[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
ప్రసారితా చతుర్దిక్షు యత్ర భిత్తిః సుధాసితా।
శ్రీశేకన్ధరభూభర్తుర్ముర్తా కీర్తిరివాభవత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 280)
(బృహత్ మసీదు) నాలుగు వైపులా గోడలు వెల్ల వేసి ఉన్నాయి. అది విశాలమైన ప్రాంగణం. ఈ విశాలమైన బృహన్మసీదు సికందర్ కీర్తికి ప్రతిరూపం.
వ్యంగ్యం అంటే ఇది!
బృహన్మసీదు నుండి ఎగసిన భూర్జ పత్రాలకు నిప్పంటుకుని నగరం కాలి బూడిదయిందని ముందరి శ్లోకంలో చెప్పాడు. ఈ శ్లోకంలో అతి విశాలము, తెల్లని గోడల కల ఆ మసీదు సికందర్ కీర్తికి ప్రతిరూపం అంటున్నాడు.
కశ్మీరులో జామా మసీదు విశాలమైన కట్టడం. అగ్నికి ఆహుతి అయిన మసీదును సికందర్ పునర్నిర్మించ చేశాడు. ఆ మసీదు గోడలు ఎత్తైనవి. అవి అన్ని వైపులా వెల్లవేసి తెల్లగా ఉన్నాయి. ఇంత వరకూ బాగానే ఉంది. ఆ మసీదు సికందర్ కీర్తికి ఆకృతిగా ఉందనడంలోనే శ్రీవరుడి భావన తెలుస్తుంది.
సికందర్‍ను అతని జీవిత కాలంలోనే ‘సికందర్ బుత్‌షికన్’ అనేవారని జోనరాజు రాశాడు. ‘బుత్’ అంటే విగ్రహం. ‘షికన్’ అంటే నాశనం చేసేవాడు. ఇస్లామీయులలో విగ్రహారాధన లేదు. కాబట్టి అతడు విరగగొట్టే విగ్రహాలన్నీ ఇస్లామేతరులవి, ప్రధానంగా భారతీయులవి. సికందర్ మందిరాలు ధ్వంసం చేశాడు. విగ్రహాలను ముక్కలు చేశాడు. మతం మారని వాళ్ళని చంపేశాడు. ప్రాణాలు అరచేత పట్టుకుని దేశం వదిలిపోయేవాళ్ళని కూడా దేశం వదిలిపోనీయలేదు. వెంటాడి, వేటాడి చంపేశాడు. ఈ జాతివధకు (Genocide) జోనరాజు ప్రత్యక్ష సాక్షి. ప్రపంచంలోనే ‘జాతివధ’కు తొలి ప్రత్యక్ష సాక్షి జోనరాజు. శ్రీవరుడు సైతం భారతీయులపై జరిగే అత్యాచారాలకు సాక్షి. దేవాలయాలు ధ్వంసం చేసి మసీదులు, ఖాన్‌కాహలు నిర్మించటం శ్రీవరుడు కళ్ళారా చూశాడు. తన రాజతరంగిణిలో ఈ ఘోరమైన ఉదంతాలను పొందుపరచాడు.
కశ్మీరులో భారతీయులపై ఎనలేని అత్యాచారాలు జరిగాయి. ఘోరమైన హింసకు, వ్యథకు గురయ్యారు. కానీ ఏ సుల్తాన్ కూడా ‘సికందర్ బుత్‌షికన్’ను అధిగమించలేదు. సికందర్ అంత క్రూరంగా వ్యవహరించిన వారెవరూ లేరు. ఇదీ అతని ఖ్యాతి. ఆ మసీదు అతని ఖ్యాతికి ప్రతిరూపం. అది చాలా ఎత్తుగా, విశాలంగా ఉంది. కానీ ఆ మసీదు నిర్మాణానికి అక్కడున్న మందిరం ధ్వంసం అయింది. పరిసరాలలోని అనేక మందిరాలు ధ్వంసమయ్యాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది స్వధర్మాన్ని విడిచి పరధర్మాన్ని స్వీకరించారు. ఇదీ ఓ రకమైన మరణమే. ఇదంతా సికందర్ ఖ్యాతిలో భాగమే.
