Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-117

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

రాజ్యం తవ క్రమాయాతం దత్తం దేవేన భున్జతామ్।
ఫలితో ధర్మవిజయః సోఅయం భాగ్యైర్మహీపతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 76)

ఓ రాజా! వంశపారంపర్యంగా నీకు అందిన రాజ్యం భగవదత్తంగా భావించు. భాగ్యం వల్ల నీకిది లభించిందని ఫలితాన్ని అనుభవించు.

కిమవ్యత్తస్య కర్తవ్యం యత్తత మార్ల సమాదిశ।
శృత్వేతి నృపతిస్తష్టో దత్తాస్మై పారితోషికమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 77)

‘ బహ్రామ్‌ఖాన్‌ను ఏం  చేయాలి ? త్వరగా ఆదేశాలివ్వండి’ అన్న ఈ మాటలు విని రాజు సంతోషించాడు. వారికి పారితోషికం ఇచ్చాడు.

జయవాద్య నివాదౌఘౌః సర్వం బలవతోషయత్।
అన్యేద్యుస్తద్భటా జైనగిర్యా కటకవేష్టితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 78)

బహ్రామఖానమానవిన్యుః ససుతం భూపతే పురః।
సంగ్రామ విజయోత్సిక్తం సత్కర్తుం సృభవ్రజామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 79)

సహర్షో రాజధానీం తామారుదోష నరేశ్వరః।
ఫలితో ధర్మవిజయః సోఅయం భాగ్యైర్మహీపతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 80)

జయ వాయిద్యాలు నినాద ఘోషతో సమస్త సేనను ఉత్సాహితులను చేశాయి.  ‘జైనగిరి’ లో పుత్రుడితో కలసి బంధితుడయిన బహ్రమ్ ఖాన్‌ను రాజు ఎదురుగా తెచ్చి నిలిపారు. యుద్ధంలో విజయం సాధించిన తన సేనను సత్కరించేందుకు రాజు రాజప్రాసాదం చేరాడు. సైనికులతో ఉచితానుచితాలు మాట్లాడుతూ బహ్రమ్ ఖాన్ వైపు చూశాడు.

భువిమ్ రన్ధ్రమివేక్షన్తం లజ్జయా చ భయేన చ।
రణక్షణ భటనస్త హస్త ధ్వస్త విభూషణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 81)

సిగ్గుతో  బ్రహ్మమ్ ఖాన్ భూమిలో రంధ్రం వెతుకుతున్నట్టు తలవంచుకుని నిలుచున్నాడు. అతనిపై సైనికులందరూ చేతులు వేసి ఆభరణాలు లాక్కోవటం వల్ల ఆభరణాలేమీ లేకుండా నిలచి ఉన్నాడు.

దయాలునీ చరత్తాత్మజీర్ణవస్త్రవగుందితమ్।
ముఖలగ్నేతుభౌదోద్యద్రక్తాక్త ధృత వేష్టనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 82)

(వొంటిపై బట్టలన్నీ చిరిగి, ఆభరాణాలన్నీ ఎవరో ఎత్తుకు పోగా), ఎవరో నిమ్న జనులు ఇచ్చిన  జీర్ణ వస్త్రాన్ని చుట్టుకుని, ముఖంపై బాణం తగలటం వల్ల కలిగిన గాయం నుంచి కారుతున్న రక్తంతో తడిసిన వస్త్రాలతో

అలక్ష్మీ వీక్షితం దూరాత్ పితృత్వం క్షణమైక్షత।
భాగ్యోర్జితస్య భూభర్తురగ్రే బద్ధః సమాత్మజః।
దీవాత్మా దదృషే పొరైః స్థిరాః కస్య విభూతయ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 83)

కొడుకుతో పాటు బంధితుడయి, అదృష్టం వరించిన రాజు ముందు తల వంచుకుని దీనుడిలా నుంచున్న బహ్రామ్ ఖాన్‌ను ప్రజలు చూశారు. ఎవరి అదృష్టం స్థిరంగా ఉంటుంది?

