[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
అత్రాంతరేహ్యదాయుక్తో యుక్తోపి నయసంపదా।
అధీర ఇవ నాశాయ నేయబుద్ధత్వ మగ్రహీత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 305)
నీతి సంపన్నుడు, పాలన నైపుణ్యం కలవాడు అయిన మంత్రి అహ్మద్, మనసుపై నియంత్రణ లేని వాడిలా ఇతరులు చెప్పిన మాటలు వింటూ, వినాశనం వైపు మ్రొగ్గిన వాడయ్యాడు.
ఏకదా పితరం పుత్రా విజనే నౌరుజాదయః।
ఇత్యూచుర్దపణాం తాజిభట్టీయాం విభవాసహాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 306)
నిగ్రహానుగ్రహైకాగ్రః సమగ్రే మన్త్రిమణ్డలే।
ఉగ్రో భట్టః ప్రజాయాసైర్దేశనాశాయ వర్ధితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 307)
తత్రాపి దుగ్ధ పితృతా రాజసూనోనృ పాస్పదే।
అగ్రే యయౌ సమాయోగః సోఽయం దాహాయ దుఃసహ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 309)
రాజ్ఞీరాజావదశ్చాస్మై సేనానీరయమేవ హి।
ప్రబలం బాధతే హ్యస్మాన్ యది నాయ ప్రణాశ్యతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 309)
ఒక రోజు అహ్మద్ సంతానం, నౌరోజు, ఇతరులు, తండ్రి ముందు తాజిభట్టును దూషించటం ప్రారంభించారు. తాజిభట్టు అక్రమంగా బోలెడంత ధనం సంపాదించాడని, ప్రజల మద్దతు తనకు అధికంగా ఉన్నదన్న గర్వంతో, దేశాన్ని దోచుకుంటూ తాను ధనం సంపాదిస్తున్నాడనీ దూషించారు. ‘అక్రమార్జనతో అతడు అందరికన్నా ధనవంతుడవుతున్నాడు. రాణి మద్దతుతో రాకుమారుడి సంరక్షణ బాధ్యతను కూడా అతడికే అప్పగించారు. ఇది అతడిని మరింత శక్తివంతుడిని చేసింది. తాజిభట్టు శక్తిమంతుడవటం అంటే మనం నాశనం అవటం తప్పదు. ఇది దుస్సహము, దుఃఖ కారణం. రాజు, రాణి ఇద్దరూ అతడికి అనుకూలంగా ఉన్నారు. అతడిని సేనాపతిగా నియమించారు. అతడిని నాశనం చేయకపోతే, అతడు మనకు తీవ్రమైన నష్టం కలిగిస్తాడు. కష్టపెడతాడు.’
రాజ్యంలో శక్తిమంతులయిన మంత్రుల నడుమ మాత్సర్యాలు పెరిగితే అది దేశానికీ, ప్రజలకు నష్టం అని ముందరి శ్లోకాలలో శ్రీవరుడు చెప్పినదానికి నిరూపణ ఇది. తాజిభట్టుకు రాజు రాణిల మద్దతు లభిస్తున్నదనీ, అతడు శక్తిమంతుడయితే, తనకూ నష్టం కలుగుతుంది కాబట్టి, అతడు మరింత శక్తిమంతుడయ్యేలోగా, అతడిని దెబ్బతీయక పోతే తనకు నష్టం కలుగుతుందనీ, అహ్మద్ సంతానం అహ్మద్‌ను రెచ్చగొడుతున్నారు. ఇరువురినీ అధికారం కోసం పోరుకు సిద్ధం చేస్తున్నారు.
ఇలాగే దేశాలు నష్టపోతాయి. ప్రజలు కష్టాల పాలవుతారు. ఇది తెలిసి కూడా అసూయతో అహంకారంతో, అధికార దాహంతో శక్తిమంతులు ప్రజల జీవితాలతో చెలగాటాలడతారు. దేశాన్ని దెబ్బతీస్తారు. తామున్న కొమ్మని తామే నరికేస్తారు. ఆ తరువాత ఆశ్రయం లేక విలవిలలాడతారు. ఆ కాలంలో అయినా, ఈ కాలం అయినా మానవ చరిత్ర మొత్తం అహంకార పోరాటాల మయం. అధికార ఆరాటాల వృత్తాంతం.
ఇత్యాకర్ణ్య సుతైరుక్తంవైగుణ్యాదవలోక్య చ।
పుత్రీకృతేపి మల్లేకస్తాజిభట్టే వ్యరజ్యత॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 310)
పుత్రుల మాటలు విన్న మల్లిక (అహ్మద్) ఇప్పుడు తాజిభట్టును చూసే దృష్టి దోషభావంతో కూడుకున్నదయింది. తాను దత్త పుత్రుడిగా స్వీకరించిన తాజిభట్టుపై విరక్తి కలిగింది.
