[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
తత్తారఖానముత్సృజ్య తుష్టాస్తముపతస్థిరే।
తదుపోఇలితా మద్రాః క్షుద్రా విద్రావితారయః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 320)
దేశం తత్తారఖానీయం సోపద్రవమచీకరన్।
దహన్ శృంగాలకోటాదౌ మస్జేదాం ఖాననిర్మితామ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 321)
సామాన్యకులజో అప్యేష నిఃసారో అనుమితో జనైః।
అచిన్త్య కృతకార్యాసీత్ స్వామిస్నేహప్రభావతః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 322)
తాజిభట్టు పెద్ద సైన్యం చూసి మద్ర ప్రజలు తాజిభట్టు వైపు వచ్చేసారు. వీరి మద్దతుతో ‘మద్ర’ ప్రజలు శత్రువులను పరాజితులను చేశారు. తాతార్ ఖాన్ దేశాన్ని అల్లకల్లోలం చేశాడు. శృంగాల కోటలో ‘ఖాన్’ నిర్మించిన మసీదులను కూల్చివేశాడు. ఇది చూసి ప్రజలందరు ఇతడు నీచకులోత్పన్నుడు, కానీ ప్రభువు స్నేహం వల్ల ఉచితానుచితాలు మరచి ప్రవర్తిస్తున్నాడని, చేయకూడని పనులు చేస్తున్నాడని దూషించారు.
తాను చూసిన చరిత్రను నిజాయితీగా చెప్తున్నాడు శ్రీవరుడు.
మాలిక్ తాజిభట్టు పెద్ద సైన్యంతో సరిహద్దుల వద్ద ఉన్న విదేశీ శత్రు సేనలను తరిమి వేయాలని బయలుదేరాడు. అతడి సేన చూసి ‘రాజపురి’ (రాజౌరి) ప్రజలు విస్మితులయ్యారు. మద్ర దేశ ప్రజలు తాజిభట్టు వైపు వచ్చేశారని రాస్తున్నాడు శ్రీవరుడు. యుద్ధం ప్రసక్తి తేలేదు.
‘తవ్వకాత్-ఎ-అక్బరీ’ ప్రకారం, తాజిభట్టు పెద్ద సేన తీసుకుని వచ్చాడు. ఢిల్లీ సుల్తాన్ సామంతరాజు తాతార్ ఖాన్‌ను ఓడించాడు. అతని సామ్రాజ్యాన్ని నష్టపరిచాడు. పీర్ హసన్ సైతం తాజిఖాన్, తాతార్ ఖాన్ల నడుమ ఘోరమైన యుద్ధం జరిగిందని రాశాడు. ‘శృంగాల కోట’ ఒకప్పటి పేరు శ్యాకల్, కేవేన సగల గా భావిస్తారు. ఈ సగల ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న ‘సియాల్కోట్’. ఇది మినాందర్ (మిళింద పన్హాలో ప్రశ్నలడిగిన మిళిందుడు) శీతకాలీన రాజధాని. తాజిభట్టు, తాతార్ ఖాన్ దేశాన్ని, రాజధాని ‘సియాల్కోట్’నూ నాశనం చేశాడు.
శ్రీవరుడు ప్రస్తావించకపోవటంతో, తాజిభట్టుకూ, తాతార్ ఖాన్‌కు నడుమ ఘోరమైన సంగ్రామం జరిగిందో లేదో నిర్థారించటం కష్టం. పర్షియన్ చరిత్రకారులు యుద్ధం జరిగినట్టు చెప్తారు. కానీ, పర్షియన్ చరిత్ర రచయితలు పలు సందర్భాలలో యుద్ధానికి సంబంధించిన విషయాలలో అబద్ధాలు రాయటం కనిపిస్తుంది. వారు గెలిచిన చిన్న యుద్ధాన్ని కూడా ఘోరమైన యుద్ధంగా వర్ణించి వారి విజయం ఎంతో గొప్పదన్న భావన కలిగిస్తారు. తాము ఓడిన యుద్ధాల గురిచి మౌనం వహిస్తారు. చెప్పటం దాటేస్తారు. కాబట్టి యుధ్ధం గురించి పర్షియన్ రచయితలు చెప్పే విషయాలను ‘నిజం’గా భావించటం కష్టం.
