[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ద్వితీయ తరంగం
వేతాలోవసదుద్దండస్తంభమండితమండపే।
తేనైవోచ్చండకోపేన ఖండితః క్రియయా నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 202)
రాజు మరణం గురించి కొందరు, పెద్ద స్తంభాల మండపంలో ఉన్న బేతాళుడికి రాజు దుశ్చర్యలు కోపం కలిగించాయనీ, అతను రాజును ముక్కలు ముక్కలు చేసి చంపేశాడనీ అంటారు.
ఇత్యూచుః కేపి కే అప్యూచుర్యోగినోశస్తహస్తతః।
న్యస్తోత్కటౌపధేర్ధ్వ స్తరుచిరస్తమగాన్నృపః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 203)
ఒక వైద్యం తెలియని యోగి ఇచ్చిన మందు వల్ల రాజు కాంతి కోల్పోయి మరణించాడని కొందరంటారు.
కేచిద్ భ్రాత్రైవ దుష్టేన కైవల్యాత్ సుతవర్జితే।
భూపతేందుశ్చికిత్సార్థే కారితా భిషజస్త్వరామ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 204)
రాకుమారుడు దూరంగా ఉన్న సమయం చూసి దుష్ట సోదరుడు, రాజుకు సరైన వైద్యం చేయకుండా వైద్యడిపై ఒత్తిడి తెచ్చాడని కొందరు అంటారు.
దివ్యం మౌసులవేదేన కృత్వాశ్వస్తతయా తయా।
బహిః శ్యౌటాలదేశాదౌ హత్వా ద్రోహేణ పార్థివాన్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 205)
యేభ్యశ్చ రాజ్యతిలకం సింహాసనగతో అగ్రహీత్।
పిత్ర్యాంస్తాన్ సచివాన్ హత్వా ప్రమీత ఇతి కేచన॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 206)
అతని తండ్రికి సన్నిహితులు, సింహాసనం అధిరోహించేందుకు సహాయం చేసినవారందరినీ, శ్యౌటాల దేశాలకు చెందిన ముస్లింల వేదం (ఖురాన్) పై శపధం చేసి నమ్మకం కలిగించి మరీ మోసం చేసి చంపినందుకు, రాజు చచ్చాడు అని అంటారు కొందరు.
నూనం స పితృశాపేన తత్తత్పాపేన దూషితః।
హిమోఘ ఇవ తాపేన విలయం ప్రాపదంజసా॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 207)
తాను చేసిన అనేక నేరాల ఫలితంగా, తండ్రి శాపం వల్ల, ఎండలో కరిగే మంచులాగా కరిగిపోయాడు రాజు.
సుల్తాన్ మరణం గురించి ఆ కాలం ప్రజలు ఎలా అనుకుంటున్నారో, రాజ్యంలో ప్రజల భావనలేమిటో వర్ణిస్తున్నాడు శ్రీవరుడు. ఇది సాధారణమే. పేరున్న వారి నుంచి సామాన్యుల వరకూ మరణం సంభవించగానే పలువురు పలురకాల కారణాలు చెప్తారు. పైకి అధికారికంగా చెప్పేది ఒకటయితే, ఎవరికి వారు, వారి వారి ఊహలను బట్టి మరణం ఎందుకు సంభవించిందో నిర్ధారిస్తారు.
ఓ రాజకీయ నాయకుడు హఠాత్తుగా మరణిస్తే, వెంటనే అతని అడ్డు తొలగించి అదికారం సాధించేందుకు జరిగిన కుట్ర అంటారు కొందరు. కాదు, అతని స్థానాన్ని ఆక్రమించేందుకు కొడుకే చంపించాడంటారు ఇంకొందరు. కాదు, కాదు, తన నిర్ణయాలతో ఎంతో మందికి అన్యాయం చేశాడు, ఆ ఉసురు తగిలిందని అంటారు ఇంకొందరు. ఇది కాదు, ఫలానా గుడి భూములపై కన్నేసి, అన్యాయం చేశాడు; ఆ దేవుడు మహిమ చూపించాడంటారు ఇంకొందరు. ఇలా ఎవరికి వారు వారి దృక్కోణంలో జరిగిన దానికి కారణం ఊహిస్తారు. అదే నిజమని నమ్ముతారు.
కశ్మీరులో కూడా ఇదే జరిగింది. రాజు తాగుబోతు. ఆనారోగ్యం పాలయ్యాడు. మరణించాడు. కానీ దానికి పలు రకాల కారణాలు ఊహిస్తున్నారు ఎవరికి వారు. బేతాళుడి నుంచి జైనులాబిదీన్ శాపం వరకూ ఎన్నెన్నో కారణాలను ఊహిస్తున్నారు.
నిష్కంటకం పుర జ్ఞాత్వా నిఃశంకో నృపనందనః।
జనక శివికారూఢ స నినాయ శవాజిరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 208)
రాజధానిలో తనకు శత్రువుల భయం లేదన్న ధైర్యంతో రాకుమారుడు తండ్రి శవయాత్రలో పాల్గొన్నాడు. శవాన్ని స్మశానానికి తీసుకెళ్లాడు.
