[శ్రీవర విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన తృతీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]
సౌదానయన వృత్తాంతం బుద్ధవా శ్రీఫిర్యడామరః।
గృహం గత్వా అహ్మదాయుక్తం యుక్తమిత్యత్రవీద్ వచః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 336)
తాజిభట్టో విధేయోయం భృత్యవద్ వర్తతే త్వయి।
తదేతం రక్ష యుక్త్యాస్య విధాయ మదశాతనమ్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 337)
మా ప్రవేశయ సైదాంస్త్వ దుర్ధరాన్ దేశకంటకాన్।
తురుష్క పుష్కలాశ్వాసాన్ యత్నాన్నిష్కాసితానపి॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 338)
ఏకనాశార్థమిచ్ఛా చేత్ సర్వనాశస్తదాగతే।
పోతైకహేతోశ్చైత్యస్య జ్వలనం కిం సమర్ప్యతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 339)
నూనం సపుత్రభృత్యస్య నాశో న భవితా చిరాత్।
యత్ సైదానయనే బుద్ధిర్జాతా భాగ్యవిపర్యయాత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 340)
కృతాపకారాన్ సైదాంస్తానానినీపుర్భవాన్ యది।
విపముష్టి క్షిప స్థాల్యాం సాన్నాయాం తత్ స్వమృత్యవే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 341)
మద్వచో గృహ్యతే సత్యం జ్ఞమ్మన్యేన త్వయా న తత్।
విపత్తౌ స్మరణీయం స్యాన్మయి లోకాన్తరం గతే॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 342)
సయ్యద్‌ను మళ్లీ కశ్మీరు పిలిపిస్తున్నారనీ, అతడు కశ్మీరు తిరిగి వస్తున్నడన్న వార్త విని ఫిర్యాడామరుడు అహ్మద్‍ను కలిశాడు. తాజిభట్టు నీకు స్వయంగా సేవకుడిలా వ్యవహరిస్తాడు. అతడు అహంకారంగా ప్రవర్తిస్తుంటే చక్కటి సలహాతో అహంకారాన్ని అదుపులో పెట్టవచ్చు. అతడిని దెబ్బ తీసేందుకు దేశానికి కంటకంలాంటి శక్తిమంతులయిన తురుష్కులు, పుష్కరలు, సేవకులు, వంటివారితో సహా, ఎవరినయితే దేశ రక్షణ కోసం దేశం నుండి వెడలనడిపామో, ఆ సయ్యదులకు మళ్లీ కశ్మీరులో ప్రవేశం కల్పించకు. ఒక్కడిని నాశనం చేసేందుకు నువ్వు ఈ దుష్టులందరినీ దేశంలో అడుగు పెట్టనిస్తే సర్వనాశనం అవుతుంది. ఒక్క పక్షిని చంపేందుకు వనంలోని చెట్లన్నిటికీ నిప్పు పెడతామా? నువ్వు, నీ పుత్రులు, భృత్యులతో సహా అందరూ నశిస్తారు. సయ్యదులను వెనక్కు పిలిపించటం నీ దురదృష్టం తల పై నర్తించటం వల్లనే. అందుకే ఇలాంటి ఆలోచన నీకు వచ్చింది. ఒక వేళ నువ్వు సర్వజనాపకారి అయిన సయ్యదులను కశ్మీరు పిలిపించాలనే నిశ్చయించుకుంటే, దాని బదులు వడ్డించిన అన్నం పళ్లెంలో గుప్పెడు విషం చల్లు. అది ఇంకా సుఖమైన మృత్యువుకు కారణం అవుతుంది. ఇప్పుడు నీకు నా మాటలు అర్థం కావు. నేను పరలోకానికి వెళ్లిన తరువాత నీకు నా మాటలు గుర్తొస్తాయి.
