Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-105

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

తచ్ఛ్రుత్వా యవనాః సర్వే గత్వా క్రుద్ధా నృపాన్తికమ్।
చుకుశుర్యేన రాజాపి ద్విజపీడనమాదిశత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 123)

హిందువులు ‘ఖాన్‌కాహ్’లపై, ఇతర ఇస్లామీయుల కట్టడాలపై దాడులు చేసి నష్టపరిచారన్న వార్త విన్న ఇతర ముస్లింలు రోదిస్తూ ఈ వార్త రాజుకు చెప్పారు. ఇది విన్న రాజు క్రుద్ధుడై బ్రాహ్మణులను హింసించమని ఆజ్ఞలు జారీ చేశారు.

‘ద్విజపీడనమాదిశత్’ – ద్విజులను పీడించమని అదేశాలిచ్చాడు సుల్తాన్.

ఈ విషయం ‘History Muslim Rule in Kashmir’ అనే పుస్తకంలో మరో రకంగా రాశాడు R.K. Parmu.

“Luli (శ్రీవరుడు ‘పూర్ణ’ అన్నాడు, R. K. Parmu ‘లూలి’ అన్నాడు) turned his wickedness against the Hindus. They were persecuted, their temples and idols were desecrated and their lands were confiscated. Hard-pressed by social injustice and official repression many Hindus renounced their faith and those who managed to save their caste adopted Muslim style of dress.”

ఇక్కడ Parmu, ‘social injustice’ అన్న పదం లౌకికవాదుల కోసం వాడినపదం. నిజానికి కశ్మీరులో హిందువులు అంటే పండితులే. అందరూ బ్రాహ్మణులే. ఒక పద్ధతి ప్రకారం కశ్మీరులో ‘కులం’ ప్రాధాన్యం తొలగి అందరినీ పండితులనే అనేవారు. ఇక్కడ ముస్లింల అణచివేతకు వెరచి మతం మారేరన్న నిజంలో చేదు తీవ్రత తగ్గించేందుకు social injustice అన్న పదం వాడేడు. ‘బహరిస్తాన్’లో social injustice అన్న పదం కనబడదు కానీ, సుల్తానుల పాలనలో ముస్లిమేతరులకు ఎలాంటి హక్కులు, రక్షణలు లేకపోవటం వల్ల సామూహికంగా అన్యాయానికి గురయినవారు మతం మారటం వల్ల అన్యాయాన్ని తప్పించుకున్నారని ఉంది. అంటే, ఏ రకంగా చూసినా హిందూ ధర్మం వదలి ఇస్లాం స్వీకరించటం వెనుక అణచివేతలు, బెదిరింపులు, అన్యాయాలు అధికంగా ఉండేవన్నది స్పష్టం అవుతుంది.

శ్రీవరుడు చేప్పిన ఈ శ్లోకంలో గమనించాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ‘పూర్ణ’ హిందువులను రెచ్చగొట్టాడు. వీరు దాడులు చేశారు. దాంతో ఇస్లామీయులు సుల్తాన్ దగ్గరకు వెళ్లి రోదిస్తూ జరిగింది చెప్తారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మన కళ్ల ముందు ఇదే కనిపిస్తుంది.

దాడి ఎవరు చేసినా, ఎవరు నష్టపోయినా ప్రపంచం   ముందు నష్టపోయినా వారిలా కనిపించేది ఇస్లామీయులే! దీన్ని మానసిక శాస్త్ర పరిభాషలో ‘forever victim syndrome’, ‘victim complex’ లేక ‘interpersonal victim hood’ అంటారు.అంటే తాము ఇతరులను కొట్టినా, అందుకు ప్రతిగా ఇతరులు తమను కొట్టినా ‘బాధితులు’ మాత్రం ఇస్లామీయులే!! ఇతరులను తాము కొట్టవచ్చు. హింసించవచ్చు. కానీ, వారు ప్రతిచర్యలు చేపట్టటం అన్యాయం. తాము బాధితులయిపోతారు.