మంజూషికాన్తరాన్నీత్వా త పటైకావృత శవమ్।
పితుః పాదతలే తత్ర భూగర్భభ్యన్తరే అక్షిపత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 209)
ఏక వస్త్రంతో కప్పిన తండ్రి శవాన్ని శవ పేటిక నుంచి తీసి, అతని తండ్రి పాదాల వద్ద తవ్విన గుంటలో ఉంచాడు.
శవాన్ని సమాధిలో ఉంచాడన్నమాట. ఏకవస్త్రం అంటే ‘కఫన్’ , శవంపై కప్పే గుడ్డ.
సర్వే మృన్ముష్టికా మాత్రమేతదేవేతి శసినః।
ముఖావలోకన కృత్వా తస్మిన్ మృన్ముష్టికా జహుః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 210)
అందరూ రాజు శరీరాన్ని మట్టిలా భావించి శవం ముఖావలోకనం చేస్తూ పిడికిలి నిండుగా మట్టిని శవంపై వేశారు.
గర్తం తత్ర సమాపూర్య శిలాం మధ్యోన్నతాం న్యధుః।
కఠినోయమభూద్ యుద్ధే జనానిత్యేవ సూచితుమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 211)
శవాన్ని ఉంచిన సమాధిని మట్టితో నింపేసి, పైన శిలను ఉంచారు. యుద్ధంలో రాజు శిలలా కఠినంగా వ్యవహరించేవాడని సూచనగా కాబోలు.
అరుదన్ సేవకాస్తస్య కృతవక్షోవదారణాః।
స్మృత్వా స్వామిప్రసాదానాం ముఖరీకృతదిగ్ముఖాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 212)
రాజు సేవకులు, రాజు తమపై కురిపించిన అనుగ్రహాలను తలచుకుని వక్షస్థలం కొట్టుకుంటూ రోదించారు. వారి రోదనకు దిక్కులు కూడా స్పందించాయి.
తద్రాజ్యం స్వల్పకాలీనః ప్రసాదసుభగోర్జితమ్।
అవిందన్ సేవకాస్తస్య స్వప్నస్వర్గాప్తిసన్నిభమ్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 213)
రాజు వల్ల కొద్దికాలంపాటూ లాభాలు పొందిన సేవకులు అతని పాలనను ఎంతో గొప్ప పాలనగా ఒక కలలాగా భావించారు.
పారిసీ భాషయా హిందుస్థావ్ వాచా చ భూపతిః।
కావ్యం గీతం వ్యధాద్ యేన ప్రశంసన్తి న కే జనాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 214)
హైదర్ షాహ పారసీ, హిందుస్తానీ భాషలలో, కావ్యాలు, గీతాలు రచించాడు. అందుకని అతడిని ప్రశంసించని వారు లేరు.
హైదర్ షాహ ‘కవి’ అన్న విషయం ఇక్కడ చెప్తున్నాడు శ్రీవరుడు. ఇంత వరకూ అతడు త్రాగుబోతు, చెప్పుడు మాటలు వింటాడు, నీచమైన అలవాట్లున్నాయని చెప్తూ వచ్చిన శ్రీవరుడు, ఇప్పుడతను పారసీ, హిందుస్తానీ భాషలలో కావ్యాలు, గీతాలు రాసేవాడని చెప్తున్నాడు. శ్రీవరుడు అతడి గురువు. కాబట్టి హైదర్ షాహ గురించి శ్రీవరుడికి బాగా తెలుసు. ‘చచ్చిన వాడి కళ్లు చారెడంత’, అంటారు అలాగ, మరణించిన తరువాత అతనిలో మంచిని మాత్రమే చెప్తున్నాడు శ్రీవరుడు.
పురాణధర్మశాస్త్రాణి మోక్షోపాయాదిసంహితాః।
శృణ్వతో భూపతేరాసీద్ యామినీషు ప్రజాగరః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 215)
పురాణాలు, ధర్మశాస్త్రాలు, మోక్షోపాయ సంహిత వంటివి వింటూ రాత్రిళ్లు మేల్కొని ఉండేవాడు రాజు.
రాత్రంతా తాగటం, ఆడూతూ పాడటం, నీచతా పరిపూర్ణమైన అలవాట్లతో నీచులతో గడిపేవాడు అని ఇంతకు ముందే చెప్పిన శ్రీవరుడు ఇప్పుడు పురాణాలు, శాస్త్రాలు వింటూ రాత్రిళ్లు గడిపేవాడని చెప్తున్నాడు.
శ్రీవరుడు అబద్ధం చెప్పటం లేదు. నిజమే చెప్తున్నాడు.
శ్రీవరుడు అతడి గురువు కాబట్టి, శాస్త్రాలు, పురాణాలు, సంహితలు శిష్యుడు చదవటంలో ఆశ్చర్యం లేదు. అయితే ఇదంతా అధికారం రాకముందని, ఇంకా జైనులాబిదీన్ నీడ దాటి ఎదగనకాలానికి చెందినదీ అయి ఉంటుంది. అధికారం అందిరావటం తోటే, దిగజారి ఉంటాడు హైదర్ షాహ.
