[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సంగీతజ్ఞ నృపం తం తే శ్రుత్వైవం తత్సముత్సుకాః।
గీతే శబ్దగుణాః పంచదశసఙ్ఖ్యా స్థితి వ్యధుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 246)
ఈ రకంగా సంగీతజ్ఞులు అయిన గాయకుల స్వరాల నుండి వెలువడిన గీతాలు అందరినీ సమ్మోహితులను చేశాయి. వారు పదిహేను రకాల విభిన్నమైన గీతాలు పాడి మెప్పించారు.
గీతాలు పలు రకాలు. ధాతువు, మాత్రల అధారంగా గీతాలను విభజిస్తారు. పైపైన చెప్పుకోవాలంటే వైదిక గీతాలు, లౌకిక గీతాలు అని గీతాలు రెండు రకాలు. వైదిక గీతాలు సామం. అవి సంపూర్ణ గీతాలు. మార్గ లేక దేశీ గీతాలు అని లౌకిక గీతాలలో రెండు రకాల గీతాలున్నాయి. రాగ, రాగిణిలతో ఉన్న గీతాలు మార్గ గీతాలు. దేశీ గీతాలు జానపద గీతాలు. దాదరా, ఠప్పా, గజల్, కవ్వాలీ, కజేరీ, వంటివన్నీ దేశీ గీతాలు. అయితే, దాదరా, ఠప్పాలు శ్రీవరుడి కాలంలో లేవు. కవ్వాలిలు, గజళ్లు అప్పుడే ప్రచారానికి వస్తున్నాయి. కాబట్టి గాయకుడు రాగ రాగిణిలతో పాటు స్థానిక జానపద గీతాలు, ఇస్లాం ప్రభావంతో ప్రచారానికి వచ్చిన కవ్వాలిలు, గజళ్లు, పాడి మెప్పించారని అనుకోవచ్చు.
ఆ కాలంలో రాజు మెప్పు పొందేందుకు కశ్మీరు ఆస్థానంలో గాయకులు కొత్తగా వస్తున్న గాన సంవిధానాలను అధ్యయనం చేసి, పాడటం నేర్చుకుని ఉంటారు. లేకపోతే, కొత్త కొత్త గాన సంవిధానలతో దర్బారుకు వచ్చే గాయకుల ముందు వారు తేలిపోతారు. బహుశా, శ్రీవరుడు కూడా అలాగే నేర్చుకుని ఉంటాడు. అందుకని వారు ఎన్ని రకాల పాటలు పాడేరో కూడా చెప్పగలుగుతున్నాడు.
కేదారగౌడగాన్ధారదేశభంగాలమాలవాః।
కర్ణాదా గాయనా రాజ్ఞో రాగాశ్చాప్యస్ఫురన్ పురః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 247)
రాజు సమక్షంలో కర్ణాట సంగీత గాయకులు కేదారగౌడ, గాంధర, దేశ, బంగాల, మాళవ రాగాల గీతాలను పాడేరు.
వారు పాడిన ఈ రాగాలు కూడా శ్రీవరుడికి తెలుసన్న మాట.
మదనోద్దీపితా రాత్రౌ నవ్యభావ్యదశోజ్జ్వలాః।
అశోభన్తానుగా రాజ్ఞో లాసికా దీపికా అపి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 248)
రాత్రి సమయంలో నూతన భావాలతో మదనోద్దీపిత దశలో సముజ్జ్వలమైన రాజ నర్తకిలు, దీపికలవలె శోభాయమానమయ్యాయి.
అందమైన నాట్యగత్తెలు వెలుగుతున్న దీపాల్లా శోభాయమానమయ్యారు. వారు మదనోద్దీపితులైనట్టున్నారు.
శ్రీవరుడు ఈ శ్లోకంలో వాడిన పదాలు మదనోద్దీపిత అంటే మదనుడి వల్ల ఉత్సాహం పొందినవారు అన్న అర్థం వస్తుంది. ఉద్దీపితమంటే వెలుగుతున్నారు అన్న మరో అర్థం ఉంది. మరో అర్థం ‘మండటం’ అని కూడా ఉంది.
