[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
రాజానకై ష్ఠక్కురైశ్చ తైర్మార్గపతిభిః సహ।
నిబద్ధయౌనసంబన్ధకృతైక్యో మల్లికో అభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 161)
రాజానకులు, ఠక్కరులు, మార్గపతిలతో లైంగిక సంబంధాలు ఏర్పరచుకున్నాడు మల్లిక్. అలా అందరినీ కలుపుకుని శక్తివంతుడయ్యాడు.
శ్రీవరుడు ‘యౌన సంబంధం’ అన్నాడు. అంటే, లైంగిక సంబంధం. కొందరు దీన్ని ‘వివాహ సంబంధం’గా అనువదించారు. మల్లిక్ రాజానుకులు, ఠక్కరులు, మార్గపతులతో లైంగిక సంబంధం ఏర్పరచుకుని వారందరినీ తన వైపుకు తిప్పుకున్నాడని రాశాడు శ్రీవరుడు. ‘యౌన సంబంధం’ అన్న సంస్కృత శబ్దానికి మైధునమ్, సంభోగః, సురతమ్, గ్రామ్యధర్మః అన్నవి పర్యాయపదాలు. సమానార్ధకాలు. వీటిల్లో గ్రామ్యధర్మః అంటే సంసారిక లేక లైంగిక సౌఖ్యం అన్న అర్థం వస్తుంది అంటే, ఎన్ని అర్థాలలో చూసినా మల్లిక్ ‘వివాహ సంబంధం’ కాక, లైంగిక సంబంధం ఏర్పరచుకుని వారందరినీ తన వైపు తిప్పుకున్నాడని శ్రీవరుడు రాసినట్టు అనిపిస్తుంది. వివాహ సంబంధం ఏర్పరచుకుని ఉంటే, ఇంతకు ముందరి 148వ శ్లోకంలో రాసినట్టు రాజపుత్రితో వివాహం అయినట్టు రాసినట్టు రాసేవాడు. మొత్తానికి కశ్మీరులోని శక్తివంతులందరినీ తన వైపు తిప్పుకున్నాడు మల్లిక్. ఎలా తిప్పుకున్నాడనేది ఊహకు అందదు. ఏమేం పద్దతులు అమలుపరచాడో శ్రీవరుడు సరిగ్గా చెప్పలేదు. కేవలం లైంగిక సంబంధం ద్వారా ఇంతమందిని తన వైపు తిప్పుకోగలగటం కుదరని పని.
ఇస్లామ్ చరిత్రను గమనిస్తే ఇస్లామీయులు యుద్ధాల ద్వారా రాజ్యాలను గెలుచుకున్నారు. వివాహ సంబంధాల ద్వారా విధేయతను సాధించారు తప్ప లైంగికతను ఆయుధంలా వాడలేదు. ఈ విషయం చరిత్ర స్పష్టంగా చూపిస్తుంది. కాబట్టి, శ్రీవరుడి ఉద్దేశ్యం ఏమైనా, వివాహ బంధాల ఆధారంగా రాజానకులు, ఠక్కరులు, మార్గపతులను తన వైపు తిప్పుకున్నాడు మల్లిక్ అనే అనుకోవాల్సి వస్తుంది.
సర్వతంత్రాధికారేణ రాజతంత్రమఖండితమ్।
తాజిభట్టాయ మల్లేకో ముష్టిబద్ధమివాకరోత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 162)
తాజిభట్టు కోసం మల్లిక్ తనకున్న సర్వతంత్రాధికారం ద్వారా రాజ్యంపై పట్టును తన చేతిలోనే ఉంచుకున్నాడు.
పుత్రీకృతో అయం సద్వంశ్యో మదాజ్ఞాస్మాత్ స్ఫురత్యలమ్।
ఇతి తస్యాక్షమిష్టాదౌ మల్లేకః స్ఫూర్జితం న కమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 163)
తాజిభట్టు తన కుటుంబానికి చెందినవాడు కాబట్టి, తన దత్త పుత్రుడిగా భావించి అతడు త్వరగా ఐశ్వర్యం సాధిస్తున్నా, అతని దోషాలను చూసిచూడనట్టు క్షమించలేదు.
స్వసారం వీక్షతే స్వల్పం మార్గేశోపి జ్యహాంగిరః।
స్వసారం సైదనిర్ముక్తిదత్తపత్రాంకితాం వ్యధాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 164)
తన సోదరికి సయ్యదుల ఇంట్లో అవమానం జరుగుతున్నది కాబట్టి, సయ్యదుల నుంచి ఆమెకు విముక్తి కలిగించేందుకు మార్గేశుడు జహంగీర్, నిర్ముక్తిపత్రం (విడుదల పత్రం, ఉర్దూలో తలాక్‌నామా) ఇప్పించాడు.
