[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తృతీయ తరంగం
తిష్ఠత్వత్ర భవాంస్తావన్మౌనం మన్త్రిసభాన్వితః।
స్వకీయాదమఖానీయాన్ జేతుం తం విసృజామహే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 50)
మీరంతా ఏమీ చేయకుండా ఉండండి. ఆదమ్ ఖాన్ సేననే బహ్రమ్ ఖాన్కు వ్యతిరేకంగా పంపుదాము.
పర్షియన్ చరిత్ర రచయితలు ఈ విషయాన్ని మరో రకంగా రాశారు. ఆదమ్ ఖాన్‌తో పని చేసిన సేనలను బహ్రమ్ ఖాన్కు వ్యతిరేకంగా పంపుదాము, వారు గెలిచి తిరిగి వచ్చే వరకూ మీరంతా మౌనంగా ఉండండి అని మల్లిక్ సలహా ఇచ్చాడని రాశారు.
తే చేజ్జితా వయం యామః పునః సర్వబలాన్వితాః।
కోయం తత్సంభ్రమః కస్య సహాయః కిం కరోత్యసౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 51)
ఒకవేళ ఆదమ్ ఖాన్ సేనలు ఓడిపోతే అప్పుడు సమస్త సేనలను వెంట తీసుకుని మనం యుద్ధానికి వెళ్దాం. అతడిని చూసి భయం ఎందుకు? అతడికి సహాయం చేసేది ఎవరు? అతడేం చేయగలడు?
యుద్ధంలో గెలుపు అన్నది భౌతిక బలం వల్ల కన్నా మానసిక శక్తివల్ల అధికంగా సంభవిస్తుంది. యుద్ధానికి భయపడుతూనో, ఓడిపోతాననుకుంటూనో వెళ్లినవాడు, యుద్ధం, ఆరంభం అయ్యేకన్నా ముందే సగం ఓడిపోతాడు. ఎదుటి వ్యక్తి బలాబలాలను, శక్తి యుక్తులను అంచనా వేసి తన శక్తిని తెలుసుకుని, ఎదుటి వ్యక్తి బలహీనతలపై దెబ్బ కొట్టే వ్యూహంతో యుద్ధానికి వెళ్లిన వాడికి విజయం ప్రాప్తిస్తుంది. ఈ విషయం మల్లిక్‌కు తెలిసినట్టుంది. అందుకే ఇలా యుద్ధం ఆరంభం కాకముందే, ఖజానాను దాచి పెట్టాలని కట్టుదిట్టం చేయాలి, రెండు వైపులా జీతం తీసుకునే గూఢచారులతో జాగ్రత్తగా ఉండాలి వంటి సలహాలను అతను ఎందుకో ఇష్టపడలేదు. అసలీ బహ్రామ్ ఖాన్‌కు సహాయం చేసేదెవరు? అతడి శక్తి ఎంతటిది వంటి ప్రశ్నలు వేసి అసలు అతడిని ఓడించేందుకు పెద్ద సైన్యం అవసరం లేదని స్పష్టంగా చెప్పాడు. చిన్న సేనను పంపి, వాళ్లు ఓడిపోతే అప్పుడు అసలు సేనను పంపుదామన్నాడు.
ఈ ఆలోచన వెనుక ఒక పథకం ఉంది. ముందుగా చిన్న సేనతో యుద్ధంలో శత్రువు శక్తి తెలుస్తుంది. శత్రువు కాస్త నష్టపోతాడు. అప్పుడు అసలు సేన రంగంలోకి దిగుతుంది. అంటే శత్రువు సేనను అలవగొట్టిన తరువాత అసలు సేన మైదానంలోకి వస్తుందన్నమాట. చిన్న సేనతో పని అయిపోతే ఇంకా మంచిది. ఇది ధైర్యాన్నిచ్చే పథకం. సేన ఓడిపోయినా చిన్న సేన ఓడిపోయింది. ముందుంది పెద్ద సేనతో పోరాటం, అదీ అసలు పోరాటం అనే అవకాశం దొరుకుతుంది.
శ్రుత్వేత్యాదిమతం తేషాం వివిధం నిశ్చయోజ్ఝితః।
మల్లేకాహ్మదమన్త్రేణ కర్తవ్యే ప్రత్యపద్యత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 52)
విభిన్నమైన వాదనలు విని ఎటూ నిశ్చయించుకోలేని రాజు, మల్లిక్ అహ్మద్ చెప్పిన పద్దతినే అమలు పరచాడు.
