Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-123

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

తేభ్యః సైదజ్యమాలాదీన్ రాజా జ్ఞాత్వా తరంగితాన్।
ప్రత్యమున్చత్ తదా దేశాత్ తత్సన్చయమవన్చయన్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 156)

కానీ, ఇప్పుడు సైదాజమాలదీన్ వంటి వారందరినీ ప్రమాదకరంగా తిరిగే తిరుగుబాటుదార్లుగా భావించిన రాజు వారిని దేశం నుంచి వెడలనడిపాడు. జైనులాబిదీన్ ఎవరినైతే గౌరవించి, దేశంలో భూమిని ఇచ్చాడో వారిని ప్రస్తుతం ప్రమాదకారులుగా భావించిన రాజు దేశం వదలి పొమ్మన్నాడు. వాళ్ల ఆస్తులను జప్తు చేస్తుకున్నాడు.

స సైదనాసిరో ధన్యో గణ్యో ధురి మనీషిణామ్।
యో విచార్యాపతి రాజ్ఞి సతి దేశాన్తరం యయౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 157)

అందరి గౌరవ మన్ననలందుకుంటున్నా సైదానసీరు గొప్ప వీరుడు. జరగబోయేది  గ్రహించిన అతడు జైనులాబిదీన్ పాలన కాలంలోనే దేశం విడిచి వెళ్లిపోయాడు.

ఈ క్రింద రాబోయే శ్లోకాలు అనాటి భారతీయుల మనస్సులోని ఆలోచనలకు దర్పణం పడతాయి. సమకాలీన సమాజానికి హెచ్చరికల్లాంటివి. భవిష్యత్తు తరాలకు గతాన్ని అవగాహన చేసుకోవటంలో దారిదీపాల్లాంటివి. భారతదేశ చరిత్రను ముఖ్యంగా సామాజిక చరిత్రను అధ్యయనం చేసేవారికి, విశ్లేషించేవారికీ మార్గదర్శక సూత్రాల్లాంటివి.

సుతోపనయనాద్ రాజ్ఞః సుచిరం యైర్నృ పాయితమ్।
బహురూపాదిరాష్ట్రాధిపత్యనిత్యసుఖోజ్జ్వలైః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 158)

ఇతస్తతో భ్రమన్తస్తే కేచిదిల్లీపురం యయుః।
కేచిద్విభవలోభన పునర్నిష్కాసితా అపి।
నారమన్త బహిర్దేశే మాఘే మధుకరా ఇవ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 159)

ప్రాప్తా యే పరదేశజాః కణభుజో దేశేఽత్ర సంపద్యుతా
గర్భోత్థాదివ విస్మృతాత్మచరితాః కుర్యుః ప్రజాపీడనమ్।
తే తత్పాపభరేణ నష్టవిభవా నిష్కాసితాః స్వామినా
గచ్ఛన్తి హృదకృష్టమత్స్యతులనాం తజ్జీవనాశాకులాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 160)

రాజపుత్రికలను వివాహమాడటం వల్ల సైదా వంశజులు కొంత కాలం రాజభోగాలు అనుభవించారు. వాళ్లిపుడు ఆశ్రయమన్నది లేక అటూ ఇటూ తిరుగుతున్నారు. కొందరు ‘దిల్లీపురం’ (ఢిల్లీ) వెళ్లిపోయారు. కొందరు ఇంకా వైభవం లభిస్తుందేమోనన్న ఆశతో, దేశ బహిష్కరణ శిక్షను పొంది కూడా భారతదేశంలో మాఘమాసంలో తేనెటీగల్లా సుఖంగా ఉండలేకపోతున్నారు. దరిద్రులు, తిండికి లేనివారు అయిన విదేశీయులు, ఈ దేశానికి వచ్చారు. ఇక్కడ ధనవంతులయ్యారు. మరో జన్మ పొందిన వారికి గతం గుర్తు ఉండని విధంగా, తమ తిండిలేని గతాన్ని మరచిపోయి ఇక్కడి ప్రజలను పీడిస్తున్నారు. ఈ పాప ఫలితంగా వారి వైభవం నష్టం అయింది. ప్రభువు దేశబహిష్కరణ శిక్ష విధించాడు. సరోవరం నుంచి వెలికి తీసిన చేపల్లా ప్రాణభయంతో భయపడుతూ ఉన్నారు.

