Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-133

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

దేశే అస్మిన్ పరవంచనాత్ ప్రకురుతే లోకో యదా సంచయ
తత్తద్ధర్మవిపర్యయేణ చ భజన్ స్వాచార నిః సారతామ్।
ఉత్పాతైర్వివిధైస్తదా సముదితాః సంపీడయన్తి ప్రజా
దుర్వాత్యానలదాహ దుర్విమ మహాశైత్యస్వ భేదామయాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 271)

ఎప్పుడెప్పుడు ఈ ప్రజలు ప్రాచీన ధర్మాలను విస్మరించారో, మోసం వల్ల ధనాన్ని ఆర్జించారో, అప్పుడప్పుడు ప్రాకృతిక ఉపద్రవాలు వారిని శిక్షించాయి. తుఫాను, అగ్ని, ప్రచండ హిమపాతం, ఘోరశీతల పవనాలు, విభిన్నమైన రోగాలు ప్రజలను పీడిస్తాయి.

శ్రీవరుడు గొప్ప సత్యం చెప్పాడు. ఆధునికులు ఇదంతా మూఢ నమ్మకం అని కొట్టేసి తమ తెలివిని ప్రదర్శించామనుకుంటారు. కానీ కారణం లేనిదే కార్యం ఉండదు. ప్రతి కార్యానికి తగిన ఫలితం ఉంటుంది అన్నది ‘సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు’, ‘రాత్రి చంద్రుడు ఉదయిస్తాడు’, ‘నీరు ప్లలమెరుగు’ వంటి వాటిలాగా కాదనలేని సత్యం. ఈ విశాల విశ్వంలో ఏ మనిషికి ఆ మనిషి తన జీవిత కాలంలోని అనుభవాల ద్వారానే సత్యాన్ని గ్రహిస్తాడు. కానీ, తనముందున్నవారు, అంతకుముందు జరిగిన చరిత్ర ద్వారా సత్యాన్ని గ్రహించేవాడు తెలివైనవాడు. చరిత్ర రచనలో భారతీయుల లక్ష్యం ఇదే. కానీ, మానవుడు  తన పరిమిత పరిధి సర్వ ప్రపంచం అనుకుంటాడు. అలాంటి వాళ్లకు ప్రపంచ రీతి, ప్రపంచంలోని శాశ్వత సత్యాలు గురించి  ఆలోచన కూడా అర్థం కాదు.

శ్రీవరుడు మనసులోని మాటను ఒక శాశ్వత సత్యం రూపంలో చెప్పాడు. ‘స్వాచార నిః సారతామ్’, ‘తత్తధర్మ విపర్యేణ’ అన్న వాక్యాలను పరిశీలించాల్సి ఉంటుంది. ప్రజలు ఇతరులను మోసం చేసి ధర్మాన్ని విస్మరించి డబ్బు సంపాదించినప్పుడు, సదాచారం, నైతిక విలువలు నిస్సారమవుతాయి.

కల్హణ రాజతరంగిణిలో చంద్రదేవుడి కథ ఉంది. ప్రజలు తమ ధర్మాన్ని విడిచి నాగుల పూజలను విస్మరించి, ధర్మచ్యుతులై (బౌద్ధం ప్రచారంతో) ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినప్పుడు కశ్మీరులో మంచు తుఫానులు వచ్చి దేశం అల్లకల్లోలమయింది. అప్పుడు రాజు ‘నీలుడి’ని ప్రార్థించాడు. తమను పూజించటం మానేసి గౌరవించకపోవటం వల్ల నాగులు ఆగ్రహించి, మంచు తుఫానులు సృష్టిస్తున్నాయని  ప్రజలు మళ్ళీ తమను మరచిన ప్రాచీన సంప్రదాయాలను పద్ధతులను పాటిస్తూ ధర్మాన్ని పాటిస్తే, నాగులు శాంతిస్తాయని, మంచు తుఫానులు తగ్గిపోతాయని, జన జీవితంలో మళ్లీ శాంతి సౌఖ్యాలు నిలుస్తాయని చెప్పాడు నాగుల రాజు ‘నీలుడు’. గతంలో కశ్మీరు ప్రజలు మరచిన  ఇది ‘నీలమతపురాణం’లా మళ్ళీ  ప్రచారంలోకి వచ్చింది. ప్రజలు ‘నీలుడు’ చెప్పినట్టు చేయటంతో కశ్మీరులో ఉపద్రవాలు తగ్గి శాంతి నెలకొంది. అంటే, ఎప్పుడెప్పుడు ప్రజలు ధర్మం వదలి, అధర్మాన్ని ఆశ్రయిస్తారో, అప్పుడప్పుడు ప్రాకృతిక ఉపద్రవాలు ప్రజల పాపాల ఫలితంగా వచ్చి జనజీవితాన్ని అల్లకల్లోలం చేస్తాయి. ఇది భారతీయుల నమ్మకం. రాజులు భారతీయ ధర్మం వదలి మ్లేఛ ధర్మంవైపు ఆకర్షితులయినప్పుడు కూడా ఉపద్రవాలు కశ్మీరును ముంచెతాయి.

ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర ప్రభావితులు, విజ్ఞానశాస్త్రాన్ని ఆధునిక ‘దైవం’లా భావించేవారు ఇలాంటి ఆలోచనను ఒప్పుకోరు. ప్రాకృతిక ఉపద్రవాలకు ప్రాకృతిక కారణాలుంటాయి. వాటికీ మనిషి అధర్మ వర్తనకూ సంబంధం లేదని వాదిస్తారు. అధర్మ వర్తనమూ ఉపద్రవాలకూ ముడి పెట్టేవారిని ‘మూర్ఖులు’ ‘అజ్ఞానులు’ అన్నట్టు చూస్తారు. వారికి అర్థం కాని విషయం ఏమిటంటే, విజ్ఞానశాస్త్రం పాశ్చాత్య తత్వ  ప్రభావితం. పాశ్చాత్య తత్వంలో సృష్టి ఆవిర్భావానికి నాలుగు మూలకాలు కారణం. పృథ్వి అపస్తేజస్వాయువుల వల్ల సృష్టి ఏర్పడింది. ఈ నాలుగు భౌతిక ఉనికి కలవే. పృథ్వి, అపస్, తేజస్ లను భౌతికంగా చూడగలుగుతాం. వాయువు ప్రభావాన్ని అనుభవం ద్వారా తెలుసుకోగులుగుతాం. అంటే విజ్ఞాన శాస్త్రం ‘భౌతిక’ అంశాలకు మాత్రమే పరిమితం అన్న మాట. భౌతికంగా దర్శించలేనిది, అనుభవించ లేనిది విజ్ఞాన శాస్త్ర పరిధికి బాహిరం. అందుకే పాశ్చాత్య ప్రపంచంలో భౌతిక అంశాలకు అంత ప్రాధాన్యం. ఎక్కువ దూరం పరుగెత్తగలవాడు, ఎక్కువ వేగంగా పరుగులు పెట్టిగలవాడు, ఎక్కువ బరువులు ఎత్తగలవాడు, ఎక్కువ మంచిన చూపగలవాడు.. ఇలా  భౌతికంగా కనగల వాటికే పాశ్చాత్యులు పరిగణలోకి తీసుకుంటారు. చూసిందే నమ్ముతారు. నమ్మిందే చూస్తారు. భౌతికంగా కలవలేని వేవీ వారి బుద్ధికి అందవు. భౌతిక పరిమితులు, విజ్ఞాన శాస్త్ర పరిధిని నిర్ణయిస్తాయి. వీరికి కనబడకుండా ప్రభావం చూపించే సూక్ష్మ అంశాల గురించిన ఆలోచనకూడా వీరికి కలగదు.

భారతీయ తత్వంలో అయిదవ మూలకం ఉంది అది ఆకాశం. ఈ ఆకాశం, పాశ్చత్య విజ్ఞానానికీ, భారతీయ విజ్ఞాన దృష్టికీ నడుమ భూమ్యాకాశాల అంత తేడా తెచ్చింది. భారతీయ విజ్ఞానం ఇంద్రియ జ్ఞానాన్ని ‘అజ్ఞానం’గా భావిస్తుంది. ‘చూసిందే నమ్మటం’ అంటే ఒకే దృశ్యాన్ని ఒక్కొక్కరు ఒక్కక్క దృష్టితో చూస్తారు. అధికులకు ఏం కనిపిస్తుందో అదే నిజమని నిర్ధారించే వీలు లేదు. ‘సత్యం’ మెజారిటీపై ఆధారపడదు. దాంతో ‘చూసిందే నమ్ముతాను’ అంటే ముందు, ‘నీ చూపే లోపభూయిష్టం, ఆ చూపు అందించే జ్ఞానం ఇంకా లోపభూయిష్టం’ పొమ్మంటుంది భారతీయ విజ్ఞానం.

