[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
భిషజోస్యాత్రమన్యాప్తాన్ కోపి యోగీ చికిత్సకః।
విపోత్కటోపధస్తస్య యతతే స్మ కృతవ్యథః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 171)
నమ్మకస్తులైన వైద్యులను కాదని, ఒక యోగికి చికిత్సను అప్పచెప్పారు. అతడు విషాన్ని అధిక మోతాదులో వాడటం వల్ల రాజుకు బాధ ఎక్కువయింది.
‘ఓ యోగి’ అని శ్రీవరుడు వాడేడు. శ్రీవరుడు కానీ జోనరాజు కానీ తమ రచనలో ఇస్లామీయుల మతప్రచారకుల గురించి, వైద్య, విద్య పద్ధతుల గురించి ప్రస్తావించలేదు. కశ్మీరు ధార్మిక వ్యవస్థను రూపాంతరం చెందించిన సూఫీ మత గురువుల ప్రస్తావన రాజతరంగిణిలలో కనబడదు. ‘నమ్మకస్తులన వైద్యులు’ అన్న పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
‘జైనులాబిదీన్’ అధికారానికి వచ్చే సమయానికి కశ్మీరులో కేవలం గుప్పెడు పండిత్ కుటుంబాలు మిగిలాయి. జైనులాబిదీన్ ఆనారోగ్యం పాలయితే సరైన వైద్యుడు కశ్మీరులో దొరకలేదు. అందుకని పండితులను మళ్లీ పిలిపించాడు కశ్మీరుకు. వారి వైద్యం వల్ల నయమయిన తరువాత కశ్మీరులో లుప్తమైన విజ్ఞానాన్ని పునరుద్ధరించే ప్రయత్నంలో భాగంగా కశ్మీరు వదలి పారిపోయిన వారందరినీ మళ్లీ కశ్మీరు రప్పించాడు. ఉన్నత పదవులు ఇచ్చి గౌరవించాడు.
జైనులాబిదీన్‌పై ఇస్లామీ ఛాందసవాదులు నిరసన ప్రదర్శించింది, ఇస్లామేతరులకు ప్రాధాన్యం ఇవ్వటం విషయంలోనే. జైనులాబిదీన్ మరణించిన వెంటనే అతడు ఆదరించి, గౌరవించిన వారందరిపై దాడులు జరిగాయి. జైనులాబిదీన్ నమ్మకస్తులందరినీ దూరం పెట్టారు. నమ్మకస్తులయిన వైద్యులను దూరం పెట్టారంటే అదీ అర్థం. ఎవరికి నమ్మకస్తులు అన్నది ప్రశ్న. ఒక రెండు మూడు రోజుల్లో రాజుకు నమ్మకస్తులయిన వారు కాదు. ఎన్నో ఏళ్లుగా రాజభవనంలో వైద్యులుగా గౌరవమన్ననలందుకున్నవారు.
ఇక శ్రీవరుడు ‘యోగి’ అన్నది ‘హకీమ్’ కాని ‘సూఫీ’ కానీ కావచ్చును. జోనరాజు, శ్రీవరుడు కూడా తమ రాజతరంగిణి రచనలో ఇస్లామీయులను సూచించేందుకు కూడా మనకు అలవాటయిన పదాలే వాడేరు. ‘సూఫీ’ బదులు ‘యోగి’ అని ఉండవచ్చు. అప్పటికే కశ్మీరులో ఇస్లామీయులు కూడా భారతీయ ఋషుల్లా, యోగుల్లా చలామణీ అవటం, ఇస్లామీయుల్లోనూ ఋషి వ్యవస్థ ఏర్పాటు కావటం ఆరంభమయింది.