క్రికెట్ ఆటలో ‘మ్యాచ్ ఫిక్సింగ్’ నేరం వెలుపలికి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎందరో క్రికెటర్లను నేరస్థులుగా నిర్ధారించారు. కానీ ‘నేను మైనారిటీని కాబట్టి నన్ను నేరస్థుడిని చేశారు’ అన్నది ఒకరే.  ఆటకు దూరమయిన ఇతరులెవరూ తమ కులం వల్లనో మతం వల్లనో వివక్ష ప్రదర్శించటం వల్ల తమకు  అన్యాయమయిపోయిందని, తమతో పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించలేదు. విక్టిం కార్డ్ వాడలేదు.

ఇటీవలె ఎ.ఆర్. రహమాన్ సైతం తాను ముస్లిం అయినందుకు తనకు బొంబాయి సినీ పరిశ్రమలో అవకాశాలు రావటం లేదన్నాడు. కానీ నిజం వేరుగా ఉంది. చివరికి మాజీ ఉపరాష్ట్రపతి నుంచి గల్లీలోని సామాన్యుడి వరకూ ఈ ‘విక్టమ్’ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తారు.

‘హమాస్’ అనే తీవ్రవాద సంస్థ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. సామాన్యులను బందీగా తీసుకుంది. ఫలితంగా హమాస్ స్థావరాలపై ఇజ్రాయిల్ దాడి చేసింది. ప్రపంచం మొత్తం అమాయకులపై ఇజ్రయెల్ దాడులను ఖండించింది. కానీ దానికి కారణమైన హమాస్‌ను దోషిగా ఎంచినవారు లేరు. చివరికి దెబ్బలు తింటూ సర్వం కోల్పోతున్న ప్రజలు కూడా ఏడుస్తున్నారు,  ఇజ్రాఎల్ ను  దూషిస్తున్నారు,  కానీ ‘హమాస్’ను దోషిగా నిలిపినవారు లేరు. ‘మీవల్ల మేం కష్టాలు పడుతున్నాం. మామానాన మమ్మల్ని బ్రతకనివ్వండి. పొండి’ అని హమాస్ తో అన్నవారు లేరు. నేరం ఇజ్రాఎల్ ది. తమపై తీవ్రవాదులు దాడులు చేస్తే, మౌనంగా భరిస్తూండక, దాడులు చేసి, అంతా బూడిద చేస్తారా? ఇజ్రాఎల్ వారు రాక్షసులు. మానవత్వంలేనివారు. అందుకని  బాధితులు ఇస్లామీయులే.

ఇప్పుడు ఇరాన్ పై దాడిని వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. కానీ ఇరాన్  సమర్థన ఉన్న హిజ్బుల్లా, హమాస్, హౌతి వంటి ఉగ్రవాద సంస్థలు జరుపుతున్న హింసాత్మక చర్యలను ఎవరూ పట్టించుకోవటం లేదు.  ఒక దేశానికి ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించాల్సిన  అవసరం ఏముందని ప్రశ్నించటం లేదు. ఇప్పుడూ ఇజ్రాఎల్  ఇరాన్ తో   పోరాడుతున్నదంటే ఇరాన్ తో సహా ఈ తీవ్రవాద సంస్థలన్నిటితో పోరాడుతున్నట్టన్నమాట.  ఈ సంస్థల ప్రధాన ఉద్దేశం ఇజ్రాయెల్‌ను ప్రపంచ పటం నుండి తుడిచి పెట్టేయటం.  ఇలా, ‘తీవ్రవాద సంస్థలను పెంచిపోషించటం తప్పు’ అని అన్నవారు లేరు. తీవ్రవాద సంస్థలు, దేశాలతో సమానంగా పోరాడటం చూస్తూంటే, వాటిని పెంచి పోషిస్తున్న దేశాలపై సానుభూతి చూపటం ఆత్మహత్య సదృశం అని అర్ధమవుతుంది. కానీ, దొషి ఇజ్రాఎల్. బాధితులు ఇస్లామీయులు. గమనిస్తే, తోటి ముస్లీం దేశాలపై ఇరాన్ దాడులు చేయవచ్చు. ఎవరూ ఖండించరు. కానీ, ఇస్లామేతరులపై తాము దాడులు చేయవచ్చు. తిరిగి తమపై వారు దాడిచేస్తే, తాము బాధితులు!!

