Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-114

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ తరంగం

అధికారనదీ పూర్వం స్ఫురన్తీ శతధాభవత్।
తదా ద్వితీయయావృత్త్యా తస్మిన్ కృతపదా బభౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 29)

గతంలో అధికారం అనే నది వంద దార్లలో ప్రవహించేది. కానీ ఇప్పుడు రెండవ మార్గం లేకుండా నది మొత్తం తాజిభట్టు ద్వారానే ప్రవహిస్తోంది.

అన్యే అప్యుచ్చా వచాన్ గ్రామాన్ జోనరాజానకాదయః।
పూర్వ సేవానుసారేణ ప్రసాదం ప్రాపురంజసా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 30)

గతంలో తాము చేసిన సేవలననుసరించి జోనరాజనకాతో సహా ఇతరులు గ్రామాలను ప్రసాద రూపంగా గ్రహించారు.

ఈ జోనరాజనకుడు వేరే జోనరాజు. రాజతరంగిణి రాసిన జోనరాజు మరణించిన తరువాతనే శ్రీవరుడు రాజతరంగిణిని, జోనరాజు ఎక్కడ ఆపాడో అక్కడి నుంచి కొనసాగించాడు. కాబట్టి ఈ జోనరాజు మరెవరో అని సులభంగా తెలుస్తుంది.

శ్రీ మల్లేకాహ్మదః సర్వకార్యే యాం స్థితిమబ్రవీత్।
తాం నోదల్లంఘాత్యమ్ రాజా వేలాం సింధురివోల్వణః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 31)

మల్లిక్ అహ్మద్ ఏది ఎలా చెప్తే రాజు దాన్ని అలా వినేవాడు. ఎలాగయితే సముద్రం ఎంతగా అలలతో ఎగసినప్పటికీ తీరం దాటి రాదో, అలాగ రాజు ఈ మల్లిక్ అహ్మద్ మాట ఉల్లంఘించేవాడు కాదు.

పిత్ర్యాః పైతామహా వాపి విరుద్ధా బన్ధనే అవసన్।
భుట్టద్దేశం ధియా తస్య తేషాం నిష్కాసనం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 32)

తన తండ్రి తాతకు విరోధులై భట్ట దేశంలో బంధితులైన వారందరినీ మల్లక్ అహ్మద్ సలహాననుసరించి విడుదల చేసాడు.

సర్వదర్శన సంయుక్తో నృపో మన్త్రివిధేయధీః।
పితామహ సమాచారం ప్రావర్తయత మండలే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 33)

సర్వదర్శనాలతో పరిచయం ఉన్నవాడు, మంత్రి అహ్మద్ చెప్పినట్టు వినేవాడు అయిన రాజు, మళ్లీ కశ్మీరంలో పితామహుడి కాలం నాటి పద్ధతులను అమలు చేయటం అరంభించాడు.

స్వామీ క్షమీ కృతజ్ఞశ్చ మన్త్రీ భక్తః స్మయోజ్ఝితః।
సంయోగోయం ప్రజాపుణ్యైః సుచిరేణ నిరీక్షితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 34)

క్షమాశీలడయిన రాజు, కృతజ్ఞత కల భక్తుడు గర్వరహితులయిన మంత్రుల కలయికను ప్రజల పుణ్యం వల్ల ఎంతో కాలం తరువాత చూసే వీలు లభించింది.

ఉచ్చాసనేషు మార్గేశఠక్కురాదీన్ నివేశయన్।
తదూత ఇవ రాజాగ్రే స నిషణ్ణోభవత్సదా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 35)

ఆ కాలంలో మార్గేశుడు, ఠక్కురులను దూతలలా గౌరవిస్తూ ఉన్నతాసనాలలో కూర్చో బెట్టారు.

హితం ప్రాణపణేనాపి ప్రభోః సంపాదయన్నయమ్।
మహేశ్వరవదేతస్మిన్నాభవద్ భక్తిఖండితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 36)

తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ అతడు (అహ్మద్) రాజు చెప్పిన కార్యాలను నెరవేర్చేవాడు. రాజు పై అతని భక్తి మహాదేవుడిపై భక్తిలా నిశ్చలమైనది.

