Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-118

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

బద్ధం రిపుం సమాదాయ నానారూఢం సుతాన్వితమ్।
శ్రీజైననగరే రాజావాసే స్వే బంధనే వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 99)

పుత్రుడితో పాటు బంధితుడిని (బహ్రామ్ ఖాన్‍ను) నౌకలో జైననగరం తీసుకుని వచ్చారు. రాజు నివాసంలోనే బంధితుడిగా ఉంచారు.

తన పినతండ్రి, పినతండ్రి కొడుకు అయినా సరే విప్లవం లేవదీసినందుకు వారి పై కనికరం చూపే ప్రసక్తి లేదు. తెలిసి తెలిసి విషపు పామును ఎవ్వరూ ఇంట్లో ఉంచుకోరు కదా! పైగా, సుల్తాన్‌లు ఎవరూ విప్లవం లేదీసిన వారిని స్వంత అన్న అయినా, తమ్ముడయినా క్షమించి కనికరం చూపిన ఉదాహరణలు లేవు. కాబట్టి హస్సన్ షాహ ప్రవర్తనలో ఎలాంటి క్రొత్తదనం లేదు. అందరు సుల్తాన్‌ల లాగానే ప్రవర్తించాడు.

జననీ నృపతేః ప్రీతా దర్శనామృత హర్షణా।
అమన్యత్ రణోత్తీర్ణ పునర్జాతమివాత్మజమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 100)

యుద్ధం నుండి తిరిగి వచ్చిన కుమారుడిని చూసి అతని తల్లి సంతోషించింది. తన కొడుకు పునర్జన్మ పొందినట్టు భావించింది.

శంకితో యౌన సంబంధాద్ భూపతిః కతిచిద్దినైః।
రూషావతార సీహదన్ కారాగారాన్తరే వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 101)

అవతార సీహదీన్, అతని సంబంధీకుల పట్ల ఆగ్రహంతో రాజు వారిని కారాగారంలో బంధించాడు.

ఈ అవతార సీహదీన్ ఎవరో, అతని సంబంధీకులు ఎవరో, రాజుకు వారి మీద ఎందుకు కోపం వచ్చిందో శ్రీవరుడు రాయలేదు. ఇతర పర్షియన్ రచయితలు ఈ విషయం ప్రస్తావించలేదు.

పాపో మల్లికజాజః స పంచగహ్వరదేశజః।
పునశ్చాటుక తంత్రేణ తత్తదాయాస కార్యభూత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 102)

పంచగహ్వర దేశంలో జన్మించిన మల్లిక జాజ అనేవాడు పొగడ్తలతో రాజు ప్రాపు సంపాదించాడు. అందరి దురదృష్టానికి కారణమయ్యాడు.

ఉత్కోచముద్రాదానాదిప్రపంచాంచితవంచనః।
సుసంచయకృతా యేన దేశోశేషో విలుంఠితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 103)

మొత్తం దేశం అతనికి ధనం సమర్పించుకునే స్థితికి దిగజారింది. ఈ రకంగా అతడు బోలెడంత ధనం సంపాదించాడు.

అభిమన్యుప్రతీహారః స్వతంత్రో మంత్రిమండలే।
స దేవసరసి స్వామ్యమభజద్ బలిదర్పితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 104)

అభిమన్యు ప్రతీహార అనేవాడు ‘దేవసర’పై అధికారాన్ని పొందాడు. మంత్రులందరిలోకి స్వతంత్రుడు అభిమన్యు. అతడు తన శక్తిని  చూసి గర్వించేవాడు.