లోభాక్రాంతథియో వివేకాముచితం మున్దన్తి యన్మోహితా
భుక్తా యా మనసాపి దర్పకచితా స్త్వక్తుం న శక్యాః స్వయమ్।
సన్తాపాయ భవన్తి సప్తతరులం నీతాః పరైశ్చేద్ బలా –
న్మా మా సన్తు భవేఅన్త హన్త చపలా వేశ్యా ఇవైతాః శ్రియః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 84)

గర్విష్టి, లోభి అయినవాడు, ఏదైనా ఒక విషయం చూసి మోహించి, ఉచితానుచితాలు.. త్యజించి, దాన్ని ప్రాప్తించుకుని, ఒకసారి అనుభవించి, దాన్ని వదలలేకపోతాడో, మనసు నుంచి తొలగించలేక పోతాడో, దాన్ని మరెవరో బలవంతంగా లాక్కుంటే, నిరంతరం తాను కోల్పోయినదాని గురించి తపిస్తూ, దుఃఖిస్తాడు మనిషి. సంపద అన్నది వేశ్యలాంటిది. ఈ లోకంలో సంపద అన్నది ఉండకూడదు. ఉండకూడదు.

ఇక్కడ శ్రీవరుడి హృదయాన్ని గ్రహించే వీలు లభిస్తుంది. జైనులాబిదీన్‌కు ముగ్గురు కొడుకులు. పెద్దవాడు యుద్ధంలో బాణం తగిలి చనిపోయాడు. రెండవ వాడు సుల్తాన్ అయి ప్రమాదవశాత్తు కాలు జారిపడి చనిపోయాడు. మూడవవాడు ఇప్పుడు బాణం తగిలి, సోదరుడి  చేతిలో చిక్కి అర్ధాంతరంగా చావుకు గురవుతాడు. అంటే, జైనులాబిదీన్ మగ్గురు కొడుకులు కూడా ఏదో రకంగా ప్రమాదంలో హఠాన్మరణం చెందినవారే. దీర్ఘాయుష్యులు కారు. వారందరి మరణాలకు కారణం రాజ్యాధికార కాంక్ష. వారు ముగ్గురూ శ్రీవరుడి శిష్యులు. తన శిష్యులు, తన కళ్ల ముందు పెరిగినవారు, ఇలా వ్యర్థంగా, అధికారం కోసం కొట్టుకు చచ్చిపోతుంటే, చూస్తూన్న శ్రీవరుడి హృదయం ఎంతగా క్షోభించిందో ఈ శ్లోకం చెప్తుంది. ఎంత చెడ్డది అధికారం. అసలు అధికారంపై ఆశ అన్నదే ఈ ప్రపంచంలో లేకపోతే ఎంతమంది ప్రాణాలు పోకుండా ఉంటాయో కదా! అందుకే ఈ సంపత్తిని వేశ్యతో పోల్చాడు శ్రీవరుడు. ఎవరి దగ్గరా ఎల్లప్పటికీ ఉండదు. ఎప్పుడు ఎవరి దగ్గిర ఉంటుందో ఎవరికీ తెలియదు. దాని కోసం ఎన్నెన్ని రక్తపాతాలు! ఎంత హింస! అసలు అదే లేకపోతే సమస్యనే ఉండదు కదా!

ఉపేక్షితః పితా తాదృగస్సాస్థ్యే స్వ్థోలిప్సయా।
జ్యేష్ఠోహ్య దమఖానః స బాధితో అపాయ యుక్తిభిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 85)

బంధితుడై ఉన్న బహ్రమ్ ఖాన్‌ను చూస్తూ ప్రజలు ఇతడు ఎన్ని రకాలుగా సాధ్యమో అన్ని రకాలుగా పెద్దన్న ఆదమ్ ఖాన్‌ను వ్యతిరేకించాడు. అనారోగ్యంతో బాధ పడుతున్న తండ్రిని విస్మరించాడు.

దురాశాపరో భ్రాతా శ్రియో అసాధ్యా మయేక్షణాత్।
రాజ్యలోఖాద్ భ్రాతృసుత తాస్తా ద్రోహధియః కృతాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 86)

తన సోదరుడి కొడుకు నుంచి అధికారం దక్కకుండా ఉండేందుకు విప్లవం లేవదీశాడు. ఇలా తన సోదరుడి కొడుకుకు వ్యతిరేకంగా దుర్బుద్ధితో వ్యవహరించాడు.