కశ్మీరుకే ప్రత్యేకమయిన ఋషి వ్యవస్థను షేఖ్ నూర్-ఊద్-దీన్ వలి ఆరంభించాడు. ఈయనను ‘నంద ఋషి’ అంటారు. ‘అలమ్‌దార్-ఎ-కశ్మీర్’ అని కూడా అంటారు. హిందూ – బౌద్ధ ధర్మాలలోని తంత్రాలనూ మార్మికతనూ ఇస్లామ్ లోని ఆధ్యాత్మికతనూ మిళితం చేసి ఈయన ఏర్పాటు చేసిన ఇస్లాం ఋషి వ్యవస్థ ‘కశ్మీరియత్’ను నిర్వచించిందని భావిస్తారు. ఈయన జీవిత కాలం 1377 నుండి 1440 వరకూ. ఈయన తరువాత నుంచి ఈనాటి వరకూ కశ్మీరులో సూఫీ ఋషి వ్యవస్థ కొనసాగుతూ వస్తోంది. కశ్మీరీ కవిత్వంలోనూ, జానపద గీతాల్లోనూ ఈ వ్యవస్థ ప్రభావం కనిపిస్తుంది. అనేక ‘జియారాత్’ లలో హిందూ, ముస్లింలు పూజలు చేస్తారు. శ్రీవరుడి కాలానికి ఈ వ్యవస్థ ఉచ్చదశలో ఉంది. కాబట్టి, ఈ వ్యవస్థకు సంబంధించిన వారెవరో వైద్యం చేసి ఉండవచ్చు. అందుకని ప్రత్యేకంగా పాతవారిని పక్కనపెట్టి అని చెప్తున్నాడు శ్రీవరుడు. అయితే, పర్షియన్ రచయితలు మాత్రం ఎవరు చికిత్స చేశారో చెప్పటం లేదు కాని రాజు మరణించాడని మాత్రం చెప్తున్నారు. తమ వైఫల్యానికి సంబంధించిన విషయాలను ప్రస్తావించకపోవటం, చిన్న విషయాన్ని గొప్ప విషయాలుగా చిత్రించటం పర్షియన్ రచయితలకు అలవాటు.
తస్యోపధ ప్రయోగేణ ప్రాప్తదాహో దివానిశమ్।
కాంక్షతి స్మ స్వమరణ క్షణమాత్రం న జీవనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 172)
ఆ యోగి ఔషద ప్రభావంతో రాత్రింబవళ్లు దాహంతో తపించాడు రాజు. ప్రతిక్షణం మరణాన్ని కోరుకుంటూ ఒక్కో క్షణాన్ని భారంగా గడిపాడు.
రాజధాన్యంతరే రాజసుతః స్వజనకాన్తికే।
ఆయుక్తాహ్మదసంయుక్తస్తహినేషు స్థితిం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 173)
అధికారి అష్మదా వెంట రాగా రాకుమారుడు మూడు రోజులు రాజధానిలోనే ఉండిపోయాడు.
ముమూషా పితరి జ్ఞాత్వా మహతో దర్శనాగవాన్।
తన్నిర్గమ నిరోధాయ ద్వారధాన్యాం భటాన్ వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 174)
తండ్రి మరణం ఆసన్నమైందని తెలుసుకుని, తండ్రిని చూసేందుకు వచ్చే వారిని నియంత్రించేందుకు ద్వారాల వద్ద బలగాలను నియమించాడు.
స్యాలయస్థా అనుజో రాజ్ఞో భయహర్షాప్తసంభ్రమః।
కారానివ రలిస్తీక్షాంశ్చారాన్ సంచార యన్నభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 175)
సూర్యుడు తన కిరణాలు నలుదిక్కులకు పంపినట్టు, సంతోషంలో బహ్రామ్‌ఖాన్, తాను ఇంట్లోనే ఉండి గూఢచారులను నలువైపులకూ పంపించాడు.