మఠాగ్రహారసదననిర్మాణాతిథిపూజనైః।
నృపోపచారై సాఫల్యమనైషీత్ సర్వసంపదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 37)

కమలమమలం దృష్ట్వా శ్రీమత్స్వకోశవిభూషితం
మథయితుమథ ప్రాప్తో యావన్మదాన్మదవారణః।
ప్రకృతిమలినస్తావన్మనః లపంకసరోవరే
శ్రవణచపలో బద్ధో యాతి క్షయం మధుపైః సహ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 38)

అతడు (అహ్మద్) తన ధనాన్ని మఠాల నిర్మాంలోనూ, అగ్రహారాలు భవనాల నిర్మాణంలో అతిధి పూజ, నృపసేవలోనూ వినియోగించి సంపత్తిని సద్వినియోగం చేశాడు.

మదమెక్కిన ఏనుగు, కమలాన్ని చూసి దాన్ని నాశనం చేయాలని పరుగెత్తుకుని వచ్చి  తీగలలో చిక్కుని బురదలో కూరుకుపోయి మరణిస్తుంది. పూలపై ఉన్న తుమ్మెదలూ దానిలోనే మరణిస్తాయి.

ఈ శ్లోకం ఇక్కడ రాయటంలో శ్రీవరుడి ఉద్దేశ్యం, తరువాతి శ్లోకాలను బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నూతన రాజు కమలం అనుకుంటే, ఆ కమలాన్ని నాశనం చేయలాన్న ఆత్రంతో మత్తుగజంలా శత్రువులు పరుగున వస్తారు. కానీ వారు రాజుకు బందీ అయి ప్రాణాలు కోల్పోతారు. ఈ శ్లోకం ఇంకొన్ని శ్లోకాల కథ జరిగిన తరువాత ఇంకా బాగా అర్థమవుతంది.

అత్రాంతరే స బహామఖానః పిశున మోహితః।
దేశాంతరోద్యమం త్యక్త్వా యుద్ధాయాగాన్మదోద్ధతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 39)

ఈ సమయంలో కుట్రలు పన్నిన వాడు, వ్యామోహితుడు, మదోన్నతుడు అయిన బహ్రమ్ ఖాన్, విదేశాలను గెలుచుకోవటం వదలి యుద్ధం కోసం సిద్ధమయ్యాడు. కమలం చూసి నాశనం చేయాలని పరుగెత్తుకొచ్చిన ఏనుగులా విదేశాలను గెలవటం వదలి బహ్రమ్ ఖాన్ కశ్మీరం వైపు పరుగెత్తుకు వచ్చాడు.

స్వద్వలాన్తరమేష్యామో వయం తబ రణక్షణే।
ఇతి లేబైర్ధృతాశం తమకుర్వన్ రాజపూరుషాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 40)

నీ రక్షణ కోసం, మేము వచ్చి నిన్ను  కలుస్తామని రాజపురుషులు కొందరు అతనికి (బహ్రామ్ ఖాన్ కు) అహ్వానం పంపారు.

‘ఎవరీ రాజపురుషులు’ అన్న ప్రశ్న వస్తుంది.

‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం ‘కొందరు అమీర్లు లేఖ రాసి బహ్రమ్ ఖాన్‌కు తమ సమర్థన తెలిపి ఆహ్వనించారు’ అని ఉంది.

‘పీర్ హసన్’ ప్రకారం కొందరు ఆశాంతిని, అల్లకల్లోలాన్ని కోరేవారు బహ్రమ్ ఖాన్ దగ్గరకు వెళ్లి అతడిని కశ్మీరుకు ఆహ్వానించారు. అతని వెంట నిలుస్తామని వాగ్దానం చేశారు. మత గురువులు బహ్రమ్ ఖాన్ ‌కు ఉత్తరం రాసి మద్దతు తెలిపి ఆహ్వానించారు.

శ్రీవరుడు ఇలా ప్రత్యేకంగా వాళ్లు వీళ్లు అని చెప్పలేదు. కొందరు రాజపురుషులు అన్నాడు. అంతే.

