Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-127

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

యో ధర్మసంధ్యు పకృద్ బౌద్ధమార్గ ఇవాబభౌ।
ప్రాసాద లక్ష్మమేరాద్యా భ్రాతరోస్య వణిగ్వరాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 205)

భీమస్వామిగణేశస్య వ్యధుః శైలమయం నవమ్।
తద్గణేశాలయం దృష్ట్వైవోన్నతం సుధయా సితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 206)

ద్వేషాన్మ్లేచ్ఛముఖం చిత్రం భవత్యేవాసితం నతమ్।
అన్యేప్యుచ్చావచా వేశ్మప్రతిష్ఠా వివిధా వ్యధుః।
యాభిః స్వర్గోపమం భాతి మండలం వేశ్మమండితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 207)

(భాండపతి నిర్మించిన) విహారం బౌద్ధ సంఘాల ఆదరణ పొందడంతో, అది విజ్ఞాన మార్గంలా శోభాయమానం అయింది. (భాండపతి) సోదరుడు లక్ష్మమేర, ఇతరులు, వణిజులు, భీమస్వామి కలసి గణేశుడి మందిరాన్ని రాళ్ళతో నూతన ప్రాసాదాన్ని నిర్మించారు. ఉన్నతమైనది, అమృతతుల్యమైనది, శ్వేతరంగులొ ఉన్నది అయిన గణేశాలయాన్ని చూసి ఆశ్చర్యంతో, ద్వేషంతో మ్లేచ్ఛుల ముఖాలు నల్లబడ్డాయి. వారి తలలు వినయంతో వంగిపోయాయి. ఇతరులు కూడా అనేక చిన్నవి, పెద్దవి అయిన ఇళ్ళు, మందిరాలు నిర్మించటంతో ఆ మొత్తం మండలం స్వర్ణ సదృశం అయిపోయింది.

కొద్ది కొద్దిగా శ్రీవరుడి మనసులో మాటలు బయటపడుతున్నాయి.  నిర్మొహమాటంగా కుండలు బ్రద్దలు కొట్టలేడు. అందుకని ముందుగా సుల్తాన్, అతడి అనుచర గణం, మంత్రులు, ఇతరులు నిర్మించిన కట్టడాలను పొగిడాడు. మసీదులు, ఖన్‌కాహ్‌లు, మజీరాలను వివరించాడు, వర్ణించాడు. తరువాత బౌద్ధులు నిర్మించిన విహారాల గురించి చెప్పాడు. చివరగా దేవాలయాల ప్రసక్తి తెచ్చాడు. ఎవరెవరు ఏమేం నిర్మించారో ఇస్లామీయుల కట్టడాల నిర్మాణాలను చెప్పినంత విపులంగా చెప్పలేదు. కానీ ఒక మందిరం గురించి చెప్పి, ఆ మందిరం చూసి ద్వేషించే మ్లేచ్ఛుల ముఖాలు  నల్లగా అయిపోయాయని , దాని శోభను చూసి వాళ్ళు తలలు దించుకున్నారనీ చెప్పాడు.

ఇక్కడే శ్రీవరుడి హృదయం తెలుస్తుంది.

మసీదుల ఘనత వర్ణించాడు. విహారాలను వర్ణించాదు. గణేశ మందిరాన్ని వర్ణిస్తూనే మ్లేచ్ఛుల ముఖాలు నల్లగా అయిపోయాయన్నాడు. అదీ ద్వేషంతో అని స్పష్టంగా చెప్పాడు. మందిరాలంటే మ్లేచ్ఛులకు ద్వేషం ఎందుకు? అది చెప్పటం శ్రీవరుడి పని కాదు.

ఒక కావ్యంలో రచయిత అనేక విషయాలను పొందుపరుస్తాడు. కొన్ని స్పష్టంగా, కొన్ని పరోక్షంగా, కొన్ని నర్మగర్భితంగా, కొన్ని సూచనప్రాయంగా తన భావాలను పొందుపరుస్తాడు. అలంకారశాస్త్రం వీటిని ధ్వని, వ్యజోక్తి, అన్యాపదేశం, అలంకారం, రసంగా విభజించింది. ఇవి రచయిత అసలు భావానికి పర్యాయ పదాల లాంటివి. వీటి ద్వారా రచయిత పైకి చెప్పే విషయంలో దాగున్న అసలు విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది. రచయిత హృదయాన్ని గ్రహించే వీలుంటుంది.