తలపై దుర్దశ నర్తిస్తున్నప్పుడు మంచి మాటలు నచ్చవు. కశ్మీరులో అదే జరుగుతోంది. అహ్మదు ఢిల్లీ నుంచి సయ్యదులను కశ్మీరుకు రప్పిస్తున్నాడని తెలియగానే హితైషి ఫిర్య డామరుడు, అహ్మదును కలసి ఒక్కడిని దెబ్బ తీసేందుకు మొత్తం కశ్మీరును నష్టపరచటం భావ్యం కాదని నచ్చచెప్పాడు. కశ్మీరుతో పాటు అహ్మదు, అతని కుటుంబం సర్వం నాశనమౌతాయని చెప్పాడు.
ఫిర్య డామరుడిచ్చిన ఈ సలహా ఎంత సరైనదో భవిష్యత్తు నిరూపిస్తుంది. సయ్యదాలు ఇరాన్ నుంచి కశ్మీరు వచ్చారు. వీరు శక్తిమంతులు, మత ఛాందస్సులు. అసహనం అధికంగా కలవారు, క్రూరులు. చాలా తెలివైనవారు. అధికారం కోసం అర్రులు సాచేవారు. రాజకీయ వివాహాల ద్వారా, ఇతర పద్దతుల ద్వారా అధికారం సాధించటం, అన్ని కీలకమైన పదవులను హస్తగతం చేసుకోవటం, పాలనపై పట్టు సాధించటం ద్వారా తమకు ఎదురుచెప్పిన వారిని, స్థానికులను హింసించటం వీరికి అలవాటు. ముఖ్యంగా ఇస్లామేతరుల పొడ వీరికి గిట్టదు. జైనులాబిదీన్ పిలుపు వల్ల కశ్మీరు వచ్చి స్థిరపడ్డ హిందువులను ఈ సయ్యదులు క్రూరంగా హింసించారు. పన్నులు విధించారు. కత్తి మెడపై పెట్టి మతం మార్చారు. కశ్మీరులో స్థానికులైన మాగరాలు, చాక్ లను తక్కువవారిగా చూసి హింసించారు. చివరికి కశ్మీరులో ఘోరమైన హింసాత్మక అంతర్యుద్ధానికి కారణమయ్యారు సయ్యుదులు. ఇదంతా ఎలా సాధ్యమయిదంటే, తాజిభట్టు అనేవాడిని అణచి వేయటానికి, అహ్మద్ అనేవాడు, దేశానికి నష్టం కలిగిస్తున్నడన్న ఆరోపణపై దేశ బహిష్కారం పొందిన సయ్యదులను తిరిగి కశ్మీరుకు రప్పించటం వల్ల. అంటే ఇద్దరు అధికారుల అహంకార పోరాట దుష్ఫలితాన్ని మొత్తం కశ్మీరు తద్వారా భారతదేశం అనుభవించిందన్న మాట. ఈ విషయమే శ్రీవరుడు తన శ్లోకాలలో వివరించాడు.
భారతీయుల దృక్కోణంలో ఇది చరిత్ర రచన పద్ధతి. పాశ్చాత్యులు చరిత్ర రచనలో తేదీలు, యుద్ధాలు, ఎంత కాలం పాలించాడు. ఏమేం కట్టించాడు.. వంటి వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు. వారికి కాలగమన లక్ష్యంపై అవగాహన లేదు. మానవ జీవితం గురించిన ఆలోచన లేదు. కర్మ సిద్ధాంతం స్పృహ లేదు. ఇప్పుడు శాస్త్రవేత్తలు ప్రస్తావిస్తున్న ‘Butterfly effect’ గురించిన ఊహ కూడా లేదు. కానీ భారతీయుల దృష్టి వేరు.
