[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
పూర్ణ నాపిత మల్లేకజాదాద్యా హృతసంచయాః।
బంధనస్థాశ్చిరం భూత్వా తే సర్వే ప్రమయం యయుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 149)
మంగలి వాడు పూర్ణ, మల్లిక జాదతో సహా అన్యాయంగా ధనం ఆర్జించిన ఇతరులు అంతా, కారాగారంలో బందీలయి మరణించారు.
తత్తద్రాజ్యా హితాకాంక్షికులే తస్య క్షయావధిః।
శాపః శ్రీజైనభూపస్య ప్రసారితభుజో భవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 150)
జైనులాబిదీన్ ఇచ్చిన శాపం రాజ్యవ్యతిరేక శక్తులందరిపై ప్రభావం చూపించింది.
మన్త్రై రాజ్యవివర్ధనం కురుత భోః సత్యం బ్రువే మన్త్రిణో
నాశం స్వామిని కుర్వతాం నహి సుఖం స్యాద్వః పరత్రేహ చ।
యైయైజైనమహీపతావపకృతం పుత్రైర్ను భృత్యైర్ను వా
తైర్లబ్ధం ఫలమీదృశం తదహితా మాత్సర్యధీస్త్యజ్యతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 151)
ఓ మంత్రులారా! నేను నిజం చెప్తున్నాను. మీ తెలివిని రాజ్యాభివృద్ధికి ఉపయోగించండి. తమ ప్రభువుకు నష్టం కలిగించే మంత్రులు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా సుఖం పొందలేరు. సేవకులు, పుత్రులు, ఎవరెవరు జైనులాబిదీన్ రాజుకు అపకారం చేశారో, వారు చేసిన అపకారానికి తగిన ఫలితం అనుభవించారు. ఎదుటి వాడికి నష్టం కలిగించే మాత్సర్యబుద్ధిని వదల్చుకోవటం మంచిది.
గొప్ప సామాజిక సత్యాన్ని జీవిత సత్యాన్ని అద్భతంగా చెప్పాడు శ్రీవరుడు. భావి తరాలు అర్థం చేసుకుని ఆచరించ వలసిన గొప్ప నిజం ఉదాహరణతో సహ చెప్పాడు. అయితే, ఎవరెన్ని నిజాలు ఎంత గొప్పగా చెప్పినా, అర్థం చేసుకోలేనివారు, పట్టించుకోలేనివారు, పూర్వీకుల జీవితాలను పరిశీలించి, పొరపాట్లను గ్రహించి ఆ పొరపాట్లను తాము చేయకుండా జీవితాన్ని తీర్చిదిద్దుకోలేరు. పూర్వీకులు చేసిన తప్పులే చేస్తూ వారి బాటలోనే ప్రయాణిస్తారు. అనుభవిస్తారు.
శ్రీవరుడు గొప్ప సత్యం చెప్పాడు. ఎలాగయితే ప్రజాపాలన ప్రజా సంక్షేమం రాజు బాధ్యతనో, అలాగే దేశ సంక్షేమాన్ని దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజుకు సలహాలు సూచనలు ఇవ్వటం మంత్రుల పని. అంటే, మంత్రులు అక్కడ రాజు సంక్షేమం, రాజు గొప్పతనం, రాజు ఇష్టాయిష్టాల కన్నా రాజ్య అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మార్గదర్శనం చేయాలి. తాత్కాలిక లాభాల ప్రలోభంలో పడి రాజుకు నష్టం కలిగిస్తే అది రాజ్యానికి నష్టం కలిగించటమే కాదు స్వయంగా వారినీ నష్టపరుస్తుంది. కాబట్టి మంత్రి అన్నవాడు దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రాజ్య అభివృద్ధి, ప్రజాక్షేమం కలిగించే నిర్ణయాలనే సూచించాలి.
