Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-119

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

నైర్ఘృణ్యమక్షిహర్తుర్యత్ కృష్టాక్షస్య చ యా వ్యథా।
ద్వయం న శక్యతే వక్తుం యథార్థం మాదృశాం గిరా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 109)

కళ్లను పీకీసే వాడి  నిర్దయత, కళ్లు పీకేసిన వాడి వ్యథలను వర్ణించేందుకు నాలాంటి వాళ్ల దగ్గర పదాలు లేవు.

ఈ శ్లోకం ఒక్కటి చాలు, ఈ అనాగరిక, రాక్షస చర్యకు శ్రీవరుడి మనసు ఎంతగా క్షోభించిందో. శ్రీవరుడు ఇలాంటి పైశాచిక చర్యలకు ఎంతగా బాధపడి అసహ్యించకున్నాడో తెలియటానికి ఈ ఒక్క శ్లోకం చాలు. ఇక్కడ శ్రీవరుడు మన ఆధునిక నిర్జీవ చరిత్ర రచనల ప్రామాణికాలను త్రోసిరాజని, మనిషిగా ఆలోచించాడు. మనసుతో స్పందించాడు. చరిత్ర రచన అసలు పద్ధతి ఇది.

చరిత్ర రచయిత నిష్పక్షికంగా, నిర్మోహంగా నిజాలను ప్రకటించాలి. కానీ ఆ నిజాలను ప్రకటిస్తున్న తానూ మానవుడిని అని మరచిపోకూడదు. ఇలాంటి దుశ్చర్యలను రాక్షస చర్యలను ప్రకటించేప్పుడు రచయిత ఒక్క కన్నీటి చుక్కను రాల్చితే చాలు, చదివేవారి మనసులు శోక సముద్రాలవుతాయి.

అధికారం కోసం అందరూ ఆశపడతారు. అధికారం దక్కేవరకూ ఆరాటం, ఆ తరువాత అధికారం నిలుపుకోవాలనే పోరాటం తప్ప అధికారం చరిత్ర మరొకటి లేదు. ఈ ఆరాట, పోరాటాల నడుమ వ్యక్తి వ్యక్తిత్వం, సమాజ  వ్యక్తిత్వం,  మనస్తత్వాలు, విలువలు బోధపడతాయి. శ్రీవరుడు ప్రస్తావించకుండా, స్పురింప చేసిన విషయం ఇదే. ఇద్దరి నడుమ పోరు జరిగింది,  అధికారం కోసం. ఒకడే గెలుస్తాడు. గెలిచినవాడు ఓడినవాడి కళ్లు పీకించటం, అవమానించి, రోడ్డు మీద ఊరేగించి చంపటం, భారత ధార్మిక, సామాజిక విలువలకు వ్యతిరేకం. ఓడినవాడినీ గౌరవించే ధర్మం మనది. ఇందుకు విరుద్ధంగా ఏకగర్భజనితులు సైతం ఇంత క్రూరంగా, రాక్షసంగా, అమానుషంగా, పైశాచికంగా, వ్యవహరించటం ఊహకందదు. ఊహకు అందని దానిని వర్ణించటం కుదరుదు. ఎందుకంటే ఊహకందని దానికి పదాలు కూడా అందవు. అందుకే కళ్లు పీకిన వాడి దౌష్ట్యం, కళ్లు కోల్పోయిన వాడి బాధను వర్ణించేందుకు పదాలు లేవంటున్నాడు శ్రీవరుడు. ఇక్కడ శ్రీవరుడి బాధ ఏమిటంటే, ఎవడయితే కళ్లు పీకించాడో, వాడు శ్రీవరుడి శిష్యుడి కొడుకు. ఇతడూ  శ్రీవరుడి దగ్గర ఎంతో కొంత శిష్యరికం చేసే ఉంటాడు. ఎవరి కళ్లయితే పీకారో, వాడు శ్రీవరుడి శిష్యుడు.  దైవ సమానంగా భావించే అతడి కొడుకు. వర్ణనాతీతం ఆ బాధ. ఎలాంటి జైనులాబిదీన్? ఎలాంటి సంతానం?

ఇది భారతీయులు చరిత్ర రాసే పద్ధతి. భారతీయులు నిర్జీవమైన అంకెలలో మానవ జీవితాలను, సంవేదనలను కుదించరు. భారతీయులు మనసుతో చరిత్ర రచిస్తారు. నిజాలు చెప్తూ, ఆ నిజాలలో ఒదిగి ఉన్న భావనలను ప్రకటిస్తారు.