శ్రీవరుడు రచించిన ఈ శ్లోకాలు చరిత్ర పుస్తకాలు ప్రకటించని చేదు నిజాలను స్పష్టం చేస్తాయి. శ్రీవరుడు తన రాజతరంగిణి ద్వితీయ భాగాన్ని ఇంత నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా రాయటం వెనుక ప్రధాన కారణం, ఈ రాజతరంగిణి అతను ఏ రాజు మెప్పు కోసం రాయటం లేదు. మొదటి భాగాన్ని జైనులాబిదీన్ కోరిక మేరకు రచించాడు. కాబట్టి కశ్మీరులో తామరతంపరగా విస్తరిస్తూ, ఇస్లామేతరుల జీవితాలను అల్లకల్లోలం చేస్తున్న వారి గురించి ఉన్నది ఉన్నట్టు రాయలేదు. పైగా దుష్ట శక్తులను, సంకుచితపుటాలోచనలను జైనులాబిదీన్ అదుపులో పెట్టటంతో వారిని పట్టించుకోవాల్సిన అవసరం లేకపోయినా జాగ్రత్తగా రాయాల్సి వచ్చింది. ఒక్క  వ్యాఖ్యను దుష్ట శక్తులు తప్పు అర్ధం చేసుకుని   ప్రచారం చేస్తే మొదటికే మోసం వస్తుంది కాబట్టి, జైనులాబిదీన్ మరణించే వరకూ శ్రీవరుడు ఇస్లామీయుల గురించి, కశ్మీరులో వారి అకృత్యాల గురించి సూచనప్రాయంగా తప్ప స్పష్టంగా ఏమీ అవలేదు.

జైనులాబిదీన్ మరణం తరువాత పరిస్థితి మారింది. అంత వరకూ జైనులాబిదీన్ అదిమి పెట్టి ఉంచిన దుష్ట శక్తులు, సంకుచితపుటాలోచనలు రెట్టింపు శక్తితో తలలెత్తాయి. శ్రీవరుడికి రాజాశ్రయం ఉన్నా, గతంలో లాంటి పరిస్థితి లేదు. ఎప్పుడు ఏ మూల నుంచి, ఎలాంటి ప్రమాదం ముంచెత్తుతుందో తెలియదు. జైనులాబిదీన్‍తో ఉన్న సాన్నిహిత్యం అతని సంతానంతో లేదు. పైగా, వీరు చెప్పుడు మాటలు వినేవారు. దాంతో శ్రీవరుడికి ఇప్పుడు గతంలో ఉన్నట్టు రాజు పట్ల ఆదరం లేదు. అభిమానం లేదు. వారికి ఈయన గురువు అన్న గౌరవం. ఈయనకు వారు జైనులాబిదీన్ సంతానం అన్న ఆదరం తప్ప, మరొకటి లేదు. అందుకని ఇప్పుడు శ్రీవరుడి రాతల్లో తీక్షణత పెరిగింది. నిక్కచ్చితనం పెరిగింది. ఉన్నది ఉన్నట్టు నిర్భయంగా చెప్పటం కనబడుతుంది.

కశ్మీరుపై సుల్తానుల అధికారం ఆరంభమయినప్పటి నుంచీ ఇస్లాం దేశాల నుండి ఇస్లామీయులు భారతదేశం వచ్చి ఇక్కడ స్థిరపడటం మొదలయింది. మత ప్రచారం కోసం వచ్చేవారు ఒక ఎత్తయితే, పొట్ట చేత పట్టుకుని ఇక్కడ తమ వారి రాజ్యంలో ఏదో ఒక ఉద్యోగం దొరకకపోదు, జీవిక గడవకపోదు అని వచ్చేవారు మరో ఎత్తు.

