Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-132

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పదపాఠస్వరైస్తైస్తు తాలరాగైర్మనోహరమ్।
శ్రుత్వా పంకం తం మత్తో రాజాభూదుదితాశయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 260)

రాజుకు నేను పదం, పాదం, స్వరం, తాళం, రాగంతో షడంగ యుక్తియుక్తమైన గీతాన్ని వివరించాను. పాట విని ఉదారహృదయుడైన రాజు మైమరచిపోయాడు.

దేశీ భాషలో పాడిన పాట రాజుకు అర్థం కాలేదు. దాని లక్షణాలను వివరించమని శ్రీవరుడిని కోరాడు. భరత శాస్త్రం ఆధారంగా ఆ పాటను విశ్లేషించి, లక్షణాలను వివరించాడు శ్రీవరుడు. దాంతో, పాట విని మైమరచిపోయాడు రాజు.

ఏదైనా తెలిసి ఆనందించటం వేరు, తెలియకుండా ఆనందించటం వేరు. కళ ఏదైనా దానిలోని మర్మాలు, మెలకువలు తెలిసి ఉంటే, అనుభవించే ఆనందంలోని గాఢత్వం తీవ్రత పెరుగుతుంది. ఈ విషయాన్నే శ్రీవరుడు స్పష్టం చేస్తున్నాడు. ఇలా తెలిసి ఆనందించటం అన్న విషయంలోనే పండితులు, సామాన్యుల నడుమ దృష్టి భేదం ఏర్పడుతుంది.

ఒక కళాప్రదర్శనను పండితులు చూసి, అనుభవించే దృష్టిలో, సామాన్యులు దాన్ని అర్థం చేసుకుని అనుభవించటంలో ఎంతో తేడా ఉంటుంది. అందుకే ప్రజాదరణ పొందిన ప్రతి కళాప్రదర్శన నాణ్యత పరంగా ఉత్తమమైనది కానవసరం లేదు. అలాగే, ప్రజల నిరాదరణ పొందిన కళ ఉత్తమమైనది కాకుండా పోదు. సామాన్యులకూ, పండితులకూ నడుమ కళా విమర్శకులు వారధిలాగా వ్యవహరిస్తారు. వీరు కళలోని శాస్త్రీయతను, ఔన్నత్యాన్ని, మెళకువలను, లోటుపాట్లను సామాన్యులకు చేరువ చేసి వారి అవగాహన శక్తిని, తద్వారా ఆనందం పొందే శక్తిని పెంచుతారు. సామాన్యుల దృక్కోణాన్ని పండితులకు వివరించి, వారి అవగాహనను పెంచుతారు. ఇక్కడ శ్రీవరుడు చేసిందదే.  ఆ కళలోని వైవిధ్యాన్ని, వైశిష్ట్యాన్ని శాస్త్రీయంగా రాజుకు వివరించాడు. దాంతో రాజు అనుభవించే ఆనందం గాఢత పెరిగింది. అవగాహన పెరిగింది.

శ్రీవరుడు రాజుకు గేయంలోని షడంగాలను, భరతశాస్త్రం ఆధారంగా వివరించాడు. ఈ షడంగాలు గేయ రచనకు ప్రాణం వంటివి. శరీర అంగాల వంటివి. అవి – స్వరము, బిరుదము, పదము, తెనకము, పాటము, తాళము. ‘స్వరము’ అంటే సప్త స్వరాలు. ఇవి సంగీతానికి భావాన్ని, జీవాన్ని ఇస్తాయి. బిరుదము లేక విరుద అంటే గుణగణాలను, కీర్తిని పొగిడే పదాలు. ‘పదము’ అంటే పాటకు అర్థాన్నిచ్చే సాహిత్యం. తెనెకము లేక తేన అంటే మంగళకరమైన ధ్వనులు. ‘పాటము’ అంటే వాద్య ధ్వనులను అనుసరించి పలికే అక్షరాలు. తకధిమి, ‘ధిమ్’, ‘ధనన్’ వంటివి. ‘తాళం’ అంటే కాల ప్రమాణం లేక లయ. స్వరం, తాళం పాటకు కళ్ళు లేక జీవన శ్వాస లాంటివి. పదము, తెనకము శరీర భాగాలు, బిరుదము, పాటము రెండు చేతులు. ఇవన్నీ శ్రీవరుడు సుల్తాన్‌కు వివరించాడు.

తద్గీతస్యాంగ్యై వైకల్య జ్ఞాత్వా మామత్రవీదిదమ్।
గీతదర్పభృతా వాదం కుర్వనేన సభాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 261)

అతని గీతంలోని అంగవైకల్యం గమనించిన రాజు నాతో అన్నాడు, “తన పాట పట్ల గర్వం ఉన్న అతనితో సభలో అందరిముందు నువ్వు వాదించు”.

