Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-113

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ తరంగం

రవి: ప్రదీప్తః కురుతే ప్రకాశం
విభాతి చాస్మిన్ సతి సూర్యకాన్తః।
తస్మాత్ సముత్థః స చ పావకోర్య –
స్తమోపహః కిం న కరోతి కార్యమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 19)

వెలిగే సూర్యుడు ప్రకాశాన్ని విస్తరింప చేస్తాడు. సూర్యకాంతిలో సూర్యకాంతమణి మరింత కాంతివంతమవుతుంది. అంధకార వినాశి అయిన  వెలుతురు (అగ్ని) సాధించలేని కార్యమేది? ఏదీ లేదు.

‘సూర్యకాంతమణి’ అనేది స్ఫటికము. ఈ స్ఫటికము సూర్యకాంతిలో మెరవటం మాత్రమే కాదు, కాంతి కిరణాలను ఒకచోట కేంద్రీకృతం చేయటం వల్ల మంటను ఉత్పన్నం చేస్తుంది. ఇదీ కవి చెప్తున్నాడు. సూర్యకాంతమణి వల్ల కలిగే అగ్ని అంధకారాన్ని నాశనం చేస్తుంది. ఏమైనా సాధిస్తుంది. ఎందుకంటే, అన్నటినీ తనలో కలిపేసుకునేది అగ్ని. ఆ అగ్ని ఉత్పన్నమవుతున్నది. అగ్ని సాధించలేనిది ఏదీ లేదు.

ఆసన్ పితృపితృవ్యాద్యా యత్కృతే విఫలశ్రమాః।
పౌత్రేణ హేలయా ప్రాప్తం తద్రాజ్యం గతకంటకమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 20)

బాబాయి, తండ్రి, కష్టపడి సాధించాలని ప్రయత్నించి విఫలమైన రాజ్యం, మనమడికి సునాయాసంగా లభించింది.

ఇది కూడా మనం ప్రపంచంలో గమనిస్తాం. ఒకడు ప్రాణాలు పణంగా పెట్టి, రాత్రింబవళ్లు ఏదో సాధించాలని కష్టపడతాడు. కానీ అనుకున్నది సాధించలేడు. మరొకడికి అది ఎలాంటి ప్రయత్నం చేయకుండా అందుతుంది. హసన్ షాహ్ పరిస్థితి అలాంటిదే అయింది. రాజ్యం కోసం యుధ్దం చేయలేదు. నరసంహారం చేయలేదు. దానంతట అది వెతుక్కంటూ వచ్చినట్టు వచ్చింది. వరించింది.

పితుః పితామహస్యాపి పితృవ్యస్య చ సంపదః।
భాగ్యభాజం నృపం ప్రాపుః సర్వాః సిన్ధుమివాపగాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 21)

ఎలాగయితే నదులన్నీ చివరికి సముద్రాన్ని చేరుతాయో, అలాగే తాత, తండ్రి, ఇతర బంధువులందరి సంపదలు భాగ్యవంతుడయిన రాజును చేరాయి. ఇక్కడ ‘సింధు’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. ‘సింధు’ అనగానే ‘సింధు’ నది గుర్తుకు వస్తుంది. కశ్మీరులో నదులన్నీ సింధునదిలో కలుస్తాయి. సింధునది ద్వారా అవి సముద్రాన్ని చేరతాయి. కాబట్టి, ఏ రకంగా తీసుకున్నా అంటే సింధునదిగా అనుకున్నా, సముద్రం అనుకున్నా అర్థానికి ఏ మాత్రం మార్పు రాదు.

షడ్దర్శన పరిచయం సో అగ్రహీన్మత్సరోజ్ఝితః।
పడ్ దర్శనక్రియా యస్మిన్నైకమత్యమివాయయుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 22)

రాజు మాత్సర్యం త్యాగం చేసి, షడ్దర్శనాలు అధ్యయనం చేశాడు. ఆరు దర్శనాలూ అతనిలో కలిసి ఏకదర్శనంగా అయిపోయాయి.

జైనులాబిదీన్ అంతరంగికుడు శ్రీవరుడు. జైనులాబిదీన్ పుత్రులందరికీ గురువు. రాజాస్థానంలో ఉండటం వల్ల వారి పుత్రులకు కూడా గురువయ్యాడు. అందరి గౌరవమన్ననలు, పూర్తిస్థాయిలో కాకున్నా, అందుకుంటున్నాడు.

‘మత్సరాన్ని వదలి’ షడ్దర్శనాలు చదివేడంటున్నాడు శ్రీవరుడు. ఇలాంటి పద ప్రయోగాల ద్వారా కవులు సూచనప్రాయంగా అప్పటి పరిస్థితులను, వ్యక్తిత్వాలను చెప్పినట్టు చెప్పకుండా చెప్తారు.