జైనులాబిదీన్కు నష్టం కలిగించి, స్వార్థ ప్రయోజనాల కోసం అతని సంతానం నడుమ చిచ్చుపెట్టి, జైనులాబిదీన్ని దెబ్బ దీయటం ద్వారా కశ్మీరును దెబ్బ తీసిన వారెవరూ బాగుపడలేదు. వారంతా వారు చేసిన ద్రోహానికి తగిన శిక్షను అనుభవించారు. జయచంద్రుడు ఏం సాధించాడు! మీర్ జాఫర్ ఏం అనుభవించాడు? కానీ వారి దుశ్చర్యల ఫలితం ఈనాటికీ సమాజం అనుభవిస్తోంది. అలెగ్జాండర్‌కు సహాయం చేసిన అంభి అధికారాన్ని ఎంత కాలం అనుభవించాడు? దేశాన్ని ముక్కలు చేసిన జిన్నా ఏ అనుభవించాడు? నిజామ్కు ప్రత్యేక సామ్రాజ్యం కలలు చూపించిన సయ్యద్ మహమ్మద్ ఖాసిమ్ రజ్వీ ఏం సాధించాడు? కానీ పాలకుడిని తప్పుదారి పట్టించినవారే కాదు, వారి దుశ్చర్యల ఫలితాన్ని సామాన్య ప్రజలు కూడా అనుభవించారు. తరతరాలు అనుభవిస్తూనే ఉన్నాయి. చరిత్ర చూపుతున్న ఈ చేదు నిజాలను గ్రహించి తమపై విశ్వాసం ఉంచిన పాలకులకు, ఆ పాలకులపై విశ్వాసం ఉంచిన ప్రజలకు ద్రోహం చేయకూడదు నిర్ణయాత్మకమైన స్థానాలలో ఉన్నవారు. తరాలు మారతాయి. సమాజాలు రూపాంతరం చెందుతాయి కానీ ఈ సత్యం మాత్రం ఎన్నడూ మారదు.
అన్యేప్యుచ్చావచాస్తస్య సేవకా యే తదాభవన్।
తదనిష్టకరాః సర్వే తద్వత్తే అపి ప్రమిమ్యిరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 152)
జైనులాబిదీన్కు నష్టం చేసిన పెద్ద, చిన్న సేవకులు కూడా నాశనమైపోయారు.
యావహసతి వసన్తస్తావద్విలసన్తి సంతతం భృంగాః।
తస్మిన్నిష్టే నష్టే భ్రష్టచ్ఛాయా న చేష్టన్తే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 153)
వసంతకాలం ఉన్నంత వరకూ భ్రమరాలు ఆనందిస్తాయి. వసంతకాలం అయిపోయిన తరువాత ఆశ్రయ రహితమైన భ్రమరాలు స్తబ్ధమైపోతాయి.
పూర్వ జైననృపః సైదనాసీరాదీన్ సమాగతాన్।
పైగంబరాన్వయే జాతాన్ పూజ్యాన్ జ్ఞాత్వా మహాగుణాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 154)
ప్రోచ్చాసనకరస్పర్శదర్శితాతులసత్కృతీన్।
స్వసుతాదానమానేన యాంస్తాన్ రాష్ట్రాధిపాన్ వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 155)
పూర్వం కశ్మీరుకు వచ్చిన సైదా వసీర్ను, అతని వెంట వచ్చిన వారిని పైగంబర్ వంశానికి చెందిన పూజ్యానీయులు, మహా పండితులు అని గుర్తించిన జైనులాబిదీన్ వారికి ఉన్నతాసనం ఇచ్చి, సత్కరించి, కరస్పర్శ చేయటంతో పాటు తన పుత్రికను ఇచ్చి, ఎంతో గౌరవంతో ఓ ప్రాంతానికి అధిపతిగా నియమించాడు.
ఇక్కడ శ్రీవరుడు ప్రస్తుతం సమాజంలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ‘demography change’ ను ప్రస్తావిస్తున్నాడు. సాధారణంగా ఒక్క ప్రాంతంలో ఇస్లామీయులకు ఆదరణ లభించినా, ఆశ్రయం లభించినా, నెమ్మదిగా ఇతర దేశాల నుంచి, ప్రాంతాల నుంచి ఇస్లామీయులు అక్కడకు వచ్చి చేరతారు. రాను రాను వారి సంఖ్య ఎంతగా పెరిగి పోతుందంటే స్థానికుల సంఖ్య అల్పమైపోతుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా చారిత్రికంగా మాత్రమే కాదు సమాకాలీన సమాజంలోనూ సంభవిస్తున్న పరిణామమే. దీన్ని demographic shift అంటారు. తెలుగులో జనాభా మార్పు లేక సంఖ్యాపరమైన జనాభా మార్పు అనవచ్చు.