తత్కాలం రాజలక్ష్మీః సా పితృవ్యభ్రాతృపుత్రయోః।
ద్వయోరాసీత్ సమారూఢా చిత్తే సంశయధీరివ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 176)
అదృష్టదేవత సోదరుడిని వరించాలా, పుత్రుడిని వరించాలా అన్న సందిగ్ధంలో పడ్డట్టుంది.
రాజ్యాధికారం కోసం బహ్రమ్ ఖాన్ ఎదురు చూస్తున్నాడు. హసన్ ఖాన్ సిద్ధంగా ఉన్నాడు. ఒకరు రాజుకు సోదరుడు. ఇంకొకరు రాకుమారుడు. ఇద్దరి లక్ష్యం కశ్మీరుపై అధికారం. ఎవరికి దక్కాలో తెలియని అయోమయంలో ఉంది అదృష్టం అంటున్నాడు శ్రీవరుడు. ఇలాంటి సందర్భంలో ఎవరు పాచికలను సరిగ్గా కదుపుతారో రాజ్యం వారిదవుతుంది. అన్ని అర్హతలున్నా సరైన సమయంలో, సరైన రీతిలో వ్యవహరించలేని వాడిని అదృష్టం వరించదు. క్షమించదు. ఇక్కడ ఇద్దరూ శక్తిమంతులు. వీరులు. సింహసనార్హత ఉన్నవారు. సింహాసనంపై ఆశ ఉన్నవారు. వారిద్దరిలో ఎవరు రాజవుతారన్నది కాలమే నిర్ణయిస్తుంది.
అత్రాంతరే అహ్మదాయుక్తః సంమంత్ర్య సచినైః సహ।
బహ్రామఖాన మాగత్య యుక్తమిత్యబ్రవీద్ వచః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 177)
ఇంతలో అధికారి అహ్మదా, ఇతర మంత్రులతో చర్చించి, బహ్రామ్ ఖాన్ దగ్గరకు వెళ్లి ఇలా అన్నాడు.
వామి హైదరశాహోద్య సమర్థ్య స్వవయస్త్వయి।
సుగృహీతాభిధో భ్రాతా ప్రయాతః కీర్తిశేషతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 178)
ఈరోజు రాజు హైదర్ శాహ ఆయన ఆయువు నీకు సమర్పించి దివంగతుడయ్యాడు.
జ్యేష్ఠోఅధునావశిష్టస్తద్భవాన్ భజ నృపాసనమ్।
స్వయ హస్సన ఖానాయ యౌవరాజ్య ప్రదీయతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 179)
త్వత్పిత్రౌ మహతో యత్నాద్ రక్షితా చరితా సతీ।
సేయం త్వయాద్య నగరీ పాల్యా కులవధూరివ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 180)
కిమన్యత్ పురలుంటాకాః కాకా ఇవ బలిప్రియాః।
యథాగత ప్రయాన్త్వేతే కుశబ్దా మలినద్విషః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 181)
ఇప్పుడు రాచకుటుంబంలో అందరికన్నా పెద్దవారు మీరే. రాజ్యం స్వీకరించండి. హసన్ ఖాన్‌ను యువరాజుగా ప్రకటించండి. ఎంతో శ్రమించి మీ తండ్రిగారు ఈ నగరాన్ని ప్రజలను రక్షించారు. వారి మరణంతో చకితమైన ఉన్న ప్రజలను కుల వధువును రక్షించినట్టు కాపాడాల్సిన బాధ్యత మీదే. నగరంపై పడి దోచుకుంటున్న వారు ఎలా వచ్చారో అలాగే వారిని వెడలనంపాల్సిన బాధ్యత మీదే.