‘మాత్సర్యం’ అంటే అసూయ, లేదా ఈర్ష్య. ఇతరుల పురోగతిని, ఆనందాన్ని, సంపదను చూసి ఓర్వలేకపోవటం. భారతీయ తత్వశాస్త్రంలో మానవుడి పతనానికి దారితీసే ఆరు ప్రధాన అంతర్గత శత్రువులలో, వీటినే అరిషడ్వర్గాలు అంటారు,  ఒకటి మాత్సర్యం. ఇక్కడ రాజుకు మాత్సర్యం ఎవరి మీద? ఎందుకని? ఈ ప్రశ్నకు సమాధానం కాసేపటి తరువాత. మాత్సర్యం వదలిన రాజు చేసిందేమిటి? షడ్దర్శనాలు అధ్యయనం చేశాడు.

ఇప్పుడు మళ్లీ ఇందాకటి ప్రశ్న వేసుకుంటే.. రాజుకు మాత్సర్యం ఎవరి మీద? ఎందుకు? మాత్సర్యం వదలి రాజు షడ్దర్శనాలు చదివాడంటే అర్థం మాత్సర్యం వల్ల వాటిని చదవలేదని అనుకునే వీలుంది. మాత్సర్యం వల్ల వాటిని దూరం పెట్టాడని భావించే వీలుంది.

కాబట్టి రాజుకు మాత్సర్యం షడ్దర్శనాలు, ప్రాచీన భారతీయ తాత్విక చింతన మీద. ఇప్పటిలాగా ఆ కాలంలో ‘జిహాద్’ అన్న సిద్ధాంతానికి ఇస్లామేతరులలో  అంత ప్రాచుర్యం లేదు. పైగా పని కట్టుకుని తమ దేవుడిని నమ్మని వారిపై యుద్ధం ప్రకటించటం, నాశనం చేయటం ఇప్పడు వెనక్కు తిరిగి చరిత్రలో చుక్కలన్నిటినీ కలుపుతుంటే మనకు అర్ధమవుతోంది. కానీ ఆ కాలంలో ఇస్లామేతరులకు ‘జిహాద్’ అన్న పదం అంత లోతుగా అర్థమయి ఉండదు. ఒక మతం ఇలాంటి ఆలోచన చేస్తుందన్న ఆలోచననే  వారు ఒప్పుకోకపోయి ఉండవచ్చు. ఎందుకంటే ఇతరులను ఆదరించటం, గౌరవించటం, ప్రతి దైవాన్ని తమది కాకపోయినా పవిత్రంగా భావించి గౌరవించటం మనకు అలవాటే. అందుకని ఇస్లామీయులు ‘జిహాద్’ యుద్ధం చేస్తూ ఉన్నా భారతీయులకు  ఆ పదం బోధపడేందుకు ఇరవయొకటవ శతాబ్దం వరకూ పట్టింది.

అందుకే శ్రీవరుడు ‘మాత్సర్యం’ అన్నాడు. జైనులాబిదీన్ కాలం నుంచీ శ్రీవరుడు గమనించే ఉంటాడు. గురువు జోనరాజు నుంచి సికందర్ బుత్‌షికన్ గురించి తెలుసుకుని ఉంటాడు. రాజతరంగిణిలో ఎలాగో జోనరాజు భారతీయులపై జరిగి దారుణ మారణకాండ సంబంధిత సత్యాలు పొందుపరచాడు. వీటన్నింటినీ చూస్తే ఇస్లామీయులు క్రూరంగా చంపటం, గుళ్లు గోపురాలు ధ్వంసం చేయటం, బలవంతంగా మతం మార్చటం, ఇస్లామేతరులను సహించకపోవటం వంటి విషయాలు మాత్సర్యంగానో,  క్రోధంగానో,  అసహనంగానో కనిపించటం సాధారణం.

అలాగే, జైనులాబిదీన్ తమకు గౌరవ భద్రతలు కల్పించటం, రాజాస్థానంలో ఉన్నత స్థాయి హోదా కల్పించటం కూడా ఇస్లామీయులు సహించలేకపోవటం శ్రీవరుడికి తెలుసు. ఎందుకీ క్రోధం, మాత్యర్యం అన్నది అతడికి అర్థమయి ఉండకపోయి ఉండవచ్చు.