దేవసర కులగామ్ జిల్లాలో ఉంటుంది. నీలమత పురాణంలో కూడా ఈ దేవసర ప్రసక్తి వస్తుంది. ఇలా మంత్రిమండలిలో ఒక్కొక్కొరూ రాజును పొగడి సేవలు చేసి, అధికారాలు సాధిస్తూ గర్విస్తున్నారు. వీరు ప్రజలను హింసించి, ఆస్తులు పెంచుకుంటు గర్విస్తున్నారు. హస్సన్ షాహ పాలనలో ఇది మరింత స్పష్టంగా తెలుస్తూంటుంది. జైనులాబిదీన్ తరువాత కశ్మీర్‌లో పేరుకి రాజు ఉన్నా, పాలన రాజు నమ్మకస్తుల చేతిలోకి, రాజుకు మెప్పించి నమ్మించిన వారి చేతిలోకి వెళ్తున్నదనీ, రాజును కేవలం రాజ్యానికి అధికారంగా భావిస్తున్నారే తప్ప, అధికారం క్రింది వారి చేతిలోకి వెళ్లిపోతున్నదనీ అర్థం చేసుకోవచ్చు.

లోత్రప్రవిగ్రహక్షేత్రదత్తరుద్ధిః పదే పదే।
లుభ్ధః స నిజమాత్మానమనా శీర్బాజనం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 105)

అతడు తన లోభత్వంతో కావాలని అడుగడుగునా సమస్యలు సృష్టిస్తూ ప్రజలను దోచుకునేవాడు. పనులను అడ్డుకుని, ప్రజల శాపాలకు కేంద్రం అయ్యాడు. ప్రజలు సంఖ్యలో ఎంత ఎక్కువ అయినా, వారు అధికారానికి తలవంచుతారు. తలవంచక తప్పదు. అన్యాయాన్ని నిందిస్తారు. దూషిస్తారు. శాపానార్థాలు పెడతారు. కానీ ధైర్యంగా ఇది అన్యాయం అని కలసికట్టుగా పోరాడరు. ఎవరో కార్యశూరుడు వచ్చి రక్షించాలని ఎదురు చూస్తారు.

శంకయో రాజగృహాసన్నః పితృవ్యో బంధన స్థితిః।
త్వయ్యన్యత్ర స్థితే కోపి నీత్వా ద్వైరాజ్యమాచరేత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 106)

అతడు రాజు మనసులో బంధితులయి ఉన్న తండ్రి సోదరుడు, అతడి కొడుకుపై అనుమానాలను కలిగించాడు. వారు కారాగారంలో సజీవంగా ఉన్నంత వరకూ, వారి ఆధారంగా రాజకీయాలు చేసి అంతర్గత పోరాటాన్ని నెరపచ్చుని రాజుకు బోధించాడు.

ఇత్యాది ప్రేరితోనేన నేయబుద్ధిర్నరేశ్వరః।
కృద్ధో బహ్రామఖానాయ నేత్రోత్పాటన మాదిశత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 107)

ఇలాంటి మాటల వల్ల ప్రేరితుడై, ఇంకా పరిణతి చెందని రాజు, క్రోధంతో బహ్రామ్ ఖాన్ కళ్లు పీకేయమని ఆజ్ఞాపించాడు.

రాజు, జాలి దయ చూపించాలనుకున్నా, చుట్టూ ఉన్న వారు అతడికి ఆ అవకాశం ఇవ్వరు. అయితే, ఒక కోణంలోంచి చూస్తే వారి సలహా కూడా సరైనదే అనిపిస్తుంది. ఇటీవలి కాలంలో శక్తివంతమైన తీవ్రవాదులను పట్టుకుని ఎంత కాలం జైలులో ఉంచితే అంత కాలం, పలురకాలుగా అతడిని విడిపించే ప్రయత్నాలు సాగే వీలుంది. విడిపించటం కోసం హైజాక్‌లూ, తీవ్రవాద దాడులు, కిడ్నాప్‌లు చేసి, బెదిరించే వీలుంది. అందుకే శత్రు శేషం మిగల్చరాదంటారు.

తస్య తూలాచితే నేత్రద్వయే తప్తాం శలాకికామ్।
జైనరాజానకో లౌహీం దృంజ్ఞ్మానార్థమదాపయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 108)

అతడి దృష్టి నాశనం చేసేందుకు ఎర్రగా కాల్చిన ఇనుపకడ్డీలతో అతడి కళ్లను నాశనం చేయమని ఆజ్ఞాపించాడు రాజు. బహ్రామ్ ఖాన్ కళ్లపై దూదిని ఉంచి, ఇనుప కడ్డీలతో అతడి దృష్టిని నాశనం చేశారు. జైనులాబిదీన్ కు తగిన  వారసుడు కాడు బహ్రామ్ ఖాన్.

