[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
భూపం నిత్యమదోన్మత్తం స్వతంత్రం మంత్రిమండలమ్।
ఉత్కోచహారిణః సర్వానన్తరంగస్తరంగితాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 129)
దర్శితా బలపీడార్తిం పండితానవలోక్య చ।
స్మృతశ్రీజైన భూపాలగుణమాలస్తదా జనః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 130)
రాజు నిత్యం మద్యం మత్తులో కనిపిస్తుంటే, మంత్రులు రాజుకు విధేయులుగా ఉండి రాజెలా చెప్తే అలా చేస్తుంటే, రాజు స్నేహితులు లంచాలు తీసుకుంటూ ఉంటే, వారు చంచల మనస్కులై, ప్రజలను పీడిస్తుంటే, ప్రజలు జైనులాబిదీన్ గుణగణాలను తలచుకుంటుండేవారు.
ఒక రాజు చక్కగా పాలిస్తాడు. ఆ తరువాత ప్రజలను పట్టించుకోని, తీవ్రంగా హింసించే రాజు పాలన ఆరంభమవుతుంది. అప్పుడు ప్రజలు, మొదటి రాజు బ్రతికి ఉన్నప్పటి కన్నా ఎక్కవగా ఆ రాజును తలచుకుంటారు. అతడి గుణగణాలను తలచుకుని తలచుకుని బాధపడతారు. కశ్మీరులో జరుగుతున్నది ఇదే.
రాజు తాగుబ్రోతు. విందులు, వినోదాలు, విలాసాలు తప్ప పాలన పట్టిలేదు. ఎప్పుడూ తాగుడు మత్తులో ఉంటాడు. రాజుకు ఎప్పుడు ఎవరి మీద ఎందుకు ఆగ్రహం కలుగుతుందో తెలియదు. కాబట్టి మంత్రులెవ్వరూ రాజుకు మంచి చెప్పే ప్రయత్నాలు చేయరు. సలహాల్విరు. రాజు ఏం చేస్తే దానికి తలలూపుతారు. దాంతో రాజు పేరు మీద అతని స్నేహితులు, (శ్రీవరుడు మంగలివాడు ‘పూర్ణ’ రాజును తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడని రాశాడు) తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. వారు ఏం చెప్తే రాజు దాన్ని నమ్మటంతో నచ్చనివారి గురించి చెడు చెప్పి రాజు ఆజ్ఞలను తీసుకుని హింసించేవారు. చంపేవారు. ఆస్తులు కాజేసేవారు.
అయితే, ఇక్కడ శ్రీవరుడు స్పష్టంగా చెప్పనిదేమిటంటే ప్రజలు అని అన్నాడు. కానీ ఇస్లామేతరులు అని స్పష్టంగా చెప్పలేదు. చెప్పలేడు కూడా. అసలే ఉన్నది ఇస్లాం రాజ్యంలో. రాజు విచక్షణా రహితుడు. కాబట్టి రాజు నుంచి రక్షణ లభించే ప్రసక్తి లేదు. ఇస్లామేతరులు జైనులాబిదీన్‌ను తలచుకుంటున్నారంటే, మొత్తం ఇస్లామేతరుల మీద ప్రభుత్వం విరుచుకు పడే వీలుంది. అదీగాక, జైనులాబిదీన్ మరణం వల్ల అతి తీవ్రంగా నష్టపోయింది ఇస్లామేతరులే. అది బహిరంగంగా చెప్పే విషయం కాదు, అర్థం చేసుకోవాల్సిన విషయం. అలాగని ఇస్లామీయులకు కష్టం లేదని అనలేదు. ఎందుకంటే, జైనులాబిదీన్‌తో ఎవరు సన్నిహితంగా ఉన్నా మతంతో సంబంధం లేకుండా వారందరినీ హింసించాడు కొత్త సుల్తాన్. జైనులాబిదీన్ వల్ల లబ్ధి పొందిన వారి పట్ల అసూయ, క్రోధాలు అప్పటి సమాజంలో ఉండేవి. కాబట్టి వారిని అవమానించటం, హింసించటం, ఆస్తులు లాక్కోవటం జరిగింది. ఇక్కడ ‘అసూయ’ లోభత్వాలకు ప్రాధాన్యం.