జనసంఖ్య మార్పు ప్రభావం రాజ్య భవిష్యత్తుపై ఉంటుంది. బౌద్ధుడైన రించన్ కశ్మీరు రాజ్యాధికారాన్ని సాధించిన వెంటనే, తన అధికారాన్ని నిలుపుకోవటం కోసం మతం మారాలని నిశ్చయించకున్నాడు. కారణం ఏమిటంటే, కశ్మీరులో బౌద్ధుల సంఖ్య అత్యల్పం ఆ సమయంలో. భారతీయుల సంఖ్య అధికం. ఇస్లామీయుల సంఖ్య తక్కువనే అయినా, వారు ఆ సమయంలో శక్తిమంతులు. రించన్ ముందుగా శైవం స్వీకరించాలని ప్రయత్నించాడు. చిత్తశుద్ధి లేకుండా, కేవలం అధికారం నిలుపుకునేందుకు మతం మారటాన్ని శైవులు అంగీకరిచలేదు. రించన్ మతం మారటం అధికుల మద్దతు కోసం. భారతీయులు, ఇస్లామీయులు అధికంగా ఉన్న రాజ్యంలో అల్పసంఖ్యలో ఉన్న బౌద్ధానికి చెందిన రాజును ప్రజలు ఆమోదించటం కష్టం. జనసంఖ్య ప్రభావం పాలనలోనూ కనిపిస్తుంది. శైవం తిరస్కరించిన తరువాత, ఇస్లామ్ స్వీకరించాడు రించన్. అలా ఆరంభమయింది కశ్మీరులో ఇస్లామీయుల పాలన. ఇదంతా జోనరాజ రాజతరంగిణిలో ఇంకా విపులంగా ప్రస్తావించాడు జోనరాజు.
ఎప్పుడయితే, కశ్మీరులో ఇస్లామీయుల పాలన ఆరంభమయిందో, అప్పుడే కశ్మీరుకు పర్షియా నుండి ఇతర ఇస్లాం దేశాల నుంచి ప్రజలు రావటం వేగవంతమయింది. మత గురువులు వారి వారి శిష్యగణంతో కశ్మీరు వచ్చి చేరారు. బోధనలు చేశారు. ఇస్లామేతరుల మతం మార్చటమో, చంపటమో తప్పదని నేర్పారు. ఇస్లామేతరులు ఇస్లామీయుల కన్నా తక్కువ వారనీ, వారినీ ఇస్లామీయులనూ సమానంగా చూడటం వీలుపడదనీ బోధించారు. ముఖ్యంగా మీర్ సయ్యద్ అలీ హమదానీ క్రీ.శ. 1384 లో 700 మంది శిష్యులతో కశ్మీరు వచ్చినప్పటి నుంచీ ధార్మికంగా కశ్మీరు స్వరూపం పూర్తిగా మారిపోయింది. 750 మంది శిష్యులు కశ్మీరులో విస్తరించారు.
డాక్టరు షబ్బీర్ అహ్మద్ లోనే, ‘Rise of Islam In Kashmir Valley’ అన్న పరిశోధనా పత్రంలో ఈ విషయాన్ని స్పష్టం చేశాడు – “Through their teachings and personal conduct, Hamadani and his followers helped transform Kashmir into a spiritually vibrant and Islamized region.”
