[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
ఇత్యాద్యనుచితా నిందా ప్రస్తావాద్విహితాత్ర యత్।
క్షంతవ్యా మౌసులైర్యస్మాత్ కవివాచో నిరర్గలాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 97)
ప్రసంగవశాత్తు, ఈ రకంగా అనుచితమైన విమర్శ నా వల్ల ఏమైనా జరిగితే కవి వాక్కు నిరంకుశం అని భావించి ముసల్మానులు నన్ను క్షమింతురుగాక .
అనాడే కాదు, ఈనాడు ఇదే పరిస్థితి.
మనసులో ఓ ఆలోచన ఉంటుంది. దాన్ని పైకి చెప్తే ఎదుటి వాడి మనోభావాలు దెబ్బతింటాయేమోనని పైకి చెప్పకుండా మాటను మనసులోనే అణచిపెడతాం. కానీ ఎదుటివాడు మన మనోభావాల గురించి పట్టించుకోడు. వాడు అనాలని అనుకున్నది అనేస్తాడు. మన బాధ గురించి వాడికి పట్టింపు లేదు. పొరపాటున మనం ఏమైనా అన్నామంటే, ఇక బ్రహ్మండం బద్దలవుతుంది. పెద్ద గోల అవుతుంది. మనం అన్నదాన్లో నిజం ఎంత ఉన్నా, ఎదుటివాడు చేసే గోల చూసి, అందరూ తప్పు మనదే అంటారు. నేరం మనదే అవుతుంది. ఈ విషయంలో ఎవరికయినా ఎలాంటి సందేహం ఉన్నా ‘నూపుర్ శర్మ’ వైపు చూస్తే చాలు. ఆమెకు మద్దతిచ్చిన పాపానికి ‘సర్ తనసే జుదా’ అయిన ఓ మామూలు టైలర్ పేరు తెలిస్తే చాలు.
దేశంలో పలు రకాల మతకల్లోలాలు, హింస సంఘటనలను పరిశీలిస్తే చాలు, శ్రీవరుడు క్షమార్పణలు కోరటం వెనుక ఉన్న ‘భయం’ తెలుస్తుంది. అది సుల్తానుల పాలన కాలం. శ్రీవరుడి భయానికి అర్థం ఉంది. పరమత సహనం కల జైనులాబిదీన్ మరణించాడు. తన జీవిత కాలంలో కూడా జైనులాబిదీన్ సంకుచిత మత ఛాందసవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు. నిజానికి జైనులాబిదీన్ వివక్షను చూపలేదు. ఇస్లామీయులను గౌరవించినట్లే, ఇస్లామేతరులను గౌరవించాడు. కానీ ఇస్లామేతరులను తమతో సమానంగా చూడటం ఇస్లామీయులకు నచ్చలేదు.
ఇస్లాం శాస్త్రాల ప్రకారం ఇస్లాం రాజ్యంలో నివసిస్తున్న ఇస్లామేతరులంతా ‘ధిమ్మీ’లు. రాజ్యం నిర్దేశించిన పన్ను (జిజియా) కడితే చాలు వీరు తమ మతాన్ని, ధర్మాన్ని స్వేచ్ఛగా పాటించుకోవచ్చు. అయితే, రాజ్యం వీరిని పౌరులుగా పరిగణించదు. వీరు సైన్యంలో, ఇతర రాజ్య కార్యకలాపాలలో పాల్గొనే వీలు లేదు. ఇస్లామేతరులు తమ పవిత్ర స్థలాలలో పూజలు చేసుకోవచ్చు. కానీ కొత్తవి కట్టటం, పాతవాటిని పునరుద్ధరించటం పట్ల నియమాలున్నాయి. ‘షరియా’ న్యాయసూత్రాలు ఇస్లామేతరులకు వర్తిస్తాయి. ఇప్పటికీ సౌదీ అరేబియాలో ఇస్లామేతరులు బహిరంగంగా పూజలు నిర్వహించటం నిషేధం.
ముస్లిమేతరులతో వ్యవహించే విధానానికి మూల సూత్రం ఖురాన్ లోని 4: 141 సూరా (and God will not grant the nonbelievers any way over the believers) అన్నది. దీని ప్రకారం ఒక ఇస్లామీయుడిపై ఇస్లామేతరుడి ఆధిక్యాన్ని భగవంతుడు ఎన్నడూ ఆమోదించడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఇస్లామీయులు తమపై ఇస్లామేతరుల అధికారాన్ని ఆమోదించరు. ఇతరులకు అలా అధికారం చలాయించే అవకాశం ఇవ్వరు.
