Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-125

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

వివాహోత్సవ సద్దేశ్మ నాట్యయాత్రాదిమంగలాన్।
నాపరామగ్రహీ చ్చిన్తాం సౌరాజ్యసుఖితో జనః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 171)

రాజు సుపరిపాలనలో సంతోషంగా ఉన్న ప్రజలు పెళ్లిళ్లల్లో, సంబరాలలో నూతన భవన నిర్మాణాలలో, నృత్యాలలో, ఉత్సవాలు తప్ప మరో విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేకుండా ఉన్నారు.

పంచాశద్వత్సరే రాజా నిర్మమే నిర్మమోహితః।
దిద్దామఠే నదీప్రాన్తే రాజధానీం మనోహరామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 172)

ఖర్చు గురించి ఆలోచన లేకుండా, నదీతీరంపై దిద్దా మఠం దగ్గర యాభయ్యవ సంవత్సరంలో అందమైన భవంతిని నిర్మించాడు.

శ్రీనగరంలో ప్రస్తుతం దిద్దర మొహల్లాగా గుర్తింపు పొందిన ప్రాతంలో ‘దిద్దామఠం’ ఉండేది. అక్కడ ఒక అందమైన భవంతిని నిర్మింప చేశాడు సుల్తాన్ హసన్ షాహ్.

శ్రీవరుడు యాభయ్యవ సంవత్సరం అన్నాడు. ఇది క్రీ.శ.1574వ సంవత్సరం ప్రస్తుతం  లెక్కలలో.

ధన్యాహమన్యా కిం శూన్యా ఇత్యేవాంబుని బింబింతా।
స్ఫురచ్చతుష్కికాహస్తైర్నృ త్యతీవ దివానిశమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 173)

‘నేను ధన్యను’ అని భావిస్తూ, నీటిలో ప్రతిబింబిస్తున్న మెరుస్తున్న నూతన భవన స్తంభాలు చేతులెత్తి ఆనందంతో నృత్యం చేస్తున్నట్టున్నాయి. పాత భవనం శూన్యంగా ఉంది.

మద్దంశ్యేన కృతా కేనాపీదృశీతి దిదృక్షయా।
స్వర్ణచ్ఛత్రచ్ఛలాద్యస్యాః ప్రాప్తో వ్యోమ్నో దివాకరః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 174)

తన వంశజుడెవరో తనలాంటి ఛత్రాన్ని భూమిపై నిర్మించారని భావించి, భవనం పైని బంగారు ఛత్రాన్ని చూసేందుకు వచ్చినట్టు సూర్యుడు వచ్చాడు.

యత్కారు క్లృప్తకోణస్థదారుగారుడ మూర్తిభిః।
వస్తాశ్చరన్తో నాయాన్తి పక్షిణస్తన్నభోధ్వనా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 175)

భవంతి నలుమూలల శిల్పాలు చెక్కి ఉంచిన గరుడిడి విగ్రహాలు చూసి భయంతో పక్షులు ఆ వైపు వెళ్లటం మానేశాయి.

గోల్ఖాతోనాభి ధి రాజ్ఞీ మాతా దిద్దేవ దేవతా।
విశాలాం ధర్మశాలాం సాప్యకరోన్మద్ర సాఖ్యయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 176)

రాజమాత గోల్ ఖాతూన్, దిద్దాదేవి వంటిది. ఆమె  ‘మదరసా’ అన్న పేరు గల పెద్ద ధర్మశాలను నిర్మింప చేసింది.

‘మదరసా’ అన్న పదం సంస్కృత కావ్యంలో ప్రవేశించింది. ‘మదరసా’ను శ్రీవరుడు పెద్ద ధర్మశాల అన్నాడు.

‘మదరసా’ అన్నది  అరబిక్ పదం. ‘దరసా’ అంటే పఠించటం, అధ్యయనం చేయటం. మదరసాలు ఇస్లామీయుల విద్యాలయాలు. ఆరంభంలో ముస్లింలు మసీదుల్లోనే చదివేవారు. 11వ శతాబ్దం నుంచీ మదరసా వ్యవస్థ ఆరంభమయింది. కానీ, శ్రీవరుడు ‘మదరసా’ను ‘ధర్మశాల’ అన్నాడు. మదరసాలు ధర్మశాలలు కావు. బహుశా, విద్యార్ధులు అక్కడే ఉండి చదవటం, వారికి ఉచితం సౌకర్యాల కల్పించటం, విదేశాల నుంచి వచ్చిన వారు మదరసాలలో ఆశ్రయం పొందటం వంటి విషయాల వల్ల శ్రీవరుడు ‘ధర్మశాల’ అనివుంటాడు.

