Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-107

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

అస్మిన్నవసరే నేయధిషణః పిశునేరితః।
యాత్రార్థం సబలం పుత్రం బహిర్దేశే వ్యసర్జయత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 143)

ఇంతలో కొందరు చేసిన కుట్రల వల్ల రాజు తన కొడుకుని జైత్రయాత్రల కోసం ఇతర దేశాల పైకి పంపాడు.

ఈ శ్లోకం వల్ల తెలుస్తున్నదేమిటంటే, సుల్తాన్ హైదర్ మత్తులో ఉండి, రాజ్య పాలనను మంత్రులకు; తనపై ప్రభవం చూపే స్నేహితులకు అప్పచెప్పటంతో, కశ్మీరులో సింహసనం కోసం కుట్రలు తీవ్రమయ్యాయన్నది. ఇంకా జైనులాబిదీన్ ఇతర తనయులు బ్రతికే ఉన్నారు. ముఖ్యంగా ‘బహ్రమ్ ఖాన్’ సింహాసనం కోసం పొంచి ఉన్నాడు. ‘హైదర్ షాహ’ను సుల్తాన్ గా తప్పించి, బహ్రమ్ ఖాన్‌కి అధికారం కట్టబెట్టాలన్న కుట్రలు తీవ్రంగా సాగుతూ ఉంటాయి. వీరందరికీ కాలులో ముల్లు, సుల్తాన్ కొడుకు, రాకుమారుడు ‘హసన్ ఖాన్’. ‘హసన్ ఖాన్’ ను సుల్తాన్‌కు దూరం చేస్తే సింహాసనం కబళించటం కష్టం కాదని భావించి ఉంటారు. దాంతో ‘హసన్ ఖాన్’కు వ్యతిరేకంగా సుల్తాన్‌కు చెప్పి అతడిని దేశానికి ఆవల పంపమని చెప్పి ఉంటారు. ఫలితంగా యుద్ధం కోసం బయటకు పంపాడు సుల్తాన్ తన కొడుకు హసన్ ఖాన్‌ను. ఈ సంఘటన జైనులాబిదీన్ కొడుకులకు అధికార దాహం కలిగించి, అధికారం ఆశ చూపి, వారిలో వారు కొట్టుకునేట్టు చేసి, జైనులాబిదీన్‌కు వ్యతిరేకంగా పోరాడేట్లు చేసిన కుట్రల స్వరూపం ఇప్పుడు మరింత స్పష్టమవుతుంది. ఇదంతా శ్రీవరుడు స్పష్టంగా చెప్పలేదు. ఎందుకంటే, ఇంకా శ్రీవరుడు రాజాస్థానంలో పలుకుబడి గల స్థానంలో ఉన్నాడు. ఈ విషయమై ఆర్.కె. పర్ము ‘హిస్టరీ ఆఫ్ ముస్లిం రూల్ ఇన్ కశ్మీర్’లో రాసింది చదివితే శ్రీవరుడు ఎంత జాగ్రత్తగా రాజతరంగిణి రచించాడో తెలుస్తుంది. అప్రియమైన నిజాన్ని స్పష్టంగా చెప్పకుండా, భావితరాల వాళ్ల ఊహకందే రీతిలో రచించాడు. ఏదీ స్పష్టంగా చెప్పడు. కానీ అన్నీ తేటతెల్లమవుతుంటాయి.

“While the orgy of cruelties against the Hindus was going on, Hasan Khan, the heir-apparent, was ordered to restore order in Punch and Rajauri, because he had opposed the anti-Hindu policy of Luli.”

లూలీ (శ్రీవరుడి పూర్ణ) హిందువుల పై జరిగే అత్యాచారాలను వ్యతిరేకిస్తున్నాడని హసన్ ఖాన్‌ను పూంచ్ – రాజౌరీలలో శాంతి నెలకొల్పేందుకు పంపించాడు సుల్తాన్. శ్రీవరుడు బహు గోప్యంగా చెప్పింది, ‘తవ్వకత్-ఎ-అక్బరీ’ స్పష్టంగా చెప్పింది. హిందువులపై జరుగుతున్న అత్యాచారాలను హసన్ ఖాన్ వ్యతిరేకించాడు. హసన్ ఖాన్ అడ్డు తొలగించేందుకు అవకాశం కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశం దొరికింది. అతడిని సుల్తాన్ కశ్మీర్ బయటకు పంపించేట్టు చేశారు.