దేశే సరుదితాక్రందం శుశోచాత్యన్తదుఃఖితః।
సర్వవృద్ధశ్చిరారూఢోగ్రస్తోదృష్టపరాభవః।
సర్వకార్యాన్తరజ్ఞోయం క్షయం యాతి కదా నృపః।
ఇతి యేప్యవదన్ దుష్టాస్తత్సుతా విభవార్థినః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 131)
జైనులాబిదీన్ పాలన కాలంలో చిరకాలం ఉన్నత పదవులను అధిష్టించి, అత్యంత గౌరవ మన్ననలందుకున్న వృద్ధులు, జీవితంలో ఎన్నడూ ఏ పరాభవం వేధింపులను ఎరుగని వారందరూ రోదించారు. జైనులాబిదీన్ జీవిత కాలంలో, ఆయన ఎప్పుడు మరణిస్తాడో, అతడి కొడుకు దగ్గర ధనం సంపాదించవచ్చుని అనుకున్నవారు కూడా కొంత కాలం ఆనందం అనుభవించినా, వారిని కూడా రాజు కష్టపెడుతుండటంతో ఈ రాజు ఎప్పుడు పోతాడని దూషిస్తూ, ఎదురు చూశారు.
పారసీ భాషయా కావ్యే యదూచే దూపణా విషామ్।
స శాపః ఫలితో దేశే శ్రీమజ్జైనమహీపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 132)
పారసీ భాష కావ్యంలో ప్రజల దోషానికి ఎలాంటి శాపం ఉందని చెప్తారో, ఆ శాపం ఇప్పుడు జైనులాబిదీన్ దేశంలో ఫలిస్తున్నది.
ఇలాంటి శ్లోకాలు, శ్లోకంలో ప్రదర్శంచిన భావాలు కవుల హృదయాలను పట్టిస్తాయి. జైనులాబిదీన్ సుల్తాన్ అయినా అందరినీ సమానంగా చూశాడు. కశ్మీరు ప్రజలు సుఖంగా జీవించే వాతావరణం కల్పించాడు. ఇది నచ్చని అనేకులు జైనులాబిదీన్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నారు. పర్షియన్ రచయితల రచనలు చదివితే వారికి జైనులాబిదీన్ పట్ల ఉన్న అసంతృప్తి ఆగ్రహాలు తెలుస్తాయి. వారికి తమను గౌరవించి ధనం ఇచ్చాడన్న సంతోషం కన్నా కాఫిర్ లను తమతో సమానంగా చూశాడన్న క్రోధం ఎక్కువ. అందుకని వారు జైనులాబిదీన్ సంతానాన్ని తమ వైపు తిప్పుకుని కుట్రలు పన్నారు. ఇది వారు చేసిన పాపం.
పాపం చేసిన వారు అంతా ఇస్లామీయలే. కాబట్టి ఫారసీ దేశం భాషలోని వాక్యాలలో, ప్రజల దోషాలకు ఎలాంటి శిక్ష పడుతుందన్న శాపం ఉందో, ఆ శాపఫలితం జైనులాబిదీన్ దేశం అనుభవిస్తున్నదని, ఫారసీ ప్రజలను (కశ్మీరుకు పరాయి దేశాల నుండి వస్తున్న సూఫీలు, ఆ రాజులతో సహా ఇతర ఇస్లామీయులు) జైనులాబిదీన్‌ను వేరు చేసి చూపిస్తున్నాడు శ్రీవరుడు. కశ్మీరు అనుభవిస్తున్నదని, కశ్మీరు ప్రజలు అనుభవిస్తున్నారనీ అనలేదు. జైనులాబిదీన్ దేశం అనుభవిస్తున్నదని అన్నాడు శ్రీవరుడు.
జైనులాబిదీన్ వంటి వాడు పాలించిన దేశంలో ఇలా అవుతోందేమిటన్న బాధ వ్యక్తపరుస్తున్నాడు శ్రీవరుడు. సాధారణంగా, తల్లిదండ్రులను చూసి పిల్లల మంచి వారి సంస్కారంలో కొంతైనా ఉంటుందనుకుంటాము. కానీ అందుకు భిన్నంగా ఉంటే ‘ఎలాంటి తండ్రికి ఇలాంటి కొడుకు’ అని బాధపడతారు. శ్రీవరుడు అలాంటి బాధని వ్యక్తపరుస్తున్నాడు. ఇక్కడ కూడా రాజుది దోషం అనటం లేదు. ఫారసీ ప్రజల దోషం. ఫారసీ శాస్త్రాలు చెప్పిన ఫలితం అనుభస్తున్నది దేశం అంటున్నాడు.
సేవకాః కితవ ప్రాయా భుక్తప్రేశ్యా నియోగినః।
తచ్ఛాపాదివ కాలేన ప్రాప్తాత్యన్తనిపీడనాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 133)
జైనులాబిదీన్ కొడుకు దగ్గర నుండి లభించిన ధనంతో కొన్ని రోజులు ఆనందంగా ఉన్నా సేవకులు శాపగ్రస్థులైనట్టు అధికంగా పీడనకు గురయ్యారు.