పాకిస్తాన్ కూడా తీవ్రవాద సంస్థలను  తన దేశంలో పెంచి పోషిస్తున్నది. మనం పాకిస్తాన్‌ తీవ్రవాదాన్ని  భరిస్తున్నాం, సహనం వల్లనో, చేతకానితనం వల్లనో.కానీ, తాను పెంచి పోషించిన తాలిబన్  ఇప్పుడు తనకు వ్యతిరేకమవగానే, తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని అఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ దాడి చేసింది. ఇస్లాం దేశాలు తమలో తాము కొట్టుకుంటే మౌనం.  అదే  మనపైకి తీవ్రవాదులను పంపుతున్నదని పాకిస్తాన్ పై  మనం దాడి చేస్తే, మనపై జరిగిన  తీవ్రవాద దాడిని మరచి పాకిస్తాన్ బాధితుడిలా విలపిస్తుంది. వారికి మనదేశంలో లౌకికవాదుల సమర్ధన లభిస్తుంది.బాంబులక్కడపడితే, విస్ఫోటనం ఇక్కడ జరుగుతుంది.

ఇటీవలె ఢిల్లీలోని ఉత్తమ నగర్ సంఘటన లోనూ ఇదే కనిపిస్తుంది. ఒకడిని పండుగ రోజు అన్యాయంగా చంపామన్న పశ్చాత్తాపం లేదు. ఇల్లు కూల్చేశారని, తమ  పండుగకు అడ్డు పడతామన్నారని, తమకూ రక్షణ కావాలని, రక్షణ లేదని, తమకు పండుగ జరపుకునే స్వేచ్ఛ లేదని ఇన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొరపాటున రంగు నీళ్లు పడితే మనిషిని కొట్టి చంపటం ఏ రకంగా సమర్థనీయమన్న ప్రశ్న మాత్రం అడగటం లేదెవ్వరూ. ఒక్కడిపై నలభైమంది దాడి చేసి చంపినా బాధితులు ఇస్లామీయులే!

అంతెందుకు, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం సమయంలో ‘ఆంధ్రావాళ్ళు తెలంగాణా వదలివెళ్ళిపోవాలని తీవ్రంగా డిమాండ్ చేసిన ఒక ముస్లీం ఆందోళనజీవి, మన దేశంలోకి అక్రమంగా చొరబడ్డ రోహింగ్యాలనూ, పాకిస్తాన్ వారిని వెతికి వెనక్కు పంపిస్తూంటే, కన్నీళ్ళ కథనాలు రాసి వాళ్ళని వాళ్ళదేశం పొమ్మనటం అమానుషం అని రోదించాడు. మనదేశం వారిని మనం భరించలేము, పరాయిదేశం వారు ముస్లీములయితే వారి దేశానికి వారిని పొమ్మనటం అన్యాయం. మన దేశంలో మనకు అన్ని రాష్ట్రాలలో వుండే స్వేచ్చలేదుకానీ, వేరే దేశంవారికోసమే మనదేశం అన్నమాట. ఇక్కడ కూడా బాధితులు ఇస్లామీయులే!

అంతెందుకు కొద్ది రోజులక్రితం విజయవాడలో తీవ్రవాద సంస్థతో సంబంధం ఉన్న ముగ్గురు ముస్లీం యువకులు పట్టుబడితే, హిందువులు చేస్తున్న ఆరోపణలు, అవమానాల వల్లనే  వారు తీవ్రవాదంవైపు మొగ్గు చూపించారని తీర్మానించారు లౌకిక లిబెరల్ మేధావులు. ఇక్కడా బాధితులు ముస్లీం యువకులే!

