Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

శ్రీవర తృతీయ రాజతరంగిణి-139

[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

పురపత్తనఘోపాదీననయత్ స్మృతిశేషతామ్।
ప్రతాపస్తస్య తత్కాలం తీక్ష్వాశోరివ దుఃసహః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 323)

పురం, పట్టణం, ఘోష వంటి వాటన్నింటినీ సంపూర్ణంగా నాశనం చేశాడు. వాటి వైభవం కేవలం స్మృతి చిహ్నం చేశాడు. ఆ సమయంలో అతని ప్రతాపం సూర్యుడి తైక్ష్ణ్యం సమానంగా ఉంది.

సర్వనాశనం చేశాడన్నమాట  తాజిభట్టు. ఘోష్ అంటే యాదవ కులస్థులు, పశుపాలకులు ఉండే ప్రాంతం. వాటిని కూడా నాశనం చేశాడన్న మాట. పురం, పట్టణం బదులు ‘పురపట్టణ’ అనే ప్రాంతంలో పశుపాలకుల నగరాన్ని ధ్వంసం చేశాడని కొందరు వ్యాఖ్యానిస్తారు.

తత్తంగి ఢల్యాది దేశస్థ రాజలోకభయం వ్యధాత్।
కరదీ కృత్య సామన్తాంస్తత్తత్సాహసనిష్ఠురః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 324)

ఢిల్లీతో సహా దేశంలోని ఇతర రాజులు కూడా ఇతడి సాహసపూర్ణ కార్యకృత్యాలతో భయభ్రాంతులయ్యారు. సామంతులుగా ఉండేందుకు సిద్దమయ్యారు.

బహరిస్తాన్ ప్రకారం ఆ కాలంలో పంజాబ్ గవర్నర్‌గా ఉన్న బహ్రమ్ ఖాన్ లోదీ, కశ్మీరు సేనలను నిలువరించేందుకు, కశ్మీరును అక్రమించేందుకు పెద్ద సైన్యం పంపాడు. కానీ వాతావరణం అనుకూలించకపోవటంతో, మార్గం దుర్గమం కావటంతో ఆ సేనలు ముందుకు పోలేక పాయాయి. మొత్తానికి కశ్మీరు సేన విజయం, ఢిల్లీ సుల్తానుల దృష్టిని కశ్మీరు వైపు ఆకర్షించింది. భవిష్యత్తులో అక్బర్ కశ్మీరుపై సంపూర్ణాధికారం సాధించేందుకు దారి తీసింది.

చరిత్రను అధ్యయనం చేయటంలో ఇది ఒక లక్ష్యం. సంఘటనలు సంభవిస్తున్న వర్తమాన కాలంలో ఆయా సంఘటనలు భవిష్యత్తుపై చూసే ప్రభావాన్ని ఊహించటం కష్టం. కానీ, పరస్పరం సంబంధం లేనట్టు అనిపించే సంఘటనలు, భవిష్యత్తులో కీలకమైన పరిణామాలకు దారి తీస్తాయి. ఇది గతాన్ని అధ్యయనం చేయటం వల్ల తెలుస్తుంది. ఇలా గ్రహించిన విషయం ఆధారంగా వర్తమానంలో సంభవిస్తున్న సంఘటనల ఫలితాన్ని ఊహించే వీలు కలుగుతుంది.

ప్రస్తుతం రష్యా – యుక్రెయిన్‌ల నడుమ నాలుగేళ్లుగా సాగుతున్న యుధ్దాన్ని అంతం చేసి శాంతి సాధించేందుకు అమెరికా, రష్యా, యూరోపియన్ దేశాల నడుమ సాగుతున్న చర్చలు,  1938లో చెకోస్లోవేకియాకి చెందిన  భూభాగాన్ని   , శాంతికోసం   జర్మనీకి అప్పగించటం భవిష్యత్తులో మరింత ఘోరమైన యుద్ధానికి దారి తీసింది. ఇప్పుడు, ప్రపంచ దేశాలు, యుక్రెయిన్  భూభాగాన్ని రష్యాకు అప్పగించటం ద్వారా యుక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపి శాంతి సాధించాలనే చర్య కూడా భవిష్యత్తులో అశాంతికి దారి తీస్తుందని అర్థం చేసుకునేందుకు ‘మ్యూనిచ్ ఒప్పందాన్ని’ అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

