Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-116

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తృతీయ తరంగం

అథో దేవస్య మాహాత్మ్యం యత్తస్యైవ రణే భటాః।
శిరాలమార్గపాద్యా యే తద్భృత్యాః ప్రలయం యయుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 65)

యుద్ధంలో శత్రువు భటులు శిరాల, మార్గపతి వంటి వారు నాశనమవటం ప్రభువు గొప్పతనం!

‘శిరాల’ అన్నది ‘సిరాజ్’ భ్రష్టరూపంగా భావిస్తున్నారు. వీళ్లంతా బహ్రామ్ ఖాన్ వైపున పోరాడినవారు. వారు మరణించటం ప్రభువు గొప్పతనం అంటున్నారు. ఇది ఇప్పటికీ మనం చూడవచ్చు. పరాజయం పాలయితే వేరే ఎవరిదో దోషం. గెలిస్తే మాత్రం నాయకుడికే గొప్పతనం.

ఇద చిత్రతరం యన్నః కటకే కోపి నో మృతః।
కింత్వ స్మద్భట నిర్ముక్త శరాగ్రఫల సంధితాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 66)

నిష్క్రష్టుం నాశకత్ కోష్ఠాత్ ఖంగం ఖానో రణోద్యతః।
తేనాఫలాయుధః ఖానో దీనస్త్వద్భవేష్టితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 67)

ఇది ఎంతో ఆశ్చర్యకరమైన విషయం. మన సైనికులు వదలిన బాణాలు వారి కవచాలను చీల్చి మరీ వారిని చంపాయి. వారు ఎన్ని బాణాలు వేసినా మనలో ప్రాణ నష్టం అన్నది కలగలేదు. బహ్రామ్ ఖాన్ ఒర నుంచి కత్తిని కూడా బయటకు తీయలేకపోయాడు. అతని  ఆయుధం వ్యర్థమైపోయింది. బహ్రామ్ ఖాన్ దీనుడయ్యాడు.

చితానల ఇవాసారైర్మిథ్యోష్మా సమపద్యత।
యావత్ సమేత్య ఇన్తుం తం ప్రారభన్ కృపయా ద్రుతమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 68)

వర్షం పడి చితి ఆరిపోయినట్టు, అతని (బహ్రామ్ ఖాన్) తేజమంతా పనికిరానిదయిపోయింది. అందరూ అతడిని చుట్టుముట్టి చంపాలని అనుకున్నారు.

తం ఫిర్యడామరస్తావదరక్షద్ బాహుపంజరే।
భృః పంకిలాతివృష్టిశ్చి ద్విజాగ్రే నిఃసహాయతా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 69)

(అందరూ బహ్రామ్ ఖాన్‌ని చంపేందుకు సిద్ధమౌతుండగా) ఫిర్యాడామరుడు త్వరగా ముందుకు వచ్చి బహ్రమ్ ఖాన్‌ను తన బాహు పంజరంలో బంధించాడు. బహ్రామ్ ఖాన్ ఎంతటి దుస్థితిలో ఉన్నాడంటే, భోరున పడే అతివృష్టి వల్ల అంతా బురద, బ్రాహ్మణుడి నిస్సహాయతను అనుభవించాడు. ‘ద్విజాగ్రే నిఃసహాయత’ను కొందరు ‘బ్రాహ్మణుడి ఎదురుగా నిస్సహాయత’ గా అనువదించారు. కానీ ‘ద్విజాగ్రే నిస్సహాయత’ అన్న పదం వెనుక ఉన్న అర్థాన్ని ఆంగ్లేయులు గ్రహించటం కష్టం. ఆ నిస్సహాయత భారతీయులకే అర్థమవుతుంది. ఇంకొందరు అక్కడ బురద, ఎదురుగా బ్రాహ్మణుడు ఉన్నారు అని అనువదించారు. ఈ రెండు అనువాదాలు కూడా అంత అర్ధవంతంగా అనిపించవు.

‘ద్విజాగ్రే నిస్సహయత’ అంటే బ్రాహ్మణుడి నిస్సహాయత. సందర్భంలో బహ్రామ్ ఖాన్ ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడంటే, ఒక బ్రాహ్మణుడి నిస్సహాయ స్థితిలాంటి స్థితిలో ఉన్నాడు. బ్రాహ్మణులు భారతీయ సమాజంలో అత్యంత గౌరవాన్ని అనుభవించారు. గ్రీకులు, హుణులు, శకులు వంటి విదేశీ దాడుల వల్ల కూడా వారి గౌరవానికి భంగం కలగలేదు. కానీ ఇస్లామీయుల దృష్టిలో  ప్రపంచంలో మనుషులు  మూడు రకాలు. ఒకరు తమ దైవాన్ని నమ్మేవారు. రెండవ రకం వారు తమ దైవాన్ని నమ్మనివారు. మూడవ రకం కపటులు (నమ్మకం లేకున్నా ఉన్నట్టు నటించేవారు).