ఇథియోపియాకు చెందిన ‘ఛాపు’ అనే బానిస ఒక యజమాని నుంచి మరో యజమానికి అమ్ముడుపోతూ చివరికి అహ్మద్‍నగర్ ‘పీష్వా’ దగ్గర చేరాడు. ఆయనను కొని అమ్మేసే అనేక యజమానులలో ఒక యజమాని ‘ఛాపు’కు ఇస్లామ్ మతం ఇచ్చి ‘అంబర్’ అని పేరు పెట్టాడు. అహ్మద్‌నగర్ సైన్యంలో శౌర్యం ప్రదర్శించటంతో అంచెలంచెలుగా ఎదిగిన బానిస,  డబ్బుకు అమ్ముడుపోయే సైన్యాన్ని తయారు చేశాడు. ఏ రాజు డబ్బులిస్తే ఆ రాజు తరపున పోరాడుతుందీ సైన్యం. అలా పేరు సంపాదించిన ‘మాలిక్ అంబర్’ అహ్మద్‌నగర్ సుల్తాన్‌కు మంత్రి అయ్యాడు. అంటే బానిసగా తినటానికి తిండిలేక, ఎవరు కొంటే వారికి బానిసత్వం చేసే వ్యక్తి, భారతదేశం వచ్చిన తరువాత స్వేచ్ఛ పొంది మంత్రిగా గొప్ప పేరు సంపాదించాడు.

ఢిల్లీలో సుల్తానుల పాలనను ఆరంభించిన ఖుత్బ్-ఉద్-దీన్ ఐబక్ కూడా బానిస. మహమ్మద్ ఘోరీ అతడిని కొన్నాడు. అలా ఘోరీ సైన్యంలో పెద్ద పేరు సంపాదించి చివరికి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు.

ఢిల్లీ మరో సుల్తాన్ ‘బల్బన్’ కూడా మంగోలల వద్ద బానిస. ఢిల్లీకి చెందిన నవాబు అతడిని కొన్నాడు. అందరికీ నీళ్లు అందించే పని చేసేవాడు. తరువాత అంచెలంచెలుగా ఎదిగి ఢిల్లీ సుల్తాన్ అయ్యాడు.

‘నూర్ జహాన్’ తండ్రి మీర్-ఘియోస్-బేగ్, పొట్ట చేత పట్టుకుని, పర్షియా నుంచి ఢిల్లీ పారిపోయి వచ్చాడు. అతని కూతురు ‘నూర్ జహాన్’, ‘జహంగీర్’ను వివాహమాడటంతో అతని అదృష్టం మారిపోయింది.

దక్కన్‌లో పేద బ్రహ్మణుడిని పర్షియాకు చెందిన ధనవంతుడు బానిసగా కొనుక్కున్నాడు (యుద్ధంలో చిక్కిన వారిని ఆ కాలంలో తమ దేశం తీసుకు వెళ్లి బానిసలుగా అమ్మేసేవారు). మతం మారిన ఆ బ్రాహ్మణుడు పర్షియాలో తిండికి లేని పరిస్థితులలో భారత్ వచ్చాడు. మొఘలుల వద్ద లెక్కలు రాసేవాడిగా చేరాడు. చివరికి బెంగాల్‌లో తొలి స్వతంత్ర నవాబు ‘ముర్షిద్ ఖులీ ఖాన్’ అయ్యాడు.

మంగోలుల నుంచి తప్పించుకున్న తుర్కి సైనికుడు చేతిలో చిల్లిగవ్వ లేకుండా భారత్‌కు వచ్చి స్థిరపడ్డాడు. ఇక్కడ మతం మారిన హిందూ అమ్మాయిని వివాహమాడేడు. వారి సంతానం ‘అమీర్ ఖుస్రూ’ భారత్‌లో ఖవ్వాలి సంగీతాన్ని రూపొందించాడు.

ఇలా చరిత్రను త్రవ్వుతూపోతే, చేతిలో చిల్లిగవ్వ లేక, తినటానికి తిండి లేక, ప్రాణాలు అరచేత పట్టుకుని భారత్ చేరిన అనేక ఇస్లామీయులు, ఇక్కడ స్థిరపడి ధనవంతులయి, ఇక్కడి ప్రజలను పీడించిన కథలు కోకొల్లలుగా దొరుకుతాయి.