శ్రీవరుడు ‘గోల్ఖతూన్’ అన్నది ‘గుల్ ఖూతూన్’ను. ఈమె హైదర్ షాహ పత్ని. ప్రస్తుత సుల్తాన్ హసన్ షాహ్‌కు తల్లి. అందుకే ఆమెను ‘రాజమాత’ అన్నాడు శ్రీవరుడు. ఈమె హిందూ స్త్రీ, హైదర్ షాహను వివాహమాడినా ఆమె హిందూ పద్ధతులను పాటించేదని అంటారు. కాశ్మీరీ ముస్లిం రాణుల్లో ఈమెది ఉన్నతమైన స్థానం. ఈమె ప్రభావంలో ఉన్నంత కాలం హసన్ షాహ ఉత్తమంగా వ్యవహరించాడు. కశ్మీరులో ఉత్తమ మహిళను ఉన్నత స్థాయి మహీళలను ‘రాణీ దిద్దాదేవి’ తో పోలుస్తారు. శ్రీవరుడు అదే పని చేశాడు. కశ్మీరును యాభయ్ సంవత్సరాలు పాలించింది రాణి దిద్దాదేవి.

యత్ప్రవేశే నృపస్తుష్టో మాత్రా సహ సమాగతః।
పక్షమేకం వ్యధాద్ భూరివ్యయశాలిమహోత్సవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 177)

తోటలో ఆ భవనంలో ప్రవేశాచిన  రాజు ఎంతో సంతుష్టుడయ్యాడు. అతడు  పక్షకాలం పాటు ఉండి ఎంతో ఖర్చుతో కూడిన సంబరాలు జరిపాడు.

ప్రతిష్ఠామర్ధనిష్పన్నాం నిర్లోఢ్యానుచితాం నృపః।
నగరే పితృపుణ్యార్థం ఖానగాహం వినిర్మమే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 178)

ఎంతో ధనం ఖర్చు చేసి తండ్రి పుణ్యార్ధం  ‘ఖాన్ కాహ’ను నిర్మించాడు.

‘ఖనకాహ’ అన్నది పార్సీ పదం నుంచి వచ్చింది. ‘ఖాన్ క్రాహ’ ఫార్సీ పదం. ఫకీరులు, సాధువులు దేశం తిరుగుతూ ఇలాంటి గృహాలలో ఉచితంగా నివసిస్తారు. కొన్నాళ్లు విశ్రాంతి తీసుకుని ముందుకు సాగుతారు.

కులోద్ధరణనాగస్య తటభూమౌ మహీపతిః।
వహ్నిదగ్ధం నవ చక్రే రాజవాసం మనోరమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 179)

నది ఒడ్డున ‘కులోద్ధరణ నాగ’ వద్ద అగ్నికి  అహుతి అయిన రాజవాసాన్ని నవీనంగా సుందరంగా నిర్మించాడు.

విజయేశనదీప్రాన్తే రాజవేశ్మ నవీకృతమ్।
భాతి భాతిశయాన్మధ్యరత్నం హారావలేఖి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 180)

విజయేశ వద్ద నదీతీరం దగ్గర నూతనంగా నిర్మించిన రాజభవనం మణిహారంలో మణిలా వెలుగుతోంది.

ఛత్రం యత్ర స్ఫురత్పత్ర వితస్తామ్బుని విమ్బితమ్।
ప్రేక్ష్య తుష్టైః సురైర్ముక్తమివ సౌవర్ణపఙ్కజమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 181)

భవంతి పై వెలుగుతున్న ఛత్రం లాంటి నిర్మాణం, వితస్త నదిలో ప్రతిబింబిస్తూ, దేవతలు సువర్ణ కమలాన్ని జలాలలో ఉంచారని అనిపిస్తున్నది.

భాతి సుయ్యపురే రాజధానీ రాజవినిర్మితా।
పురాతనీం పరాకీర్ణాం హసతీవ సుధాసితా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 182)

రాజధాని సుయ్యపురంలో రాజు నిర్మించిన భవనం శ్వేత వర్ణంలో శోభిస్తూ, పాత భవనాన్ని చూసి నవ్వుతున్నట్టుంది.

రాజ్ఞా కుతైరనేకాక్షే స్వోద్యానే రాజవేశ్మభిః।
యద్దర్శనాదనేకాక్షో నూనం స్వమభినిన్దతి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 183)

‘అనేకాక్ష’ అనే ఉద్యానవనంలో రాజు నిర్మించిన భవనం ఎంత సుందరంగా నిర్మించాడంటే, అది చూసి ఇంద్రుడు, న్యూనతా భావానికి గురయ్యాడు.

కశ్మీరులో ‘అనేచ్ఛ’ అని ఒక పరగణా ఉంది. దాన్ని ప్రస్తుతం  ‘అనంత్‌నాగ్’ అంటున్నాం. ఈ ‘అనంత్‌నాగ్’ను కొన్నాళ్లు ‘ఇస్లామాబాద్’ అన్న పేరుతో వ్యవహరించారు. ఈ అనేచ్ఛ లోని ఉద్యానవనం ‘అనేకాక్ష’ అని  అనుకుంటున్నారు. అంటే, ఈ ‘అనేకాక్ష’ అనే ఉద్యానవనం అనంత్‌నాగ్‌లో ఉండేదని భావిస్తున్నారన్న మాట. ఇప్పుడు ఆ ఉద్యానవనం లేదు. ఇంద్రుడు చూసి న్యూనతా భావానికి గురయ్యిన భవంతి కూడా లేదు.