ఎవరేం చెప్పినా రాజు మల్లిక్ అహ్మద్ చెప్పినదే వింటాడు. పాటిస్తాడు. అని అందరికీ తెలుసు. అదే జరిగింది.
సిమః పితామహస్సాధ సైన్యం వృత్వా నిజాన్తినే।
పైత్రువాన్ సేవకాన్త్యాంశ్చ దత్త్వా తత్తద్దలాన్వితాన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 53)
సఫిర్యడామరాంస్తాజిభట్టాదీన్ వ్యసృజన్నృపః।
యోద్ధుం బహామఖానాయ మావరీదేశవాసినే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 54)
‘మావారీ’ దేశంలో ఉన్న బహ్రామ్ ఖాన్ సేనలతో పోరాడేందుకు రాజు తాజ్ భట్టు, ఫిర్యదామరలతో పాటు తన ఆదం ఖాన్ సేనలను పంపాడు. తండ్రి తాతల సేనలను తన దగ్గరే ఉంచుకున్నాడు.
శ్రీవరుడు స్పష్టంగా తాజ్ భట్ అని రాశాడు. కానీ పర్షియన్ చరిత్ర రచయితలు, బ్రిటీష్ రచయితలు పలు రకాలుగా ఈ పేరును రాశారు. తవ్వాకత్-ఎ-అక్బరీ ఈ పేరును ‘తాజ్ బెహతా’ అని రాసింది. తవ్వాకల్-ఎ-అక్బరీ మరో ప్రతిలో తాజ్ భట్ అన్నారు. కానీ పెద్ద సైన్యంతో వెళ్లాడని రాశాడు. ఫరిష్త ‘మాలిక్ తాజ్ భట్’ అన్నాడు. బ్రిగ్స్, రోజర్స్ తమ చరిత్రలో ‘హసన్’ సేనాపతి అని మాత్రం రాశారు. పేరు రాయలేదు.
భారతదేశ చరిత్ర రచనలో ఇలాంటి గమ్మత్తులు చాలా కనబడతాయి. పర్షియన్ రచయితల రచనలన్నిటి కన్నా, ఘటన జరిగినప్పుడు చూసి రాసిన ఏకైక సాక్షి శ్రీవరుడు. శ్రీవరుడు తాజ్ భట్ అంటే ‘తాజ్ భట్’ అని స్వీకరించటంలో అభ్యంతరాలుండల్సిన అవసరం లేదు . కానీ ఉన్నాయంటే అర్థం, లోపం, చరిత్రను అర్థం చేసుకునే వారి మెదడులో ఉంటుంది తప్ప సాక్షి కథనంలో లేదు. అక్కడ ఉన్నది ఒకడే సాక్షి. ఆ సాక్షి చెప్పింది నమ్మకుండా స్వంత అభిప్రాయాలతో రచిస్తే అది చరిత్ర కాదు. కానీ భారత చరిత్ర విషయాలు మాత్రం ఆ రాసింది విదేశీయుడయితే, వాడు చెప్పిందే ప్రామాణికం! అంతే!
బహ్రామ్ ఖాన్ ఉన్న ‘మావారి’ ప్రాంతం ఎక్కడ ఉందో ఇంకా తేలలేదు. కొందరు మాత్రం ఇది కశ్మీరు దగ్గరలో ఉన్న మవుర్ (మాహురీ) నది పరిసర ప్రాంతంగా భావిస్తారు. మచ్ఛీపురం పరగణాల గుండా ప్రవహిస్తుందీ నది. కానీ ఇదే ప్రాంతం అని స్థిరపరచేందుకు ఎలాంటి ఆధారాలు లభించలేదు.
అథ స్వల్పబలానేతాన్ జేష్యామీతి త్వరాకులః।
తావద్ వహామఖానః స ప్రాప డులపురాన్తరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 55)
తక్కువ సైన్యాన్ని నేను సులభంగా గెలుస్తాననుకుంటూ బహ్రామ్ ఖాన్ ‘డుల్‌పుర్’ చేరుకున్నాడు.