‘ఖురాన్’లో పలు సురాలలో ఈ తేడాలను స్పష్టంగా వివరించటం కనిపిస్తుంది. సూర-అత్-తాఘబు (64, 2) లో ‘ఆయన మిమ్మల్ని సృష్టించినవాడు. కానీ మీలో కొందరు ఆయనను నమ్మేవారు. ఇంకొందరు నమ్మనివారు. ఆయన మీరేం చేస్తున్నారో అంతా చూస్తున్నాడు’ అని ఉంది.

సురా-అర్-కాఫీరున్ (109) మొత్తం నమ్మకస్థులకు, నమ్మనివారికీ నడుమ తేడా వివరించే అధ్యాయం. సకారా-అత-బఖారా (1,1-7) ఆరంభం లోనే మనుషులను మూడు రకాలుగా వర్గీకరించటం కనిపిస్తుంది. దాంతో ఇస్లామీయులకు తమ దైవాన్ని నమ్మని వారంతా ఒక్కటే. దాంతో భారతీయ సమాజంలో అత్యంత గౌరవం పొందుతున్న బ్రాహ్మణుడు ఇస్లాం సమాజం దృష్టిలో  తన విలువలేనివాడయ్యాడు. దీన్ని సామాజిక శాస్త్రవేత్తలు Existential vulnerability – ‘అస్తిత్వ దౌర్భల్యం’ అంటారు. అంటే వారి అస్తిత్వం బలహీనమై, ప్రమాదంలో పడిందన్నమాట. ఈ విషయంలో బ్రాహ్మణుడు ఏమీ చేయలేని నిస్సహాయుడు.

ఆధ్యాత్మికంగా చూస్తే ‘ద్విజాగ్రే నిస్సహయత’ అన్న పదం ‘గురువు ముందు తన అహాంకారాన్ని సంపూర్ణంగా నశింప చేసి ఆయన ముందు నిస్సహాయంగా నిలవటం’. అది గురువు కావచ్చు, దైవం కావచ్చు. దైవ శక్తి ముందు ఎవరైనా మోకరిల్లాల్సిందే. అలాంటి నిస్సహాయత. కానీ ఇప్పుడు బ్రాహ్మణుడన్న వాడు తురకల కరవాలాల ముందు నిస్సహాయుడు. మరణించటమో, లేక, తన ధర్మం విడవటమో తప్ప మరో దారి లేదు. ఏ దారైనా అస్తిత్వం కోల్పోక తప్పదు. Existential vulnerability.   అలాంటి నిస్సహాయతను బహ్రామ్ ఖాన్ అనుభవించాడని అంటున్నాడు శ్రీవరుడు.

ఈ పోలిక ఆనాటి భారతీయుల నిస్సహాయతను, వారిపై జరిగిన అత్యాచారాలను, వారి అస్తిత్వాన్ని సంపూర్ణంగా నాశనం చేసేందుకు చెలరేగిన మారణకాండను స్పష్టం చేస్తుంది. ప్రపంచంలో యూదులు ఎక్కడికి పోయినా  దాడులకు గురయ్యారు. Existential vulnerability అనుక్షణం అనుభవించారు.  రెండవ ప్రపంచ యుద్ధంలో యూదుల పట్ల నాజీలు అత్యాచారాలు చేశారు. అనుక్షణం వాటిని మరచి పోనీయకుండా ప్రపంచానికి చెప్తుంటారు యూదులు. భారతీయులపై యూదుల కన్నా ఘోరాతిఘోరమైన అత్యాచారాలు జరిగాయి. ‘అస్తిత్వ దౌర్బల్యాన్ని’ ఒక రకంగా ఈనాడు కూడా  అనుభవిస్తున్నారు భారతీయులు. కానీ ఆ అవగాహన లేదు ఈనాడు కూడా. ఆనాటి  Existential vulnerability  ప్రస్తావన రాలేదు ఎక్కడా. అందుకే, శ్రీవరుడు బ్రాహ్మణుడన్న పదం ఎందుకువాడేడో గ్రహించలేకపోయారు.