శ్రీవరుడు చెప్పినట్టు హైదర్ షాహ పురాణాలు చదివేడు అంటే మనకలవాటైన అష్టాదశ పురాణాలు కాదు. కశ్మీరుకు చెందిన అతి ప్రాచీనమైన ‘నీలమత పురాణం’ అని అర్థం చేసుకోవాలి. ఆయన ధర్మశాస్త్రాలు చదివేవాడంటే, కేవలం హిందూ ధర్మశాస్త్రాలు మాత్రమే కాదు, ఇస్లాం ధర్మశాస్త్రాలు కూడా చదివేవాడని భావించాలి. అలాగే, మోక్షోపాయ సంహిత చదివేవాడంటే, అదో ప్రత్యేకమైన పుస్తకం కాదు. మోక్ష వర్ణన ఉండే గ్రంథాలు, అంటే, యోగవాశిష్టం, రామాయణం వంటి గ్రంథాలు చదివేవాడని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ శ్రీవరుడు అతడికి విద్యార్ధిగా ఉన్నప్పుడు చెప్పి ఉంటాడు. అందువల్లే జైనులాబిదీన్ కు అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయినా, ఇస్లాం పాలనలో ఇతరులపై అత్యాచారాలు జరుగుతున్నా, శ్రీవరుడు భద్రంగా ఉండగలిగేడు.
దోషాకులాః పరగృహాశుభపాకదా యే
ధూకాదయో దిన పతేరుదయం ద్విపన్తి।
తస్మిన్ సముద్యతి మహారుచిరప్రకాశో –
అనిష్టా భ్రమన్తి విపినేషు గుహాప్తదుఃఖాః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 216)
గుడ్లగూబలు ఇతర పక్షులు రాత్రి అవటం కోసం ఎదురు చూస్తాయి. రాత్రి అవుతూనే అవి ఇతరుల ఇళ్లల్లో గోల చేసి ఇబ్బంది పెడతాయి. వాటికి సూర్యోదయం నచ్చదు. సూర్యుడు ఉదయించటంతోటే, వెలుతురు భరించలేక అవి దుఃఖంతో గుహల్లో దాక్కుటాయి. అడవుల్లో తిరుగుతాయి.
సమర్థుడైన రాజు సూర్యుడు. అతడు లేని సమయంలో, అంటే రాత్రిపూట గుడ్లగూబలు, ఇతర పక్షులు స్వైర విహారం చేస్తాయి. దుష్టులు, దొంగలు రాజు లేని సమయంలో ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తారు. సూర్యుడు ఉదయిస్తే దాక్కుంటారు, చీకటి కోసం ఎదురుచూస్తూ.
దుష్టాన్ మేరేప్తకారాదీన్ జ్ఞాత్వానిష్టాన్ విశిష్టఘీః।
ఖానోన్యేద్యుః సదుఃఖోపి కారాగారాన్తరే న్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 217)
విష్టమైన తెలివితేటలు కల ఖాన్ (కాబోయే రాజు) దుఃఖితుడై ఉండి కూడా మేరేప్తవార్ (మీర్ ఇఫ్తకార్) వంటి వారిని తనకు వ్యతిరేకులుగా భావించి కారాగారంలో బంధించాడు.
అధికారం రాకముందే తన శత్రువుల అడ్డు తొలగించుకుంటున్నాడన్న మాట.
నిర్వత్యన్త్యక్రియాం సర్వాం స పితుర్వ్యయశాలినీమ్।
రాజ్యాభిషేకసభారం చక్రే పోడశభిర్దినైః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 218)
తన తండ్రి కోసం అతి ఖరీదైన కార్యక్రమాలు నిర్వహించాడు. 16 రోజులలో రాజ్యధికార భారం స్వీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.
ఘూకాదయో నభసి సన్తి పరాప్రశస్తా స్తావత్
ప్రదోషసమయాప్తసుఖప్రచారాః।
ఆశాప్రకాశవిషదో విలసత్ప్రకాశో
భాస్వాన్న యావదుదయం కురుతే సుచండః॥
(శ్రీవర రాజతరంగిణి, ద్వితీయ తరంగం, 219)
సూర్యుడు ఉదయించి అన్ని వైపులా వెలుగు విస్తరింప చేసేవరకూ గుడ్లగూబలు, ఇతర పక్షులూ అందరికీ నష్టం చేకూరుస్తాయి.
ఇతి జైనరాజతరంగిణ్యాం పండితశ్రీవర విరచితాయా
హాజ్యే హైదరశాహ రాజ్య వృత్తాన్తవర్ణన
నామ ద్వితీయస్తరంగః।
జైనరాజతరంగిణిలో పండిత శ్రీవరుడు రచించిన హాజీ హైదర్ షాహ రాజ్యపాలన గాథా వర్ణనం అనే ద్వితీయ తరంగం, ఇంతటితో సమాప్తం.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