‘దశోజ్జ్వల’ అన్న దాన్లో దశ అంటే ‘వొత్తి’ అన్న అర్థం వస్తుంది. ‘దశ’ అన్న అర్థం వస్తుంది. మదనుడి వల్ల జ్వలితమైన నర్తకిల దశ వెలుగుతోందని అనుకోవచ్చు. మదన దీపం ప్రజ్వలిస్తోంది వారిలో అనీ అనుకోవచ్చు. ‘దీపిక’ అంటే ‘దీపస్తంభం’ అన్న అర్థం వస్తుంది. ‘దీపిక’ అన్నది హిందోళ రాగానికి పత్నిలాంటి రాగం కూడా కావచ్చు. ఈ రకంగా రెండు మూడు అర్థాలు వచ్చే పదాలు వాడి, ఏ అర్థమైనా నర్తకిల గొప్ప నృత్య ప్రదర్శనం, ఆ ప్రదర్శన ద్వారా వారు ఉద్దీపింప చేస్తున్న కామభావనలను స్పష్టం చేస్తుంది.
ఇక్కడ మరో విషయం గమనించాలి. భారతీయ నృత్యంలో శృంగారం ఒక ప్రధాన రసమయినా, ఈ శృంగారం భక్తులు, భగవంతుల నడుమ ముక్తికి, భగవంతుడితో లయమయ్యేందుకు దారి చూపే శృంగారమే తప్ప, మదన భావనలను ఉద్దీపింప చేసే నృత్యం కాదు. ఇస్లాంలో బహిరంగంగా లైంగిక భావనలను ఉద్దీపింప చేసే నృత్యాలు కానీ, లైంగిక సూచనలున్న నృత్యాలు కానీ ఆమోదయోగ్యం కాదు. అవి నిషిద్ధాలు. మరి సుల్తానుల ముందు చేసే నృత్యంలో లైంగిక భావనలను కలిగించే నృత్యాలు ఎలా వచ్చాయి?
భారతీయ నృత్య కళా పరిణామక్రమాన్ని అధ్యయనం చేసిన వారి ప్రకారం ప్రాచీన భారతంలో నృత్యంలోని లైంగిక సూచనలన్నీ ఆధ్యాత్మికపుటాలోచనల ప్రతీకలు. అవి ప్రదర్శించే శృంగారం దేవతల శృంగారం. అది ఉన్నత స్థాయిలో ఉండి ఉత్తమ ఆలోచనలు కలిగించేది తప్ప లైంగిక ప్రచోదనలకు కారణం అయ్యేది కాదు. మధ్యయుగంలో నృత్యం మందిరాల నుండి, పవిత్ర సంబరాల నుండి సుల్తానుల దర్బారుల్లో ప్రవేశించింది. అందకు ముందు గణికలు, వేశ్యల వ్యవస్థ ఉన్నా, వారి నృత్యాలు కూడా ఉత్తమ స్థాయిలో ఉండేవి. భగవంతుడి భావనలతో ఉండేవి.
దర్బారుల్లో భగవంతుడి గురించిన నృత్యాలు కుదరవు. దాంతో నృత్యాలలోని శృంగార భావనలలో లైంగికత ప్రస్ఫుటమయింది. గతంలో భగవద్భావన క్రింద అణగి ఉన్న లైంగిక భావనలు ఇప్పుడు పెల్లుబికి వచ్చాయి. భక్తి భావనను ముంచెత్తాయి. అందుకే శ్రీవరుడు ‘నవ్య భావనలు’ అన్నాడు.
అంతకు ముందూ నృత్యం ఉండేది. నర్తకిలుండేవారు. కానీ వారి ద్వారా ప్రదర్శితమయ్యే భావనలు వేరు. ఇప్పుడు ప్రదర్శిమయ్యే మదనోద్దీపిత భానలు ‘నవ్య భావనలు’.
ఇస్లాంలో నృత్యాలకి అంత ప్రాధాన్యం లేకపోవటంతో, ఆ కాలంలో నర్తకిలందరూ ఇస్లామేతరులే. భారతీయ మహిళలే. వారు నృత్యాలు చేయటం పట్ల ఎవరికీ అభ్యంతరాలుండేవి కావు. వారు భక్తి నృత్యాలు కాక, లైంగిక భావ ప్రేరేపిత నృత్యాలు చేస్తేనే అందరూ మెచ్చగలిగేవారు. ఆ రకంగా అంతర్లీనంగా ఉన్న శృంగార భావనలు బహిరంగం అయ్యాయి.
బ్రిటిష్ వారు వచ్చే సమయానికి ‘నృత్యం అంటే ఇదే’ అన్న భావన స్థిరపడింది. దేవదాసి వ్యవస్థ దిగజారింది. జమిందార్ల వ్యవస్థ ఆరంభమయింది. దాంతో నృత్య పద్ధతులు మారేయి. బ్రిటిషర్లు రంగప్రవేశం చేసే సమయానికి తురుష్క సంపర్కంతో రూపాంతరం చెందిన భారతీయ వ్యవస్థ వారికి కనిపించింది. వారు దీన్ని ప్రాచీన కాలం నుంచీ ఉన్న వ్యవస్థగా భావించారు.
