[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
కుర్వన్ కల్యాగ్నినిర్దగ్ఘ విశ్వజ్వాలావలి భ్రమమ్।
క్షణమాత్రాత్తదా యాతం భిత్తిమాత్రావశేషతామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 287)
క ల్పాంతంలోని అగ్నిలా, క్షణమాత్రంలో ఆ అగ్ని అంత మహాభవంతిని కూడా దగ్ధం చేసింది. కాలిన గోడలు తప్ప మసీదు స్థానంలో ఏమీ మిగల లేదు.
నిమిత్తజా విధా యస్యాం మ్లేచ్ఛా కుర్వన్తి భక్తితః।
ఎధామహోత్సవాద్యేషు గణశో మిలితాః సదా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 288)
‘ఈద్’ సమయంలో పెద్ద సంఖ్యలో మ్లేచ్ఛులు ఈ భవనంలో జమ అయి ప్రార్థనలు చేసేవారొకప్పుడు.
ఈద్‌ను ‘ఎధా’ అన్నాడు శ్రీకరుడు. ‘ఈద్’ మహత్యాన్ని ‘ఏదా’ మహత్యం అన్నాడు. ఇస్లామీయులు చేసే ప్రార్థన ‘నమాజ్’ను ‘నైమిత్తిక విధి’ అన్నాడు. శ్రీవరుడు కొత్త పదాలను సృష్టించటం గమనించవచ్చు. ‘ఈద్’ అన్నది అరబిక్ పదం. దాన్ని ‘ఎధా’గా సంస్కృతీకరణ చేశాడు.
అభూద్ధహామఖానీయపంచావాసాదిభిర్గృహైః।
సతాండవ చటత్కారం తైః ఖాండవ వనాయితమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 289)
ఖాండవ వనాన్ని దహించినట్టు అగ్ని, బహ్రమ్ ఖాన్‌కు చెందిన అయిదు గృహాలను పెద్ద శబ్దంతో దగ్ధం చేసింది.
జ్వాలద్భూర్జత్వచో యాతా వితస్తాసలిలాన్తరమ్।
దగ్ధా జలగతా నావాః శేకుః శమయితుం న యాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 290)
మండుతున్న భూర్జర పత్రాలు వితస్త నీటిలో పడ్డాయి. అక్కడి నౌకలకు నిప్పు అంటుకుంది. మంటలార్పినా ఆగక ఆ నౌకలు దగ్ధమై పోయాయి.
పురపత్తన ఘోపేషు తదుపల్లవవాయునా।
సహస్రసంఖ్యా వేశ్మౌఘాస్తద్దినే ఉజ్వలుర్న కే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 291)
పురం, పట్టణాలు, వీధులన్నీ ఆ వాయివు వీయటం వల్ల అగ్ని విస్తరించి, వేల సంఖ్యలో గృహాలు బూడిద అయ్యాయి.
పురం, పట్టణాల నడుమ తేడా ఉంది. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే పురం, city తో సమానం. పట్టణం town సమానం.
ఉత్పాతవాత జాతోర్మిమహాపద్మసరోన్తరే।
శతసఙ్ఖ్యా దినే తస్మిన్ కిరాతాః ప్రలయం యయుః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 292)
ప్రళయ కాలంనాటి గాలుల వల్ల మహాపద్మ సరోవరంలో చెలరేగిన అలల వల్ల పక్షులను పట్టే బోయవాళ్లు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
వర్ణాచార విపర్యాసః స మాసః కుజవత్సరః।
పురశ్రీవిహితోద్వాసే నివాసక్షయకార్యభూత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 293)
మంగళ సంవత్సరం ప్రభావం వల్ల, వర్ణాచార ధర్మాలు పాటించక పోవటం వల్ల ఇళ్ళల్లోని మంగళకారకమైన కులదేవత వెళ్లిపోవటం వల్ల ఇళ్లన్నీ బూడిద అయిపోయాయి.