ఇప్పుడు ‘హసన్ షాహ’ ఆ దారిలో ఉన్నట్టు కనిపించినా, మాత్సర్యాన్ని అణచిపెట్టి షడ్దర్శనాలను అధ్యయనం చేయటం శ్రీవరుడికి ఆనందం కలిగించి ఉంటుంది. మళ్లీ జైనులాబిదీన్ పాలన కాలం నాటి మంచి రోజులు వస్తాయని ఆశ కలిగి ఉంటుంది. అందుకే రాజు షడ్దర్శనాలను అధ్యయనం చేయటం గురించి అంత ప్రత్యేకంగా చెప్తున్నాడు. ‘మాత్సర్యాన్ని త్యాగం చేసి’ అని చెప్పీ చెప్పనట్టు అసలు విషయం సూచిస్తున్నాడు. జైనులాబిదీన్ మందిరాలు సందర్శించినా, నిర్మించినా, శాస్త్రాలు చదివినా ఏ సందర్భంలో కూడా ‘మాత్సర్యం వదలి’ అని వాడలేదు శ్రీవరుడు. ఇది గమనార్హం.

భూపతేరహ్మదాయుక్తో నియుక్తః సర్వకర్మసు।
సాచివ్యం పుత్రసంయుక్తః పుణ్యోద్యుక్తః సదాకరోత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 23)

అన్ని కార్యలపై అధికారిగా అహ్మద్‌ను నియమించాడు రాజు. అతని కొడుకుతో కలసి అహ్మద్ రాచకార్యలను నిర్వహించాడు.

అన్ని కార్యాలపై అధికారిగా నియమించాడని శ్రీవరుడు రాశాడు. కానీ పదవి  పేరు ఏమీ రాయలేదు. ‘బహిరిస్తాన్’లో అహ్మద్‌ను వజీర్ (మంత్రి)గా నియమించాడని రాశారు. పరిష్తా, అహ్మద్‌ను ప్రధాన మంత్రి చేశాడని రాసాడు. వజీర్, ప్రధాన మంత్రి సమాన శక్తి కలిగిన పదవులు. పీర్ హసన్ మాత్రం ‘మాలిక్ మహమ్మద్ యతు’ అని పూర్తి పేరు రాశాడు. అతను శక్తివంతుడనీ, అతడిని సర్వాధికారిని చేశాడనీ రాశాడు. కశ్మీరు ఇతర రచనలలో అతని పేరు ‘మాలిక్ మహమ్మద్ ఐతూ’ అని కనిపిస్తుంది. కానీ చరిత్ర రచయితలు ‘యతు’కే ప్రాధాన్యం ఇచ్చారు. అందుకు కారణం కశ్మీర్‌‌లో ‘యతు’ అన్నది సాధారణమైన పేరు.

అథ ప్రథమమే వాహ్మదాయుక్తం మల్లికం నృపః।
సగ్రామగ్రామనాగ్రామప్రమేయస్వామినం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 24)

అందుకు ముందే రాజు, మల్లిక్ అహ్మద్‌ను గ్రామ సగ్రామ గ్రామాల అధిపతిగా నియమించాడు.

గ్రామానికి అధిపతిగా నియమించటం అర్థమవుతుంది. సగ్రామ అధిపతి అంటే కూడా గ్రామానికి అధిపతే. ‘సగ్రామం’ అన్నది ఒక ప్రాంతం. ఆ జాగీరును రాజు మల్లిక్ అహ్మద్‍కు అప్పచెప్పాడు. ఈ మల్లిక్ అహ్మద్ రాజుకు అంతరంగికుడిగా, సలహదారుగా, నమ్మకస్తుడిగా అనిపిస్తున్నాడు. అతడికి అన్ని అధికారాలు కట్టబెడుతున్నాడు రాజు.

తబాకత్-ఎ-అక్బరీ ప్రకారం సుల్తాన్ అహ్మద్‌కు మాలిక్ అహ్మద్ అన్న బిరుదునిచ్చి, పాలన వ్యవహారాలన్నీ అతడికే వదిలేశాడు.

పుత్రోస్య నౌరుజాయుక్తో ద్వారపాలాదికార్యభాక్।
ఇక్షికామభజద్ర రాష్ట్ర సగ్రామవిభవోజితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 25)

మాలిక్ అహ్మద్ పుత్రుడు నౌరుజ్, ద్వారపాలకుడి ఉద్యోగం చేసేవాడు. సగ్రామం తదితర గ్రామాల నుండి అందుతున్న ధనం వల్ల శక్తివంతుడై ‘ఇక్షికా’ రాష్ట్రాన్ని సాధించుకున్నాడు.

‘నౌరుజ్’కు సుల్తాన్ ‘బహదూర్ మల్లిక్’ అన్న బిరుదునిచ్చాడు. ‘నౌరుజ్’ అన్నది ఇరానీ శబ్దం. ‘నౌ’ అంటే ‘కొత్త’, ‘రుజ్’ అంటే రాజు. ‘నౌరుజ్’ అంటే కొత్త రాజు. కొత్త సంవత్సరం తొలి రోజున ‘నౌరుజ్’ అంటారు. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశంలో ‘నౌరుజ్’ పండుగను దాదాపుగా రెండు వారాల పాటు జరుపుతారు. ఇస్లామీయులు ఈ పండుగను జరుపుకుంటున్నా, ఈ పండుగకు 3000 ఏళ్ల చరిత్ర ఉంది. జోరాస్ట్రియన్లు ఈ పండుగను జరుపుకునేవారు. ఇరాన్ ఇస్లామ్ పరమైన తరువాత పాత పండుగలు కొన్ని ఇస్లామ్ కొనసాగించింది.