భారతీయుల దృష్టిలో చరిత్ర అన్నది నిర్జీవమైన అంకెలు, జడమైన అంశాలు కాదు. భారతీయుల దృష్టిలో చరిత్ర మానవ జీవిత గమనంలో మార్గదర్శనం చేసే ఒక పాఠం. గతంలోని సమాజంలో సంభవించిన సంఘటనలు, పరిణామాలు, దీర్ఘకాలంలో వాటి ఫలితాలను, ఆయా సమాజాలను పరిశీలించటం వల్ల, మానవ మనస్తత్వాన్ని అధ్యయనం చేయటం వల్ల, గ్రహించటం ద్వారా, వర్తమానాన్ని అర్థం చేసుకుని, ఆ పొరపాట్లు భవిష్యత్తులో సంభవించకుండా జాగ్రత్త పడటం. అందుకే చరిత్రను ఒక కావ్యంలా రాశారు. కానీ కావ్యం అనగానే, పాశ్చాత్య చరిత్ర రచయితలు అది చరిత్ర కాదు అంటారు. ఎందుకంటే చరిత్ర ప్రాణం లేని కట్టె లాంటిది, రాయి లాంటిది వారి దృష్టిలో. ఆ ప్రాణం లేని కట్టెలో నిబిడీకృతమైన అగ్నిని గ్రహించటం, రాతిలోని తేమను గుర్తించటం, చరాచర సృష్టిలో ఒదిగి ఉన్న ప్రణాళికను నిరూపించటం ద్వారా మానవ జీవిత గమనాన్ని తీర్చదిద్దుకునే వీలు కలిగించటం భారతీయ చరిత్ర అధ్యయన దృక్కోణం, లక్ష్యం. శ్రీవరుడు అందుకే రాజతరంగిణి రచనలో విషయాలను విపులంగా వివరిస్తున్నాడు. సంఘటనలను సూక్ష్మంగా వర్ణిస్తాడు. ఈ ప్రపంచ ప్రణాళికలో సూక్ష్మంలో ఉన్నదే స్థూలంలోనూ ఉంటుంది. సూక్ష్మం గ్రహిస్తే స్థూలం గ్రహించటం సులభం.
కశ్మీరులో ఇద్దరు అధికారుల అహంకార పోరాటంలో ఒకరిని దెబ్బ తీసేందుకు పరాయివాడు, దుష్టుడు అయిన వాడిని దేశంలోనికి ఆహ్వానించటం వల్ల సర్వనాశం అయింది. ఈ విషయాన్ని గనుక భవిష్యత్తు తరాల వారు గ్రహించి ఉంటే, తోటి రాజును దెబ్బ తీసేందుకు పరాయి రాజును అహ్వానించేవారు కాదు. వ్యక్తిగత కక్ష సాధన కోసం సమష్టికి అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యేవారు కాదు. కానీ, అప్పడే కాదు, ఇప్పుడూ ఈ నిజాన్ని ఎరూ గ్రహించటం లేదని నడుస్తున్న చరిత్ర నిరూపిస్తున్నది. తాత్కాలిక అహం తృప్తి కోసం సకల సమాజానికి శాశ్వత నష్టం అయినా ఫరవలేదన్న భావన అడుగడుగునా కనిపిస్తున్నది. అయితే, కాలానికి ఇదేమీ పట్టదు. తన ధోరణిలో ముందుకు దూసుకు పోతూనే ఉంటుంది.
శ్రుత్వేతి మల్లికః ప్రాహ కిం కుర్వన్తి మయి స్థితే।
ఏకదా జ్ఞాతసార్మథ్యాచ్చాటుకారా భవన్తి నః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 343)
ఫిర్యడానురుడు చెప్పినదంతా విన్న అహ్మద్ మల్లిక “నేను ఉన్నంత కాలం వాళ్లు ఏమీ చేయలేరు. గతంలో ఒక్కసారి వాళ్లని అణచి పెట్టేను. నా సామర్థ్యం తెలిసి వాళ్లు నా చెప్పుచేతల్లో ఉంటారు” అన్నాడు.
అహంకారం సర్వనాశన కారకం అంటే ఇదే. నేను ఉన్నంత కాలం వాళ్లేమీ చేయలేరు అన్న ధీమా ప్రదర్శించాడు మల్లిక్ అహ్మద్. కానీ తన తరువాత అన్న ఆలోచనలేదు. అంటే తాను ఉన్నంత వరకు మాత్రమే ఆలోచిస్తున్నాడు. తన తరువాత అన్న ఆలోచన లేదు. చదరంగం ఆటలో తాను వేసిన స్టెప్ పరిణామాలు మటుకే ఆలోచిస్తే కుదరదు. ప్రత్యర్ధి ఒక కదలికను అర్థం చేసుకుని, మొదటి కదలికతోనే చివరి కదలికను ఊహించి, సరిచేయగలిగినవాడే విజేతగా నిలుస్తాడు.