ఇక్కడ మనం ఓ విషయం ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.

ఇస్లామీయులలో అతివాదులున్నారు. మిత వాదులున్నారు. సమన్వయవాదులున్నారు. కానీ, అతివాదుల ‘హింస’ కుట్రలు, ఇతరుల స్వరాలను అణచి వేస్తున్నాయి. దాంతో వినిపిస్తున్నది ఒకే అతివాదుల స్వరం. తమ అయిష్టాన్ని ధైర్యంగా ప్రకటించలేక, ప్రకటిస్తే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుందన్న భయంతో మనసులో మాటను బహరంగ పరచరు మితవాదులు.

ఆర్.కె. పర్ము పుస్తకం ప్రకారం కాశ్మీరులో హిందువుల పై జరుగుతున్న అత్యచారాలకు వ్యతిరేకంగా ‘హసన్ ఖాన్’ నోరు విప్పాడు. అతడు రాజకుమారుడు. అతడిని ఏమీ చేయలేరు. అందుకని, అతడిని దేశం బయటకు పంపి, తమ మాట వినే వాడికి రాజ్యాధికారం కట్టబెట్టే కుట్రలు ఆరంభించారు. ఇలా ఛాందసానికి, మతమౌఢ్యానికి వ్యతిరేక స్వరాలు స్పష్టంగా వినిపించకపోవటంతో మొత్తం మతం అపోహలకు గురవుతోంది.

యత్సైన్యం వోక్ష్య దైన్యం తే యయుర్బ్రాహ్య మహీభుజః।
ప్రదీప్తం రవిరవశ్మోఘం దివసే తారకా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 144)

సూర్యుడి వెలుగు ముందు ఉదయం పూట తారకలు అదృశ్యమైనట్టు, రాజు సైన్యం చూసి, శతృరాజుల దశ దయనీయమై పోయింది. వాళ్లూ అదృశ్యం అయిపోయారు.

అంటే, హసన్ ఖాన్ సైన్యం శత్రువులను పరాజితులను చేసిందన్న మాట. అతని శౌర్యవీరత్వం ప్రకటితమయింది. అదృష్టవంతుడిని పాడు చేసేవారు లేరు అంటారు. హసన్ ఖాన్ పట్ల అది నిజమయింది. అతడిని దేశం వెలుపలకు పంపటం ద్వారా తమ కలను నిజం చేసుకుని  అధికారం చేపడదామనుకున్నారు. కానీ  తన శౌర్యప్రతాపాలను, యుద్ధ రంగంలో వెరపు లేకుండా పోరాడే పటిమను ప్రదర్శించే వీలు లభించింది హసన్ ఖాన్‌కు. ప్రజల దృష్టిలో అతడిని వీరుడిగా నిలిపింది.

పూర్వం రాజపురీరాజ జయసింహో నృపాత్మజమ్।
స్వసారం వ స్వసారం చ దత్త్యా తోపయతి స్మ తమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 145)

రాజపురి (రాజౌరి) రాజు అమూల్యమైన ధనాన్ని సమర్పించాడు. రాజవంశానికి చెందిన యువతిని ఇచ్చి వివాహం చేశాడు. కొందరు, జయసింహుడు తన సోదరుని ఇచ్చి వివాహం చేశాడని రాశారు. కాని శ్రీవరుడు ‘రాజవంశపు స్త్రీ’ అని మాత్రం చెప్పాడు. భవిత్యత్తు శ్లోకాలలో ఆమె పేరు ‘జయమాల’ అని తెలుస్తుంది.

కాలీధారామసిలతామివ వీక్ష్య తదాశ్రితామ్।
కంప్యం కే నాత్ర దేశస్థాః ప్రాపుస్తద్భయతో జనాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 146)

‘కాలీధార’ అసిధార (కత్తి అంచు)లా కనబడటంతో అతడిని చూసి భయపడనిదెవరు?