ఇది చాలా ప్రాధాన్యం కల శ్లోకం. సంస్కృత సాహిత్యంలో ప్రథమంగా వినిపిస్తుంది ‘నిర్ముక్తి పత్రం’ అన్న పదం. ‘తలాక్‌నామా’ అన్న పదాన్ని సంస్కృతంలో ‘నిర్ముక్తి పత్రం’ అన్నాడు శ్రీవరుడు. భారతీయ సాహిత్యంలో కంచుకాగడా పెట్టి వెతికినా ఇలాంటి భావన కనబడదు.
భారతీయ ధర్మంలో ‘విడాకులు’ అన్న ఆలోచన లేదు. ఇది స్వతంత్రం తరువాత మన సమాజంలోకి ప్రవేశించిన ఆలోచన. అంతకు ముందు భార్యాభర్తలు కష్టమైనా, నష్టమైనా కలసి ఉండేందుకే ప్రాధాన్యమిచ్చేవారు. ఎవరికైనా తన జీవిత భాగస్వామిపై ఏదో కారణం వల్ల విరక్తి కలిగితే, అతడు సంసారం వదలి సన్యాసి అయ్యేవాడు (సన్యాసం స్వీకరించాలంటే పెళ్లి కాకపోతే తల్లి అనుమతి, పెళ్లయితే భార్య ఆమోదం అవసరం). అతడు సన్యాసి అయినా అతడినే ధ్యానిస్తూ అతడి మనసు మారి ఎపుడయినా తిరిగి వస్తాడన్న ఆశతో ఎదురు చూసేది భార్య. అంతే కానీ, ‘పోయాడు వెధవ, పీడా పోయింద’ని అనుకునేది కాదు. ఒకవేళ స్త్రీ మర్యాదను అతిక్రమించి, పరపురుషుడితో అక్రమ సంబంధం నెరపితే ఇప్పటి లాగా, అక్రమ సంబంధానికి సాక్ష్యం చూపిస్తే, కోర్టు విడాకులిచ్చే వ్యవస్థ అప్పుడు లేదు. వీడియోలను వెంటబెట్టుకుని ‘రెడ్ హ్యాండెడ్’గా పట్టుకుని అవమానిస్తూ రికార్డు చేయటం, అల్లరి చేయటం అనే ఆలోచన కూడా అప్పుడు లేదు.
భారతీయ ధర్మం ప్రకారం వివాహం అన్నది జీవితాంతం ఉండే సంబంధం. అదొక సంస్కారం. అనంత కాలం ఉండే సంస్కారం. అందుకే అహల్య ఇంద్రుడు మారువేషాన ఉన్నాడని గ్రహించి కూడా మౌనంగా ఉన్నా సరే, గౌతముడు ‘డైవర్స్’ అని అరవలేదు. ఆమె తన పొరపాటు గ్రహించగానే, శారీరిక సౌఖ్యం క్షణికం, ధర్మ పాలన శాశ్వతం, అని అర్థం చేసుకోగానే, అప్పటి వరకూ హిమాలయాల్లో తపస్సు చేస్తున్న ఆయన తిరిగి వచ్చాడు. అహల్యను స్వీకరించాడు. చంద్రుడు, తార కథలో కూడా ‘తార’ గర్భాన చంద్రుడి పుత్రుడున్నా, తార, పుట్టబోయే సంతానం తనకు చెందుతారని తన దగ్గరే ఉండాలని బృహస్పతి పట్టుబట్టాడు. యుద్ధానికి సిద్ధమయ్యాడు. చివరికి దేవతలంతా కలగచేసుకుని నచ్చచెప్తే తార, చంద్రులు కలసి ఉండేందుకు అంగీకరించాడు. ఇవి రెండు పురాణగాథలు. ఇంకా బోలెడన్ని ఇలాంటి గాథలు పురాణాలలో ఉన్నాయి. భారతీయ ధర్మంలో వివాహం అవిచ్ఛిన్నమైనది. ఎందుకంటే, వివాహం ఒక బాధ్యత. సామాజిక కర్తవ్యం. అక్కడ వ్యక్తిగత ఇష్టాయిష్టాలతో పనిలేదు. వివాహ బంధాన్ని జీవితాంతం నిర్వహించాల్సిందే. అంతే.
మనుధర్మ శాస్త్రం కూడా భార్యాభర్తలు జీవితాంతం కలసి ఉండాల్సిందేనని, ఇది ‘సార్వజనీన ధర్మం’ అనీ తీర్మానించింది. భార్యాభర్తలు నిజాయితీగా ఉండాలని, ఒకరికొకరు విధేయులుగా ఉండాలని నిర్దేశిస్తుంది మనుధర్మ శాస్త్రం. మనుధర్మ శాస్త్రంలో భార్యాభర్తలు మానసికంగా ఏకమైనా, కొన్ని తప్పనిసరి పరిస్థితులలో భౌతికంగా వేర్వేరుగా జీవించవచ్చని తీర్మానించింది. పరస్పర విద్వేషం, తీవ్రమైన హింస వంటి పరిస్థితులలో వేర్వేరుగా జీవించవచ్చు అంది కానీ ‘విడాకులు’ ప్రసక్తి, ఆలోచన మాత్రం లేదు.