‘తాతార్ ఖాన్’ ఢిల్లీ పాదుషాలతో దగ్గర సంబంధం ఉన్నవాడు. కశ్మీరు సేనాపతి తాజిభట్టు యుద్ధంలో గెలిచిన మద్ర దేశం ప్రస్తుతం పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలోనూ, భారత్‌లో ఉన్న పంజాబ్ ప్రాంతంలో కశ్మీరును ఆనుకుని ఉంటుంది. పాక్ ఆక్రమిత కశ్మీరు, గిల్గిత్ – బాల్తిస్తాన్, లదాఖ్, జమ్ము పర్వత పాదాల వద్ద ఉన్న ప్రాంతలన్నీ కలిపితే ఒకప్పటి మద్ర దేశంగా భావిస్తున్నారు. దీనిపై ఢిల్లీ సుల్తానుల ఆధిపత్యం ఉండేది. శ్రీవరుడు ప్రస్తావించిన కాలంలో ‘లోడీ’ వంశస్తులు ఢిల్లీ పరిపాలకులు. వారి తరువాత మొఘలులు ఢిల్లీ పై అధికారం సాధించారు. ‘తవ్వకాత్-ఎ-అక్బరీ’ రాసిన ఖ్వాజా నిజాముద్దీన్ అహ్మద్ ‘అక్బర్’ పాలనలో ‘మీర్ బక్ష్’ (Paymaster General) గా పని చేశాడు. కాబట్టి, ఢిల్లీ సుల్తానులకు చెందిన ప్రాంత ప్రజలు, కశ్మీరుకు చెందిన పెద్ద సైన్యాన్ని చూసి లొంగిపోయారని రాస్తే, ఆ సమయానికి కశ్మీరుపై ఆధిక్యం సాధించిన అక్బర్‌కు నచ్చదు. ఎందుకంటే, విజేతలు ఎప్పుడూ పరాజితుల ఆధిక్యాన్ని, తమ బలహీనతలను ఒప్పుకోరు. అవి ప్రజలకు తెలియటం అస్సలు ఆమోదించరు. కాబట్టి ఘోర యుద్ధం జరిగిందని రాయటం వల్ల పరువు నిలబడుతుంది.
పీర్ హసన్ 19వ శతాబ్దానికి చెందినవాడు. అతడికి శ్రీవరుడు రాసిన దాని కన్నా ‘తవ్వకాత్-ఎ-అక్బరీ’లో ఉన్న దాని పట్లనే విశ్వాసం ఉండటంలో ఆశ్చర్యం లేదు. కాబట్టి తాజీఖాన్, తాతార్ ఖాన్ల నడుమ ఘోరమైన యుద్ధం జరిగిందని రాయటంలో అశ్చర్యం లేదు. కానీ శ్రీవరుడు జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి. అతడు కశ్మీరు సుల్తానుల ఆశ్రయంలో ఉండి రాస్తున్నాడు. కాబట్టి ఘోరమైన యుద్ధం జరిగిందనీ, తాజీభట్టు గొప్ప శౌర్యం ప్రదర్శించాడని రాస్తే అతడికి లాభం. కానీ శ్రీవరుడు అలా రాయలేదు. కేవలం సైన్యం చూసి ప్రజలు లొంగిపోయారని రాశాడు. అంతే కాదు, అలా లొంగిపోయిన తరువాత కూడా తాజిభట్టు దేశాన్నీ, రాజధానినీ నాశనం చేశాడని రాశాడు.
రాజధానిని నాశనం చేస్తూ, ఖాన్ నిర్మించిన మసీదునూ దహనం చేశాడని రాశాడు శ్రీవరుడు.