పరాంచి ఖాని వ్యతృణత్ స్వయంభూః
తస్మాత్పరాజ పశ్యతి నాంతరాత్మన్।
కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షత్
ఆవృత్త చక్షురమృతత్వమిచ్ఛన్॥
(కఠోపనిషత్తు 2-1-1)

పరమాత్మ ఇంద్రియాలను బహర్ముఖులుగా (బాహ్య విషయాలను మాత్రమే చూసే స్వభావం కలవిగా) సృష్టించాడు. అందుకని ఇంద్రియాలు బాహ్యవిషయాలనే చూస్తున్నాయి. అవి అంతరాత్మను చూడలేవు. వివేకవంతుడు ఇంద్రియాలను అంతర్ముఖం చేసి తన స్వరూపమైన పరమాత్మను దర్శిస్తాడు.

ఇది భారతీయ తత్వం. ఇంద్రియాలు పరిమిత శక్తి కలవి. అసలు సత్యం గ్రహించాలంటే ఇంద్రియాల పరిధి దాటి దర్శించగలగాలి. అందుకే, మనుషుల దుశ్చర్యలకు, ప్రాకృతిక పరిణామాలకూ నడుమ భారతీయ ధర్మం సంబంధాన్ని దర్శించాలుగుతుంది.

కాబట్టి, ‘చూసేదే నమ్ముతాం. మేము చూడలేనిది లేదు’ అనే వారికి  భారతీయ ధర్మంపై, నమ్మకాలపై, ఆలోచనలపై వ్యాఖ్యానించే స్థాయి లేదు. అయినా సరే, పసిపిల్లవాడు ఎలాగయితే, తనకు తెలిసింది  విజ్ఞానం అనుకుని వాదిస్తూంటే, పెద్దలు నవ్వుకుంటారో, అలా వీరి వాదనలను విని నవ్వుకోవటం తప్ప చేయాల్సిందేమీ లేదు.

కాబట్టి, ఈ సృష్టిలో ప్రతి కర్మకూ ఫలితం ఉంటుంది. మంచి పనికి మంచి ఫలితం. చెడు పనికి చెడు ఫలితం ఉంటుంది.  ఫలితం వెంటనే కనబడదు. సమయం పడుతుంది. అందుకే భగవంతుడి ప్రపంచంలో న్యాయం అలస్యంగా అవచ్చు కానీ అన్యాయం అన్నది లేదంటారు. అన్యాయంగా అనిపించిన రీతికి మనకు తెలియని, అర్థం కాని, ఊహకు అందని ఏదో కారణం ఉంటుంది.

భారతదేశంలో బ్రిటిష్‌వారు చక్కెరను ప్రవేశపెడుతున్నప్పుడు భారతీయ పండితులంతా దాన్ని ప్రతిఘటించారు. అది భారతీయ సామాజిక స్వస్థతని దెబ్బతీస్తుదని వాదించారు. కానీ వారందిరినీ ఛాందసులు (మొండివారు, కొత్తని ఆహ్వానించలేనివారు, అన్న అర్థంలో ఈ పదం వాడుతున్నారు.. కానీ ఛందస్సు అంటే బ్రహ్మ. కాబట్టి ఛాందసులు అన్నది తిట్టు కాదు), అభివృద్ధి నిరోధకులు అని దూషించారు విజ్ఞానవంతులమనుకునేవారు ఆ కాలంలో. చివరికి మన పద్ధతులు పోయి చక్కెర మన జీవితాల్లో ప్రవేశించింది. విడదీయరాని భాగం అయిపోయింది. ఇప్పుడు దేశంలో ‘మధుమేహ వ్యాధి’ ప్రబలిన తరువాత, పిల్లలు కూడా పుడుతూనే ఆ వ్యాధితో పుడుతూండటం వల్ల ఇప్పుడు ‘చక్కెర’ను పూర్తిగా వర్జించటం ఆరోగ్య సూత్రం అయింది. అయినా ‘పంచదార’ పంచన చేరకపోతే రోజులు గడవని పరిస్థితి. మందులు వేసుకునయినా ‘పంచదార’ను వదలమంటున్నారు. ఇదీ చేసిన పనికి ఫలితం అంటే!