‘కాలీధార’ అన్నది జమ్ము పూంచ్‌ల నడుమ ‘రీసై’ జిల్లాలో ‘చౌకి చౌరా’ దగ్గర ఉంటుంది. ఇక్కడ ఇదే పేరుతో ఉన్న మందిరం వల్ల ఈ ప్రాంతానికి, ఇక్కడి అడవికి ‘కాలీధార’ అన్న పేరు వచ్చింది. ప్రస్తుతం జమ్ము – పూంచ్ రహదారిలో వెళ్లే వారు ఈ మందిరం దాటి వెళ్తారు. దూరంగా ‘కాలీధార’ పర్వత పంక్తులు కనిపిస్తూంటాయి. అవి సుందరమైన అతి పవిత్రమైన స్థలం ఇది. ఇవన్నీ ఇప్పుడు హసన్ ఖాన్ వశమయినాయన్నమాట.

సేనా దీన్నారకోటీయాః శిశ్రయుస్తాం భయచ్ఛిదే।
బలిభిర్మంగలాదేవీమివోన్నతభువి స్థితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 147)

భయం దూరం చేసుకునేందుకు దీనారకోట సేనలు అతడి ఆశ్రయం ఎలా అభ్యర్థించాయంటే – భయం దూరం చేసుకునేందుకు ప్రజల ఉన్నత స్థలం పై ఉన్న మంగలా దేవి ఆశ్రయం ఎలా అభ్యర్ధిస్తారో అలాగ.

అంత వరకూ అతడి ప్రజలు భయం తొలగించుకునేందుకు ‘మంగల’ దేవిని శరణు వేడేవారు. కానీ ఇప్పుడు వారు హసన్ ఖాన్ ఆశ్రయం కోరారు. వర్ణనలోనూ చమత్కారం చూపించాడు శ్రీవరుడు.

‘రాజౌరీ – పూంచ్’ ప్రాంతాలు ఇప్పటి వరకు హిందూ రాజుల ఆధీనంలో ఉన్నాయి. కశ్మీరు సుల్తాన్‌కు సామంత రాజ్యం అయినా స్వతంత్రంగా ఉండేవి. అందుకే జయసింహుడు విలువైన ధనాన్ని, తన వంశానికి చెందిన స్త్రీని హసన్ ఖాన్‌కు అర్పించాడు. ‘దీనారకోట’ సేనలు మంగలా దేవి బదులు హసన్ ఖాన్‌ను ఆశ్రయించాయి. అంటే, వారి దైవం వారిని రక్షించ అశక్తురాలు. అందుకని హసన్ ఖాన్ ఆశ్రయం కోరారు. అతని ఖడ్గదారకు ఎదురు నిలచేవారు లేరు. అందరూ భయంతో వణుకుతున్నారని అంతకు ముందు శ్లోకంలో చెప్పాడు శ్రీవరుడు.

మద్రగఖ్కాచిమ్భశా రాజహంసాస్తమాయయుః।
సరోవరమివ ప్రోద్యచ్ఛుక్లపక్షా వినిర్మలమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 148)

హంసలు స్వచ్ఛమైన నీటి సరస్సుకు వచ్చేట్టు మద్ర, గోఖ్ఖార, చిమ్ల దేశాల రాజులు శ్వేత వస్త్రాలు ధరించి వచ్చారు.

ఫారసీ చరిత్ర రచయితలు ‘జమ్ము’ను ‘మద్ర’ దేశం అన్నారు. కశ్మీరు సాహిత్యం ప్రకారం ‘మద్ర’ రాజ్యం కశ్మీరు దక్షిణ భాగంగా భావించారు. సట్లెజ్ – సింధు నదుల పరీవాహక ప్రాంతం వరకూ ఉంటుంది. మద్ర దేశంలో ‘ఉశేవర్’ అన్న దేశంలో త్రిగర్త, జమ్ములు భాగాలు. ఉదీద్ర దేశం అంటే బాహ్లీక, గాంధార దేశాల సమ్మిళిత రూపం.