ఇక్కడ ఎవ్వరూ నిత్య బాధితులను అడగని ప్రశ్న ఏమిటంటే, అన్యాయం జరిగిందనిపించిన ప్రతి ఒక్కడూ పొరుగు దేశం పోయి, వారితో చేతులు కలిపి ఈ దేశంలో హింస నెరపటం ఏరకంగా సమర్ధనీయం? ఈ దేశంలో న్యాయవ్యవస్థ, చట్టాలూ ఎందుకూ పనికిరావా? అన్యాయం జరిగితే, అవమానం జరిగితే, ఈ దేశంపై దాడిచేయటం , నేను బాధితుడిని అనటం న్యాయమా? లౌకిక మేధావులే సమాధానం చెప్పాలి.

ఈకంగా, ముల్లు అరిటాకు మీద పడ్డా, అరిటాకు ముల్లు మీదపడ్డా  అన్నివేళలా బాధితులు ఇస్లామీయులే , నిరంతర బాధితులు ఇస్లామీయులే అన్న ఆలోచన ప్రపంచం అంతా కనిపిస్తుంది.

ఇదే మనస్తత్వం శ్రీవరుడి రాజతరంగిణిలోనూ కనిపిస్తుంది.

రెచ్చగొట్టింది మతం మారిన మంగలివాడు ‘పూర్ణ’. రెచ్చిపోయి దాడులు చేసింది హిందువులు. ఏడుస్తూ సుల్తానుకు ఫిర్యాదు చేసింది ఇస్లామీయులు. ‘ఏమైంది?’ అని అడగకుండా ‘ద్విజపీడనం’ అదేశించాడు సుల్తాన్.

గోద్రాలో రైలులో సజీవ దహనం చేయటం కన్నా సజీవ దహన చర్యకు ప్రతిగా ఆవేశం ప్రదర్శించటం తప్పు. మసీదుల నుండి, ఇళ్ల పై నుండి రాళ్లు రువ్వటం కన్నా రాళ్లు రువ్వినందుకు పోలీసులు చర్యలు తీసుకుంటే తప్పు. లౌకిక రాజ్యంలో కూడా ఇదే మనస్తత్వం. ఇటీవలి లండన్‌లో హలాల్ మాసం అమ్మని సిక్కుపై ఇస్లామీయులు ఆగ్రహం ప్రదర్శిస్తే పోలీసులు దుకాణం యజమానిని అరెస్టు చేశారు.

ఇక్కడ మనం మరో విషయం ప్రస్తావించుకోవాల్సివుంటుంది. భారతదేశంలో మతకల్లోలాలు పదిహేడవ శతాబ్దం నుంచీ ప్రారంభమయ్యాయని అంటారు. ఇప్పుడు శ్రీవరుడు ప్రస్తావించినది మతం ఆధారంగా జరిగిన హింస అయినా, మతకల్లోలం అనే వీలులేదు. ఎందుకంటే, మతకల్లోలాల్లో రెండువర్గాలుండాలి. ఇక్కడ హిందువులు ఖన్ ఖాలపై దాడి చేశారు. ముస్లీములు రాజుకు చెప్పారు. రాజు దండన విధించాడు.

ఈ సంఘటన మరొక విషయం స్పష్టం చేస్తుంది.