మందిరాలు, విగ్రహాలు ధ్వంసం చేయటం, మనుషులను చంపటం, బెదిరించి, భయపట్టి, మెడపై కత్తి పెట్టి మతం మార్చటం, మందిరాల స్థానంలో పెద్ద పెద్ద మసీదులు నిర్మించటం.. ఇదంతా ‘సికందర్ బుత్‌షికన్’ ఖ్యాతి. ఆ ఖ్యాతికి ప్రతిరూపం ఆ మసీదు. అర్థం కాని వారికి, అంత పెద్ద మసీదుతో సికందర్ ఖ్యాతిని పోలుస్తున్నట్టు. పెద్ద మసీదు, పెద్ద ఖ్యాతి. అర్థమయ్యేవారికి మసీదు నిర్మాణం మతపరమైన నిర్మాణం. సికందర్ బిరుదు ‘బుత్‌షికన్’. అదీ అతని ఖ్యాతి. దానికి ప్రతిరూపం మసీదు. పైపైన చూస్తే పొగడ్త.. లోతుగా వెళ్ళి ఆలోచిస్తే, వ్యంగ్యం.. విమర్శ.
వ్యధాద్ యదన్తర్జనతా ప్రాణీతా పునరుద్ధితా।
త్వంగత్సరోవరోత్తుంగతరంగావలిభంగితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 281)
ఆ మసీదులో భక్తులు ప్రార్థన చేస్తూ, వంగి లేవటం ఒక ఉత్తుంగ తరంగం పడి లేస్తున్నట్టుంది.
మసీదులో నమాజ్ చదివే సమయంలో ‘సిజ్దా’, అంటే, వంగి నమస్కారం (ప్రణత్) చేస్తారు. తర్వాత లేచి (కయామ్) మళ్ళీ సిజ్దా చేస్తారు. ఇది ఒక తరంగం ఎగసిపడినట్టుంటుంది. ‘నమాజ్’ని తనకి అర్థమైన దృష్టాంతంతో సుందరంగా వర్ణించాడు శ్రీవరుడు.
ఈ వర్ణన శ్రీవరుడు నమాజ్ చదవటం చూశాడని స్పష్టం చేస్తుంది. అధిక సంఖ్యలో భక్తులు అక్కడ చేరి నమాజ్ చదువుతారు. వారి సజ్దా, కయామ్‍లు చూస్తుంటే ఒక తరంగం ఎగసిపడుతున్నట్టుంటుంది. అందుకే శ్రీవరుడు ‘నమాజ్’ చదవటాన్ని అంత చక్కగా వర్ణించాడు.
మంత్రపాఠోద్యతం యత్ర యవనానాం కదంబకమ్।
గుంజన్మధుప గర్భాజసహస్రమివ రాజతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 282)
(మసీదులో) యవనులు మంత్రం చదువుతూంటే సహస్ర కమలాల గర్భంలో తుమ్మెదల ఝుంకారంలా ఉంది.
చతుర్దిగ్ద్వారనిర్గచ్ఛచ్ఛుక్రవారాగతా జనాః।
కుర్వన్తి భూగత మ్లేచ్ఛతదహర్నిర్గమభ్రమమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 283)
మసీదు నాలుగు ద్వారాల నుంచి శుక్రవారం నమాజు తరువాత బయటకు వచ్చే మ్లేచ్ఛులు, భూమిని తొలుచుకుని వస్తున్నట్టు అనిపిస్తుంది.
శ్రీవరుడికి ఇస్లామీయుల సిద్ధాంతాలతో పరిచయం ఉన్నదని ఈ శ్లోకం నిరూపిస్తుంది. ఇస్లామీయులు, క్రిస్టియన్లు, యూదులు – మరణించిన వారిని పాతిపెడతారు. కారణం, వారి నమ్మకం ప్రకారం ప్రపంచం అంతమయ్యే జడ్జిమెంట్ డే, అంతిమ తీర్పు రోజు, మరణించిన వారంతా వారి సమాధులలో నుంచి లేచి వస్తారు. ఈశ్వరుడు వారి గురించి ‘తీర్పు’ ఇస్తాడు. అందుకే వారు శవాలను పాతిపెడతారు. పునర్జన్మను నమ్మరు.
శుక్రవారం ఇస్లామీయులకు ప్రత్యేకంగా పవిత్ర దినం. ఆ రోజు మధ్యాహ్నం నమాజులొ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ప్రార్థన అయిన తరువాత వారంతా కలసికట్టుగా బయటకు వస్తారు. అలా అధిక సంఖ్యలో ప్రజలు ఏదైనా భవంతి లోంచి వస్తున్నా, ఏదైనా మైదానాలలో జమ అయినా, మనం, ‘నేల ఈనినట్టుంది’ అంటాం. కానీ శ్రీవరుడికి ఇస్లామీయుల నమ్మకాలు తెలుసు. కాబట్టి, భూమిలో పాతబెట్టిన మ్లేచ్ఛులంతా లేచి వస్తున్నట్టున్నారన్నాడు. అంత పెద్ద సంఖ్యలో ఆ మసీదులో నమాజులో పాల్గొంటున్నారన్నమాట.