ఇలా కశ్మీరు వచ్చి స్థిరపడి, తమ గత దౌర్భాగ్యాన్ని మరచి అధికారం చలాయిస్తూ ప్రజలను పీడించిన వారిని ప్రస్తావిస్తున్నాడు శ్రీవరుడు. మనం పైన ప్రస్తావించుకున్న వారు పొట్ట చేత పట్టుకునో, బానిసలుగానో వచ్చి పేరు తెచ్చుకున్నవారు. అలాకాక ఎంతో మంది చరిత్ర పుటల్లో పేర్లు సంపాదించనివారు ఉండి ఉంటారు. అలాంటి వారిలో తనకు తెలిసిన వారిని గురించి వ్యాఖ్యానిస్తున్నాడు శ్రీవరుడు.

శ్రీవరుడీ శ్లోకంలో ‘కణభుజో’ అన్న పదం వాడాడు. ఇక్కడ ‘కణం’ అంటే ధాన్యపుగింజ లేక ధాన్యంగా భావించవచ్చు. విదేశాల నుంచి వచ్చిన సయ్యద్‍లు, ఇతరులు పేదవారు తిండికి లేని వారు. దుర్భర దారిద్ర్యంతో ఉన్నవారు. భారత్‌లో తమ పరిస్థితులు మెరుగుపడతాయన్న ఆశతో, తురకల పాలనలో తమకు ఆవకాశాలు లభిస్తాయన్న ఆశతో కశ్మీరు వచ్చారు. వారికి కడుపు నిండా తిండి దొరికేది కాదు. వారి దేశంలో  వారు ఇతరులు వదిలేసిన నూకలను, పారేసిన బియ్యపు గింజలను ఏరుకుని తినేవారు. ఆకాలంలో దీన్ని  ‘పేదల ఆహారం’ అనేవారు.

కశ్మీరు వచ్చిన తరువాత రాజాశ్రయం లభించటంతో వారు గొప్ప వారు అయిపోయారు. ఏదో పదవి లభించింది. అందుకే వారిని ‘కణభుజో’ అన్నాడు శ్రీవరుడు, చులకనగా వారి గతాన్ని ప్రస్తావిస్తూ.

అధికారం లభించటంతోటే వారు, సామాన్యులపై ముఖ్యంగా, ఇస్లామేతరులపై, అధికారం చలాయించేవారు. వారి ఆస్తులు దోచుకునేవారు. హింసించేవారు. జైనులాబిదీన్ కాలంలో ఇలాంటి వాటికి ఆయన అనుమతినీయలేదు. ఎవరైనా ఇలాంటి అన్యాయాలకు పాల్పడితే, వెంటనే ఆయన వారిపై కఠినమైన చర్యలు తీసుకునేవాడు. కానీ ఇప్పటి సుల్తానుకు అలాంటి ధైర్యం లేదు. పట్టి లేదు. నిజానికి, జైనులాబిదీన్ తమను అడ్డుకుంటున్నాడన్న కోపంతోనే ఇస్లామీయులు, జైనులాబిదీన్ కొడుకుల నడుమ చిచ్చుపెట్టారు. అధికారాన్ని చేపట్టారు. ఇస్లామీయుడు, ఇతరులందరికన్నా ఉన్నతుడు, వారెవరికీ లొంగి ఉండకూడదన్న సిద్ధాంతం ప్రకారం వారి దృష్టిలో ఇతరులంతా తమకన్నా తక్కువ వారే.