కర్ణాచ్ఛంతరతః శైవానులంఘ్య కటకోత్కటః।
క్రమరాజ్యపురం ప్రాప్తః క్రమరాజ్య జిహీర్షయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 41)

‘కర్ణా’ ప్రాంతం నుండి పెద్ద సైన్యంతో వచ్చి, పర్వతాలు దాటి క్రమ రాజ్య పురం చేరుకున్నాడు బహ్రామ్ ఖాన్.

‘కర్ణా’ అన్నదాన్ని ప్రాంతం పేరుగా భావిస్తున్నారు పలువురు చరిత్ర విశ్లేషకులు. పర్షియన్ రచయిత ‘కర్మార్’ అన్నారు. ఈ కర్మార్‌ను సంస్కృతీకరణ చేసి శ్రీవరుడు ‘కర్ణ’ అన్నడని భావిస్తున్నారు. కొందరు ‘కర్ణ’ అన్నది ఏదో ప్రత్యేక మార్గమనీ, ఇప్పుడు అన్ని పేర్లు మారిపోయాయి. కాబట్టి గుర్తించలేక పోతున్నామనీ అభిప్రాయ పడుతున్నారు. క్రమ రాజ్యానికి చేరే దారుల్లో ఇది ఏదో ఒక దారి అయి ఉంటుందంటున్న ‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం ‘కర్ణ’ అనే విదేశ ప్రాంతం నుంచి పర్వత మార్గాల గూండా ‘కిమరాజ్యా’న్ని అక్రమించేందుకు వచ్చాడు బహ్రామ్ ఖాన్.

తావన్మన్త్రియుతో రాజా స్థితో అవన్తి పురాన్తరే।
తత్ప్రత్యావృత్తివార్తాం తాం శ్రుత్వా తూర్ణ న్యవర్తత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 42)

ఆ సమయంలో రాజు అవంతిపూర్‍లో ఉన్నాడు. బహ్రమ్ ఖాన్ సైన్యంతో వస్తున్నాడన్న వార్త తెలియగానే వెంటనే వెనక్కి వచ్చేశాడు.

‘తవ్వాకత్-ఎ-అక్బరీ’ ప్రకారం ఆ సమయంలో సుల్తాన్ వేట కోసమని దినాపూర్ వెళ్లాడు. బహ్రమ్ ఖాన్ వస్తున్నాడని తెలియగానే సోపోర్ (సయ్యపూర్) చేరుకున్నాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు.

ఫరిష్తా ప్రకారం ‘దీపాల్‌పూర్’ వైపు వెళ్లిన సుల్తాన్ బహ్రమ్ ఖాన్ వార్త తెలియగానే శివపూర (సోపోర్) చేరుకున్నాడు.

పీర్ హసన్ ‘చినా నగర్’లో ఉన్నాడు రాజు ఆ సమయంలో అని రాశాడు.

శ్రీవరుడు ‘అవంతిపూర్‌లో ఉన్నాడు, వెనక్కు వచ్చేశాడు’ అన్నాడు. మిగతా వారంతా ‘సోపోర్’ వద్ద యుద్ధానికి సిద్ధంగా ఉన్నడని రాశారు.

రాజా సుయ్యపురం ప్రాప్తః పితృవ్యాగమవిహ్వలః।
ఆనీయ సచివాన్ సర్వాన్ సభాన్తరిదమ బ్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 43)

బాబాయి సైన్యంతో రావటం పట్ల ఆందోళన ప్రదర్శిస్తూ ఆందరినీ సమావేశపరచి సభలో ప్రసంగించాడు రాజు.

పితుః క్రమాగతం రాజ్యం పుత్రస్యేత్యుచితం మమ।
కోయం పితృవ్యో జ్యేష్ఠోపి కనిష్ఠో నిర్మితోద్యమః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 44)

“తండ్రి రాజ్యం కొడుక్కు సంక్రమించటం ఉచిత పద్ధతి. న్యాయమైన పద్ధతి. అలాగే రాజ్యం నాకు సంక్రమించింది. మధ్యలో వయసులో నాకన్నా పెద్దయిన ఈ చిన్నాన్న ఎవరు? ప్రయత్నశీలికే రాజ్యాధికారం దక్కుతుంది.”