ఇలాంటి అమానుష చర్యలకు సగటు భారతీయుడు ఎలా స్పందిస్తాడో అలాగే స్పందించాడు శ్రీవరుడు. ఇంత అమానుషత్వం, దౌష్ట్యం భారతీయులకు తెలియదు. రాదు. భూమి మీద నడుస్తూ, భూదేవిని పాదాలతో తొక్కుతున్నందుకు క్షమాపణలడిగే సంస్కారం భారతీయులది. పుట్టలో, గుట్టలో, చెట్టులో సకల చరాచర సృష్టిలో పరమాత్మను దర్శించే తత్వం భారతీయులది. అలాంటిది తుచ్ఛమైన అధికారం కోసం ఇలాంటి దుష్కృత్యాలకు పాల్పడటం ఊహకందదు. ఇలా అధికారం కోసం, ఆరాటపడి, ఎందుకయినా తెగించే వారిని రాక్షసులు అంటుంది భారతీయ ధర్మం.

భారతదేశ చరిత్రలో అందుకే తీవ్రవాదం లేదు. ఆత్మాహుతి దాడుల ప్రసక్తి లేదు. వెన్నుపోటు పొడవటం, దొంగ దాడులు చేయటం లేదు. యుద్ధం చేయాల్సి వస్తే, పట్టపగలు ప్రకటించి, నమస్కార బాణాలు శత్రువులపై వేసి మరీ యుద్ధం చేసే జాతి ఇది. ఓడిన శత్రువులను సైతం గౌరవించి, అతని రాజ్యం అతనికి అప్పగించే సంస్కారం భారతీయులది. అలాంటి వారు ఇలాంటి నైచ్యాన్ని, క్రౌర్యాన్ని ఊహించలేరు. అందుకే ఆరంభంలో ఇస్లామీయుల క్రౌర్య, రాక్షస పద్ధతులకు అల్లల్లాడిపోయినా తేరుకుని ఎదురుదాడి చేశారు భారతీయులు. ముల్లును ముల్లుతోనే తీయాలని ప్రయత్నించారు. అదీ ధర్మ పరిధుల్లోనే.

అందుకే ఈనాడు భారతీయులు అప్పుడప్పుడు అవేశం ప్రదర్శించటం, హింసను ప్రదర్శించటం ప్రతీకారచర్య తప్ప స్వభావం కాదు. అలాంటి హింసాత్మక ప్రతిచర్యలకు వెంటనే భారతీయ సమాజం లోంచే వ్యతిరేకత వస్తుంది. ఇతర ఏ సమాజంలోనూ ఇలాంటి లక్షణం లేదు. తనను నమ్మని వాడిని చంపేందుకు దైవమే అనుమతివ్వటం, నమ్మని వారిని చంపటం దైవకార్యం కావటం ఇతర జాతుల్లో చూడవచ్చు కానీ, యుద్ధానికి సిద్ధంగా ఉండి కూడా, నా వారిని చంపలేను అని ఆయుధాలు విసర్జించే ఏకైక సాత్విక జాతి భారత జాతి. అందుకే ఇంతటి క్రౌర్యం చూసి చలించిపోయాడు శ్రీవరుడు. అయితే, ఈ క్రౌర్యాన్ని తట్టుకునేందుకు భారతీయులు ఆ కాలంలో ఎలాంటి తర్కాన్ని, తత్వాన్ని ఉపయోగించారో శ్రీవరుడి తరువాత శ్లోకం ప్రదర్శిస్తుంది.

దుర్నీతిమవదన్ కేచిత్ కేచిదీశ్వరజృంభితమ్।
ప్రాక్కర్మపాకమపరే నీచసంగమథాపరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 110)

(కళ్లు పోగొట్టుకున్న బహ్రామ్ ఖాన్ గురించి ప్రజలు ఇలా అనుకుంటున్నారు) కొందరు ఇది రాజు చేసిన దుశ్చర్య అనుకున్నారు. రాజు దుర్నీతి అనుకున్నారు. కొందరు ఇది దైవ నిర్ణయం అన్నారు. మరికొందరు ఇది పూర్వజన్మలోని దుశ్చర్యల పాపఫలితం అన్నారు. ఇంకొందరు ఇది దుష్టుల సాంగత్య ఫలితం అన్నారు. అందకు శిక్ష అన్నారు.