నారద స్మృతి, పరాశర స్మృతులలో అయిదు ప్రత్యేక పరిస్థితులలో మహిళ ద్వితీయ వివాహం చేసుకోవచ్చని ఉంది. భర్త అదృశ్యం అయినా (చెప్పాపెట్టకుండా ఏటో వెళ్లిపోయినా), మరణించినా, భర్త సన్యాసం స్వీకరించినా, భర్త సంసార సుఖానికి పనికి రానివాడయినా, భర్త కులం నుంచి పతితుడై, వెలివేతకు గురయినా, భార్య ద్వితీయ వివాహానికి అంగీకారం తెలిపాయి స్మృతులు. ఇక్కడ కూడా ‘విడాకులు’ అన్న ఆలోచన లేదు. ‘అర్థశాస్త్రం’లో కౌటిల్యుడు భార్యాభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో వేర్వేరు వివాహాలు చేసుకోవచ్చన్నాడు. ఇలాంటి పరస్పరాంగీకారం, కేవలం గాంధర్వ, రాక్షస వివాహాలకే వర్తిస్తుందన్నాడు. సాంప్రదాయిక వివాహాలకు ఈ నియమం చెల్లదు. అంటే, 1955లో హిందూ మారేజ్ ఏక్ట్, హిందూ వివాహ చట్టం తెరపైకి వచ్చే వరకూ భారతీయ సమాజంలో ‘విడాకులు’ అన్న ఆలోచన లేనేలేదు. ఇది భారతీయ సమాజానికి అలవాటు లేని కొత్త అలోచన, చట్టం ద్వారా చొచ్చుకుని వచ్చింది.
ఇస్లామీయులలో ‘తలాక్’ అన్న ఆలోచన ‘ఖురాన్’లో కనిపిస్తుంది. కానీ ‘తలాక్‌నామా’ ‘విడాకుల పత్రం’ అన్న ఆలోచన తరువాత వచ్చింది. ఖురాన్ ప్రకారం ‘తలాక్’ అన్నది ఇద్దరు సాక్షులు (సూర, అత్-తలాక్, 65:2) ఉంటే సరిపోతుంది. రాను రాను ‘తలాక్‌నామా’ అన్న ఆలోచన అమలు అయింది. ఈ ‘తలాక్‌నామా’ను సున్నీలు ఆమోదిస్తారు. షియాలకు ఇద్దరు సాక్షుల ముందు ‘తలాఖ్’ అంటే చాలు. భర్త మాట్లాడలేని పరిస్థితులలోనే ‘తలాఖ్ నామా’ను ఆమోదిస్తారు. ఖురాన్ (సూర ఆల్-బఖురాహ్ 2.282) ప్రకారం సంపత్తికి సంబంధించిన వ్యవహారాలకు సంబంధించిన ఒప్పందాలు రాతపూర్వకంగా ఉండాలి. దాని ఆధారంగా ‘తలాఖ్‌నామా’ ఆమోదయోగ్యంగా భావిస్తారు అనేకులు. కాబట్టి విడాకులు, విముక్తి పత్రం, తలాఖ్‌నామా అన్న ఆలోచనలు ఇస్లామీయులకు అలవాటయిన పదాలు. వారు ఆచరిస్తున్న పద్ధతి. ఆ పద్ధతిని చట్టం ద్వారా భారతీయ సమాజంలోకి ప్రవేశపెట్టారన్నమాట. దాంతో భారతీయ ధర్మానికి ప్రత్యేకమయిన ‘దాంపత్య ధర్మం’ రాను రాను ప్రమాదంలో పడటం మొదలయింది. ఇప్పుడు ‘వివాహం’ కన్నా వివాహ రహితంగా సహజీవనం చేయటమనే ‘వికృతి’ సమాజంలో వ్రేళ్లూనుకుంటున్నది. వివాహం ఒక ‘ధర్మం’లా కాక ‘ఒప్పందం’లా మారిపోతున్నది. ‘విడిపోవటం’ అన్నది భారతీయ ధర్మంలో లేదని శ్రీవరుడి రాజతరంగిణి స్పష్టం చేస్తున్నది. తనకు ఇష్టం లేకున్నా తండ్రి మాట వల్ల సుల్తానులను వివాహం చేసుకున్న ఎందరో మహిళల గాథలు మనకు తెలుసు. వారు భర్త ధర్మం స్వీకరించి, భర్తకు, భర్త ధర్మానికి విధేయులుగా ఉండటమూ చరిత్ర చెప్తుంది. అంతెందుకు శ్రీకృష్ణదేవరాయలను అయిష్టంగా వివాహమాడిన అన్నపూర్ణాదేవి కృష్ణదేవరాయలపై హత్య ప్రయత్నం చేసిందన్న కథ ఒకటి ప్రచారంలో ఉంది. ఆ తరువాత ఆమె కృష్ణదేవరాయలను మనస్ఫూర్తిగా స్వీకరించిందనీ, తనపై హత్యా ప్రయత్నం చేసినా కృష్ణదేవరాయలు కోపగించక, ఆమెను స్వీకరించాడనీ అంటారు. అంతే తప్ప, శ్రీకృష్ణదేవరాయలు ‘డైవర్స్’ అనలేదు. అందుకే స్వతంత్రం ముందరి వరకూ, పరిస్థితులేవయినా భార్యాభర్తలు వివాహానికి కట్టుబడి ఉండేవారు. అందుకే శ్రీవరుడు ‘విముక్తి పత్రాన్ని’ ప్రత్యేకంగా ప్రస్తావించాడు, ఆశ్చర్యంతో.