ప్రతిష్ఠా విహితా రాజ్ఞా నవా యా నిజమణ్డలే।
అన్యాస్తా వర్ణితా నాత్ర గ్రన్థగౌరవతో మయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 184)

ఇంకా రాజు పూర్తి చేసిన అనేక నిర్మాణాలను గ్రంథ విస్తరణ భీతితో నేను వర్ణించలేదు.

దిద్దామఠే అహ్మదాయుక్తః కృతాతులగృహావలిః।
మసోదాహజిరోదారశిలాభిత్తివిరాజితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 185)

ఖానగాహేతి విఖ్యాతం ఘర్మవాసం వినిర్మమే।
యేన నానాదిగాయాతతత్తత్పథికశాలినా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 186)

దిద్దామఠపురం సర్వం యయౌ నేత్రాభిరామతామ్।
ప్రవేశే నృపమానీయ పష్టిలక్షకృతవ్యయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 187)

దత్త్వా సతిపుపగ్రామ సత్ర యత్రావతారితమ్।
శాహాభిధాస్య భార్యాపి మఠ సుకృతకర్మఠమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 188)

ఖేరీవిపయమార్గాన్తర్నిర్మమే సప్రతిగ్రహమ్।
తత్పుత్రో నౌరుజాయుక్తః కృత్వా ధర్మమఠ నవమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 189)

నగరాత్ క్షిప్తికాం యావచ్ఛేలసేతు నవ వ్యధాత్।
తద్వీపే సతి యో హన్తి సర్వేషాం పురవాసినామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 190)

స్తమ్భనిర్మితదీర్ఘాశ్మసేతుబన్ధకుతూహలమ్।
ఆతరావపి తౌ ధన్యావన్యౌ రిగకనూథకౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 191)

వ్యఘాతాం క్రమరాజ్యాన్తర్మఠౌ సౌఘమనోహరౌ।
తాజిభట్టోపి భూపాలవాల్లభ్య విభవోజితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 192)

కరాలవిషయే జైనపురీమధ్యే మఠం వ్యధాత్।
కునదీనపురీమధ్యే చక్రేశ్మరచనాం నవామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 193)

ఇంద్రోపీక్షేత తాం సోపి భవేత్ కర్మకుతూహలీ।
ఎదరాజానకో రాజవస్త్రశోభాధికారభాక్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 194)

ఖానగాహం స నిర్వర్త్య బలాఢ్యమఠకాన్తరే।
నవః పితృవిహారాన్తే నిజజన్మభువోన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 195)

మంత్రి అహ్మద్, దిద్దామఠంలో భవంతులు వరుసలుగా నిర్మించాడు.

మసీదు హజరా ఆవరణలో పేరుపొందిన ఖాన్‌గాహను నిర్మించాడు. దేశ విదేశాల నలుమూలల నుంచి ప్రయాణీకులు ఈ ఖాన్‌గాహలో ఆశ్రయం పొందేవారు. ఇందువల్ల సంపూర్ణ దిద్దామఠపురం నయనానందకరం అయింది. ఈ ఖాన్‌గాహ్ ఆరంభ సమయంలో రాజును ఆహ్వానిచారు. రాజు, 60 లక్షల ధనం అందే ‘సవిపుష్’ ప్రాంతాన్ని  ప్రదానం చేశాడు. అక్కడ సత్రం నడిపించేవారు.  దాని ఖర్చుల కోసం ఈ దానం. అహ్మద్ భార్య ‘షాహ’ ‘ఖౌరీ’ గ్రామాలకు  వెళ్లేదారిలో ఒక మఠాన్ని నిర్మించింది. ఆమె పుత్రుడు, మంత్రి సోరోజ్ కూడా మత పరమైన మఠాలు నిర్మించాడు. క్షిప్తకా నగరానికి రాళ్ల వంతెన నిర్మింపచేశారు. ఆ వంతెన పూర్తి అయిన తరువాత స్తంభాల ఆధారంగా నిలచిన ఆ సుదీర్ఘ వంతెనను ప్రజలు ఆశ్చర్యంగా చూసేవారు. క్రామరాజ్యంలో రిగన్, మాధవ్ అన్న పేర్లున్న సోదరులు సుందరమైన మఠాలు, భవనాలు నిర్మించారు. రాజు అపార దయ వల్ల ధనవంతుడయిన తాజిభట్టు కూడా క్రమ దేశం కుద్దీనపురం దారిలో ఉన్న జైనపురి  మధ్యలో ఒక నవీన మఠ నిర్మాణం చేశాడు. ఈ నిర్మాణాలు చూసి ఇంద్రుడికి కూడా నిర్మాణాలు చేపట్టాలన్న ఉత్సాహం కలుగుతుంది. రాజు వస్త్రాలు తయారు చేసే అధికారి ఎదరాజకుమారుడు బాలాడ్య మఠంలో ఒక ఖాన్‌కాహ నిర్మింప చేశాడు. తన జన్మభూమిలో కూడా  ‘పితృవిహార్’ దగ్గర నిర్మాణం చేశాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version