపై ఒక చిన్న రాయి వుంచితే అది మరో లోకంలో ఉన్న మరణించిన వాడికి సంతోషం కలిగిస్తుందని విన్నాను.

ఎంత ఆశ్చర్యం ఇది. బ్రతికి ఉన్నవాళ్ళు భూమిని తమ పేరు మీద  ఉంచుకున్నట్టు, మరణించినవాడు  కూడా సమాధి పేరిట భూమిని తన పేర ఉంచుకుంటాడు.

ఇక్కడ తెలుస్తోంది శ్రీవరుడి కసి.

మరణించటంతోటే, అన్ని బంధాలు తెగిపోతాయి. ఇక్కడేమీ మిగలదు. ఏదీ వెంట తీసుకువెళ్ళరు. కానీ, సమాధి పేరిట కొంత భూమిని కొని, సమాధి కట్టటం వల్ల, మరణించి కూడా బ్రతికి ఉన్నవాడిలా భూమి ‘తనది’ అని చెప్తున్నట్టవుతున్నది. ఒక రకంగా ఆ భూమి ఇంకా ఎవరికీ ఉపయోగపడదు. సమాధి నిర్మాణం అంటే, చనిపోయినవాడి పేర భూమిని రాసి వుంచటం.

ఇస్లామీయుల కుటుంబాలకు ఆ కాలంలో ప్రత్యేక సమాధి స్థలాలుండేవి. రాజుల కుటుంబాలవారొక చోట, ఇలా.. ఎవరెవరి స్థాయిని బట్టి వారికీ, కుటుంబాలకు, బంధువులకు సమాధి స్థలాలుండేవి. ఇలా సమాధి స్థలాలేర్పరచుకోవటం, ఆ స్థలం చుట్టూ గోడలో, కంచెలో నిర్మించి ఇతరులెవరూ రాకుండా చూడటం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించేవారు. సామాన్యులు ఇలా ఏర్పాటు చేసుకోలేకపోయేవారు.

ఇలా ఎన్నెన్నో ఎకరాలకొద్దీ స్థలాలు, సమాధుల వల్ల, ఎవరికీ ఉపయోగపడకుండా ఉండిపోతాయి. దీన్ని వెక్కిరిస్తున్నాడు శ్రీవరుడు. ఇటీవలి కాలంలో జనాభా పెరిగిపోవటం వల్ల సమాధి స్థలాలు కూడా ఇళ్ళ స్థలాలుగా మారుతున్నాయి. ఇలా మారటం పలు చోట్ల ఉద్విగ్నతలకు కూడా దారి తీస్తోంది.

ఆధునిక కాలంలో మరొక సమస్య కూడా సమాధులవల్ల నెలకొంటున్నది. సమాధి ఎవరిదో, అక్కడెందుకున్నదో ఎవ్వరికీ తెలియదు. కానీ, భూమి ధరలు విపరీతంగా పెరిగి పోవటంతో సమాధుల భూముల విలువ పెరుగుతోంది, లేని చోట్ల తెల్లారేసరికి సమాధులు వెలుస్తున్నాయి.

సమాధి పై శిలను ఉంచటం విషయంలో శ్రీవరుడు పొరబడినట్టున్నాడు. ఎందుకంటే, సమాధిపై శిలను ఉంచటం కేవలం గుర్తింపు కొరకే తప్ప పరలోకంలో ఉన్నవారికి సంతోషం కలిగించటం కోసం కాదు. పైగా, ఇస్లాంలో అసలు సమాధి నిర్మించటమే నిషిద్ధం, సమాధి నిర్మించినా భూమితో సమానమైన ఎత్తులో ఉండాలి, ఎలాంటి ప్రత్యేకత ఉండకూడదు, సమాధి వుంటే, ప్రజలు దైవాన్ని వదలి సమాధిని పూజించే వీలుంది.. కాబట్టి సమాధి నిర్మాణాన్ని శాస్త్రాలు సమర్థించవు. అందుకే, అనేక ఇస్లామ్ దేశాలలో సమాధులుండవు. ప్రపంచంలో అత్యధిక సమాధులున్న దేశం, శరీరానికి విలువనివ్వక, ఆత్మకే ప్రాధాన్యం ఇచ్చే భారతదేశమే!

మహాన్తో హన్త కుర్వన్తు కృతయత్నాః శవాజిరం।
తన్నిర్మాణేన జీవన్తి కియంతోపి బుభుక్షితాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 95)

ధనవంతులు, గొప్పవారు, ఎంతో జాగ్రత్తగా తమ సమాధులను నిర్మించుకుంటారు. ఆ సమాధులు నిర్మించటం వల్ల ఎంతో మంది కడుపులు నిండుతాయి.

