Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-110

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

ద్వితీయ తరంగం

స కనీయానహం జ్యేష్ఠో వయసా చ గుణేన చ।
పృథివ్యాం వీరభోగ్యాయాం సామ్నః కోవసరోధునా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 186)

నా సోదరుడి కొడుకు వయసులో నా కన్నా చిన్నవాడు. గుణంలోనూ నా కన్నా తక్కువ. నేను పెద్దవాడిని. రాజ్యం వీరభోజ్యం. నాకన్నా తక్కువ వాడితో సామం అవసరం ఏముంది?

‘సామదాన బేధ దండోపాయాలు’ శత్రువులపై విజయం సాధించేందుకు అనుసరించవలసిన నాలుగు మార్గాలు. ఇందులో సామం అంటే సంధి. సోదరుడి కొడుకు తనకన్నా చిన్నవాడు. వాడితో సంధి చేసుకోవటం ఏమిటి? అన్న అహంకారం ప్రదర్శించాడు బహ్రామ్ ఖాన్.

ప్రజల సుఖ సంతోషాలు కోరే రాజు వీలయినంత వరకూ సంఘర్షణను పరిత్యజిస్తాడు. సామరస్య పూర్వకమైన పరిష్కారం కోసమే ప్రయత్నిస్తాడు. బహ్రామ్ ఖాన్ ఆ సంయమనం పాటించలేదు. రాజ్యధికారం అతని కాలి దగ్గరకు వచ్చింది. కనీసం రాజ్యాధికారాన్ని పంచుకోమని కూడా అనలేదు. కేవలం హసన్ ఖాన్‌ను యువరాజుగా ప్రకటించమన్నారు. దానికి కూడా బహ్రమ్ ఖాన్ సిద్ధంగా లేడు. ‘యుద్ధం’ మంత్రులకు ఇష్టం లేదు. జైనులాబిదీన్ చివరి రోజుల నుంచీ కశ్మీరు అశాంతిగానే ఉంది. ఇప్పుడయినా శాంతి నెలకొల్పాలని మంత్రులు ప్రయత్నించారు.

ఇత్యాద్యనుచితం యత్తంచ్చోక్తవా తం ప్రత్యమోచయత్।
యైః స గ్రథితకన్థోభూద రాజ్యార్థే కృతభావనైః।
అప్రాప్యైతాంస్తథా మత్వా నిరాశః సమపద్యత॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 187)

ఇలాంటి అనుచితమైన మాటలు మాట్లాడటం వల్ల రాజ్యం అప్పగించాలనుకున్న వారు అతడిని వదలి వెళ్లిపోయారు. రాజ్యప్రాప్తి నుంచి ముక్తి లభించింది అతడికి. ఎవరయితే రాజ్యాధికారం కోసం అతడిని ఉత్సాహపరిచారో, వారెవరూ కనబడక పోవటం రాజ్యధికారం అప్పగించేందుకు తనకు ఎవ్వరూ సహాయం చేయరని అర్థమై అతడు నిరాశ చెందాడు.

ప్రత్యాసన్నే నాశే రుద్ధజలౌఘస్య బద్ధమూలస్య।
కుపథాత్ ప్రసరత్యాదౌ ధృతిరివ సేతోర్మతిర్జన్తోః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 188)

నాశనకాలం దగ్గరకు వచ్చినప్పుడు, ఆనకట్ట తెగి నీరు బంధనాలను దాటి ప్రవహించినట్టు ప్రాణి బుద్ధి పొరపాటు వైపు పరుగిడుతుంది.

యుక్తమాయుక్త వాక్యం చేదగ్రహీష్యన్నయాన్వితః।
తురగాద్యర్జితం సర్వమదాస్యచ్చేత్ స్వయం గతః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 189)

అథవాప్తం తమేకం చేదహనిష్యద్ధలోన్నతః।
కోశం హర్తుమయాస్యచ్చేత్ స్థితం పితృపురాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 190)

అథవా బాహ్యదేశం చేదగమిష్యత్ తదధ్వనా।
నివృత్తః క్రమరాజ్యే చేదాక్రమిప్యచ్ఛనైర్మహీమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 191)

క్రమాప్తమకలస్యాస్య కిము నశ్యేద్ విలమ్బః।
బాలవాలిశభృత్యోక్తయా యుక్తవాక్యావినిశ్చయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 192)