హిందువులు ఖన్ ఖాలకు హాని చేయటం. సికందర్ బుత్ షికన్ కాలంలో రాజు అనుమతితో హిందువులను వేటాడటం వల్ల వారు ప్రాణాలు అరచేత పెట్టుకుని కశ్మీరు వదలి పారిపోయారు. తరువాత జైనులాబిదీన్ అందరినీ వెనక్కు రప్పించి వారికి గౌరవమర్యాదభద్రతలిచ్చాడు. సికందర్ బుత్ షికన్ కాలంలో ఇస్లాం సంకుచిత వాద ఫలితాలను అనుభవించిన తరం జైనులాబిదీన్ పాలనకాలంలో అదృశ్యమై పోయింది. జోనరాజు ఆ తరానికి చెందినవాడు. ఇప్పుడున్నవారు జైనులాబిదీన్ పాలనాకాలంలో జన్మించినవారు. వీరికి ఇస్లాం ఛాందసవాదఫలం తెలియదు. జైనులాబిదీన్ కాలంలో భద్రతతో, ఆత్మవిశ్వాసంతో పెరిగారు. ఇస్లాం రాజ్యంలో తాము ద్వితీయశ్రేణి పౌరులకన్నా తక్కువ అన్న ఊహ వీరికిలేదు. ఇస్లామీయులు తాము సమానులం అన్న భావనతో పెరిగారు. అందుకే, పూర్ణ రెచ్చగొట్టగానే రెచ్చిపోయారు. తాము తక్కువకాదని దాడి చేశారు. ఒకవేళ వీరు సుల్తాన్ కు ఫిర్యాదు చేస్తే, సుల్తాన్ కు తమ వాదన వినిపించవచ్చని అనుకునిఉంటారు. కానీ, ఇప్పుడున్న  సుల్తాన్ జైనులాబిదీన్ కాదు. పరమతసహనం ఉన్నవాడు కాదు. అసలు రెండోవైపు వాదన వినలేదు. ఏమిటి? ఎందుకు? అన్న ప్రశ్నలు వేయలేదు. వీళ్ళు ఏడ్చారు. ఆయన పోయి చంపమన్నాడు. అంతే, ఇప్పుడు ఈ తరానికి నిజానిజాలు గ్రహింపుకు వచ్చాయి. ఈ విషయాలను శ్రీవరుడు బహిరంగంగా శ్లోకంలో రాయలేదు. కానీ, శ్లోకంలో చెప్పిన విషయాలద్వారా ఇదంతా గ్రహించే వీలుండేట్టు రచించాడు.

ఇక ‘ద్విజపీడనం’ ఎలా జరిగిందో వర్ణిస్తాడు శ్రీవరుడు.

అజరామరవుద్ధాదీన్ బ్రాహ్మణాన్ సేవకానపి।
తత్కోపేనాకరోద్ రాజా నికృత్తభుజనాసికాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 124)

కోపంతో రాజు, అజర, అమర, బుద్ధతో సహా ఇంకొందరి చేతులు, ముక్కులు కత్తిరించాడు. చివరికి సేవకుల చేతులు, ముక్కలు కూడా కోసివేశాడు.

అజర, అమర, బుద్ధ అన్నవాళ్ళు రాజు దగ్గర ఉండే ప్రధాన సేవకులు. వీరికి అల్లర్లతో ఎలాంటి సంబంధం లేదు. కానీ ‘హిందువులు’ అయినందుకు వారి చేతులు ముక్కులు కత్తిరింపించాడు. వీరితో పాటు ఇతర సేవకుల చేతులు, ముక్కులు కూడా కోయించాడు.

మన దేశంలో తీవ్రవాదికి మతం లేదన్న మాట తీవ్రవాద చర్య జరిగినప్పుడల్లా ఎక్కువగా వినిపిస్తుంది. తీవ్రవాద చర్చ జరిగినప్పుడల్లా వినిపిస్తుంది. కానీ ఇస్లామీయులకు ఆగ్రహం కలిగినప్పుడు ఎదుటివాడి మతమే తప్ప వాడు నేరస్థుడా? అమాయకుడా? అన్నది పట్టించుకోరు.

కశ్మీరులో ‘పహల్‌గామ్’ వద్ద ప్యాంట్లు విప్పించి, హిందువులని నిర్ధారించుకుని మరీ చంపారు. అక్కడ వారు ఏ నేరం చేశారని చంపారు?

నలభై మంది కలసి ఒక్క అమాయకుడిని కొట్టి చంపారు, ఉత్తమనగర్, ఢిల్లీలో. అతడి నేరం ఏమిటి? అసలు జరిగిన సంఘటన కూడా అతడికి తెలియదు.

కశ్మీరులో 15వశతాబ్దిలో శ్రీవరుడు తన రాజతరంగిణిలో ప్రదర్శించిన ప్రవర్తన ఈనాటికీ వర్తిస్తుంది.