ఈ ప్రపంచగతి చక్రనేమిక్రమేణ.  ప్రపంచం మారినట్టు కనిపిస్తుంది. కానీ మారదు. చరిత్ర పునరావృతమవుతూ ఉంటుంది. రూపం వేరు, భావం ఒకటే. ఇది గ్రహించిన, భారతీయ చరిత్ర రచయితలు చరిత్రను కావ్యాల రూపంలో ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా, భవిష్యత్తు పట్ల అవగాహన కలిగించే రీతిలో రచించారు. కల్హణుడు తన చారిత్రాత్మక కావ్యానికి ‘రాజతరంగిణి’ అని పేరు పెట్టటంలోనే అలల్లాగా చెలరేగి, కాస్త ఎత్తుకు ఎగసి, విరిగి, కరగి, నీటిలో భాగమయిపోయే రాజులు, రాజ్యాల చరిత్రను అర్థం చేసుకుని భవిష్యత్తులో ప్రజలు, అధికారులు అశాశ్వతమైన అధికార స్వరూపాన్ని అర్థం చేసుకుని జీవితాలను అర్ధవంతం చేసుకోవాలన్న సూచన కనిపిస్తుంది.

స్వదేశం ప్రత్యగాత్తూర్ణం పూర్ణస్తురగసంపదా।
స్వామికార్యవశాన్మన్త్రీ పుత్రం పశ్యతి శత్రువత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 325)

సాధించిన ద్రవ్య సంపత్తితో సంతుష్టుడై తన దేశం  తిరిగి వచ్చాడు తాజిభట్టు. స్వామి కార్యం కారణంగా అవసరమైతే పుత్రుడిని కూడా శత్రువుగా భావిస్తాడు.

శత్రుమప్యతివైరార్హం పుత్రవత్ పరిరక్షతి।
ఇత్యాదినీతిముల్లంఘ్య మల్లికో దైవమోహితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 326)

స్వామి భక్తి వల్ల ఎలాగయితే స్వంత పుత్రుడిని శత్రువులా భావిస్తారో అలాగే శత్రువును స్వంత పుత్రుడిలా భావించి రక్షించాల్సి వస్తుంది. ఈ రాజనీతిని మల్లిక ఉల్లంఘించాడు విధి ప్రోద్బలంతో.

తదుత్కర్షాసహస్తస్య దర్పనాశోద్యతో అభవత్।
సవలో వాఘతే సర్వాన్ వాల్లభ్యాదితి శంకితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 327)

తాజిభట్టు అభివృద్ధిని సహించక లేక, రాజుతో సాన్నిహిత్యం వల్ల తాజిభట్టు మరింత శక్తిమంతుడై తనకు దుఃఖం కలగ చేస్తాడని భావించాడు మల్లిక అహ్మద్.

తవ్వాకత్-ఎ-అక్బరీ ప్రకారం మలిక్  తాజిభట్టు, మలిక్ అహ్మద్‌ల నడుమ శత్రుత్వం ఏర్పడింది. దాంతో వారు ఒకరికొకరు నాశనం చేయాలని ప్రయత్నించారు. రోజర్స్ కూడా ఈ రెండు దేశాల నడుమ ఘర్షణలు జరుగుతూండేవని రాశాడు. కానీ శ్రీవరుడు జరుగుతున్న సంఘటనలన్నింటినీ ప్రత్యక్ష సాక్షి. కాబట్టి శ్రీవరుడు చెప్పినట్టు వారి నడుమ ఘర్షణల కన్నా అసూయల వల్ల ఎత్తుకు పై ఎత్తు వేస్తూ ఒకరినొకరు చిత్తు చేసుకోవాలని ప్రయత్నించారని అనుకోవచ్చు.

