[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
గుణిమదతృణదాత్రీ ప్రేక్షకానందదాత్రీ
నవకరణవిధాత్రీ రూపలావణ్యధాత్రీ।
కలితలలితగాత్రీ శుద్ధ సంగీతగాత్రీ
గుణగణమణిపాత్రీ రూపమాలైవ పాత్రీ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 251)
పండితులకు తన్మయత్వము, ప్రేక్షకులకు ఆనందాన్ని కలిగిస్తుంది నూతన లయల సృష్టికర్త్రి. రూపలావణ్యాలకు పెట్టింది పేరు. లలితమైన గాత్రం కలది. శరీరం శుద్ధ సంగీతం లాంటిది. గుణగుణాలనే మణులు కలది. ఇవన్నీ కలది కేవలం రూపమాలతో మాత్రమే ఆమెతో పోలిస్తే ఇతరులంతా గడ్డిపోచల్లాంటివారు. రూపమాల అనే గాయని వర్ణన ఇది. ఆమె అందరినీ మైమరింపచేసింది.
యస్యా ముఖం హిమరుచిర్నను యద్విధాత్రా
సంపూర్ణపర్వమవశేపతయాత్ర ముక్తః।
ఆశ్యానతాముపగతోస్య రుచాయమాస్తే
నాసాగ్రమౌక్తికమిపాదమృతస్య బిందుః ముక్తః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 252)
ఆమె వదనం చంద్రబింబం. ఆమె వదనంలో విధాత పూర్ణచంద్ర కాంతి సర్వం నిక్షిప్తం చేశాడు. ఆమె ముక్కుకొసన అమృత బిందువు ముత్యంలా నిలిచి ఉంది.
ఆసాం కర్ణాలికప్రోతలంబిముక్తాఫలచ్ఛలాత్।
ముఖేందోర్నిర్గతాం నూనం లావణ్యామృతబిందవః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 253)
ఈ నర్తకిల చెవులు, తలలపై వ్రేలాడుతున్న ముత్యాలు వారి శిరోజాల నడుమ ఊగుతూ బుగ్గలపైకి అమృతంలా జారుతున్నాయి. వారి బుగ్గల నుండి అమృతం జాలువారుతున్నట్టుంది.
నల్లటి కురుల సందులలో తెల్లటి ముత్యాలు సుందరమైన వృక్షానికి పళ్ళున్నట్టు అనిపిస్తున్నాయి. నవ యవ్వన సుందరీమణులను శ్రీవరుడు రసిక హృదయంతో వర్ణిస్తున్నాడు.
ఇత్యాది శంసాం కుర్వాణో నృపతిర్నవయౌవనః।
లీలామిత్రైః సమం తాభ్యో మద్యపాత్రమగాహత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 254)
ఇలా నర్తకిలను ప్రశంసిస్తూ రాజు తన స్నేహితులతో కలసి నర్తకిల హస్తాల నుండి మద్య పాత్రను గ్రహించాడు.
సుల్తాను నర్తకిలను ఏమని పొగిడాడో తెలియదు కానీ, శ్రీవరుడు మాత్రం ఉన్నతంగా, సంస్కారయుతంగా, తీవ్రమైన గౌరవంతో వారిని వర్ణించాడు.
తత్తత్కలా పరిచయే కవివాక్ప్రపంచే
పంచేషు సంచయ నిభాసు వరాంగనాసు।
సంగీతచర్వణవిధౌ వసుధా నృభోగే
ధన్యా నృపాః ప్రతిదినం వ్యసనం భజన్తే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 255)
ఆయా కళలను చూసి ఆనదించటంలో, వాక్ప్రపంచంలో పంచబాణాల వంటి వారాంగనలతో సంగీతాన్ని అనుభవిస్తూ, భూమిపై శరీరంతో ఎన్ని భోగాలు అనుభవించవచ్చో అన్ని భోగాలు అనుభవించటం రాజుకు వ్యసనంగా మారింది.
‘షోలే’ సినిమాలో అమితాభ్ పాత్ర ధర్మేంద్ర గుణగుణాలను గొప్పగా చెప్తున్నట్టే చెప్తూ, అన్ని అవలక్షణాలను బయటపెడుతుంది. ఇదుగో, శ్రీవరుడు ఇక్కడ అదే పని చేస్తున్నాడు.