శత్రువుల కళ్లు పీకించటం సుల్తాన్‌ల కాలంలో అనవాయితీ. ఢీల్లీలో సైతం బాద్షాహలను సింహసనం నుంచి దింపి కళ్లు పీకేవారు. భారతదేశంలోనే కాదు, ఇతర దేశాలలోని ముస్లింల రాజ్యాలలో కూడా ఈ పద్దతిని పాటించేవారు. ఢిల్లీ మొఘలు రాజు ఫరూఖ్‌షియర్ కళ్లు పీకి కారాగారంలో పారేశారు.

ఇంతమంది సుల్తానులు శత్రువుల కళ్లు, బంధువులని కూడా చూడకుండా, ఘోరంగా పీకించినా, కళ్లు పీకించటం ప్రసక్తి రాగానే మనకు శ్రీకృష్ణదేవరాయలు గుర్తుకు వస్తాడు. అప్పాజీ గుర్తుకు వస్తాడు. ఇది చరిత్ర రచయితల గొప్పతనం!

కళ్లు పీకించటం భారతీయ సంస్కృతి కాదు. పైగా, తనకు ఎంతో మేలు చేసి, అండగా నిలచిన వారి కళ్లు పీకించటం నమ్మవీలులేని  గొప్ప కథ. మనసులు కరిగించే కథ. సుల్తానులు కళ్ళు  పీకించటం గురించి చాలా మంది చెప్పేరు. ఇప్పుడు ప్రత్యక్ష సాక్షి శ్రీవరుడి కథనం ఉంది. పర్షియన్ రచయితలు బోలెడన్ని సంఘటనలు గొప్పగా రాశారు. బోలెడంత మంది సాక్షులున్నారు. భారతదేశంలోను బయట దేశాల్లోనూ జరిగిన ఇలాంటి సంఘటనల వివరాలకు  సాక్ష్యాలు భద్రపరచారు. కానీ శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ కళ్లు పీకించినట్టు ఎలాంటి సాక్షాలు లేవు. సమకాలీకులు ఎవ్వరూ ఈ విషయం ప్రస్తావించలేదు. ఆ కాలం కవుల కాలం. కవులు తమ రచనల్లో సమకాలీన సంఘటనలను పొందుపరచారు. కానీ ఈ విషయం ఎవ్వరూ ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ప్రస్తావించలేదు.

శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ కళ్లు పీకించినట్టు ఒక్క శాసనం కానీ, రాతపూర్వకంగా కానీ, శిల్పాల రూపంలో కానీ సాక్ష్యం లేదు. కేవలం జానపద కథలు, గాథలు, పాటల ద్వారానే తప్ప లిఖిత పూర్వక ఆధారాలు ఏమీ లేవు. అప్పాజీ కళ్లు శ్రీ కృష్ణదేవరాయలు పీకించినట్టు లఖిత పూర్వకంగా 16-17వ శతాబ్దికి చెందిన రాయవాచకంలో లభిస్తుంది. శ్రీకృష్ణదేవరాయల పాలనాకాలం ముగిసిన వందేళ్ల తరువాత రాసిన రచన కాబట్టి దాన్ని ప్రామాణికంగా భావించటం కష్టం. కానీ చరిత్ర రచయితలు ఈ రచనను primary source గా గ్రహించటం గమనించవచ్చు.