శ్రుత్వేతి భాషితం తస్య కోపరూక్షాక్షరో అబ్రవీత్।
సుస్నిగ్ధో జనకస్త్యక్తస్తాదృక్కల్పద్రుమోపమః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 182)
సదైవాదమఖానః స వాధితస్తదుపాధిభిః।
పరలోకమనాలోచ్య స్వార్థ సంత్యజ్య దూరతః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 183)
అస్వస్థః స యథా భ్రాతా సేవితః సతత మయా।
జానాత్యేవం న కో రాజ్య యథా తస్య మయార్జితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 184)
కోయం మద్భ్రాతృపుత్రోద్య వద కైవాస్య యోగ్యతా।
అస్మిన్ మత్పైతృకే రాజ్యే యోగ్యో మదపరస్తు కః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 185)
వారి మాటలు విన్న బహ్రమ్ ఖాన్ కోపంతో అన్నాడు కఠినంగా
“నా స్వార్ధం వదలి, భవిష్యత్తు, గురించి ఆలోచంచకుండా కోరినది ఇచ్చే కల్పవృక్షం లాంటి తండ్రిని వ్యతిరేకించాను. రాజ్యం చేయటం చేతకాని ఈ సోదరుడి కోసం నేను ఆదమ్ ఖాన్‌ను వ్యతిరేకించాను. నేను ఇతడికి రాజ్యం దక్కటం కోసం ఎంత త్యాగం చేశానో ఎవరికి తెలియదు? ఇప్పుడు నా సోదరుడి కొడుకు ఎవరు? వాడి విలువెంత? నాకు కాక నా తండ్రి సామ్రాజ్యానికి అధిపతి అయ్యే అర్హత ఇంకెవరికి ఉంది? నా సోదరుడి కొడుకు అయినా యువకుడే. వాడికన్నా వయసులో నేను పెద్దవాడిని, రాజ్యార్హత ఉన్నవాడిని. వాడితో రాజీ పడాల్సిన అవసరం నాకేం ఉంది? శక్తిమంతుడు అనుభవించే భోగాలు అనుభవించటంలో నాకు అడ్డేముంది?”
కాలి దగ్గరకు వచ్చిన అదృష్టాన్ని కాలదన్నటం అంటే ఇదే.
దేశ హితం కోరిన మంత్రులు రాజ్యాన్ని పళ్లెంతో తెచ్చి అర్పించారు బహ్రమ్ ఖాన్‌కు. రాజ్యం కోసం వారసుల నడుమ పోరు జరగకూడదని వారు బహ్రమ్ ఖాన్‍ను రాజుగా, హసన్ షాహ్‌ను యువరాజుగా ప్రకటించమని కోరారు. కానీ అహంకారంతో, రాజ్యం తనదేనన్న ధీమాతో, తాను తప్ప మరొకరు దిక్కు లేరన్న గర్వంతో బ్రహ్మమ్ ఖాన్ తన సోదరుడి కొడుకును యువరాజుగా అంగీకరించలేదు. అంటే, రాజ్యాధికారం తన తర్వాత తన సోదరుడి సంతానానికి ఇచ్చేందుకు సిద్ధంగా లేడన్నమాట. హసన్ శాహ్ పిల్లవాడు కాదు. యుద్ధాలు తెలిసిన వాడు. కొద్ది రోజుల క్రితమే దిగ్విజయ యాత్ర చేసి వచ్చినవాడు. రాజ్యం కోసం కుట్రలు జరుగుతున్నాయని. తండ్రి మరణానికి చేరువనున్నాడని తెలియగానే వెంటనే వెనక్కి వచ్చాడు. అంటే, రాజ్యధికారంపై ఆశ ఉన్నవాడు. కాబట్టి, అతడిని కాదని మరొకరికి అధికారం ఇస్తే, యుద్ధానికి వెనుకంజ వేయడు. కశ్మీరు ఇప్పటికే ఎంతో నష్టపోయి ఉంది. సరైన పాలన లేక అల్లకల్లోలంలో ఉంది. అధికారం కోసం మరో పోరును భరించలేదు. దాంతో ఎంతో ఆలోచించి రాజ్యక్షేమం కోరిన మంత్రులు నిర్ణయానికి రావాల్సి ఉంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