గమనిస్తే తురుష్క ప్రవేశం కన్నా ముందు నృత్యగత్తెలకు ఎంతో గౌరవం ఉండేది. బౌద్ధులలో ‘అమ్రపాలి’ ఇంట్లో బుద్ధుడు భోజనం చేశాడు. సంఘానికి ఆమె దానాలు ఇచ్చింది. ‘మిళింద పన్నా’లో ‘బిందుమతి’ ప్రసక్తి వస్తుంది. ఆమె సత్యసంధత, గంగానదినే వ్యతిరేక దిశలో ప్రవహించేట్టు చేసింది. జైనులలో ‘కోశ’ అనే నర్తకి ప్రసక్తి వస్తుంది.
ఉత్తర ప్రదేశ్ లోని మధుర ‘కంకాలి తిల’ వద్ద రెండవ శతాబ్దికి చెందిన శాసనాలు దొరికాయి. వాటి ప్రకారం అదా, నాదా, వాసు, లోనబోభిక అనే నర్తకిలు జైన అర్హతుడి జ్ఞాపకార్ధం జైన మందిరాలు కట్టించారు. కర్ణాటకలోని ‘సన్నతి’లో లభించిన శాసనం ప్రకారం గాలిదాసి, అర్యదాసి అనే నటి, నటికలు బౌద్ధ అరామాలు నిర్మించారు.
ఏడవ శతాబ్దంలో ‘బూట’ అనే గణిక ‘దుర్గ’ మందిరాన్ని నిర్మించింది. చోళ సామ్రాజ్యంలో ‘అనుక్కయర’ పరావై కల్కియారా’ అనే నర్తకి ‘తిరవరూర’ మందిరానికి బంగారు ఆభరణాలతో సహా పలు విలువైన వస్తువులను దానం చేసింది. పండర్‌పుర్‌లో దొరికిన శాసనాల ప్రకారం విఠనాయకాచి, పండితాచి నాయకి హీరాతో సహా వంద పైగా నర్తకిలు విఠోబా మందిరానికి విలువైన వెన్నోదానాలు చేశారు. 5 నుండి 13 శతాబ్దాల కాలంలో ఎందరో నర్తకులు ‘దేశభోగ’ (భూమి) అక్షయ దానం వంటి దానాలు అనేకం, అత్యంత విరివిగా హిందూ బౌద్ధ, జైన దేవాలయాలకు చేశారు. ఇక రాజనర్తకుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘నందవ్వ’ ‘పాలియక్క’ ‘చామెరాంబ’ వంటి వార్ల పేర్లు దక్షిణ భారత చరిత్రలో అనేక దానాలు చేసిన ప్రధాన నర్తకిల పేర్లు.
13వ శతాబ్దం నుంచీ ఒక్క‘ విజయనగరం’ వదిలేస్తే, దేశంలో మిగతా ఏ సామ్రాజ్యంలో కూడా దాన ధర్మాలు చేసిన నర్తకుల పేర్లు కనబడవు. దానికి ప్రధాన కారణం తురుష్కులు, అరబ్బులు, అప్ఘన్లు, మంగోలులు ఇలా పలు దోపిడీదార్లు దేశంలో స్థిరపడటం. వీరికి నృత్యం లైంగిక చర్యకు ప్రేరేపణతప్ప ఆధ్యాత్మికతకు దారి కాదు. దాంతో నాట్యం, నర్తకిల విలువ దిగజారింది. వారి ఐశ్వర్యం అదృశ్యమయింది. వారే భుక్తికి ఎవరిమీదనో ఆధారపడేప్పుడు, ఇక దానధర్మాల ఆలోచనే కుదరదు.