‘మంగళ సంవత్సరం’ అంటే ‘అంగారక గ్రహం’ ఒక వైపు మంచి మరో వైపుకు ప్రయాణించటం ఒక మంగళ సంవత్సరం. 360 రోజులు ఉంటుంది. జ్యోతిషశాస్త్రం ప్రకారం కూడా అంగారక గ్రహం ‘అగ్ని’కి, ‘నష్టానికి’ సంబంధించిది. దీనికి వర్ణాచారాలను పాటించక పోవటానికి ముడిపెట్టాడు శ్రీవరుడు. వర్ణాచర ధర్మాలను పాటించక పోవటం అరిష్టకారకమని నమ్ముతారు. కశ్మీరులో తురకల ప్రాబల్యం పెరుగుతున్న కొద్దీ సమాజంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. ఇంతకు ముందు శ్లోకాల్లో గోవధ గోమాంస భక్షణ వంటి దుశ్యర్యల దుష్పలితాలు చెప్పాడు. ఇప్పుడు వర్ణాచారాలను అతిక్రమించటం వల్ల వేల సంఖ్యలో ఇళ్లు బూడిదయిపోయాయని చెప్తున్నాడు.
అధునిక అభ్యుదయవాద, చూసిందే నమ్మే విప్లవ, భావ, హేతువాదులకు శ్రీవరుడి ఈ వ్యాఖ్యలు ‘కుల అహంకారం’ గా అనిపిస్తే అది వారి తప్పు కాదు. శ్రీవరుడి కాలంలో ఈ వ్యాఖ్యలు సర్వజనాంగీకారం పొందటం ఆ కాలం వారి దోషం కాదు. అప్పటి వర్ణాచారాలు, ఇప్పుడు అర్ధం చేసుకుంటున్న వర్ణాచారాలు ఒకటి కాదు.
అథవా పూర్వకర్తణాం జాతే పుణ్యక్షయే సతి।
నవీనకర్తృ నిర్మాణ కీర్త్యర్థం కురు విధిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 294)
పూర్వ కర్మల పుణ్యక్షయం అయిపోవటం వల్ల కొత్త కర్మల ద్వారా తమ వీరికి పునర్మించుకునే వీలు విధి ఇచ్చినట్టుంది.
భారతీయుల మనస్తత్వం, ఆలోచనా విధానం అర్థం కాని వారు ‘వేదాంతం’ అని వెక్కిరిస్తారు. కానీ వేదాంత భావనలో నిక్షిప్తమై ఉన్న నిర్మాణాత్మకమైన ఆలోచన వారికి అర్థం కాదు.
భారతీయ ధర్మంలో ‘ఏది జరిగినా మంచికే’. కానీ ‘అంతా భగవదేచ్ఛ’ అన్న భావనలు ఉన్నాయి. ఆ భావనలు నిర్లిప్తంగా, నిర్వ్యాపారంగా జీవితం గడిపేందుకు కాదు, ఎలాంటి కఠినమైన పరిస్థితిలోనయినా దైవం పై భారం వేసి పరిస్థితిలో మంచిని గమనించి నిర్మాణాత్మకంగా ముందుకు సాగే ప్రేరణ పొందేందుకు ఉపయోగ పడతాయి.
భయంకరమైన అగ్నికి కశ్మీరులో నగరాలు దగ్ధమైపోతున్నాయి. దీనికి కారణాలుగా గోహత్య, గోమాంస భక్షణ, వర్ణాచార ధర్మ ఉల్లంఘనలుగా చూపించాడు శ్రీవరుడు. వెంటనే ఇదంతా ‘పాపక్షయం’ అయిపోయింది. మొత్తం పాపం అయిపోయింది. ఇకనైనా పుణ్య కార్యాలు చేసే అవకాశం లభించింది, ఆ పునర్నిర్మాణాల ద్వారా అంటున్నాడు. అంటే, కర్మల బాలెన్స్ షీట్ ‘సున్న’ అయిపోయింది. ఇప్పటి నుంచీ మంచి పనులు చేసి పుణ్యకీర్తి సంపాదించుకోవచ్చు. విధి అవకాశం కల్పించిందని ‘పాజిటివ్’ గా ఆలోచించటం నేర్పుతున్నాడు.