అందుకే జైనులాబిదీన్ ప్రజలందరినీ సమానంగా చూడటం ఇస్లాం మత ఛాందసవాదులు సహించలేకపోయారు. జైనులాబిదీన్‌ను దూషించారు. అతనికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. జైనులాబిదీన్ ఇలాంటి సంకుచిత భావాల వెల్లువ ఇస్లామేతరులను ముంచెత్తకుండా అడ్డుగా నిలిచాడు కానీ జైనులాబిదీన్ మరణంతో ఆ అడ్డు తొలగింది. ఇప్పుడు ఆ శక్తులు విజృంభించాయి. ఇలాంటి పరిస్థితులలో శ్రీవరుడు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తించాల్సివుంటుంది. ఎవరిని విమర్శించినా, ఎవరికి అవమానంగా అనిపించినా తెగిపడుతుంది శ్రీవరుడి తల. ఎందుకంటే, ఇప్పుడు శ్రీవరుడు జైనులాబిదీన్ కాలంలో లేడు. అందుకని అనాలనుకున్నది అనేసినా, ‘కవి నిరంకుశుడు’ కాబట్టి క్షమించాలని వేడుకున్నాడు.
బహరిస్తాన్ – జైనులాబిదీన్ పాలనలో శక్తి పుంజుకున్న ఇస్లామేతరుల పట్ల నిరసన, జైనులాబిదీన్‌ను విమర్శించటం ఆ కాలంలో ఇస్లాం మత ఛాందసవాదులకు జైనులాబిదీన్ పట్ల, ఇస్లామేతరుల పట్ల ఉన్న క్రోధాన్ని స్పష్టం చేస్తుంది.
“జైనులాబిదీన్ పాలనలో ఇస్లామేతరుల ప్రాబల్యం పెరిగింది. ఇది ప్రవక్త అందించిన షరియా అమలుపై , ఇస్లాంపై దుష్ప్రభావం చూపిచింది. కాఫిర్లు జైనులాబిదీన్‌ను ‘గొప్ప రాజు’ అన్నారు. ఎందుకంటే అతడి పాలనలో వారు ఎంతో అభివృద్ధి చెందారు. సుఖం అనుభవించారు.
కాలక్రమేణా హిందువులు, కాఫిర్ల సంప్రదాయాలు ఎలాంటి అనైతిక, అవినీతి కరమైన ప్రభావం చూపించాయంటే, ఎంతో గొప్ప విజ్ఞానవంతులయిన ఉలేమాలు, సయ్యిద్‌లు, ఖాదీలు కూడా, ఇసుమంతయినా అసహ్యం లేకుండా కాఫిర్ల పద్ధతులు పాటించకుండా నిషేధించే వారెవరూ లేకుండాపోయారు. క్రమంగా ఇస్లాం బలహీనమయేందుకు, ఇస్లాం సూత్రాలు, సంప్రదాయాలు క్షయించేందుకు దారి తీసింది ఈ పరిస్థితి. అమీర్ శంసుద్దీన్ మహమ్మద్ ఇరానీ దయ వల్ల, కఠినమైన ప్రయత్నాల వల్ల ఇస్లాంలో జొరబడిన ఈ అపవిత్రమైన పద్ధతులు సమసిపోయాయి. ఈయన మార్గదర్శకత్వంలో మళ్లీ పవిత్ర ప్రవక్త బోధనలు, షరియా సూత్రాలు సరిగ్గా పాటించటం ఆరంభమయింది.”
జైనులాబిదీన్ కాలంలోని వ్యతిరేకత అతని మరణం తరువాత ఇస్లామేతరుల పట్ల ద్వేషంగా ప్రకటితమయింది. గమనిస్తే ‘బహరిస్తాన్’, చరిత్ర రచయితలు విస్మరించిన ఒక విషయాన్ని స్పష్టం చేస్తుంది.
భారతీయులు, తమకలవాటయిన సహనంతో ఇస్లామీయులను కూడా, దేశంపై దాడికి వచ్చిన స్థిరపడిన అనేక విదేశీయ మతాలను కలిపివేసుకున్నట్లే కలిపివేసుకోవటం ఆరంభించారు. ఇలాగే కొన్నాళ్లయి ఉంటే, గ్రీకులు, శకుల వంటి వాళ్లలాగా ఇస్లామీయులు కూడా భారతీయ ధర్మంలో మిళితమై అస్తిత్వాన్ని కోల్పోయేవారు. కానీ అలా కాకుండా ఆపింది, వెల్లువలా ఇస్లామ్ దేశాల నుంచి భారత్‌కు వచ్చి చేరుతున్న వారి మత గురువులు. అంతకు ముందు భారత్‌కు వచ్చిన విదేశీయులు ఇక్కడ స్థిరపడిపోవటంతో, వారి మూలాల నుంచి వారికి సంబంధం తెగిపోయింది. వారు తమని తాము మరచిపోయారు. ఇందుకు భిన్నంగా ఇస్లామీయులు భారతదేశంలో ప్రాంతాలను గెలుచుకుంటుంటే ప్రపంచంలోని ఇతర దేశాలనుంచి నుంచి ఇస్లామీయులు పెద్ద ఎత్తున భారత్ వస్తూనే ఉన్నారు. తమతో పాటు సంకుచితత్వాన్ని పెంచుతూ ఇస్లాంను ప్రత్యేకంగా నిలిపారు.