ఇస్లాం ప్రపంచంలో ‘లైంగిక చర్య’ నేరం కాదు. దాంతో భారతీయ నృత్యాలలో ‘లైంగికత’ ప్రదర్శనకు ప్రాధాన్యం వచ్చింది. జీవిక కోసం, మారుతున్న కాలంలో నృత్యం, నర్తకులు మారక తప్పదు. బ్రిటీష్ వారికి భారతీయ నృత్యంలో లైంగికత నచ్చలేదు. క్రిష్టియన్ మతం ప్రకారం ‘లైంగికత’ పాపం, నేరం. ఆదమ్, ఏవ్ లు ఆ పాపం చేసి స్వర్గంలో స్థానం పోగొట్టుకున్నారు. అధికారం సాధించిన తరువాత ఆంగ్లేయులు, భారతీయ నృత్యాలను , దేవదాసి వ్యవస్థను అనాగరికంగా అసహ్యంగా భావించారు. సంస్కరణలు ఆరంభించారు. ముఖ్యంగా 1857 ప్రథమ స్వాతంత్ర పోరాటం సమయంలో నర్తకులు, వేశ్యలు, విప్లవ సైన్యాలకు సహాయం చేయటం, గూఢచారులుగా వ్యవహరించటం, బ్రిటిష్ సైనికాధికారుల గుట్టమట్లు విప్లవకారులకు చేరవేయటం వంటి చర్యలు బ్రిటీష్ వారికి వీరి పట్ల ఆగ్రహం కలిగించాయి. ఫలితంగా అధికారం సుస్థిరం కాగానే వారు నాట్యాలను అశ్లీలంగా ముద్ర వేసి ఇవన్నీ చట్ట వ్యతిరేకమైన చర్యలుగా తీర్మానించారు. మందిరాలపై వీరి హక్కులను తొలగించారు. వీరంతా నైతికపరంగా భ్రష్టులని, వారి పనులు చట్ట విరుద్ధం అని నిశ్చయించారు. బ్రిటీష్ వారి మెప్పు కోసం వారిని కొందరు హిందువులు, ముస్లింలు సమర్ధించారు. ఇందువల్ల, ఈనాటికి కూడా నృత్యం గురించి, దేవదాసీల గురించి, నర్తకుల గురించి అపోహలు పోలేదు. ఇప్పుడు కూడా వారిని తక్కువ చేసి చూపుతూనే ఉన్నారు. చరిత్ర సరిగ్గా తెలియని వారు, విదేశీయుల సంపర్కం వల్ల మన సమాజం ఏ రకంగా రూపాంతరం చెందిందో అధ్యయనం చేసి నిజానిజాలు ప్రకటించే వారి స్వరాలు అణచి వేస్తూనే ఉన్నారు.
రత్నమాలా దీపమాలారూపమాలాఙ్కితాభిఘా।
అకుర్వన్లామికా లాస్యం హావభావ మనోహరమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 249)
రత్నమాలా, దీపమాలా, రూపమాలా అన్న పేర్లు గల ‘లాసికలు’ హావభావాలతో మనోహరమైన నృత్యాలు ప్రదర్శించారు.
‘లాసిక’లు అంటే నర్తకిలు, వేశ్యలు, స్వేచ్ఛా చారిణులు అన్న అర్థాలున్నాయి. వీరు మనోహరమైన నృత్యం ప్రదర్శించారన్న మాట. ‘లాస్య నృత్యం’లో అనేక భంగిమలుంటాయి. అవయవాల సంచలనం ఉంటుంది.
ఝంపాకంపాకులాగ్రప్రసరసరసతాఘారసర్వాంగహార-
ప్రారబ్ధాశాస్యలాస్యోత్తరతరలలసద్ధావభావానుభావా।
ఉత్కంఠాకారికంఠోద్గతసతతతతస్ఫీతగీతప్రపంచా
పాత్రీయం రమ్యగాత్రీ లసతి సతిలకా కీదృశీ రత్నమాలా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 250)
హావభావాలతో, శరీర కంపనాలతో, కనుబొమల ముడితో సర్వాంగాలలో మనోహర సరసతా ధారతో అందరూ కోరి ఆనందించే నృత్యం ప్రారంభం నుంచి అందరినీ ఆకట్టుకుని, ఉత్కంఠ కలిగించే ఆమె కంఠం నుంచి నిరంతరం ప్రజలు మెచ్చే గీతాలు వెలువడే ఆమె, తిలకం దిద్దుకుని రత్నమాల వేసుకున్న ఆమె అందరి మనసులను దోచుకుంది.
శ్రీవరుడు వాడిన పదాలను గమనించాల్సి ఉంటుంది. ‘ఝంపా’ అంటే ఎగిరి దూకటం, ‘కంప’ అంటే కంపనం. భావానుభావంలో భావం మనోగతం. అనుభవం, దృష్టి ద్వారా పంపే సంకేతాలు.
ఈ శ్లోకం చదువుతుంటే కనులలోన, కనుబొమలలోన, అధరమ్ములోన, వదనమ్ములోన, గళసీమలోన, కటిసీమలోన, కరయుగములోన, పదయుగములోన,నీ తనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి నర్తనమాడేవారని అర్థమవుతుంది. శ్రీవరుడు వారి ప్రతి కదలికను, ప్రతి భావాన్ని గమనించి, అర్థం చేసుకున్నాడని కూడా అర్థమవుతుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