పై శ్లోకంలో యవనులు అన్నాడు. ప్రార్థనలు చేస్తున్నారు కాబట్టి. బయటకు వచ్చే వారిని మ్లేచ్ఛులు అన్నాడు. ఇక్కడే శ్రీవరుడి పదాల వాడకాన్ని జాగ్రత్తగా గమనించటం ద్వారా, పదాల వెనుక దాగిన ఉద్దేశ్యాన్ని గ్రహించవచ్చు.
కశ్మీరులో యవన, మ్లేచ్ఛ అన్న పదాలు కాలక్రమేణా పలు విభిన్నమైన అర్థాలను సంతరించుకున్నాయి. ‘నీలమత పురాణం’లో యవనులు అన్న పదాన్ని అయోనియన్లు (గ్రీకులు) లేక ఉత్తరపథంలో నివసించే పాశ్చాత్యులను సూచించేందుకు వాడేవారు. క్రీ.పూ. 2వ శతాబ్దం నుంచీ కశ్మీరులో గ్రీకులున్నారని తెలుస్తుంది. డెమెట్రియస్, మిళింద (మినాండెర్) వంటి వారి సామ్రాజ్యాల ప్రభావం కశ్మీరుపై కనిపిస్తుంది.
కల్హణ రాజతరంగిణిలో కశ్మీరు పశ్చిమాన ఉన్న అభిసార, ఉరగ, సింహపుర, దివ్య కటక, ఉత్తర జ్యోతిష వంటి ప్రాంతాలను యవన రాజ్యాలుగా పేర్కొనటం కనిపిస్తుంది. వీరు వేద పద్ధతులను పాటించరు. వీరిలో కొందరు విదేశాల నుంచి వచ్చినవారు. వారి భాష కూడా వేరు. ఇక్కడి పద్దతులను పాటించని గ్రీకు సంతతిని యవనులని అనేవారు.
జోనరాజు కాలానికి వచ్చేసరికి ముస్లిం పాలకులను యవనులు అన్నారు. అంటే, యవనులు మర్యాద పదం అయిందన్న మాట జోనరాజు కాలంలో. జైనులాబిదీన్‌ను, ఇతర రాజకుటుంబానికి సంబంధించిన వారినీ, పాలకవర్గాన్నీ ‘యవనులు’ అన్నాడు జోనరాజు. మిగతా ఇస్లామీయులందరినీ ‘మ్లేచ్ఛులు’ అన్నాడు. శ్రీవరుడి ఉద్దేశంలో మ్లేచ్ఛులు అంటే అనాగరికులు, అవిద్యావంతులు, హింసకు పాల్పడేవారు. అర్థం కాని భాష మాట్లాడేవారు, నీతి నియమాలు లేనివారు. ఇలా పలు సందర్భాలలో, పలు అర్థాలు వచ్చేట్టు వాడేడు జోనరాజు. ఈ కాలంలో ‘యవనులు’ అంటే గ్రీకులు అన్న అర్థం పోయింది కశ్మీరులో.
శ్రీవరుడు కూడా ఇదే పద్ధతిని కొనసాగించాడు. అరబ్బులు, టర్కులు, ఇతరులంతా మర్యాదగా, నాగరికంగా ఉన్నా, పాలకవర్గంలో ఉన్న వారు యవనులు. మిగతా వారంతా మ్లేచ్ఛులు.
ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్న ఇస్లామీయులను ‘యవనులు’ అన్నాడు. బయటకు వస్తున్న వారిని ‘మ్లేచ్ఛులు’ అన్నాడు. ఇదీ తేడా! మసీదులోకి వెళ్ళేవాళ్ళు, బయటకు వచ్చేవారు ఒకరే. కానీ మసీదులోకి వెళ్ళి ప్రార్థనలు చేసేవారు యవనులు. బయటకు వచ్చేవారు మ్లేచ్ఛులు. ఎందుకంటే, వారంతా, సమాధుల్లోంచి లేచివచ్చినవారిలా అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ రెండు పదాలను శ్రీవరుడు వాడిన అర్థాలలో చూస్తే, శ్రీవరుడి ఉద్దేశం అర్థమైపోతుంది. పైగా, బయటకు వచ్చేవారిని, భూమిలో పాతిపెట్టగా లేచి వచ్చినవారితో పోల్చాడు.