నిర్మితా తాదృశీ రాజ్ఞా సా మహాసదనస్థితిః।
పుణ్యశ్రీరివ యా స్ఫీతా విభాతి నగరాన్తరే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 295)
కాలిపోయిన మహాభవనం స్థానంలో రాజు కొత్త భవనం నిర్మించాడు. ఇది రాజు గొప్పతనాన్ని శోభయామానం చేస్తోంది.
అచిరాత్ సా పురీ దగ్ధా నవీకృతగృహా బభౌ।
భూపం తరుణమేవైక్ష్య విహితా తరుణీ ప్రియా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 296)
అచిరకాలంలోనే దగ్ధమైన గృహాలన్నీ రాజు పునర్నిర్మింపచేశాడు. కొత్త గృహాలు కట్టించాడు. యువరాజును చూసి, ప్రియుడిని చూసి సిగ్గపడి ఆనందించే ప్రేయసిలా నగరం శోభితమయింది.
భూపాలదుర్వ్యసనజాః ప్రభవన్తి దోషా
నాశాయ యద్యపి హిమాధ్వని మండలేస్మిన।
అన్యోన్యమంత్రివరవైరమముత్థ దోషో
రాజ్యం సమస్తమపి నాశయతి క్షణేన॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 297)
రాజు దుర్వ్యసన దోషాలు రాజ్యాన్ని నాశనం చేస్తాయి. కానీ మంత్రుల నడుమ అహంకారం అసూయల పోరుల వల్ల రాజ్యం క్షణంలో నాశనమౌతుంది.
శక్తిస్ఫీతం సముదయలసత్సప్తఘాత్వంగభంగ
ధత్తే నిత్యం యదపి సుభగం సర్వకార్యక్షమత్వమ్।
దోపా వాతాదయ ఇవ మహామంత్రిణోన్యోన్యదుష్టా
యత్రైతే స్యుర్గలతి న చిరాద్ దేహవత్ తత్ర రాజ్యమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 298)
ఏ రాజ్యంలోనయితే ప్రజలనడుమ ఐక్యత ఉండి సప్త ధాతువులు, అంగాలు శక్తిమంతమై ఉంటాయో ఆ రాజ్యంలో అన్నీ సమృద్ధిగా ఉంటాయి. సర్వ కార్యాలు విజయవంత మౌతాయి. ఇందుకు భిన్నంగా వాతాది దోషాలుంటే శరీరం బలహీనమై నశించినట్టు, పరస్పర ద్వేషాల నడుమ రాజ్యదేహం కూడా నశిస్తుంది.
అత్రస్థైః సర్వదా రక్ష్యః స్వభేదః ప్రభవిష్ణుభిః।
చార్వాకాణామివైయాం హి భయ న పరలోకతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 299)
అధికారులు తమ నడుమ పరస్పర ద్వేష భావనలు చెలరేగకుండా జాగ్రత్త పడాలి అప్పుడు చార్వాకులు దైవమంటే భయపడనట్టు రాజు కూడా శత్రువులంటే భయపడడు.
సప్త ధాతువులు శరీరానికి, సప్తాంగాలు రాజ్యానికి అత్యంత ప్రధానమైనవి. ఇవి సరిగ్గా, సమన్వయంతో ఉంటే శరీరం దారుఢ్యంగా ఉంటుంది. రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి మంత్రులు కూడా తమ నడుమ భేదభావాలు రాకుండా, ద్వేష భావనలు కలగకుండా జాగ్రత్తగా ఉంటే రాజ్యం శక్తివంతమౌతుంది. శత్రువులంటే భయపడనవసరం ఉండదు.
లలితాదిత్యదేవోక్తామితి నీతి లిలఙ్ఘయ యే।
మిథో వైరం ప్రకుర్వన్తి తే నశ్యన్తీహ మన్త్రిణః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 300)
లలితాదిత్యుడు ఏర్పాటు చేసిన ఈ ‘నీతి’ని ఉల్లంఘించి అసూయ ద్వేషాలకు తావిచ్చిన మంత్రులు నశిస్తారు.