మల్లికస్తం ప్రతి క్రుద్ధో భూపం ద్వేషమజిగ్రహత్।
అత్రాన్తరే సుతో రాజ్ఞః కనీయాన్ హోస్సనాభిధః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 328)

తాజిభట్టుపై క్రోధంతో మల్లిక రాజుకు తాజిభట్టుపై ఆగ్రహం కలిగించాడు. తాజిభట్టు సంరక్షణలో ఉన్న రాజు కొడుకు హోస్సనాపై కూడా దీని ప్రభావం పడింది.

పయోదానాయ మల్లేకనౌరుజాయ సమర్పితః।
తేన శ్రుతేన తద్భూపవిధేయత్వవిసూత్రితః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 329)

రాజు కనిష్ట పుత్రుడు హోస్సన పాలన పోషణ బాధ్యత తాజిభట్టు నుండి తొలగించి మల్లిక నౌరాజుకు అప్పగించాడు రాజు.  ఇది తెలిసిన తాజిబట్టుకు రాజు పట్ల ఉన్న విధేయత దెబ్బతిన్నది – ‘హోసన్’ అంటే ‘హుస్సేన్’.

ఆగచ్ఛన్ కటకే భట్టో యయౌ మందప్రతాపతామ్।
తస్య సేనాగతస్యాథ నేయవుద్ధి నృ పేశ్వరః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 330)

సేనతో తిరిగి వస్తున్న తాజిభట్టుకు రాజుకు తన పట్ల ఆదరణ తగ్గతున్నట్టు తోచింది. చంచల బుద్ది కల రాజు, సేనతో వస్తున్న అతడిని ఆదరించలేదు.

సత్కారం చోదితం తస్మై నాకరోద్ విరసీకృతః।
అథ తస్యాపకారాయ మల్లికః స్వయమక్షమః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 331)

తిరిగి వస్తున్న తాజిభట్టుకు సుల్తాను సముచిత సత్కారం జరపలేదు. సుల్తాన్ కోరిన కార్యాలు నిర్వహించటంలో మల్లిక్ తాజిభట్టు అశక్తుడని రాజును  నమ్మించి అతడిని తాజిభట్టు పట్ల విరక్తుడిని చేశారు.

దధ్ర గతానాం సౌదానాం పునరాగమనే మతిమ్।
యదోయా తనయా రాజం స్తవ పుత్రవతీ ప్రియా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 332)

తాజిభట్టును దెబ్బతీయటంలో అశక్తుడయిన మాలిక్ అహ్మద్  దేశం విడిచి వెళ్లిన సయ్యద్‌ను మళ్లీ వెనక్కు పిలిచి అతడి ద్వారా దెబ్బ తీయాలని ఆలోచించాడు. ‘ఓ రాజా నీకు ప్రియమైన పుత్రుడిని ఇచ్చిన ప్రియమైన భార్య తండ్రి సయ్యద్’.

రక్ష్యః శ్వశురపక్షః స కథ నానీయతే త్వయా।
ఇత్యాది ప్రేరణాద్రాజ్ఞో రాజారాధనతత్పరః।
సోపధీన్ వ్యసృజల్లేఖాన్ సైదాణ్డిల్లీశ మండలే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 333)

రాజుకు తన కూతురుకి ఇచ్చిన సైదా(సయ్యద్)  ఢిల్లీ రాజు వద్ద ఆశ్రయం పొందటం కన్నా కశ్మీరు రాజు దగ్గరనే ఆశ్రయం పొందటం సముచితమని, అతడిని ఢిల్లీ నుంచి కశ్మీరు పిలిపించమని కుట్ర పూరితంగా రాజుకు సలహా ఇచ్చాడు. ఢిల్లీలో ఉన్న సయ్యదాకు లేఖలు పంపించాడు.

ఈ రకంగా కశ్మీరు వదలి వెళ్లిపోయిన శక్తిమంతులను వెనక్కు పిలిపించటం ద్వారా తన శక్తి పెంచుకుని తాజిభట్టు శక్తిని తగ్గించాలని ప్రయత్నిస్తున్నాడు మల్లిక అమ్మద్.