కిమస్మద్రక్షకో దైవహతో వృద్ధో మహీపతిః।
ఇత్యాది సాసుసాక్రందాః శుశుచుస్తేపి పార్థివమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 134)
“మా రాజును భగవంతుడు ఎందుకు తీసుకువెళ్లిపోయాడో?” అని ఏడుస్తూ వాళ్లు (సేవకులు) కూడా జైనులాబిదీన్ ను తలచుకుని శోకించారు.
అంటే, జైనులాబిదీన్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నిన వారు కూడా ఇప్పుడు జైనులాబిదీన్‌ను తలచుకుని రోదిస్తున్నారన్నమాట.
ఇది కూడా సర్వసాధారణం. ఒక మంచి పని చేస్తున్నవాడు, ఆ పని చేస్తున్నంత కాలం అడ్డుపడతారు, తమకేదో దక్కలేదన్న అక్కసుతో. తీరా, వాడి స్థానంలో మరొక దుష్టుడు వచ్చి వారికి అడ్డుపడే అవకాశం ఇవ్వకుండా అధికారాలన్నీ లాగేసుకుంటే, కనీసం పాత రాజే ఉండి ఉంటే బావుండేదని ఏడుస్తారు. అలాంటి పరిస్థితిని వర్ణించాడు శ్రీవరుడు.
స్వల్పోపి రాజ్యకాలోభూన్నవాయాపైః సుదుః సహః।
నిదాఘరాత్రి సందృష్టి దీర్ఘదుః స్వప్న స నిభః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 135)
ప్రస్తుత రాజు పాలన స్వల్ప కాలమైనా భరించలేనతంగా దీర్ఘకాల పాలనగా ఎండాకాలం కన్నా భయంకరమైన కలగా భావించారు ప్రజలు.
లోత్రరాశిగృహద్రవ్యహరణైః పరపీడనైః।
తుతుషుస్తస్య భృత్యౌఘాః కౌశికా స్తిమిరైరివ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 136)
శయ్యారూఢో మధుక్షీవః ప్రజాకార్య పరాన్ముఖః।
సర్వం దినం నినాయాన్తః స్వపార్శ్వ పరివర్తనైః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 137)
రాజు సేవకులు దోపిడీల ద్వారా, ఇంటిలోని వస్తువులను ఎత్తుకుపోవటం ద్వారా, ప్రజలను హింసించటం ద్వారా ఎంతో ఆనందం పొందారు. గుడ్లగూబలు రాత్రి వేళల ఎంత ఆనందం పొందుతాయో, అంత ఆనందం దుష్ట చర్యల ద్వారా పొందారు.
రాజు మదిర పాన మత్తుడై ప్రజల గురించి, పాలన గురించి పట్టించుకోలేదు. తన సమయమంతా భవంతిలో మంచంపై పొర్లుతూ గడిపేవాడు రాజు.
కులాలగాయనోద్గీత గీతం శృణ్వన్ దివానిశమ్।
గుణిభ్యో రాజయోగ్యేభ్యో నాదాద్ దర్శనమాత్రకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 138)
పిచ్చి కూతల లాంటి పాటలు వింటూ రాజు ఆనందించేవాడు. సంగీతజ్ఞులకు దర్శనం కూడా ఇచ్చేవాడు కాదు.
ఇక్కడ శ్రీవరుడు ‘కులాల్’ అన్న పదం వాడేడు. ‘కులాల్’ అంటే ‘కుమ్మరి’. కుండలు తయారు చేసేవాడు అని అర్థం వస్తుంది. అంటే కుమ్మరివాడు పాడే పాటలు రాత్రింబవళ్లు వింటుండేవాడు అన్న అర్థం వస్తుంది. కాని ‘కులాల్’ అంటే ‘కోడి’, ‘గుడ్లగూబ’ అన్న అర్థాలు వస్తాయి. శ్రీవరుడు ఏదో ఓ కులానికి చెందిన వాడి పాటలు విన్నాడు అన్న దృష్టిలో కాక, కోళ్లు, గుడ్లగూబల కూతల లాంటి పాటలు వింటూ కాలం గడిపే వాడన్న దృష్టిలో ‘కులాల’ అన్న పదం వాడేడనుకోవటం ఔచితీమంతంగా ఉంటుంది.