హమదాని ప్రభావం కశ్మీరు సుల్తాన్ సికందర్‌పై అమితంగా ఉంది. ఆయన ప్రభావంతో సుల్తాన్ సికందర్, ‘సికందర్ బుత్షికన్’ గా పేరు తెచ్చుకున్నాడు. కశ్మీరులోని ఇస్లామేతరులను మతం మార్చటమో, చంపటమో పనిగా పెట్టుకున్నాడు. అనేకులు ప్రాణాలు అరచేత పట్టుకుని కశ్మీరు వదలి పారిపోయారు. ఈయన మరణించేనాటికి కశ్మీరులో కేవలం 11 ఇస్లామేతర కుటుంబాలు మాత్రమే ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు ‘జనసంఖ్య మార్పిడి’ ఎంత పెద్ద ఎత్తున జరిగిందో. ఇస్లామీ చరిత్ర రచయితలు, కశ్మీరు శాంతియుతంగా ఇస్లామ్ రాజ్యంగా మారిందన్నట్టు రచనలు చేస్తారు. దాన్ని ఆధారం చేసుకుని ఆధునిక మేధావులు, అభ్యుదయవాదులు కశ్మీరు మత సామరస్యానికి చక్కని ఉదాహరణ అన్నట్టు వ్యాఖ్యానిస్తారు. నమ్మించాలని చూస్తారు. ఉదాహరణకు కశ్మీరులో ఇస్లామీయుల పాలన కాలంలో ప్రథమ జనసంఖ్య మతమార్పిడి షాహమీర్ కాలంలో (క్రీ.శ. 1339-1389) సంభవించింది. ఆయన అధికారానికి వచ్చినప్పుడు కశ్మీరులో హిందువులు – బౌద్ధులు అధికంగా ఉండేవారు. ఇస్లామీయులు అల్ప సంఖ్యాకులు. ఆయన ఒక పద్ధతి ప్రకారం పర్షియా, మధ్య ఆసియా ప్రాంతాల నుంచి మతగురువులను, పాలనలో నిష్ణాతులను, వర్తకులను కశ్మీరుకు ఆహ్వానించాడు. ఈయన పాలన కాలంలో హమదాని అతని అనుచరులు కశ్మీరులో అడుగుపెట్టారు. ఈయన పాలన కాలంలో బెదిరింపులు, రాజాస్థానంలో ఉద్యోగాలన్నీ ఇస్లామీయులకే ఇవ్వటం, ఇస్లామేతరులపై పన్నులు విపరీతంగా విధించటం, రక్షణ లేకపోవటం, భద్రత కరవవటం వంటి వాటి వల్ల రాజ్యం వదలి పోవటమో, ఇస్లాం స్వీకరించటమో తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడింది. అనేక మందిరాలు ఈయన పాలన కాలంలో ధ్వంసం అయ్యాయి. ఇతని తరువాత సికందర్ బుత్షికన్ పాలన కాలంలో 24000 పండితుల కుటుంబాలు కశ్మీరు వదిలి పారిపోవటమో ప్రాణాలు కోల్పోవటమో సంభవించింది. కానీ కశ్మీరులో ప్రజలు ఇస్లాం స్వీకరించటం ఎంతో శాంతియుతంగా సాగిందని ప్రచారం చేస్తారు. కాని జోనరాజ రాజతరంగిణి వీరి ప్రచారాలు తప్పుడువని వివరిస్తుంది.
జైనులాబిదీన్ పాలన కశ్మీరులో ఆరంభమయిన తరువాత ఆయన, కశ్మీరు వదలి పారిపోయిన ఇస్లామేతరులను కశ్మీరు రప్పించి వారికి నివాసాలు ఏర్పాటు చేశాడు. అంటే ఇంతకు ముందు జరిగిన జనసంఖ్య మార్పిడికి వ్యతిరేకమైన ‘జనసంఖ్య మార్పిడి’ చేశాడన్న మాట జైనులాబిదీన్. అయితే జైనులాబిదీన్ పండితులను కశ్మీరులో నివాసం కల్పించినా ‘జనసంఖ్య మార్పిడి’ జరగలేదు. ఇస్లామీయులే అధిక సంఖ్యాకులుగా నిలిచారు. అంటే micro demographic shift (సూక్ష్మ జనమార్పిడి) జరిగింది కానీ macro demographic shift (అధిక జనసంఖ్య మార్పిడి) జరగలేదు. దీనికి కారణం మతం మారిన వారికి జీవికలు కల్పించే లక్ష్యంతో జైనులాబిదీన్ పెద్ద సంఖ్యలో ఇతర ప్రాంతాల నుంచి ఇస్లామీ పనివారిని, పనుల్లో నిష్ణాతులను కశ్మీరుకు రప్పించాడు. దీనికి తోడు హమదాని తనయుడు హజ్రత్ మీర్ హమదాని తండ్రి ఆరంభించిన పనిని పూర్తి చేసేందుకు కశ్మీరు వచ్చాడు. అతడికి సాదర ఆహ్వానం పలికాడు జైనులాబిదీన్. వీరంతా కశ్మీరులో స్థిరపడ్డారు. వివాహమాడారు. శిష్యులను నలుదిశలా పంపారు. ఇలా ఇస్లామీయుల జనాభా కశ్మీరులో పెరుగుతూనే పోయింది.
