Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-108

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

సోహం సంమాన్య రాజ్ఞాస్మై దత్తస్తత్సమయేన్వహమ్।
కుర్వన్ బృహత్కథాఖ్యానమభూవం ధృతపుస్తకః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 157)

రాజు నన్ను గౌరవించి, హసన్ ఖాన్  దగ్గరకు పంపించాడు. నేను రోజూ హసన్  ఖాన్ కు  బృహత్కథ వినిపించేవాడిని.

జైనులాబిదీన్ తరువాత కూడా శ్రీవరుడికి రాజాస్థానంలో ఆశ్రయం లభించిందని స్పష్టం చేస్తుందీ శ్లోకం. అయితే, శ్రీవరుడి వర్ణనలను బట్టి గ్రహించగలిగేదేమిటంటే శ్రీవరుడు రాజాస్థానంలో ఉన్నా గతంలో లభించిన మర్యాద, మన్ననలు, భద్రతలు హైదర్ షాహ పాలనలో శ్రీవరుడికి లభించలేదన్న విషయం. అంతే కాదు, హిందువులపై అత్యాచారాలు జరుగుతుంటే శ్రీవరుడు రాజాస్థానంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోయాడన్న బాధ అతని రచనలో కనిపిస్తుంది. జైనులాబిదీన్ లాగా హైదర్ షాహ దగ్గర సాన్నిహిత్యం శ్రీవరుడికి లేదన్నది స్పష్టం. కానీ జైనులాబిదీన్ రాజుగా ఉన్నప్పుడు అతడి సంతానానికి గురువు శ్రీవరుడు కావటంతో, గురువన్న గౌరవంతో, హింసించకపోయినా, దూరంగా ఉంచాడు హైదర్ ఖాన్. హైదర్ ఖాన్ ఇష్టాయిష్టాలు శ్రీవరుడి స్థాయివి కావు. అతను వినే పాటలు , శ్రీవరుడి స్థాయివి కావు. హైదర్ శాహకు  సాహిత్యం, సంగీతం వంటి వాటిపై ఎలాంటి అభిరుచి లేదు. కాబట్టి శ్రీవరుడు రాజు దగ్గర ఉన్నాడు. కానీ రాజుకు దగ్గర కాదు. రాజుకు శ్రీవరుడి అవసరం లేదు. సాహిత్యం అవసరం లేదు. సలహాలూ అవసరం లేదు. బహుశా శ్రీవరుడిని చూస్తే జైనులాబిదీన్ గుర్తుకు వచ్చి హైదర్ షాహకు వేరే భావన కలుగుతుందేమో. ఇప్పుడు శ్రీవరుడుని తన కొడుకు హసన్ ఖాన్  దగ్గరకు పంపాడు. బహుశా, తన కొడుకుపై శ్రీవరుడి మంచి ప్రబావం పడాలని భావించాడేమో! శ్రీవరుడు ‘హసన్ ఖాన్’ కు బృహత్క థ రోజూ వినిపించాడు.

బృహత్కథను గుణాడ్యుడు పైశాచీ భాషలో రాశాడు. ఇప్పుడు ఆ ప్రతి లభ్యం కావటం లేదు. కానీ కశ్మీరుకు చెందిన  క్షేమేంద్రుడు ‘బృహత్కథ మంజరి’, సోమదేవుడు ‘కథా సరిత్సాగరం’ పేరిట బృహత్కథను సంస్కృతంలోకి అనువదించారు. ఈ రెండు అనువాదాలు లభ్యమౌతూండటం వల్ల బృహత్కకథ మనకు  తెలుస్తోంది.

జైనులాబిదీన్‌కు ముక్తికోపనిషత్తు వినిపించిన శ్రీవరుడు ఇప్పుడు అతని మనవడికి ‘బహృత్కథ’ వినిపిస్తున్నాడు.

కరదీకృత భూపాలః స పణ్మాసకృత స్థితిః।
అభవచ్చైనమాసాన్తే కశ్మీరాగమనోత్సుకః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 158)

శత్రువులను ఓడించి కప్పం కట్టింహుకున్న  రాకుమారుడు ఆరు నెలల తరువాత చైత్ర మాసాంతానికి కశ్మీరు వెళ్లాలని తొందరపడ్డాడు.