పైకి, సమాధుల నిర్మాణం వల్ల పనులు దొరుకుతాయని అంటున్నట్టుంది. కానీ, దీనిలో తిరస్కారం కూడా ఉంది. ఎంతో మంది జీవిక కోసం పోరాడుతూంటే, డబ్బున్నవాళ్ళు, తమ సమాధుల మీద ఎంతో వెచ్చిస్తున్నారు అన్న నిరసన కూడా ఉంది.

వన్ధ్యోన్యదర్శనాచారో హస్తమాత్రే భువస్తలే।
దుగ్ధా యత్ కోటిషో నిత్యం సావకాశం తథైవ తత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 96)

దీనికన్నా ఇతర దర్శనాల ఆచరణే శ్రేష్ఠమయినది. కోట్ల సంఖ్యలో మనుషులు మరణిస్తారు. గుప్పెడు స్థలంలో వారందరూ బూడిద అయిపోతారు. భూమి ఇంతకుముందు ఎలావుందో, ఎప్పుడూ అలాగే ఉంటుంది.

శ్రీవరుడి హృదయం స్పష్టంగా అవగతమవుతున్నది.

ఇక్కడ ఇతర దర్శనాల ఆచరణ శ్రేష్ఠం అని అంటున్నాడు తప్ప సనాతన ధర్మమో, హిందూ ధర్మమో ఆచరించటం ఉత్తమం అని అనటంలేదు. ఇది గమనార్హం. అప్పుడు లెఫ్ట్ లిబెరల్, లౌకికవాద, అభ్యుదయవాద, విచ్చిన్నకర, టుక్డే టుక్డే గ్యాంగ్ లు, ఆందోళన జీవులు లేరు. కానీ, ఉంటున్నది సుల్తానుల పాలనలో. ఆ సుల్తానులూ జైనులాబిదీన్ లాంటివారు కారు. జైనులాబిదీన్ లాంటి సుల్తాను మరొకడుండడు. కాబట్టి ధైర్యంగా ఏ ధర్మమో చెప్పలేడు. అందుకే అన్య ధర్మాలని అన్నాడు. అప్పుడూ ఇప్పుడూ అదే పరిస్థితి. ఇతరులు వాళ్ళ ధర్మాన్ని గొప్ప అనవచ్చు కానీ, మనం మన ధర్మంం గొప్పది  అంటే, సంకుచిత, కుళ్ళు, మనువాద, బ్రాహ్మణవాద, అహంకార సనాతనధర్మవాది అయిపోతాము.

అయితే, శ్రీవరుడు ఇతర దర్శనాలు గొప్ప అనేందుకు మొదటి నుంచీ తన వాదనకు బలాన్ని సమకూరుస్తున్నాడు. సమాధులు స్థలాన్ని ఆక్రమిస్తాయి. పోయినవాడేమీ తీసుకుపోడు. ఉన్నవాడినీ ఆ స్థలం అనుభవించనీయడు. అది అలా అందుబాటులో లేకుండా వుంటుంది, వ్యర్థంగా..

లక్షల సంఖ్యలో ప్రజలు మరణించినా గుప్పెడు స్థలంలో శవాన్ని కాలుస్తారు. బూడిదను గంగలో  కలిపేస్తారు. అంతే, అదే స్థలంలో ఇంకొకరిని కాలుస్తారు. ఇక్కడ భూమిని వ్యర్థం చేయటంలేదు. మరణించినవాడి కోసం స్థలాన్ని  రక్షిస్తూ, జీవిస్తున్నవాడు అనుభవించకుండా అడ్డుపడటం లేదు. కాబట్టి ఈ పద్ధతే మేలు అంటున్నాడు శ్రీవరుడు.

ఒక అంచనా ప్రకారం మన దేశ రాజధాని ఢిల్లీలో నాయకుల సమాధులు, మెమోరియల్స్ 245 ఎకరాలను ఆక్రమించాయి. సుల్తానుల సమాధులు, ఇతరుల సమాధి స్థలాలన్నీ కలిపి 280.8 ఎకరాలను ఆక్రమించాయి.  ఢిలీ మొత్తం విస్తీర్ణం 3,66,000 ఎకరాలు. ఇంకా భవిష్యత్తు నాయకుల సమాధులను కూడా పరిగణలోకి తీసుకుంటే, భవిష్యత్తులో ఢిల్లీలో స్థలం లేదని, ఏ ప్రాంతంలో జన్మించిన నాయకుడి సమాధిని అక్కడే నిర్మించాలనే నియమం వచ్చినా ఆశ్చర్యంలేదు.

మొత్తానికి ఒక గొప్ప ప్రాక్టికల్  మనిషిలా ఆలోచించాడు శ్రీవరుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version