[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ప్రలంబకృత కశ్మశృదన్తభ్రూ విక్రియాన్చలేః।
తారానుసారితద్భావనాట్యహాస్యకథాక్రమైః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 235)
అనేకముఖ్యవాద్యైశ్చ ప్రాణిభాషానుకారకైః।
భండిమాపండితౌ భండో మూర్తీ హాస్యరసో అభవత్ ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 236)
పొడవైన కృత్రిమ గడ్డం, మీసాలు, దంతాలు, కనుబొమల వికృతులతో, లయబద్ధంగా నృత్యం, హాస్యం చేస్తూ కథలు చెప్తూ, పలు ప్రముఖ వాయిద్యాలు, ప్రముఖుల భాషను అనుకరిస్తూండేవారు, పశుపక్షులను అనుకరిస్తూ, అందరినీ మెప్పించారు హాస్యగాళ్ళు.
ఈ శ్లోకం, ఆ కాలంలో హాస్యం పేరిట చలామాణీ అయ్యే వికృతులను ఎత్తి చూపిస్తుంది. హాస్యం సృష్టించేందుకు అప్పటి కళాకారులు వేసే పిచ్చి, వికృత వేషాలను ఎత్తి చూపిస్తున్నదీ శ్లోకం.
‘కళ’ స్థాయి, దాన్ని ఆస్వాదించేవాడి స్థాయిని బట్టి ఉంటుంది. ఆ కాలంలో రాజు మెచ్చిందే కళ. రాజులు ఉత్తమ కళను ఇష్టపడితే, కళాకారులు ఉత్తమ స్థాయి కళను సృజిస్తారు. రాజులు నీచమైన కళను ఇష్టపడితే, కళాకారుల కళా నీచతాపరిపూర్ణమయి ఉంటుంది.
ఈ శ్లోకంలో భండిమ, భండో అన్న పాదాలను వాడేడు. ‘భండిమ’ అంటే మోసం చెయ్యటం అన్న అర్థం. ఇక్కడ హాస్యగాళ్ళు హాస్యం కలిగించే రూపాలతో, పక్షులు, జంతువులు కూస్తున్నాయన్న భ్రమను కలిగించి మోసం చేసేవారన్న మాట. ‘భండిమ’ అన్న పదం లలితాసహస్రనామాలలో వస్తుంది. అక్కడ ఈ పదం సంసారం విధించే పరిమితులలో ఒదిగిన ఆత్మను సూచిస్తుంది. శ్రీవరుడు ఆ కళాకారులను పొగుడుతున్నాడో, విమర్శిస్తున్నాడో అర్థం కాని రీతిలో పొగిడాడు. సంస్కృత నాటకాలలో హాస్యగాడిని ‘విదూషకుడు’ అంటారు. ఈ విదూషకుడు సాధారణంగా బ్రాహ్మణుడే అయి ఉంటాడు. అందుకని తెలివైన హాస్య వ్యంగ్య సంభాషణలతో, వ్యక్తుల ప్రవర్తనపై, సామాజిక పరిస్థితులపై వ్యంగ్య విమర్శలతో హాస్యం సృష్టించేవారు. ఆకారం చూడగానే నవ్వు పుట్టించేటట్టుండేది. దానికి తోడు, హావభావాలు, వ్యంగ్య సంభాషణలతో ఆరోగ్యకరమైన హాస్యాన్ని సృష్టించేవారు.
సుల్తానుల కాలంలో హాస్యం రూపురేఖలు మారిపోయాయి. తెలివైన సంభాషణలు, వ్యంగ్య విసుర్ల స్థానాన్ని వికృతమైన కృత్రిమ వేషధారణలు, పశుపక్ష్య జంతువుల కూతల అనుకరణలతో హాస్యం సృష్టించటం ఆరంభమైంది.