అదృష్టవంతుడిని చెరపలేరు. దురదృష్టవంతుడిని బాగుపరచేవారు లేరంటారు. ఒక పథకం ప్రకారం ‘హసన్ ఖాన్ ’ను కశ్మీరుకు దూరంగా పంపించారు. శ్రీవరుడిని దూరం పంపించారు. అంటే, శ్రీవరుడిని సైతం రాజుకు విధేయుడైన వాడిగా భావించారన్నమాట. ఆ తరువాత జరిగిన సంఘటనలు హఠాత్తుగా ‘హసన్ ఖాన్’ వెనక్కు తిరిగి రావటం వల్ల చరిత్ర తిరిగిన మలుపును తెలుపుతాయి.

తావద్ బభ్రామ బహ్రామఖానో దామనిర్గలః।
ఆక్రాంతమంత్రిసామన్తో జ్ఞాత్వా వ్యసనిన నృపమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 159)

రాజు వ్యనసపరుడు. నిరంతరం మత్తులో ఉండటాన్ని గ్రహించిన బహ్రమ్  ఖాన్ మంత్రులను సామంతులను తన గుప్పిట్లో పెట్టుకుని రాజ్యంపై అధికారం కోసం ఎదురు లేకుండా ముందుకు సాగాడు.

అథ సంతతపానేన క్షీణదేహబలచ్ఛవిః।
స వాతశోణితవ్యాధివాధితోభూన్మహీపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 160)

నిరంతర మద్యపానం వల్ల రాజు శరీరం, అందం అన్నీ పాడయిపోయాయి. రాజు రోగగ్రస్తుడయ్యాడు. వాయు రక్త వికారాలతో రాజు క్షీణించసాగాడు.

వాత, శోణిత వ్యాధి అన్నాడు శ్రీవరుడు. ఆయుర్వేదం ప్రకారం వాత రోగం అన్ని కదలికలపై, శరీరంపై, మెదడుపై, ఊపిరిపై, రక్త సరఫరాలపై ప్రభావం చూపిస్తుంది. ‘శోణిత వ్యాధి’ రక్తానికి సంబంధించినది. అంటే వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం రక్తంపై పడిందన్న మాట. ఇది హృదయ సంబంధిత రోగాలకు దారి తీస్తుంది. అంటే అధిక మద్యపానం వల్ల రాజు రోజులు లెక్కపెట్టే దశ స్థితికి వచ్చాడన్నమాట. ఇది అదనుగా బహ్రామ్‌ ఖాన్ సింహాసనం అక్రమించకోవాలనుకున్నాడు. అనుకోకుండా ఇదే సమయానికి ‘హసన్ ఖాన్’ వెనక్కు తిరిగి వచ్చాడు. దీన్ని బట్టి చూస్తే, హసన్ ఖాన్  కనుక సమయానికి వెనక్కు తిరిగి రాకపోతే రాజ్యం బహ్రమ్ ఖాన్ పరమయ్యేది. కాబట్టి ‘హసన్ ఖాన్’ కశ్మీరుకు బయట ఉన్నా,  కశ్మీరులో ఏం జరుగుతున్నదో తెలుసుకుంటూనే ఉన్నడన్న మాట. అందుకే ఆరు నెలలు కాగానే హఠాత్తుగా కశ్మీరు గమనోత్సుకుడయ్యాడు.

ప్రాప్తో హస్సనఖానః స పూర్ణచంద్ర ఇవోదితః।
తాన్ దుష్టమన్త్రిణః పద్మానివ సంకుచితాన్ వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 161)

పూర్ణచంద్రుడిలా హసన్ ఖాన్ కశ్మీరు వచ్చాడు. చంద్రుడు రాగానే కమలాలు ఎలా మాడిపోతాయో అలాగ దుష్టమంత్రులు హసన్ ఖాన్ రావటంతో వాడిపోయారు. అంటే, హసన్ ఖాన్ వారి పని పట్టాడన్నమాట.

హసన్ ఖాన్ కశ్మీరు రావటంతో కుట్రలు పూర్తికాలేదు. ఇంకా వేగవంతం అయ్యాయి.

కిం నైతేన సమానీతో బద్ధ్వా పిరుజగఖఖరః।
ఇతి రోప సుతే రాజా పిశున ప్రేరితోఽగ్రహీత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 162)

‘పిరుజ గఖ్ఖర్’ను బంధించి తీసుకుని రానందుకు రాజు హసన్ ఖాన్‌పై ఆగ్రహం ప్రదర్శించాడు. రాజాగ్రహం వెనుక దుష్టుల ప్రేరణ ఉంది.