ఇక్కడ ఇంకో అర్థం కూడా తీసుకోవచ్చు. జైనులాబిదీన్ అధికంగా భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వినేవాడు. శ్రీవరుడితో పాడించికునేవాడు. జైనులాబిదీన్ ముందు ఇస్లామీయులు పాడినా అధికంగా భక్తిగీతాలు పాడేవారని ఊహించటం కష్టం కాదు. కానీ ఇప్పుడు రాజు మదిరపాన మత్తుడు. నీచమైన ఇష్టాలు కలవాడు. అతడు జైనులాబిదీన్‌లా చక్కని సంగీతం వింటాడనుకునే వీలు లేదు. కాబట్టి అతడు వినే పాటలు శ్రీవరుడికి గుడ్లగూబల పాటలుగా అనిపించటంలో ఆశ్చర్యం లేదు. దాన్నే వ్యక్తపరచి ఉంటాడు, ‘కులాల’ అన్న పదం వాడి.
శాహాభదేనరాజ్యే యా సపన్నాతిమనోహరా।
లక్ష్మీపురే రాజధానీ తాం పుప్లోపోదితః శిఖీ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 139)
శాహబుద్దీన్ కాలంలో పూర్తయిన సంపన్నమయిన, మనోహరమైన రాజధాని లక్ష్మీపురం అగ్ని శిఖలకు ఆహుతి అయి బూడిదయి పోయింది.
సుల్తాన్ శాహబుద్దీన్ రాణి పేరు లక్ష్మి. ఆమె పేరు మీద నగరం కట్టించి దాన్ని తన రాజధాని చేసున్నాడు శాహభుద్దీన్. అది అత్యంత సంపన్నమైన నగరం. అది బూడిద అయిపోయింది.
యా బలాఢ్యమస్థానే వేశ్మాలీ విపులాభవత్।
సాపి దగ్ధా సమం తత్ర తత్తత్పౌరజన శ్రియా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 140)
బలాఢ్య మఠం, దగ్గరలో ఉన్న అనేక భవనాలు ప్రజల ధనంతో సహా బూడిద అయ్యాయి. లక్ష్మీపురం బూడిద అయింది. బలాఢ్య మఠం బూడిద అయింది. అనేక ఇతర భవనాలు బూడిదయ్యాయి. ప్రజల ఐశ్వర్యం బూడిద అయింది.
ఇప్పటి కాలంలో ప్రజలను చంపటం, తగలుబెట్టటం, లూటీ చెయ్యటం వంటి పరిస్థితిని వర్ణిస్తున్నాడు శ్రీవరుడు.
అప్పటి ‘బలాఢ్య’ను ప్రస్తుతం ‘బలన్దిర్’ అంటున్నారు. శ్రీనగరంలో ఉందీ ప్రాంతం. ఇప్పుడు అక్కడ పాత మఠం ఆనవాళ్లు కానీ, అప్పటికి చెందినవేవీ లభించవు. అంతా ఆనాడే బూడిద అయింది.
ఇత్యాద్యుపద్రవాన్ దేశే దృష్ట్వా వాస్తవ్యనాశకాన్।
ఏతన్నాశాద్ భవేద్ విఘ్నశాన్తిరిత్యవదజ్జనః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 141)
దేశంలో ఇలా వరసగా ఉపద్రవాలు సంభవించటం అనుభవిస్తున్న ప్రజలు, ఈ రాజు నాశనం అయితేనే విఘ్నాల శాంతి కలుగతుంది అనుకున్నారు.
శ్రీవరుడు కశ్మీరం అనుభవిస్తున్న దుస్థితిని ప్రజల ఫలితం అంటున్నాడు. కానీ ప్రజలు ఇదంతా రాజు వల్ల, ఈ రాజు ఛస్తే కానీ శాంతి లేదంటున్నారు. ప్రజలు అట్లా అనుకుంటున్నారు. ప్రజలలా అనుకోవటంలో శ్రీవరుడి దోషం లేదు.
రాజా పంచగృహావాసం స్వం జ్వలన్తం సమీక్ష్య చ।
హర్మ్యమారుహ్య సంతుష్టః పానలీలా వ్యగాహత॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 142)
తన నివాస స్థానాలయిన అయిదు గృహాలు అగ్నికి ఆహుతి అవటం చూసి, సంతోషంతో సంతుష్టుడయిన రాజు మద్యం త్రాగటం ఆరంభించాడు.
మనం రోము తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో గురించి విన్నాం. కానీ నీరోను మరపింపచేసే సుల్తాన్ మన కశ్మీరంలో ఉన్నాడని మనకు తెలియదు. మన కశ్మీర్ నీరో రోమన్ నీరో కన్నా గొప్పవాడు. తన స్వంత భవనాలు తగులబడుతుంటే సంతుష్టుడై మధుపానం ఆరంభించాడు. ఇలాంటి పాలకులను కూడా చూసే అదృష్టం అటు కశ్మీరుకూ ఇటు మనకూ లభించింది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