పని చేసిన వెంటనే ఫలితం  గోడకు కొట్టిన బంతిలాగా వెంటనే వెనక్కురాదు. వెనక్కి వస్తుంది కానీ దాని సమయం దానిది. ఇక్కడ శ్రీవరుడు అదే చెప్తున్నాడు. కశ్మీరులో మతమార్పిళ్లు పెద్ద ఎత్తున సాగాయి. సాగుతున్నాయి. కొత్త ధర్మం స్వీకరించినవారు పాత ధర్మాన్ని అవహేళన చేస్తున్నారు. విస్మరిస్తున్నారు. కొత్త ధర్మం స్వీకరించిన వారి నైతిక విలువలు వేరు. కౌటిల్యుడి అర్ధశాస్త్రంలో అవినీతి ప్రస్తావనలు ఉన్నా, పాలకులే అవినీతికి పాల్పడటం అన్నది మధ్య యుగంలో అనవాయితీగా అయింది. అల్లాఉద్దీన్ ఖిల్జీ స్వయంగా తన స్థాయిలో ‘బహుమతులు’ అందుకుటున్నా అధికారుల అవినీతిని అడ్డుకోవాలని చూశాడు. నిజామ్-అల్-ముల్క్ రాసిన  ‘సియాసత్ నామా’ – సుల్తాన్ ఎలాగయితే బహుమతుల విలువల ఆధారంగా ఫర్మానాలు జారీ చేసినాడో, క్రింద అధికారులు కూడా దొరికింది దొరికింది తినేవారో- చెబుతుంది.

జైనులాబిదీన్ కూడా, ఇస్లామీయులు పాలన కన్నా దోచుకోవటం, ప్రతీకారాలు తీర్చుకోవటం వంటి వాటి పైనే దృష్టి పెట్టటంతో, పాలన కోసం, ప్రజల సౌఖ్యం కోసం కశ్మీరు వదలిపోయిన పండితులందరినీ, మళ్లీ కశ్మీరు పిలిపించి ‘పాలన’ను స్థిరపరచుకున్నాడు. కానీ జైనులాబిదీన్ తరువాత మళ్లీ అంతకు  పూర్వం పరిస్థితి కశ్మీరులో నెలకొంటున్నది. ఇంతకు ముందరి శ్లోకాలలో శ్రీవరుడు ఎవరెవరు ఎన్నెన్ని అధర్మ రూపాలలో ఆస్తులు సంపాదించారో చెప్తూ వచ్చాడు. ఇప్పుడు అధర్మంగా ధనం సంపాదించి, స్వధర్మాన్ని విస్మరించి, నైతిక విలువలను  గాలికొదిలినవారు ఫలితం అనుభవించక తప్పదని అంటున్నాడు.

ఎలాగయితే, సమాజంలో ప్రవేశించిన డెబ్బయి ఏళ్ల తరువాత సామాజిక స్వస్థతపై పంచదార దుష్ప్రభావం ప్రస్పుటమవటం ఆరంభమయిందో, అలాగే ఎప్పటి నుంచో సాగుతున్న అవినీతి దుష్ప్రభావం కనిపించటం ఆరంభమయింది. ఈ ఉపద్రవాలు తుఫానులు, మంచు తుఫానులు, అగ్ని దహనాలలా పలు రూపాలలో కనిపిస్తుంది.

ఇక్కడ ఓ ప్రశ్న వస్తుంది. ‘పంచదార’ వల్ల శరీరంపై ప్రబావం పడటం అర్థం చేసుకోవచ్చు. కానీ అవినీతి వల్ల ప్రకృతి ప్రభావం అవటం ‘అభూత కల్పన’ అనిపించవచ్చు. నిజానికి దేశంలో ‘మధుమేహం’  ప్రబలటం ఒక్క ‘పంచదార’ వల్లనే కాదు, అనేక ఇతర విషయాల ప్రభావం కూడా ఉంటుంది. ప్రకృతి, మనిషి వేర్వేరుగా కనిపించినా, సూక్ష్మంగా ఆలోచిస్తే, ప్రకృతి మనిషి వేర్వేరు కాదు. ఒకదానిపై మరొకటి ఆధారపడ్డ  ఒకే శరీరంలోని విభిన్న అంగాలు  అనిపిస్తుంది. మనిషి చర్యలు ప్రకృతిపై ప్రబావం చూపిస్తాయి. ఈ విషయం ‘పర్యావరణం’ ‘పెద్ద సమస్య’ అయిన ప్రపంచానికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పైగా, విజ్ఞాన శాస్త్రం ప్రకారం ప్రపంచమంతా తరంగాలే. ఆలోచనలు తరంగాలే. దుష్టపుటాలోచనలు దుష్ట తరంగాలను వెలువరిస్తాయి. వాటి ఫలితం ‘దుష్టం’ గానే ఉంటుంది.