ఇస్లాం సూత్రాల ప్రకారం వేదికపై మనుషులు, జంతువులను చూపకూడదు. కాబట్టి ఇస్లామీయుల పాలనలో నాటకాలపై అప్రకటిత నిషేధం ఉండేది. దాంతో, నాటకం రాజదర్బారును వదిలి వీధిబాట పట్టింది. చిన్న చిన్న సంస్థానాల దారి పట్టింది. సామాన్యులను తిన్నగా చేరింది. దాంతో హాస్య సృజన కూడా మారింది. రూపం చూడగానే హాస్యం కలిగించేట్టు, వెర్రి వేషాల ద్వారా, మొరటు మాటల ద్వారా హాస్యాన్ని సృజించటం ఆరంభమైంది. అంటే, నాటకం – స్థానిక, జానపదాలను అనుసరించి జీవికను సాగించింది. ఉదాహరణకు, గుజరాత్‌లో భావై, ఉత్తర భారతంలోని ‘స్వాంగ్’ తోలుబొమ్మల ఆటలు (వేదికపై మనుషులు కనబడకూడదు కాబట్టి) ఇలా రూపుదిద్దుకున్నవే.
పండితుడు, సంస్కృత భాషా ప్రవీణుడు జైనులాబిదీన్ పాలనలో ఉత్తమ అభిరుచి కల కళా ప్రదర్శనలను అనుభవించినవాడైన శ్రీవరుడు, సుల్తాన్ ‘హసన్ షాహ’ కాలంలో మారుతున్న కళా ప్రదర్శనలను హర్షించటం కష్టం. కానీ వాటిని తక్కువ స్థాయివని విమర్శించలేడు. అందుకని అటూ ఇటూ కానట్టు పదాలు వాడేడు. ఒక వైపు నుంచి చూస్తే మూర్ఖత్వం అని అర్థం వచ్చేట్టు, మరోవైపు నుంచి చూస్తే ఉత్తమ అర్థం వచ్చేట్టు రచించాడు శ్రీవరుడు.
మల్లాహస్సననామాపి పితురభ్యధికో గుణీ।
ప్రథమం దశతన్త్రీకాం మోదవీణామకారయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 237)
తండ్రి కన్నా అధిక ప్రావీణ్యం కల ముల్లా హసన్, మొదటి పది తంత్రుల వాయిద్యం ‘మోదవీణ’ను తయారు చేశాడు.
పన్నెండు తంత్రులు కల వీణ ఇది. మధ్య యుగంలో మోదవీణ అనేవారు. దీన్ని కశ్మీరు సుల్తాన్ హసన్ షాహ తయారు చేశాడని శ్రీవరుడు చెప్తున్నాడు.
భాషాభిగీత సామగ్రీం పారసీగీతకౌశలమ్।
తుంబవీణాధరః సోహం నృపాజ్ఞప్తోప్యదర్శయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 238)
రాజు ఆదేశాన్ని అనుసరించి, తుంబ వీణాధారినై, నేను, ఫారసీ గీతాలను, స్థానిక గీతాలను వినిపించటంలో నా కౌశలాన్ని ప్రదర్శించాను.
ఈ శ్లోకం సంగీత చరిత్ర రచయితలకు ఉపయోగపడే శ్లోకం.
భారతీయుల సంగీతం, ఇస్లామీయుల సంపర్కంతో రూపాంతరం చెందుతూండటానికి చక్కని నిదర్శనం ఈ శ్లోకం. ఫారసీ సంగీతం, సాంప్రదాయ సంగీతం కలిసి నూతన సంగీత మార్గానికి దారి తీసిందనేందుకు ఈ శ్లోకం చక్కని నిరూపణ.