అద్వైతేన ఫలం ప్రాప్తం తరధర్మవినిశ్చయాత్।
దృష్ట్యా బద్ధం తమానీతం ఖానమిత్యవదజ్జీవః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 87)

తాను చేసిన అధర్మ ఫలితాలను అనుభవిస్తున్నాడని, బందితుడైన బహ్రామ్ ఖాన్‌ను చూస్తూ ప్రజలు అనుకున్నారు.

కేర్యాభ స పితు శాపాద్ విమూఢ సమపద్యత।
తథాహి తం పితా జాతు పితృధ్వైధే రహబ్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 88)

తండ్రి శాపం వల్ల తెలివి కోల్పోయి మూఢుడయ్యాడు బహ్రామ్ ఖాన్.అని కొందరు అన్నారు. తండ్రితో వివాదం వచ్చినప్పుడు తండ్రి బహ్రామ్ ఖాన్‌తో అన్నాడు.

రాజ్యం త్వదగ్రజాభ్యాం మే వాశితం వైరతో మిథః।
తత్రాప్య నిష్టా ద్వావేవ మమ చిత్తాజ్వర ప్రజా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 89)

నీ సోదరులిద్దరూ పరస్పర కలహాలతో రాజ్యానికి నష్టం చేకూర్చారు. వారు అంటే నాకు ఇష్టం లేదు. వారు జ్వరం లాంటి రోగంతో సమానం.

తదౌతౌ వినివార్యాహం యుక్త్యా దేశసుఖాశయా।
త్వామేవ వర్ధయిష్యామి త్వం మదేవాశ్రయో॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 90)

నేను నీ సోదరులిద్దరినీ నివారిస్తాను. దేశం సుఖంగా ఉండేందుకు నీకు ప్రోత్సాహం ఇస్తాను (నిన్ను రాజును చేస్తాను). నువ్వు నా వెంట ఉండు చాలు.

శృత్వేతి ప్రాహతం నాహం జాతుచేద్ భ్రాతరం త్యజే।
యతో జ్యేష్టో అస్తి మే ద్విష్ఠో ద్వయోః కిం ప కరిష్యతి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 91)

తండ్రి మాటలు విన్న బహ్రమ్ ఖాన్ నేను సోదరుడిని వదలనని అన్నాడు. ఎందుకంటే తనను ద్వేషించే పెద్దవాడు తామిద్దరినీ ఏం చేయాలేడన్న ధీమా ప్రదర్శించాడు.

శృత్వేత్సాహగ్రజం హన్తుం త్వయేచ్ఛస్త్యాం స రక్షతి।
ప్రాప్త ప్రాధుణహన్తేన భుజంగమివ వేశ్మగమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 92)

నీ రెండవ సోదరుడు నీ ద్వారా (బహ్రామ్ ఖాన్) చంపాలని పథకాలని వేస్తున్నాడు. ఇది ఇంటి సేవకుడిని చంపేందుకు అతిథిని  వాడుకున్నట్టు నీ సోదరుడిని చంపేందుకు నిన్ను వాడుకుంటున్నాడని జైనులాబిదీన్ బహ్రమ్ ఖాన్‌కు నచ్చచెప్పాడు. అలాంటి వాడు నిన్ను (బహ్రామ్ ఖాన్‍ను) రక్షిస్తాడని నమ్మటం మూర్ఖత్వమని చెప్తాడు.

సిద్ధకార్యః సపుత్రః స బాధతే యది కా గతిః।
తద్భుత్వా సంస్కృతజ్ఞః స శ్లోకమేత్యుత్తరం దజా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 93)

‘నీ ద్వారా పెద్దవాడి అడ్డు తొలగించుకుని నీ రెండవ సోదరుడు, కొడుకుతో కలసి నీకు వ్యతిరేకమైతే ఏం చేస్తావు’ అనడిగాడు జైనులాబిదీన్. దానికి సంస్కృత శ్లోకంతో సమాధానం ఇచ్చాడు బహ్రామ్ ఖాన్.