శ్రీవరుడు ‘ద్విజుడు నిస్సహాయుడు’ అన్నాడు.  ఈ కాలంలో కొందరు ‘ద్విజ’ అన్న పదం వినగానే ‘బ్రాహ్మణులే ప్రమాదంలో పడ్డారు’ అని ‘కులం’ ప్రసక్తి తెస్తారు. శ్రీవరుడి కాలంలో సమాజంలో బ్రాహ్మణులకు అత్యంత గౌరవం లభించేది. ద్విజ శబ్దం ఇక్కడ సమాజానికి ప్రతీక. ‘కులం’ సూచి కాదు. సమాజం అత్యంత గౌరవించే వారి అస్తిత్వం ప్రమాదంలో పడిందంటే మొత్తం సమాజ అస్తిత్వం ప్రమాదంలో పడిందని అర్థం. ఒక రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతని రాజ్యం ఓడిపోయిందంటాం. ఎందుకంటే, రాజు ఆ రాజ్యానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కాబట్టి. ఆ కాలంలో భారతీయ సమాజానికి బ్రాహ్మణుడు ప్రాతినిధ్యం వహించేవాడు. అందుకని ‘ద్విజ నిస్సహాయత’ అనటం ద్వారా సమాజం ఎంతటి నిస్సహాయతను అనుభవించిందో చెప్తూ ‘బహ్రామ్ ఖాన్’ అంతటి నిస్సహాయతను అనుభవించాడని పోలుస్తున్నాడు శ్రీవరుడు. ఈ పోలిక ద్వారా ఆనాడు ఇస్లామీయుల పాలనలో భారతీయ సమాజ స్థితిని చెప్పకనే చెప్పాడు. బహ్రామ్ ఖాన్ శత్రువులకు దొరికిపోయాడు. అతడిని శత్రుసైనికులు చుట్టుముట్టారు. చంపటానికి పోటీలు పడుతున్నారు. ఇంతలో డామరుడు తన బాహువుల్లో అతడిని బంధించాడు. మరణం అనివార్యం. ఎంత ఘోరమైన మరణం అన్నదే ప్రశ్న.  ఇంతకన్నా నిస్సహాయ స్థితి ఏముంది?

తిరుగుబాటు లేవదీసి, విఫలమై, గెలిచిన సుల్తాన్‌కు చిక్కినవాడి గతి ఏమిటో అందరికీ తెలుసు. ఇప్పుడు తన భవిష్యత్తు ఏమిటో బహ్రామ్ ఖాన్‌కు తెలుసు. రాజ్యలక్ష్మి తన దగ్గరకు వచ్చినప్పుడు కాదన్నాడు. ఇప్పుడు బురదలో పడి బందీ అయిన దుస్థితిలో ఉన్నాడు. అదీ అతడి నిస్సహాయ స్థితి!

మృత్యుభీతిరితి ప్రాభృత్ కిం కిం తస్య న దుఃఖదమ్।
శీతవాత భయోద్విగ్నాః మగ్నాః కేదారకర్దమే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 70)

త్యక్త్వా తం తద్భటా నగ్నా గర్తాటా ఇవ తేచలన్।
అర్జితాం సర్వసామాగ్రీ పామరైః పరిలుంఠితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 71)

బురద, నిస్సహాయత, మృత్యు భయం.. ఇలా బహ్రామ్ ఖాన్ కష్టాలు ఏమేమని చెప్తాం? లేని దుఃఖం లేదు అతనికి. చల్లగాలి, భయంతో ఉద్విగ్నత, నగ్నంగా , బురదలో మునిగిన సైనికులు, అతడిని వదలి, పారిపోయే ఎలకలలా పారిపోయారు. అతని సంపాదన, విలువైన వస్తువులన్నీ దొంగతనమయ్యాయి.

బహ్రామ్ ఖాన్‌ను వదలిపోయే సైనికులు  ప్రాణభయంతో పారిపోయారని చెప్తూ వారిని వర్ణించేందుకు ‘గర్తటా’ అన్న పదం వాడేడు శ్రీవరుడు. పంటలు బాగా పండినప్పుడు ఎలకలు, భూమిలో బొరియలు తవ్వుతాయి. వాటిలో ఉంటాయి. కానీ వర్షం పడినప్పుడు బొరియల నిండా నీళ్లు నిండుతాయి. ఎలకలు అక్కడ ఉండలేవు. ప్రాణభయంతో తమ బొరియలు వదలి  పరుగెత్తుతాయి. అలా పరుగెత్తారన్న మాట సైనికులు ప్రాణాలు అరచేత పెట్టుకుని.  ఇలా ఎలకలలా బిలంలో ఉన్న మనుషులను సూచిస్తుంది ‘గర్తట’ పదం.