శ్రీవరుడి రాజతరగిణిలో ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది, బహ్రమ్ ఖాన్ పైకి తక్కువ సేనను పంపించాడు హసన్ ఖాన్ అని. ఎక్కువ సేనను పంపించాడని పర్షియన్ రచయితలు కూడా రాయలేదు. కానీ ఇంగ్లీషు రచయితలు మాత్రం పెద్ద సైన్యాన్ని పంపించాడని రాశారు. ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల పెద్ద తేడాలు రాకపోవచ్చు. కానీ పెద్ద విషయాల రచనలోనూ ఇదే అహంకారం, ఇదే నిర్లక్ష్యం కనిపిస్తుంది. మొగ్గలోనే తుంచకపోవటం వల్ల అది వంచ లేని మహా వృక్షమైపోయింది. ఇప్పుడు విషవృక్షమై పోయింది.
ఆ విషం ఎంతగా అలవాటయి పోయిందంటే, విషాన్ని విషం అనటం కూడా నేరమైపోయేటంతగా.
‘డుల్‌పూర్’ అన్నది ‘తూలాపుర్’, ‘డూలీపర్’ గా భావిస్తున్నారు.
‘శాలురా’ ప్రాంతానికి దగ్గరలో నది ఒడ్డున ఓ గ్రామం ఉంది. ఇక్కడో పెద్ద మసీదు ఉంది. దీన్ని శ్రీవరుడు ప్రస్తావించిన ‘డుల్‌పుర్’గా భావిస్తున్నారు. ఫరిష్త ‘టాల్‌పుర్’ అన్నాడు. తవాకత్-అక్బరీ ‘లూలూ’ అంటుంది. కర్నల్ బ్రిగ్ ‘లోలోపూర్’ అన్నాడు. ఎవరికి ఇష్టమైనట్టు వారు రాశారు. ఇదే చరిత్ర పొమ్మన్నారు.
అనాగతైః కృతాశ్వాసైరపి రాజమహత్తమైః।
స్వాత్మానం వంచితం మేనే తన్నిరాశో నృపాత్మజః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 56)
ఎవరెవరైతే బహ్రమ్ ఖాన్‌కు మద్దతు నిచ్చి అతడి వైపు పోరాడతామని మాట ఇచ్చారో, వారెవ్వరూ బహ్రమ్ ఖాన్‌కి అక్కడ కనబడలేదు. దాంతో తనని మోసం చేశారని నిరాశ చెందాడు బహ్రమ్ ఖాన్.
తద్దినే రాజ్యలక్ష్మీః సా పితృవ్య భ్రాతృపుత్రయోః।
ద్వయోరాసీత్ సమారూఢా కోట్యోః సందేహఘీరివ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 57)
ఆ రోజు రాజ్యప్రాప్తి అనే అదృష్టం బాబాయిని వరించాలా, అతడి అన్న కొడుకును వరించాలా అన్నట్టు సందిగ్ధంలో ఉంది.
అంటే, అప్పటిదాకా ఇద్దరి బలాబాలాలు సమానమే అన్న మాట. రాజ్యలక్ష్మి ఎవరినయినా వరించవచ్చు. కానీ ఈ క్షణం నుంచీ పరిస్థితి మారింది. ఎందుకంటే తానూహించిన సహాయం, సమయానికి అందక పోవటంతో బహ్రమ్ ఖాన్‌లో సందేహాలు జనించాయి. సందేహం యుద్ధంలో పరాజయానికి తొలి అడుగు.
చౌరా ఇవాన్ధకారౌధే ద్వైరాజ్యోపప్లవప్రియాః।
తుతుపుశ్చక్రవాడాద్యాస్తంశ్రుత్వా క్రమరాజ్యజాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 58)
రెండు రాజ్యాలలో అనిశ్చిత పరిస్థితులు నెలకొనాలని కోరుకునేవారు క్రమ రాజ్యానికి చెందిన చక్రవాడ, ఇతరులు, చీకట్లో దొంగ ఎంత సంతోషిస్తాడో, అంతగా ప్రస్తుత పరిస్థితికి సంతోషించారు.
శ్రీవరుడు ‘ఉపద్రవ ప్రేమి’ అన్నాడు. ఇప్పుడు వీరిని ‘ఆందోళన జీవులు’ అంటున్నాము. వీరికి సందిగ్ధ పరిస్థితులు అంటే ఇష్టం. ఏమీ లేకపోతే ఏదో ఒకటి సృష్టిస్తారు. ఏదైనా ఉంటే, ఆ అయోమయ పరిస్థితులలో లాభం పొందాలని ప్రయత్నిస్తారు.