సికందర్ బుత్‌షికన్ ఆరంభంలో సహనం ప్రదర్శించాడు. కానీ సూఫీ ‘హమదాని’ ప్రవేశంతో పరిస్థితి మారిపోయింది. సుల్తాన్ సికందర్‌కు సన్నిహితుడై అతని మతగురువై రాజ్యంలో ఇస్లాం సూత్రాలను కఠినంగా అమలుపరిచేటట్టు చేశాడు. కాఫిర్ల మదం అణచాలని బోధించాడు. ఫలితంగా సుల్తాన్ సికందర్ – సికిందర్ బుత్‌షికన్ అయ్యాడు. అతని పాలన కాలం అంతం అయ్యే సమయానికి కశ్మీరులో 13 పండితుల కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ ఎలాంటి హక్కులు, రక్షణలు లేక మిగిలాయి.
జైనులాబిదీన్ ఈ పరిస్థితిని సంపూర్ణంగా మార్చాడు. దేశం వదిలిపోయిన పండితులను కశ్మీరుకు ఆహ్వానించాడు. భారతదేశంలోని నలు మూలల నుంచి పండితులను, మేధావులను, విజ్ఞానవంతులను కశ్మీరు రప్పించాడు. గౌరవించాడు. వారికి రక్షణనిచ్చాడు. ఈ సమయంలో ఇతర దేశాల నుంచి వచ్చిన ఇస్లాం పండితులను గౌరవించాడు. కానీ కాఫిర్లతో తమను సమానంగా చూడటం వారు ఆమోదించలేకపోయారు. జైనులాబిదీన్ మరణం తరువాత వారు విజృంబించారు. కానీ, ఇస్లాం సమాజంలో మిళితమై రూపాంతరం చెందితున్న భారతీయ సంస్కృతి సంప్రదాయాలను వారు ఏమీ చేయలేకపోయారు.
చివరికి ‘హసన్ షాహ’ పాలన సమయంలో ఖురసాన్ నుంచి వచ్చిన ‘శంసుద్దీన్ ఇరానీ’ కశ్మీర్‌లో అడుగుపెట్టటంతో పరిస్థితి మారిపోయింది. కాఫిర్ల పద్ధతులను అమలుపరచి ఇస్లామ్‌ను కలుషితం చేయటాన్ని తీవ్రంగా వ్యతిరేకించి పరిస్థితిని చక్కబెట్టేందుకు కంకణం క్టటుకున్నాడాయన. అందుకే అమీర్ శంసుద్దీన్ మొహమ్మద్ ఇరానీ దయవల్ల కఠినమైన ప్రయాత్నాల వల్ల ఇస్లాంలో చొరబడిన అపవిత్రమైన పద్ధతులు సమసిపోయాయని అంటుంది బహరిస్తాన్.
ఇది అప్పుడే కాదు, ఇప్పటి సమాజంలో కూడా కనిపిస్తుంది. ఇస్లామీయులు ఏమాత్రం పరమత సహనం ప్రదర్శించినా వెంటనే ‘ఫత్వా’లు జారీ అవుతాయి. ఇస్లామీయులను, వారి పద్ధతులను విమర్శించాలంటే ప్రతి ఒక్కరు భయపడతారు. ఎవరైనా వ్యాఖ్యానించినా వెంటనే తమ తప్పు సరిద్దుకుంటారు. కానీ ఇతర మతాలు, ముఖ్యంగా భారతీయ ధర్మాన్ని విమర్శించేందుకు జంకే లేదు. అర్థం పర్థం లేకుండా నోటికి ఎంత వస్తే అంత వాగే స్వేచ్ఛను భారతీయ ధర్మం విషయంలో చూపిన ధీరులు, ఇస్లాంతో సహా ఇతర మతాల విమర్శలో చూపరు. ఎందుకంటే ఇస్లామీయులు విమర్శను సహించరు. తీవ్రంగా స్పందిస్తారు. ఆ కాలంలో నుంచీ ఈ కాలం వలకూ ఈ తీవ్ర స్పందనను మనం గమనించవచ్చు. అందుకే శ్రీవరుడు ‘క్షంతవ్య మౌసులైర్యస్మాత్’ అన్నాడు.