అనుకోకుండా హసన్ ఖాన్ వెనక్కు వచ్చి, రాజద్రోహం చేయాలనుకున్నా మంత్రుల పని పట్టటంతో వారితో కలసి ఉన్న ఇతరులు రాజుకు హసన్ ఖాన్ గురించి చాడీలు చెప్పారన్న మాట. దాంతో రాజు ఆగ్రహం ప్రదర్శించాడు. ‘పిరుజ గఖ్ఖర్’ ను పట్టి తీసుకురానందుకు అన్నది ఒక నెపం మాత్రమే.

‘పిరుజ గఖ్ఖర్’ అన్నది కశ్మీరుకు చెందిన ఒక ‘జాతి’వారి పేరు. జైనులాబిదీన్ రాజు అవటంతో సహాయం చేసిన ‘జసరధు’ ఈ జాతికి చెందిన వాడే. ఢిల్లీ సుల్తాన్ జసరధుపై దాడి చేసినప్పుడు జైనులాబిదీన్ అతడికి అండగా నిలిచాడు. కశ్మీరుతో సత్ సంబంధాలు కలవారు ‘గఖ్ఖర్’లు. కానీ జైనులాబిదీన్ మరణం తరువాత పరిస్థితి మారింది. హసన్ ఖాన్ వారిని ఓడించి వారి రాజ్యాన్ని నాశనం చేశాడు.

పశ్చిమాశాగతం శ్రుత్వా తమపూర్వార్కసంనిభమ్।
బహామఖానో మన్దేహో మన్దేహ ఇవ సోఅభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 163)

పూర్వ దిశలో ఉండాల్సిన సూర్యుడు పశ్చిమ దిశలోకి వచ్చాడని విని నమ్మే మూర్ఖుడు బహ్రామ్ ఖాన్. హసన్ ఖాన్ వచ్చిన వార్త విని సందేహంలో పడిపోయాడు.

బహ్రమ్ ఖాన్ అంచనాల ప్రకారం హసన్ ఖాన్ అప్పుడే కశ్మీరు రాకూడదు. కానీ హఠాత్తుగా హసన్ ఖాన్ వచ్చాడన్న వార్త విని కంగారు పడిపోయాడు. తూర్పున ఉండాల్సిన వాడు పశ్చిమానికి వచ్చాడని విని నమ్మే మందబుద్ధి. బహ్రామ్ ఖాన్ అంటున్నాడు శ్రీవరుడు.

ప్రాప్తే సుతే అన్తికం సో అభూన్న తదత్యధికాదరః।
ప్రత్యాసన్నవినాశానాం ధీర్భీత్యేవ పలాయతే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 164)

దగ్గరకు వచ్చిన తనయుడితో రాజు ఆదరంగా ప్రవర్తించలేదు. వినాశకాలం ప్రాప్తించినప్పుడు భయంతో వారి తెలివి వారిని వదలి పారిపోతుంది.

విజేతగా తిరిగి వచ్చిన కొడుకును రాజు దగ్గరు తీయలేదు. ఆదరించలేదు. పైగా, శత్రువులను బంధించి తీసుకురాలేదని కోపం ప్రదర్శించాడు. కొడుకు గొప్పతనం గుర్తించలేదు. రాజు చివరి రోజులు దగ్గర పడ్డాయి. అతడు మరణిస్తే తానుకూడా  మరణిస్తానన్న భయంతో బుద్ధి రాజును వదలి  దూరం పారిపోయినట్టుంది అని వ్యాఖ్యానించాడు శ్రీవరుడు.

గమనిస్తే, శ్రీవరుడి రాతలలో ధైర్యం కనిపిస్తున్నది. ఆరంభంలో రాసినట్టు జాగ్రత్తగా రాయటం లేదు. తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తపరుస్తున్నాడు. ఓ రకమైన తెగింపు కనిపిస్తున్నది శ్రీవరుడి భావ వ్యక్తీకరణలో.

అత్యభ్యర్థనయా మన్త్రిసామన్తానాం మహీపతిః।
యాత్రాగతాయ పుత్రాయ దదౌ దర్శనమాత్రకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 165)

మంత్రులు సామంతులు ఎంతో అభ్యర్ధించటం వల్ల విజేతగా వచ్చిన తన కొడుక్కు కేవలం దర్శనం ఇచ్చాడు రాజు .