‘భద్ర’ దేశం, ఝీలమ్, బియాస్ నదుల నడుమ ప్రదేశం. ఈ దేశాల రాజులంతా శ్వేత వస్త్రాలు ధరించి వచ్చారంటే సంధి కోసం వచ్చారన్నమాట.

రాజవృత్తామరోధేన స్వపదార్థోపపాదకైః।
మాతులైరపి తస్యాగ్రే సుల్హణైః కల్హణాయితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 149)

అతని మామ మల్లణుడు, రాజకార్యాలు చక్కబెట్టాడు. అతడు కూడా అనేక బహుమతులు అందించాడు.

ఇందులో కల్హణుడు, సుల్హణుడు పేర్ల వాడకం గురించి ఇంకా స్పష్టమైన అవగాహన లేదు. ‘సుల్హణుడు’ అన్నది కశ్మీరులో సాధారణ నామం. కల్హణ రాజతరంగిణిలో సుల్హణుడన్న రాజకుమాడి ప్రస్తావన ఉంది. కానీ ఈ సుల్హణుడు ఆ సుల్హణుడు కాదు. నడుమ కొన్ని వందల ఏళ్ల వ్యత్యాసం ఉంది. మల్లణుడు, కల్హణుడు పని చేశాడనటం అర్థరహితం అనిపిస్తుంది. శ్రీవరుడి ఉద్దేశం అర్థమయ్యేట్టు లేదు. ప్రతులను కాపీ చేయటంలో పొరపాటు దొర్లి ఉంటుందని పరిశోధనలు అభిప్రాయ పడుతున్నారు.

కౌమారోద్వంసికం వీక్ష్య కటకాలంకృతా అపి।
అభూవన్ ధైర్యరహితా మాహిలా మహిలా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 150)

‘కౌమార’ ధ్వంసాన్ని చూసిన మాహిలలు పెద్ద సైన్యం ఉన్నా సరే, మహిళలలా ధైర్యం కోల్పోయారు. ‘కౌమార’ పదం గురించి కూడా భిన్న అభిప్రాయాలున్నాయి. కొందరు చరిత్ర పరిశోదనలు ‘కౌమారనగరం’గా దీన్ని అర్థం చేసుకున్నారు. కానీ ఇది ‘కుమారి’ అంటే యువతులు అనే అర్థంలో తీసుకోవాలని, యువతుల ధ్వంసం, అంటే యువతల చరిత్రను అంటే మాన ప్రాణాలను హరించి , శీలాన్ని ధ్వంసం చేయటం చూసిన మహిళలు బెదిరిపోయారని అర్థం చేసుకోవాలన్నది ఇంకొందరి అభిప్రాయం. ‘కుమార నగరం’ అనే నగరం ఉన్నట్టు ఎలాంటి ప్రమాణాలు లభించకపోవటంలో యువతుల చరిత్రలను ధ్వంసం చేయటం అంటే వారి మానహరణం వల్ల మహిల యుద్ధవీరులు బెదిరిపోయారని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.

బద్ధపంక్తిస్తరన్తీ సా జ్యలమేస్తన్నదీతటాత్।
తత్సేనా రామబద్ధాబ్ధి సేతుకౌతుకమాతనోత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 151)

రాజకుమారుడి సైన్యం ఒకరి వెనక ఒకరుగా నదిని దాటుతుంటే రాముడు నిర్మించిన సేతువులుగా అనిపించింది. అలా వారు జ్యాలమి చేరుకున్నారు.

‘జ్యాలమి’ అంటే ఝీలమ్ నది.

కుటీపాటీశ్వరీ ప్రాప్తం తత్సైన్యం దైన్యవర్జితమ్।
నారాయణోదరోద్రచ్ఛద్విశ్వలోకభ్రమం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 152)

అలసట లేకుండా ఉత్సాహంతో పాటీశ్వరి చేరుకున్న సైన్యం, నారాయణుడి నాభి నుంచి ఉత్పన్నమైన విశ్వం అన్న భ్రమను కలిగించింది.