ఇక్కడ విరక్తుడవటం అంటే అతడితో వైరం పూనటంగా అర్థం చేసుకోవాలి. తాజిభట్టుపై ఉన్న పుత్ర ప్రేమ నశించింది అని అర్థం. ఇప్పుడు ఎలాగయినా తాజిభట్టును నాశనం చేయటమే అతని లక్ష్యం.
రాజ్యాఙ్గాని సమస్తాని యోరక్షత్ సమయా దృశా।
ప్రాక్పుణ్య సంక్షయాత్ సోపి శనైరాసీత్ స్ఖలన్మతిః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 311)
గతంలో సమస్త రాజ్యాంగాలను సమదృష్టితో చూసిన అతని దృష్టి ఇప్పుడు మారిపోయింది. అతడి బుద్ధి మారిపోయింది.
ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ‘మాట’. ఒక్క మాట మనిషి దృష్టిని మార్చేస్తుంది. వ్యక్తిత్వాన్ని రూపాంతరం చెందిస్తుంది. మనిషిని పశువు చేస్తుంది. పశువులాంటి మనిషికి దైవత్వం నేర్పుతుంది. అందుకే సుభాషితం ఆకర్షణీయంగా, చక్కగా మాట్లాడేవాడు పదివేలల్లో కూడా దొరకడంటాడు శ్రీవరుడు.
శతేషు జాయతే శూరః సహస్రేషు చ పండితః।
వక్తా దశసహస్రేషు దాతా భవతి వా న వా॥
వీరుడు వందల్లో ఒకడు దొరుకుతాడు. వేయిమందిలో ఒక చక్కని పండితుడు లభిస్తాడు. కానీ అందరినీ మెప్పించి, ఒప్పించే తెలివైన మాటకారి మాత్రం పదివేలల్లో ఒకడు కూడా లభించటం అరుదు.
గమనిస్తే, ఈ శ్లోకంలో అందరికన్నా తక్కువ స్థాయి వీరుడిది. వీరత్వం, ఒకరకంగా పశుత్వంతో సమానం. అందుకని వందల్లో ఒక్కడు లభిస్తాడు. పాండిత్యం, వీరత్వం కన్నా పైస్తాయిది. ఇది మానవ లక్షణం. ధారణ శక్తి ఉన్నవాడు, కష్టపడి నేర్చుకునేవాడు పండితుడిగా చలామణీ అవవచ్చు. కానీ, ఎంతగా వీరుడయినా, ఎంత పాండిత్యం ఉన్నా మాటకారి కాకపోతే లాభంలేదు. ఒక పండితుడు ఎంత గొప్ప పాండిత్యం ప్రదర్శించినా, ప్రజలు చమత్కారి అయిన మాటకారి పనికిరాని మాటలనే అధికంగా ఇష్టపడతారు.
కేయూరాణి న భూషయంతి పురుషం హారా న చంద్రోజ్జ్వలా।
న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజాః।
వాణ్యేక సమలంకరోతి పురుషం యా సంస్కృత ధార్యతే।
క్షీయన్తే ఖలు భూషణాని సతతం వాగ్భూషణం భూషణమ్॥
ముత్యాల ఆభరణాలు కానీ, చంద్రుడి వంటి హారాలు కానీ, సుగంధ జలంతో స్నానం కానీ, శరీరానికి పూసుకునే సుగంథ ద్రవ్యాలు కానీ, ధరించే పూలు కానీ వ్యక్తికి అసలైన ఆభరాణలు కావు. వ్యక్తికి అసలైన చక్కని, సంస్కారవంతమైన మాట. దాన్ని మించిన అభరణం లేదు.