త్యక్తస్త్రజాతివేశాస్తద్దినేషు త్రాహ్మణాదయః।
న భట్టోహం న భట్టోహమిత్యూచుర్భద్వలుంఠనే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 125)

ఆ సమయంలో బ్రహ్మణులు తమ వేషాలు మార్చి ‘నేను భట్టు కాదు, మేము భట్టు కాదు’ అని చెప్పుకునేవారు.

సుల్తాన్ శిక్షనుంచి తప్పించుకునేందుకు హిందువులు సైతం ఇస్లామీయులలా వేషాలు వేయటం అన్నది అప్పటినుంచీ కొనసాగింది. అందుకే, కశ్మీరులో వేషభాశలనుబట్టి హిందూ ముస్లీములను వేరుచేసి చెప్పటం కష్టం.

ఈనాడు ఇది చదివితే ఎవరికయినా నవ్వు రావచ్చు. వాళ్లు పిరికివాళ్లు. ప్రాణం పోయినా సరే తమ ‘గుర్తింపు’ను మార్పుకోకుండా ఉండాల్సింది అని వాదించవచ్చు. కానీ ఆనాటి పరిస్థితులను ప్రత్యక్షంగా అనుభవించిన వారికే వారి ‘ధైర్యం’ అర్థమవుతుంది.

మొదటి బహదూర్ షాహ సిక్కు వీరులను ఎదుర్కోలేక ‘సిక్కుల’ తలలను తెచ్చి ఇచ్చిన వారికి ధన బహుమతి ప్రకటించాడు. దాంతో ఇస్లామీయులు ‘గడ్డం’ ఉన్న ప్రతీవాడినీ సిక్కుగా భావించి వారి తలలు కోసి తెచ్చిచ్చిన ధనం తీసుకునేవారు. ఈ సమయంలో సిక్కులు అనేకులు తమ గడ్డం తీసేశారు. వారిని ‘పిరికివార’ని అనగలమా? గడ్డం ఉంచకుని ప్రాణాలు విడిచివేయాల్సింది అని వాదించగలమా?

ఇటీవలి సమాజంలో ఇలాంటి ప్రశ్నలు జైళ్లల్లో అష్టకష్టాలు పడి, తప్పనిసరి పరిస్థితులలో క్షమాభిక్ష వేడుకుని బయటకు వచ్చిన స్వతంత్ర వీరులపై విమర్షలబాణాలు  సంధిస్తూ వారు పిరికివారని తీర్మానాలు చేస్తున్నారు. అనుభవించిన వాడికే తెలుస్తుంది నొప్పి!

బహుఖాత ముఖ్యా యే పురే సన్తీష్టదేవతాః।
తన్మూర్తిలోఠనం రాజా మ్లేచ్ఛప్రేరణయాదిశత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 126)

మ్లేచ్ఛుల ప్రేరణతో, నగరంలో ఉన్న ఐశ్వర్యవంతమైన బహుఖాతక మందిరం విగ్రహాలను కొల్లగొట్టమని రాజు ఆజ్ఞాపించాడు. ఈ మందిరం అనేక ప్రజల ఇష్టదేవత.

శ్రీనగరంలో బహుఖాతక మందిరం ఒకప్పుడు అతి ఐశ్వర్యవంతమైన మందిరం. ప్రస్తుతం శ్రీనగర్‌లో ‘భైరవ’ మందిరం దగ్గరలో ఉంటుందీ మందిరం. ఇక్కడికి దగ్గర్లో రూపాదేవి మందిరం కూడా ఉంటుంది. ఈ మందిరం దగ్గర పెద్ద జాతరలయ్యేవి. కశ్మీరీ పండితులంతా ఈ జాతరలో పాల్గొనేవారు.

ఇప్పుడు మ్లేచ్ఛుల ప్రేరణతో రాజు ధ్వంసం చేయమని ఆజ్ఞాపించిన మందిరంతో శ్రీవరుడికి సన్నిహిత సంబంధం ఉంది. శ్రీవరుడితో కలసి జైనులాబిదీన్ ఈ  మందిరాన్ని దర్శించుకున్నాడు పలుమార్లు. ఆ మందిరాన్ని ఇప్పుడు ధ్వంసం చేయమన్నాడు రాజు.