‘పాటీశ్వరి’ ఎక్కడ ఉన్నదో నిర్ధారణ కాలేదు.

సంప్లుష్టే భోగపాలానాం పురే మద్రాచితాన్యపి।
సుచిరం ధూమితాన్యాసన్ గృహాణి హృదయాని చ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 153)

‘మద్రలు’ నివసించే భోగపాల నగరంలోని ఇళ్లను దగ్ధం చేశారు. వాళ్ల గృహాలతో పాటు వాళ్ల హృదయాలు కూడా చిరకాలం మండుతూనే ఉన్నాయి. వాటి నుంచి ధూమం వెలువడుతూనే ఉంది. మరో రకంగా చూస్తే గృహాల లాగే వాళ్ల హృదయాలు కూడా బూడిద అయిపోయాయి అని భావించవచ్చు.

భోగపతి భోగక అన్న పదాలు హర్ష చరితంలో కనిపిస్తాయి. ‘రాజ్యాధికారి’ అన్న అర్థంలో వాడేరీ పదాన్ని. పన్నులు వసూలు చేసేవారు ఈ భోగపాలురు. తరువాత భోగపాల, భోగవతి అన్న పదాలను ‘ఈనామ్‌దార్’ ‘జాగీర్’ అన్న పదాలు అక్రమించాయి. భోగపాల నగరాన్ని హసన్ ఖాన్ సేనలు నాశనం చేశాయన్నమాట.

ఉన్నాదహదసంసంగతత్తురంగ తరంగితా।
బాల్యేశ్వరగిరేః పాదమూలం ప్రాపాస్య వాహినీ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 154)

సంతోషాతిరేక శబ్దాలు చేస్తూ సేన, అశ్వాల తరంగంలా బాల్వేశరగిరి దగ్గరకు చేరుకుంది.

‘ఉన్నాద’ అన్న శబ్దాన్ని కొంతమంది ఉన్నాద అనే సరస్సుగా భావించారు. ‘ఉ’ అన్న శబ్దానికి ఉత్కర్ష, పైనుంచి వెళ్లటం అనే అర్థాలున్నాయి. కశ్మీరులో సరస్సు అల్లకల్లోమై పొంగిపొర్లినపుడు వచ్చే శబ్దాన్ని ‘ఉన్నాద’ శబ్దం అని అంటారు. సైన్యం నడుస్తూంటే వచ్చే శబ్దాన్ని శ్రీవరుడు ‘ఉన్నాద’ శబ్దంతో పోల్చాడు తప్ప ఉన్నాద అనే సరస్సు లేదని అంటారు.

తదీయకటకోదీపస్తత్తురంగత్తరంగితః।
తం తమేవ నతం చక్రే యేన యేన పథావహత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 155)

సైన్యంలోని అశ్వాల నడక వరదలా అనిపించింది. అది ప్రయాణించిన దారులన్నిటినీ వరదలా ముంచెత్తుతూ ముందుకు సాగింది సైన్యం.

నిస్తృణ భూతలం తత్తు నిష్పానీయా జలాశయాః।
నిరిన్ధనాన్యరణ్యాని తత్సైన్యే చలితేభవన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 156)

ఆ సేనలు ప్రయాణం చేసిన మార్గాలలో గడ్డి కూడా మిగలలేదు. జలాశయాలలో నీళ్లు లేవు. అరణ్యాలలో వృక్షాలు లేవు.

అంటే, సర్వం నాశనం చేస్తూ ముందుకు సాగాయన్నమాట సేనలు.తృణరహితం, జలరహితం, ఇంధన రహితం. ‘నిరింధన’ అన్నాడు శ్రీవరుడు. ఇంధనం అంటే ‘fuel’ అన్నమాట. పెట్రోలు లేని ఆ కాలంలో చెట్లు కొట్టి ఆ కర్రలను ఇంధనంగా వాడేవారు. ‘నిరింధన అరణ్యం’ అంటే అరణ్యాలు ఇంధన రహితం అంటే వృక్షరహితం అయ్యాయన్నమాట.

(ఇంకా ఉంది)

Exit mobile version