కశ్మీరులో సుల్తానుల దర్బారు సంగీతంపై పర్షియన్, మధ్య ఏషియా సంగీత ప్రభావం అధికంగా కనిపిస్తుంది. ‘సూఫియానా సంగీతం’ అధికంగా వినిపించేది కశ్మీరులో. జైనులాబిదీన్ కాలంలో, పర్షియన్ సంగీతం, సంప్రదాయక సంగీతం, కశ్మీరు ప్రాంతీయ సంగీతం దేనికి అదే తన ప్రత్యేకతను నిలుపుకున్నది. ప్రతి సంగీతానికీ తనదైన ప్రత్యేక వాయిద్యాలు, గాన సంవిధానం ఉంటాయి. కానీ రాను రాను ఈ విభిన్నమైన సంగీత పద్ధతుల నడుమ ఎల్లలు కరిగిపోతున్నాయని శ్రీవరుడు తుంబవీణపై పర్షియన్ గీతాలు వాయించటం సూచిస్తుంది. ఆ కాలంలో కశ్మీరీ సంగీతంలో భారతీయ రాగాలతో, పర్షియన్ ‘మకామ్’ సంగీతం మిళితమై ఉండేది.
‘మకామ్’ అన్నది అరబిక్, మధ్య ఆఫ్రికా, ఉత్తర ఆఫ్రికా సంగీత పద్ధతి. పదాలను పలకటం, స్థాయి, అలంకారాలు, ఆరోహణ, అవరోహణల వంటివి ప్రత్యేకం. ఈ ‘మకామ్’ సంగీతాన్ని తుంబవీణపై వినిపించాడు. శాస్త్రీయ సంగీతంలో నిష్ణాతుడైన శ్రీవరుడు అతి సులభంగా ఈ కొత్త సంగీత పద్ధతిని ఆకళింపు చేసుకున్నట్టున్నాడు. బహుశా, ఆ కాలంలో శాస్త్రీయ సంగీత విద్వాంసులు శ్రీవరుడిని దూషించి ఉంటారు, సంగీతాన్ని కలుషితం చేస్తున్నాడని, అపవిత్రం చేస్తున్నాడని. కానీ రాజాదరణ ఉండటం వల్ల శ్రీవరుడు నెట్టుకొచ్చి ఉంటాడు. రాజు ముందు తన కౌశలాన్ని ప్రదర్శించానని చెప్తున్నాడు.
గాథాగీతప్రియో రాజా స్వయం సంస్కృత పద్యవిత్।
నాదశంసామయం శ్లోకం రాగాలప్త్యేమమబ్రవీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 239)
శుష్కా యేన సముల్లసన్తి తరవో వశ్యా భవేయుమృగా
పత్రే చావతరన్తి దైవతగణా జల్పన్త్యదృష్టా అపి।
యో దుఃఖే చ సుఖే చ మూర్ఖవిదుషోర్వాలస్య వృద్ధస్య వా
ప్రాయః ప్రీతికరో మమాస్తు సతతం శ్రీనాదనామా రసః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 240)
గాథాగీతాలు, సంస్కృత పద్యవేత్త అయిన రాజు స్వయంగా ఈ శ్లోకం గానం చేశాడు. సంగీతం వల్ల వాడిన వృక్షాలు వికసిస్తాయి. క్రూర జంతువులు సాత్వికమై వశమౌతాయి. దేవతాగణాలు దిగివస్తాయి. మూర్ఖులు, విద్వాంసులు, పిల్లలు, వృద్ధులు అందరినీ సుఖదుఃఖాలలోనూ ఆనందింపచేసే శ్రీనాదమని పేరు కల సంగీతం నాకు చాలా ఇష్టం.
కశ్మీరు సుల్తానుల చరిత్రలో స్వయంగా విద్వాంసులు, రచయితలు, సాహిత్య ప్రేమికులు అయిన సుల్తానులు ఇద్దరే. ఒకరు జైనులాబిదీన్, రెండవవారు హసన్ షాహ. వీరు సంస్కృతం కూడా తెలిసినవారు. సంస్కృతంలో పద్య రచన చేశారు. పాటలు రాయటమే కాదు, స్వయంగా పాడేవారు కూడా.