ఇటీవలి కాలంలో ఇస్లామీయులు మందిరాలను ధ్వంసం చేశారనగానే, ‘కశ్మీరులో శ్రీహర్షుడు మందిరాలను నాశనం చేశాడ’ని ఎదురు వాదన అధికంగా వినిపిస్తోంది. ఇలా వాదించేవారు – వారూ వీరూ చెప్తే విన్న వారే కానీ రాజతరంగిణి చదివిన వారు కాదు.
రాజతరంగిణిలో కల్హణుడు 7వ తరంగంలో 1073 శ్లోకం నుండి 1107 శ్లోకం వరకు – హర్షుడు, మందిరాల నుండి ఐశ్వర్యాన్ని కాజేయటం గురించి చెప్తాడు. మందిరాల ధ్వంసం గురించి కాదు. కశ్మీరు ధనాన్ని హర్షుడు ఇష్టం వచ్చినట్టు, ముందూ వెనకా చూడకుండా ఖర్చు చేసేస్తాడు. దాంతో దేశం ఆర్థికంగా పూర్తిగా దెబ్బ తింటుంది. ఆ సమయంలో భీమేశ్వర మందిరాన్ని దర్శిస్తాడు హర్షుడు. ఆ మందిరంలో రహస్యంగా దాచి ఉంచిన ధనాన్ని చూస్తాడు. ఆ మందిరాలలో దాచి ఉంచిన ధనం, బంగారంతో చేసిన విగ్రహాలను కరిగిస్తే లభించే ధనం తన ఆర్థిక కష్టాలను తీరుస్తాయని భావిస్తాడు. ఫలితంగా మందిరాలలోని ధనాన్ని కొల్లగొడతాడు. విగ్రహాలను కరిగించి వేస్తాడు. అయితే, ప్రజలు హర్షుడిని ఏమని దూషిస్తారంటే, ‘తురుష్క హర్షుడు’ అని.
‘తురుష్క హర్షుడు’ తురుష్కులంటే ఎంతో ఆదరణ చూపుతాడు. అందమైన తురుష్క మహిళల ప్రభావంలో పడతాడు. వారితో గడిపేందుకు తహతహలాడతాడు. వారి వల్ల వారి వెంట ఉన్న పురుషులకు – ప్రధాన ఉద్యోగాలిస్తాడు. ఎప్పుడూ హర్షుడి వెంట ఓ తురుష్కడుంటాడు. అతడి చేతిలో హర్షుడు కీలుబొమ్మ. అతడి ప్రభావం వల్ల ఆర్థిక సమస్యల నుండి గట్టెక్కేందుకు మందిర ధనంపై హర్షుడు కన్నేశాడని ఊహించటం కష్టం కాదు. ‘సికిందర్ బుత్కిషన్’ అకృత్యాలకు అతడి అనుచరుడు, మతం మారిన ‘సూహభట్టు’ను దోషిగా జోనరాజు నిలిపినట్టు, హర్షుడు మందిర ధనాన్ని కాజేయటానికి నేరం తురుష్కుడిపై పెట్టలేదు శ్రీవరుడు. ఎందుకంటే, కల్హణుడు ఏ రాజాశ్రయం లోనో ఉండి రాజతరంగిణిని రాయలేదు. కాబట్టి రాజు దోషం సేవకుడిపై నెట్టివేయాల్సిన అవసరం రాలేదు. అందుకే, హర్షుడు తురుష్కుడు చెప్పినట్లు వింటున్నాడు కాబట్టి ప్రజలు అతన్ని ‘తురుష్క హర్షుడు’ అని హేళనగా పిలిచేవారు అని రాయటం తప్ప, అతడి ప్రేరణతో మందిరాల ధనం కొల్లగొట్టాడని హర్షుడు అమాయకుడనీ రాయలేదు. పైగా చేసిన పాపాల ఫలితంగా, ఘోరంగా, పశుశాలలో అతి దయనీయమైన స్థితిలో చస్తాడు హర్షుడు (కస్తూరి మురళీకృష్ణ రాసిన ‘కశ్మీర కల్హణ రాజతరంగిణి కథలు’ లో, ‘తురుష్క హర్షుడు’ కథ చదవండి).