కల్హణుడు, జోనరాజుల రాజతరంగిణిల కన్నా శ్రీవరుడి రాజతరంగిణిని విశ్లేషించటం క్లిష్టమైన పని. కల్హణుడు నిర్మొహమాటంగా, సూటిగా మనసులోని భావాలను వ్యక్తపరిచాడు. జోనరాజు నర్మగర్భితంగా భావాన్ని ప్రదర్శించాడు. పైన పైన చదివితే సుల్తానులకు కోపం రాదు, వారిని పొగిడినట్టుంది. లోలోన తరచి చూస్తే, అతడి ఆవేదన, ఆక్రోశం, బాధ వంటి విషయాలు గ్రహించే వీలుంటుంది. శ్రీవరుడి రచనలో పై లక్షణాలతో పాటుగా, చెప్పీచెప్పనట్టు చేదు నిజాన్ని చెప్పటం కూడా ఉంటుంది.

ఈ శ్లోకంలో, ముందు శ్లోకంలో శ్రీవరుడు భారతదేశంలో, కశ్మీరులో 15వ శతాబ్ద కాలంలో బౌద్ధులు ఉన్నారని, సంఘాలు ఉన్నాయనీ, వారు విహారాలు నిర్మించేవారనీ చెప్పాడు. అంటే మన చరిత్ర చెప్తున్నట్టు బ్రాహ్మణులు బౌద్ధులను దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టలేదన్న మాట.

చరిత్ర రచయితల ప్రకారం 12వ శతాబ్దంలో భఖ్తియార్ ఖిల్జీ నలందపై దాడి చేయటంతో భారతదేశంలోని బౌద్ధులంతా తిబ్బత్తు, నేపాల్, ఆగ్నేయాసియా దేశాలకు పారిపోయారు. భఖ్తియార్ ఖిల్జీ దాడి, ఒంటె పడిపోయే ముందు ఉంచిన చివరి గడ్డిపోచ వంటిది. అంతకు ముందే హిందూ సంప్రదాయానికి ప్రాధాన్యం పెరుగుతుండటంతో భారతదేశంలో బౌద్ధులు బలహీనమయిపోయారు. భఖ్తియార్ ఖిల్జీ దెబ్బతో మిగిలినవారంతా పారిపోయారంటారు. కానీ బ్రాహ్మణుడైన శ్రీవరుడు 15వ శతాబ్దంలోని సుల్తానుల పాలనా కాలంలో, పండితులతో పాటు బౌద్ధులు కలసి మెలసి ఉన్నారనీ, విహారాలను నిర్మించారనీ రాశాడు. శ్రీవరుడు తన రాజతరంగిణిలో బౌద్ధ సంఘాల గురించి, త్రిరత్నాల గురించి వివరించాడు. బౌద్ధ సంఘాలు విహారాలు నిర్మించాయని రాశాడు. అంటే, 15వ శతాబ్దంలో కశ్మీరులో బౌద్ధ ధర్మం సజీవంగా ఉన్నదన్న మాట. ఒకే స్థలంలో బౌద్ధానుయాయులు, హిందువులు కలసిమెలసి ఉన్నారనీ, వారి నడుమ వివాహాది సంబంధాలు ఉండేవని రాశాడు. భారతదేశ చరిత్రను పునర్మూల్యాంకనం జరిపి, దొరుకుతున్న నూతన ఆధారాలతొ తిరిగి సరిగ్గా రాయాల్సిన అవసరం ఉందని శ్రీవరుడి రాజతరంగిణి అడుగడుగునా స్పష్టం చేస్తూంటుంది.