ఇలాంటి భీరువు మనస్తత్వాన్ని శ్రీవరుడు ప్రదర్శించాడంటే అర్థం ఉంది. అతడు మధ్యయుగంలో సుల్తానుల పాలన కాలంలో ఉన్నాడు. కానీ 21వ శతాబ్దంలో, ప్రజాస్వామ్యంలో కూడా ఇదే మనస్తత్వం కనబడటం, అవే ఛాయలు సమాజంలో నెలకొని ఉండటం. ఎంతగా భారతీయ మనస్తత్వం బానిసత్వంలో కూరుకుపోయి ఉందో స్పష్టం చేస్తుంది. ఇప్పటికి కూడా, ఇస్లామీయుల కన్నా అధికంగా, ఇస్లామేతరులే విమర్శను సహించకపోవటం ఈ మనస్తత్వానికి అద్దం పడుతుంది.
తమిళనాడు లో ‘కార్తీక దీపం’ వివాదం ఈ మనస్తత్వానికి దర్పణం పడుతుంది. ఇస్లామీయుల నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకున్నా ప్రభుత్వం ఈ 13వ శతాబ్దపు ‘దర్గా’ సమీపంలో దీపాన్ని వెలిగించేందుకు అభ్యంతరాలు ప్రకటించింది. ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానించారు అధికారులు. చివరికి తీర్పునిచ్చిన న్యాయధీశుడిని కూడా దూషించారు. ఈ విషయంలో ఇస్లామీయులు మౌనంగానే ఉన్నారు. దీపం వెలిగించటం పట్ల అభ్యంతరాలు తెలపలేదు. దాన్లో గోల అంతా ప్రభుత్వందే. చివరికి కోర్టు హెచ్చరించినా ప్రభుత్వ ప్రవర్తన మారలేదు. ఇలాంటి బానిస మనస్తత్వ ప్రవర్తనకు భయపడే శ్రీవరుడు ముస్లింలను క్షమించమని అడిగాడు. వారు క్షమిస్తారు. క్షమించనివారు ఈ భీరువు బానిసపు మనస్తత్వం కలవారే!
యే రాజవైభవమవాప్య నిపీడ్య లోకం
కుర్వన్తి సంచయమతో న చ దానభోగీ।
అత్యుత్కటాఘ భరతత్ఫలలబ్ధదుఃఖా-
స్తే కోశరక్షణనిభాద్ వితరన్తి రాజ్ఞః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 98)
ఎవరైతే ప్రజలను అణచి, దోచి ధనం సంపాదిస్తారో, తాము అన్యాయంగా సంపాదించిన ధనాన్ని దాన ధర్మాలకు కొంతయినా వినియోగించరో, అలాంటివారు తాము చేసిన పాపాలకు తగిన ఫలితాన్ని అనుభవిస్తారు. ఇది రాజులకు కూడా వర్తిస్తుంది.
ఎంత కసి ఉంటే ఇలాంటి మాటలంటాడు శ్రీవరుడు!
భారతీయులు కర్మ సిద్దాంతాన్ని నమ్ముతారు. మంచి పనికి మంచి ఫలితం, చెడు పనికి చెడు ఫలితం ఉంటుందని నమ్ముతారు. కానీ ప్రపంచంలో దుష్టులు అన్ని సౌఖ్యాలు అనుభవిస్తున్నట్టు, మంచివారు కష్టాలు పడుతున్నట్టు అనిపిస్తుంది. మనిషి జీవిత కాలం చిన్నది. అందువల్ల ఈ సిద్ధాంతం అమలవటం గమనించలేకపోతాడు. కానీ, కొన్ని సందర్భాలలో తన జీవిత కాలంలోనే దుష్టుడు పాపఫలితాన్ని అనుభవించటం చూడగలుగుతారు. అలాంటి సందర్భాన్ని ప్రస్తావిస్తున్నాడు శ్రీవరుడు. కర్మ ఫలితాన్ని అనుభవించటంతో సుల్తాన్ కూడా సామాన్యులాంటివాడే అని అంటున్నాడు జాగ్రత్తగా.
ఎలా సంపాదించిన ఐశ్వర్యం అలాగే పోతుంది. అక్రమంగా సంపాదించినా కనీసం దాన్ని దాన ధర్మాలు చేస్తే పాపం కొంత తగ్గుతుంది. అది కూడా చేయని వారు ఆ పాప ఫలితాన్ని సంపూర్ణంగా అనుభవిస్తారని అంటున్నాడు శ్రీవరుడు తరువాత శ్లోకాల్లో అందుకు ఉదాహరణలు కూడా చూపించాడు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