నూనం స్వానుజభీతో అభూత్తత్కాలం సో అన్యథా కథమ్।
పరిఘానా దిసత్కారం న్యూన మేవాకరోత్ సుతే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 166)

బహుశా తన సోదరుడి (బహ్రామ్ ఖాన్) భయంతో రాజు తన ‘విజేత’ పుత్రునికి సరైన రీతిలో సన్మానం చేయలేదు. సాధారణంగా సన్మానించాడు అంతే.

ఆరంభంలో రాకుమారుడిని కలసేందుకు ఇష్టపడలేదు. అందరూ బ్రతిమాలాడితే దర్శనం ఇచ్చాడు. పలు రాజులను ఓడించి కప్పం కట్టించుకుని వచ్చిన కొడుకును గొప్పగా సత్కరించే బదులు ఏదో చిన్నగా సత్కరించి వదిలేశాడు.

బహ్రామో బాఘతే నూనం మత్పుత్రమితి శంకితః।
స తస్మింశ్ఛన్న కోపాగ్నిః శమీతరురివా భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 167)

బహ్రమ్ ఖాన్ తప్పని సరిగా తన పుత్రుడిని బాధిస్తాడన్న కోపాగ్నిని, శమీవృక్షంలా తనలోనే దాచుకున్నాడు రాజు.

రాజుకు తెలుసు బహ్రామ్ ఖాన్ కన్ను సింహాసనం పైన ఉన్నదని. కానీ తప్పనిసరి పరిస్థితులలో ఇతర శత్రువులను అదపులో పెట్టేందుకు బహ్రామ్ ఖాన్‌ను భరిస్తూ వచ్చాడు. కానీ బహ్రామ్ ఖాన్ నుంచి ప్రమాదం పొంచి ఉన్నదని తెలుసు. అందుకని తన కొడుకు విజేత అయి తిరిగి వచ్చినా అతడిని ధైర్యంగా సత్కరించలేకపోయాడు. తన కొడుకుదే రాజ్యం అని ధైర్యంగా ప్రకటించలేడు. బహ్రామ్ ఖాన్ అంటే అంత భయం.

పానార్థ రాజధాన్యగ్రం తస్మిన్నవసరే నృపః।
ఆరురోహ సమ భృత్యైర్మృత్యునేవ ప్రచోదితః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 168)

ఈ సమయంలోనే మృత్యువుతో ప్రేరేపింతుడయినట్టి రాజు సేవకులతో కలసి మద్యపానం చేసేందుకు రాజప్రాసాదం పైకి వెళ్లాడు.

తత్ర పుష్కరసౌధాన్తలలయా కాచమండపే।
ధావన్ పపాత నాసాగ్రస్రవదత్రవిసంస్థూలః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 169)

రాజప్రాసాదం పైన పుష్కర సౌధం అనే అద్దాల మండపంలో ఆట ఆడుతూ  రాజు పరుగెత్తుతూ   పడిపోయాడు. అతడి ముక్కు నుంచి రక్తం రావటం ఆరంభమయింది.

కక్షాక్షిప్తభుజైర్భృత్యైనీతః శయనమండపమ్।
ధ్వస్తచ్ఛాయ ఇవాదర్శః సమూర్ధన్ శయనే అపతత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 170)

భృత్యులు రాజును భుజాలపై మోసుకు వెళ్లి శయన మండపంలో మంచంపై పడుకోబెట్టారు. ప్రతిబింబాన్ని చూపలేని దర్పణంలా రాజు మంచంపై పడి ఉన్నాడు.

‘నష్ట దర్పణమ్’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. అంటే, తన ప్రాథమిక లక్షణాలను  ప్రదర్శించే శక్తిని  కోల్పోయిన దర్పణం. దర్పణం లక్ష్యం ప్రతిబింబాన్ని ఏర్పాటు చేయటం. రాజు పడిపోయాడు. ముక్కులోంచి రక్తం కారుతోంది. సేవకులు మోసుకుని వెళ్లాల్సి వచ్చింది అంటే స్పృహ కోల్పోయి ఉంటాడు. స్పృహ కోల్పోవటం అంటే చైతన్య రహితుడవటం. ఎవరేమన్నా రాజు ప్రతిస్పందించలేదు. ఎలాగయితే ప్రతిబింబం ఏర్పాటు చేయలేదో దర్పణం, అలాంటి స్థితిలో ఉన్నాడన్న మాట రాజు. ప్రతిబింబం ఏర్పాటు చేయలేని దర్పణం పనికి రానట్టు, రాజు చైతన్యం లేని శరీరంలా మిగిలాడని సూచిస్తున్నాడు శ్రీవరుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version