తథేత్యుక్తే మహారాజో ద్వయోర్వాదమకారయత్।
సభాయాం విహితే వాదే గీతగ్రంథావలోకనాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 262)

శృత్వా ప్రబంధాన్మత్తః స సాశ్చర్యో గదనోభవత్।
అహో కాశ్మీరికోపీదృక్ చతురః సర్వశాస్త్రవిత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 263)

ఇత్యుక్త్వాలింగయ మాం మే త్వ గురురిత్యబ్రవీత్ స్ఫుటమ్।
కౌశేయకపరీ వానప్రసాదానన్దితాశయమ్।
అకరోన్మాం నృపస్తూర్ణం తద్వాదజయరంజితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 264)

మహారాజు అనుమతితో సభలో చర్చ ప్రారంభమైంది. గీత గ్రంథాల ఆధారంగా జరిగిన చర్చలో నేను శాస్త్రాలలో ఉన్న విషయాలను వివరించి చెప్పాను. దాంతో ఆశ్చర్యంతో, “కశ్మీరీయులు శాస్త్రాలలో ఎంతో నిష్ణాతులు, చతురులు!” అని ఆశ్చర్యంతో పవార్ కదమ్ ఆనందంతో నన్ను కౌగలించుకుని, “నువ్వు నా గురువువి” అని స్పష్టం చేశాడు. ఈ శాస్త్ర చర్చలో నేను విజయం సాధించటంతో రాజు నాకు పట్టువస్త్రాలు బహుకరించి, నన్ను పరమానందభరితుడిని చేశాడు.

ఎప్పటిలాగే, ఆ కాలంలో కూడా కశ్మీరీయులపై, దేశంలోని ఇతర ప్రాంతాల వారికి అపోహలున్నట్టున్నాయి. అందుకే శ్రీవరుడి పాండిత్యం చూసి, పవార్ కదముడు ఆశ్చర్యపోయాడు. శ్రీవరుడిని తన గురువుగా స్వీకరించాడు.

ఈ సంఘటనతో శ్రీవరుడిపై రాజుకు గౌరవం పెరిగి ఉంటుంది. కానీ సభలోని వారికి శ్రీవరుడిపై అసూయ కూడా కలిగి ఉంటుంది. శ్రీవరుడు తరువాత చెప్పిన విషయాలు ఈ ఆలోచనను బలపరుస్తాయి.

ఘోషాః స్వోత్పత్తితోషా గతిగుణచతురాః పీవరాంగాస్తురగాః
స్ఫీతం యజ్ఞోపవీతం కనకమణిచితం ద్రవ్యమన్యచ్చ భవ్యమ్।
వస్త్రోదద్యోతాశ్చ పోతా నిజవపుషి ధృతా వస్త్రయోగాః సభోగా
రాజ్ఞా శ్రీహస్సనే ప్రసభమిహ మయి శ్రీవరే కిం న దత్తమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 265)

ఈ శ్లోకంలో రాజు తనను సన్మానించి గౌరవించిన తీరు చెప్తున్నాడు శ్రీవరుడు. వాదనలో శ్రీవరుడు విజయం సాధించటంతో సంతోషించిన రాజు అతనికి పట్టుపస్త్రాలు బహుకరించాడు. ఉత్తమ అశ్వాలను, కనక మణులతో సహా యజ్ఞోపవీతం, ఇంకా విలువైన వస్తువులను బహుకరించాడు. తన శరీరంపై ఉన్న విలువైన వస్తువులనూ ఇచ్చాడు. ఈ రకంగా సుల్తాన్ హసన్ శ్రీవరుడికి ఇవ్వనిది ఏముంది?

శ్రీవరుడిని అతడి పాండిత్య ప్రదర్శనను, రాజు ఆనందంగా, ఘనంగా సత్కరించాడు. ఈ విషయాన్ని శ్రీవరుడు గర్వంగా చెప్తున్నాడు. శ్రీవరుడు తన జీవితకాలంలొ ఇప్పటికి ముగ్గురు సుల్తానుల పాలనలను అనుభవించాడు. జైనులాబిదీన్, హైదర్ షాహ్, హసన్ షాహల పాలనలను అనుభవించాడు. జైనులాబిదీన్ పాలన అయితే స్వర్ణయుగం. ‘హైదర్ షాహ్’ పాలన రెండేళ్ళే. కానీ ఇస్లామేతరులు ఆ రెండేళ్ళలో అనేక కష్టాలు అనుభవించారు. హసన్ షాహ, జైనులాబిదీన్ బాటలో నడుస్తున్నాడు. వ్యక్తిగతంగా వ్యసనపరుడైనా, కళలను ఆదరించటం, పరమత సహన ప్రదర్శన వంటివి జైనులాబిదీన్ స్థాయిలో కాకున్నా, కశ్మీరులో ఇస్లామేతరుల జీవితాన్ని సుఖమయం చేశాయి. హసన్ షాహకు సంగీతమంటే ప్రీతి. సంగీతంలో కొత్త కొత్త విషయాలు తెలుసుకోవటంపై అతడికి ఆసక్తి ఉన్నదని శ్రీవరుడు వర్ణించిన ఈ సంఘటన నిరూపిస్తుంది.