సంగీతానికి నాదం ప్రాణం. నాదం వల్ల రసోత్పత్తి సంభవిస్తుంది. సంగీతం వల్ల ఉత్పన్నమయ్యే శుద్ధ ఆనందాన్ని ఈశ్వరుడి మరో రూపుగా, నాదబ్రహ్మగా భావిస్తారు. అందుకే నాదం ద్వారా ఉత్పన్నమయ్యే రసం తనకు ఇష్టం అన్నాడు సుల్తాన్.
శ్రవ్యకంఠే నృపో గీత్వా రాగైకాలప్తితో బహూన్।
రాగాన్ సమోచ్చగీతాంశ్చ సాశ్చర్యాన్నస్తదాకరోత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 241)
ఆ సమయంలో రాజు మధుర కంఠంతో రాగంలో ఒక ఆలాపన చేశాడు. ఉచ్చస్థాయిలో పాడి మమ్మల్నందరినీ చకితులను చేశాడు.
‘ఉచ్చస్థాయి’లో పాడటం – కర్ణాటక సంగీతం కన్నా పర్షియన్ సంగీతం ప్రభావం అధికంగా ఉన్న హిందుస్తానీ సంగీతంలో అధికం. ఇక్కడ రాజు సరైన సమయంలో, సరైన స్థానంలో ఉచ్చస్థాయిలో ఆలాపన చేసి అందరినీ ఆశ్చర్యచకితులను చేశాడని రాశాడు శ్రీవరుడు. కర్ణాటక సంగీతంలో ఒక్కో మెట్టు ఎక్కినట్టు క్రమ పద్ధతిలో ఉచ్చస్థాయికి వెళ్ళటం ఉంటుంది. కానీ పర్షియన్ సంగీతంలో అలలు ఎగసిపడ్డట్టు హఠాత్తుగా ‘హై పిచ్’కి వెళ్ళటం, వెంటనే ‘లో పిచ్’కి వచ్చేయటం ఉంటుంది.
సాధారణంగా ఏ సమాజంలో అయినా అధికారం ఉన్నవాడు చెప్పింది ప్రామాణికం అవుతుంది. దాన్ని సమాజం అనుసరిస్తుంది. స్వయంగా రాజు పాడి మెప్పించిన పాట పాడే విధానం కశ్మీరీయులందరూ అనుసరించి రాజును మెప్పించాలని ప్రయత్నిస్తారు. ఇది స్వాభావికం. దాంతో అప్పటికే ప్రచారంలో ఉన్న గాన సంవిధానాలు కొంతకాలం చలామణీలో ఉన్నా, రాను రాను రాజు పాడిన విధానం అధికంగా చలామణీలోకి వస్తుంది. ఈ రకంగా పద్ధతులు మారిపోతుంటాయి.
అథ గాయనవృందం తత్ ప్రవేశయ మమాగ్రతః।
గీతాంగాధిపతేరాజ్ఞా మదాన్మే నృపనాయకః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 242)
‘వృంద’ గాయకుడిని నా సమ్ముఖంలో ప్రవేశపెట్టమని రాజు గీతాంగాధిపతికి ఆదేశం ఇచ్చాడు.
ఆనీయ స్థాపితాః సర్వే నామగ్రాహం నివేద్య చ।
తే తే వహావదేనాద్యాః సర్వాద్యా వృందనాయకాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 243)
రాజు ఆజ్ఞను పాలించి వహాబుద్దీన్‌నూ, ఇతర వృంద నాయకులను రాజుకు పేరు పేరునా పరిచయం చేశాను.
నిర్దోష కంఠసంజ్ఞాతమంజులధ్వనిరంజకాః।
అధీతగీతబద్ధాత్తమాత్తద్రవకమట్టకాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 244)
శిక్షాకారాదయః పంచ స్వప్రపంచాతిచంచలః।
అముంచన్ పంచవ్యాజాత్ పంచేషు రససంచమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 245)
ఎలాంటి దోషం లేని కంఠం నుండి వెలువడిన ధ్వనితో జనరంజకం, ఉత్తేజపరిచే గీతాలను గానం చేసి, ప్రజల హృదయాలను ద్రవింపచేసే గీతాలను గానం చేశారు. అయిదు రాగాలను గానం చేయటం ద్వారా ప్రపంచంలో మన్మథుడి ప్రభావాన్ని పెంచారు వారు.