పోర్చగీసు గుర్రాల వ్యాపారి ఫెర్నావో న్యూనిజ్ రాసిన Chronicles of the Kings of Vijayanagara లో కృష్ణదేవరాయ పాలనా కాలం గురించి ఆధారాలు లభిస్తాయి. కాని ఈయన కూడా ప్రత్యక్ష సాక్షి కాదు. ఈయన కృష్ణదేవరాయల పాలన కాలం తన కళ్లతో చూడలేదు. అప్పటికే ప్రచారంలో ఉన్న కథలను తన రచనలో జొప్పించాడు. ఇతను తన రచనను అచ్యుతదేవరాయల కాలంలో రాశాడు. కాబట్టి కృష్ణదేవరాయలను పొగడటం కన్నా అచ్యుతదేవరాయలను సంతృప్తి పరచటంపై దృష్టి పెడతాడు.

అదే దొమింగో పేస్ రచన ప్రత్యక్షసాక్షి కథనం. అయన విజయనగర వైభవాన్ని కళ్లతో చూశాడు. అందుకే అతని రచనలో విజయనర గొప్పతనం పట్ల ఆశ్చర్యం, ఐశ్వర్యం పట్ల అద్భుత భావనలు కనిపిస్తాయి. న్యూనిజ్ రచనలో ఇవేవీ కనిపించవు. కానీ మన చరిత్ర రచయితలు విదేశీయుడు రాసిన కట్టుకథలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇతర విషయాలలో జానపదుల కథలకు, పాటలకు ఇవ్వని చారిత్రిక ప్రామాణికత శ్రీకృష్టదేవరాయల విషయంలో ఇచ్చారు.

భారతీయ చరిత్ర రచయితలు, శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ కళ్లు పీకించలేదని నమ్ముతారు. శ్రీకృష్ణదేవరాయల తరువాత కూడా అప్పాజీ చురకైన రాజకీయ జీవితం గడిపాడని, శేష జీవితం ప్రశాంతంగా తిరుమలలో గడిపాడని భావిస్తారు. ఇందుకు అప్పాజీ వేయించిన శాసనాలను కూడా అధారాలుగా చూపిస్తారు. కానీ, ప్రచారంలోకి మాత్రం శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీ కళ్లు పీకించాడనే వచ్చింది.

కృష్ణదేవరాయలు అప్పాజీ కళ్లు పీకించేడనే  అబద్దామని లభించిన ప్రచారం, హుమయున్ తన సోదరుడు కమ్రాన్ కళ్లను ఇనుప కడ్డీలతో పీకించటం, జహంగీర్ సోదరుడు ఖుస్రూ మీర్జాను గుడ్డివాడిని చేయటం, రాజసభలోని పెద్దలు అహ్మద్ షాహ, రెండవ షాహ ఆలమ్‌ల కళ్లు పీకేయటం, జలాలుద్దీన్ ఖిల్జీ కొడుకుల కళ్లు అల్లాఉద్దీన్ ఖిల్జీ పీకించటం వంటి విషయాలకు లభించలేదు. అంతేకాదు, మహమ్మద్ ఘోరీ, బందీగా చిక్కిన పృథ్వీరాజ్ చౌహాన్ కళ్లు పీకించాడా? లేదా? అన్న విషయంపై తీవ్రమైన వాదోపవాదాలు ఉన్నాయి. ‘పృథ్వీరాజ్ రాసో’ రచన ప్రకారం పృథ్వీరాజ్‌ను గ్రుడ్డివాడిని చేసి చంపారు. కానీ చరిత్ర రచయితలు ‘పృథ్వీరాజ్ రూసో’ను కట్టుకథగా కొట్టేసి ఘోరీ, పృధ్వీరాజ్‌ను గ్రుడ్డివాడిని చయలేదని నమ్ముతారు. భారతదేశ చరిత్ర రచనలో ఇలాంటి వైరుధ్యాలు ఎన్నో. కృష్ణదేవరాయల విషయంలో ప్రచారంలో ఉన్న కథలు ఆధారాలు వాటి ఆధారంగా చేసిన విదేశీ రచన ప్రామాణికం.  కానీ ఘోరీ విషయంలో ప్రచారంలో ఉన్నవి కట్టుకథలు. రచనలు కట్టుకథల ఆధారంగా రాసిన అబద్ధపు గాథలు.

(ఇంకా ఉంది)

Exit mobile version