నయజ్ఞః శంసదేనోభూన్మన్త్రీ చాలాభదేనకః।
వీరః శాహాభదేనః స కుదదేనో వివేచకః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 266)

శ్రీశేకన్యరశాహోపి యవనేంద్ర మతప్రియః।
ఆలిశాహోభవద్ దాతా శ్రీమాన్ జైనమహీపతిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 267)

సర్వశాస్త్రప్రియః సర్వభాషాకావ్యవిచక్షణః।
రాజా హైఘరశాహః స తన్త్రీవాద్యవిశారదః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 268)

సంగీతనిపుణః సోయం హస్సనేంద్రో నరేశ్వరః।
ఏకై గుణబాహుల్యా ప్రసిద్ధా నృపమండలీ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 269)

మండలేస్మిన్ జనైర్దృష్టేత్యవోచన్నృపతేః సదా।
శ్రుత్వా రాజ్ఞో మహాగీతం రాగాలప్తిమనోహరమ్
శ్రీజ్యహాంగిర మాగేశముఖ్యాః పాదౌ వవన్దిరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 270)

ఈ ఆరు శ్లోకాలలో శ్రీవరుడు గత సుల్తానుల మూల్యాంకనం చేస్తూ, ప్రస్తుత సుల్తాన్ హసన్ షాహ గుణగణాలను ప్రస్తుతిస్తున్నాడు.

శంసదీన్/షహమీర  నీతిజ్ఞుడు. అలాభదీన్ (అల్లా ఉద్దీన్) మంత్రి. శాహబదీన్ (శహబుద్దీన్) వీరుడు. కుద్దదేవ (కుతుబుద్దీన్) వివేచన కలగవాడు. శ్రీ సికంధరుడు (సికందర్ బుత్‌షికన్) యవనధర్మ ప్రేమి. అలీషాహ (అలీ షాహ) దాత. శ్రీ జైనులాదీశుడు సర్వశాస్త్ర ప్రేమి. సర్వభాషలు, కావ్యాల విచక్షణ కలవాడు. రాజా హైదర్ షాహ వీణ వాద్యంతో సహా తీగ వాయిద్యాల నిపుణుడు. రాజు హసన్ షాహ సంగీతంలో నిపుణుడు. ఇలా ప్రస్తుతం సభలలో, హసన్ షాహలో గత రాజులందరినీ దర్శించారు. ఎటు చూసినా హసన్ షాహ ఎవరో ఒకరిని  తలపుకు తెస్తూ ‘రాజసభ’ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. రాగాలాపనతో మనస్సును హరించిన రాజు మహాగీతాలాపం విని,  జహంగీర్‌తో సహా ప్రముఖలెందరో అతనికి పాదాభివందనం చేశారు.

రాజుల గుణగణాలను వర్ణించేటప్పుడు  శ్రీవరుడు ఎంతో జాగ్రత్తగా వర్ణించటం గమనించవచ్చు. సికందర్ బుత్‌షికన్‌ను ‘యవనధర్మ ప్రేమి’ అన్నాడు. సికందర్ హయాంలో కశ్మీరులో మారణహోమం జరిగింది. కశ్మీరులోని ఇస్లామేతరులు మతం మారిపోయారు. మారని వారు ప్రాణాలు కోల్పోయారు. లేదా, దేశం విడిచి పారిపోయారు. సికందర్ దేవాలయాలను ధ్వంసం చేశాడు. విగ్రహాలను ముక్కలు చేశాడు. అందుకే అతడిని ‘సికందర్ బుత్‌షికన్’ అన్నారు. అతడి పాలన పూర్తయ్యేసరికి కశ్మీరులో కేవలం 11 పండిత కుటుంబాలు మాత్రమే మిగిలాయి. అతడిని ‘యవనధర్మ ప్రేమి’ అన్నాడు శ్రీవరుడు. ‘యవనధర్మ ప్రేమి’ అనటంలోనే, సికందర్ ఎంతగా ఇస్లామేతరులను హింసించాడో శ్రీవరుడు సూచిస్తున్నాడు. అంటే, మందిరాలను ధ్వంసం చేయటం, తమ దైవాన్ని నమ్మని వారిని హింసించటం, చంపటం ‘యవనధర్మ ప్రేమ’ అన్న మాట. శ్రీవరుడు ఈ కాలంలో ఈ మాట అని ఉంటే, అతనిది ‘ఇస్లామోఫోబియా’ అనేవారు. బ్రాహ్మణుడని దూషించేవారు. ఇంకాస్త ఉత్సాహవంతులు ఆరెస్సెస్, బీజీపీ వాడనీ, హిందూ టెర్రరిస్టు అని కూడా విమర్శించేవారు. అదృష్టవంతుడు. 15వ శతాబ్దం వాడు కాబట్టి, పరమతాలను సంపూర్ణంగా నాశనం చేయాలన్న ద్వేషంతో కరడుకట్టిన రాక్షసుడిలా ప్రవర్తించిన సికందర్‌ను ‘యవనధర్మ ప్రేమి’ అని బ్రతికిపోయాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version