నమాజ్ పద్ధతి ప్రకారం చేస్తారు. ప్రశాంతంగా చేస్తారు. నాగరికం అది. ‘నమాజ్’ సమయంలో ఏకాగ్రత భంగం కాదు. అందుకని యవనులు అన్నాడు. కానీ వారే, బయటకు వచ్చేటప్పుడు ప్రశాంతంగా ఉండరు. అనేక మతకల్లోలాలు, శుక్రవారం పూట మసీదు నుండి బయటకు వస్తూన్న సమయంలోనే ఆరంభమవుతాయి. అప్పటికీ, ఇప్పటికీ శుక్రవారం ప్రధాన మసీదుల వద్ద పోలీసులు అలర్ట్‌గా ఉంటారు.
మసీదు నుంచి బయటకు వస్తూ హింసకు పాల్పడటమన్నది మధ్యయుగంలో తొలిసారిగా రికార్డయింది. మన దేశంలో తొలిసారిగా రికార్డయిన మత కల్లోలం క్రీ. శ. 1714లో, అహ్మదాబాదులో సంభవించింది. చరిత్ర రచయిత ఓమర్ ఖాలిద్ ప్రకారం, హోలీకి సంబంధించి, గోవధకు సంబంధించీ జరిగిందీ మత కల్లోలం. శ్రీవరుడు 15-16వ శతాబ్దికి చెందినవాడు. బయటకు వచ్చేవారిని ‘మ్లేచ్ఛులు’ అనటం, బయటకు వచ్చేవారు అంత నాగరికంలా లేరని స్పష్టం చేస్తుంది.
మసీదు నుంచి బయటకు వచ్చేవారి సంఖ్య ఎంత అధికంగా ఉన్నదంటే, ‘ఖయామత్’ రోజు వచ్చేసినట్టుంది. అందుకని భూమిలో పాతిపెట్టిన వారంతా లేచి వస్తున్న భ్రమ కలుగుతోంది అంటున్నాడు శ్రీవరుడు.
యన్మధ్యోచ్చచతుః స్తంభదంభాద్ విధిదిదృక్షయా।
చతుష్పాదివ తద్ధర్మః ప్రాప్తో భాత్పునర్జితస్థితిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 284)
నాలుగు పెద్ద స్తంభాలు (మీనార్లు) సత్యాన్ని, ధర్మాన్ని రక్షిస్తున్నట్లున్నాయి. అవి ప్రజలు ధర్మాన్ని సరిగా పాటిస్తున్నారో లేదో చూస్తున్నట్టున్నాయి.
మీనార్లను నాలుగు స్తంభాలు అన్నాడు. మీనార్లు కట్టడం పైనుంటాయి. అక్కడి నుంచి అవి ధర్మాన్ని రక్షిస్తున్నట్టు, అందరూ ధర్మం పాటిస్తున్నారా లేదా అని పరిశీలిస్తున్నట్టున్నాయి అంటున్నాడు శ్రీవరుడు.
ఇక్కడ నాలుగు మీనార్లను ‘చతుష్పాద్’ అన్నాడు శ్రీవరుడు. మీనార్లు ధర్మాన్ని నిలుపుతున్నాయి. కాబట్టి ఇక్కడ ‘చతుష్పాదం’ అంటే నాలుగు పాదాల మీద నడిచే ధర్మం.
స్వర్ణఛత్రచ్ఛాద్యత్ర మాయాకర్ణన కౌతుకాత్।
కర్ణ దాతుమివాభ్యర్ణ భజన్ భాతి దివాకరః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 285)
ఇక్కడ సూర్యుడు స్వర్ణ చక్రంలా మెరుస్తున్నాడు. ఇక్కడ ప్రజలు సంభాషణలు వినేందుకు సూర్యుడు ఇటువైపు దగ్గరగా వంగినట్టుంది.
తన్మహాసదనం వ్యాప్తగగనం రచనాద్భుతమ్।
మ్లేచ్ఛదర్శన రాజార్థం రక్షాదుర్గశ్రియం దదత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 286)
ఆ భవనాలు ఆకాశాన్ని తాకుతున్నంత ఎత్తు ఉన్నాయి. ఈ భవనాలు చక్కగా అలంకృతమై ఉన్నాయి. అవి మ్లేచ్ఛధర్మాన్ని పాటించే రాజుల రక్షణ కోసం కట్టిన దుర్గాల్లా ఉన్నాయి. మసీదులను దుర్గాలు అనటంలోనే పైకి చెప్పలేని చేదు నిజం దాగుంది. ఏ గుడిని కూడా, రాజుకు రక్షణగా నిలచే దుర్గం అని ఎవ్వరూ ఎప్పుడూ అనలేదు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