తథేత్యుక్త్వా గతే తస్మిన్ జ్ఞామ్మన్యత్వాదృణాదృతే।
సైదానయనసఙ్కల్పాన్న మనాగ విరరామ సః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 344)
తానే తెలివైన వాడినన్న అహంకారంతో అహ్మద్ మాలిక్, ఫిర్యా డామరుడి మాటలు పెడచెవిన పెట్టి అవమానించాడు. తాను తల పెట్టిన చర్య నుంచి కొద్దిగా కూడా అతడు పక్కకు జరగడని గ్రహించి ఫిర్య డామరుడు” ఎలాగయితే అలాగే కానీ” అనుకుంటు వెళ్లిపోయాడు.
జ్ఞాతాయతిత్వాదుపదిష్టమిష్టే గృహ్ణాతి వాక్యం న హి నష్టచేష్టః।
కష్టే నివిష్టః స హి వక్తి శోకాద్దింగ్మామతిష్ఠం న హితోపదేశ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 345)
భవిష్యత్తు తెలిసిన తరువాత కూడా, ఇష్ట జనులు, హితైషుల మాట పెడచెవిన పెట్టి, జరిగే నష్టం గ్రహించని వాడు, నష్టం ఎదురయినప్పుడు శోకిస్తాడు. ఛీ, నేను మంచి మాటలను ఎందుకు వినలేదు, అని భాధపడతాడు.
తతో లేఖాన్ సమాలోచ్య తస్యోత్కణ్ఠితమానసాః।
హంసా ఇవాయయుః సైదాః కృతపక్షపరిగ్రహాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 346)
సయ్యదాలు మల్లిక్ అహ్మద్ లేఖలను చూసిన తరువాత కశ్మీరు తిరిగి రావాలని ఉత్కంఠభరితులయ్యారు. హంసలు గుంపులు గుంపులుగా వచ్చేట్టు సయ్యదాలు కశ్మీరు వచ్చి పడ్డారు.
శ్రీవరుడు ఈ శ్లోక రచనలో చిన్న చమత్కారం చేశాడు. “ఉత్కంఠత మనః” అన్నాడు. ఇక్కడ ఉత్కంఠ మనసు అన్నది సామాన్యార్థం. కశ్మీరు వచ్చిన చేరేందుకు సయ్యదాలు ఉత్కంఠ మనస్కులయ్యారు అన్నది పైకి కనబడే అర్థం. మనసా అంటే మానస సరోవరం కూడా. మానససరోవరానికి కొంగలు గుంపులు గుంపులుగా వచ్చి నీటి ఉపరితలాన్ని కప్పేస్తాయి. అంటే, ఒక రకంగా గుంపులు గుంపులుగా సయ్యదాలు కశ్మీరు వచ్చి చేరారు. భవిష్యత్తులో కశ్మీరు వారి పరం అవుతుందని సూచిస్తున్నాడు. అంతే కాదు, మానససరోవరం భారతీయులకు అతి పవిత్రమైనది. దాన్ని హంసలు ఆక్రమిస్తున్నాయి. కశ్మీరు అతి పవిత్రమైన మానస సరోవరం లాంటిది. దాన్ని హంసలలాంటి సయ్యదాలు ఆక్రమిస్తున్నారు.
అథ ప్రథమమేవేహ స మేయాహస్సనో అగ్రణీః।
అగ్యాప్త నౌరుజాయుక్తయుక్తో భూపాగ్రమాయయౌ॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 347)
ముందుగా వారి నాయకుడు మేయాహసన్న, అతని వెంట నమ్మకస్తుడైన సలహాదారు సౌరుజాలు రాజు దగ్గరకు వచ్చారు.
విహితాన్యోన్యకం శంసన్ మల్లికోస్మై ప్రసన్నధీః।
ఖోయాశ్రమం ప్రదేశం తం స్వకీయం స సమార్పయత్॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 348)
పరస్పర ప్రశంసలతో ప్రసన్నుడయిన మల్లిక్ వారికి తన జాగీరయిన ఖోయాశ్రమంను సమర్పించాడు.