తన్మార్గేశాగ్రజాం రాజానుమతేన ప్రసన్నధీ:।
అభ్యర్థ్య తాజిభట్టాయ మల్లే కస్తామదాపయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 165)
రాజు ఆమోదంతో నిర్మల బుద్ధి కల మల్లిక్, మార్గపతి సోదరితో తాజిభట్టు వివాహం జరిపించాడు.
జ్యహాంగిరోపి మార్గేశః క్షితిపాలానురోధతః।
స్వాగ్రజార్పణమేతస్మై చక్షమే నయదక్షఘీః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 166)
మార్గేశుడు జహంగీర్ సైతం, ఈ చర్యలోని రాజనీతిని గ్రహించి తన సోదరిని అతనికి (తాజిభట్టు) సమర్పించటంలో సమర్థుడయ్యాడు.
చంచరీకా ఇవోద్యానం కుల్యా ఇవ మహోదధిమ్।
భాగ్యభాజం సమాయాన్తి కలత్రాణి చ సంపదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 167)
ఉద్యానవనం లోకి తుమ్మెదలు వచ్చేట్టు, నదులు సముద్రంలోకి ప్రవహించేట్టు, సంపద, స్త్రీలు భాగ్యవంతుడికే దక్కుతారు.
తాం మార్గేశ కులోద్యాన కల్పవల్లీం ఫలప్రదామ్।
తైః సంపూర్ణగుణైః పూర్ణాం భట్టో లక్ష్మీమివాసదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 168)
మార్గేశుడి కులోద్యానంలో కల్పవల్లి, సంపూర్ణ గుణాలు కల అతడి సోదరిని లక్ష్మి ప్రాప్తించినట్టు భట్టుకు ప్రాప్తించింది.
‘కులోద్యాన కల్పవల్లి’ అంటే వారి వంశంలో కల్పవల్లి లాంటిది అని అర్ధం.
సైదనిష్కాసనం నైవ సంపన్నం జైనభూపతేః।
హేలయైవాస్య పౌత్రేణ కృతమిత్యవదజ్జనః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 169)
జైనులాబిదీన్ దేశం నుంచి సయ్యదులను బహిష్కరించాలని అనుకున్నాడు, కానీ చేయలేకపోయాడు. అతని మనుమడు సునాయాసంగా ఆ పని సాధించాడని ప్రజలు అనుకున్నారు.
కృతే నిష్కంటకే దేశే మల్లికాహ్లాదసన్తతః।
ప్రతిష్ఠారసికో రాజా తత్సభా చ తదాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 170)
దేశ వ్యతిరేకులు, శత్రువుల భయం నుంచి దేశం విముక్తమయిన తరువాత మల్లిక్ అహ్మద్ ప్రభావంతో రాజు భవన నిర్మాణాల పట్ల ఆసక్తుడయ్యాడు. అతడి సభ కూడా అలాగే అయింది.
‘ప్రతిష్ఠారసికో’.. రసికుడు అంటే ఆసక్తి కలిగిన వాడు. ‘ప్రతిష్ఠ’ అంటే ఇక్కడ భవన నిర్మాణం. అంటే సుల్తాను భవన నిర్మాణాల పట్ల ఆసక్తి కలవాడయ్యాడని అర్థం. భవనాలు నిర్మించాడు. అతడిని ఆదర్శంగా తీసుకుని సభికులు అంటే రాజ్యంలోని ఇతరులు కూడా నిర్మాణ కార్యక్రమాలు చేపట్టారన్న మాట.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