భారతీయ తత్వం ఏ రకంగా ఒక వ్యక్తి భరించలేని సంఘటనలను, దురదృష్టాన్ని తట్టుకుని మానసిక ప్రశాంతి సాధించేందుకు తోడ్పడుతుందో ఈ శ్లోకం ప్రదర్శిస్తుంది. ఎంతటి అణచివేతనయినా భరిస్తూ, ఎలాంటి దౌష్ట్యాన్నయినా సహిస్తూ జీవించగలిగే శక్తి భారతీయులకు వారి తత్వాన్నుంచి వస్తుందని నిరూపిస్తుందీ శ్లోకం.

కేచిద్విభవవైశస్యం కాతరత్వమథాపరే।
తదన్ఘంకరణం శ్రుత్వా కోప్యవాచ్య గిరోబ్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 111)

రాజు పిరికివాడు కాబట్టి కళ్లు పీకించాడని కొందరు అన్నారు. కొందరు ధనం లాభంతో రాజు చేసిన పని ఇది అన్నారు. బహ్రామ్ ఖాన్ కళ్లను రాజు పీకించాడని విన్న కొందరు అనలేని మాటలన్నారు.

మానుష్యం మాస్తు తచ్చేత్స్యాద్ వరం ప్రాకృతవేశ్మని।
రాజగేహేస్తు మా జన్మ కస్యాపీతి న కోవదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 112)

మానవ యోని ద్వారా జన్మించకూడదు. జన్మించినా సామాన్యుడిగా జన్మించాలి తప్ప రాజవంశంలో జన్మించకుడదు అని అనని వారు లేరు.

ఇది బహ్రామ్ ఖాన్‌ను, హసన్‌ గ్రుడ్డివాడిని చేయటం పట్ల ప్రజల స్పందన. ఇక్కడ ఒక విషయం గమనించాలి. శ్రీవరుడు భారతీయుల స్పందనను మాత్రమే తెలుపుతున్నాడు. ఎందుకంటే పునర్జన్మ, దుష్కర్మల ఫలం, దుస్సాంగత్యం ఫలం వంటివన్నీ భారతీయ సిద్ధాంతాలు. ఇవి భారతీయ ధర్మానికి ప్రత్యేకం. ఇతర ధర్మాలలో ‘పునర్జన్మ’ భావన లేదు. ఇతర ధర్మాల ప్రకారం మనిషికి ఒకే జన్మ. జన్మ పరంపర భారతీయులకే ప్రత్యేకమైన సిద్ధాంతం. అందుకే భారతీయులు శరీరానికి ప్రాధాన్యం ఇవ్వరు. ప్రాణం పోతే, శరీరం ఉపయోగం అయిపోయిందని కాల్చివేస్తారు. ఆత్మ మళ్లీ మరో శరీరంలో ప్రవేశిస్తుందని నమ్ముతారు. కానీ ఇతర ధర్మాలలో ఆత్మ తీర్పు దినం లేదా చివరి తీర్పు రోజు మళ్లీ పాత శరీరం లోకే ప్రవేశింప చేస్తాడు దైవం అని నమ్ముతారు. అందుకని వారు శరీరాన్ని భద్రపరుస్తారు. సమాధులు నిర్మిస్తారు. ‘ఇస్లామ్’లో ఆత్మ సమాధిలో విశ్రాంతి స్థితిలో ఉంటుందని (బర్జాఖ్) నమ్ముతారు. కాబట్టి శ్రీవరుడు తన రాజతరంగిణిలో ప్రదర్శిస్తున్నది కేవలం భారతీయుల దృక్కోణం అన్నది స్పష్టం.

స్ఫూర్జద్భాగ్యసముద్భవన్నవనవప్రోల్లాససంపత్సుఖః
ప్రాయో వేత్తి విభుర్వినోదకలయా కాలం విశాలం క్షణమ్।
దౌర్భాగ్యోదిత దుర్గతేః స్మృతనిజప్రాచ్యప్రకర్షోన్నతే-
స్వస్య ప్రాప్తమహాభయస్య స భవేత్ స్వప్నోపి కల్పోపమః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 113)

భాగ్యం వల్ల కొత్త కొత్త సుఖాలు, అనుభవాలు అనుభవించేవాడికి సుఖానుభవం వల్ల ఎంత దీర్ఘకాలమయినా క్షణకాలం లాగా అనిపిస్తుంది. దౌర్భాగ్యం కారణంగా దుర్గతి పొందేవాడు తన ఒకప్పటి వైభవాన్ని తలచుకునే వాడికి క్షణ కాలం కూడా కల్ప సదృశం అనిపిస్తంది.