కదాచిత్ పౌరవణిజో గోవధం నగరాన్తరే।
ఆజన్మహిందుకాచారాశ్చకృమౌంసుల వల్లభాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 272)

యత్ర గావో హతా భుక్తైస్తన్మాసై స్తైర్దురాశయైః।
స విహారః స నగరః శుద్ధయై చాగ్నౌ స్వమక్షిపత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 273)

ఒకానొక సమయంలో జన్మతః హిందూ ఆచారాలను పాటించే వ్యాపారులు ఇస్లాం మతం స్వీకరించినవారు, నగరంలో గోవధ చేశారు. గోవధ చేయటమే, కాదు, వారు గోమాంసాన్ని తిన్నారు. ఎక్కడయితే గోవధ చేశారో, గోమాంసం తిన్నారో, ఆ విహారం, ఆ నగరం, స్వయంగా  శుద్ధి అయినట్టు అగ్నిలో దహించుకుపోయింది.  మధ్యయుగం రచనలలో ముఖ్యంగా కశ్మీరు భారతీయుల సంస్కృత రచనలలో ‘గోవధ’ ప్రస్తావన చేసిన ప్రథముడు శ్రీవరుడు.

నిజానికి గోవధ ప్రస్తావన జయానుకుడు రచించిన ‘పృధ్వీరాజ విజయం’లో కనిపిస్తుంది. మ్లేచ్ఛులు, తరుష్కులు ‘గోవధను’ తమ ఆధిక్యానికి సూచనగా భారతీయులను అవమానించేందుకు ఆయుధంలా వాడేరని తెలుస్తుంది. 6-7 శతాబ్దంలోనే సింధు ప్రాంతాలను గెలుచుకున్న అరబ్బులు, తరుష్కులు ‘గోవధను’ తమ ఆధికారానికి సూచనగా వాడేరు. మందిరాలలో గోహత్య చేసేవారు. బ్రాహ్మణులతో ఆ మాంసాన్ని మొయించేవారు. జయనకుడు ‘ఘోరి’ పేరు ‘గో అరి’ (గోవు శత్రువు) గా వాడేడు. దీన్ని బట్టి తెలిసేదేమిటంటే, ‘గోహత్య’ అన్నది ఇస్లామీయులు భారతదేశంలో ప్రవేశించినప్పటి నుంచీ, భారతీయులను రెచ్చగొట్టేందుకు, తమ ఆధిక్యాన్ని నిరూపించుకునేందుకు, భారతీయులను అవమానించేందుకు వాడిన ఒక ‘ఆయుధం’ లాంటిది అన్నమాట. ఈనాటికీ, ఈ రెచ్చగొట్టటం, అవమానించటం, ఆధిక్యం నిరూపించుకోవటంలో ‘గో వధ’ ఒక ఆయుధంలా ఉపయోగపడుతున్నది, భారతీయ ధర్మ వ్యతిరేకులకు.

శ్రీవరుడు రచించిన ఈ శ్లోకాన్ని ముందరి శ్లోకంతో కలిపి విశ్లేషిస్తే, మతం మారినవారు, అకృత్యాలు అధికంగా చేసేవారనీ, తాము పుట్టినప్పటి నుంచీ పాటిస్తున్న ధర్మాన్ని త్యజించి, ఇస్లాం స్వీకరించగానే, వారు అధర్మవర్తన ద్వారా నైతిక విలువలను విస్మరించేవారని తెలుస్తుంది ఫలితంగా ప్రాకృతిక ఉపద్రవాలు సంభవించి కశ్మీరం అల్లకల్లోలం అవుతున్నది. ఎక్కడయితే గోహత్య జరిపి, గో మాంసం తిన్నారో అదంతా పరశురామ ప్రీతి అయింది. శ్రీవరుడు దాన్ని, అపవిత్రమైన స్థలాలు అగ్నితో శుద్ధి అయ్యాయని వ్యాఖ్యానించాడు. ఇస్లామీయులు దుష్టప్రవర్తన, అధిక్య ప్రదర్శన నెపం మీద భారతీయులను అవమానించటం, వారి విశ్వాసాలను దెబ్బతీయాలని ప్రయత్నించటం, భారతీయుల మనస్తత్వంపై ఎలాంటి చెరగని, మాయని గాయం చేసిందో, శ్రీవరుడు తన రచనలో ప్రతిబింబిస్తున్నాడు. భారతీయుల మనస్తత్వంలో మధ్యయుగంలో వచ్చిన మార్పుల గురించి తెలుసుకోవాలంటే శ్రీవరుడి రాజతరంగిణి ఒక పాఠ్య పుస్తకంలా ఉపయోగ పడుతుంది. తప్పు చేసినవాడు శిక్ష అనుభవిస్తాడని నిరూపణ అయింది.  ‘చూసినవి మాత్రమే నమ్ముతాం’ అని కళ్లకు గంతలు కట్టుకుని, మెదడు తలుపులు మూసుకున్న వారికి ఇదంతా ‘మౌఢ్యం’లా కనిపిస్తుంది. వారి దృష్టి అంతే మరి!

(ఇంకా ఉంది)

Exit mobile version