వారి గానాన్ని వివరిస్తూ శ్రీవరుడు చమత్కారంగా పంచమ స్వరంలో పాడి, వారు, పంచబాణాలను ప్రసారం చేశాడు అని రాశాడు. ‘పంచస్వరం’ అంటే సరిగమలలో ‘ప’.
భారతీయ సంగీత శాస్త్రం ప్రకారం ఈ స్వరానికి వర్ణం బ్రాహ్మణ, రంగు శ్యామవర్ణం, దేవత శివుడు, రూపం ఇంద్రతుల్యం, స్థానం క్రౌంచ ద్వీపం. ఒక్కో స్వరానికి ఇలా వర్ణం, రంగు, దేవత, రూపం ఉంటాయి. ప్రతి స్వరానికీ మూర్ఛనలుంటాయి. వీటిని యమలి, నిర్మలి, కోమలి అంటారు. వీటిల్లో ఇప్పుడు ‘యమలి’ గురించి అంతగా తెలియటం లేదు. నిర్మలి, కోమలినే అమలులో ఉన్నాయి.
భరతముని ప్రకారం ఈ స్వర ఉచ్చారణలో నాభి, ఊరువు, హృదయం, కర్ణం మూర్ధ స్థానాలలో వాయు స్పర్శ సంభవిస్తుంది. ఈ స్వరం పలకటంలో ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన వాయువులు ఒకేసారి కలిసి స్పందిస్తాయి. అందుకని దీన్ని పంచమ స్వరం అంటారు. పంచమ స్వరం గాన సమయం శరదృతువులో ప్రాతః కాలం. పంచమ రాగాలు ఆరు. అవి: విభాషా, భూపాలీ, కర్ణాటీ, వరహంసిక, మాలవీ, పటమంజరీ రాగాలు.
శ్రీవరుడి సంగీత పరిజ్ఞానం ఈ శ్లోకాలలో తెలుస్తూంటుంది. ఆయన స్వయంగా గాయకుడు. సంగీత జ్ఞానం ఉన్నవాడు. వాద్య విద్వాంసుడు. కాబట్టి, ఇతరుల గానం గురించి సరిగ్గా అంచనా వేయగలవాడు. రాజు ఆమోదం పొందినవారి గానాన్ని ఆమోదించక తప్పదు. ఇది ఆయన రచనలో తెలుస్తుంది.
భారతీయ సంప్రదాయ సంగీతం మోక్షకారకం. మోక్షానికి మార్గం. అంటే సంగీతం పాడేవారు, ఆ సంగీతాన్ని అనుభవించేవారు ఇద్దరూ రసానుభూతి ద్వారా పరమానందం అనుభవిస్తారన్న మాట. కానీ ఇక్కడ వారు పంచమ స్వరంలో పాడుతూంటే పంచబాణాల పరంపర విస్తరిస్తోంది. అంటే లైంగిక భావనలు విస్తరిస్తున్నాయన్న మాట. ఇది భారతీయ సంగీత లక్షణం కాదు. శారీరిక వాంఛలు, భౌతిక సుఖాల లాలస వదిలితేనే మోక్ష మార్గం లభిస్తుంది. కాబట్టి వీరు పాడే సంగీతం మోక్షదాయని కాదు. ఇది ఉత్తమ స్థాయి సంగీతం కాదు. ఈ సత్యాన్ని శ్రీవరుడు చెప్పకనే చెప్తున్నాడు. పైపైన చదివే వారికి వారు పాడుతున్న సంగీతం గొప్పగా ఉంది. ప్రజలను సమ్మోహితులను చేస్తున్నది. కానీ అర్థం చేసుకున్నవారికి శ్రీవరుడి నిరసన, ఆ సంగీతం పట్ల తూష్ణీం భావం తెలుస్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