ఈ ‘తురుష్క హర్షుడి’ని ఉదాహరణగా తీసుకుని హిందూ రాజులు కూడా మందిరాలను కొల్లగొట్టారు, తురుష్కులు ఆ పని చేస్తే బాధ ఏమిటని ప్రశ్నిస్తారు కొందరు లౌకిక ఉదారవాదులు. మందిర ధ్వంసం దోషం మంచి తురుష్కులను విముక్తి చేయాలని ప్రయత్నిస్తారు.
“Temples were destroyed, but the motivation was not limited to religious animosity. There was also a greed for wealth and a desire to assert power. Wherever great wealth accumulates, whether in secular or religious institutions, with management committees to administer and enhance the wealth, as was the case in the richer temples, there is inevitably an involvement with non-religious concerns.” (Destruction of the Babri Masjid: A National Dishonour; by A.G Noorani)
కానీ ‘కల్హణుడు’ రాజతరంగిణిలో హర్షుడి ఉద్దేశ్యం మందిరంలోని ధన్నాన్ని కాజేయటమే అని స్పష్టంగా చెప్పాడు.
తతో వివిధవాహినీకోశాదానోద్యతో నృపః।
సేనాగౌరవహేతోః స దేవానాం భూషణో అగ్రహీత్॥
(కల్హణ రాజతరంగిణి, VII-1089)
ఖర్చులు అధికమయిపోవటంతో, సైన్యం పాలన కోసం ధనం అవసరమయింది. ధనం కోసం దేవతల ధనాన్ని కాజేయటం ఆరంభించాడు.
అయితే, ఈ ‘దేవోత్పాటననాయక’ అన్న మంత్రిత్వ శాఖను హర్షుడు ‘లోస్తధరుడు’ అనే వాడికి కట్టబెడతాడు. ఈ లోస్తధరుడు అత్యంత ఉత్సాహంతో మందిరాలలో విగ్రహాలను, ధనాన్ని కొల్లగొట్టటం పర్యవేక్షిస్తాడు. హర్షుడిని ఈ పని కోసం ప్రోత్సహించింది, వెంటనున్నదీ కూడా లోస్తధరుడే.
లోస్తధరుడు వైష్ణవ కుటుంబానికి చెందినవాడు. అనంతమహారాజు ప్రధాన మంత్రి హలధరుడికి సమకాలికుడు ఈ లోస్తధరుడు. కానీ ఇతడు అజీవకుల ప్రభావంలో పడి భారతీయ ధర్మాన్ని వదిలినవాడు. ‘అజీవకుల’ మత సంబంధిత అవైదిక కార్యక్రమాలలో పెద్ద పెద్ద మట్టి గుళికలను, ఇనుప గుళికలను చేతిలో పెట్టుకోవటం ఉంటుంది. అందుకని అతడికి లోస్తధరుడున్న పేరు వచ్చింది. లోస్తధరుడంటే, మట్టి గుళికలు పట్టుకునేవాడు. ప్రఖ్యాత చరిత్ర రచయిత – ఎ.ఎల్. బాషామ్ ‘Harsa of Kashmir and the Iconoclast Ascetics’ అన్న పత్రంలో ఈ వివరాలు ప్రకటించాడు. ఇది Bulletin of the School of Oriental and African Studies (BSOAS), Oct 1948, issues 3-4, Pages 140-145; లో ప్రచురించారు.