ఇప్పుడీ శ్లోకంలో శ్రీవరుడు అలాంటి ఓ సంఘటనను ప్రస్తావించాడు. ఇస్లామ్ దేశాల నుంచి కశ్మీరు వచ్చి చేరిన అనేకులలో శ్రీవరుడు ప్రస్తావించిన సైద్ జమాల్ ఒకడు. అతని పేరు సయ్యద్ నాసిర్. సయ్యద్ అంటే ఇస్లామ్‌లో అధికారి అన్న అర్థం వస్తుంది. అది గౌరవ వాచకం. వీరు మహమ్మద్ ప్రవక్తకు అతని కూతురు అల్లుడి ద్వారా బంధువులవుతారు. అందుకే శ్రీవరుడు – జైనులాబిదీన్ వీరిని ‘పైగంబరాన్వయే జాతాన్’ అన్నాడు. పైగంబర్ వంశానికి చెందిన వారని గ్రహించి గౌరవించాడు. పైగంబర్ అంటే ప్రవక్త లేదా దైవుడి దూత. ఇస్లాం ప్రకారం మొత్తం 25 గురు పైగంబర్లు. వారి పేర్లు కూడా ఖురాన్లో ఉన్నాయి. వీరిలో మహమ్మద్ ప్రవక్తను ‘Khatam an-Nabiyyin’ అంటారు. అంటే ‘ultimate messenger’ అన్న మాట. పైగంబర్ వంశానికి చెందిన వారు కాబట్టి సయ్యద్ నాసిర్‌ను జైనులాబిదీన్ గౌరవించాడు. జైనులాబిదీన్ భార్య కూడా సయ్యద్ వంశానికి చెందినది. జైనులాబిదీన్ మనమడు ప్రస్తుత సుల్తాన్ హసన్ షాహ. హసన్ షాహ సయ్యద్ నాసిర్ కొడుకు మేయ్యా హసన్‌కు ‘బహురూప’ గ్రామాన్ని బహుకరించాడు. అందుకే సయ్యద్ నాసిర్‌ను గౌరవించి, కూతుర్నిచ్చి పెళ్లి చేసి, గ్రామాలపై అధికారాన్నిచ్చాడు. ఇలా ఎందరో కశ్మీరు వచ్చి స్థిరపడుతుండటం వల్ల కశ్మీరులో జనసంఖ్య మారిపోయింది. కశ్మీరుకు చెందిన భారతీయులు కశ్మీరు వదలి పారిపోవటం, బయట నుంచి వచ్చిన వారు కశ్మీరులోనే స్థిరపడిపోవటం, వల్ల కశ్మీరు పూర్తిగా ఇస్లాం ఆధిక్య రాజ్యంగా మారిపోయింది.
సమాకాలీన సమాజంలో ప్రపంచవ్యాప్తంగా ఈ జనసంఖ్య మార్పిడి ద్వారా సమాజాల్లో సంభవిస్తున్న సాంస్కృతిక, సామాజిక ధార్మిక మార్పులను మనం చూస్తూనే ఉన్నాం. అల్లకల్లోల రాజ్యాలను వదలి ఇస్లామీయులు ఇతర దేశాల్లో స్థిరపడటం, ఆశ్రయం పొందటం వంటి వాటి ద్వారా ఆయా దేశాల్ల ఇస్లామీయులు అధికమవటం, తద్వారా సంభవిస్తున్న పరిణామాలను చూస్తున్నాం. ఇరుగు పొరుగు దేశాలనుంచి అక్రమంగా దేశంలో ప్రవేశించిన ఇస్లామీయులు మన దేశంలో స్థిరపడటం వల్ల మన కళ్ల ముందే అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులు వల్ల కలిగే దుష్పరిణామాలను అరికట్టేందుకు, అక్రమంగా దేశంలో స్థిరపడి ఇక్కడి సౌకర్యాలను అనుభవిస్తూ దేశం పట్ల ఎలాంటి ప్రేమ లేకుండా ద్వేషం ప్రకటిస్తూ, అరాచకం సృష్టించేందుకు కారణమైన అక్రమ వలసదార్లను ఏరివేయటం మన దేశానికే కాదు, అనేక ఇతర దేశాలకూ పెద్ద సమస్యగా పరిణమించింది. తనకు తెలియకుండానే demographic shift ను ప్రదర్శించాడు శ్రీవరుడు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