తస్యైవేతి ప్రభవతి జనో దుర్నయైదూషణాద్యై-
రేతబుద్ధయా నయతి న వయః స్వం కథ గాఢమూఢః।
సర్వాం పృథ్వీ జయతి న కథం తన్త్రమన్త్రోర్జితోసా-
నిత్యాశంకయో భవతి పురుషో భాగ్తభాగ్ యావదాస్తే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 334)

పురుషుడి అదృష్టం అనుకూలంగా,  శక్తిమంతంగా ఉన్నంత కాలం అతని బంధువులు, స్నేహితులు దూషణ భూషణలు, దుష్టకార్యాలతో తమ శక్తిని ప్రదర్శిస్తారు. కానీ, తమ ఆధిక్యాన్ని శక్తిని మంచి కార్యాలలో ప్రదర్శించాలన్న నిజాన్ని గ్రహించలేదు ఆ మూర్ఖులు అని ప్రజలు అనుకుంటున్నారు.

అపకృత్య పునః సైదాన్ యదానయతి మల్లికః।
తేన స్యాత్ సర్వనాశోస్యేత్యవదత్ తీక్ష్ణదీర్జనః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 335)

తాను హాని చేసిన సయ్యద్‌ను మాలిక్ మళ్లీ కశ్మీరు తీసుకువస్తున్నాడు. అవకాశం దొరికినప్పుడు అతడు మాలిక్‍ను సర్వనాశనం చేస్తాడు అనుకున్నారు ప్రజలు.

తాను హాని చేసిన వాడిని పిలిచి శక్తిమంతుడినిగా చేయటం అంటే కొరివితో తల గోక్కోవటమే. మాలిక్ అహ్మద్ తాత్కాలిక లాభం వైపు చూస్తున్నాడు. కానీ శాశ్వత నష్టం గురించి ఆలోచించటం లేదు. సయ్యద్ నసీర్ రాజు పత్ని తండ్రి. ఎన్నో కుట్రలు చేసి అతడిని దేశం బయటకు పంపారు. ఇప్పుడు వెనక్కు వచ్చి రాజ్యంలో శక్తివంతమైన స్థానం సంపాదించిన తరువాత అతడు తమకు హాని కలగించిన వారందరినీ  ఇబ్బందుల పాలు చేస్తాడని ఊహించటం పెద్ద కష్టం కాదు. ప్రత్యర్ధిని దెబ్బతీయటం కోసం మూడో వ్యక్తిని శక్తిమంతుడిని చేస్తే అతడు ముందు ప్రత్యర్ధిని దెబ్బతీస్తాడు. ఆ పై తనను పిలిచిన వాడి పని పడతాడు. తనకు ఎదురు చెప్పేవాడు లేకుండా అధికారం స్థిరపరచుకుంటాడు. ఇది జగతి రీతి.

భారత ప్రభుత్వాన్ని పడదోసి, అధికారం సాధించేందుకు విదేశీ శక్తుల సహాయం తీసుకోవటం అంటే, తన గొయ్యి తాను తీసుకోవటం మాత్రమే కాదు, ప్రజలందరి జీవితాలతో చెలగాటమాడటం. వ్యక్తిగత కక్ష సాధింపు కోసం సమస్త దేశాన్ని పణంగా పెట్టటం. ఆ కాలమైనా, ఈ కాలమైనా ఇలాంటి మనస్తత్వం అనర్థదాయకం. టిప్పు  సుల్తాన్‌ను దెబ్బతీసేందుకు మరాఠా, నిజామ్ రాజ్యాలు, బ్రిటిష్ వారికి సహకరించాయి. టిప్పు అడ్డు తొలగించుకున్న తర్వాత వారు నెమ్మదిగా నిజామ్‌పై, మరాఠాలపై ఆధిక్యతను సాధించారు. అందుకని పిల్లులు తమ మధ్య పోరును తామే తీర్చుకోవాలి. కోతిని పిలిస్తే, తమ పరువు ఎలాగో పోతుంది, రొట్టె కూడా అదే ఎత్తుకు పోతుంది. అన్నీ తెలిసి కూడా అవే అహంకారపు ఆటలు, అవే అధికార దాహాలు, అవే అనర్థాలుగా సాగుతుంది మానవ జీవితం.

(ఇంకా ఉంది)

Exit mobile version