‘నౌరుజ్’ ద్వారపాలకుడి పని చేసేవాడని శ్రీవరుడు అతడి పనికి తనకు అర్థమయిన పదంతో చెప్పాడు. పర్షియన్ చరిత్ర రచయితల ప్రకారం ఆయన ‘హజిలేదర్’ లేక ‘అమీదేదర్’ అద్యోగం చేసేవాడు. ‘టర్కీ’లో ‘కపోచీ బహీ’ అంటారీ ఉద్యోగాన్ని. ద్వారపాలకుడు కన్నా ‘security guard’ అన్న పదం సరిగ్గా సరిపోతుంది. అది ద్వారానికి కావచ్చు, భవనానికి కావచ్చు. నగరానికీ కావచ్చు. పర్షియాలో ఆ పదాలకున్నా అర్థం విస్తృతి అలాంటిది. ‘ఇక్షికా’ అన్న ప్రాంతం ప్రస్తుతం ‘హెచ్ పరగణా’ ప్రాంతంగా గుర్తింపు పొందుతున్నది. ఇది సగ్రమ్‌కు తూర్పు దిశలో ఉంది.

పానలీలాన్తరే తత్ర ప్రసాదామృతవర్షిణా।
యేన దారిద్రయదావాగ్నిః కేషాం న క్షపితః క్షణాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 26)

మద్యపాన మత్తులోని ఆ కాలంలో, క్షణంలో తన కృపావర్షంతో ఎంతో మంది దారిద్ర్య దావాగ్నిని నష్టం చేశాడు.

అంటే, కొత్త సుల్తాన్ సైతం మద్యపాన మత్తుడనీ, ఆ సంతోషంలో ఎవరుబడితే వారిపై కరుణ వర్షం కురిపించి వారి అదృష్టాన్ని మార్చేసేవాడన్నమాట.

బహిర్దేశస్థితే రాజ్ఞి బాల్యే యః సేవకో అభవత్ ।
స తాజిభట్టో మల్లేకమతః ప్రాపాన్తరంగతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 27)

బాల్యంలో రాజు వేరే దేశంలో ఉన్నప్పుడు, అతిడికి సేవలు చేసిన మల్లిక్ తాజ్ భట్టు రాజుకు ఆంతరంగికుడయి పోయాడు.

హైదర్ షాహ కశ్మీరు బయట రాజ్యంపై యుద్ధానికి వెళ్లినప్పుడు హసన్ షాహను కూడా వెంట తీసుకువెళ్లాడు. ఆ సమయంలో భట్ ఎంతో సహాయం చేశాడు. తాజ భట్టు రాణికి కూడా విశ్వాసపాత్రుడని పర్షియన్ల రచనల ద్వారా తెలుస్తుంది.

నిగ్రహానుగ్రహవ్యగ్రః సమగ్రే రాజ్యవిగ్రహే।
దత్తదూత్యాధికారేణ రాజ్ఞో జిహ్వేవ సో అభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 28)

చక్కని పద్యం ఇది.

నిగ్రహ, విగ్రహ, అనుగ్రహాలలో సర్వాధికారాలు దక్కించుకున్న అతడు రాజుకు నాలికలాగా అయిపోయాడు.

‘విగ్రహ’ అంటే యుద్ధనీతి విషయం. కౌటిల్యుడి ప్రకారం రాజుకు అవసరమైన రాజకీయ గుణాలు ఆరు. షడ్గుణాలంటారు వాటిని. అవి సంధి, విగ్రహ, యాన, ఆసన, సంశ్రయ, ద్వైదీభావాలు. దీన్లో ‘విగ్రహ’ అంటే యుద్ధ సంబంధ. ‘నిగ్రహ’ అంటే నియంత్రణ. ‘అనుగ్రహ’ అంటే ఎవరి పైనైనా అనుగ్రహం చూపించటం. యుద్ద విషయంలో, నియంత్రణలో, ఎవరి పైనైనా అనుగ్రహం చూపటంలో ఈ తాజ్ భట్ రాజు నాలికలాగా అయిపోయాడు. అంటే ఇతను రాజు మాట అయి పోయాడన్నమాట. ఇతనేం చేప్తే అంత, ఎంత చేప్తే అంత, ఎలా చెప్తే అలా. ఇలా మొత్తం రాజును తన గుప్పిట్లో తెచ్చుకున్నాడు తాజ్ భట్.

(ఇంకా ఉంది)

Exit mobile version