ఇలాంటి సంఘటనలు చదువుతున్నప్పుడు అప్పటి వారి మనస్సుల్లో  ఎలాంటి భావనలు చెలరేగి ఉంటాయో అన్న ఆలోచన వస్తుంది. రాజాజ్ఞ కాదనలేరు. కానీ దైవంతో అనుబంధం. మరచిపోలేరు. బ్రతకాలంటే రాజాజ్ఞను పాటించాలి. కానీ దైవాన్ని కోల్పోయి బ్రతకటం అంటే జీవచ్ఛవంలా బ్రతకటమే. ఇలాంటి అనేకానేక అకృత్యాలను, అన్యాయాలను తట్టుకుని తమ స్వధర్మాన్ని సజీవంగా తరువాత తరాలకి అందించిన వారి పట్టుదల, ధర్మ భక్తి ఈనాడు కాస్త కష్టం కలిగితే  దైవాన్ని దూషించే వారికి అర్థం కాదు.

దత్తా భూర్జైవ భూపేన యేషాం గుణపరీక్షయా।
తేభ్యస్తాం నిర్నిమిత్తేనాప్యహరన్నాధికారిణః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 127)

ఎవరెవరి పాండిత్యాన్ని మెచ్చి జైనులాబిదీన్ భూదానాలిచ్చాడో, ఇప్పటి రాజు సేవకులు అకారణంగా వాటన్నింటినీ అపహరించారు.

ఇది కూడా సుల్తానుల పాలన కాలంలో సర్వ సామాన్యంగా జరిగేది. జైనులాబిదీన్ ఇస్లామేతరులకి దానాలిచ్చిన భూములు మాత్రమే అపహరించారని శ్రీవరుడు స్పష్టంగా చెప్పలేదు. పెర్షియన్ చరిత్ర రచయితలు రాశారు.

ఇస్లాం రాజ్యంలో ఇస్లామేతరులు  ద్వితీయ శ్రేణి పౌరులు కూడా కాదు. వారికి ఎలాంటి భద్రత ఉండదు. ‘జిజియా’ పన్ను కడితే రక్షణ ఉంటుంది. కానీ, వారి ఆస్తులను ఎవరైనా ఎప్పుడైనా హస్తగతం చేసుకోవచ్చు. ఇస్లామీయుడిపై ఫిర్యాదు చేయరాదు.  చట్టం ప్రకారం ఇస్లామేతరులకు  ఫిర్యాదు చేసే హక్కు ఉన్నా, ‘నేర నిరూపణ’ దగ్గరకు వచ్చే సరికి ఇస్లామేతరులే దెబ్బతింటారు. జైనులాబిదీన్ ఈ విషయంలో న్యాయసూత్రాలను తూ.చ. తప్పకుండా అమలు చేశాడు. అన్ని మతాల వారినీ సమానంగా చూశాడు. అది ఇస్లాం ఛాందసవాదులకు నచ్చలేదు. అందుకే జైనులాబిదీన్ మరణించగానే వారంతా తల లెత్తారు. జైనులాబిదీన్ చేసిన భూదానాలకు చెందిన భూములన్నీ తమ స్వంతం చేసుకున్నారు.

ఇది చదవగానే ఒక ఆలోచన వస్తుంది. జైనులాబిదీన్ మరణించగానే అతని దానాలు చెల్లనివి అవుతాయి. ఎవరిది రాజ్యం అయితే వారి మాటే శాసనం. కానీ భారత్‌లో,  ‘వక్స్ బోర్డు’ మొఘలులు దానం చేసిన భూములు అంటూ అనేక భూములు తనవి అని వాదిస్తుంది. మొఘలులు పోయారు. బ్రిటీష్‌వారు పోయారు. స్వతంత్రం వచ్చి డెబ్భయి అయిదేళ్లు దాటింది. కానీ ఇస్లామీయులకు  మొఘలులు చేసిన  ‘దానం’ ఈనాటికీ చెల్లుతోందీ దేశంలో.