సానన్దం చ సుతం పశ్యన్నశ్యద్వైర్యః స వివ్యథే।
దధ్యౌ చ క్వ చ సే భ్రాతా వ భృత్యాః క్వ గృహాదికమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 72)

ఆక్రందిస్తున్న తన కొడుకును చూసి, అతని ధైర్యం  సన్నిగిల్లింది. అతడికి చాలా బాధ కలిగింది. ‘నా సోదరుడు ఏడి? నా భృత్యులేరి? నా ఇల్లేది?’ అని ఆలోచించాడు. ఇప్పుడు అధికారంపై ఆశ అసలు స్వరూపం అర్ధమయింది. అధికారం దక్కితే ఏదో అనుభవించవచ్చు అనుకున్నాడు. కానీ అధికారం దక్కినా తనని తాను కోల్పోతాడు. అధికారం దక్కకపోతే ప్రాణాలు కోల్పోతాడు. ఇప్పుడతనికి తన సోదరుడు గుర్తొచ్చాడు. సేవకులు గుర్తొచ్చారు. ఇల్లు గుర్తొచ్చింది. కానీ ఏం లాభం? ఇప్పుడు స్వంత కొడుకు, అతడి కళ్ల ముందే ప్రాణ భయంతో ఏడుస్తున్నాడు. ఇతడు బందీ, ఇతడికీ  ప్రాణాలపై ఆశ లేదు. సర్వం కోల్పోయాడు. అతి దయనీయమైన పరిస్థితి.

ససుతః శత్రుభిర్వద్ధః కం పృచ్ఛామి కరోమి కిమ్।
వరం మరణమేవాస్తు మా మాస్తు మమ జీవనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 73)

పుత్రుడితో కలసి నేను శత్రువులకు బందీనయ్యాను. నేను ఎవరిని ఏం అడగాలి? ఏం చేయాలి? దీనికన్నా మరణమే మంచిది. నాలాంటి వాడు బ్రతకకూడదు. మరణమే మంచిది.

ఫలిత వచనం మేద్య యదుక్తం జనకేన తత్।
ధింగ్ మాం చిన్తామణిం త్యక్త్వా యేన కాచమణిః శ్రితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 74)

తండ్రి అన్న మాట ఈ రోజు అర్థమయింది. ఆయన అన్న మాట నిజమయింది. ఇందుకు నేనే కారణం. దోషిని నేను. గాజు ముక్కల కోసం మణులను వదిలేశాను. గతంలో.

సింహాసనంపై ఆశ వదలమని జైనులాబిదీన్ బహ్రామ్ ఖాన్‌ని అభ్యర్ధిస్తాడు. అప్పుడు బహ్రామ్ ఖాన్ తండ్రి మాట వినలేదు. అప్పుడు కోపంతో జైనులాబిదీన్ అతడికి శాపం ఇచ్చాడు. అధికార దాహం కలవాడు, అధికారం కోసం హత్యలు చేసేందుకు కూడా సిద్ధమైనవాడు సర్వనాశనం అవుతాడు అని శాపం ఇచ్చాడు జైనులాబిదీన్. ఇప్పుడు అది నిజమౌతోంది. సర్వం కోల్పోయాడు బహ్రామ్ ఖాన్. ఇప్పుడు కొడుకుతో సహా తనని కూడా కోల్పోతున్నాడు. పెద్దలు చెప్పిన మంచి మాటలు విన్నప్పుడు అయిష్టంగా ఉంటాయి. వారిని లెక్క చేయాలనిపించదు. తరువాత, అనుభవించేప్పుడు ‘ఆ రోజు మాట వినుంటే..’ అనిపిస్తుంది. చేతులు కాలిన తరువాత పట్టుకునేందుకు ఆకులు కూడా మిగలవు.

ఇత్యాది నిందన్ స్వాత్మానం పశ్చాత్తాపహతాశయః।
జీవన్మరణమాపన్నః ఖానః సంప్రతి వర్తతే ।
పౌషే తరురివోన్నగ్నః ఫలపత్రవివర్జితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 75)

ఈ రకంగా తనని తాను నిందించుకుంటూ, పశ్చాత్తాప పడుతూ, మరణం కోసం ఎదురు చూస్తూన్న   బహ్రామ్ ఖాన్ ఎలాగున్నాడంటే, పుష్య మాసంలో ఆకులన్నీ రాల్చిన చెట్టులా  నగ్నంగా ఉన్నట్టు ఉన్నాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version