అనభిజ్ఞతయా తేన వత కిం కిం న హారితమ్।
నామకోపి చిర భోక్ష్యత్యతితీక్ష్ణతయా ధియా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 193)

అనుభవ రాహిత్యం వల్ల, మూర్ఘత్వం వల్ల, స్నేహితుల చెడు సలహాల వల్ల బహ్రామ్ ఖాన్ ఏమేం కోల్పోలేదు? (సర్వం కోల్పోయాడు). మంచి సలహా నుంచి చెడు సలహాను గుర్తించి, విచక్షణతో మంచి మాటలను పాటించి ఉన్నా, వెంటనే తనకు చెందిన అశ్వాలను, ఇతరాలను తన వద్ద కట్టుదిట్టం చేసుకుని ఉన్నా, తనను నమ్మిన సోదరుడి కొడుకును అవకాశం చూసి చంపేసి ఉన్నా, తండ్రి కోశాగారం పై పట్టు సాధించినా,  రాజ్యం వదలి  వెళ్లిపోయి, తన సైన్యంతో నెమ్మదిగా క్రమరాజ్యాన్ని ఆక్రమించుకున్నా, క్రమరాజ్యంపై అధికారం చేయాల్సినవాడు సర్వం కోల్పోయేవాడు కాదు. సరైన సమయంలో సరైన చర్యలు సత్వరం చేపట్టే బదులు ఆలస్యం చేయటం వల్ల బహ్రామ్ ఖాన్ చిరకాలం రాజ్యం చేసే అవకాశం కోల్పోయాడు. దెబ్బతిన్నాడు.

వరమజ్ఞే సుతే రాజ్ఞో రాజ్యం దత్త్వాస్తి నః సుఖమ్।
ఇత్యేకమేవం సబోధ్య బలినం నృపవల్లభమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 194)

ఆయుక్తాద్మదుమల్లేకః సంమన్త్ర్య సచివైః సహ।
చక్రే సంభావనా రాజ్యనిశ్చయే రాజమూనవే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 195)

రాజు ఆజ్ఞననుసరించి పుత్రుడికి రాజ్యాధికారం అప్పగించి మనం ప్రశాంతంగా ఉండటం మంచిదని వలీ రాజమంత్రులందరితో అన్నాడు. మంత్రులతో ఇతర పెద్దలతో, రాజపుత్రుడికే రాజ్యం అప్పగించే విషయం అహ్మద్ మాలిక్ చర్చించాడు.

ఈ వలీ, అహ్మద్ మాలిక్‌లు ఎవరో శ్రీవరుడు స్పష్టంగా చెప్పలేదు. కానీ, మంత్రాంగాన్ని ప్రభావితం చేస్తున్నారంటే రాజ్యంలో శక్తివంతులని భావించవచ్చు. రాజు ఎవరో నిర్ణయించే స్థితిలో ఉన్నారు వీరు.

గత్వాస్కందం ప్రదాస్యామి బహ్లామమితి దర్పతః।
అభిమన్యు ప్రతీహారో నిశ్చికాయాభిషేణనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 196)

బహ్రమ్ ఖాన్‌తో యుద్ధం చేసి అతడి మదమణుస్తానని ప్రతీహారి అభిమన్యుడు నిశ్చయించాడు.

అథ స్వచ్ఛందవా స శ్రుత్వా తూర్ణం సుతాన్వితః।
బహామఖానో విత్రాణో నిరగాన్నగరాన్తరాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 197)

ఈ వార్త విని భయపడిన బహ్రామ్ ఖాన్ శ్రీనగరంలో తనకూ రక్షణ లేదని భావించి పుత్రుడిని వెంట తీసుకుని నగరం వదలి వెళ్లిపోయడు.

కొద్ది గంటల క్రితం దాకా కశ్మీరు రాజు అవ్వాల్సిన వాడు, మంత్రులు చెప్పిన మాట విని రాజీ పడి ఉంటే అధికారం దక్కేది. కానీ అహంకారం వల్ల ఇప్పుడు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదలి పారిపోవాల్సి వచ్చింది.

దృష్ట్వా మహార్ఘమణిమోక్తికవిద్రుభౌఘాన్
రత్నాకర శ్రయతి లుగ్ఘమతిః స ఏకః।
తత్తన్మహాభయకరాన్ మకరాంస్తదీయాన్
వీర్యేణ యః శమయితు గతభీః సమర్థః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 198)

ఎవరైతే సముద్రంలోని మణిమాణిక్యలు సాధిచాలన్న పట్టుదలతో ఉంటారో వారే సముద్ర జలాల్లోకి దూకుతారు. సముద్రం లోని రాక్షసులతో పోరాడుతారు. తాము అనుకున్నది పొందుతారు.