స మాహిస ఫరో మాసః ప్రసిద్ధో మ్లేచ్ఛదర్శనే।
సర్వదర్శన విఘ్నాయ న కేషాం భయకార్యభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 128)

మ్లేచ్ఛదర్శనం ప్రకారం ‘మాహి సఫర్’ నెల వచ్చింది. ఇతర ధర్మాలన్నింటికీ విఘ్నం కలిగించే ఈ మాసం, ప్రతి ఒక్కరికీ భయకారణం అయింది.

ఈ శ్లోకంలో ‘సఫర్’ అన్నది అరబ్బీ పదం. ‘మహ్ – ఎ – సఫర్’ అన్నది ఇస్లామీ కాలగణన ప్రకారం, ఇస్లామీ సంవత్సరంలో రెండవ నెల. ఇది ముహార్రమ్ నెల తరువాత నెల. దీని తరువాత వచ్చే నెల ‘రబి’అల్ – అవ్వల్’. 12 నెలల ఇస్లామీ క్యాలెండర్‌లో ‘మహ్ – ఎ – సఫర్’ రెండవ నెల.

‘సఫర్’ అన్నది అరబ్బీ పదం. ‘సిఫ్ర్’ నుంచి వచ్చింది. ‘ఖాళీ’ అన్నది అర్ధం. చరిత్ర ప్రకారం ఈ నెల ఇళ్లు వదలి యుద్ధానికో, అహారాన్ని వెతికేందుకో వెళ్లేవారు. ఇళ్లు ఖాళీగా ఉండేవి. అందుకని ఈ నెలను ‘మాహ్ – ఎ -సఫర్’ నెల అంటారు.

‘సఫర్’ అన్న ప్రాధాన్యం ఏమిటంటే ‘ఇది వలస వెళ్లిన సమయం (హిజ్ర్)’.  మహమ్మద్ ప్రవక్త ఈ నెలలో మక్కా నుండి మదీనా వలస వెళ్లారు. ఈ నెలలో ఇస్లామీయులు తమ అంతరంగంలోకి  తరచి చూసుకుంటారు.

ఈ నెలలో వారి పండుగ కాబట్టి, ఇస్లామీయులు ఇతర మతాల వారికి విఘ్నాలు కలిగించే వారంటున్నాడు శ్రీవరుడు. అందుకే ఈ నెల ఇస్లామేతరులందరూ భయపడతారని అంటున్నాడు. నిజానికి ముహర్రం అనేది విషాదకరమైన పండుగ. ఈ సందర్భంగా ‘జంజీర్ -జాలి’ అంటే ఇనుప గొలుసులతో వ్యక్తులు తమని తాము కొట్టుకుంటారు, రక్తం విరజిమ్మేట్టు. ఇది సందర్భం తెలియని వారికి భయంకరంగా అనిపిస్తుంది. అయితే శ్రీవరుడు, ‘ఇతరధర్మాలన్నిటికీ విఘ్నం కలిగించే’ అన్నాడు. అంటే, బహుషా ఈ సందర్భంగా వీధుల్లో సామూహికంగా ప్రదర్శన చేస్తున్నవారు, ఇతరులెవరినీ మార్గంలోకి రానీయలేదేమో? లేక, వారిపై దాడులు చేసేవారేమో? వర్తమానంలో గతం ఉంటుంది కాబట్టి వర్తమానం ఆధారంగా గతాన్ని అర్ధం చేసుకునేవీలుంటుంది.  శ్రీవరుడు దాన్ని ప్రస్తావిస్తున్నాడు. శ్రీవరుడు ‘మతం’ అనే బదులు ‘దర్శనం’ అంటున్నాడు. ‘దర్శనం’ అంటే ‘తత్వం’, philosophy. ఇటీవలి కాలంలో religion ను మతం అనటం అనవాయితీ అయింది. కానీ శ్రీవరుడి కాలంలో మతం లేదు, ఉన్నది ‘దర్శనం’.

(ఇంకా ఉంది)

Exit mobile version