ఇది ‘మాట’ ప్రాధాన్యం. ఇది తెలియక అధునిక ప్రపంచంలో పెద్ద చిన్న, లేకుండా ఎవరిని పడితే వారిని నోటికి ఎంత వస్తే అంత అనేయటం, దూషించటం, హేళన చేయటం, వెక్కిరించటం గొప్ప అనుకుంటున్నారు. అలా విచ్చలవిడిగా నోటికి అడ్డు అదుపు లేకుండా మాటలనేయటం, ఎంతవారినైనా, ఏమైనా అనేయటం తమ హక్కు అనుకుంటున్నారు. దాన్ని ఇతరులు ‘స్వేచ్ఛ’ పేరిట సమర్థిస్తూండటంతో అదే గొప్పతనం అన్న రీతిలో యువతరం భావించటం మనం అనుభవిస్తూనే ఉన్నాం. ‘మాట’ ప్రాధాన్యం మరచి, ‘తూటాలంటి మాటలతో’ మూర్ఖత్వానికి, అనాగరిక, అనుచిత, అన్యాయ ప్రవర్తనకు కోట కట్టి సంరక్షిస్తున్నాం. ఒకప్పుడు పిల్లలు అనుచితంగా మాట్లాడితే పెద్దలు సరిదిద్దేవారు. కానీ ఇప్పుడు పెద్దలూ ఈ ‘మాటలు’ ప్రభావంలో పడిపోతున్నారు. అలాగే అహ్మద్ మల్లిక్ కూడా కొడుకుల మాటల ప్రభావంలో పడ్డాడు.
స్వార్థం పరిత్యజ్య విభోర్హితం యే
కుర్వన్తి తత్కార్యకృతావధానాః।
వినాశకాలే సముపస్థితే తే
ధవన్త్యకస్మాద్ విపరీతచేష్టాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 312)
నిస్వార్థంగా, ప్రభు హితం కోసం పాటుపడేవారు. అనుక్షణం ప్రభు కార్యాల నిర్వహణ కోసం అప్రమత్తంగా ఉండేవారు.. వారి వినాశకాలం సమీపించినప్పుడు అకస్మాత్తుగా వారి ప్రవర్తన మారిపోతుంది.
ఇతి చిన్తాకులస్తాంస్తానుపాయాన్ మల్లికోకరోత్।
అథై కదాబ్రవీద్రాజ్ఞః సభాయాం మల్లికః క్రుయా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 313)
ఈ రకంగా ఆలోచిస్తూ, తాజిభట్టును దెబ్బతీసే అవకాశం కోసం ఎదురుచూస్తూ ఒక రోజు సభలో మల్లిక్ అహ్మద్ కోపంతో అన్నాడు.
రాజ్యేనాప్తేన కిం రాజన్నాక్రాన్తా బాహ్యభూః పరైః।
చిన్తా కస్యాపి నైవాస్తి యావత్సర్వం ప్రణశ్యతి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 314)
ఓ రాజా! రాజ్యం లభించటంలో గొప్ప ఏముంది. శత్రువులు భూమిని ఆక్రమించినప్పుడు దాని గురించి ఎవరికీ పట్టింపు లేదు. అంతా నాశనం అయిపోతోంది.
చాలా తెలివిగా ఎవారూ కాదనలేని అంశం ఎంచుకున్నాడు. దేశ సరిహద్దులలో శత్రువు పొంచిఉన్నాడని ఎత్తి చూపించటం ఎదురులేని వజ్రాయుధం.
వరం స్వయమహం యామి తదాజ్ఞా దీయతాం విభో।
ఇతి శ్రుత్వాత్రవీత్ తాజిభట్టస్త సాహసోత్సుకః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 315)
అందుకని ప్రభూ! నాకు ఆజ్ఞ ఇవ్వండి. శత్రువులతో పోరాడేందుకు నేను స్వయంగా వెళ్తాను.
ఇది విన్న తాజిభట్టుకు ఉత్సాహం హెచ్చింది.
యాత్రాయై దీయతాంరాజ్ఞా సేనానీర్మత్పరోధికః।
తచ్ఛ్రుత్వా సర్వసామగ్రీం దవా మల్లికచోదితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 316)
నాకు ఈ ప్రయాణానికి ఆజ్ఞ ఇవ్వండి. ఈ సమయంలో శత్రువులతో తలపడేందుకు నన్ను మించిన వీరుడెవరున్నాడు?
అది విన్న మల్లిక్ ప్రేరేపితుడయిన రాజు అందుకు ఒప్పుకున్నాడు.
‘మ్యాచ్ ఫిక్సింగ్’ జరిగిపోయిందన్న మాట. అహ్మద్ మల్లిక్ ముందే రాజుతో మాట్లాడి పెట్టుకున్నాడన్నమాట. ‘మల్లిక చోదితః’ అనటంలోనే ‘మ్యాచ్ ఫిక్సింగ్’ స్పష్టమైపోతుంది.