బహ్రామ్ ఖాన్ నిలచి పోరాడవలసిందని సూచిస్తున్నాడు శ్రీవరుడు. బహ్రామ్ ఖాన్ ‌కు రాజ్యాధికారం సాధించాలన్న తపన తీవ్రంగా లేదన్నదీ చెప్తున్నాడు శ్రీవరుడు. అందుకే నిలచి పోరాడకుండా పారిపోతున్నాడు. ఇలాంటి వాడు ‘రాజ్యం వీరభోజ్యం’ అనకుండా రాజీ పడి ఉండాల్సిందన్న ఆలోచనను కలిగిస్తున్నాడు.

దృష్ట్వా స్వభ్రాతృపుత్రస్య చరిత చిత్రమత్ర సః।
విత్రాసిత బలః పుత్రయుతో ద్వారాధ్వనాచలత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 199)

తన సోదరుడి పుత్రుడి గురించిన విచిత్రమైన కథలు విన్న బహ్రామ్ ఖాన్, అతని సైన్యం భయపడి ద్వార మార్గం నుంచి పారిపోయాయి. బహ్రామ్ ఖాన్ వెంట అతని పుత్రుడు కూడా ఉన్నాడు.

యథైవాదమఖానస్య నిష్కాసనమయ వ్యఘాత్।
తథైవాస్యాభవద్ రాత్రౌ న చిరేణ ఫలత్యధః ॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 200)

తన సోదరుడు అదమ్ ఖాన్ కశ్మీరు వదలి పారిపోయేందుకు ఎలాంటి పరిస్థితులు కల్పించాడో, అలాంటి పరిస్థితులలోనే బహ్రామ్ ఖాన్ కశ్మీరు వదలి పారిపోవాల్సి వచ్చింది. పాపపు ఫలితం త్వరగానే అనుభవించక తప్పదు కదా!

రాజ్య స దశమాసాన్దే కృత్వా మాసి చ భాఘవే।
వర్షే అష్టచత్వారింశేగాద్ దివ శ్రీపంచమీదినే॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 201)

వైశాఖ మాసం, పంచమి రోజు, 48వ సంవత్సరంలో, ఒక సంవత్సరం, 10 నెలలు రాజ్యం చేసి హైదర్ ఖాన్ మరణించాడు.

అబుల్ ఫజల్, నిజాబుద్దీన్, ఫరిస్తా వంటి వారు, వారి రచనలను ప్రామాణికంగా తీసుకున్న కలనల్ హెగ్ కూడా హైదర్ షాహ 14 నెలలు పాలించాడని రాశారు. ‘బహరిస్తాన్’ మాత్రం శ్రీవరుడిని అనుసరించింది. లభించిన నాణాలు కూడా శ్రీవరుడిచ్చిన తేదీలనే నిరూపించాయి. అయితే పాఠ్య పుస్తకాలలో మాత్రం పర్షియన్ రచయితల తేదీలనే ప్రామాణికంగా తీసుకున్నారు. తరువాత ప్రతులను పరిశీలించిన వారు పర్షియన్ రచయితల పొరపాటును కనుక్కున్నారు. పర్షియన్ రచనలను కాపీ  చేసేప్పుడు ‘యక్ సాల్ దహ మహ’ అన్నదాన్ని  కాపీ చేసే బదులు ‘యక్ సాల్ దన్వి మాహ’ అని కాపీ చేశారు. ఆ తరువాత కాపీ చేసిన ప్రతిని  మిగతా అంతా అనుసరించటంతో ఒక సంవత్సరం 10 నెలలు కాస్తా ‘ఒక సంవత్సరం రెండు నెలలుగా’ నిర్ధారితమయింది. ఈ పొరపాటును కనుగొన్న తరువాత కూడా పాఠ్యపుస్తకాలను సవరించలేదన్నది వేరే విషయం, ఇప్పుడు కశ్మీరులో ఒక రాజు పాలన ఎన్ని నెలలు అనే విషయం కన్నా ప్రాధాన్యం వహించే విషయాలు అనేకం ఉన్నాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version