ఇప్పుడు పలు కారణాల వల్ల, వారంతా తనను వ్యతిరేకిస్తున్నారన్న ఆలోచనతో వారి ఆస్తులను జప్తు చేసుకుని వారికి  దేశబహిష్కారం విధించాడు కశ్మీరు సుల్తాన్. ఇదంతా అమాయకులను వేధించి, సంపాదించిన పాప ఫలితం అంటాడు శ్రీవరుడు. అయినా సరే, వారికి కశ్మీరు వదిలి వెళ్లటం ఇష్టం లేదు. ఎందుకంటే తమ దేశంలో వారి కోసం ‘దారిద్ర్యం’ తప్ప మరొకటి ఎదురు చూసింది లేదు. అందుకని ప్రాణ భయం ఉన్నా  వారు కశ్మీరును వదలటం లేదు. వదలినా ఢిల్లీ వంటి తురకల పాలన ఉన్న ప్రాంతాలకే వెళ్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ కాలంలో దేశంలో అధిక ప్రాంతాలలో తురకల పాలన ఉన్నా, కొన్ని ప్రాంతాలలో భారతీయులకు రక్షణ ఉండేది. అందుకని వారు వేధింపులు, హింసల నుండి తప్పించుకుని ఆ ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు ప్రపంచంలో భారతీయులకు తల దాచుకునేందుకు భారతదేశం తప్ప మరో దేశం లేదు. ఇది చేదు నిజం. ఇటీవలి కాలంలో కొందరు ముస్లిం మేథావులు, భారతదేశంలో తామే ‘మూలవాసులం’ అని ఓ విచిత్రమైన వాదన ఆరంభించారు. వారి వాదనలోని డొల్లతనాన్ని, దురూహలను ‘రాజతరంగిణిలు’ ఎత్తి చూపిస్తాయి.

అసలు కశ్మీరీ ప్రజలు అనేకులు కశ్మీరు వదలి పారిపోయారు. మతం మారనివారు ప్రాణాలు కోల్పోయారు. ఇతర దేశాల నుంచి వచ్చిన ఇస్లామీయులు అనేకులు కశ్మీరులో స్థిరపడ్డారు. దాంతో ఇప్పుడు అసలు కశ్మీరీలెవరు? అన్న ప్రశ్న కూడా రాని విధంగా అయిపోయింది. కానీ, కశ్మీరు తమదేననీ, ఇస్లామీయులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ వారు ముస్లింలు అధికంగా ఉన్నారు కాబట్టి, కశ్మీరు తమదేనని అంటున్నారు. ‘మేమే మూలవాసులం’ అనటం వెనుక ఈ ‘దేశం తమదే’ నని డిమాండ్ చేసే దురుద్దేశం పొంచి ఉన్నదని శ్రీవరుడి రాజతరంగిణి హెచ్చరిస్తున్నది.

ఆ కాలంలో కశ్మీరులో జరిగినట్టుగా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, మ్యాన్‌మార్ నుంచి ఇస్లామీయులు సరిహద్దు దాటి వస్తున్నారు. దేశంలో స్థిరపడుతున్నారు. ‘ఇది మా దేశమే’ అంటున్నారు. వారికి  పలు రూపాలలో సహాయ సహకారాలు అందుతున్నాయి. అప్పుడు కశ్మీరులో జరిగినట్టే ఇప్పుడు ‘జనసంఖ్య స్వరూపం’ మారుతోంది. దీని ఫలితాలు కూడా పలు రూపాలుగా దేశం నలుమూలలా కనిపిస్తున్నాయి. ఇది దేశంలో కలిగించాల్సినంత ఆందోళన కలిగించటం లేదు. ఆ కాలంలో కశ్మీరు సుల్తానుల పాలనలో ఉంది. కాబట్టి ఎవ్వరూ ఏమీ అనలేక పోయారు. కానీ ఇప్పుడు మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యంలో ఉన్నాం. కాబట్టి, మన దేశాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. భారతీయులంతా ఒక్కటై విదేశీ శక్తులను ఎదుర్కొనాల్సి ఉంది. లేకపోతే నాడు కశ్మీరులో జరిగింది, ఇప్పుడు దేశమంతా సంభవిస్తుంది. శ్రీవరుడి రాజతరంగిణి ఈ విషయంలో హెచ్చరిక లాంటిది. గతం నుంచి గుణపాఠాలు నేర్చుకున్నవాడు భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటాడు. గతాన్ని విస్మరించినవాడు అదే పొరపాట్లు చేస్తాడు, అనుభవిస్తాడు. చరిత్ర రచన గతంలో పొరపాట్లను ఎత్తి చూపించి భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకే. అందుకే ప్రాణాలకు తెగించి మరీ శ్రీవరుడు, ప్రజ్ఞాభట్టు, శుకుడు రాజతరంగిణిని కొనసాగించారు. కశ్మీరు రక్తసిక్త, అణచివేతల చరిత్రను అందించారు.

(ఇంకా ఉంది)

Exit mobile version