హసన్ షాహ, బహ్రామ్ ఖాన్‌ల స్థితుల నడుమ తేడాను చూపిస్తున్నాడు శ్రీవరుడు. తేడా చూపిస్తూ జీవిత సత్యాన్ని చెప్పాడు.  ఐన్‌స్టీన్ తన సాపేక్ష సిద్ధాంతాన్ని వివరిస్తూ, ‘ప్రేయసితో గంట గడిపినా అర సెకనే అనిపిస్తుంది. అదే పాఠం వింటూ పది నిమిషాలు గడిపినా పది యుగాలుగా గడుస్తుంది’ అన్నాడు. ఆ సాపేక్ష సిద్ధాంతాన్ని ఇక్కడ చేప్తాడు శ్రీవరుడు.

అయః శృంఖల బద్ధాంగిః సో అన్ధస్తత్రైవ బన్ధనే।
స్మరన్ విభవ సామగ్రీమనయచ్ఛేపమాయుషః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 114)

శృంఖలా బద్ధుడై, అంధుడైన బహ్రామ్ ఖాన్ ఇక తను విముక్తి లభించదని అర్థం చేసుకుని కారాగారంలో గత వైభవాన్ని తలచుకుంటు సమయాన్ని గడిపాడు.

నాయం గీతైర్వినా జాతు వర్తతే స్మ గృహాన్తరే।
ఇత్యేవ తస్య సారావా ఝిల్లయో జాగరణం వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 115)

ఇంట్లో గాయిగా పాటలు వింటూ గడిపిన వాడు ఇప్పుడు రాత్రుళ్లు కీచురాళ్ల (cricket) రొద వింటూ జాగరణం చేస్తున్నాడు.

యో భూభ్భయ్యో గృహే నిత్యం సర్వాగే సేవకైర్యృతః।
అభూవన్ కేవలం తస్య భృత్యాశ్చటకమత్క్రుణాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 116)

ఒకప్పుడు ఇంట్లో సేవకుల సేవలతో వైభవం అనుభవించినవాడు ఇప్పుడు పక్షులు, నల్లులు  తప్ప మరో సేవకుడు లేకుండా గడుపుతున్నాడు.

వితానావలయో యస్య చభ్రువుదుర్లభాః సురైః।
దృష్టాస్త ఏవ తద్గేహే లూతాతన్తువినిర్మితాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 117)

దేవతలకు కూడా దుర్లభమైన భవనాలలో నివసించినవాడు, ఇప్పుడు సాలీడు అల్లిన గూళ్ల నడుమ నివసించాల్సి వస్తున్నది.

యద్వపుః కోమలం పట్టతూల శయ్యా మభూషయత్।
తదా తత్తస్య భూపృష్టే శయిష్టాదృష్టవిష్టరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 118)

ఎవడి శరీరం అయితే పట్టు వస్త్రాలపై పడుకునేదో ఇప్పుడు ఆ శరీరం ఇప్పుడు కఠినమైన నేలపై పడుకుంటున్నది.

దీయతాం దీయతాం తస్య వాణీ యా త్యాగినః శ్రుతా।
విపత్ క్షణేన సైవాభూత్ తత్తదృస్తూపయాచనే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 119)

ఒకప్పుడు ‘ఇది ఇచ్చేయండి, ఇదీ ఇచ్చేయండి’ అని ఆజ్ఞాపించిన స్వరం ఇప్పుడు దీనంగా ‘యేమైనా ఇవ్వండి’ అని అభ్యర్థిస్తున్నది.

గతం స్వామ్యం హతా భృత్యాః ప్రాప్తః పరిభవో నవః।
బంధనం శృంఖలా బంధైర్నేత్రోత్పాటనతో వ్యథా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 120)

అధికారం పోయింది. సేవకులు మరణించారు. కొత్త అవమానాలు లభిస్తున్నాయి. ఓడిపోయి శృంఖలా బద్ధుడయ్యాడు. కళ్లు పోయాయి. ఈ అన్ని విషయాలూ అతడిని బాధిస్తున్నాయి.

దయనీయంగా, బహ్రామ్ ఖాన్‌పై జాలి కలిగే రీతిలో వర్ణిస్తున్నాడు శ్రీవరుడు. భవిష్యత్తరాలకు క్రౌర్యం, దౌష్ట్యం, రాక్షసత్వాలు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. అవి అనుభవించిన వారి స్థితి ఎంత దయనీయమో చెప్తున్నాడు. తాను అభిమానించే వారు అలాంటి దౌష్ట్యం చేస్తుంటే, అనుభవించే వారూ తనకు కావాల్సిన వారయితే చూసేవారు ఎంతటి ఘోరమైన వేదనను అనుభవిస్తారో చెప్పకనే చెప్తున్నాడు శ్రీవరుడు.

(ఇంకా ఉంది)

Exit mobile version