కల్హణుడు హర్షుడుని తురుష్క హర్షుడని, రాక్షసుడనీ దూషించాడు. తురుష్క హర్షుడు ఎక్కడెక్కడ ఖరీదైన విగ్రహాలున్నాయో, వాటన్నిటినీ ఏరి ఏరి మరీ కరిగించి వేశాడని రాస్తాడు. ఈ పని చేయటానికి అతడు తురుష్క కిరాయి పనివారిని ఎన్నుకున్నాడు. ఈ సమయంలో హిందూ పద్ధతులు విసర్జించి విదేశీ పద్ధతులను స్వీకరించాడని రాశాడు కల్హణుడు. దీని ఆధారంగా, హర్షుడు రహస్యంగా మతం మారి ఉండవచ్చునని పలువురు భావిస్తున్నారు. కానీ ఆ కాలంలో కశ్మీరులో గుప్పెడు మందే తురకలు ఉండేవారు. తురక మహిళల పొందు కోసం, వారి సంతృప్తి కోసం రహస్యంగా మతం స్వీకరించి ఉండవచ్చనీ కొందరు చరిత్ర రచయితలు అభిప్రాయపడుతున్నారు. అజీవకుడి సలహా వల్ల బౌద్ధ విహారాలు, మందిరాల నుండి మాత్రమే హర్షుడు ధనం కొల్లగొట్టాడన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కానీ, ఈ అభిప్రాయాలన్నీ తప్పు అని రష్నీక్ ఖేర్ ‘Iconoclasm in Kashmir: Harsha – The Iconoclast’ అన్న వ్యాస పరంపరలో స్పష్టం చేస్తారు.
“Why I wish to discuss this king is because he has been pulled out of the historical wilderness time and again by the Marxist historians. This one example is used as a counterweight to the huge historical evidence that we have to support religious persecution and Iconoclasm by hundreds of Muslim rulers all over south Asia and not just Kashmir alone.”
ఈ వ్యాసంలో ఆయన అందరి వాదనలనూ పూర్వపక్షం చేస్తూ, “Though the actions may have similarities, the motivations were very different.” అని నిరూపిస్తాడు. చివరలో, “it is conclusively proved in case of Harsha that although he did destroy temples and Viharas both but the reason was not to promote Hinduism or to subjugate Buddhism. What however can be argued is that he may be doing at the behest of whom Kalhana calls Turks what later Muslim kings did.”
అంటే, కల్హణ రాజతరంగిణి చదివినవారు, పరిశోధించినవారు, తురుష్క హర్షుడు మందిరాలలోని ధనాన్ని దోచుకోవటాన్ని – ఇస్లామీయులు భారతీయుల మందిరాలను ధ్వంసం చేయటంతో పోల్చారు. తురుష్క హర్షుడికి కావల్సింది ధనం మాత్రమే. సుల్తానులకు ధనంతో పాటు పరాయి ధర్మానికి చెందిన పవిత్ర స్థలాన్ని ధ్వంసం చేసి, దాని స్థానంలో తమ మత పవిత్ర స్థలాన్ని నిలపటం. తద్వారా తమ ఆధిక్యత, తమ దైవం, తమ మతం ఆధిక్యతని నిరూపించటం. అక్కడి వారందరినీ తమ మతంలోకి మార్చటం. దీన్ని కప్పిపుచ్చేందుకు హర్షుడిని ఒక ఆయుధంలా వాడుతున్నారు. కానీ అది పేలని తుపాకీ, గుళ్లు లేని తుపాకీ, అసలు నిజం తెలిస్తే.
గమనించవలసిన విషయం ఏమిటంటే, మందిర ధ్వంసం విషయంలో ఇస్లామీయులను సమర్థించేందుకు రాజతరంగిణిలో హర్షుడిని వెతికి తీసిన వాళ్లు శ్రీవరుడు రచించిన ఈ శ్లోకంలో ఇస్లామీయుల సేనలు మసీదును అగ్నికి ఆహుతి చేయటం విషయం ప్రస్తావించరు. కానీ ఇస్లామీయులే తమ మసీదులను కాల్చినప్పుడు, ఇతరులు మసీదులను ధ్వంసం చేయవచ్చని, వారి స్థాయికి దిగి ఈ వికృతపు వాదనలు చేయటం మన సంస్కారం కాదు. కానీ తమ మసీదులను ఇస్లామీయులే నేలమట్టం చేసిన కొన్ని సంఘటనలు ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది
క్రీ.శ. 630 సంవత్సరంలో కొందరు (మునాఫికర్లు) మదీనాలో ‘కూబా’ (Quba) మసీదు దగ్గర ఓ మసీదును నిర్మించారు. ఈ మసీదు దైవ ప్రార్థన కోసం కాదు, ఇస్లామీయుల నడుమ విభేదాలు సృష్టించేందుకు నిర్మించినవని నిర్ధారించుకున్న మహమ్మద్ ప్రవక్త ఆ మసీదును నేలమట్టం చేయమని ఆజ్ఞాపించాడు. ఫలితంగా, అతని అనుచరులు మాలిక్ ఇబ్న్ దుఖ్షూమ్ ఖాన్, మాక్ ఇబ్న్ ఆరి వంటి వారు ఆ మసీదును కూల్చివేశారు. ఆ స్థలం చెత్త వేసే స్థలంగా మారింది.