మలాఏసాకదర్యావఖానాదీనాం విరోధతః।
స్వభేదజర్జరం రాజ్యం దృష్టం శ్రీజైనభూపతేః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 301)
తదాప్రభృతి తేనైవ దృష్టే నాశేత్ర మండలే।
మన్త్రిణో నైవ కస్యాపి మత్సరో విరమత్యయమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 302)
అహో ద్వేషపిశాచోయం రూఢో రాజసభాశయే।
కేనాపి మన్త్రిణా నైవ జీయతే సర్వనాశకః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 303)
ముల్లా ఈసాన్, దర్యార్ ఖాన్ వంటి వారి విద్వేషాల కారణంగా జైనభూపతి రాజ్యం విభిన్నమయింది. రాజ్యం నాశనమవటం చూసి కూడా వారు తమ అసూయ ద్వేషాలను అణచి వేయలేదు. కొనసాగించారు. అయ్యో! ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే రాజసభలో కూడా ద్వేష పిశాచం ఉత్పన్నమయింది. ఏ మంత్రి కూడా దీన్ని అణచి వేయలేకపోయాడు.
‘ఈసాన్’ అన్నది అరబ్బీ నామం. ‘ఇష్పియన్’ అన్నది దీని అపభ్ర్రంశం. ముల్లా ఈసాన్ లేక ముల్లా ఇషాహన్ కావచ్చు అని పరిశోధకులు భావిస్తున్నారు. ‘దరయార్’ పార్సీ శబ్దం.
జైనులాబిదీన్ సామ్రాజ్యాన్ని అల్లకల్లోలం చేసింది మంత్రుల నడుమ విద్వేష భావనలు. ఒక్కో మంత్రి, జైనులాబిదీన్ ఒక్కో కొడుకుని తమ అయుధంగా చేసుకుని వారి నడుమ అధికార పోరు సృష్టించారు. ఫలితంగా రాజ్యం అల్లకల్లోలమయింది. ఇప్పుడు హసన్ షాహ రాజ్యంలో కూడా అవే మాత్సర్యాలు, అవే విద్వేషాలు పొడుచూపుతున్నాయని శ్రీవరుడు ఆందోళన ప్రకటిస్తున్నాడు. ఎందుకంటే రాజ్యం శాంతితో ఉన్నంత కాలమే ఇస్లామేతరుల జీవితాలు భద్రంగా ఉండేది. రాజ్యం అల్లకల్లోమైతే ముందుగా నష్టపోయేది ఇస్లామేతరులే. ఇది శ్రీవరుడికి బాగా తెలుసు.
రోగో హతప్రయోగో వ్యాలో వా ఘృతమహావిషజ్వాలః।
నాగ్నిస్తాదృగ్ భయకృత్ ప్రకృతివిరోధో యథా దేశే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 304)
చికిత్సలేని రోగం, మహావిషం, నిప్పులుమిసే సర్పం, అగ్ని వంటివేవీ దేశంలో మంత్రుల నడుమ చెలరేగే ద్వేషాన్ని మించి భయకారకాలు కావు.
శ్రీవరుడి ఆందోళన ఇక్కడ తెలుస్తోంది. అధికార దాహం, అహంకారం, మాత్సర్యం వంటివి దేశ వినాశకారకాలు. ఎప్పుడయితే ఇవి పాలకులు, అధికారుల నడుమ చెలరేగుతాయో అప్పుడు ఒకరినొకరు దెబ్బ తీసుకోవాలని చూస్తారు. తమ అధిక్యం ప్రదర్శించాలని చూస్తారు. ఫలితంగా ప్రజలు నష్టపోతారు. దేశం బలహీనమౌతుంది. శ్రీవరుడి మాటలలో నిజం అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడో మధ్య యుగంలోని చరిత్రలో వెతక నవసరం లేదు. మన చుట్టూ జరుగుతున్న విషయాలను గమనిస్తే చాలు. ‘దేశం’ అల్లకల్లోలం అయినా ఫరవాలేదు. అధికారం దక్కతే చాలు అన్న అధికార దాహపు అగ్ని జ్వాలలు కనిపిస్తాయి కళ్ల ఎదురుగానే. దేశాన్ని దగ్ధం చేసేందుకు సిద్ధంగా!
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