ఈ శ్లోకంలో గమనించాల్సిన మరో విషయం ఉంది. సయ్య భాండపతి బౌద్ధుడు. విహారాలు నిర్మించాడు. ‘లక్ష్మ’ అతడి సోదరుడు. ఆయన గణేశ మందిరం నిర్మించాడు. అంటే, ఒకే కుటుంబంలోని సోదరులిద్దరూ వేర్వేరు ధర్మావలంబులు. ఒకటే కుటుంబంలో అన్న బౌద్ధుడు, తమ్ముడు హిందువు.

‘తెలంగాణా’లో నిజామ్ పాలన సమయంలో, హిందువులపై పలురకాల వివక్షల వల్ల తినటానికి తిండి లభించే పరిస్థితులుండేవి కావు. మతం మారితే వెంటనే వారికి తిండి దొరికేది. అందుకని ఇంట్లో ఒకరు మతం మారేవారు. ముఖ్యంగా హరిజన కుటుంబాలలో ఇది అధికంగా జరిగేది. ఒకరు మతం మారినా ఆ కుటుంబంలో మిగతా అంతా హిందూ ధర్మం పాటించేవారు. మతం మారిన వాడివల్ల కుటుంబానికి తిండి దొరికేది. ఇలా మతం మారిన వాడికి ఇంటి బయట విస్తరి వేసి తిండి పెట్టేవారు. దూరం ఉంచేవారు. ఈ పరిస్థితిని కె.ఎం. మున్షీ ‘The End of an Era’ పుస్తకంలో వర్ణించాడు. ఈ పుస్తకం తెలుగు అనువాదం ‘నిజాం పాలన చివరి రోజులు, నా హైదరాబాదు జ్ఞాపకాలు’లో పేజీ నెం. 74లొ ఈ ప్రస్తావన ఉంది.

ఇలాంటి పరిస్థితి హాస్యం కలిగించేది. మతం మారిన వ్యక్తి గడ్డంతో, టోపీతో, ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా కూర్చునేవాడు. అతని భార్య కూడా దూరం నుంచే వడ్డించేది. మతం మారిన వ్యక్తి తన పిల్లలకు తండ్రి అయినా, మతం మారినందుకు దూరం పెట్టేది భార్య. భార్య హిందువుగానే ఉండేది. అతను అవసరార్థం ముస్లింగా ఉండేవాడు.

ఇలాంటి పరిస్థితి క్రిస్టియానిటీ వల్ల చైనా, జపాన్‌లు కూడా ఎదుర్కున్నాయి. ఒకే ఇంట్లో ఒక వ్యక్తి బౌద్ధుడిగా, మరో వ్యక్తి షింటోగా ఉంటే, మూడవ వ్యక్తి కన్‌ఫ్యూషియస్‌ను, నాలుగో వ్యక్తి క్రిస్టియానిటీనీ అనుసరించేవారు. కాబట్టి ఇంట్లో ఒకరు బౌద్ధాన్ని,  మరొకరు హిందూ ధర్మాన్ని అనుసరించటంలో ఆశ్చర్యం లేదు. వారు కలసి మెలసి ఉండటం, ఒకరు విహారాన్ని నిర్మిస్తె, మరొకరు దేవాలయాన్ని నిర్మించటం విశేషం. అంతేకాదు, ఇద్దరూ వ్యాపారాన్నే చేయటం ఇంకో విశేషం. ఇక్కడ కులం, వృత్తిల ప్రసక్తిలేదు.