రాజా త కటకోపేతం బాహ్యదేశ వ్యసర్జయత్।
భీత్యా ప్రీత్యా చ నీత్యా చ జగ్ముస్తమను సేవకాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 317)
మధుపా ఇవ గర్జన్తో యాతం మధుకరేశ్వరమ్।
రాజప్రక్రియయా రమ్యం దృష్ట్వా త వ్యయశాలినమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 318)
పెద్ద సైన్యం ఇచ్చి అతడిని కశ్మీరు బయటకు పంపించేశాడు. భీతి-ప్రీతి-నీతి వల్ల సేవకులు కూడా అతడి వెంట వెళ్లారు. సేవకులు ఎలా తాజిభట్టు వెంట వెళ్లారంటే, తుమ్మెదల రాజు వెంట ఇతర తుమ్మెదలు వెళ్లినట్టు.
నృపా రాజపురీయాద్యా బభూవుర్విమ్మితాశయాః।
అన్యే అప్యజ్యభదేవాద్యాః సమస్తాః మద్రమండలే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 319)
రాజపురి, ఇతర దేశాల రాజులు తాజిభట్టు సేనను చూసి ఆశ్చర్య చకితులయ్యారు. మద్రమండలంలో రెండవ అప్యజ్యభదేవుడు ఇతరులు అతడిని చూసి సంతోషించారు.
అప్యజ్యభదేవుడంటే అజయదేవుడుగా చరిత్ర రచయితలు భావిస్తున్నారు. ‘తవ్వకత్-ఎ-అక్బరీ’లో ఇతని పేరు అజవదేవుడని ఉంది. జమ్ము రాజు అజవదేవుడు యారీ (తాజిభట్టు) ను కలిశాడు అని ఉంది.
పీర్ హసన్ ఈ సంఘటనను ప్రస్తావిస్తూ, “పంజాబ్‌పై దాడి చేసేందుకు జమ్ము రాజు అజవదేవ తన సైన్యాన్ని తాజిభట్టు సైన్యానికి తోడుగా పంపాడు” అని రాశాడు.
డోగరి చరిత్ర ప్రకారం హమీర్ దేవుడికి ఇద్దరు కుమారులు. ఒకరు హసలదుడు. రెండవ వాడు అజవదేవుడు. అజవదేవుడు 31 సంవత్సరాలు పాలించాడు.
ఫరిష్త ప్రకారం మలిక్ యారీ భట్టు పంజాబ్‌పై దాడి చేసేందుకు జమ్ము రాజుకు సహాయం చేశాడు. అతడు సయాల్‌కోట్‌ను దోపిడి చేసి నష్ట పరిచాడు.
కలనల్ బ్రిగ్స్ ప్రకారం కశ్మీర్ సేన పంజాబ్‌పై దాడి చేయటం వెనుక జమ్ము రాజు ప్రేరణ ఉంది. జమ్ము రాజు అజవదేవుడు. గతంలో తాతార్ ఖాన్‌తో యుద్ధంలో ఓడిపోయాడు. ఇప్పుడు కశ్మీర్ సహాయం కోరాడు, పఠాన్‌ను దెబ్బతీసేందుకు. కశ్మీర్ సేనకు సేనాపతి మాలిక్ తాజిభట్టు అన్నాడు కలనల్ బ్రిగ్స్.
కశ్మీర్ సరిహద్దులను తాతార్ ఖాన్ నష్టపరుస్తూండటంతో జమ్ము రాజు సహాయం కోసం తాజిభట్టు సైన్యంతో వచ్చాడంటాడు చరిత్ర రచయిత రోజర్స్. కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా ప్రకారం, హసన్ షాహ, యూరీ భట్టు నేతృత్వంలో పంజాబ్‌ను అదుపులో పెట్టేందుకు సైన్యాన్ని పంపాడు. యూరి భట్టు సియాల్‌కోట్ ప్రాంతాన్ని నాశనం చేశాడు. ఆ సమయంలో పంజాబ్, ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహమ్ లోడీ సామంతుడు తాతార్ ఖాన్ లోడీ ఆధీనంలో ఉంది. సియాల్‌కోట్ దోచి సాధించిన ధనంతో తాజిభట్టు ప్రత్యేక సైనిక దళాన్ని ఏర్పాటు చేశాడంటుంది కేంబ్రిడ్జి చరిత్ర.
గమనిస్తే అందరూ శ్రీవరుడి తరువాత రాసినవారే. హసన్ షాహ పంజాబ్‌ను అణచటానికో జమ్మూ రాజు సహాయానికో తాజిభట్టు నేతృత్వంలో సైన్యాన్ని పంపాడని అంగీకరిస్తున్నారు. కానీ సైన్యం తాజిభట్టు నేతృత్వంలో పంపటం వెనుక ఉన్న కశ్మీరు అంతర్గత రాజకీయాలను శ్రీవరుడు ప్రస్తావించాడు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