అథ జైన గిరిం యావదాయయౌ తద్రణాకులః।
దూతస్తావత్ సమాగత్య భూపతేరిదమత్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 59)
యుద్ధం కొనసాగించాలని రాజు జైనగిరి చేరేసరికి, దూతలు వచ్చి ఇలా అన్నారు.
దేవ బహామఖానః సతనయో నయవిచ్యుతః।
యుయుత్సుః సమరే బద్ధః కరీవ మదనిర్భరః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 60)
ఓ రాజా! మదమెక్కిన ఏనుగులా నీతిదూరుడై బహ్రమ్ ఖాన్ కొడుకుతో సహా యుద్ధానికి ఉత్సాహంగా వచ్చాడు. పుత్రుడితో సహా అతడిని బందీ చేసి తీసుకువచ్చాం.
అంటే యుద్దం ఆరంభం అయ్యేకన్నా ముగిసిపోయిందన్నమాట. బహ్రమ్ ఖాన్‌కు విశ్వాసం పోయింది. దాంతో రాజు సేన తక్కువగా ఉన్నా బహ్రమ్ ఖాన్ బందీగా దొరికాడు.
పతితే తద్రణోద్యానే త్వద్వలోద్ధృతమానసే।
తత్యజేనుచరైః ఖానః పౌషే పర్ణోరివ ద్రుమః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 61)
ఎండాకాలంలో ఆకులు రాలిపోయే చెట్టును పక్షులు ఎలా వదలి ఎగిరి పోతాయో, అలాగే యుద్ధభూమిలో క్రింద పడ్డ బహ్రమ్ ఖాన్‌ను అతని సైనికులు వదలి పారిపోయారు.
తతః సంజరమేరాద్యా గర్జంతః సైన్యనాయకాః।
దుష్టమేఘా ఇవాయాతాశ్చక్రుస్తచ్ఛరవర్షణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 62)
ఆ తరువాత సంజయమేరు వంటి సేనానాయకులు నల్లమేఘాలలాగా వచ్చి విరుచుకు పడి అతడిపై బాణాల వర్షాన్ని కురిపించారు.
‘సంజయమేరు’ పేరు గతంలోనూ ప్రస్తావనకు వచ్చింది. ఈయన సుల్తాన్ హైదర్ షాహ ఆదేశాల ప్రకారం నడచేవాడు. ఆయన ఎవరిని చంపమంటే, వారిని నిర్దాక్షిణ్యంగా చంపేస్తాడు. సుల్తాన్ అతని కోశాధికారి ‘హస్సన్’ను చంపమని ఆదేశించగానే సుల్తాన్ సమ్ముఖంలోనే హస్సన్‌ను, అతని అనుచరులను క్షణాలలో వధించాడు. అతడు ఇప్పుడు బహ్రమ్ ఖాన్, అతని కొడుకుపై విరుచుకు పడ్డాడు.
ధన్యాస్తే శ్లాఘ్యమరణాః స్మరణాః స్వామినః పురః।
స్మృత్వామితప్రసాదానాం జీవ యత్ తృణవజ్జహుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 63)
తన స్వామి కోసం ఆయన ముందు ప్రాణాలు అర్పించేవారు ధన్యులు. అలాంటి వారి మృత్యువును ఆదరణతో స్మరిస్తూంటారు.
తచ్ఛుద్ధ యే ఋణమవేక్ష్య మితప్రసాద
ప్రాప్తే క్షణే జహతి యే నిజజీవరత్నమ్।
శస్త్రాణి పుష్పనికరానివ సంవిదన్తీ
ధన్యాస్త ఏవ కతిచిత్ ప్రభుసేవకేభ్యః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 64)
అలాంటి వారు స్వామి సేవలో తమ ప్రాణాలను తృణప్రాయంగా భావిస్తారు. స్వామి నుంచి అందుకున్న దాన్ని ఋణంగా భావించి, తమ ప్రాణాలను అర్పించటం ఋణ విముక్తిగా భావిస్తారు. శత్రువుల ఆయుధాలను పూలమాలల్లా ఆహ్వానిస్తారు, ప్రాణ త్యాగం చేసే సమయంలో.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