విద్యతీర్థే శృతిపరిచితాః సాధవః సత్యతీర్థే
గంగాతీర్థే సకలమూనయా యోగినో అధ్యత్మ తీర్థే।
లజ్జాతీర్థే కులయవతయో దావతీర్థే వదాన్యా
దారాతీర్థే ధరణిపతయ కిల్బిషం క్షాలయన్తి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 94)

శాస్త్రాలు తెలిసినవారు తమ పాపాలను విద్యతీర్థంలో ప్రక్షాళన చేసుకుంటారు. సత్యతీర్థంలో సాధకులు తమ పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. సకల మునులు గంగాతీర్థంలో పాపాలను ప్రక్షాళన చేసుకుంటారు. కుల యువతులు లజ్జాతీర్థంలో, దాన నిరతులు దాన తీర్థంలో, రాజులు ధారా తీర్థంలో పాపాలు ప్రక్షాళన చేసుకుంటారు.

‘ధార’ అంటే కత్తి అంచు, కత్తి ధార. Razor’s edge అన్నమాట. అంటే రాజుల పాపాలు కత్తి ధారతో ప్రక్షాళనమవుతాయి. తాను యుద్ధ మార్గాన్ని ఎంచుకున్నట్టు తండ్రికి చెప్పాడు బహ్రమ్ ఖాన్.

తదాకర్ధ్యబ్రవీద్ రాజా సక్రోధం తం దురాశయమ్।
బహుధా యుద్ధ దృష్టోసి నాహం యత్రాస్మి తతక్షమః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 95)

వరాకః ఖడ్గధారార్థీ తత్ర త్వమసి దర్శితః।
కిం చ్యుత్పాటనే యోగ్యే కిత్ర పశ్యామి దుర్ధయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 96)

ఇది విని రాజు క్రోధపూరితుడయ్యాడు. అతని దూరాశను విమర్శిస్తూ ‘యుద్ధంలో నిన్ను చాలా మార్లు చూశాను. నేను నీతో యుద్ధం చేయలేకపోయాను. నువ్వు కత్తి తిప్పుతూ గర్వించావు. దుష్టుడా, నువ్వు అహంకారివి. నిన్నేమనాలి? దుష్టబుద్ది.. గర్వంతో కాలుతున్న నీ కళ్ళు పీకివేసేందుకు అర్హమనిపిస్తోంది నాకు.’

తదేవ ఏవ నష్టస్త్యం భవేః సానుశయో అచిరాత్।
ఇత్యుక్తమస్మిన్ పిత్రాయత్ తదర్య ఫలితం వచః।
తం వీక్ష్యేతి కథా లోకః స శోకో అస్యకరోన్మథః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 97)

త్వరలోనే నువ్వు నష్టపోతావు. పశ్చాత్తపపడతావు. ఇలా ఆ రాజు అతని తండ్రి అన్న మాటలు ఈ రోజు నిజమయ్యాయని ప్రజలు బంధితుడయిన బహ్రామ్ ఖాన్‌ను చూస్తూ శోకం ప్రకటించారు.

ఇంత వరకూ గతంలో చెప్పిన కథనే శ్రీవరుడు మళ్లీ చెప్పాడు. జైనులాబిదీన్ మాటను ఆయన కొడుకులు వినకపోవటం వల్ల కలిగిన అనర్థం పట్ల విషాదంతో, తండ్రి మంచి చెప్తే వినని  అతని కొడుకుల దుర్దశ ఎలాంటిదో మరోసారి ప్రపంచానికి ప్రకటిస్తూ, చేసిన కర్మ ఫలితం అనుభవించక తప్పదని, నిరూపిస్తూ, గతంలో జైనులాబిదీన్ బహ్రామ్ ఖాన్‌ల నడుమ జరిగిన సంవాదాన్ని మరోసారి రచించాడు శ్రీవరుడు.

యథో చితైర్ధావమానైస్తోషయిత్వా నిజం బలమ్।
తస్మిన్నేవ దినే రాజా తుష్టో నగరమాయయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 98)

తన సైన్యానికి యథోచితంగా దానాలు, బహుమతులు ఇచ్చి, వారిని సంతృప్తి పరచి రాజు నగరం వెళ్లిపోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version