ఇలాంటి యుద్ధాలు, అల్లకల్లోలాలను తప్పించాలనే మంత్రులు బహ్రమ్ ఖాన్ ను రాజుగా ఉండమని, అతని తరువాత రాజ్యం హసన్ షాహ్‌కు దక్కేట్టు అతడిని యువరాజుగా ప్రకటించమనీ అడిగారు. బహ్రమ్ ఖాన్ అందుకు ఒప్పుకోలేదు. కనీసం అధికారాన్ని హస్తగతం చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. ఇప్పుడు అన్న కొడుకు రాజ్యాధికారం చేపట్టిన తరువాత యుద్ధానికి రావటం అనవసరం. కానీ వచ్చాడు. అప్పుడు పోరాడే బదులు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇదీ సమస్య.

అథవా వీరభోగ్యాయాం భువి కోయం నయో ద్వయోః।
యుద్ధేన విజయీ యః స్యాద్ రాజ్యభాక్ సోస్తు మండలే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 45)

“రాజ్యం వీర భోజ్యం. ఈ యుద్ధంలో విజయం ఎవరిని వరిస్తే రాజ్యాధికారం వారికే దక్కుతుంది.”

శ్రుత్వేతి నృపతేర్వాక్యం ప్రత్యూచుర్మన్త్రినాయకాః।
యే తేప్యాదమఖానాద్యాస్త్వదర్థం విధినా హతాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 46)

రాజు మాటలు విన్న ప్రముఖ మంత్రురందరూ “మీ కోసమే ఆదమ్ ఖాన్, ఇతరులను విధాత హతులను చేశాడు” అన్నారు.

కోయమల్పబలస్తే స్యాద్ యోద్ధా స్థానపరిచ్యుతః।
కిం త్వద్యావసరో నాస్తి సమిత్యుభయవేతనాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 47)

అముమేవ మిలన్స్యేతే యది కిం క్రియతే పునః।
తద్ధృత్వా కోశసామగ్రీమితో గత్వా బహిస్తతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 48)

దేశమాక్రమ్య నః కార్య సిద్ధయత్యే వాచిరాద్ విభో।
శ్రుత్వేతి మల్లిక: ప్రాహ భూపం తత్ర సభాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 49)

“తక్కువ సైన్యంతో దేశం కాని దేశంలో ఉన్న బహ్రమ్ ఖాన్ మీకు సరి ఎన్నడూ కాదు. అతడు మీతో యుద్ధం చేయలేడు. కానీ కొందరు రెండు వైపులా ధనం తీసుకునేవారు ఉన్నారు. వారు బహ్రమ్ ఖాన్‌తో చేతులు కలిపితే కష్టం. కాబట్టి, కోశాగారంలో ఉన్నదంతా బయటకు తెచ్చి దాచి, తరువాత యుద్ధం చేయాలి. త్వరలోనే మనం విజయం సాధిస్తాం” అన్నారు మంత్రులు. వారి సలహా విన్న మల్లిక్ ఇలా అన్నాడు:

“మంత్రులు దాడి కన్నా రక్షణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అంతః శత్రువుల బారిన ఖజానా పడుకుండా ముందు దాన్ని భద్రం చేసి, ఆపై యుద్ధం చేద్దామని అంటున్నారు. ఇది పరాజితుడి ఆలోచన.”

బహ్రమ్ ఖాన్ దగ్గర పెద్ద పేరు లేదు. పైగా అతడు వేరే దేశంలో ఉన్నాడు. అతడు హసన్ షాహ ముందు నిలడలేడని అన్నవారే, మోసగాళ్లు అతని వైపు చేరితే కష్టం కాబట్టి ఖజానాను సురక్షితం చేసి యుద్ధం చేయమంటున్నారు. దీన్ని బట్టి, మంత్రులకే గెలుపుపై విశ్వాసం లేదని అర్థమవుతంది.

ఎవరెన్ని సలహాలు ఇచ్చిన రాజు మాత్రం మల్లిక్ అహమ్మద్ మాటే వింటాడు. అతని మాటనే అఖరి మాట అవుతుంది. మంత్రుల సలహా విన్న మల్లిక్ అహమ్మద్ తన అభిప్రాయం చెప్పాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version