రాజు సంగీతాన్ని విని ఆస్వాదిస్తాడు. నృత్యాన్ని చూసి మైమరిచిపోతాడు. తానూ రాస్తాడు, పాడతాడు. వారాంగనల చేతుల లోంచి మదిర తీసుకోవటం అతనికి వ్యసనం అయింది. భూమి మీద శరీరంతో ఎన్ని భోగాలు అనుభవించవచ్చో అన్నీ అనుభవిస్తున్నాడు. పైకి అన్నీ గొప్పగా చెప్తున్నట్టే ఉంది. ఉపరితలం వదిలి లోపలకు తొంగిచూస్తే, అసలు విషయం తెలుస్తుంది. విష్ణువుతో సమానంగా భావించే రాజు, ఎలాంటి దిగజారుడు పనులు చేస్తున్నాడో! ఇది ఆనాటి భారతీయ సమాజానికి మానసికంగా ఎంతటి పెద్ద దెబ్బనో ఊహించవచ్చు.
శ్రుత్వా దిగన్తరాత్ కీర్తిం రాజ్ఞః కర్ణామృతప్రదామ్।
గీతకావ్యకలాఖ్యాతః పవారకదనో భగాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 256)
పవార్ కదన్ అనేవాడు గొప్ప పాటల రచయితగా, సంగీతజ్ఞునిగా, గాయకుడిగా పేరుపొందాడు. దిగంతాల వరకూ వ్యాపించిన రాజు ఖ్యాతి విని అతడు కశ్మీరు వచ్చాడు.
‘పవార్’ అన్నది జాతి వాచకం. ‘కదన్’ అన్నది పేరు. ఆ కాలంలో ‘పవరియాలు’ సారంగి వాయిస్తూ, పాటలు పాడేవారు. వారి పాటలు ప్రబంధ కావ్యాలలా ఉండేవి. వీరు ఇంటి ద్వారం ముందు కూర్చుని పాటలు పాడేవారు. ‘పవార్ కదన్’ కశ్మీరు వెలుపల నుండి వచ్చాడు. అతడు హసన్ షాహ, కళాకారులను గౌరవిస్తాడని తెలుసుకుని కశ్మీరు వచ్చాడు. అందుకే శ్రీవరుడు సుల్తాన్ కీర్తి దిగంతాల వరకూ వ్యాపించిందని అన్నాడు. వీరు అధికంగా గ్వాలియర్, ఉత్తరాంచల్ వంటి ప్రాంతాలలో ఉండేవారు. మరొక వాదన ప్రకారం ‘పరమార్’లే, ‘పవార్’లు, ‘పవార్’ అన్నది అపభ్రంశ శబ్దం. కానీ ఇక్కడ శ్రీవరుడు గాయకుడు అని స్పష్టంగా చెప్పటంతో, వీరు పాటలు పాడే ‘పవారియా’లే అని నిర్ధారించారు.
గాయతః సోనుగీతాని స్వకృతాని సభాన్తరే।
తుష్టో మహీపతిస్తస్మై వ్యధాత్ కనకవర్పణమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 257)
సభలో స్వనిర్మితమైన అనుగీత పాడాడు. రాజు దానికి సంతుష్టుడై అతనికి బోలెడంత బంగారం వర్షం కురిపించాడు.
‘పవారియాలు’ తాము ఎవరి దగ్గర పాడుతున్నారో, వారి వంశం, పేర్లు తెలుసుకుని అప్పటికప్పుడు పాటలు అల్లి పాడేవారు. ఇది సుల్తాన్‌ను మెప్పించింది.
ప్రబంధగీత చతురః కదాచిత్ స నృపాగ్రగః।
అగాయత్ సర్వలీలాఖ్యం ప్రబంధం దేశభాపయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 258)
ప్రబంధ గీతాలు పాడటంలో దిట్ట. ఒక రోజు రాజు సమక్షంలో లీలా అనే ప్రబంధాన్ని దేశీ భాషలో పాడి వినిపించాడు.
అనభిజ్ఞతయా రాజ్ఞః పృష్టోహం తస్య లక్షణమ్।
తూర్ణం భరతశాస్త్రాదేః సోదాహరణమత్రమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 259)
తనకు ఈ నూతన గాన సంవిధానం తెలియకపోవటంతో రాజు వాటి లక్షణాల గురించి చెప్పమని నన్ను అడిగాడు. నేను భరతశాస్త్రం వంటి గ్రంథాలు పరిశీలించి, వాటిని ఉదహరిస్తూ లక్షణాలు వివరించాను.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