ఈ శ్లోకంలో గ్రహించాల్సిన మరో విశేషం ‘లక్ష్మ మేర’ అనటం. ‘లక్ష్మ’ హిందువు అని తెలుస్తోంది. దేవాలయం నిర్మించాడు. ‘మేర’ అన్నది ‘మీర్’ అన్న ఇస్లామీ పదం. ఆ కాలంలొ హిందువులు సైతం తమ పేర్ల చివర తాము నిర్వహించే పదవులను సూచించే పర్షియన్, అరబిక్ పదాలను చేర్చుకోవటం ప్రారంభమయింది. హిందువులు సైతం పేరు చివర మీర్, అల్లాహ్ వంటి పదాలను చేర్చేవారు. కొన్నాళ్ళకు ఇది వారి ఇంటి పేరుగా స్థిరపడేది. వారంతా ఓ ‘కులం’లా ఏర్పడ్డారు. ‘బెంగాల్’లో ఇలాగే, హిందువులు సైతం పేరు చివర ‘ఖాన్’ చేర్చుకునేవారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ లలో ‘భూమిహార్’లు ‘ఖాన్’ పదవిని నిర్వహించేవారు. స్థానిక నాయకులను, జమీన్‌దారులను ‘ఖాన్’ అనేవారు. రాను రాను అది ‘జాతి’కి సూచక పదంగా ఎదిగింది. కశ్మీరులో ఖజుండి, సర్రాఫ్, మున్షీ, బక్షీ వంటి ఫారసీ పదాలు హిందువుల పేర్ల వెనుక జాతి, వర్గ సూచకాలుగా ఎదిగాయి.

ఈ శ్లోకంలో ప్రస్తావించిన ‘భీమస్వామి’ పూజ – హరిపర్వతానికి దక్షిణాన ఉన్న సారిక శైలం దగ్గర ఉన్న ‘శైల కుండం’ వద్ద ఈనాటికీ జరుగుతోంది. ఇది తరువాతి కాలంలో అక్బర్ నిర్మించిన ‘సరిచా దుర్గ్’ దగ్గరలోనే ఉంటుంది. భీమస్వామి గణేశుడి మందిరంలో గణేశ విగ్రహం  స్థానంలో శిల  ఉంది.

నిజానికి సుల్తానుల పాలనలో నూతన మందిరాల నిర్మాణంపై నిషేధం ఉంటుంది. పాత మందిరాలకు మరమ్మత్తులు చేయవచ్చు గానీ, కొత్త మందిరాలు నిర్మించే వీలు లేదు. సికందర్ బుత్‌షికన్ లాంటి వారైతే, పాత కొత్త లేకుండా కనబడిన మందిరాలన్నిటినీ ధ్వంసం చేశారు. జైనులాబిదీన్ కాలంలో ఈ పద్ధతికి అడ్డు పడింది. నూతన మందిరాల నిర్మాణం జరిగింది. పాత మందిరాల పునరుద్ధరణ ఎలాగో జరుగుతుంది. జైనులాబిదీన్ తరువాత  మళ్ళీ రెండేళ్ళు నూతన నిర్మాణాలకు అడ్డు పడింది. మందిరాల ధ్వంసం మొదలయింది. కానీ హసన్ షాహ, జైనులాబిదీన్ మార్గాన్ని అనుసరించటంతో నూతన నిర్మాణాలు మళ్ళీ ఆరంభమయ్యాయి. ఇతర ప్రాంతాల చరిత్రకూ, కశ్మీరు చరిత్రకు ఇక్కడ తేడా కనిపిస్తుంది. దేశంలో ఇతర ప్రాంతాలలో ఒక్కసారి సుల్తానుల కాలంలో  నూతన మందిరాల నిర్మాణం  ఆగిపోతే మళ్ళీ స్వతంత్ర్యం వచ్చిన తరువాతనో, లేక ఆయా ప్రాంతాలలో స్వతంత్రం కన్నా ముందు సుల్తానుల పాలన పోయి హిందూరాజుల పాలన వస్తేనో నూతాన మందిరాల నిర్మాణం సంభవమయింది. ఇది ముస్లిం పాలనలో ఉన్న రాజ్యాలన్నిటికీ వర్తిస్తుంది. దేశంలో అనేక నగరాలలో కొన్ని వందల సంవత్సరాల తరువాత నూతన మందిర నిర్మాణాలు స్వతంత్ర సాధన తరువాతనే సంభవమయ్యాయి. మన పాఠ్య పుస్తకాలలో సుల్తానుల పరమత సహనం గురించి, వారి వద్ద పనిచేసిన ఇతర మతస్తుల గురించి, వారి వల్ల సహాయం పొందిన ఇస్లామేతరుల గురించి చదువుతాం కానీ, సుల్తానుల కాలంలో నిర్మించిన నూతన మందిరాల విషయం ప్రస్తావన ఉండదు. జాగ్రత్తగా వెతికితే, ఒక చేతివేళ్ళపై లెక్కించగలిగే నూతన మందిరాల వివరాలు లభించటం కూడా అనుమానాస్పదమే. సుల్తానుల పాలనా కాలంలో నూతన మందిరాల నిర్మాణాలు కశ్మీరుకే ప్రత్యేకం!