ఈ ఖోయాశ్రమంను ‘ఖుయ్య హోమ పరగణ’ అంటారు. ఈ ప్రాంతం ఊలూరు సరస్సుకు ఉత్తర భాగాన ఉన్నట్టు గుర్తించారు.
యత్ సైదహస్సనేనాపి సిద్ధాదేశాధికారితా।
తస్య తేనైవ నాశార్థం సిద్ధా దేశాధికారితా॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 349)
ఒకప్పుడు దేశ ప్రవేశర్హత లేని సయ్యద్ ఇప్పుడు దేశాధికారాన్ని నిర్దేశించే స్థితికి వచ్చాడు.
క్రమాత్ సమాగతైః సైదైరాక్రాన్తే మణ్డలే వలైః।
ఆభ్యన్తరాశ్చ బాహ్యాశ్చ కాశ్మీరాస్తత్రసుర్జనాః॥
(శ్రీవర రాజతరంగిణి, తృతీయ తరంగం, 350)
క్రమంగా పెద్ద సంఖ్యలో సయ్యదాలు కశ్మీరులో వచ్చిన స్థిరపడ్డారు. వారి వల్ల కశ్మీరు లోపల, బయట ఉన్న ప్రజలంతా భయగ్రస్తులయ్యారు.
(ఇంకా ఉంది)
కస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని అందిస్తున్నారు. కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, హారర్, క్రైమ్ తదితర పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
కథాసంపుటాలు: 4 x 5, ఆ అరగంట చాలు, భారతీయ ప్రేమ కథామాలిక, ఉజ్జ్వల భారత మహోజ్జ్వల గాథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, జాతక కథలు, థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు, ప్రపంచ ప్రేమ కథామాలిక,
నవలలు: ముస్సోలిని, పునఃసృష్టికి పురిటి నొప్పులు, సౌశీల్య ద్రౌపది, రోషనార, శ్రీకృష్ణదేవరాయలు, అసిధార, అంతర్మథనం, మర్మయోగం, అంతర్యాగం, ఆపరేషన్ బద్ర్, జగమే మారినదీ..,
అనువాద రచనలు: కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు, జోనరాజ రాజతరంగిణి, నీలమత పురాణం, నిజాం పాలన చివరి రోజులు,
వ్యాస సంపుటాలు: తీవ్రవాదం, శైశవ గీతి, అక్షరాంజలి, మనం మరువకూడని మహాయుద్ధం 1857, ప్రాచీన విజ్ఞానం, భారతీయ తత్త్వచింతన, భారతీయ వ్యక్తిత్వ వికాసం, రియల్ స్టోరీస్, క్రైమ్ స్టోరీస్-1, మన ప్రధానమంత్రులు, మన తెలుగు ముఖ్యమంత్రులు,
బయోగ్రఫీలు: మైకేల్ జాన్సన్, సంగీత సరస్వతి లతామంగేష్కర్,
సినిమా పుస్తకాలు: పాడుతా తీయగా, కమర్షియల్ క్లాసిక్స్, నవల నుంచి సినిమాకు,
సంపాదకత్వం/సంకలనాలు: తెలుగు కథల్లో గాంధీ మహాత్ముడు, కులం కథ, రైలు కథలు, క్రీడా కథ, దేశభక్తి కథలు, రామకథాసుధ
పురస్కారాలు/బహుమతులు: 1995లో ఆంధ్రప్రభ ‘దీపావళి’ నవలల పోటీలో ‘అంతర్యాగం‘ నవలకు ద్వితీయ బహుమతి. 1999 లో ఆంధ్రభూమి సస్పెన్స్ నవలల పోటీలో ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి. 2017 సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి కీర్తి పురస్కారం గ్రహీత.
~
కల్హణ కశ్మీర రాజతరంగిణి కథలు కన్నడంలోకి; థ్రిల్లింగ్ చిల్లింగ్ కథలు ఒడియాలోకి, మరాఠీలోకి అనువాదమయ్యాయి. ‘పాడుగా తీయగా’ హిందీలోకి అనువాదమవుతోంది.