క్రీ.శ.930 లో ఇస్లామ్ లోని షియా తెగకు చెందిన ఖర్మషియన్లు, అబూతాహిర్ అల్ జన్నాచి నేతృత్వంలో హజయాత్రను ‘మూఢ నమ్మకం’లాగా భావించి, మక్కలో ప్రవేశించి 30,000 మంది భక్తులను హతమార్చారు. జమ్ జమా బావిలోకి శవాలను విసిరివేశారు. కూబాని దోచుకుని, Black Stone ను ముక్కలు చేసి, వాటిని దాదాపుగా 20 ఏళ్ళు ‘బహ్రెయిన్’లో వేలం వేశారు.
11-13 శతాబ్దులలో హసన్-ఇ-సబ్బాహ్ ఆరంభించిన నిజారి ఇస్లామీయులు శుక్రవారం ప్రార్థనలలో పాల్గొనే భక్తులపై దాడులు చేసేవారు. క్రీ.శ.1113 లో డమాస్కస్ గ్రాండ్ మసీదు ఆవరణలో ‘మౌదూద్’ను హత్య చేశారు.
ఈజిప్టు లోని లెవాంట్, హిజూజ్లపై అధికారం సాధించిన ఫాతిమిడ్లు ‘సున్ని’లతో, వారి పవిత్ర స్థలాలతో దారుణంగా వ్యవహరించారు. తరువాత సున్నిలు అధికారం సాధించగానే ఫాతిమిద్ మసీదులను ధ్వంసం చేసేవారు. వాటిని సున్ని సంస్థలుగా మార్చేశారు.
ఉమ్మాయిద్ ముస్లిం సేనలు మక్క లోని మస్జీద్-అల్-హరామ్ పై నిప్పు గోళాలతో దాడులు చేశాయి. ఇటీవలి కాలంలో మక్కపై డ్రోన్ల దాడులు జరిగాయి. దీన్ని బట్టి చూస్తే, శ్రీవరుడు ప్రస్తావించిన మసీదును కూల్చివేసే సంఘటన ప్రాధాన్యం అర్థమవుతుంది.
భారతీయ రాజులు పొరుగు రాజును ఓడిస్తే, తమ ఆధిక్యతను నిరూపించుకునేందుకు పొరుగు రాజు పూజించే ఇష్టదైవం విగ్రహాన్ని తీసుకెళ్ళేవారు. ఆ విగ్రహాన్ని అగౌరవపరచేవారు కాదు. మళ్ళీ ఆ రాజు ఏదో ఓ రకంగా ఆ విగ్రహన్ని సంపాదించేవాడు. భయభక్తులతో ప్రతిష్ఠించుకునేవాడు. అక్కడ గౌరవం తప్ప ద్వేషం, క్రోధం లేదు. తమ దృక్కోణాన్ని బలపరిచేందుకు, సామాన్యుడికి తెలియని చరిత్రను మన తెలివైన చరిత్ర రచయితలు ఏ రకంగా రూపాంతరం చెందించగలరో శ్రీవరుడు రచించిన ఈ శ్లోకం స్మరించుకునేట్టు చేస్తుంది.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