దేశే అస్మిన్ విభవో భవన్ కతి నతే యైః సంచయార్థే వయః
సంనీతం న తతో మృతైరుపహతాప్యేకాకినీ కాకినీ।
సోహం లబ్ధపదః కరోమి యది నో ధర్మం ప్రతిష్ఠాదిభీ
రిక్తోయామ్యముతోచిరాదితి మతిః పుణ్యాత్మనో జాయయే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 208)

ఈ దేశంలో ఎందరో గొప్పవాళ్ళు, ధనవంతులు జీవించారు. వారు జీవితమంతా ధనం సేకరిస్తూ గడిపారు. కానీ మరణం తరువాత వారు ఒక్క పైస కూడా వెంట తీసుకెళ్ళలేదు. వారి శవాలపై ఉంచిన చిల్లర పైసలు కూడా వారు ఇక్కడే వదిలి వెళ్ళిపోయారు. ఇది గ్రహించిన తెలివైనవారు, ‘నేను ధర్మాన్ని గనుక నిర్వహించకపోతే, ఎలాగూ ఉట్టి చేతులతో వెళ్ళిపోతాను కానీ ఎవ్వరూ గుర్తుంచుకోరు’ అనుకుంటారు. మందిర నిర్మాణాలు చేపడతారు.

శ్రీవరుడి మనసులో మాట ఇది. వ్యక్తులు ఎంత ధనం సంపాదించారన్నది ప్రాధాన్యంగల విషయం కాదు. ఆ ధనాన్ని ఎలా వెచ్చించారన్నది ప్రధానం. తన సుఖలాలస కోసం వెచ్చించిన వాడిని ఎవరూ పట్టించుకోరు. ప్రజోపయోగ కార్యక్రమాలలో వినియోగించిన వారిని మెచ్చుకుంటారు. కానీ మందిరాలను, బావులను, సత్రాలను నిర్మించినవారిని వారు మరణించిన తరువాత కూడా తరతరాలు గుర్తుంచుకుంటాయి.

కోపోదీపే నరేంద్రస్య వేగాదపి సముత్థితే।
ద్విపామధోగతిర్జాతా న తు తద్వేశ్మనాం క్వచిత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 209)

రాజుకు కోపం వరదలా వస్తుంది. వరద హద్దులు దాటినా సరే, కోపం తెప్పించిన వారి గతి అధోగతే అయినా, వారి భవనాలను మాత్రం రాజు నేలమట్టం చేసేవాడు కాదు.

యో అభూద్ రాజవిరుద్ధానాం దండస్తద్ గృహలోఠనమ్।
తద్రాజ్జే ప్రభవిష్ణూనాం తద్వికల్పోగలద్ధదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 210)

రాజును వ్యతిరేకించేవారు, రాజుకు వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించేవారి ధనం, ఐశ్వర్యం హస్తగతం చేసుకున్నా, వారి భవనాలను ధ్వంసం చేసే చట్టాన్ని రాజు తొలగించాడు.

కిమన్యద్వేశ్మనిర్మాణవ్యసనే శాఖ్యుపద్రవాత్।
జాతా వనభువః శూన్యా ద్విషాం వసతయో యథా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 211)

దీని గురించి ఇంకా ఏం చెప్పాలి? గృహ నిర్మాణం కోసం అడవిలో చెట్లను నరుకుతూపోతే అడవి ఎలా శూన్యమైపోతుందో అలా శత్రుదేశాలు శూన్యమైపోయాయి.

(ఇంకా ఉంది)

Exit mobile version